Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : మే ​2024

కరెంట్​ అఫైర్స్​ : మే ​2024

అంతర్జాతీయం

సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం
అమెరికా (916 బిలియన్ డాలర్లు), చైనా (296 బిలియన్ డాలర్లు), రష్యా(109 బిలియన్ డాలర్లు) తర్వాత రక్షణ రంగానికి 83.6 బిలియన్ డాలర్లను కేటాయించడం ద్వారా భారత్ 2023లో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా నిలిచింది.

Advertisement

కాలుష్య నగరంగా ఖాట్మండు
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిని కొలిచే ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-ర్యాంకింగ్’ ప్రకారం ప్రపంచంలోని అనారోగ్యకరమైన వాయు జాబితాలో ఖాట్మండు గాలి అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ, థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌మై, వియత్నాంలోని హనోయి, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ మరియు బంగ్లాదేశ్‌లోని ఢాకా వరుసగా రెండు, మూడు, నాలుగు మరియు ఐదవ స్థానాల్లో ఉన్నాయి.

యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’
పర్యావరణం ప్రోత్సహించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా ‘బ్లూ రెసిడెన్సీ వీసా’ను తీసుకురానుంది. ఇవి పొందిన వారికి యూఏఈలో పదేళ్ల నివాస అనుమతితోపాటు అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పించనున్నారు.

సింగపూర్‌ ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌
సింగపూర్‌ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్‌ లూంగ్‌ ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్‌ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. వీరిద్దరూ పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందినవారే. వాంగ్‌ ప్రధాని పదవితోపాటు ఆర్థిక మంత్రి పదవినీ నిర్వహిస్తారు. దేశాధ్యక్షుడు ధర్మన్‌ షణ్ముగరత్నం, వాంగ్‌తో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు.

Advertisement

స్వతంత్ర దేశంగా పాలస్తీనా
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్లు మూడు ఐరోపా దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. పాలస్తీనాకు తాము ఇచ్చిన గుర్తింపు మే 28 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

ఉత్తర కొరియా మిస్సైల్​ ప్రయోగం
ఉత్తర కొరియా స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి 300 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం, జపాన్‌ మధ్య సముద్ర జలాల్లో పడినట్లు పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా భారీస్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. వీటిని స్వయంగా ఆ దేశ అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యవేక్షిస్తున్నారు.

పాపువా న్యూగినీలో భారీ విపత్తు
పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడడంతో ఎంగా ప్రావిన్స్‌లో రెండు వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయి. దీంతో ఆ దేశం అంతర్జాతీయ సాయాన్ని కోరుతూ ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. భారత్‌ రూ.8.31 కోట్ల ఆర్థికసాయం ప్రకటించింది.

Advertisement

స్వతంత్ర దేశంగా పాలస్తీనా గుర్తింపు
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌ ప్రకటించాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తెలిపారు.

స్టీల్ ఉత్పత్తిలో దూసుకెళ్తున్న భారత్
ప్రపంచ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) తాజా నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ నెలలో ఉక్కు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి సాధించింది. ఏప్రిల్ నెలలో చైనా, జపాన్, అమెరికా, రష్యా వంటి స్టీల్ ఉత్పత్తి దిగ్గజాల ఉత్పత్తి గణనీయంగా క్షీణించినప్పటికీ, భారత్ 3.6% వృద్ధితో 12.1 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది.

ఏఐ యాంకర్​కు గ్లోబల్​ మీడియా అవార్డ్​
ఇండియా టుడే గ్రూప్ ఏఐ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకుంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ గ్లోబల్ మీడియా అవార్డ్స్‌లో గణనీయమైన విజయాన్ని సాధించింది.

Advertisement

భారత్‌ వృద్ది 7.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచింది. నివేదిక ప్రకారం 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది.

జీఎస్‌టీ రికార్డు వసూళ్లు
భారత్‌ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల‌లో రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు.

విమానాయాన ఉద్గారాల్లో మూడో స్థానం
2019 లో అంతర్జాతీయ విమానాయాన డాటా ఆధారంగా నార్వేజియన్​ యూనివర్సిటీ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ పరిశోధనలో విమానాయాన రంగం ద్వారా కార్బన్​ డై ఆక్సైడ్​ ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్​ మూడో స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, బ్రిటన్​ రెండో స్థానంలో ఉన్నాయి.

Advertisement

ఎన్​ఆర్​ఐ ఓట్లలో కేరళ టాప్​
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఎన్​ఆర్​ఐ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళా 74.9శాతంతో టాప్​లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

ఆర్టికల్​ 370 రద్దుకు సుప్రీం సపోర్ట్​
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించిన 2023 డిసెంబరు 11 నాటి సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వీటిని పరిశీలించి విచారణ అర్హత లేదని తేల్చింది. పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది.

ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ
ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024 ప్రకారం భారత్​ ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. 2021లో డ‌బ్ల్యూఈఎఫ్ ప్రక‌టించిన ఈ సూచిలో భారత్ 54వ స్థానంలో ఉంది. 2024 జాబితాలో అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

పెరగనున్న మనిషి సగటు జీవితకాలం
ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది.2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎంఈ) నిర్వహించిన గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్‌(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు.

ఎక్సర్‌ సైజ్‌ శక్తి’ సైనిక శిక్షణ
భారత్‌–ఫ్రాన్స్‌ దేశాల మధ్య 7వ ‘ఎక్సర్‌ సైజ్‌ శక్తి’ సంయుక్త సైనిక శిక్షణ మే 13– 26 తేదీల మధ్య కొనసాగింది. మేఘాలయలోని ఉమ్రోయ్‌­లో ఈ సైనిక శిక్షణ కొనసాగినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య సైనిక పాటవాన్ని పెంపొందించుకోవడం, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడం దీని ప్రధాన లక్ష్యం.

ముస్లింల ఓబీసీ హోదా రద్దు
పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదా రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది.

Advertisement

దూరదర్శన్‌ కిసాన్‌లో ఏఐ యాంకర్లు
రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్‌ డీడీ కిసాన్‌ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా దూరదర్శన్‌ ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట వీటిని తీసుకురానున్నట్లు వెల్లడించింది.

బంగాళాఖాతంలో ‘రెమాల్‌’ తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుఫాను తీవ్ర తుఫానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.

సీఏఏ కింద పౌరసత్వాలు మంజూరు
పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద పౌరసత్వ మంజూరు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడు రాష్ట్రాల్లో పలువురు దరఖాస్తుదారులకు పౌరసత్వం మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

నీటిని వృథా చేస్తే జరిమానా
దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండటంతో తాగునీటి కొరత తలెత్తకుండా దిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు
పశ్చిమ బెంగాల్​లోని హౌరాలోని శివపూర్​లోని బొటానికల్​ గార్డెన్స్​లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా రికార్డు సృష్టించింది. దీని వయసు కనీసం 250 సంవత్సరాలు ఉంటుంది.

ప్రాంతీయం

తొలి మెగాఫుడ్‌ పార్క్‌
రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్‌పార్క్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభించనున్నారు. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మందికి ఇందులో ఉపాధి దొరకనుంది.

Advertisement

పెద్దలకు బీసీజీ టీకా
ఇప్పటి వరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్‌ ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి ఇవ్వనున్నారు. మొదటి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది.

మాటలు రాని పిల్లలకు ‘అమ్మ’ యాప్‌
మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్‌ ఆవిష్కరించారు. నిట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ హెడ్‌ డా.కె.వి.కాదంబరి ఆధ్వర్యంలో సీఎస్​ఈ ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించారు.

సిద్ధిపేటలో నిజాం కాలం నాణెలు
సిద్ధిపేట మండలం నర్సాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రాతి పాత్రలో నిజాం కాలం నాటి 25 వెండి నాణెలు, రెండు వెండి ఉంగరాలు లభ్యమయ్యాయి.

ఇకపై టీఎస్‌ కాదు టీజీ
ఇకపై ప్రభుత్వ శాఖల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లో అన్నింటా టీఎస్‌కు బదులు టీజీనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్​ ఆదేశాలు జారీ చేశారు.

వార్తల్లో వ్యక్తులు

నైమా ఖాతూన్‌
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్‌చాన్సలర్‌(వీసీ)గా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు.1875లో ఏర్పాటైన ముహమ్మదన్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ కాలేజీ…1920 లో ‘అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది.

ప్రబోవో సుబియాంతో
ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన ఈ ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్నారు. సుబియాంతో ప్రస్తుతం ఇండోనేసియా రక్షణ మంత్రిగా ఉన్నారు.

స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ ఎన్నికయ్యారు. గత నెలలో కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్‌ వారసుడిగా గౌతమానంద్‌జీ బాధ్యతలు చేపట్టారు. మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు 95 ఏళ్ల గౌతమానంద్‌జీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

సునీతా విలియమ్స్‌
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్‌ విల్మోర్‌ వెళ్లనున్నారు. వారం రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నారు.

ఇబ్రహీం రైసీ
హెలికాప్టర్‌ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్‌ అమిర్‌ అబ్దొల్లాహియన్‌ సహా ఇతరులకు ఇరాన్‌ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించింది. రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరాన్‌ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్నారు.

నిఖత్‌ పసిడి పంచ్‌
ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్‌ జరీన్‌ సత్తా చాటింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ఫామ్‌ను కొనసాగిస్తూ గోల్డ్​ మెడల్​ గెలుచుకుంది. 52 కేజీల తుదిపోరులో ఆమె 5-–0తో ఉర్క్‌బయెవా (కజకిస్థాన్‌)ను చిత్తు చేసింది. మరో భారత బాక్సర్‌ మీనాక్షి 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 4-–1తో రహ్‌మనోవా (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించి గోల్డ్​ మెడల్​ గెలుచుకుంది.

శ్రీశ్రీ రవిశంకర్
శ్రీలంకలో 200 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత సంతతి తమిళుల స్మారకంగా విడుదల చేసిన తొలి స్టాంపును భారత ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ స్వీకరించారు. ఈ స్టాంపును శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్ బహూకరించారు.

లై చింగ్-తే
తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్-తే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. తైవాన్‌ను ఎనిమిదేళ్లుగా నడిపించిన త్సాయ్ ఇంగ్-వెన్ స్థానంలో లై బాధ్యతలు చేపట్టారు.

టో లామ్
వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లామ్ పదవీకాలంలో పోలీసు, ఇంటెలిజెన్స్‌ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించి విదేశాల్లో అపహరణలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ గుయెన్‌ ఫూ ట్రాంగ్‌ 2021లో మూడోసారి ఆ పదవిని చేపట్టారు.

పాయల్​ కపాడియా
77వ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ 2024 లో కొత్త దర్శకురాలు పాయల్​ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్​ వి ఈమాజిన్​ ఆస్​​ రైట్​’ చిత్రానికి గ్రాండ్​ ప్రిక్స్​ అవార్డు దక్కింది. ఈ అవార్డ్​ అందుకున్న తొలి భారతీయ మహిళా దర్శకురాలిగా పాయల్​ కపాడియా రికార్డ్​ సృష్టించారు. మూడు దశాబ్దాల్లో గ్రాండ్​ ప్రిక్స్​ అవార్డ్​ దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే .

రాధికా సేన్‌
డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్‌ రాధికా సేన్‌ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2023)తో సత్కరించనుంది. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్‌ సుమన్‌ గవానీ అందుకోగా, రెండోసారి మేజర్‌ రాధికాసేన్‌ అందుకోనున్నారు.

సంజీవ్‌పురి
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌ పురి బాధ్యతలు స్వీకరించారు. 2024-–25 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. సీఐఐ జాతీయ ఉపాధ్యక్షుడిగా టాటా కెమికల్స్‌ ఎండీ, సీఈఓ ఆర్‌.ముకుందన్‌ వ్యవహరిస్తారు.

డాక్టర్‌ కృష్ణ ఎల్ల
భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్‌ మెడల్‌ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది.

సత్యదీప్‌ గుప్తా
భారత పర్వతారోహకుడు సత్యదీప్‌ గుప్తా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్‌లో అధిరోహించడంతోపాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేయడం విశేషం.

శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి
ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణికి ‘షా’ బహుమతి ల‌భించింది. విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల వెల్లువ వంటి విషయాలపై శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త కులకర్ణి.

స్పోర్ట్స్​

జ్యోతి సురేఖ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌
ఇండియన్​ స్టార్​ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో మూడు గోల్డ్​ మెడల్స్​ సాధించడంతో పాటు తన కెరీర్​లో అత్యుత్తమంగా కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

చాంపియన్స్​ సాత్విక్‌-చిరాగ్‌
భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్​, చిరాగ్‌ శెట్టి థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఈ జంట 21–-15, 21-–15తో చెన్‌ యాంగ్‌- ల్యూయి (చైనా) జంటపై విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టోర్నీల్లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి ఇది తొమ్మిదో టైటిల్​.

రొమాగ్నా గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌
ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసును మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ కైవసం చేసుకున్నాడు. ఈ రేసులో ఈ రెడ్‌బుల్‌ డ్రైవర్‌ 25 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఏడు గ్రాండ్‌ప్రి రేసుల్లో వెర్‌స్టాపెన్‌కు ఇది అయిదో విజయం. రొమాగ్నా రేసులో నోరిస్‌ (18 పాయింట్లు) రన్నరప్‌గా నిలవగా.. లీక్లెర్క్‌ (ఫెరారీ, 15) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఐపీఎల్‌-17 చాంపియన్‌ నైట్‌ రైడర్స్‌
ఐపీఎల్‌-17 చాంపియన్‌గా నైట్‌ రైడర్స్‌ కోల్‌కత్తా నిలిచింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. విజేతగా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు, ర‌న్నర‌ప్‌ హైదరాబాద్‌ జట్టుకు రూ.12.5 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. విరాట్ కోహ్లీ(741 ప‌రుగులు) ఆరెంజ్​ క్యాప్​, హ‌ర్షల్ ప‌టేల్(24 వికెట్లు) పర్పుల్​ క్యాప్​ దక్కింది.

జిమ్నాస్టిక్స్​లో దీపా రికార్డ్
ఆసియా సీనియర్​ జిమ్నాస్టిక్స్​ చాంపియన్​షిప్​లో మహిళల వాల్ట్​ ఫైనల్లో గోల్డ్​ మెడల్​ సాధించిన తొలి భారత జిమ్నాస్ట్​గా దీపా కర్మాకర్​ చరిత్ర సృష్టించారు. డోపింగ్​లో పట్టుబడి 21 నెలల నిషేధానికి గురైన దీపా తిరిగి ఈ విజయంతో సత్తా చాటింది.

టాప్​లో సూర్యకుమార్​ యాదవ్​
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ ఐసీసీ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌-2023 అవార్డు అందుకున్నారు. వెస్టిండీస్‌ స్టార్‌ బ్రాండన్‌ కింగ్‌ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

‘స్మార్ట్‌’ అస్త్ర ప్రయోగం సక్సెస్​
సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పిడో (స్మార్ట్‌) అనే ఆయుధ వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ‘స్మార్ట్‌’ అనేది కొత్తతరం క్షిపణి ఆధారిత తేలికపాటి టోర్పిడో వ్యవస్థ. జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. డీఆర్‌డీవో దీన్ని అభివృద్ధి చేసింది.

తొలి భారత అంతరిక్ష పర్యాటకుడు
తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర దిగ్విజయంగా రోదసియాత్ర చేసిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్‌-25 (ఎన్‌ఎస్‌-25) వ్యోమనౌకలో గోపీచంద్‌ ఈ యాత్ర పూర్తిచేశారు.

‘అగ్నిబాణ్‌’ సక్సెస్​
చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ లిక్విడ్ ఇంజిన్‌ కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ నిర్వహించినట్లైంది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్‌పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అమర్చారు.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మార్చి​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఫిబ్రవరి​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జనవరి​ 2024

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!