Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : జనవరి ​2024

కరెంట్​ అఫైర్స్​ : జనవరి ​2024

అంతర్జాతీయం

డెన్మార్క్‌ రాజుగా ఫ్రెడెరిక్‌-10
డెన్మార్క్‌ రాజుగా ఫ్రెడెరిక్‌-10 నియమితులయ్యారు. ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరెట్‌-2 (83) స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫ్రెడెరిక్‌-10కు అవకాశం దక్కింది. ఆయనను రాజుగా డెన్మార్క్‌ ప్రధాని మెట్‌ ఫ్రెడెరిక్సన్‌ ప్రకటించారు.

తైవాన్‌ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌
తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) అభ్యర్థి లాయ్‌ చింగ్‌ తె విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా దేశాధ్యక్షురాలిగా కొనసాగుతున్న త్సాయింగ్‌ వెన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు.

నిఘా కోసం జపాన్‌ ఉపగ్రహ ప్రయోగం
ఉత్తర కొరియాపై నిఘా వేసేందుకు జపాన్‌ నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర కొరియా దళాల కదలికలను పసిగట్టనుంది. తనేగషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్‌2ఏ రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు.

ఎర్ర సముద్రంలో హౌతీల దాడి
ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ నౌకా మార్గంపై హౌతీ రెబల్స్‌ భారీ దాడి చేశారు. యెమెన్‌ భూభాగం నుంచి 20కి పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు. యెమెన్‌లోని హోడైడా, మోఖా పోర్టుల వద్ద ఈ దాడులు జరిగాయి.

ప్రపంచంలోనే విలువైన కరెన్సీ
ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్‌ దినార్‌ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్‌ విలువ రూ.270.23కు చేరింది. అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియా గోల్డెన్‌ వీసా రద్దు
విదేశీయులు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా, అక్కడే కొన్ని రోజులు నివసించేందుకు అనువుగా జారీచేస్తున్న ‘గోల్డెన్‌ వీసా’ రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. గోల్డెన్‌ వీసా నిబంధనల ప్రకారం కనీసం రూ.27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఈ నిబంధన తీసుకొచ్చింది.

ఇరాన్‌ ఉపగ్రహ ప్రయోగం
ఇరాన్‌ సొరయా అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 50 కిలోల బరువైన ఈ ఉపగ్రహం భూమికి 750 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశించింది. టెహ్రాన్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని షాహ్రౌద్‌ అనే పట్టణంలో మొబైల్‌ లాంచ్‌పాడ్‌ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.

మలేసియా రాజుగా ఇస్కందర్‌
మలేసియా కొత్త రాజుగా 65 ఏళ్ల సుల్తాన్‌ ఇబ్రహీం ఇస్కందర్‌ ప్రమాణస్వీకారం చేశారు. మలేసియాలోని జోహోర్‌ రాష్ట్రాన్ని పాలించిన ఈయన.. వంతులవారీ రాజరిక వ్యవస్థలో భాగంగా కొత్త రాజయ్యారు. పట్టాభిషేక కార్యక్రమం తర్వాత జరగనుంది.

ప్రపంచ ఉత్తమ నగరాల్లో ముంబై
‘టైమ్‌ ఔట్‌’ విడుదల చేసిన ప్రపంచంలో టాప్‌ నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. జాబితాలో న్యూయార్క్, కేప్‌టౌన్‌ , లండన్‌ , బెర్లిన్‌ , మ్యాడ్రిడ్‌ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.

అవినీతి ర్యాంకింగ్
ప్రపంచంలోని అత్యంత అవినీతి, తక్కువ అవినీతి దేశాల జాబితా విడుదలైంది. 180 దేశాల జాబితాలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో సోమాలియా, సిరియా, యెమెన్ ఉన్నాయి. అదే సమయంలో, అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఉన్నాయి. భారత్ 93వ స్థానంలో ఉంది.

ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్‌ అర్నాల్ట్‌
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందించిన రియల్‌-టైమ్‌ బిలియనీర్స్‌ జాబితాలో బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. అర్నాల్ట్, ఆయన కుటుంబం నికర విలువ 207.8 బి.డాలర్లకు చేరింది. టెస్లా సీఈఓ నికర విలువ 204.7 బి.డాలర్లుగా ఉంది.

ఉగ్రవాదుల నిరోధానికి ‘ఆపరేషన్‌ సర్వశక్తి’
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్థాన్‌ అమలుచేస్తున్న ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌ సర్వశక్తి’ని ప్రారంభించింది.ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమంతాగాలింపులు చేపడతాయి.

వాతావరణ యాప్‌ ఆవిష్కరణ
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ వాతావరణ సమాచారం అందించేందుకు ‘హర్‌హర్‌ మౌసం.. హర్‌ఘర్‌ మౌసం’ (ప్రతి ఒక్కరికీ.. ప్రతి ఇంటికీ వాతావరణ సమాచారం) పేరిట కొత్త యాప్‌ను రూపొందించింది.

సౌర దీపాలతో గిన్నిస్‌ రికార్డ్‌
అయోధ్యలో ఏర్పాటుచేసిన ‘సౌర వీధి’ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సాధించింది. స్థానిక గుప్తార్‌ ఘాట్‌ నుంచి నిర్మల్‌కుండ్‌ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌర దీపాలు అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధిదీపాల లైనుగా ‘గిన్నిస్‌’ గుర్తించింది.

వాద్‌నగర్‌లో మానవ ఆవాస ఆనవాళ్లు
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో క్రీస్తుపూర్వం 800 సంవత్సరం నాటి మానవ ఆవాస ఆనవాళ్లు బయటపడ్డాయి. ఐఐటీ-ఖరగ్‌పూర్, భారత పురాతత్వ సంస్థ (ఏఎస్‌ఐ), భౌతికశాస్త్ర ప్రయోగశాల (పీఆర్‌ఎల్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), దక్కన్‌ కాలేజ్‌లకు చెందిన పరిశోధకులు వాద్‌నగర్‌ పురాతత్వ తవ్వకాలను పరిశీలించి ఈ విషయం తెలిపారు.

అయోధ్య పోస్టల్‌ స్టాంపులు విడుదల
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్‌ రాజ్, శబరిమాతలపై మొత్తం ఆరు స్టాంపులు రూపొందించారు. దీంతోపాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు.

Advertisement

‘బాలక్‌ రామ్‌’గా అయోధ్య రామయ్య
భవ్య మందిరంలో అయిదేళ్ల బాలుడి విగ్రహ రూపంలో కొలువుదీరిన అయోధ్య రామయ్యను ఇక నుంచి ‘బాలక్‌ రామ్‌’గా పిలవనున్నారు. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించాడు.

ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యం
71వ ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దిల్లీలోని భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించనున్నారు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ పోటీలకు భారత్‌ వేదికగా నిలుస్తోంది.

ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన
దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. దీనికోసం ఇళ్ల కప్పులపై సౌర ఫలకాల (సోలార్‌ రూఫ్‌టాప్‌) వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన’ను ప్రకటించారు.

ఎస్సీ వర్గీకరణకు కమిటీ
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గాబా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర హోంశాఖ; సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ; గిరిజన వ్యవహారాలు; న్యాయ శాఖ; సామాజిక న్యాయం-సాధికారశాఖ కార్యదర్శులు సభ్యులు.

దేశంలోనే తొలి బాలికల సైనిక్‌ స్కూల్‌
డిఫెన్స్లో చేరి దేశానికి సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న బాలికల కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర నగరంలోని బృందావన్‌లో మొట్ట మొదటి ఆల్‌ గర్ల్స్‌ సైనిక్‌ స్కూల్‌ ‘ సంవిద్‌ గురుకులం గర్ల్స్‌ సైనిక్‌ స్కూల్‌’ను రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు.

రిపబ్లిక్ డే
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్‌ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ – లోక్‌తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు.

పద్మ అవార్డులు 2024
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిలకు పద్మవిభూషణ్‌ వరించింది. తెలంగాణ నుంచి కళారంగం విభాగంలో ఎ.వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్‌ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు.

టాప్లో ఒడిశా శకటం
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని ‘కర్తవ్య్‌ పథ్‌’లో ప్రదర్శించిన శకటాల్లో ఒడిశా శకటానికి మొదటి బహుమతి దక్కింది. ప్రజల ఎంపిక విభాగంలో గుజరాత్‌ శకటం ప్రథమ స్థానాన్ని పొందింది. న్యాయ నిర్ణేతల విభాగంలో ఒడిశా మొదటి స్థానం కైవసం చేసుకోగా.. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్‌కు ప్రథమం స్థానం దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

బిహార్‌ సీఎంగా తొమ్మిదోసారి నీతీశ్‌
బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరారు. 18 నెలల క్రితం వదిలేసిన కూటమిలోకి మళ్లీ వచ్చేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేసి, కాసేపట్లోనే తిరిగి సీఎంగా ప్రమాణం చేశారు. బిహార్‌ సీఎంగా ఆయన రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి బాధ్యతలు చేపట్టినట్లయింది.

ఆర్థికసంఘానికి నూతన సభ్యులు
అరవింద్‌ పనగాడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థికసంఘం సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు. అజయ్‌ నారాయణ్‌ ఝా, ఏనీ జార్జ్‌ మాథ్యూ, నిరంజన్‌ రాజాధ్యక్ష, సౌమ్యకాంతి ఘోష్‌లను ఆర్థికసంఘం పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డార్క్‌స్కై పార్క్‌గా పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌
దేశంలోనే తొలి డార్క్‌స్కై పార్క్‌(కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి)గా మహారాష్ట్రలోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌(పీటీఆర్‌) అరుదైన గుర్తింపు సాధించింది.

యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి భోగ్‌ (బ్లిస్‌ఫుల్‌ హైజీనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) జాతీయ స్థాయి గుర్తింపు పత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి లభించింది.

సచివాలయ సలహాదారుగా ప్రసన్నకుమార్‌
తెలంగాణ శాసనసభ, శాసనమండలి వ్యవస్థ సచివాలయ సలహాదారు (అడ్వైజర్‌ టు తెలంగాణ లెజిస్లేచర్‌ సెక్రటేరియట్‌)గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ నియమితులయ్యారు.

లక్ష్మీప్రియకు బాల పురస్కారం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారానికి హనుమకొండకు చెందిన 14 ఏళ్ల కూచిపూడి నృత్యకారిణి పెండ్యాల లక్ష్మీప్రియ ఎంపికయ్యింది.

భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌
తెలంగాణ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కర్రెం గౌరీశంకర్‌రావు ఎన్నికయ్యారు.

‘నంది’ స్థానంలో ‘గద్దర్‌’ పురస్కారాలు
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసే ‘నంది’ పురస్కారాలను ఇకపై ‘ప్రజాయుద్ధనౌక గద్దర్‌’ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులకు వాటిని ప్రదానం చేస్తామన్నారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు (టీఎస్‌పీఎస్సీకి) చైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, యరబాడి రామమోహనరావు, పాల్వాయి రజినీకుమారి, ప్రొఫెసర్‌ అమీరుల్లా ఖాన్, నర్రి యాదయ్య బాధ్యతలు స్వీకరించారు.

జారా
చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జారా అనే బాలిక నాలుగేళ్ల ప్రాయంలోనే ఏకంగా ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ ఎక్కేసింది. అక్కడికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు భారత్‌కు చెందిన ప్రిషా లోకేశ్‌ నికాజూ గతేడాది అయిదేళ్ల వయసులో ఎవరెస్ట్‌ చేరుకుంది.

అల్కా లాంబా
కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగం అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా నియమితులయ్యారు. ప్రస్తుత అధ్యక్షురాలు నెట్టా డిసౌజా స్థానంలో ఈ నియామకాన్ని చేపట్టారు. కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా వరుణ్‌ చౌధరి నియమితులయ్యారు.

ప్రఖర్‌ చతుర్వేది
కూచ్‌ బేహర్‌ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక బ్యాటర్‌ ప్రఖర్‌ చతుర్వేది ముంబయిపై 404 (636 బంతుల్లో) పరుగులు చేశాడు. కూచ్‌ బేహర్‌ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యువరాజ్‌ సింగ్‌ (1999) పేరిట ఉన్న రికార్డును ప్రఖర్ తిరగరాశాడు.

కోత రవి
సిక్కోలు వాసి కోత రవి అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అస్సాం కేడర్‌ 1993 బ్యాచ్‌కు చెందిన రవి.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

రిథమ్‌ సంగ్వాన్‌
భారత షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో సత్తాచాటి పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థానం సాధించింది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత 16వ షూటర్‌గా రిథమ్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో అత్యధిక మంది భారత షూటర్లు పోటీపడబోయే ఒలింపిక్స్‌ ఇదే కానుంది.

వైఎస్‌ షర్మిల
ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) అధికారిక ప్రకటన వెలువరించింది. ఏపీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

కర్పూరీ ఠాకుర్‌
బిహారీ ‘జన నాయక్‌’గా ప్రసిద్ధి పొందిన మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. ఆయన100వ జయంతికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికచేసింది.36 ఏళ్ల సుదీర్ఘ కాలం ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధిగా ఆయన కొనసాగారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
హిందీ భాషాభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న.. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాష సమన్వయకర్తగా విశ్వ హిందీ పరిషత్‌ నియమించింది. ఆయా దేశాల్లో హిందీ అధ్యయనానికి అవసరమైన చర్యలు పర్యవేక్షిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.

రోహన్‌ బోపన్న
అత్యంత పెద్ద వయసులో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అయిన ఆటగాడిగా రోహన్‌ బోపన్న రికార్డ్ సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ సెమీఫైన్‌ చేరడంతో బోపన్నకు నంబర్‌వన్‌ ర్యాంకు ఖాయమైంది. 43 ఏళ్ల బోపన్న మూడో ర్యాంకు ఆటగాడిగా టోర్నమెంట్లో అడుగుపెట్టాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌
భారత బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2023గా ఎంపికయ్యాడు. 2023లో సూర్య దాదాపు 50 సగటు, 150పై స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. అతడు ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఎంపికవడం ఇది వరుసగా రెండో ఏడాది.

సుద్దాల అశోక్‌ తేజ
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రముఖ సినీగీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజకు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం ‘తెలుగు భాషా రత్న’ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలకుగాను ఈ పురస్కారం అందజేయనుంది.

చంపయ్‌ సోరెన్‌
జార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపయ్‌ సోరెన్‌ ఖరారయ్యారు. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయ్‌ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకుర్‌ తెలిపారు. గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం హేమంత్‌ సోరెన్‌ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు.

తన్మయ్‌ అగర్వాల్‌
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (323 బ్యాటింగ్‌; 160 బంతుల్లో 33×4, 21×6) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. జెన్‌ నెక్స్ట్‌ మైదానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ మ్యాచ్‌ లో ఈ రికార్డ్ నమోదు అయింది.

మాడిసన్‌ మార్ష్‌
కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్‌ మార్ష్‌ మిస్‌ అమెరికా 2024 అందాల పోటీల్లో విజేతగ నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.ఆమె ఎయిర్‌ఫోర్స్‌ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిస్‌ అమెరికా టైటిల్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

మెస్సీకి ఫిఫా ఉత్తమ ప్లేయర్‌ అవార్డు
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సి ఫిఫా ఉత్తమ పురుష ప్లేయర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకోవడం గత నాలుగేళ్లలో మెస్సీకిది మూడోసారి. స్పెయిన్‌ స్ట్రైకర్‌ అయితనా బొన్మాటి ఫిఫా ఉత్తమ మహిళా ప్లేయర్‌ అవార్డు దక్కించుకుంది.

ప్రజ్ఞానంద సూపర్ విన్
ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్‌ లిరెన్‌ (చైనా)పై గెలుపొందాడు. దీంతో ప్రజ్ఞానంద లైవ్‌ రేటింగ్స్‌లో 2748.3 పాయింట్లతో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ చేరుకున్నాడు.

ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు
2023లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నాడు. కోహ్లీకి ఇది నాలుగో అవార్డు. గతంలో 2012, 2017, 2018ల్లో వరుసగా అవార్డు సాధించాడు. అత్యధికసార్లు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
ఇండియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి రన్నరప్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-–15, 11–-21, 18-–21తో మూడో సీడ్‌ కాంగ్‌ మిన్‌ హ్యుక్‌- సియో సూంగ్‌ (కొరియా) జంట చేతిలో పోరాడి ఓడింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ ఇటలీ కుర్రాడు జనిక్‌ సినర్‌ గెలుచుకున్నాడు. ఫైనల్లో మెద్వెదెవ్‌పై అతడు పైచేయి సాధించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (మహిళలు)ను సబలెంక (బెలారస్‌) సొంతం చేసుకుంది. ఫైనల్లో సబలెంక 6–-3, 6–-2తో కిన్వెన్‌ జెంగ్‌ (చైనా)పై విజయం సాధించింది.

రోహన్‌ బోపన్న రికార్డు
అత్యంత పెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ గెలిచిన ఆటగాడిగా భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న రికార్డు సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. 43 ఏళ్ల బోపన్నకు పురుషుల డబుల్స్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.

ఆకాశ్‌-ఎన్‌జీ పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ్‌-ఎన్‌జీని ఒడిశాలోని చాందీపుర్‌లో విజయవంతంగా పరీక్షించారు. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవ రహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసింది. ఆకాశ్‌-ఎన్‌జీ 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.

జాబిల్లిపై జపాన్‌ ల్యాండర్‌
జపాన్‌కు చెందిన ‘స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌’ (స్లిమ్‌) అనే వ్యోమనౌక చంద్రుడిపై విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపై వ్యోమనౌకను సాఫీగా దించిన (సాఫ్ట్‌ల్యాండింగ్‌ సాధించిన) ఐదో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్‌ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి.

సూపర్ కంప్యూటర్​ బ్రెయిన్
2016లో ఎలన్‌ మస్క్‌ ప్రారంభించిన ‘న్యూరాలింక్‌’ ప్రాజెక్టులో భాగంగా బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ సాంకేతికత(బీసీఏ)ను మానవులపై తొలిసారి ప్రయోగించినట్లు ప్రకటించారు. ఓ వ్యక్తి మెదడులో చిప్‌ను అమర్చామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మే​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మార్చి​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఫిబ్రవరి​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జనవరి​ 2024

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!