Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: మే​ 2022

కరెంట్​ అఫైర్స్​: మే​ 2022

అంతర్జాతీయం

ఇండియా–నార్డిక్‌ సమ్మిట్​

Advertisement

డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌లో రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సు నిర్వహించారు. ఈ భేటీ సంద్భంగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్‌ ప్రధానులతో భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సదస్సులో ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు.

యుద్ధంతో వలసలు 83 లక్షలు

రష్యా – ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి మొత్తం 83 లక్షల మంది శరణార్థులుగా దేశం విడిచి వెళ్లిపోవొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. హంగరీ, మాల్దోవా, పోలండ్, రొమేనియా, స్లోవేకియా, బెలారస్, బల్గేరియా, చెక్‌ రిపబ్లిక్‌లకు కొనసాగుతున్న వలసలకు సాయం అందించేందుకు ప్రణాళికను రూపొందించింది.

Advertisement

పోలాండ్​, బల్గేరియాపై రష్యా ఆంక్షలు

నాటో సభ్యదేశాలైన పోలాండ్, బల్గేరియాకు సహజవాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. త్వరలో ఇతర దేశాలకు కూడా సరఫరా ఆపేస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని యూఎస్, యూరప్‌ దేశాలు నిర్ణయించిన మర్నాడే రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సు

Advertisement

ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇండియా – డెన్మార్క్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొన్నారు. భారత్​లో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు శీతల గిడ్డంగులు, షిప్పింగ్, పోర్టులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మోడీ కోరారు. ఈ కార్యక్రమంలో డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్, యువరాజు ఫెడెరిక్‌ పాల్గొన్నారు.

దానిశ్‌ సిద్దీఖికి పులిట్జర్‌ అవార్డు

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల కాల్పుల్లో మరణించిన భారత ఫొటోగ్రాఫర్‌ దానిశ్‌ సిద్దీఖికి ప్రతిష్టాత్మక పులిట్జర్‌ అవార్డు లభించింది. భారత్‌లో కొవిడ్‌ సమయంలో మరణాలకు సంబంధించి తీసిన చిత్రాలకు సిద్దీఖితో పాటు రాయిటర్స్‌ వార్తా సంస్థకు చెందిన ఆయన సహచరులు అద్నాన్‌ అబిద్, సన్నా ఇర్షాద్‌ మట్టూ, అమిత్‌ దవేలకూ ఈ పురస్కారం దక్కింది.

Advertisement

వరల్డ్​‍ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్​​

పత్రికా స్వేచ్ఛ రోజు సందర్భంగా 180 దేశాలతో వరల్డ్​‍ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్​​‍ విడుదల చేశారు. ఈ జాబితాలో నార్వే మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్​‍ 2, స్వీడన్‌ 3, ఎస్టోనియా 4, ఫిన్‌లాండ్‌ 5వ స్థానాల్లో నిలిచాయి. భారతదేశం 150వ స్థానంలో నిలిచింది. 2021 సూచీలో భారత్‌ 142వ స్థానంలో ఉంది.

శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమ సింఘే

Advertisement

తీవ్ర సంక్షోభంతో కల్లోలమవుతోన్న శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.

రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌

ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలిలో రష్యా బదులు చెక్‌ రిపబ్లిక్‌ను తీసుకునేందుకు యూఎన్​ఓ సర్వప్రతినిధి సభ తీర్మానించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక రష్యాను ఈ స్థానం నుంచి తొలగించారు.

Advertisement

ప్రపంచంలోనే అతి పొడ‌వైన వంతెన

చెక్‌ రిపబ్లిక్‌లోని డోల్నీ మొరావాలో ఏర్పాటు చేసిన 2,365 అడుగుల (721 మీటర్లు) ఊయల వంతెన సముద్ర మట్టానికి 1,100 మీటర్లకుపైగా ఎత్తున నిర్మించారు. పాదచారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊయల వంతెనల్లోకెల్లా ఇదే పొడవైంది.

ఫ్రాన్స్‌ ప్రధానిగా ఎలిసబెత్‌ బోర్న్‌

Advertisement

ఫ్రాన్స్‌ నూతన ప్రధానమంత్రిగా ఎలిసబెత్‌ నియమితులయ్యారు. అధ్యక్షుడిగా మెక్రాన్‌ రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన మెక్రాన్, ఆయన స్థానంలో బోర్న్‌ను ప్రధానిగా నియమించారు.

నాటోకు ఫిన్లాండ్, స్వీడన్‌ అప్లికేషన్​

రష్యా తమపై దురాక్రమణకు దిగొచ్చనే ఉద్దేశంతో నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్‌ దానికి సంబంధించిన అప్లికేషన్స్​ బ్రసెల్స్‌లోని కూటమి ప్రధాన కార్యాలయానికి పంపించాయి. కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి.

Advertisement

యూఏఈ అధ్యక్షుడిగా షేక్‌ మహమ్మద్‌ బిన్‌

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మృతి చెందడంతో కొత్త అధ్యక్షుడిగా షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. చనిపోయిన అధ్యక్షుడి సోదరుడే కొత్తగా ఎంపికైన మహ్మద్​.

ఆస్ట్రేలియా ప్రధానిగా అల్బనీస్‌

Advertisement

ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ 2007 తర్వాత లేబర్‌ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో మొత్తం 151 స్థానాలు ఉన్నాయి.

ఎవరెస్టుపై వాతావరణ కేంద్రం

ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుంది. సౌరశక్తి సాయంతో ఇది పనిచేస్తుంది.

కొత్తగా క్వాడ్‌ ఫెలోషిప్‌

‘క్వాడ్‌ ఫెలోషిప్‌’ను సభ్య దేశాధినేతలు మోడీ, బైడెన్, కిషిడా, అల్బనీస్‌ ఆవిష్కరించారు. అమెరికాలోని ప్రఖ్యాత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టోరల్‌ డిగ్రీలు చేసేందుకు ఒక్కో సభ్య దేశం నుంచి ఏటా 25 మంది స్టూడెంట్లను ఈ ఫెలోషిప్‌ స్పాన్సర్‌ చేస్తుంది.

12 దేశాలతో ఐపీఈఎఫ్‌

ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్‌ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్‌ దేశాల మధ్య ఇండో పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌) పేరుతో వర్తక ఒప్పందం కుదిరింది. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు

జాతీయం

ఆర్​బీఐ రెపోరేటు పెరిగింది

కీలక పాలసీ వడ్డీ రేటు అయిన రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పెంచింది. రెపో రేటు 4 శాతం నుంచి 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. రివర్స్‌ రెపో రేటును3.35 శాతంగానే కొనసాగించింది.

జర్మనీ ఛాన్స్‌లర్‌తో ప్రధాని చర్చలు

ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ ఆ దేశ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు, అంతర్‌ ప్రభుత్వ సంప్రదింపులు జరిపారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటానికి సంబంధించిన సంయుక్త ప్రకటనపై భారత్, జర్మనీ సంతకాలు చేశాయి.

జీఎస్‌టీ వసూళ్లలో రికార్డు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. 2022 ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మార్చి వసూళ్లతో పోలిస్తే ఈ మొత్తం రూ.25 వేల కోట్లు అధికం. ఒక నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను దాటడం ఇదే తొలిసారి.

ఏలూరులో ఆదిమానవుల ఆనవాళ్లు

చారిత్రక సంపద పరిరక్షణలో భాగంగా ఏలూరు జిల్లా రుద్రమకోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. ఇందులో భాగంగా పూసలు, కుండలు క్రీస్తు పూర్వం నాటివని గుర్తించారు. అలంకరణకు వినియోగించిన తెలుపు, ఎరువు, పచ్చని రాతి పూసలు, మట్టిపాత్రలు, ఆయుధాలు లభ్యమయ్యాయని సహాయ సంచాలకులు కె.తిమ్మరాజు తెలిపారు.

చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్ర ఆరంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. గంగా, యమున విగ్రహాలను స్వస్థలాలకు తీసుకొచ్చారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు.

చీఫ్​ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్​ కుమార్​

భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సుశీల్‌ చంద్ర మే 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మే 15న నూతన సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది.

దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే

బ్రిటిష్‌ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్‌ 124ఏ) విషయంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణ నిలిపేయాలని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

కశ్మీర్‌కు 47..జమ్మూకు 43 అసెంబ్లీ సీట్లు

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన కసరత్తు పూర్తయింది. కశ్మీర్‌ డివిజన్‌కు 47 అసెంబ్లీ స్థానాలను, జమ్మూ డివిజన్‌కు 43 సీట్లను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ రంజన ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌ కమిషన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కేరళలో టమాటో ఫ్లూ వైరస్‌

కేరళలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. ఐదేళ్ల లోపు చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కొల్లాం జిల్లాలో 80 మందికి పైగా పిల్లలు దీని బారిన పడ్డట్టు వైద్య అధికారులు వెల్లడించారు. టమాటో ఫ్లూ సోకిన వారి శరీరంపై ఎర్రటి దద్దుర్లు, టమాటో రంగు బొబ్బలు వస్తున్నాయి.

‘మోడీ జీ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనా కోణాలు, ఆయన పనిచేసే విధానాల్లోని విశిష్టతను విశ్లేషిస్తూ దేశంలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనంతో ‘మోడీ జీ 20 డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ అనే పుస్తకాన్ని రూపొందించారు. విజ్ఞాన్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా

త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లవ్‌ దేవ్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. శాంతి భద్రతలు కాపాడడంపై ప్రత్యేక దృష్టి పెడుతా అని కొత్త సీఎం ప్రకటించారు.

కర్ణాటకలో ‘మత మార్పిడి నిషేధ’ ఆర్డినెన్స్‌

మత మార్పిడి నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం పంపేందుకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. వర్షాకాల సమావేశాలకు సమయం ఉండటంతో ఆర్డినెన్స్‌ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు.

దైవదూతగా దేవసహాయం పిళ్లై

భారతదేశంలో పుట్టి, క్రైస్తవం స్వీకరించిన దేవసహాయం పిళ్లై ఇక నుంచీ దైవదూతగా గుర్తింపు పొందనున్నారు. ప్రపంచ క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్‌ సిటీలో జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

నేపాల్​లో​ ప్రధాని మోడీ పర్యటన

బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్‌లో ఉన్న బుద్ధుని జన్మస్థలం లుంబిని వనంలో మే 16న ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఆహ్వానం మేరకు బుద్ధుని జన్మస్థలంగా భావించే మాయాదేవి ఆలయాన్ని ప్రధానులిద్దరూ దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

‘స్టార్టప్‌ పాలసీ 2022’ ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల వల్ల దేశంలో భారీ సంఖ్యలో ఏర్పడిన స్టార్టప్స్‌ స్వల్ప కాలంలోనే యునికార్న్‌ కంపెనీలు (100 కోట్ల డాలర్ల విలువైనవి)గా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ‘స్టార్టప్‌ పాలసీ 2022’ను ఆవిష్కరించారు.

అంతర్జాతీయ పర్యాటక సూచిలో భారత్‌

ప్రపంచ దేశాలకు ప్రయాణాలు, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46 స్థానాన్ని దక్కించుకున్న మన దేశం ఎనిమిది స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి పడిపోయింది. జపాన్‌ మొదటి స్థానంలో నిలిస్తే, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్ నిలిచాయి.

ప్రధాని నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైర్మన్​గా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.

దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌

స్థానికంగా స్టార్టప్​లు, పరిశ్రమ వర్గాలు తమ ఉత్పత్తులను పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. విదేశీ కేంద్రాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. రూ.220 కోట్ల వ్యయంతో ఈ టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు చేశారు.

సీమా పుజానీకి గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ అవార్డు

భారత్‌కు చెందిన 10 లక్షల మంది ఆశా వర్కర్లు కొవిడ్‌-19 విజృంభణ సమయంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్భుతమైన వైద్య సేవలను అందించినందుకు గాను గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌ అవార్డును డబ్లూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించారు. భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సీమా పుజానీ ఈ పురస్కారం అందుకున్నారు.

ప్రాంతీయం

పంచాయతీ ఆడిటింగ్‌లో టాప్​

గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆడిటింగ్‌తో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శక రాష్ట్రం (నేషనల్‌ లీడ్‌ స్టేట్‌)గా నిలిచింది. పంచాయతీ ఆడిటింగ్‌లో తెలంగాణ వరుసగా రెండో సారి మొదటి స్థానాన్ని దక్కించుకొని ఈ ఘనత సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

టెస్కాబ్‌కు అవార్డులు

సహకార రంగంలో విశేష కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌)కు తృతీయ, కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాని (ప్యాక్స్‌)కి ప్రథమ బహుమతులను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగల్‌ అందజేశారు.

సింగరేణికి అవార్డు

సింగరేణి సంస్థకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (ఐఐఐఈ) పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 65 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో దేశంలోని ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

‘హైసియా’ అధ్యక్షురాలిగా మనీష

హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) నూతన అధ్యక్షురాలిగా మనీష సాబు బాధ్యతలు చేపట్టారు. ఒక మహిళ హైసియాకు సారథ్యం వహించటం ఇదే తొలిసారి. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు.

హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది.

అలంపూర్‌లో అమితాభ బుద్ధుడు

అలంపూర్‌ ఆలయాల పరిధిలో ప్రాచీన బుద్ధుడి విగ్రహాలున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో శివనాగిరెడ్డి తెలిపారు.

సింగరేణికి అవార్డులు

సింగరేణికి జియోమైన్‌ టెక్‌ విబ్జియార్‌ గోల్డెన్‌ రెయిన్‌ బో పురస్కారంతో పాటు సంస్థ డైరెక్టర్​ చంద్రశేఖర్‌కు ఇన్నోవేటివ్‌ లీడర్‌ షిప్, బలరామ్‌కు ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం లభించాయి. భువనేశ్వర్‌లో జరిగిన 22వ అంతర్జాతీయ జియోమైన్‌ టెక్‌ సదస్సులో వీటిని ప్రదానం చేశారు.

టీబీఏ అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్‌

తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా మళ్లీ కేటీఆర్‌ ఎన్నికయ్యారు. సమావేశంలో సభ్యులు గత కార్యవర్గాన్నే తిరిగి ఎనుకున్నారు. సంఘం కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్, ఉపాధ్యక్షుడిగా చాముండీశ్వరీనాథ్ కొనసాగనున్నారు.

వార్తల్లో వ్యక్తులు

హర్షద శరద్‌ గరుడ్‌

భారత వెయిట్‌ లిఫ్టర్‌ హర్షద శరద్‌ గరుడ్‌ ఐడబ్ల్యూఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. గ్రీస్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 45 కేజీల విభాగంలో హర్షద గోల్డ్​ మెడల్​ కైవసం చేసుకుంది.

తరుణ్‌ కపూర్‌

ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నియమితులయ్యారు. 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌) అధికారి అయిన కపూర్, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా గతేడాది నవంబరు 30న పదవీ విరమణ చేశారు.

సంగీతా సింగ్‌

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్‌పర్సన్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారిణి సంగీతా సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత ఛైర్మన్‌ జె.బి.మహాపాత్ర ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి సంగీతా సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.

కృష్ణన్‌ రామానుజం

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) చైర్‌పర్సన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కృష్ణన్‌ రామానుజం నియమితులయ్యారు. 2022–23 సంవత్సరానికిగాను ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన నాస్కామ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

నంద్‌ మూల్‌చందానీ

అమెరికా గూఢచర్య సంస్థ ‘సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)’ తొలి ‘చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)’గా నంద్‌ మూల్‌చందానీ నియమితులయ్యారు. మూల్‌చందానీ ఇంతకుముందు అమెరికా రక్షణ శాఖ జాయింట్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌కు సీటీవోగా, తాత్కాలిక డైరెక్టర్‌గా పనిచేశారు.

కామీ రీటా

తన రికార్డును తానే బద్దలుగొడుతూ 52 ఏళ్ల నేపాలీ షెర్పా కామీ రీటా 26వ సారి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇంతవరకు అత్యధిక సార్లు ఈ శిఖరం పైకి చేరుకున్న రికార్డు ఆయనదే కాగా దాన్ని మళ్లీ అధిగమించడం విశేషం.

రాజాచారి

తెలుగు మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి రోదసిలో ఆరు నెలలు గడిపిన అనంతరం క్షేమంగా భూమికి చేరుకున్నారు. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్‌ ఎండ్యూరెన్స్‌ వ్యోమనౌక ద్వారా ఆయన మెక్సికో అగాథంలోని సముద్ర జలాల్లో దిగారు.

ప్రియాంకా మొహితే

మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంకా మొహితే అరుదైన రికార్డు నమోదు చేశారు. దేశంలో 8 వేల మీటర్ల ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. కాంచన్‌గంగ పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మూడో పర్వతం ఇదే.

మార్కోస్‌ జూనియర్‌

ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌ జూనియర్‌ ఘన విజయం సాధించారు. కొత్త అధ్యక్షుడు జూన్‌ 30న బాధ్యతలు చేపడతాడు. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్‌ నియంత ఫెర్డినాండ్‌ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టారు.

జాన్‌ లీ

చైనా అనుకూల నేత జాన్‌ లీ హాంకాంగ్‌ నగర నూతన అధిపతిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల్లో జాన్‌ లీకి 99 శాతం ఓట్లు లభించాయి. సుమారు 1500 మంది కమిటీ సభ్యుల్లో చాలా మంది గతంలో హాంకాంగ్‌లో ప్రజాసామ్య ఉద్యమాన్ని భద్రతా ముఖ్య అధికారిగా కఠినంగా అణిచి వేసిన లీ వైపే మొగ్గు చూపారు.

టీఎన్‌ మనోహరన్‌

ఐడీబీఐ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా మూడేళ్ల కాలానికి టీఎన్‌ మనోహరన్‌ను నియమించేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపింది. మే 9 నుంచి స్వతంత్ర డైరెక్టర్‌ మనోహరన్‌ మూడేళ్ల పాటు పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా కొనసాగేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసిందనీ, ఆర్‌బీఐ నుంచి మే 6నే అనుమతి లభించిందని ఐడీబీఐ తెలిపింది.

నిఖత్‌ జరీన్‌

మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విజేతగా నిలిచింది. 52 కేజీ ఫ్లయ్‌వెయిట్‌ విభాగం ఫైనల్లో 5- – 0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించి స్వర్ణం అందుకుంది. దీంతో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్‌ నిలిచింది. గతంలో మేరీ కోమ్‌, సరితాదేవి, ఆర్‌ఎల్‌ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్‌ సాధించారు.

మనోజ్‌ పాండే

భారత్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండేకు పరమ విశిష్ట సేవా పురస్కారం వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విధుల్లో మరణించిన పలువురు ఆర్మీ అధికారులకు, సైనికులకు శౌర్య చక్ర అవార్డులను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు.

సంజీవ్‌ బజాజ్‌

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చైర్మన్, ఎండీ సంజీవ్‌ బజాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. 2022 –- 23 సంవత్సరానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. తదుపరి సీఐఐ అధ్యక్ష అభ్యర్థిగా హీరో మోటోకార్ప్‌ చైర్మన్, సీఈఓ పవన్‌ ముంజాల్‌ ఉంటారు.

సచిన్‌ తెందుల్కర్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ యూనిసెఫ్‌ సుహృద్భావ రాయబారిగా రికార్డు స్థాయిలో 20వ సంవత్సరం కొనసాగనున్నారు. ఈ హోదాలో ఆయన రెండు దశాబ్దాలుగా పేద పిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్నారని యూనిసెఫ్‌ పేర్కొంది.

అన్వితారెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన అన్వితా సముద్ర మట్టానికి 8,848.86 మీ. ఎత్తున ఉన్న ఎవరెస్టును ఎక్కినట్లు ట్రైనర్​ హైదరాబాద్‌లోని ట్రాన్సెన్డ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ అధినేత శేఖర్‌బాబు తెలిపారు.

వినయ్‌ కుమార్‌ సక్సేనా

దేశ రాజధాని డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వినయ్‌కుమార్‌ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో గతవారం రాజీనామా చేసిన అనిల్‌ బైజల్‌ స్థానంలో సక్సేనాను నియమించారు.

సలీల్‌ పరేఖ్‌

ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓగా మరో అయిదేళ్ల పాటు సలీల్‌ పరేఖ్‌ కొనసాగనున్నారు. 2027 మార్చి 31 వరకు సలీల్‌ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఇన్ఫోసిస్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఐటీ సేవల పరిశ్రమలో 30 ఏళ్లకు పైగా అంతర్జాతీయ స్థాయి అనుభవం ఆయన సొంతం.

పియాలీ బసక్‌

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకురాలు పియాలీ బసక్‌ ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా అధిరోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమె రికార్డ్​ సృష్టించింది. పియాలీ స్వస్థలం బెంగాల్‌లోని చందన్‌నగర్‌.

బిందు మాధవి

నటి బిందు మాధవి ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ సీజన్‌-1 విజేతగా నిలిచారు. ఆమె స్వస్థలం ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె. ట్రోఫీతో పాటు రూ.40 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. తెలుగు బిగ్‌బాస్‌ షోలో మహిళా కంటెస్టెంట్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి.

స్పోర్ట్స్​

టాప్​లో టీమ్​ ఇండియా​

2021–2022 క్రికెట్‌ సీజన్‌ను భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించింది. 270 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలిచింది. టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ రెండో ర్యాంక్‌లో ఉంది. వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ టాప్‌ ర్యాంక్‌, భారత్‌ నాలుగో ర్యాంక్‌లో ఉంది.

సింధుకి కాంస్యం

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్టార్‌ షట్లర్‌ సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ సింధు 21–-13, 19-–21, 16-–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌) చేతిలో ఓడింది.

కార్లోస్‌దే మాడ్రిడ్‌ టైటిల్‌

స్పెయిన్‌ టీనేజర్‌ కార్లోస్‌ అల్కరస్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ ఫైనల్లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఫైనల్లో 19 ఏళ్ల అల్కరస్‌ 6-3, 6-1తో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ను ఓడించాడు. క్లే టోర్నమెంట్లో నాదల్, జకోవిచ్‌లను వరుస మ్యాచ్‌ల్లో ఓడించి ఫైనల్‌కు వెళ్లిన తొలి ఆటగాడిగా అల్కరస్‌ ఘనత సాధించాడు.

సంతోష్‌ ట్రోఫీ

ఫుట్‌బాల్‌ 75వ సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో కేరళ టీమ్​ వెస్ట్​ బెంగాల్‌ను ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. ఈ ట్రోఫీని కేరళ గెలుచుకోవడం ఇది ఏడో సారి. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ జిజో జోసఫ్‌ (కేరళ)కు దక్కింది. అత్యధిక గోల్‌ స్కోరర్‌గా జెసిన్‌ టీకే (9 గోల్స్​, కేరళ) నిలిచాడు.

థామస్‌ కప్‌ చాంపియన్​ భారత్​

థామస్‌ కప్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో 14 సార్లు టైటిల్‌ సాధించిన ఇండోనేసియాను చిత్తుగా ఓడించి భారత్​ టైటిల్‌ నెగ్గింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్‌ సాయిరాజు ఈ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు. థామస్‌ కప్‌ టైటిల్‌ సాధించిన ఆరో దేశంగా భారత్​ రికార్డ్​ సృష్టించింది.

ఐలీగ్‌ విజేతగా కేరళ

ఐ లీగ్‌ టైటిల్‌ను గోకులం కేరళ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిలబెట్టుకుంది. ఫుట్‌బాల్‌ లీగ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన కేరళ జట్టు ఫైనల్లో 2-–1తో మహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ను ఓడించింది. రిషద్‌ (49వ నిమిషం), ఎమిల్‌ బెన్ని (61వ నిమిషం) కేరళను గెలిపించారు.

ఆనంద్‌కు సూపర్‌బెట్‌ టైటిల్‌

ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సూపర్‌బెట్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ పోలెండ్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే అతడు విజేతగా నిలిచాడు. ఆరు గేముల్లో నెగ్గిన ఆనంద్‌ రెండు గేమ్‌లను డ్రాగా ముగించాడు.

టాప్​ 3లో సురేఖ

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ (విజయవాడ) ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-3లో అడుగుపెట్టింది. ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్‌ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి కాంపౌండ్‌ ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

2024లో శుక్రయాన్‌ మిషన్

చంద్రయాన్, మంగళ్‌యాన్‌ పేరిట ఇప్పటికే చంద్రునిపైకి, మార్స్‌పైకి మిషన్లను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రయాన్‌పై దృష్టి పెట్టింది. 2024 డిసెంబర్‌కల్లా మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించారు.

సుఖోయ్​ నుంచి బ్రహ్మోస్‌

బ్రహ్మోస్‌ మెరుగైన వెర్షన్‌ను భారత్‌ సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ రకం క్షిపణిని ‘ఎక్స్‌టెండెండ్‌ రేంజ్‌ వెర్షన్‌’గా పిలుస్తారు. ఈ పరీక్షలో బ్రహ్మోస్‌ బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

53 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌

ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌ సంస్థ చేపట్టిన ‘స్టార్‌లింక్‌’ ప్రాజెక్టు కింద మరో 53 ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లాయి. ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది.

మిస్సైల్​ టెస్ట్​ సక్సెస్​

దేశీయంగా అభివృద్ధి చేసిన నౌకా విధ్వంసక క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌లోని టెస్ట్‌ రేంజిలో నౌకా దళంతో కలిసి సంయుక్తంగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది.

విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ సక్సెస్​

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్​ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్ విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్రొపెల్లెంట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ స్టాటిక్‌ టెస్టింగ్‌ సదుపాయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దేశంలో ప్రైవేట్​ రంగంలో ఇదే తొలి రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగం.

DONT MISS TO READ: కరెంట్​ అఫైర్స్​ ఏప్రిల్ 2022

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!