Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జూన్​​ 2022

కరెంట్​ అఫైర్స్​: జూన్​​ 2022

అంతర్జాతీయం


భారత్​–బంగ్లా నేవీ విన్యాసాలు
భారత్‌–-బంగ్లాదేశ్‌ నావికా విన్యాసాలు బంగ్లాదేశ్‌లోని పోర్ట్‍ మోంగ్లాలో నిర్వహించారు. ‘బొంగోసాగర్‌’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసాలు ఉత్తర బంగాళాఖాతంలో కూడా చేపట్టారు. ‘అధిక స్థాయి ఇంటరాపరబిలిటీ, ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం’ లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహించారు.

Advertisement

‘బ్రిక్స్‌’ విస్తరణకు చైనా ఓకే

‘బ్రిక్స్‌’ కూటమి విస్తరణకు చైనా మద్దతు తెలిపింది. ఇందులో సౌదీ అరేబియా, అర్జెంటీనాలు పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చేరాలనుకుంటున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్‌ ఈ వ్యాఖ్య చేసింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.

భారతీయ భాషల్లో అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లు

Advertisement

వైట్‌హౌస్, ఫెడరల్‌ ఏజెన్సీలతో పాటు కీలకమైన ప్రభుత్వ వెబ్‌సైట్లను హిందీ, గుజరాత్, పంజాబ్‌ తదితర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని యూఎస్‌ ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. పబ్లిక్, ఎమర్జెన్సీ హెచ్చరికలు ఆంగ్ల భాషలో నైపుణ్యం లేనివారికి సులవుగా చేరేలా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సూచించింది.

అవిశ్వాసంలో నెగ్గిన బోరిస్‌ జాన్సన్‌

‘పార్టీగేట్‌’ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సొంత పార్టీ కన్జర్వేటివ్‌ సభ్యుల నుంచి ఎదురైన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రధానిగా ఆయనే కొనసాగాలని 211 మంది ఓటు వేయగా, 148 మంది వ్యతిరేకించారు.

Advertisement

టర్కీ ఇకపై తుర్కియే

తమ దేశం పేరును ‘తుర్కియే’గా మార్చుకున్నామని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్‌ కావసోగ్లు ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. ఈ లేఖ సమితికి అందిన క్షణం నుంచే టర్కీ పేరు తుర్కియేగా మారిపోయిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ అధికార ప్రతినిధి స్టెఫనీ దుహారిచ్‌ తెలిపారు.

రిమ్‌పాక్ నౌకా విన్యాసాలు

Advertisement

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా విన్యాసాలు జూన్‌ 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ యుద్ధ విన్యాసాలకు అమెరికాలోని హోనోలులు, శాన్‌ డియాగో వేదిక కానున్నాయి. మొత్తం 26 దేశాలు పాల్గొననున్నాయి.

పోటీతత్వ సూచీ

ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందినందున, వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత స్థానం 43 నుంచి 6 స్థానాలు మెరుగై, 37కు చేరిందని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎండీ) వెల్లడించింది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్​ టాప్​లో నిలిచింది.

Advertisement

తాత్కాలిక సభ్యదేశంగా జపాన్‌

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) తాత్కాలిక సభ్యదేశాలుగా ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్‌ ఎన్నికయ్యాయి. ఈ దేశాలు భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే స్థానాల్లో వచ్చే ఏడాది జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరిస్తాయి. పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది.

చమురు సరఫరాలో రష్యా రెండో స్థానం

Advertisement

భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్‌ అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు రష్యా భారీ డిస్కౌంటుపై చమురు సరఫరా చేస్తోంది.

హిందీ నవలకు బుకర్‌ ప్రైజ్‌

హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీకి ప్రతిష్టాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ లభించింది. ఆమె రాసిన హిందీ నవల ‘రేత్‌ సమాధి’ (ఇసుక సమాధి) ఆంగ్ల అనువాదం ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’కు ఈ పురస్కారం లభించింది. హిందీ మూల రచనకు బుకర్‌కు ప్రైజ్‌ రావడం ఇదే తొలిసారి.

Advertisement

ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా

యూరోపియన్​ యూనియన్​ (ఈయూ)లో చేరాలనే ఉక్రెయిన్‌కు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది.

దక్షిణ కొరియా తొలి రాకెట్‌ ప్రయోగం

Advertisement

దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష రాకెట్‌ (నురి) ను దక్షిణ కొరియా విజయవంతంగా ప్రయోగించింది. దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. దీని పొడవు 47 మీటర్లు. ఇది ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందులో నాలుగు బుల్లి ఉపగ్రహాలు ఉన్నాయి.

భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్‌

ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త రుచిరా కంబోజ్‌ నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌ ‘ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌’ (ఐఎఫ్‌ఎస్‌) అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా ఉన్నారు. ఢిల్లీతో పాటు ఫ్రాన్స్, మారిషస్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఆమె సేవలందించారు.

Advertisement

జాతీయం

ఐఎన్‌ఎస్‌ గోమతికి వీడ్కోలు

యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ గోమతికి భారత నావికాదళం వీడ్కోలు పలికింది. ఈ నౌక సేవలను ఉపసంహరించింది. 1988లో నావికాదళంలో ప్రవేశించిన గోమతి 34 ఏళ్ల పాటు సేవలందించింది. కాక్టస్, పరాక్రమ్, రైన్‌బో తదితర ఆపరేషన్స్‌లో పాల్గొంది.

పాల ఉత్పత్తిలో భారత్​ టాప్​

పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్​ అగ్రస్థానంలో ఉందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ‘గరీబ్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ సిమ్లా వేదికగా రైతులు, పథకాల లబ్ధిదారులతో చర్చాగోష్ఠి నిర్వహించారు. హయత్‌నగర్‌లోని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ (క్రిడ)లో వర్చువల్‌ విధానంలో నిర్వహించారు.

అస్త్ర ఎంకే 1 క్షిపణులు

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు రక్షణ శాఖ నుంచి రూ.2,971 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది. భారత వాయుసేన, నౌకాదళాలకు అస్త్ర ఎంకే-1 బీవీఆర్‌ (బియాండ్‌ విజువల్‌ రేంజ్‌) ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణిలను బీడీఎల్‌ సరఫరా చేయనుంది.

మొదటి నగరంగా కోల్‌కతా

దేశంలోనే జీవవైవిధ్య వివరణాత్మక రిజిస్టర్‌ను రూపొందించిన తొలి మెట్రో నగరంగా కోల్‌కతా నిలిచింది. దీనికి సంబంధించి కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ‘పీపుల్స్​‍ బయోడైవర్సిటీ రిజిస్టర్‌ (పీబీఆర్‌)’ను మే 25న విడుదల చేసింది. ఇందులో 138 రకాల చెట్లు, 26 రకాల చైనీస్ కూరగాయలు, 33 రకాల ఔషధ మొక్కలు, 100 ఇతర వృక్ష జాతులను నమోదు చేశారు.

డ్రోన్‌తో పోస్టల్‌ డెలివరీ

దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో పోస్టల్‌ శాఖ డ్రోన్‌ సాయంతో టపా పార్సిలు చేరవేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రయోగంలో 46 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని 25 నిమిషాల్లో డ్రోన్‌ చేరుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. భుజ్‌ తాలూకాలోని హాబే గ్రామం నుంచి భచావూ తాలూకాలోని నేర్‌ గ్రామానికి ఈ టపా పంపారు.

పర్యావరణ సూచీ

పర్యావరణ అంశాల నిర్వహణ, పనితీరు విశ్లేషించి రూపొందించిన 180 దేశాల జాబితాలో భారత్‌ చివరి స్థానంలో నిలిచింది. అమెరికాలోని పలు సంస్థలు సిద్ధం చేసిన ఈ జాబితాలో డెన్మార్క్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. యూకే, ఫిన్లాండ్‌ రెండు, మూడో స్థానాలను సొంతం చేసుకున్నాయి.

వృద్ధి రేటు 7.5 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. 8.7 శాతం వృద్ధి రేటు లభిస్తుందని 2022 జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధి రేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.

అభయారణ్యంగా నంజరాయన్‌ సరస్సు

తమినాడు ప్రభుత్వం 17వ పక్షుల అభయారణ్యంగా నంజరాయన్‌ సరస్సును ప్రకటించింది. 440 ఎకరాల్లో విస్తరించిన ఈ సరస్సు తిరుప్పూర్‌లో ఉంది. బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఈ సరస్సులో 220 కార్మోరెంట్‌ అనే పక్షులు, 165 పెలికాన్‌ పక్షులు ఉన్నాయి.

తొలి ప్రైవేట్​ ‘దేఖో అప్నా దేశ్‌’ రైల్​

కోయంబత్తూరు నార్త్‌ నుంచి సాయినగర్‌ శిర్డీకి తొలి ప్రైవేట్​ రైలు బయలుదేరింది. కేంద్రం ‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే. 1100 మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట కోయంబత్తూరు నార్త్‌లో బయలుదేరిన ట్రైన్​ సాయినగర్‌ శిర్డీ వెళ్లింది.

ప్రపంచంలోనే ఎత్తైన పోస్ట్​ ఆఫీస్​

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోస్ట్​ ఆఫీస్​ హిమాచల్‌ప్రదేశ్‌ లాహౌల్‌ – స్పితి జిల్లాలోని హిక్కిం గ్రామంలో, సముద్ర మట్టానికి 14,567 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కార్యాలయం ఆకారం లెటర్‌ బాక్స్‌లా ఉంటుంది. ఇంతకు ముందు ఈ పోస్టాఫీసు ఓ పూరింట్లో ఉండేది.

వర్సిటీల చాన్స్​లర్​ నియామక బిల్లు

పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రే ఆ రాష్ట్రం నడిపే యూనివర్సిటీలకు చాన్స్​లర్​గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ పశ్చిమ బెంగాల్‌ యూనివర్సిటీ లాస్‌ (సవరణ) బిల్లు – 2022ను ఆమోదించింది. దీంతో చాన్స్​లర్​ బాధ్యతలు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ స్థానంలో సీఎం మమతా బెనర్జీ తీసుకోనున్నారు.

యుద్ధనౌకలకు వీడ్కోలు

దేశ రక్షణలో 32 ఏళ్ల పాటు సేవలందించిన రెండు యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ అక్షయ్, ఐఎన్‌ఎస్‌ నిషాంక్‌లకు భారత నౌకాదళం వీడ్కోలు పలికింది. ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్డ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా వీటిపై జాతీయ జెండాను దించేసింది.

ఆర్య సమాజ్‌లో వివాహం చట్టబద్దం కాదు

ఆర్య సమాజ్‌ జారీ చేసే వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మధ్యప్రదేశ్‌లో డైనోసార్‌ అండం

డైనోసార్లకు సంబంధించిన ఒక వింత అండాన్ని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గుడ్డు లోపల మరో గుడ్డు ఉంది. ఇది టైటానోసారిడ్‌ అనే రాకాసిబల్లికి సంబంధించిన గుడ్డు. మధ్యప్రదేశ్‌లో ధార్‌ జిల్లాలో ఉన్న బాగ్‌ ప్రాంతంలో ఈ గుడ్డు కనిపించింది.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ రంజనా దేశాయ్‌

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) చైర్‌పర్సన్‌గా నియమితులైన తొలి మహిళగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నియమితులయ్యారు. ఆమె నియామకంపై గెజెట్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

చెస్‌ ఒలింపియాడ్‌ టార్చ్‌ రిలే

ఒలింపిక్స్‌ తరహాలో చెస్‌ ఒలింపియాడ్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన జ్యోతి యాత్ర ఢిల్లీలో మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఒలింపియాడ్‌ జ్యోతి యాత్రను ప్రారంభించారు. ఈసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు భారతే ఆతిథ్యమివ్వనుంది. జులై 28 నుంచి తమిళనాడులోని మహాబలిపురంలో చెస్‌ ఒలింపియాడ్‌ జరగనుంది.

బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణం

రూ.34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారంటూ దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌), ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని అధికారులు తెలిపారు.

ప్రాంతీయం

కాకతీయుల నాటి దానశాసనం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలం నాటి దాన శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డ్​

సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 2021 -– 22 ఆర్థిక సంవత్సరంలో 6.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ రికార్డు సాధించినట్లు ప్రకటించింది.

రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాలు

2020లో శిశు మరణాలపై కేంద్రం ఆధ్వర్యంలోని శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం(ఎస్‌ఆర్‌ఎస్‌) నిర్వహించిన సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు దేశంలో ప్రతి వెయ్యికి 28 మంది మరణిస్తుండగా.. తెలంగాణలో 21 మంది శిశువులు మరణిస్తున్నారు.

గోదావరి బోర్డు చైర్మన్‌గా ఎం.కె.సిన్హా

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం వరకు గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చంద్రశేఖర్‌ అయ్యర్‌కు కేంద్ర జల్‌ సంఘం సభ్యునిగా పదోన్నతి వచ్చింది.

సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో సీజేగా సేవలందిస్తున్న జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కొలీజియం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు.

గ్రాండ్‌ మాస్టర్‌గా రాహుల్‌ శ్రీవాత్సవ్‌

తెలంగాణ కుర్రాడు రాహుల్‌ శ్రీవాత్సవ్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించాడు. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ జీఎం హోదా సాధించాడు. భారత 74వ జీఎంగా అతను నిలిచాడు. తెలంగాణ నుంచి అర్జున్‌ ఇరిగేశి, హర్ష భరత్‌కోటి, రాజా రిత్విక్‌ తర్వాత నాలుగో జీఎంగా రికార్డు సృష్టించాడు

వార్తల్లో వ్యక్తులు

పూల ఆంథోని

హైదరాబాద్‌ ఆర్చ్‌ బిషప్‌ పూల ఆంథోని కార్డినల్‌గా నియమితులయ్యారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రపంచవ్యాప్తంగా 21 మందికి కార్డినల్‌ హోదా కల్పించగా అందులో భారత్‌ నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిలో ఆంథోనితో పాటు గోవా నుంచి ఆర్చ్‌ బిషప్‌ ఫిలిప్‌ నెరిలకు అవకాశం దక్కింది.

నటరాజన్‌ సుందర్‌

బ్యాడ్‌ బ్యాంక్‌గా పరిగణించే నేషనల్‌ అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) ఎండీ, సీఈఓగా నటరాజన్‌ సుందర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సుందర్‌ ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ, చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌గా పనిచేసి 2022 ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేశారు.

టెడ్రోస్‌ అథనోమ్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ పదవికి టెడ్రోస్‌ అథనోమ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. కరోనా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పదవికి ఇతరులెవరూ పోటీపడలేదు.

లిండా ఫాగన్‌

అమెరికా తీర గస్తీ దళం నూతన కమాండెంట్‌గా తొలిసారి ఓ మహిళ నియమితురాలై రికార్డు సృష్టించారు. ఇంతవరకు వైస్‌ కమాండెంట్‌గా ఉన్న లిండా ఫాగన్‌ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆమెను అభినందించారు.

మొహీందర్‌ కె. మిధా

బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత, కౌన్సిలర్‌ మొహీందర్‌ కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. ఆమె పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాదికి (2022 -– 23)కిగాను ఆ పదవికి ఆమెను కౌన్సిల్‌ సమావేశంలో ఎన్నుకున్నారు.

అలోక్‌ చౌద్రి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైర్టెర్‌ (రిటైల్‌ బిజినెస్, కార్యకలాపాలు)గా అలోక్‌ కుమార్‌ ఛౌధ్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్నారు. ఎస్‌బీఐకి చైర్మన్‌ దినేశ్‌ ఖారాతో పాటు నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లున్నారు.

ఫ్రాంక్‌ విల్జెక్‌

సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంక్‌ విల్జెక్‌కు 2022కు గాను టెంపుల్‌టన్‌ అవార్డు లభించింది. ప్రకృతి ప్రాథమిక చట్టాలపై ఆయన పరిశోధనలు చేశారు. ఈ అవార్డును 1972లో స్థాపించారు. ఈయన ఫండమెంటల్స్​: టెన్‌ కీస్ టు రియాలిటీ ఫండమెంటల్స్​, ది లైట్‌నెస్ ఆఫ్‌ బీయింగ్‌ నవలలు రచించారు.

ఎలిజబెత్‌-2

బ్రిటన్‌ రాణిగా 70 వసంతాలు పూర్తిచేసుకొని, ఇటీవల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్న ఎలిజబెత్‌-2 మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ఆమె థాయ్‌లాండ్‌ రాజును అధిగమించి ప్రపంచంలోనే ఓ రాజ్యాన్ని అత్యధిక కాలం ఏలిన రెండో వ్యక్తిగా ఘనత సాధించారు.

అమన్‌దీప్‌సింగ్‌ గిల్‌

భారత సీనియర్‌ దౌత్యవేత్త అమన్‌దీప్‌సింగ్‌ గిల్‌ ఐక్యరాజ్యసమితి సాంకేతిక రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జెనీవా కేంద్రంగా ‘ఇంటర్నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌’ (ఐ-డీఏఐఆర్‌) సంయుక్త ప్రాజెక్టు సీఈవోగా సేవలందిస్తున్నారు.

వీఎస్‌కే కౌముది

కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శిగా (భద్రత) 1986 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి వీఎస్‌కే కౌముది నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన హోం శాఖలో అంతర్గత భద్రతా వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.

కార్తిక్‌ జయస్‌వాల్‌

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన కార్తిక్‌ జయస్‌వాల్‌ (21) గంటలో 3,331 పుషప్స్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు గిన్నిస్‌ బుక్‌లో ఆస్ట్రేలియా వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. గతంలో 44 సెకన్లలో 770 టైల్స్‌ పగలగొట్టి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ కార్తిక్‌ చోటు దక్కించుకున్నాడు.

సనపతి గురునాయుడు

యూత్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు సనపతి గురునాయుడు మెక్సికోలోని లెయాన్‌లో జరుగుతున్న టోర్నీలో బాలుర 55 కేజీల విభాగంలో గోల్డ్​ మెడల్​ గెలుచుకున్నాడు.16 ఏళ్ల భారత లిఫ్టర్‌ మొత్తం మీద 230 కేజీలతో పసిడి సొంతం చేసుకున్నాడు.

టి.ప్రదీప్‌

సౌదీ అరేబియా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’కు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీఎం) ప్రొఫెసర్​ టి.ప్రదీప్‌ ఎంపికయ్యారు. నీటికి సంబంధించిన ఆవిష్కరణల్లో పురోగతి సాధించిన వారికి ‘ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ అవార్డు’ అందజేస్తారని ఐఐటీ వర్గాలు తెలిపాయి.

ఆర్తీ ప్రభాకర్‌

ప్రముఖ ఇండో – అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్తీ ప్రభాకర్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యక్తిగత సైన్స్‌ సలహాదారుగా నామినేట్‌ చేశారు. ఆర్తీకి మూడేళ్ల వయసులో వీరి కుటుంబం దిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడింది. టెక్సాస్‌ టెక్‌ యూనివర్సిటీ నుంచి ఆమె ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

రమాబాయ్‌

106 ఏళ్ల హర్యాన అథ్లెట్‌ రమాబాయ్‌ జాతీయ వెటరన్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో గోల్డ్​ మెడల్​ సాధించింది. ఇదే పోటీల్లో 82 ఏళ్ల జగదీష్‌ శర్మ 100 మీటర్ల పరుగులో రెండో స్థానంలో నిలిచాడు. 3 వేల మీటర్ల రేసులో రమాబాయ్‌ మనమరాలు షర్మిలా సాంగ్వాన్‌ కాంస్యం గెలిచింది.

రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌

భారత సంతతికి చెందిన రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ను రక్షణ శాఖ ఉప సహాయ మంత్రిగా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. ఆమె ఆయుధ, వస్తు సేకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. గూగుల్, ఫేస్‌ బుక్‌ కంపెనీలలో ఉన్నత సాంకేతిక పదవులు ఆమె నిర్వహించారు.

లిన్‌ మలెర్బా

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ నేటివ్‌ అమెరికన్‌ మహిళ లిన్‌ మలెర్బా ఆ దేశ ట్రెజరర్‌గా నామినేట్‌ అయ్యారు. ట్రెజరర్‌ విధుల్లో టంకశాల పర్యవేక్షణ, ఫెడరల్‌ రిజర్వ్‌తో సమన్వయం, ట్రెజరీ కార్యాలయ వినియోగదారుల విధానం పర్యవేక్షణ వంటివి ఉంటాయి. దీంతో పాటు అమెరికా నగదు నోట్లపై ట్రెజరర్‌ సంతకం ఉంటుంది.

స్పోర్ట్స్​

ఐపీఎల్‌ విజేతగా గుజరాత్‌ టైటాన్స్‌

హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్లో రాజస్థాన్​ రాయల్స్​పై విజయం సాధించి, టైటిల్‌ గెలిచింది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన ఏడో జట్టుగా గుజరాత్‌ నిలిచింది. విజేత గుజరాత్​కు రూ.20 కోట్లు, రన్నరప్​ రాజస్థాన్​కు రూ.13 కోట్లు లభించాయి. అత్యధిక పరుగులతో బట్లర్ (863) ఆరెంజ్​ క్యాంప్​, అత్యధిక వికెట్లతో చాహల్ (27) పర్పుల్​ క్యాప్​ గెలుచుకున్నాడు.

రియల్‌ మాడ్రిడ్‌దే ఛాంపియన్స్‌ లీగ్‌

రియల్‌ మాడ్రిడ్‌ 14వ సారి ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో 1-0తో లివర్‌పూల్‌పై విజయం సాధించింది. వినిసియస్‌ జూనియర్‌ మాడ్రిడ్‌కు గెలుపు గోల్​ అందించాడు. 59వ నిమిషంలో అతడు స్కోర్‌ చేశాడు.

ఫ్రెంచ్‌ విన్నర్స్​​ నాదల్‌, స్వైటెక్​

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌పై నాదల్​ గెలుపొంది 14వ సారి టైటిల్​ కైవసం చేసుకున్నాడు. ఫెదరర్, జకోవిచ్‌ కన్నా రెండు టైటిళ్లు ముందున్నాడు. మహిళల సింగిల్స్​ ఫైనల్లో స్వైటెక్‌ (పోలెండ్‌) కొకో గాఫ్‌పై విజయం సాధించింది.

రిటైర్​మెంట్​ ప్రకటించిన మిథాలీరాజ్‌

భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించింది. 232 వన్డేల్లో 7శతకాలు, 64 అర్ధశతకాలతో 7805 పరుగులు చేశారు. 89 టీ20ల్లో 2364పరుగులు చేయగా.. అందులో 17 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే, 12 టెస్టుల్లో ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలతో 699 పరుగులు చేశారు.

నీరజ్‌ చోప్రా జాతీయ రికార్డు

జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన నీరజ్, తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.58)ను బద్దలు కొట్టాడు. 87.58 మీటర్లు విసిరి అతడు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.

వెర్‌స్టాపన్‌దే అజర్‌బైజాన్‌ టైటిల్‌

అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెదర్లాండ్స్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ చేజిక్కించుకున్నాడు. తుది రేసులో సెర్గియో పెరెజ్‌ను వెనక్కి నెట్టి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్టాండింగ్స్‌లో అగ్రస్థానాన్ని వెర్‌స్టాపెన్‌ (150 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు.

ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌లో రజతం

దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్‌ రొనాల్డో సింగ్‌ ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పోటీల్లో సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్‌గా రికార్డు నమోదు చేశాడు. సీనియర్‌ స్ప్రింట్‌ విభాగంలో అతను రెండో స్థానంలో నిలిచాడు.

హరికృష్ణకు ప్రేగ్‌ టైటిల్‌

గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ ప్రేగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. తొమ్మిదో రౌండ్లో స్పెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ డేవిడ్‌ ఆంటోన్‌పై విజయం సాధించిన హరి మొత్తం 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

నింగిలోకి జీశాట్ – 24

జీశాట్‌–24 ఉపగ్రహాన్ని జూన్‌ 22న కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని యూరోపియన్‌ యూనియన్‌ కు చెందిన ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా కౌరులోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపాలని నిర్ణయించింది. ఇది దేశ డీటీహెచ్‌ అవసరాలను తీర్చనుంది.

అగ్ని-–4 పరీక్ష సక్సెస్​

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-4ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఈ అస్త్రాన్ని పరీక్షించారు. ఈ అస్త్రం, టన్ను పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

పృథ్వి-2 పరీక్ష సక్సెస్

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణ్వాయుధాన్ని మోసుకెళ్లే సామర్థ్యం గల పృథ్వి-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. ఒడిశాలోని చాందీపుర్‌ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ మిస్సైల్​ను ప్రయోగించారు.

రోదసీలోకి జీశాట్​ – 24

ఇస్రో జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్‌ కంపెనీ ఏరియన్‌ స్పేస్‌ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–5 రాకెట్‌తో ఇస్రో రోదసీలోకి పంపింది. డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు దీన్ని పంపారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!