Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: డిసెంబర్​​​ 2022

కరెంట్​ అఫైర్స్​: డిసెంబర్​​​ 2022

అంతర్జాతీయం

మలేసియా కొత్త ప్రధానిగా అన్వర్‌

Advertisement

మలేసియాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడగా 75 ఏళ్ల అన్వర్‌ ఇబ్రహీం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, అనేక సంస్కరణల కోసం పోరాడినా అన్వర్‌ పగ్గాలు చేపట్టడంతో దేశాభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.

మంకీపాక్స్‌ ఇక ఎంపాక్స్‌
మంకీపాక్స్‌ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు రావడంతో  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక నుంచి మంకీ పాక్స్‌ వ్యాధిని ఎంపాక్స్‌ అని వ్యవహరించాలని ప్రకటించింది.

పాక్‌ ఆర్మీ కొత్త చీఫ్‌ బాధ్యతలు
పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతిగా గతంలో పనిచేసిన జనరల్‌ అసీం మునీర్‌ పాక్‌ ఆర్మీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా పదవీ విరమణ చేయడంతో పాక్‌ ఆర్మీకి 17వ కొత్త చీఫ్‌గా మునీర్‌ను ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నియమించారు.

Advertisement

ఆస్ట్రేలియా స్టెమ్‌ సూపర్‌స్టార్స్‌
ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సూపర్‌స్టార్స్‌ ఆఫ్‌ ‘స్టెమ్‌’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ అండ్‌ మ్యాథమేటిక్స్‌) అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన 60 మంది శాస్త్రవేత్తల్లో భారతీయ మూలాలున్న నీలిమా కడియాల, డాక్టర్‌ అనా బాబూరమణి, డాక్టర్‌ ఇంద్రాణి ముఖర్జీ చోటు సాధించారు.

అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌
ది స్క్వేర్‌ కిలోమీటర్‌ అరే (ఎస్‌కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్‌లో ఉంటుంది.

పెరూ అధ్యక్షురాలిగా దినా బొలార్టే
పెరూ దేశానికి తొలిసారి ఓ మ‌హిళ దేశాధ్యక్షురాలిగా దినా బొలార్టే ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంస‌న ద్వారా తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యత‌లు చేప‌ట్టారు. జూలై 2026 వ‌ర‌కు తానే అధికారంలో ఉండ‌నున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement

ఆక్స్‌ఫర్డ్‌ ఈ ఏటి మేటి పదం ‘గాబ్లిన్‌ మోడ్‌’
‘గాబ్లిన్‌ మోడ్‌’ ఈ ఏడాది మేటి పదంగా ఎన్నికైనట్లు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ ప్రచురించే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) ప్రకటించింది. గాబ్లిన్‌ మోడ్‌ అనే పదం వ్యక్తి ప్రవర్తనను సూచిస్తుంది. ఎంతసేపటికీ తన సుఖాలు, తన కోరికలే తప్ప ఇతరుల గురించి పట్టించుకోని తత్వమది.

ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్‌
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్‌ నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ ఈ జాబితాను రూపొందించింది. 172 ప్రధాన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్‌ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి.

భద్రతామండలి ప్రెసిడెంట్‌గా భారత్‌
ఐక్యరాజ్యసమితిలోని శక్తివంతమైన భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టింది.15 దేశాల మండలిలో డిసెంబర్‌ నెలకు గాను అధ్యక్ష పీఠంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ కొనసాగుతారు. మండలిలో భారత్‌ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది.

Advertisement

యూఎన్ఓలో గాంధీ విగ్రహం
ఐక్యరాజ్య సమితి కార్యాలయ ఆవరణలో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్తో కలిసి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సామ్రాజ్యవాదంపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐరాసకు పునాది అని గుటెరస్‌ పేర్కొన్నాడు.

స్వలింగ వివాహాలు చట్టబద్ధం
అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్‌ మ్యారేజెస్‌) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్‌ అభివర్ణించారు.

సిగరెట్లు కొనకుండా నిషేధం
ఆరోగ్యాన్ని హాని కలిగించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్‌ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి.

Advertisement

ఐర్లాండ్‌ ప్రధానిగా లియో వరాద్కర్‌
భారత సంతతికి చెందిన లియో వరాద్కర్‌ ఐర్లాండ్‌ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఫిన్‌గేల్‌ పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్‌ పద్ధతిలో అవకాశం వచ్చింది. 2017లో తొలిసారి ఐర్లాండ్‌ ప్రధానిగా ఎంపికైన 43 ఏళ్ల వరాద్కర్, ప్రపంచంలోని అతి కొద్ది మంది స్వలింగ సంపర్క నేతల్లో ఒకరు.

ప్రపంచ చాంపియన్లుగా నాదల్, స్వైటెక్‌
ఈ ఏడాది రెండేసి గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) ఐటీఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌కు ఎంపికయ్యారు. గ్రాండ్‌స్లామ్, బిల్లీ జీన్‌ కింగ్‌ కప్, డేవిస్‌ కప్‌ తదితర ప్రధాన టోర్నీలను ప్రతిపాదికగా తీసుకుని ఐటీఎఫ్‌ ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది నాదల్‌ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచాడు. స్వైటెక్‌  ఫ్రెంచ్, యుఎస్‌ ఓపెన్‌ ట్రోఫీలు నెగ్గింది.

నింగిలోకి నాసా ‘స్వాట్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలు, నదులు, సరస్సులను మ్యాప్‌ చేసే సామర్థ్యమున్న సర్ఫేస్‌ వాటర్‌ అండ్‌ ఓషన్‌ టోపోగ్రఫీ (స్వాట్‌)  ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నింగిలోకి పంపింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. దీన్ని ఫ్రాన్స్‌తో కలిసి నాసా అభివృద్ధి చేసింది.

Advertisement

నేపాల్‌ ప్రధానిగా ప్రచండ
సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ (ఎంసీ) పార్టీ ఛైర్మన్‌ పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ మూడోసారి నేపాల్‌ ప్రధానిగా ప్రమాణం చేశారు. గెరిల్లా ఉద్యమ నేతగా పేరొందిన ఆయనతో దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రమాణం చేయించారు. ప్రచండతో పాటు కొత్త సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

ఫిజీ నూతన ప్రధానిగా రబూకా
ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబూకా బాధ్యతలు స్వీకరించారు. 74 ఏళ్ల ఈ మాజీ సైనిక కమాండర్‌ పార్లమెంట్ సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్‌లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గి గత 16 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఫ్రాంక్‌ బైనిమారామాను అధికారానికి దూరం చేశారు.

పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌గా అఫ్రిది
పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ స్టార్‌ ప్లేయర్ షాహిద్‌ అఫ్రిది నియమితుడయ్యాడు. 2020 డిసెంబర్‌ నుంచి ఈ పదవిలో ఉన్న మహ్మద్‌ వసీమ్‌ స్థానంలో అఫ్రిది బాధ్యతలు చేపట్టాడు. ఈ తాత్కాలిక సెలక్షన్‌ కమిటీలో అబ్దుల్‌ రజాక్, ఇఫ్తికార్‌ అహ్మద్, హరూన్‌ రషీద్‌ కూడా ఉన్నారు.

Advertisement

కార్ల్‌సన్‌కు ర్యాపిడ్‌ చెస్‌  టైటిల్‌
ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) 10 పాయింట్లతో ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఓపెన్‌ విభాగంలో  టైటిల్‌ గెలిచాడు. విన్సెంట్‌ (జర్మనీ) 9.5 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు. అమెరికాకు చెందిన కరువానా (9.5) మూడో స్థానంలో నిలిచాడు. అర్జున్‌ ఇరిగేశి అయిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఇజ్రాయెల్‌ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రిగా లికుడ్‌ పార్టీ చీఫ్‌ బెంజమిన్‌ నెతన్యాహు ఆరోసారి ప్రమాణం చేశారు.120 మంది సభ్యులుండే నెస్సెట్‌(పార్లమెంట్‌)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు.

జాతీయం

భారత్కు జీ20 బాధ్యతలు
ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్‌–20) అధ్యక్ష బాధ్యతలు ఇండోనేషియా నుంచి భారత్‌ డిసెంబర్‌ 1వ తేదీన చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా లాంటి సవాళ్లను అందరం కలిసికట్టుగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.

Advertisement

రిటైల్‌ డిజిటల్‌ ఈ–రూపీ
హోల్‌సేల్‌ లావాదేవీల కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ–రూపీని డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో రిటైల్‌ డిజిటల్‌ రూపీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. తర్వాత హైదరాబాద్‌తో పాటు మరో తొమ్మిది నగరాల్లో ఈ–రూపీని అందుబాటులోకి తేనున్నారు.

తొలి ప్రైవేట్ లాంచింగ్ స్టేషన్
ఇస్రో ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రాంగణంలో చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్‌ కాస్మోస్, అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ నవంబరు 25న ఈ కేంద్రాలను ఆవిష్కరించారు.

నిఖత్, శ్రీజలకు అర్జున అవార్డ్
తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు బహూకరించారు. ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ ను శరత్‌ కమల్‌ స్వీకరించారు.

Advertisement

మహారాష్ట్ర గ్రామానికి అమరుడి పేరు
పద్నాలుగేళ్ల కింద జరిగిన ముంబయి ఉగ్ర దాడి (26/11)లో అమరుడైన జవాను రాహుల్‌ శిందే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా సుల్తాన్‌పూర్‌లో 600 ఇళ్లు ఉంటాయి. అమర జవాను పుట్టి పెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్‌ నగర్‌గా మార్చారు.

పెరిగిన రెపో రేటు
వరుసగా ఐదో విడత ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

విమానయాన భద్రతలో 48వ స్థానం
అంతర్జాతీయ విమానయాన భద్రతలో భారత్‌కు 48వ స్థానం లభించిందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది. ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) ఇచ్చే ఈ ర్యాంకుల్లో తొలిస్థానంలో సింగపూర్‌ ఉండగా, రెండు-మూడు స్థానాల్లో యూఏఈ, దక్షిణ కొరియా ఉన్నాయి.

గుజరాత్లో బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది.182 అసెంబ్లీ స్థానాల్లో 156 సీట్లను సొంతం చేసుకుంది. హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలుండగా, కాంగ్రెస్‌ 40, బీజేపీ 25 సీట్లు కైవసం చేసుకున్నాయి. ముగ్గురు స్వతంత్ర సభ్యులు నెగ్గారు.

టాప్‌ 50 లో ఐఐటీ ఢిల్లీ
టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిన గ్లోబల్‌ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ఐఐటీ ఢిల్లీ మాత్రమే టాప్‌ 50లో చోటు దక్కించుకున్నది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 58వ స్థానంలో నిలవగా.. ఐఐటీ బాంబే 72వ స్థానంలో నిలిచింది.

తాండూరు కంది పప్పునకు జీఐ ట్యాగ్
దేశంలో పేరుగాంచిన తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పంటల పరంగా మొదట జీఐ పొందింది తాండూరు కంది పప్పే. ఉద్యాన పంటల పరంగా ఏపీలోని బనగానపల్లె మామిడికి ఈ గుర్తింపు ఉంది.

గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్‌ హోదా రద్దు
కేరళా రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌గా గవర్నర్‌ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. చాన్సెలర్‌ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది.  

గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌
గుజరాత్‌ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్తో ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజధాని గాంధీనగర్‌లో నూతన సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్‌ గ్రౌండ్‌లో ఈ భూపేంద్ర పటేల్‌ సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది రెండోసారి.

సామాజిక శత్రుత్వ సూచీలో భారత్‌ టాప్‌
మతం ప్రతిపాదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో భారత్‌ టాప్ ప్లేస్లో నిలిచింది. దేశంలో మత ఆధారిత సామాజిక శత్రుత్వం అతి దారుణంగా ఉందని ప్యూ రీసెర్చ్‌సెంటర్‌( అమెరికా) అధ్యయనంలో తేలింది. భారత్‌ తర్వాత నైజీరియా, అఫ్గానిస్థాన్‌ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

9 రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ
ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్‌ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్‌ సభలో పేర్కొన్నారు.

మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌కు చెందిన మొఢేరా సూర్య దేవాలయం, చారిత్రక నగరం వడ్‌నగర్, ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది.

అంధుల టీ20 ప్రపంచకప్‌ విన్నర్ భారత్‌
అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. బంగ్లాదేశ్‌ను 120 పరుగుల తేడాతో  ఓడించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా టైటిల్‌ నిలబెట్టుకుంది. 2012, 2017 టోర్నీల్లోనూ భారత్ విజేతగా నిలిచింది.

ఇందిరా గాంధీ శాంతి బహుమతి
కరోనా సమయంలో విశేష సేవలందించిన భారతీయ వైద్య సమాజానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి – 2022 అవార్డు దక్కింది. దేశంలోని వైద్యులు, నర్సులందరి తరఫున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), ట్రైన్డ్‌ నర్సెస్‌ ఆర్గనైజేషన్‌ (టీఎన్‌ఏ)లకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.

దేశంలో కరోనా బీఎఫ్‌.7 వేరియంట్
చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ బీఎఫ్‌.7 పాజిటివ్‌ కేసులు భారత్‌లోనూ వెలుగుచూశాయి. బీఏ.5 అని పిలిచే ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్‌ బీఎఫ్‌.7. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని ప్రధాన లక్షణం. బలమైన ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుంది. కరోనా టీకా తీసుకున్నవారిని సైతం బీఎఫ్‌.7 ప్రభావితం చేస్తున్నట్లు తేలింది.

విజయ్ దివస్ వేడుక‌లు
ఢిల్లీలోని ఆర్మీ హౌస్‌లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ పేరుతో డిసెంబ‌ర్‌16న విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ వేడుక‌లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగాయి. ఎట్ హోమ్‌పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సైనికాధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

కొత్తరాతియుగపు మట్టి శిల్పం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు కొత్త తెలంగాణ బృందం తెలిపింది.

టాప్లో సింగరేణి థర్మల్‌ పవర్ ప్లాంట్
మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నాటికి 90.86% సామర్థ్యంతో విద్యుదుత్పత్తి(పీఎల్‌ఎఫ్‌) సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రవీందర్‌సింగ్‌ 2014లో జరిగిన కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్టేట్‌ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిరిసిల్ల టాప్
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ)లో భాగంగా నవంబర్ నెలకు బహిరంగ విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్‌) ప్లస్‌ కేటగిరీలో ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది.

రఘు అరికపూడికి అవార్డు
గడిచిన పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలకు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి రఘు అరికపూడికి బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు ప్రకటించింది.

రెడ్కోకు జాతీయ పురస్కారం
ఇంధన పొదుపు కార్యక్రమాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో)కు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రాష్ట్రానికి ఈ అవార్డు ప్రకటించిందని సంస్థ చైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణాకు రెండు జాతీయ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్‌ మెటర్నల్‌ హెల్త్‌ వర్క్‌ షాప్‌’లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది.

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌
రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణుల కోసం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తున్నది. మిషన్‌ కాకతీయ, ఈ-పంచాయతీ వంటి కీలక ఘట్టాల ప్రారంభోత్సవాలకు వేదికైన కామారెడ్డి గడ్డ మీదుగానే ఈ విప్లవాత్మక పథకం అమలు కానున్నది.ఒక్కో కిట్‌కు రూ. 1962 చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తున్నది.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్‌ రాసిన  ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. నరేంద్ర రాసిన ‘మనో ధర్మపరాగం’ నవలకు తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

తొలిసారి తెలంగాణకు రాష్ట్రపతి
దేశాధినేత పదవిని చేపట్టిన త‌రువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబ‌ర్ 26న తొలిసారి తెలంగాణకు వచ్చారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్వాగ‌తం ప‌లికారు.

ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్‌
తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్‌ నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్‌, ఏసీబీ డీజీగా రవిగుప్త, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్‌, లా అండ్ ఆర్డర్‌ డీజీగా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.

విశాఖ వేదికగా ‘జీ–20 సదస్సు’
జీ–20 అధ్యక్ష దేశంగా భారత్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది నవంబర్‌ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, ఏప్రిల్‌ 24న విశాఖ వేదికగా సదస్సు నిర్వహించనుంది.

కోవిడ్ నాసికా టీకా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంకోవాక్‌ ధరను దాని తయారీదారు భారత్‌ బయోటెక్ ప్రకటించింది. ప్రభుత్వ కోవిన్‌ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉండే ఈ నాసికా వ్యాక్సిన్‌ను రూ.800కు అందివ్వనున్నట్లు తెలిపింది. జనవరి నాలుగో వారంలో దీన్ని మార్కెట్లోకి విడుదలచేస్తారు.

జోగులాంబ ఆలయానికి అవార్డు
అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన ఆలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో  ప్రతిష్టాత్మక హిందూస్థాన్‌ గగన్‌ గౌరవ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు–2022 దక్కింది.

వార్తల్లో వ్యక్తులు

చాగంటి కోటేశ్వరరావు
మహాకవి గురజాడ107వ వర్ధంతి సందర్భంగా గురజాడ సాంస్కృతిక సమాఖ్య విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చాగంటికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. గురజాడ తన రచనలను లోకంలోని కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.

అల్లూరి సరోజ
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నవంబరు 19న జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సరోజ తండ్రి రాంబాబు, తల్లి పార్వతి స్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు.

జియాంగ్‌ జెమిన్‌
కమ్యూనిస్టు చైనాను ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ అనారోగ్యంతో షాంఘైలో మరణించారు.  చైనా అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించిన తొలి వ్యక్తి జియాంగ్‌ జెమిన్‌.

ప్రీతి సూదన్
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సభ్యురాలిగా ప్రీతి సూదన్‌ బాధ్యతలు చేపట్టారు. ఆమె 1983 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోని ప్రీతీ సూద‌న్‌తో ప్రమాణం చేయించారు. కరోనా సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసి, రిటైర్ అయ్యారు.

ప్రశాంత్‌ కుమార్‌
అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్‌గా ‘గ్రూప్‌ఎం మీడియా (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌’ దక్షిణాసియా సీఈవో ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఏఏఏఐ ఏజీఎంలో ఈ ఎన్నిక జరిగింది. 2022–23 సంవత్సరానికి ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్‌ కుమార్‌ సేవలు అందించనున్నారు.

జెలెన్‌స్కీ
‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-–2022’గా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్‌ మేగజీన్‌ తాజా సంచిక ప్రచురించింది. ‘2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది.

డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి
‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణుడు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ పురస్కారాన్ని అందజేశారు.

ఎస్.ఎస్.రాజమౌళి
ఆస్కార్‌ పురస్కారాల్లో ఫేవరేట్‌గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ, ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ (ఎన్‌.వై.ఎఫ్‌.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు.

రమేష్‌ కార్తీక్‌
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్‌ తండాకు చెందిన రమేష్‌ కార్తీక్‌ తన 20వ ఏట రాసిన కవితా సంపుటి ‘బల్దేర్‌ బండి’లోని జారేర్‌బాటి కవితను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్‌ కళాశాల డిగ్రీ 5వ సెమిస్టర్‌ సిలబస్‌లో రెండేళ్ల కిందటే పెట్టారు. తాజాగా ఏయూలో ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్‌ సిలబస్‌లో దాన్ని చేర్చారు.

అరుణ్‌ కుమార్‌ సింగ్‌
ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ చైర్మన్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు.ఆయన గతంలో చమురు రిఫైనింగ్, మార్కెటింగ్‌ సంస్థ బీపీసీఎల్‌ చైర్మన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సింగ్‌ మూడేళ్ల పాటు ఓఎన్‌జీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

అఫ్సిన్ ఘడెర్జాదేహ్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా ఇరాన్కు చెందిన అఫ్సిన్ ఘడెర్జాదేహ్ రికార్డ్ సృష్టించాడు. అతడు 65.24 సెంటీమీటర్లు (2 అడుగుల 1.68 అంగుళాలు) ఉన్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎడ్వర్డ్ నినో (కొలంబియా) అతి పొట్టి వ్యక్తిగా రికార్డుల్లో ఉండగా అతని కంటే అఫ్సిన్ 7 సెం.మీ. పొట్టిగా ఉన్నాడు.

సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు
హిమాచల్‌ప్రదేశ్‌ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖుతో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ప్రమాణం చేయించారు. సుఖు కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుంచి సీఎం వరకు అంచెలంచెలుగా ఎదిగారు.

బెర్నార్డ్‌ అర్నాల్ట్‌
ఫ్రెంచ్‌ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ నికర సంపద 190.90 బి.డాలర్లకు చేరడంతో బిలియనీర్ల జాబితాలో ఆయన అగ్ర స్థానం దక్కించుకున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. 175.50 బి.డాలర్లతో ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మూడో స్థానంలో భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ కొనసాగుతున్నారు.

కార్టూనిస్ట్‌ శంకర్‌
హైద‌రాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో బాపూ జయంతి వేడుకల సందర్భంగాప్రముఖ కార్టూనిస్ట్‌ పామర్తి శంకర్‌కు బాపూ పురస్కారం, రచయిత్రి పొత్తూరి విజ­యలక్ష్మికి రమణ పురస్కారాలను ప్రదానం చేశారు.

జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. జస్టిస్‌ దత్తా ప్రమాణస్వీకారం తర్వాత సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. భారత రాజ్యాంగ నిబంధనలప్రకారం సీజేతో కలుపుకుని సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది వరకు జడ్జీలు ఉండొచ్చు.

ఆదిత్య
యువ చెస్‌ ఆటగాడు ఆదిత్య మిట్టల్‌ (ముంబయి) గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. జీఎం టైటిల్‌ సాధించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్య ఘనత అందుకున్నాడు. 2500 ఎలో రేటింగ్, మూడు జీఎం నార్మ్‌లు సాధిస్తే గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ లభిస్తుంది.

సంపత్‌కుమార్‌
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ మాడభూషి సంపత్‌ కుమార్‌ను నియమించారు. ఆ మేరకు మైసూరులోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నారాయణ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

సర్గమ్‌ కౌశల్‌
ఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌’గా నిలిచిన  జమ్ము కశ్మీర్కు చెందిన 32 ఏళ్ల సర్గమ్‌ కౌశల్‌ ‘మిసెస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది.  మిసెస్‌ వరల్డ్‌ కిరీటం మన దేశాన్ని వరించి 21 ఏళ్లైంది.  ఇప్పటివరకూ దేశానికి ఆ కిరీటాన్ని తీసుకొచ్చింది డాక్టర్‌ అదితి గోవిత్రికర్‌ మాత్రమే.

రేవంత్‌
బిగ్‌బాస్‌ సీజన్‌-–6లో సింగర్ రేవంత్‌ విజేతగా నిలిచారు. ఆయనకు ఇంటి స్థలం, కారు, రూ.10 లక్షల ప్రైజ్‌ మనీ, ట్రోఫీ లభించాయి. శ్రీహాన్ రన్నరప్గా నిలిచాడు. సెప్టెంబరు 4న స్టార్‌ మా టీవీలో ప్రారంభమై 106 రోజులు కొనసాగిన ఆటలో 21 మంది పోటీపడగా సినీ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

రాజా రిత్విక్‌
స్పెయిన్‌లో జరిగిన సన్‌వే సిట్‌గెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల రాజా రిత్విక్‌ చాంపియన్‌గా అవతరించాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్‌ అజేయంగా నిలిచాడు.

అన్వితారెడ్డి
తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించారు. 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్‌ పర్వతాన్ని డిసెంబ‌ర్‌ 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్‌ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు.

పీటీ ఉష
భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం  పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నికైంది.  డిసెంబ‌ర్ 10వ తేదీ దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా 58 ఏళ్ల ఉష గుర్తింపు పొందింది.

ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ
సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా (సీవీసీ) విజిలెన్స్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ శ్రీవాస్తవను తాత్కాలికంగా నియమించారు. సంస్థ కమిషనర్‌ అయిన సురేష్‌ ఎన్‌ పటేల్‌ పదవీ కాలం డిసెంబర్‌ 24తో ముగియడంతో శ్రీవాస్తవను తాత్కాలిక కమిషనర్‌గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

రిచర్డ్‌ వర్మ
భారత సంతతి లాయర్, మాజీ దౌత్యవేత్త రిచర్డ్‌ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాంగ శాఖలో డిప్యూటీ కార్యదర్శి (నిర్వహణ, వనరుల విభాగం)గానామినేట్‌ చేశారు. రిచర్డ్ వర్మ, ఒబామా హయాంలోనూ విదేశాంగ శాఖలో ఉప కార్యదర్శి (న్యాయ వ్యవహారాలు)గా పనిచేశారు.

సానియా మీర్జా
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సానియా మీర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ఎన్డీఏ పరీక్షలో 149వ ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించారు. అలా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌ కానున్న సానియా మీర్జా దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్‌ పైలట్‌గా రికార్డ్ సృష్టించనున్నారు.

బూర రాజేశ్వరి
కాళ్లతో కవిత్వం రాసిన కవయిత్రి బూర రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందారు. వైకల్యంతో జన్మించిన ఆమె ఐదు వందలకు పైగా రాసిన కవితలను సుద్దాల అశోక్‌ తేజ పుస్తకంగా ప్రింట్ చేయించారు. కాళ్లతోనే కవిత్వం రాసే స్ఫూర్తికి ప్రభావితమైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పాఠ్యాంశాల్లో ఆమె జీవితగాథను చేర్చింది.

అనిల్‌కుమార్‌ లాహోటీ
రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా అనిల్‌కుమార్‌ లాహోటీని నియమిస్తూ కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదించినట్లు కార్యదర్శి దీప్తి ఉమాశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యుడి (మౌలిక వసతులు)గా పని చేస్తున్నారు.

మైకీ హోథీ
భారత సంతతికి చెందిన మైకీ హోథీ అమెరికాలో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లోడీ నగర మేయర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నగరానికి తొలి సిక్కు మేయర్‌ ఆయనే. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ నగర మేయర్‌ పీఠాన్ని సిక్కు వ్యక్తి దక్కించుకోవడం ఇదే మొదటిసారి.

స్పోర్ట్స్

కెనడాకు డేవిస్‌కప్‌
ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆస్ట్రేలియాపై గెలిచింది.122 ఏళ్ల డేవిస్‌కప్‌ చరిత్రలో కెనడా తొలిసారి టైటిల్‌ అందుకుంది. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గా నిలిచింది.

ఐఓఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష
దిగ్గజ స్ప్రింటర్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఆమె ఒక్కరే నామినేషన్‌ వేయడంతో విజయం ముందే ఖాయమైంది.  ఐఓఏ ఉపాధ్యక్షుడిగా ఒలింపిక్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

సౌరాష్ట్రదే విజయ్‌హజారె ట్రోఫీ
విజయ్‌ హజారె ఫైనల్లో మహారాష్ట్రపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలిచింది. 249 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సౌరాష్ట్ర ఈ ట్రోఫీ సాధించడం ఇది రెండోసారి. 2007–8 సీజన్‌లో ఆ జట్టు విజేతగా నిలిచింది.

మెస్సి సూపర్ రికార్డ్
ప్రొఫెషనల్‌ ఆటగాడిగా మెస్సి 1000 మ్యాచ్లు ఆడాడు. అందులో అర్జెంటీనా తరపున 169 (94 గోల్స్‌), బార్సిలోనా తరపున 778 (672 గోల్స్‌), పారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ తరపున 53 (23 గోల్స్‌) మ్యాచ్‌లాడాడు. మొత్తం 789 గోల్స్‌ సాధించాడు.

మీరాబాయికి సిల్వర్ మెడల్  
భారత స్టార్‌ మహిళా వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. బొగోటా (కొలంబియా)లో జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. జియాంగ్‌ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించింది.

ఇషా సింగ్‌కు రజతం
జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజత పతకం గెలుచుకుంది. భోపాల్‌లో డిసెంబ‌ర్ 12న‌ ముగిసిన ఈ టోర్నీలో ఇషా సింగ్‌ జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో హర్యాణకు చెందిన ఒలింపియన్‌ మను భాకర్‌ చేతిలో ఓడిపోయింది.

ఫిఫా ప్రపంచకప్‌ విజేత అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి అర్జెంటీనా విజేతగా నిలిచింది. అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. మొత్తంగా ఆ జట్టు మూడోసారి జగజ్జేతగా నిలిచింది. గోల్డెన్‌ బాల్‌ (బెస్ట్‌ ప్లేయర్‌) అవార్డ్ మెస్సీ,  గోల్డెన్‌ బూట్‌ ఎంబాపె, గోల్డెన్‌ గ్లౌవ్‌  మార్టినెజ్‌,   బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌  ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా),  ఫెయిర్‌ ప్లే అవార్డు ఇంగ్లండ్‌  టీమ్ దక్కించుకుంది.

జైపుర్‌దే ప్రొ కబడ్డీ-–9 టైటిల్‌
ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ మళ్లీ తొమ్మిదో సీజన్‌ ఫైనల్లో జైపుర్‌ 33-–29తో పుణెరి పల్టాన్‌పై విజయం సాధించడంతో టైటిల్ గెలుచుకుంది.

జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌
జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ సత్తా చాటింది. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన నిఖత్, జాతీయ టోర్నీలో 50 కేజీల ఫైనల్లో  4-–1తో అనామిక (ఆర్‌ఎస్‌పీబీ)పై నెగ్గి గోల్డ్ మెడల్ సాధించింది.

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌
ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నవంబర్‌ 2022 అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మెన్స్‌ విభాగంలో ఇంగ్లండ్‌ వన్డే, టీ 20 జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అందుకున్నాడు. మహిళల విభాగంలో పాకిస్థాన్‌ కు చెందిన సిద్రా అమీన్‌ ఎంపికైంది. విమెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నిలిచిన రెండో పాక్‌ క్రికెటర్‌గా అమీన్‌ గుర్తింపు సాధించింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ

పీఎస్‌ఎల్‌వీ సీ–54 సక్సెస్
షార్ నుంచి నవంబర్‌ 26న ప్రయోగించిన 44 మీటర్ల ఎత్తయిన పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ 1,117 కేజీల ఎర్త్‌ ఆబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ఓషన్‌శాట్‌–03(ఈవోఎస్‌6) సహా మొత్తం 1,171 కేజీల తొమ్మిది ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో ఇది 56వ ప్రయోగం.

అగ్ని–3 పరీక్ష సక్సెస్‌
మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని–3 పరీక్షను భారత్‌ నవంబర్‌ 23న విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణి 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.

అగ్ని5 క్షిపణి పరీక్ష సక్సెస్‌
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని–5 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని–2 క్షిపణి సామర్థ్యం 2 వేల కిలోమీటర్లు కాగా తాజాగా అభివృద్ధి పరిచిన అగ్ని–5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

నేవీలోకి ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’
దేశీయంగా తయారు చేసిన స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ‘ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌’ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముంబయిలో లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారు. గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్‌ పేరిట దీనికి నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు.

400 కిలోమీటర్లకు పెరిగిన బ్రహ్మోస్‌ రేంజ్
బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణశాఖ పేర్కొంది. ఈ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని నేరుగా తాకిందని పేర్కొంది. తాజాగా బ్రహ్మోస్‌ పరిధిని మరింతగా పెంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేశారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!