Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: ఏప్రిల్​ 2022

కరెంట్​ అఫైర్స్​: ఏప్రిల్​ 2022

అంతర్జాతీయం

ఆస్కార్​ అవార్డులు

Advertisement

2021 సంవత్సరానికి ఆస్కార్‌ అవార్డులను అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సెన్సైస్‌ ప్రదానం చేసింది. ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డు గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్‌ రిచర్డ్స్‌’ సినిమాకి విల్‌ స్మిత్‌ , ఉత్తమ నటిగా జెస్సికా చేస్టన్‌ ‘ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే’ సినిమాకు, ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’కి జెయిన్‌ కాంపియన్‌ ఆస్కార్‌ అందుకున్నారు.

బిమ్​స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సు

శ్రీలంక అధ్యక్షతన బిమ్​స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. బిమ్​స్టెక్ బడ్జెట్ కోసం భారత్ తరఫున వన్ మిలియన్ డాలర్లు అందించనున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆసియాలోని ఏడు దేశాలు ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం బిమ్​స్టెక్ ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాలు ఇందులో భాగస్వాములు.

Advertisement

జీ7 కంట్రీస్​

సహజవాయువు ఎగుమతులకు రూబుల్స్‌లోనే చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను జీ-7 దేశాల కూటమి తిరస్కరించింది. ఈ మేరకు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్‌ హేబెక్‌ తెలిపారు. జీ-7 కూటమిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడాలకు సభ్యత్వం ఉంది.

రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ

Advertisement

గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్‌ ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్‌ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది.

‘గ్రామీ’ అవార్డుల ప్రదానోత్సవం

సంగీతంలో అందజేసే ప్రముఖమైన గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌వెగాస్‌లోని ‘గ్రాండ్‌ మార్కీ బాల్‌రూమ్‌’లో జరిగింది. భారత సంతతికి చెందిన ఇద్దరు రిక్కీ కేజ్ ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు, ఫాల్గుణి షాలు ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ ఆల్బమ్‌కి గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు.

Advertisement

భారత్‌-–ఆస్ట్రేలియా అగ్రిమెంట్​

భారత, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కుదిరింది. దీంతో భారత్‌కు చెందిన జౌళి, తోలు, ఫర్నిచర్​, ఆభరణాలు, మెషినరీ వంటి 6000కు పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది.

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

Advertisement

శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఏప్రిల్‌ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.

రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా చేసుకొని మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఐరోపా యూనియన్‌ (ఈయూ) కార్యనిర్వాహక శాఖ యోచిస్తోంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులను నిషేధించాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌ డెర్‌ లెయెన్‌ తాజాగా ప్రతిపాదించారు.

Advertisement

పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌

పాక్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ – నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్​కు జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా174 ఓట్లు వచ్చినట్లు స్పీకర్‌ అయాజ్‌ సాదిక్‌ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్​ఖాన్​ పదవి కోల్పోయాడు.

డిఫాల్టర్​గా శ్రీలంక

Advertisement

విదేశీ రుణాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (డిఫాల్ట్‌) శ్రీలంక ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిల్‌ అవుట్‌ప్యాకేజీ పెండింగ్‌లోనే ఉన్నందున వాటిని తీర్చలేమంటూ చేతులెత్తేసింది. ఐఎంఎఫ్‌తో ఒప్పందంపై అంగీకారం కుదిరేవరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుంది.

యూఎన్​ఓ నాలుగు కమిటీల్లో భారత్​

ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్‌ ఎన్నికైంది. సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జీవోస్‌ కమిటీ, కమిషన్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఆర్థిక–సామాజిక–సాంస్కృతిక హక్కుల కమిటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది.

Advertisement

తొలి ప్రధానిగా ఇమ్రాన్​ఖాన్​

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 174 మంది మద్దతు పలికారు. దీంతో ఇమ్రాన్‌ పాక్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా నిలిచాడు.

భారత్​లో ఇంగ్లండ్​ ప్రధాని పర్యటన

Advertisement

ఇంగ్లండ్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజులు భారత్​లో పర్యటించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని బోరిస్‌ సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. హృదయ్‌కుంజ్‌లో బోరిస్‌ చరఖా తిప్పారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్‌ ప్రధానమంత్రిగా బోరిస్‌ జాన్సన్‌ రికార్డుకెక్కారు.

రష్యా ఎంఎఫ్‌ఎన్‌ హోదా రద్దు

వాణిజ్యం పరంగా రష్యాకు ఉన్న ‘అత్యంత ప్రాధాన్య దేశం’ (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను జపాన్‌ పార్లమెంటు రద్దు చేసింది. ఉక్రెయిన్‌ దురాక్రమణకు రష్యా ప్రయత్నిస్తుండడాన్ని నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు ప్రకటించింది. ఈ రద్దుతో రష్యా నుంచి జపాన్‌కు జరిగే దిగుమతుల ధరలపై ప్రభావం పడనుంది.

భారత్‌లో తగ్గిన పేదరికం

భారత్‌లో 2011తో పోలిస్తే 2019 నాటికి పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచబ్యాంక్​ నివేదిక వెల్లడించింది. తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3 శాతం మేర పేదలు తగ్గినట్లు పేర్కొంది. 2011లో 22.5 శాతంగా ఉన్న పేదరికం 2019కి వచ్చేసరికి 10.2 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.

రష్యా చేతికి మేరియుపొల్‌

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఏడు వారాల పోరాటం తర్వాత ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌ దేశంలోని ఒక నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మెక్రాన్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. తుది విడత పోలింగ్‌లో ఆయన విపక్ష నేషనల్‌ ర్యాలీ పార్టీ అభ్యర్థి మరీన్‌ లీ పెన్‌పై సునాయాసంగా నెగ్గారు. దీంతో ఫ్రాన్స్‌లో 2002 తర్వాత వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అధ్యక్ష పాలన రద్దు చేయాలి

శ్రీలంకలో అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగీ జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రతిపాదించింది. దాని స్థానంలో ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

జాతీయం

యునెస్కో తాత్కాలిక జాబితాలో లేపాక్షి

అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆలయంగా లేపాక్షి చరిత్రకెక్కింది. త్వరలో యునెస్కో బృందం ఆలయాన్ని సందర్శించి శాశ్వత జాబితాలో చోటుకు పరిశీలించనుంది.

గోవా సీఎంగా ప్రమోద్​ సావంత్​

గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సావంత్‌ చేత గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై సీఎంగా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

మైసూరులో నోట్ల తయారీ ఇంక్‌ యూనిట్‌

కర్ణాటక రాష్ట్రం మైసూరులో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌) ఏర్పాటు చేసిన ఇంక్‌ తయారీ యూనిట్‌– ‘వర్ణిక’ను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్‌ ప్రారంభించారు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గనుంది.

అగ్రస్థానంలో గుజరాత్​

నీతి ఆయోగ్‌ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత జాబితా–2021లో గుజరాత్‌కు అగ్రస్థానం లభించింది. రాష్ట్రాల ఎగుమతి సామర్థ్యం, వాటి సంసిద్ధత ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తారు. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నిలిచాయి.

హర్యానలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం

దేశంలో మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం(వరల్డ్‌ పీస్‌ సెంటర్‌)’ హర్యానలోని గురుగ్రామ్‌లో ఏర్పాటు కానుంది. శాంతి రాయబారి, ప్రముఖ జైనచార్యులు డాక్టర్‌ లోకేష్‌జీ స్థాపించిన ‘అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్‌’ ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని నెలకొల్పనుంది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్​ ఆమోదం

నేరాలకు పాల్పడిన వ్యక్తులను సత్వరమే గుర్తించేందుకు, దర్యాప్తు వేగం చేసే లక్ష్యంతో అనుమానితుల, నేరగాళ్ల కొలతలు, బయోమెట్రిక్‌ నమూనాలను సేకరించేందుకు పోలీసులకు, జైలు వార్డన్లకు అధికారం కల్పించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

మారని వడ్డీ రేట్లు

ఆర్‌బీఐ వరుసగా 11వ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 4 శాతంగా కొనసాగనుంది. ద్రవ్యలభ్యత మెరుగుపరిచే ఉద్దేశంతో రివర్స్‌ రెపోరేటు కూడా గతంలో మాదిరిగానే 3.35 శాతం వద్దనే ఉంచినట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు.

2022–23లో 7.5% వృద్ధి

బలమైన పెట్టుబడుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో భారత్‌ 7.5 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్​ (ఏడీబీ) అంచనా వేసింది. 2022 జనవరి–డిసెంబరులో చైనా వృద్ధి రేటు అంచనా అయిన 5 శాతం కంటే ఇదే అత్యధికం.

పంజాబ్​ అసెంబ్లీ తీర్మానం

చండీగఢ్‌ను తమ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 1న తీర్మానం చేసి ఆమోదించింది. పంజాబ్, హర్యాన రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్‌లో ఉమ్మడి ఆస్తులు, పరిపాలనాపరమైన విషయాల్లో సమతుల్యత పాటించట్లేదని సీఎం భగవంత్‌ మాన్‌ ఆరోపించారు.

చినూక్‌ హెలికాప్టర్‌ రికార్డు

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకధాటిగా ఏడున్నర గంటల పాటు గగనవిహారం చేసి చండీగఢ్‌ నుంచి అస్సాంలోని జోర్హట్‌ చేరుకుంది. బలగాలు, శతఘ్నులు, ఇతర సాధన సంపత్తిని రవాణా చేయడానికి ఈ హెలికాప్టర్‌ను అమెరికా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది.

యూపీఐ చెల్లింపులకు ‘టాటా న్యూ’

కూరగాయలు, కిరాణా సామగ్రి, బట్టలు, మందులు, టికెట్స్​ బుకింగ్​, మనీ ట్రాన్స్​ఫర్​, వినియోగ బిల్లుల చెల్లింపులు.. ఇలా అన్ని సేవలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై లభించేలా టాటా సంస్థ సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ’ను ఆవిష్కరించింది.

ఢిల్లీలో ప్రధానమంత్రుల మ్యూజియం

భారత మాజీ ప్రధానుల జీవిత, పరిపాలనా విశేషాలను భవిష్యత్​ తరాలు గుర్తుంచుకునేలా న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి సంగ్రహాలయ (ప్రధానమంత్రుల మ్యూజియం)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చరిత్రను గుర్తుచేసే ఈ సంగ్రహాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.

రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌

పంచాయతీరాజ్‌ సంస్థల పాలనా సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు అవసరమైన వనరులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభించిన రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) అమలు గడువును 2022 ఏప్రిల్‌ నుంచి 2026 మార్చి 31 వరకు మొత్తం రూ.5,911 కోట్ల వ్యయంతో అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం పొడగించింది.

కేసముద్రం మార్కెట్‌కు పురస్కారం

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ ‘ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు – 2019’కి ఎంపికైంది. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈనామ్‌) విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికైన కేసముద్రం మార్కెట్‌కు ట్రోఫీ, రూ.10 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు.

ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ జల ప్రవేశం

మజ్​గావ్‌ డాక్‌ యార్డ్‌లో ప్రాజెక్టు-75లో చివరిదైన ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీన్ని ఏడాది పాటు పరీక్షిస్తారు. తర్వాత నౌకాదళంలోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్‌-75లో భాగంగా ఆరు స్కార్పీన్‌ తరగతి జలాంతర్గాములను భారత్‌ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్‌-75కు సాంకేతిక సాయాన్ని ఫ్రాన్స్‌ అందిస్తోంది.

భారత వృద్ధి 8.2 శాతం

ఈ ఏడాది భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదు అవ్వొచ్చని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసింది. గత అంచనా 9% కంటే ఇది 0.8% తక్కువ. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశంగా భారత్‌ కొనసాగనుంది. చైనా వృద్ధి రేటు అంచనా 4.4 శాతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు.

అంతర్జాతీయ ఆయుష్‌ పెట్టుబడులు

గాంధీనగర్‌ వేదికగా మూడు రోజుల అంతర్జాతీయ ఆయుష్‌ పెట్టుబడుల మరియు ఆవిష్కరణల సదస్సు–2022 ప్రారంభమైంది. మారిషస్‌ ప్రధాని జగన్నాథ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ సమక్షంలో ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించారు.

ఆసిఫాబాద్‌ జిల్లాకు పీఎం పురస్కారం

శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్‌ అభియాన్‌ అమలులో 2021 సంవత్సరానికి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ప్రధానమంత్రి పురస్కారం అందుకుంది.

పోస్టల్​ స్టాంప్​, నాణెం విడుదల

తొమ్మిదో సిక్కు గురువు తేజ్​ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 21న ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తేజ్​ బహదూర్‌ గుర్తుగా పోస్టల్‌ స్టాంపు, నాణెం విడుదల చేశారు. తేజ్​ బహదూర్‌కు మరణ శిక్ష విధించాలని మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు 1675లో ఎర్రకోట నుంచే ఆదేశాలిచ్చేశారు.

గుజరాత్​లో భారీ హనుమాన్‌ విగ్రహం

హనుమాన్​ జయంతి సందర్భంగా గుజరాత్‌ రాష్ట్రంలోన మోర్బి పట్టణంలో 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్‌జీ చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు.

జాతీయ పతాకానికి గిన్నిస్‌ రికార్డ్‌

ఏకకాలంలో జాతీయ పతాకాన్ని అత్యధిక మంది గాల్లో అటూ ఇటూ ఊపుతూ చేపట్టిన కార్యక్రమానికి గిన్నిస్‌బుక్​లో చోటు దక్కిందని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. బిహార్‌లోని జగ్దీష్‌పుర్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

వీసీల నియామకం రాష్ట్రానిదే

తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో వైస్​ చాన్స్​లర్​ (వీసీ) లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా చట్ట సవరణలు చేసిన బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగా పలు పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని సీఎం స్టాలిన్‌ వెల్లడించారు.

తొలి కర్బన రహిత పంచాయతీగా పల్లీ

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జమ్మూ – కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లీ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 500 కిలోవాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం దేశంలోని తొలి కర్బన రహిత పంచాయతీగా నిలిచింది.

భారత్‌కు సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాలు

అమెరికా తయారీ ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాలు త్వరలో భారత్‌కు రానున్నాయి. విమాన వాహకనౌకల్లో మోహరింపునకు అనువుగా సూపర్‌ హార్నెట్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు బోయింగ్‌ సంస్థకు చెందిన భారత విభాగం ఉపాధ్యక్షుడు అలెన్‌ గార్షియా తెలిపారు

ప్రపంచంలోనే ఎత్తయిన సొరంగం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం త్వరలో భారత్‌లో నిర్మితం కానుంది. 16,580 అడుగుల ఎత్తులో ఉన్న షింకు లా పాస్‌లో దీన్ని నిర్మించనున్నారు. ఈ సొరంగం ద్వారా హిమాచల్‌ ప్రదేశ్‌ను లడ్డాఖ్‌తో అనుసంధానం చేస్తామని బీఆర్‌వో డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ చౌదరి పేర్కొన్నారు.

ప్రాంతీయం

తెలంగాణ స్పేస్‌టెక్‌ పాలసీ

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చే దిశగా ‘స్పేస్‌టెక్‌ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని 2022, ఏప్రిల్‌ 18న వర్చువల్‌ ప్రపంచమైన ‘మెటావర్స్‌’ వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

నందారంలో నిజాం కాలం నాణేలు

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం నందారంలో నిజాం కాలానికి చెందిన రాగి నాణేలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన సభావట్‌ లక్ష్మికి చెందిన పొలంలో చదును చేస్తుండగా ఓ కుండలో ఉర్దూలో ముద్రించిన 228 రాగి నాణేలు దొరికాయి.

అర్బన్​ పార్కులకు అంతర్జాతీయ గుర్తింపు

హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు గానూ తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హరితహారం కింద రాష్ట్రంలోని 109 పట్టణ అటవీ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ గుర్తించింది.

అరుదైన జైన మహాపాదం గుర్తింపు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని పురావస్తు మ్యూజియంలో అరుదైన జైన మహాపాదాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. మ్యూజియంలో కొనసాగుతున్న జీర్ణోద్ధరణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గతంలో గ్రామ శివారులో లభ్యమైన ఈ జైన కుడి పాదం 4 అడుగుల పొడవు, అడుగున్నర వెడల్పుతో ఉందని, దానిపైన నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

భాగ్యనగరానికి ట్రీ సిటీ అవార్డు

భాగ్యనగరం వరుసగా రెండోసారి ట్రీ సిటీ అవార్డు గెలుచుకొంది. 2021 సంవత్సరానికి యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), అర్బోర్‌ డే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందించారు. గత రెండేళ్లలో నగరంలో 3,50,56,635 మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు.

ప్రాణహిత పుష్కరాలు

ప్రాణహిత పుష్కరాలను తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏప్రిల్‌ 13న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

జీవో 111 ఎత్తివేత

జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ జీవో 69 జారీ చేసింది. ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణకు 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల్లో ఆంక్షల అమలుకు 1996లో జీవో 111 తెచ్చారు.

‘ఇయ‌ర్ ఆఫ్ పాజిటివిటీ’ పుస్తకావిష్కర‌ణ‌

తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన ‘ఇయ‌ర్ ఆఫ్ పాజిటివిటీ’ పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించారు.

ఆదర్శ గ్రామాల్లో మొదటి పది రాష్ట్రానివే

సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం కింద.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పదికి పది ఆదర్శ గ్రామాలు రాష్ట్రానికి చెందినవే నిలిచాయి. టాప్‌–10 ఆదర్శ గ్రామాలతోపాటు టాప్‌–20లో 19 గ్రామాలు రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి.

మలేరియా నియంత్రణలో జాతీయ గుర్తింపు

మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015 – 2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.

వార్తల్లో వ్యక్తులు

హిమంత బిశ్వ శర్మ

భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధ్యక్షుడిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బాయ్‌ ఉపాధ్యక్షుడిగా, జనరల్‌ సెక్రటరీగా సంజయ్‌ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్‌ లఖాని ఎన్నికయ్యారు.

రాజ్‌ సుబ్రమణియమ్‌

అమెరికాకు చెందిన బహుళ జాతి కొరియర్‌ సంస్థ ఫెడెక్స్‌కు తదుపరి సీఈఓగా భారత సంతతికి చెందిన రాజ్‌ సుబ్రమణియమ్‌ నియమితులయ్యారు. ఆ కంపెనీకి ప్రస్తుత చైర్మన్, సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్‌ డబ్ల్యూ స్మిత్‌ జూన్‌ 1న పదవీ విరమణ చేస్తారు.

పి.రఘురామ్‌
బ్రిటిష్‌ రెండో అత్యున్నత ర్యాంకింగ్‌ అవార్డు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌–2021’ను హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్ డాక్టర్‌ పి.రఘురామ్‌ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు.

విరాట్​ కోహ్లీ

2021 ఏడాదికి సంబంధించి భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (18.57 కోట్ల డాలర్లు) నిలిచాడు. కన్సల్టెన్సీ సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌,అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. పీవీ సింధు 2.2 కోట్ల డాలర్లతో 20వ స్థానం దక్కించుకున్నారు.

వినయ్‌ మోహన్‌ క్వాత్రా

నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్న వినయ్‌ మోహన్‌ క్వాత్రా తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాలో కొనసాగుతున్న హర్షవర్ధన్‌ శృంగ్లా ఏప్రిల్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో వినయ్‌ మోహన్‌ను నియమితులు కానున్నారు.

రాస్‌ టేలర్‌

న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగిన రాస్‌ టేలర్‌ తన చివరి ఇన్నింగ్స్‌ ఆడాడు.2006లో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన టేలర్‌..112 టెస్టుల్లో 7,683 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో 21 శతకాల సాయంతో 8,607 పరుగులు సాధించాడు. 102 అంతర్జాతీయ టీ20ల్లో 1,909 పరుగులు చేశాడు.

గొడ్డేటి మాధవి

కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది. వైకాపా ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి చేతులమీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.

డాక్టర్‌ అజయ్‌కుమార్‌

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌గా డాక్టర్‌ జె.అజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. కామారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన్ను రెండు వారాల కిందట వైద్య విధాన పరిషత్‌ ఇన్‌ఛార్జి సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేశారు.

మనోజ్ సోనీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్​గా డాక్టర్ మనోజ్ సోనీ నియమితులయ్యారు. ఈ నియామకానికి ముందు, సోనీ రెండు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు, అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపులు సంపాదించారు.

నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ తొలి పురస్కారం అందజేయనున్నట్లు మంగేష్కర్‌ కుటుంబం ప్రకటించింది. ఏప్రిల్‌ 24న మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ (లతా మంగేష్కర్‌ తండ్రి) 80వ వర్ధంతిన ఈ పురస్కారం అందుకుంటారు.

నిశాంత్‌ శెట్టి

కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు నమోదైంది. నిశాంత్‌ శెట్టి 100 మీటర్ల దూరాన్ని 8.36 సెకన్లలోనే చేరుకున్నాడు. సీనియర్‌ విభాగంలో 10.44 సెకన్లలోనే 125 మీటర్లు పరుగెత్తాడు. నిశాంత్‌ శెట్టి గతంలో 100 దూరాన్ని 9.52 సెకన్లలో చేరుకున్నాడు.

కేతాంజీ బ్రౌన్ జాక్సన్‌

యూఎస్​ఏ సుప్రీంకోర్ట్ జడ్జిగా కేతాంజీ బ్రౌన్ జాక్సన్‌ని యూఎస్​ సెనేట్ ధృవీకరించింది. ఆమె సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేయబడిన మొదటి నల్లజాతి మహిళగా నిలిచింది. అత్యున్నత న్యాయస్థానంలో మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా జాక్సన్‌కు మద్దతుగా ముగ్గురు రిపబ్లికన్లు, డెమొక్రాట్‌లు మరియు స్వతంత్రులతో చేరారు.

డాక్టర్‌ కడియాల రామ్మోహనరావు

సుప్రసిద్ధ విమర్శకుడు, సాహితీవేత్త డాక్టర్‌ కడియాల రామ్మోహనరావు అనారోగ్యంతో గుంటూరులో మరణించారు. సాహిత్య అకాడమీ, దిల్లీ ప్రచురించిన ఎన్‌సైక్లోపీడియా ఇండియన్‌ లిటరేచర్‌ 5 వాల్యూమ్స్‌లో 28 వ్యాసాలు రచించారు. వివిధ భాషలకు చెందిన ‘ది బెస్ట్‌ థర్టీస్‌ షార్ట్‌ స్టోరీస్‌’ను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు.

మనోజ్​ పాండే

భారత 29వ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్​ జనరల్​ మనోజ్​ పాండే ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎం.ఎం. నరవణె ఏప్రిల్​ 30న రిటైర్​ కానున్నారు. ఈ నేపథ్యంలో మే 1నుండి పాండే బాధ్యతలు తీసుకోనున్నారు. సైన్యంలోని కోర్​ ఆఫ్​ ఇంజినీర్స్​ నుంచి వచ్చిన మొదటి అధికారి పాండే.

శాంతి సేఠీ

భారత సంతతికి చెందిన అమెరికా నౌకాదళాధికారి శాంతి సేఠీ, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక బాధ్యతలు చేపట్టారు. సేఠీ 2010 డిసెంబరు నుంచి 2012 మే నెల వరకు అమెరికన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెస్ట్రాయర్‌ నౌక డికోడర్‌ కమాండరుగా వ్యవహరించారు.

అజయ్‌ కుమార్‌ సూద్‌

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుగా ప్రొఫెసర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌ నియమితులయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న ప్రొఫెసర్‌ కె.విజయ రాఘవన్‌ స్థానంలో సూద్‌ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం (2018 నుంచి) ప్రధానమంత్రి ‘టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌’ సలహా మండలిలో సూద్​ సభ్యుడిగా ఉన్నారు.

విజయలక్ష్మి

సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్‌ లీడర్​ డాక్టర్‌ మారం విజయలక్ష్మి నియమితులయ్యారు.హైదరాబాదులోని సెంట్రల్‌ ఫిలిం సెన్సార్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం నుంచి నియామక పత్రాలు అందినట్లు విజయలక్ష్మి తెలిపారు.

వేదాంత్‌

డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్లో రజతంతో సత్తా చాటిన సినీ నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్, అదే టోర్నీలో గోల్డ్​ మెడల్​ సాధించాడు. డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హెగెన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రేసులో వేదాంత్‌ 8 నిమిషాల 17.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

సుమన్‌ కె బెరీ

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి రాజీవ్‌ కుమార్‌ వైదొలగడంతో ఆయన స్థానంలో సుమన్‌ కె బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. సుమన్‌ బెరీ మే నెల 1వ తేదీన ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చి (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా, ప్రధాని ఆర్థిక సలహామండలిలో సభ్యుడిగానూ సుమన్​ బెరీ ఉన్నారు.

విజయ్‌ సాంప్లా

కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీఎస్‌సీ) చైర్మన్​గా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఇదే పదవిలో ఉన్న సాంప్లా ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు.

కృష్ణన్‌ రామానుజమ్‌

ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కృష్ణన్‌ రామానుజమ్‌ నియమితులయ్యారు. 2022 -– 23 సంవత్సరానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.

దేవులపల్లి ప్రభాకర్‌రావు

ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జన్మించిన ప్రభాకర్‌రావు ‘ప్రజాతంత్ర’వ్యవస్థాపకుల్లో ఒకరు. 2016 నుంచి తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

కానే ఠనాకా

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌బుక్​లో చోటు సంపాదించిన కానే ఠనాకా 119వ ఏట మరణించారు. నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్టణానికి చెందిన ఆమె 2019 మార్చి నెలలో గిన్నిస్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానేను గుర్తించింది.

స్పోర్ట్స్​

స్విస్‌ చాంపియన్‌గా సింధు

స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విజేతగా అవతరించింది. ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–16, 21–8తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది. 2022 ఏడాది సింధుకిది రెండో టైటిల్‌.

సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రి

2022 ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో నిలవగా, కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఆసీస్‌కు వన్డే ప్రపంచకప్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఏడోసారి సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ 71 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ (లీగ్‌ దశలో 7, సెమీస్, ఫైనల్‌) నెగ్గిన ఆసీస్‌ అజేయంగా టోర్నీని ముగించింది.

ర్యాపిడ్​ చెస్​ విజేత అర్జున్​

సూపర్‌ ఫామ్‌లో ఉన్న తెలంగాణ యువ క్రీడాకారుడు, గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ఇండియన్‌ చెస్‌ టూర్‌ తొలి అంచె పోటీల్లో విజేతగా నిలిచాడు. 15 రౌండ్లలో మొత్తం 30 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో ఎనిమిది గేమ్‌ల్లో గెలిచిన అతను.. మరో ఆరు గేమ్‌లు డ్రాగా ముగించాడు.

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి

ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ రెండో టైటిల్‌ సాధించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా ఏప్రిల్ 10న జరిగిన సీజన్‌ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో లెక్‌లెర్క్‌ (మొనాకో) విజేతగా నిలిచాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు.

స్క్వాష్‌లో డబుల్​ టైటిల్స్​

భారత స్క్వాష్‌ స్టార్‌ దీపికా పల్లికల్‌ డబ్ల్యూఎస్‌ఎఫ్‌ ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు టైటిళ్లు గెలిచింది. మహిళల డబుల్స్‌లో జోష్న చిన్నప్పతో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సౌరభ్‌ ఘోషల్‌తో కలిసి విజేతగా నిలిచింది. ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి.

క్రికెట్‌కు పొలార్డ్‌ వీడ్కోలు

వెస్టిండీస్‌ క్రికెట్​ ప్లేయర్​ కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. 2007లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌123 వన్డేల్లో 2706 పరుగులు చేశాడు.101 టీ20ల్లో 25.30 సగటుతో 1569 పరుగులు సాధించి, 42 వికెట్లు చేజిక్కించుకున్నాడు.

రొమాగ్నా గ్రాండ్‌ప్రి

రొమాగ్నా గ్రాండ్‌ప్రి పోటీలో రెడ్‌బుల్‌ స్టార్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. పోల్‌ పొజిషన్‌లో జోరు మీదున్న హామిల్టన్‌ (మెర్సిడెజ్‌)ను వెర్‌స్టాపెన్‌ వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు.ఈ సీజన్లో మ్యాక్స్‌కు ఇదే తొలి టైటిల్‌. ఓవరాల్‌గా ఇది 11వ ట్రోఫీ.

స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా వెర్‌స్టాపెన్‌

2022 లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో వెర్‌స్టాపెన్‌ ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నాడు. హెరా ‘వరల్డ్‌ స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును సొంతం చేసుకుంది. టెన్నిస్‌ స్టార్‌ రదుకాను ‘బ్రేక్‌త్రూ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని అందుకుంది. ఇటలీ పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ‘వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైంది.

విజ్డెన్‌ మేటి క్రికెటర్లుగా రోహిత్, బుమ్రా

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రా 2022కి గాను విజ్డెన్‌ ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని విజ్డెన్‌ అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

ఎంఆర్‌ శామ్‌ మిస్సైల్​ టెస్ట్​ సక్సెస్​

గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే రెండు మధ్యశ్రేణి క్షిపణులను (ఎంఆర్‌ శామ్‌) భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. లక్ష్యంగా నిర్దేశించిన మానవరహిత విమానాలను ఆ అస్త్రాలు నేరుగా ఢీ కొట్టాయని డీఆర్​డీవో తెలిపింది. లక్ష్యాలు వేగంగా కదులుతున్నప్పటికీ క్షిపణులు గురితప్పకుండా వాటిని నేలకూల్చాయి.

హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్​

హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్​ అభివృద్ధి చేయాలని ఇటీవల ఏర్పడిన ‘ఆకస్‌’ కూటమి నిర్ణయించింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆకస్‌’ భద్రతా కూటమిని గతేడాది సెప్టెంబరు నెలలో ఏర్పాటుచేశారు. హిందూ మహాసముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరగడంపై అమెరికా, దాని మిత్రపక్షాల్లో ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు టూరిస్టులు

అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ముగ్గురు టూరిస్టులను పంపింది. వీరు దాదాపు 10 రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు. దీంతో ఐఎస్‌ఎస్‌కు పర్యాటక యాత్రలను నిర్వహిస్తున్న రష్యా సరసన అమెరికా చేరింది.

ఆకాశం, సముద్రం నుంచి ‘బ్రహ్మోస్‌’

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ ఒకేరోజు రెండు వేదికల నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ అస్త్రానికి సంబంధించిన నౌకా విధ్వంసక వెర్షన్‌ను నేవీ ప్రయోగించగా, గగనతలం నుంచి గర్జించే బ్రహ్మోస్‌ను వాయుసేన పరీక్షించింది.

నింగిలోకి లక్ష్యశాట్‌ ఉపగ్రహం

వాతావరణ సమాచారాన్ని సేకరించడానికి ‘లక్ష్య శాట్‌’ పేరుతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కూరపాటి సాయి దివ్య తయారు చేసిన 400 గ్రాముల బుల్లి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. 2022, మార్చి 15న లక్ష్య శాట్‌ ఉపగ్రహాన్ని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి బీ2 స్పేస్‌ అనే కంపెనీ ద్వారా స్ట్రాటో ఆవరణంలోకి పంపారు.

DONT MISS TO READ: కరెంట్​ అఫైర్స్​ మే 2022

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!