తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మహిళలకు సువర్ణావకాశం. జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 190 పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్ లేదా పదో తరగతి అర్హత కలిగి, నిర్దేశిత వయోపరిమితి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 25 వ తేదీలోగా అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా పరిధిలోని భిక్నూర్, దోమకొండ, కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (నెం. A/262/2026) జారీ చేసింది. అందులో 95 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 95 అంగన్వాడీ హెల్పర్ (ఆయా) పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా చూస్తే భిక్నూర్లో 46, దోమకొండలో 41, కామారెడ్డిలో 26, మద్నూర్‌లో 35, ఎల్లారెడ్డిలో 42 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే.. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధిత ప్రాంతంలో ఇంటర్ అర్హత గల అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే,టెన్త్ పాసైన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. వయోపరిమితి విషయానికి వస్తే, 01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లై చేసుకునే అంగన్వాడీ కేంద్రం పరిధిలోని శాశ్వత స్థానిక నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారైతే ఆ గ్రామ పంచాయితీ, పట్టణ ప్రాంతాల వారైతే.. ఆ వార్డు పరిధికి చెందిన వారై ఉండాలి. దీని కోసం తహశీల్దార్ జారీ చేసిన రెసిడెన్సి సర్టిఫికెట్ తప్పనిసరి.
ఎంపిక విధానం:
ఈ పోస్టుల ఎంపికను మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. మొత్తం 100 మార్కులకు గాను వెయిటేజీ ఉంటుంది. ఇందులో ఇంటర్ మార్కుల మెరిట్‌కు 70 మార్కులు, వితంతువులైన అభ్యర్థులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, వికలాంగులకు 5 మార్కులు ,జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించారు. హెల్పర్ పోస్టుకు ఇంటర్ అభ్యర్థులు లేకపోతే టెన్త్ మార్కుల ఆధారంగా ఇదే విధానంలో ఎంపిక చేస్తారు.
అప్లికేషన్:
ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ (SSC మెమో), క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా కేవలం ఆన్లైన్ మోడ్‌లోనే అప్లై చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్లు జులై 9 నుంచి ప్రారంభమవగా, చివరి తేదీ 25 జూలై సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు జులై 28 నుంచి ఆగస్ట్ 1 మధ్య తమ ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది.





