దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2026 సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగాయి. ఈ పరీక్షల కోసం మొత్తం 11.23 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. సెషన్-1 ఫలితాలను ఇదివరకే విడుదల చేసిన ఎన్టీఏ, ఇప్పుడు సెషన్-2 స్కోర్‌లను కూడా వెల్లడించింది. రెండు సెషన్లలో ఎందులో బెస్ట్ స్కోర్ వస్తే.. దాన్నే ఫైనల్ ర్యాంకింగ్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
రిజల్ట్ ఎలా చూసుకోవాలి?
స్కోర్ కార్డులను కింది పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లోకి లాగిన్ అవ్వండి.
2.హోమ్ పేజీలో కనిపించే ‘JEE Main 2026 Session-2 Result’ లింక్‌పై క్లిక్ చేయండి.
3.మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై మీ స్కోర్ కార్డ్ కనిపిస్తుంది. ప్రింట్ అవుట్ తీసుకోండి.
జేఈఈ అడ్వాన్స్‌డ్:
జేఈఈ మెయిన్ రిజల్ట్ ఆధారంగా దేశంలోని ఎన్ఐటీ (NIT), ఐఐఐటీ (IIIT)లలో అడ్మిషన్లు కల్పిస్తారు. అయితే.. ఐఐటీ (IIT)లలో సీటు సాధించాలంటే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ లో టాప్ ర్యాంకులు సాధించిన సుమారు 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం లభిస్తుంది.
కటాఫ్ వివరాలు:
ఫలితాలతో పాటు ఆయా కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను కూడా ఎన్టీఏ ప్రకటించింది.





