దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2026 పరీక్షా షెడ్యూల్‌ను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో.. బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS),ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
అప్లికేషన్ ప్రక్రియ:
జేఈఈ మెయిన్స్‌లో కనీస స్కోర్ సాధించిన మొదటి 2.50 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్ ద్వారా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం అప్లై చేసుకోవచ్చు. విదేశీ ,భారత సంతతి (OCI/PIO)కి చెందిన అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ముఖ్యమైన తేదీలు :
రిజిస్ట్రేషన్ ప్రారంభం: మెయిన్స్ లో అర్హత సాధించిన వారు ఏప్రిల్ 23, 2026 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
చివరి తేదీ: మే 2 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్లు : మే 11-17 వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ (పేపర్ 1 & 2): మే 17 పరీక్షలు నిర్వహించనున్నారు.
రెస్పాన్స్ షీట్ల విడుదల: మే 21న రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ మే 25న అందుబాటులో ఉంచుతారు.
ఫైనల్ కీ విడుదల: జూన్ 1ఉదయం 10 గంటలకు ఫైనల్ కీతో పాటు ర్యాంకులు వెల్లడిస్తారు.
మే 17న జరగనున్న ఈ పరీక్ష రెండు సెషన్లలో (ఉదయం, మధ్యాహ్నం) జరుగుతుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరుకావడం తప్పనిసరి. పరీక్ష ముగిసిన అనంతరం జూన్ 1న ఫలితాలను వెల్లడించి, ఆ వెంటనే ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.





