జేఈఈ -2025 పరీక్షల షెడ్యూలు విడుదలైంది. జెఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 22 నుంచి, అడ్వాన్సుడ్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్/బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాలి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్ సీట్లున్నాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి.
మెయిన్స్ దరఖాస్తులు: ఈ నెల 28 నుంచి నవంబరు 22 వరకు
హాల్‌టికెట్లు: పరీక్షకు 3 రోజుల ముందు
పరీక్ష తేదీలు: జనవరి 22- జనవరి 31 మధ్య
ఫలితాలు: ఫిబ్రవరి 12 నాటికి
అడ్వాన్సుడ్ దరఖాస్తులు: జనవరి 31- ఫిబ్రవరి 24 వరకు
హాల్‌టికెట్లు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 1- 8 మధ్య
ఫలితాలు: ఏప్రిల్ 17 నాటికి
గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా షెడ్యూలు వెలువడింది. గత ఏడాది జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా… ఈసారి రెండు రోజులు ముందుకు జరిపారు.
జేఈఈ మెయిన్ పేపర్-1, 2లకు కలిపి గత సంవత్సరం 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ పరీక్ష ప్యాటర్న్‌లో మార్పులు చేశారు. రెండో సెక్షన్ లో ఉన్న ఛాయిస్ ఆప్షన్‌ను తొలగించారు.

