తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా జగిత్యాల జిల్లాలోని మహిళా,శిశు,దివ్యాంగుల,వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో మరో కీలక నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులైన ధర్మపురి, జగిత్యాల, మల్యాల, మెట్ పల్లి పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా జగిత్యాల జిల్లాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయింది.
ఖాళీల వివరాలు:
జగిత్యాల జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో.. మొత్తం 64 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్టుల వారీగా చూస్తే.. ధర్మపురి పరిధిలో 16, జగిత్యాల పరిధిలో.. 22, మల్యాల పరిధిలో 12 పోస్టులతో పాటు మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలోనూ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హతలు, వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాకుండా కచ్చితంగా స్థానికత కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న మహిళలు మాత్రమే అర్హులు.
ఎంపిక ప్రక్రియ, వెయిటేజీ:
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ఈ పోస్టుల భర్తీని చేపడుతుంది. అభ్యర్థులకు నిర్వహించే.. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. అలాగే మెరిట్ ఎంపికలో.. మార్కులకు వెయిటేజీ వర్తిస్తుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఉంటుంది. దీనితో పాటు అనాథలు, వితంతువులకు 5 శాతం, అనాథ అభ్యర్థులకు 10 శాతం, దివ్యాంగులకు ప్రత్యేక నిబంధనల ప్రకారం వెయిటేజీ లభిస్తుంది. కాగా..అర్హత, ఆసక్తి గల స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.





