అంతరిక్ష రంగంపై ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి సువర్ణావకాశాన్ని అందిస్తోంది. విద్యార్థుల్లో స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ, వాటి అనువర్తనాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించేందుకు ‘యువ విజ్ఞాని కార్యక్రమం’ (Yuva Vigyani Karyakram – YUVIKA) 2026 ఎడిషన్‌ను ISRO ప్రకటించింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కావాలని కలలుకంటున్న విద్యార్థులకు ఇది కీలకమైన ప్రోగ్రామ్‌గా నిలుస్తోంది.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, చిన్న వయసులోనే అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించడం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించడం. అంతరిక్ష పరిశోధన ఎలా జరుగుతుంది, శాటిలైట్లు ఎలా పనిచేస్తాయి, రాకెట్ల ప్రయోగాలు ఎలా ఉంటాయి వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవంతో కూడిన శిక్షణ ఇవ్వడం.
అర్హత: జనవరి 1, 2026 నాటికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి అర్హులు. ఇది పూర్తిగా విద్యార్థుల కోసం రూపొందించిన శిక్షణా కార్యక్రమం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 27, 2026 చివరి తేదీ: మార్చి 31, 2026, ప్రకటన వెలువడిన తేదీ: ఫిబ్రవరి 20, 2026
ముఖ్యమైన తేదీలు
మొదటి ఎంపిక జాబితా: 2026 ఏప్రిల్ 13
రెండవ ధృవీకరణ జాబితా: 2026 ఏప్రిల్ 20
ప్రోగ్రామ్ నిర్వహణ: మే 11 నుంచి మే 22 వరకు
ఎంపిక విధానం: విద్యార్థుల ఎంపిక ప్రక్రియ స్పష్టమైన వెయిటేజీ విధానంతో జరుగుతుంది.
8వ తరగతి మార్కులు – 50 శాతం వెయిటేజీ
ఆన్‌లైన్ క్విజ్ – 10 శాతం వెయిటేజీ
గత మూడు సంవత్సరాల్లో సైన్స్ ప్రదర్శనలు, సైన్స్ కార్యకలాపాల్లో పాల్గొన్న స్థాయి ఆధారంగా 2 నుంచి 10 శాతం వరకు వెయిటేజీ ఇస్తారు. అదనపు వెయిటేజీ కింద ఒలింపియాడ్స్, క్రీడలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, NCC, NSS వంటి కార్యకలాపాల్లో సాధించిన విజయాలు పరిగణనలోకి తీసుకుంటారు.
గ్రామీణ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. పంచాయతీ పరిధిలోని గ్రామీణ విద్యార్థులకు అదనంగా 15 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస ప్రాతినిధ్యం ఉండేలా ISRO చర్యలు తీసుకుంటుంది.
ఈ శిక్షణా కార్యక్రమం దేశంలోని ప్రధాన ISRO కేంద్రాల్లో జరుగుతుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC), యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) వంటి తొమ్మిది ప్రధాన కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. విద్యార్థులకు స్పేస్ సైన్స్, శాటిలైట్ టెక్నాలజీ, రాకెట్ సిస్టమ్స్, స్పేస్ అప్లికేషన్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తారు.
వసతులు, ఖర్చులు
ఎంపికైన విద్యార్థుల కోర్సు మెటీరియల్, వసతి, భోజన ఖర్చులన్నింటినీ ISRO భరిస్తుంది. విద్యార్థులకు పూర్తి ఉచిత శిక్షణ అందిస్తుంది. అదనంగా, విద్యార్థి మరియు వారి వెంట వచ్చే ఒక గార్డియన్‌కు సెకండ్ ఏసీ రైలు ఛార్జీలు లేదా దానికి సమానమైన బస్సు ఛార్జీలు రీయింబర్స్ చేస్తారు. ఇందుకు అసలు ప్రయాణ టికెట్లు సమర్పించాలి.
అధికారిక వెబ్‌సైట్: https://www.isro.gov.in





