తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరో రెండు గుడ్ న్యూస్‌లను ఇంటర్ విద్యార్థులకు చెప్పారు.
ఫీజు వాపస్
రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన డబ్బులు తిరిగిస్తామని మంత్రి సబిత వెల్లడించారు. ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చని, అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వబోమన్నారు.
సామర్థ్యం పెంచేందుకే ఎగ్జామ్స్
విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఇంటర్ బోర్డుకు తెలియజేయవచ్చన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా అందరినీ పాస్ చేశామని.. ఇంటర్ సెకండియర్‌లో విద్యార్థులు వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకొనేందుకే ఫస్టియర్ పరీక్షలు పెట్టామని సబిత తెలిపారు. కానీ 51 శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం దురదృష్టకరమని అన్నారు. కొందరు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం విచారకరమన్నారు.
త్వరలో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు
ఎవరైనా ప్రభుత్వం కేటాయించిన కనీస మార్కులతో సంతృప్తి చెందకుంటే వారు మార్కులను పెంచుకునేందుకు మరో ఛాన్స్ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. త్వరలో నిర్వహించనున్న ఇంటర్ సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఇంప్రూవ్ మెంట్ ఎగ్జామ్స్ సైతం రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.