HomeEXAMS RESULTSINTERఇంటర్‌ విలీనంపై బ్రేక్‌..! ఈ ఏడాది యథావిధిగా అడ్మిషన్లు

ఇంటర్‌ విలీనంపై బ్రేక్‌..! ఈ ఏడాది యథావిధిగా అడ్మిషన్లు

తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు దారితీసే ఇంటర్మీడియట్‌ విలీన ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వెనక్కి తగ్గింది. ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్‌ అడ్మిషన్లు యథావిధిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసి సీబీఎస్ఈ తరహాలో 11, 12 తరగతుల విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదనపై ఇంకా విస్తృత చర్చలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఇటీవల ఇంటర్‌ అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో సీఎం స్వయంగా సమీక్ష నిర్వహించి పరిస్థితిని స్పష్టంచేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి అయోమయం లేకుండా వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఎందుకు ఈ సంస్కరణ?

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి వరకు స్కూల్ విద్య, ఆ తర్వాత ఇంటర్మీడియట్‌ వేర్వేరు వ్యవస్థలుగా కొనసాగుతున్నాయి. అయితే సీబీఎస్ఈతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో 11, 12 తరగతులు స్కూల్ విద్యలో భాగంగానే ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంటర్‌ కాలేజీల్లో చేరకుండా చదువు మధ్యలోనే మానేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు దూరంగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులు, కొత్త వాతావరణానికి అలవాటు కావాల్సిన పరిస్థితులు డ్రాపౌట్స్‌కు కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ను ప్రత్యేక వ్యవస్థగా కాకుండా స్కూల్ విద్యలో భాగం చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు చదువు కొనసాగించే అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

100 స్కూళ్లలో పైలట్‌ ప్లాన్‌

ప్రభుత్వం మొదట ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ఆలోచించింది. ఎంపిక చేసిన సుమారు 100 ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంనుంచి 11వ తరగతి బోధన ప్రారంభించే ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పుడు సీఎం ఆదేశాలతో ఈ నిర్ణయం కూడా అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకే బోర్డు దిశగా అడుగులు

ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఇంటర్ బోర్డు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ రెండు వ్యవస్థలను విలీనం చేసి “తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు” పేరుతో ఒకే వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. “రైజింగ్ తెలంగాణ” దార్శనిక పత్రంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ మార్పులు అమలు కావాలంటే చట్టపరమైన సవరణలు కూడా అవసరం కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌కు సంబంధించిన 1971 చట్టాన్ని రద్దు చేసి కొత్త ఉమ్మడి చట్టాన్ని తీసుకురావాల్సి రావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై విద్యావేత్తల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు దీన్ని జాతీయ విద్యా విధానానికి అనుగుణమైన ముందడుగుగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇంటర్ విద్య ప్రత్యేకత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల భవిష్యత్తు ఏమవుతుంది? లెక్చరర్ల పోస్టులు ఎలా ఉంటాయి? పరీక్షల విధానం ఎలా మారుతుంది? సిలబస్ రూపకల్పన ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? వంటి ప్రశ్నలకు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

శాసనసభ చర్చ తర్వాతే..

ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ విలీనానికి సంబంధించిన సాంకేతిక, పరిపాలనా, చట్టపరమైన అంశాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భాగస్వామ్య వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించిన తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ నివేదికను పరిశీలించి, శాసనసభలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here