ఇండియన్ బ్యాంక్‌లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి 1,500 అప్రెంటిస్ శిక్షణ స్థానాల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. బ్యాంకు నవంబర్ 4న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం నవంబర్ 5 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రకటించిన ఈ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 85, తెలంగాణకు 46 కేటాయించారు.
తెలుగు రాష్ట్రాల్లో 131 స్థానాలు
ఆంధ్రప్రదేశ్‌లో 85 స్థానాల్లో SC 13, ST 5, OBC 22, EWS 8, అన్‌రిజర్వ్‌డ్ 37 ఉన్నాయి. తెలంగాణలో 46 స్థానాల్లో SC 7, ST 3, OBC 12, EWS 4, అన్‌రిజర్వ్‌డ్ 20 ఉన్నాయి. మొత్తం 1,500 స్థానాలు తాత్కాలిక అంచనాలేనని, అవసరాలను బట్టి మారవచ్చని బ్యాంకు తెలిపింది. ఒక్క అభ్యర్థి ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికే దరఖాస్తు చేయాలి.
అర్హతలు, వయోపరిమితి
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. డిగ్రీ ఫలితాలు 2022 ఏప్రిల్ 1 నుంచి 2026 నవంబర్ 1 మధ్య వెలువడి ఉండాలి. 2026 నవంబర్ 1 నాటికి వయసు 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. SC/STలకు ఐదేళ్లు, OBC నాన్‌క్రీమీలేయర్ అభ్యర్థులకు మూడేళ్లు, అర్హులైన దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోసడలింపు ఉంది. గతంలో అప్రెంటిస్‌షిప్ చేసినవారు, డిగ్రీ అనంతరం ఏడాది లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్నవారు అర్హులు కారు.
ఎంపిక విధానం, స్టైపెండ్
ఎంపిక ప్రక్రియలో 100 ప్రశ్నలు, 100 మార్కులతో 60 నిమిషాల ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బ్యాంకింగ్‌కు సంబంధించిన జనరల్ అవేర్‌నెస్ అంశాలు ఉంటాయి. సంబంధిత రాష్ట్ర స్థానిక భాషపై పరీక్ష కూడా ఉంటుంది. నిర్దేశించిన భాషను 8, 10 లేదా 12వ తరగతిలో చదివినట్లు ధ్రువపత్రాలు చూపినవారికి భాషా పరీక్ష మినహాయింపు ఉంటుంది. అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహించే అధికారం బ్యాంకుకు ఉంది.
ఎంపికైన వారికి 12 నెలల శిక్షణ ఇస్తారు. మెట్రో, పట్టణ శాఖల్లో నెలకు రూ.15,000; గ్రామీణ, సెమీ అర్బన్ శాఖల్లో రూ.12,300 స్టైపెండ్ ఉంటుంది. ఇది శాశ్వత బ్యాంకు ఉద్యోగం కాదు. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉండదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
దరఖాస్తు ఫీజు, చివరి తేదీ
జనరల్, OBC, EWS అభ్యర్థులకు ఫీజు రూ.800తో పాటు GST; SC, ST, PwBD అభ్యర్థులకు రూ.175తో పాటు GST. దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు నవంబర్ 25 చివరి తేదీ. ముందుగా NATS 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకుని పూర్తి ప్రొఫైల్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ కలిగి ఉండాలి. అనంతరం ఇండియన్ బ్యాంక్ నియామక లింకులో దరఖాస్తు పూర్తిచేయాలి.
ఇండియన్ బ్యాంక్ పూర్తి అధికారిక నోటిఫికేషన్ PDF | బ్యాంక్ కెరీర్స్, దరఖాస్తు లింక్ | NATS 2.0 పోర్టల్





