ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాలో మన దేశానికి చెందిన నాలుగు యూనివర్సిటీలు టాప్ లో నిలిచాయి. బ్రిటన్‌కు చెందిన ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజీన్ విడుదల చేసిన 2024 ప్రపంచ టాప్ యూనివర్సిటీల జాబితాలో ఐఐఐటీ– హైదరాబాద్‌కు చోటు దక్కింది. విభాగాల వారీగా విడుదల చేసిన ఈ జాబితాలో మన దేశానికి చెందిన నాలుగు యూనివర్సిటీలకు మంచి ర్యాంకులు దక్కాయి.
ఇంజనీరింగ్ విద్య విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు 101 నుంచి 125 స్లాట్‌లో అన్నా యూనివర్సిటీ 301–400 స్లాట్‌లో స్థానం దక్కించుకున్నాయి. జామియా మిలియా ఇస్లామి యా యూనివర్సిటీ, ఎల్పీయూ, షాలోనీ యూనివర్సిటీలు 401–500 స్లాట్‌లో, ఐఐటీ గువాహటీ, జేపీ యూనివర్సిటీలు 500–600 స్లాట్‌లో స్థానాలు సంపాదించాయి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఐఐఐటీ– హైదరాబాద్‌కు స్థానం దక్కింది. ఈ జాబితాలో ఐఐఐటీ హైదరాబాద్, జామియా మిలియా ఇస్లామియా, కేఐఐటీ యూనివర్సిటీలు 401–500 స్లాట్‌లో స్థానం దక్కించుకున్నాయి.
ఆర్ట్స్ హ్యుమానిటీస్ విభాగంలో ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూకు 501–600 స్లాట్‌లో స్థానం దక్కింది. సోషల్ సైన్సెస్‌లో ఎల్పీయూకు 401–500 స్లాట్‌లో చోటు దక్కింది. జామియా మిలియా ఇస్లామియా, జేఎన్‌యూకు 501–600 స్లాట్‌లో స్థానం దక్కించుకున్నాయి. లా విభాగంలో మన దేశానికి చెందిన ఒక్క యూనివర్సిటీకి కూడా ర్యాంకు దక్కలేదు. కాగా, ప్రపంచ టాప్ యూనివర్సిటీల్లో అన్ని విభాగాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలకు టాప్ ర్యాంకు దక్కింది.