ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది అదిరిపోయే గుడ్‌న్యూస్.హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF విభాగంలో అసిస్టెంట్లు , హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ అర్హతతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూ లేదా ఫిజికల్ టెస్ట్‌కు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు, ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా DRF అసిస్టెంట్ పోస్టులు 100 ఉండగా, హెవీ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు 50 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హత, వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కనీసం టెన్త్ పాస్ అయి ఉండాలి. ముఖ్యంగా డ్రైవర్ పోస్టులకు అప్లై చేసే వారు కచ్చితంగా ఒరిజినల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థుల గరిష్ట వయసు 35 సంవత్సరాలు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఫిజికల్ టెస్ట్:
ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు పలు శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 800 మీటర్ల రన్నింగ్ 2 నిమిషాల 50 సెకండ్లలో (170 సెకండ్లు) పూర్తి చేయాలి. అలాగే 100 మీటర్ల రన్నింగ్ 15 సెకండ్లలో, లాంగ్ జంప్‌ను 4 మీటర్లు , 7.2 కేజీల బరువున్న షాట్ పుట్‌ను 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు:
ఈ పోస్టులకు ఎలాంటి ముందస్తు ఆన్లైన్ అప్లికేషన్లు లేవు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి. డ్రైవర్ పోస్టులకు వచ్చేవారు తప్పకుండా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ పరీక్షలు ఆగస్టు 8 , 9 తేదీలలో ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు.





