తెలంగాణ జాబ్ రిక్రూట్మెంట్లో భాగంగా వెలువడిన ఎస్ఐ, పోలిస్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు పది లక్షల మంది పోటీ పడుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం అన్ని కేటగిరీలు కలిపితే మొత్తం 17292 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. వీటన్నింటికీ ఈ రోజు నుంచి (మే 2 వ తేదీ) అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. TSLPRB అఫిషియల్ వెబ్సైట్లో https://www.tslprb.in/ అభ్యర్థులు లాగిన్ అయి తమ అప్లికేషన్లు సబ్మిట్ చేయాలి. మే 2న ఉదయం 8 గంటల నుంచి మే 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ల నమోదు కు గడువు నిర్ణయించారు. చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా అభ్యర్థులు ముందే తమ అప్లికేషన్లను నమోదు చేసుకోవటం బెటర్.
అప్లై చేసే అభ్యర్థులు ఏమేం చేయాలి
- అభ్యర్థులు మొదట TSLPRB అఫిషియల్ వెబ్సైట్లో https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. రిజిస్టర్ చేసుకోవాలి.
- ఎస్ఎస్సీ మెమోలో ఉన్నట్లు పేరు, పుట్టిన తేదీ, జెండర్, కమ్యూనిటీ, తదితర వివరాలతో పాటు తమ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి.
- అనంతరం.. లాగిన్‌లోకి వెళ్లి యూజర్ ఐడీగా మొబైల్ నంబర్‌ను, పాస్‌వర్డ్‌గా పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- లాగిన్ కాగానే.. పోలీస్ నియామక మండలి విడుదల చేసిన ఆరు నోటిఫికేషన్‌లు ప్రత్యక్షమవుతాయి. అందులో వివిధ విభాగాలకు చెందిన పోస్టులు కనిపిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకునే పోస్టును ఎంపిక చేసుకోవాలి.
- నిర్ణయించిన పరీక్ష ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించాలి.
- అదే నంబర్ సాయంతో పార్ట్-1కు దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రిలిమినరీ రాత పరీక్ష ఏ భాషలో రాస్తారో ఎంచుకోవాలి..
- 1 నుంచి 7 వ తరగతి వరకు స్థానికత వివరాలను నమోదు చేయాలి.
- ప్రిలిమినరీ రాతపరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
- అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకంతో కూడిన ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి.
- ఆ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- ఒకసారి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయబోమని పోలీస్ నియామక మండలి ప్రకటించింది.

మీ విద్యార్హత.. లోకల్ నేటివిటీ .. చెక్ చేసుకొండి
- అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు ఈ సారి మారిన నిబంధనలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల విద్యార్హతలను ఈసారి మార్చారు. గతంలో కానిస్టేబుల్‌కు ఎస్సెస్సీ అర్హతగా, ఎస్సైకి ఇంటర్మీడియట్‌గా అర్హతగా ఉండేది. మిగతా వర్గాల వారికి కానిస్టేబుల్‌కు ఇంటర్మీడియట్, ఎస్సైకి డిగ్రీ విదార్హతగా ఉంది. ఇప్పుడు మిగతా వర్గాల మాదిరిగానే కానిస్టేబుల్‌కు ఇంటర్, ఎస్సైకి డిగ్రీని విదార్హతగా నిర్ణయించారు.
- లోకల్ అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ కేటగిరీగా పరిగణిస్తారు. అందుకు అభ్యర్థి చదివిన పాఠశాల నుంచి స్డడీ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఎన్ని పాఠశాలల్లో చదివితే అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలి.
- ఒకవేళ ఏ పాఠశాలలోనూ చదవకపోతే.. ఎన్నేళ్లు చదవలేదో అన్నేళ్లకు సంబంధించి స్థానిక తహసీల్దార్ నుంచి నివాస ధ్రువపత్రాన్ని తీసుకోవాలి. చదివిన తరగతులకు సంబంధించి స్టడీ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల నుంచి తీసుకొని సమర్పించాలి. ఈ ధ్రువపత్రాలను సర్టిఫికెట్ల పరిశీలన సమయంలోనే చూపించాలి. ఆ రెండింటిని పరిశీలించిన తర్వాత అభ్యర్థుల స్థానికతను నిర్ధారిస్తారు.
- అయితే.. పాఠశాలల్లో చదివి కూడా ఇతర ప్రాంతం నుంచి నివాస ధ్రువపత్రాన్ని సమర్పిస్తే స్థానికతను పరిగణించబోమని పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది.
- బీసీ అభ్యర్థులకు గత ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్ క్రీమీలేయర్ ధ్రువపత్రం తప్పనిసరి అని టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొంది.