గ్రూప్ 1 నోటిఫికేషన్ పై టీఎస్పీఎస్సీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 26 లేదా 27న నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 503 గ్రూప్1 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం టీఎస్పీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయి కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో నోటిఫికేషన్, అప్లికేషన్ల వ్యవధి.. ఎగ్జామ్ షెడ్యూలుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. గ్రూప్ 1 పోస్టులను స్టేట్ కేడర్ పోస్టులుగా కాకుండా.. మల్టీ జోన్ పోస్టులుగానే పరిగణించి.. అదే తీరుగా రిక్రూట్మెంట్ చేపట్టాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. అప్లై చేసుకునేందుకు నెల రోజులు టైమ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు తగినంత గడువు ఇచ్చి ఆగస్టు చివరన.. లేదా సెప్టెంబర్ మొదటివారంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించేందుకు వీలుగా ఎగ్జామ్ షెడ్యూల్‌పై చర్చ జరిగినట్లు టీఎస్పీఎస్సీవర్గాలు చెబుతున్నాయి.