గ్రూప్ వన్ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై.. కోర్టు తుది ఉత్తర్వులకు అనుగుణంగా గ్రూప్–1 ఫలితాలు విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన కేసులో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ వన్ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే రిట్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30న జారీ చేసిన జీవో 33 ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి పది శాతానికి పెరిగాయి. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అందులో స్పష్టం చేసింది. కానీ.. అప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడింది. గ్రూప్ వన్ పోస్టుల నోటిఫికేషన్‌లో రోస్టర్ పాయింట్లను ప్రకటించకపోవడం వల్ల పెంచిన రిజర్వేషన్లు తమకు అమలు కావడం లేదని హైకోర్టులో రిట్ దాఖలైంది.
రోస్టర్ పాయింట్లు ప్రకటించాలంటూ మెదక్ జిల్లా సర్ధనా హవేలీ ఘన్‌పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జి. స్వప్నతో పాటు అయిదుగురు అభ్యర్థులు హైకోర్టులో ఈ రిట్ దాఖలు చేశారు. అడ్వకేట్ రచనారెడ్డి ఈ రిట్‌ను వాదించారు. 503 గ్రూప్–1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 26న నోటిఫికేషన్ ఇచ్చింది. ఆరు శాతం పాత రిజర్వేషన్ల ప్రకారం దాదాపు 32 పోస్టులే ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. రోస్టర్ పాయింట్లను వెల్లడిస్తే ఆ పోస్టుల సంఖ్య 50కి పెరుగుతుందని కోర్టులో తమ వాదన వినిపించారు. ఈ జీవోను గ్రూప్ వన్ నోటిఫికేషన్‌కు వర్తింపజేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు పరీక్షను యథాతథంగా నిర్వహించుకోవచ్చని టీఎస్పీఎస్సీకి సూచించింది. తదుపరి తీర్పుకు లోబడి గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు ఉంటాయని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.