మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ .. వివిధ విభాగాల్లోని మొత్తం 149 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, జూనియర్ రెసిడెంట్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇందుకు ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్లు లేవు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఖాళీలు, విభాగాల వివరాలు :
మొత్తం 22 విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, అనస్థీజియాలజీ వంటి పలు విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేకంగా 10 ట్యూటర్ పోస్టులు, 50 జూనియర్ రెసిడెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ :
ప్రొఫెసర్ / అసోసియేట్ / అసిస్టెంట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో ఎండీ (MD), ఎంఎస్ (MS), లేదా డీఎన్బీ (DNB) పూర్తి చేసి ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి.
ట్యూటర్ / జూనియర్ రెసిడెంట్: ఎంబీబీఎస్ (MBBS) లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థులు కచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన తర్వాత ఒక వారంలోగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు, జీతాల వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు.. 69 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలి. ట్యూటర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 సంవత్సరాల వయస్సు పరిమితి నిబంధన వర్తిస్తుంది.జీతాల వివరాలు..
ప్రొఫెసర్: రూ.1,90,000
అసోసియేట్ ప్రొఫెసర్: రూ.1,50,000
అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ.1,25,000
ట్యూటర్: రూ.55,000
జూనియర్ రెసిడెంట్: రూ.46,000.
ముఖ్యమైన తేదీలు :
ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ లేదు. నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 15 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వేదిక : ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఎదిరా క్యాంపస్, తిరుమల్ల హిల్స్, మహబూబ్ నగర్ జిల్లా.
ఇంటర్వ్యూ రిజల్ట్ సెప్టెంబర్ 17 న విడుదల చేస్తారు. ఎంపికైన వారు సెప్టెంబర్ 30 లోపు విధుల్లో చేరాల్సి ఉంటుంది.
అప్లై చేసే విధానం, కావాల్సిన డాక్యుమెంట్స్:
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (mahabubnagar.telangana.gov.in లేదా gmcmbnr-ts.org) నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తి చేసి, రెండు సెట్ల సెల్ఫ్-అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో.. పాటు ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, స్టడీ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు తీసుకుని నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.





