Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsవిశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

స్మార్ట్ సిటీ.. దేశంలో టాప్​ సిటీ

తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌హుముఖ‌ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలనురూపొందించి అమలు చేస్తున్నారు. న‌గ‌రం చరిత్రలోనే తొలిసారిగా రూ.30 వేల కోట్లకు పైగా వ్య‌యంతో ప‌లు నిర్మాణ కార్య‌క్ర‌మాలు జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ ముడి ప‌దార్థాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృత‌మైన పురోగ‌తి లభించింది. నగర అభివృద్ధికి తోడు ప్రపంచ దేశాల నుండి ఎన్నోబ‌హుళ‌జాతి కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంప‌లు ప్రణాళికలను రూపొందించింది. పెరుగుతున్న జనాభాతోపాటు ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లను, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్లు, కారిడార్లు నిర్మించేందుకు, 54 జంక్షన్లను విస్తరించేందుకు రూ.23 వేల కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డిపి) పనులను చేపట్టింది. అలాగే, హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అమలుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ఇక నుంచి ఐదేండ్ల పాటు రూ.50 వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డిపి)

Advertisement


400 ఏళ్ల పురాతన చారిత్రక హైదరాబాద్ నగరం అత్యంత రద్దీగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల రహదారులు కలిపి 9204 కిలోమీటర్లకుపైగా ఉన్నాయి. న‌గ‌రాన్ని ట్రాఫిక్ ర‌హితంగా, సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్ద‌డానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.23,000 కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల‌ అభివృద్ధి ప‌థ‌కం(ఎస్‌.ఆర్‌.డి.పి)ని రూపొందించి పనులు చేపట్టింది. ఈ పథకంలో భాగంగా ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. అత్యంత ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారుల‌పై ఫ్లైఓవ‌ర్లు, కారిడార్లు, అండ‌ర్‌పాస్‌ల నిర్మాణం చేప‌ట్ట‌డం అంత్య‌త క‌ఠిన‌మైన‌ప్ప‌టికీ, వివిధ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ, ప్రభుత్వం ఎస్.ఆర్.డి.పి ప‌నుల‌ను అత్యంత వేగ‌వంతంగా నిర్వ‌హిస్తోంది. లాక్ డౌన్ సమయంలో రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడాన్ని అదునుగా తీసుకొన్న ప్రభుత్వం రేయింబవళ్లూ పనులు జరిపిస్తుండటంతో చాలావరకు పూర్తయ్యాయి.
నగరంలోని ఎల్.బి.నగర్ వద్ద చింతలకుంట జంక్షన్ అండర్‌పాస్‌, కామినేని ఫ్లైఓవర్‌, ఎల్బీనగర్‌ ఎడమ వైపు ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ అండర్ పాస్, మైండ్ స్పేస్ అండర్ పాస్, మైండ్ స్పేస్, బయో డైవర్సిటీ, రాజీవ్ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్ పనులు పూర్తికాగానే, వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఎల్బీనగర్‌ ఎడమ వైపు అండర్‌పాస్‌, బైరామల్‌గూడ కుడివైపు ఫ్లైఓవర్ పనులు తుది దశలో ఉన్నాయి. ఎల్బీనగర్‌ కుడివైపు ఫ్లైఓవర్‌ తదితర మిగతా పనులు కొనసాగుతున్నాయి.

ఎస్.ఆర్.డి.పి. పనుల్లో పురోగతి…
 పురోగతిలో ఉన్న పనుల విలువ – రూ.2,155.64 కోట్లు
 దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి (రూ.184 కోట్లు) – పనులు తుది దశకు చేరాయి.
 జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం- 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.150 కోట్లు) – తుదిదశకు చేరాయి.
 షేక్‌పేట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.333.55 కోట్లు) – జూన్‌ 2021 నాటికి పూర్తిచేసే లక్ష్యం
 కొత్తగూడ గ్రేడ్‌ సెపరేటర్‌ (రూ.263.09 కోట్లు) – జూన్‌ 2021 నాటికి పూర్తి చేసే లక్ష్యం
 బాలానగర్‌ గ్రేడ్‌ సెపరేటర్‌ (రూ.387 కోట్లు, హెచ్‌ఎండీఏ )- పనులు జరుగుతున్నాయి.
 ఒవైసీ హాస్పిటల్‌, బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ (రూ.132 కోట్లు)- పనులు జరుగుతున్నాయి.
 అంబర్‌పేట్‌ ఛే నెంబర్‌ ఫ్లైఓవర్‌ (రూ.270 కోట్లు, ఎన్‌హెచ్‌ ఆధ్వర్యంలో)- పనులు ప్రారంభం కావాలి.
మంజూరు కావాల్సిన పనులు
 ఖాజాగూడ టన్నెల్‌, ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.875 కోట్లు)- పరిపాలనా అనుమతులు రావాలి.
 ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ ఫ్లైఓవర్‌ (రూ.311కోట్లు)- పరిపాలనా అనుమతులు రావాలి.

మిగతా పనులు
 ఇందిరాపార్క్‌- వీఎస్టీ ఎలివేటెడ్‌ కారిడార్‌ (స్టీల్‌ బ్రిడ్జి, రూ.426 కోట్లు)- టెండర్లు పూర్తయ్యాయి.
 సైబర్‌ టవర్స్‌ ఎలివేటెడ్‌ రోటరీ (రూ.225 కోట్లు)- సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.
 రేతీబౌలి- నానల్‌నగర్‌ ఫ్లైఓవర్‌ (రూ.175 కోట్లు)- సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.
 శిల్పాలేఔట్‌- గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ (రూ.330 కోట్లు)- పనులు జరుగుతున్నాయి.
 నల్లగొండ క్రాస్‌రోడ్స్‌- ఒవైసీ హాస్పిటల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.523.37 కోట్లు, స్టీల్‌ బ్రిడ్జి)- టెండర్లు పూర్తయ్యాయి.
 జూపార్క్‌- ఆరాంఘర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.636.80 కోట్లు)- టెండర్లు పూర్తయ్యాయి.
 చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ఎక్స్‌టెన్షన్‌ (రూ.37 కోట్లు)- పనులు జరుగుతున్నాయి.

గ్రేట‌ర్‌ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం
నిరుపేదలకు డబ్బా ఇండ్లు కాకుండా.. డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టివ్వాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసాకూడా పేదలపై భారం పడకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నది. తొలిద‌శ‌ లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 109 చోట్ల రూ.8,541 కోట్లు ఖర్చుతో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. 90శాతం వరకు పనులు పూర్తయ్యాయి.

హైదరాబాద్ నాలుగు దిక్కుల ఎక్స్ ప్రెస్ హైవేలు
హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ రద్దీని తట్టుకునే విధంగా, రాబోయే 20 నుంచి 40 సంవత్సరాల వరకు మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రహదారుల వ్యవస్థను మెరుగుపరచేందుకు హైదరాబాద్‌ నాలుగు దిక్కులా ఎక్స్‌ప్రెస్‌ హైవేలను నిర్మించడంతో పాటు స్కైవేలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయించారు.

దేశ పర్యాటక రంగంలో హైదరాబాద్ టాప్
దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో 2019లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని నగరాల్లో సర్వే చేయగా హైదరాబాద్ తొలిస్థానంలో ఆ తర్వాత స్థానాల్లో పుణే, జైపూర్, కొచ్చి, మైసూర్ నిలిచాయి. కొచ్చి, మైసూర్ ఉన్నాయి. విదేశీ పర్యాటకులు కూడా హైదరాబాద్ నుఎక్కువగానే సందర్శించారని ఆ సర్వేలో పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ నగరంలో బోయింగ్, జీఈ తదితర డజనుకు పైగా జాతీయ రక్షణ సంస్థలు ఏర్పాటు కావడంతో డిఫెన్స్ హబ్ గా మారింది. వరల్డ్ ఏరోస్పేస్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

జేఎల్ఎల్ సంస్థ నివేదికలో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానం
ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి నగరాల్లో మళ్లీ హైదరాబాద్ ప్రథమస్థానంలో నిలిచింది. రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన జోన్స్ ల్యాంగ్ లాసలే (జెఎల్ఎల్) సంస్థ సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా ప్రపంచవ్యాప్తంగా 130 నగరాల్లో అధ్యయనం చేసి ర్యాంకులు ప్రకటించింది.

ఇళ్ల ధరల పెరుగుదలలో దేశంలోనే హైదరాబాద్ టాప్
ప్రపంచస్థాయి సౌకర్యాలు, ప్రభుత్వ విధానాల కారణంగా ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తన సర్వేలోవెల్లడించింది.

మెట్రో రైల్ ప్రాజెక్టు
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల నివారణకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రభుత్వం రూ. 21 వేల కోట్లతో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ పద్ధతిలో ప్రారంభించిన మెట్రో రైలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. మెట్రోలు ప్రతీ రోజు 780 ట్రిప్పులు నడుస్తూ 4 లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ప్రతీ రోజు 18,000 కిలోమీటర్లు తిరుగుతున్నది. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రోకు 150 వరకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి.

పారిశ్రామిక కాలుష్య రహితంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని పారిశ్రామిక కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. నగరంలో 1545 పరిశ్రమలు కాలుష్య కారకమైనవిగా గుర్తించారు. ఈ పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 19 ప్రాంతాలను గుర్తించి అక్కడ ఇండస్ట్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

మెరుగైన మురుగునీటి వ్యవస్థ – పచ్చదనం
మెరుగైన మురుగునీటి వ్యవస్థ నిర్మాణం కోసం రూ.5540 కోట్ల పనులు చేపట్టిన ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నది. హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా మురికికూపాలుగా మారిన కాల్వ (నాలా)లను హెచ్ఎండీఏ పునరుద్ధరించి, సంరక్షించి, పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నది.

హైదరాబాద్ నగరంలో పేదల విద్యుత్ బకాయిలు మాఫీ
గ్రేటర్‌ పరిధిలో వంద యూనిట్ల లోపు గృహ విద్యుత్ బకాయిలు రూ.41 కోట్ల ను మాఫీ చేసింది. దీంతో 3,35,135 మందికి లబ్ధి చేకూరింది. 100 యూనిట్ల పైబడి సర్‌చార్జి మాఫీతో 1.16 లక్షల మంది విని యోగదారులకు లబ్ధి పొందారు.

పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ
ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల్లోపు ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. లక్ష మందికి రూ.10వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చింది.

హైదరాబాద్ నగరంలో పేదల నల్లా నీటి బకాయిల మాఫీ
హెచ్ఎండీఏ పరిధిలో 15 ఏళ్ల నుంచి పేరుకుపోయిన రూ.445 కోట్ల నల్లా నీటి బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో 2.98 లక్షల నిరుపేద కుటుంబాల వారి కనెక్షన్ల బకాయిలు మాఫీ అయ్యాయి.

ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం
పేద‌లు ఆక‌లితో ఉండొద్ద‌న్న ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆకాంక్ష మేర‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అతిత‌క్కువ ధ‌ర కేవ‌లం ఐదు రూపాయ‌ల‌కే భోజ‌నాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. ప్రభుత్వం ఈ ఫౌండేషన్ కు ఒక్కో భోజనానికి రూ.24.25 చెల్లిస్తున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో హరేకృష్ణ మూవ్ మెంట్ (అక్షయపాత్ర ఫౌండేషన్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ భోజన కేంద్రాల్లో ఇప్పటివరకు 5 కోట్ల 50 లక్షల భోజనాలు పెట్టారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కేంద్రాలు వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ఈ సమయంలో ఫౌండేషన్ వారికి 65 లక్షల భోజనాలను పెట్టింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్ర‌స్థానం
రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జీహెచ్ఎంసీ సాంకేతికత‌ను ఉప‌యోగించ‌డం ద్వారా ఇత‌ర శాఖ‌ల క‌న్నా అగ్రస్థానంలో ఉంది.

హైదరాబాద్ న‌గ‌రంలో ఎల్‌.ఇ.డి లైట్లు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా రూ.271 కోట్లతో చేపట్టిన ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు ప్రాజెక్టును ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ప్రధాన మార్గాలు, వాటి అనుబంధ మార్గాలన్నీ ఎల్‌ఈడీ లైట్లతో వెలిగిపోతున్నాయి. గతంలో వీధిలైట్ల నిర్వహణకు ఏటా రూ.253 కోట్లు ఖర్చవుతుండగా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో ఈ ఖర్చు విద్యుత్ చార్జీల రూపంలో రూ. 113 కోట్లు ఆదా అవుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో మోడల్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, ఇంటరాక్షన్ పార్కుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్‌హాళ్ల‌ నిర్మాణం
న‌గ‌రంలోని నిరుపేద‌ల సౌక‌ర్యార్థం 16 మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్‌ హాళ్ల‌ను రూ. 32.59 కోట్లతో నిర్మిస్తున్నది. మొత్తం 24,700 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రెండు అంత‌స్తుల్లో నిర్మించే ఈ మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్‌హాళ్ల వ‌ల్ల స‌మావేశాలు, శుభ కార్యాలు, ఇత‌ర స‌మావేశాలు నిర్వ‌హించుకునే వీలుంది. జూన్ 2018 నాటికి రూ.9.16 కోట్లతో 5 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయినవి. మిగిలిన 10 ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.

నగరంలో క్రీడారంగ అభివృద్ధికి చర్యలు
నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 521 ప్లే గ్రౌండ్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి పాఠశాలలకు అనుసంధానం చేశారు. గ‌తంలో ఒలంపిక్‌, ఆసియా క్రీడ‌లు, ఇత‌ర అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో పాల్గొని రాష్ట్రానికి పేరుతెచ్చిన 60 సంవ‌త్స‌రాల‌కు పై బ‌డ్డ హైద‌రాబాద్‌లోని క్రీడాకారుల‌ను జీహెచ్ఎంసీ ఆర్థిక స‌హాయం అందిస్తున్నది. న‌గ‌ర యువ‌త‌లో క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించ‌డం, శారీర‌క దృఢ‌త్వం పెంపొందించ‌డానికి జిమ్నాసియాలను, స్పోర్టు కాంప్లెక్సులను, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసింది.

జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పెంపు
గ్రేటర్ హైదరాబాద్ పారిశధ్య కార్మికులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే ముఖ్యమంత్రి కేసీఆర్. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు 24 వేల మంది జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను ప్రభుత్వం పెంచింది.

తాగు నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల (అర్బన్ మిషన్ భగీరథ)
హైదరాబాద్‌ నగరం రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో జలమండలి అమలుచేస్తున్న ప్రాజెక్టులతో బాటు మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. గతంలో 688 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న మంచినీటి సరఫరాను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దాదాపు 1,456 చదరపు కిలోమీటర్లకు పెంచింది. సుమారు రూ.1,900 కోట్ల అంచనా వ్యయంతో 40 లక్షల మందికి తాగునీటిని అందించడానికి కొత్తగా 56 సర్వీస్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నది. శివార్లలోని 12 మున్సిపాలిటీల పరిధిలోని 190 ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు శాశ్వ‌త‌ ప్రణాళికలు రూపొందించింది. ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాల్లో 401 ఓవర్ హెడ్‌సర్వీస్ రిజర్వాయర్లు, 11 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు వేస్తున్నారు.

హైదరాబాద్ రూ.4765 కోట్లతో భారీ జలమాల
హైదరాబాద్ చుట్టూ మహానగరానికి భవిష్యత్తులో మంచినీటి సమస్య రాకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. దాదాపు కోటి జనాభా ఉన్న నగరానికి తాగునీటి కొరత రాకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో బృహత్తర సంకల్పానికి సిద్ధమవుతున్నది. రూ.4,725 కోట్లతో 1628 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటికొరత రాకుండా నివారించేందుకు ఔటర్ రింగురోడ్డు చుట్టూ జలమాలను నిర్మించనున్నది.

స్మార్ట్ హైదరాబాద్ నగరానికి శ్రీకారం
గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మరియు పురపాలక శాఖ విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ విఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ ను స్మార్ట్‌ సిటీగా తీర్చి దిద్దే ప్రణాళికలపై విశ్వ విఖ్యాత చెందిన ‘సిస్కో’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకున్నది.

భారతదేశంలో నెంబర్ 1 నగరంగా హైదరాబాద్
మెర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ తన తాజా నివేదికలో హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 230 నగరాలను సర్వే చేసి వాటిలో నాణ్యమయిన జీవనానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాను తయారు చేసింది. వాటిలో హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ 1 స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకొంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!