దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘గేట్ (GATE) 2026’ అడ్మిట్ కార్డులను ఐఐటీ గువాహటి విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి అధికారిక వెబ్ సైట్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 పేపర్లకు గానూ.. ప్రతిరోజూ ఉదయం (9:30 – 12:30), మధ్యాహ్నం (2:30 – 5:30) రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షా ఫలితాలు మార్చి 19న విడుదల కానున్నాయి.
గేట్ (GATE) 2026 అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి ?
- ముందుగా ఐఐటీ గువాహటి (IIT Guwahati) కి చెందిన అధికారిక గేట్ వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ను ఓపెన్ చేయండి.
- వెబ్‌సైట్ హోమ్ పేజీలో కనిపించే ‘GATE Online Application Process’ (GOAPS) లేదా ‘Download Admit Card’ లింక్‌పై క్లిక్ చేయండి.
- అనంతరం మీ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ (Enrollment ID) లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
- స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ క్యాప్చా ని పూర్తి చేసి ‘Submit’ బటన్ నొక్కండి.
- లాగిన్ అయిన తర్వాత మీ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ ‘Download Admit Card’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో, సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో తప్పని సరిగా చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పులున్నా లేదా ఫోటో స్పష్టంగా లేకపోయినా వెంటనే ఐఐటీ గువాహటి అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే సమయంలో అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. తద్వారా పరీక్షా కేంద్రం వద్ద చెక్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడవచ్చు.





