HomeLATESTచదివిస్తారు.. కొలువిస్తారు

చదివిస్తారు.. కొలువిస్తారు

యూనియన్‍ పబ్లిక్‍ సర్వీస్‍ కమీషన్‍ ఏటా రెండు సార్లు నిర్వహించే నేషనల్‍ డిఫెన్స్ అకాడమీ (ఎన్‍డీఏ) & నావల్‍ అకాడమీ (ఎన్‌ఏ) (2) ఎగ్జామినేషన్‍ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాల్లో శాశ్వత కమిషన్డ్ అఫీసర్ల హోదాలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్‍ అర్హతతోనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నావల్‍ అకాడమీల్లో లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంతో పాటు బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టా పొందే అద్భుత అవకాశం ఇందులో ఉంటుంది. కోర్సు, శిక్షణ ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. మహిళలూ అర్హులే. ఇటీవలే వెలువడిన ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ – 2024(2) ప్రకటన పూర్తి వివరాలు..

రాత పరీక్ష, ఫిజికల్‍ ఆప్టిట్యూడ్‍ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్మీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బీఎస్సీ, బీఎస్సీ(కంప్యూటర్), బీఏ కోర్సుల్లో ఏదైనా చదవొచ్చు. నేవీకి ఎంపికైనవారు బీటెక్, ఎయిర్‌‌ఫోర్స్‌కు సెలెక్టయినవారు బీఎస్సీ లేదా బీటెక్ చదువుతారు. కోర్సు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినవారికి తర్వాతి దశలో ట్రైనింగ్ ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్: పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభతో నియామకాలుంటాయి. పరీక్షలో రెండు పేపర్ల నుంచి 900 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-1 మ్యాథ్స్‌ 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పేపర్‌-2లో జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 150 ప్రశ్నలు 600 మార్కులకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇందులో పార్ట్‌- ఎ ఇంగ్లీష్‌కు 200, పార్ట్‌ బి జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు. ఇంగ్లీష్‌లో 50, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో.. ఫిజిక్స్‌ 25, కెమిస్ట్రీ 15, జనరల్‌ సైన్స్‌ 10, చరిత్ర, స్వాతంత్య్రోద్యమాలు 20, భూగోళశాస్త్రం 20, వర్తమానాంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు.

పేపర్‍/దశ సబ్జెక్టు మార్కులు టైమ్
1 మ్యాథమెటిక్స్ 300 2గంటల 30 నిమిషాలు
2 జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 2గంటల 30 నిమిషాలు
మొత్తం 900
II ఎస్‍ఎస్‍బీ టెస్ట్ /ఇంటర్వ్యూ 900

ఫిజికల్‍ & ఇంటెలిజెన్స్ టెస్ట్: ఆర్మీ, నేవీ విభాగాలను ఎంచుకుని రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి తర్వాతి దశలో సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ద్వారా ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీఏటీ), ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎయిర్‌‌ఫోర్స్‌కు ఎంపికైనవారికి అదనంగా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ ఉంటుంది. ఎస్‌ఎస్‌బీ ఇంటర్య్వూ టెస్టులో రెండు దశలుంటాయి. మొదటి దశలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ పరీక్షలతో పాటు పిక్చర్ పర్సెప్షన్, డిస్క్రిప్టివ్ టెస్టు ఉంటాయి.

ఇందులో క్వాలిఫై అయినవారు మాత్రమే రెండో దశకు వెళతారు. ఇందులో సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్స్ ఉంటాయి. సైకలాజికల్ టెస్టులో భాగంగా థిమాటిక్ అప్రిసియేషన్ టెస్టు, వర్డ్ అసోసియేషన్, సిచ్యుయేషన్ రియాక్షన్, సెల్ఫ్ డిస్క్రిప్షన్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ ఆఫీసర్ టాస్కులో గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్ ఎక్సైజ్, గ్రూప్ టాస్క్ వంటి రకరకాల టెస్టులుంటాయి. పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్టులో పైలట్‌కు ఉండాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా చూస్తారు. చివరగా మెడికల్ టెస్టు ఉంటుంది. వీటిని విజయవంతంగా పూర్తిచేసినవారు ఎంచుకున్న కోర్సులో చేరతారు.

సర్వీస్‍ రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్: ఎంపికయిన అభ్యర్థులు సర్వీస్‍ లో చేరేముందు బాండ్‍ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాకెట్‍ అలవెన్స్, పుస్తకాలు, దుస్తులు, ఆర్మీ ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ర్ట ప్రభుత్వాలు దాదాపు 27 స్కాలర్‍షిప్‍లు అందిస్తున్నాయి. అకాడమీలో చేరిన తర్వాత ఇంగ్లీష్‍, మ్యాథమెటిక్స్, సైన్స్, హిందీలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి హిందీలో అభ్యర్థుల అవగాహనను పరీక్షిస్తారు.

నేషనల్‍ డిఫెన్స్ అకాడమీలో మూడు సంవత్సరాలు అకడమిక్‍, ఫిజికల్‍గా శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అందరికీ కామన్‍ సిలబస్‍ ఉండగా మిగిలిన ఆరు నెలలు స్పెషలైజ్డ్ సబ్జెక్టు బోధిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన ఆర్మీ క్యాడెట్స్‌కి బీఎస్సీ/బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ డిగ్రీ, నావల్‍ & ఎయిర్‍ఫోర్స్ క్యాడెట్స్‌కి బీటెక్‍ డిగ్రీని న్యూఢిల్లీలోని జవహర్‍లాల్‍ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ప్రధానం చేస్తారు. 10+2 క్యాడెట్‍ ఎంట్రీ స్కీం కింద ప్రవేశించినవారికి కేరళలోని ఇండియన్‍ నావల్‍ అకాడమీలో శిక్షణనిచ్చి నాలుగేళ్ల తర్వాత బీటెక్‍ డిగ్రీని ప్రదానం చేస్తారు.

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ క్యాడెట్స్‌ను ఇండియన్‍ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్‍), నావల్‍ క్యాడెట్స్ ను ఇండియన్‍ నావల్‍ అకాడమీ (కేరళ), ఎయిర్‍ఫోర్స్ క్యాడెట్స్ ను హైదరాబాద్‍లోని ఎయిర్‍ఫోర్స్ అకాడమీకి పంపుతారు. ఆర్మీ క్యాడెట్స్ కు ఐఎంఏలో సంవత్సరం పాటు జెంటిల్‍మెన్‍ క్యాడెట్‍ ట్రైనింగ్‍ ఇస్తారు. ట్రైనింగ్‍ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆర్మీ క్యాడెట్స్ శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం పొందుతారు. నావల్‍ క్యాడెట్స్‌కు ఇండియన్‍ నేవల్ అకాడమీ లో సంవత్సరం పాటు మళ్లీ శిక్షణనిచ్చి సబ్‍ లెఫ్టినెంట్‍ హోదాలో ప్రవేశం కల్పిస్తారు.

ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్స్ ఏడాదిన్నర పాటు ఫ్లైయింగ్‍ ట్రైనింగ్‍ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం ఫ్లైయింగ్‍ ఆఫీసర్‍గా ఉద్యోగం ఇస్తారు. 10+2 క్యాడెట్‍ ఎంట్రీ స్కీం కింద ప్రవేశించిన అభ్యర్థులు కేరళలోని ఇండియన్‍ నావల్‍ అకాడమీ లో నాలుగేళ్ల బీటెక్‍ కోర్సును చదవాల్సి ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి జవహర్‍ లాల్‍ నెహ్రూ యూనివర్శిటీ నుంచి బీటెక్‍ డిగ్రీని ప్రదానం చేస్తారు.

ప్రిపరేషన్ స్ట్రాటజీ:

నోటిఫికేషన్‌లో సిలబస్‌ వివరంగా పేర్కొన్నారు. వాటి ప్రకారం సీబీఎస్‌ఈ 10, 11, 12 తరగతుల పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ పాఠ్యపుస్తకాలు చదువుతూ ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిని యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. సబ్జెక్టు ప్రశ్నలు ఏ చాప్టర్ల నుంచి, ఏ స్థాయిలో అడుగుతున్నారు, చాప్టర్లకు లభిస్తోన్న ప్రాధాన్యం ఇవన్నీ గమనించి, సన్నద్థతను మెరుగుపరచుకోవాలి. అధ్యయనం పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు విశ్లేషించుకోవాలి.

వాటి ప్రకారం వెనుకబడిన సబ్జెక్టులు/ పాఠ్యాంశాలకు ప్రాధాన్యమివ్వాలి. తర్వాత రాసే పరీక్షల్లో తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని, ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవాలి. ఇబ్బంది పెడుతోన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. మాథ్స్‌ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధనతో వేగం, కచ్చితత్వాన్ని అందుకోవచ్చు. రుణాత్మక మార్కులు ఉన్నందువల్ల అవగాహన లేని ప్రశ్నలను వదిలేయాలి. అలాగే సమాధానం కోసం ఎక్కువ వ్యవధి తీసుకునే ప్రశ్నలను పరీక్ష చివరలోనే, సమయం మిగిలితేనే ప్రయత్నించాలి. పరీక్షకు పది రోజుల ముందు నుంచీ పూర్తి సమయాన్ని రివిజన్‌ కోసమే వెచ్చించాలి.

సబ్జెక్టులవారీగా సిలబస్​: మ్యాథ్స్​: ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్‌లో ప్రశ్నలు 8 చాప్టర్ల నుంచి వస్తున్నాయి. పాత ప్రశ్నపత్రాలు గమనించి ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అధ్యాయాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.


ఫిజిక్స్‌: కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. సూత్రాలు, అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి.
కెమిస్ట్రీ: మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలపై ఫోకస్​ చేయాలి.
ఇంగ్లీష్‌: అభ్యర్థి భాష ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. వ్యాకరణం, పదసంపదకు ప్రాధాన్యం. వీలైనన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చగలగాలి. అర్థాలు, వ్యతిరేకాలు, తప్పుని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, కాంప్రహెన్షన్, ఖాళీని పూరించడం లాంటివి వీలైనన్ని మాక్​ టెస్టులు రాయాలి.
కరెంట్‌ అఫైర్స్‌: జనవరి 2024 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను రాసుకుని, పరీక్షకు ముందు మరోసారి ప్రిపేర్​ అవ్వాలి.

నోటిఫికేషన్​
ఖాళీలు: మొత్తం 404 ఖాళీలకు ప్రకటన వెలువడింది. అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 34 ఉన్నాయి.
కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌వుతారు. అలా ఎంపికైన‌వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చ‌ద‌వ‌చ్చు.
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష సెప్టెంబర్​ 1న నిర్వహిస్తారు. కోర్సులు 2 జూలై 2025 నుంచి ప్రారంభం అవుతాయి. వివరాలకు www.upsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!