తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. గత లోపాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసి వేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు తీసుకురావద్దంది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్నీ అనుమతించబోమంది. నిబంధనలను పాటించకున్నా, నిషేధించిన వస్తువులను తీసుకెళ్లినా, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా పోలీసు కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంది. పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టంచేసింది. ఇవీ మరిన్ని నిబంధనలు…
పాటించాల్సిన రూల్స్
హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. కలర్‌ప్రింట్ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాలి. ఫొటో పెట్టకుంటే అనుమతించరు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనీయరు. హాల్‌టికెట్, క్వశ్చన్ పేపర్ ఏగ్జామ్ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు జాగ్రత్త పరచాలి.
తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు
వ్యక్తిగత వివరాలను, గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం, పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటరే తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్‌టికెట్‌పై సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్‌టికెట్‌పై ఉన్న ఫొటో, అభ్యర్థి అంటించిన ఫొటో, సంతకం, నామినల్ రోల్ ఫొటో, ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుపై ఫొటో, సంతకాలు సరిపోలాలి. ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు.