Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsవిద్యుత్ సవరణ బిల్లు 2020

విద్యుత్ సవరణ బిల్లు 2020

The Electricity Amendment Bill 2020: Study Report

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ స్పెషల్​ రిపోర్టు

2003 విద్యుత్​ చట్టానికి స్వల్ప మార్పులు చేర్పులతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు–-2020  ముసాయిదాను రూపొందించింది. దీనిపై  జూన్​ 5లోగా అభిప్రాయాలను తెలియజేయాలని  అన్ని వర్గాలను కోరింది. విద్యుత్ అంశం రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే ఈ అంశంపై చట్టం చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికీ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో విద్యుత్​ రంగం అంతా కేవలం విద్యుత్ చట్టం-2003 ప్రకారమే నడుస్తోంది. అంతకు ముందున్న రాష్ట్ర చట్టాలన్నీ దీనికి లోబడి ఉండాలని ఆ చట్టమే చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్తగా తెచ్చిన బిల్లు పలు కీలక అంశాలను లేవనెత్తిందనే చెప్పుకోవాలి.

విద్యుత్ చట్టం-2003:

విద్యుత్ అంశం రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, ఈ అంశంపై చట్టం చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికీ ఉంటుంది.

విద్యుత్తుకు సంబంధించి, 2003 సంవత్సరానికి ముందు దేశంలో మూడు కేంద్ర చట్టాలు, ఎనిమిది రాష్ట్ర చట్టాలు అమలులో ఉండేవి. ఈ నేపథ్యంలో కేంద్రం విద్యుత్ చట్టం-2003 ను తీసుకు వచ్చింది. అప్పటికి అమలులో ఉన్న మూడు కేంద్ర చట్టాలను తొలగించి, ఆ స్థానంలో విద్యుత్ చట్టం-2003ను; జూన్ 10, 2003 నుండి అమలులోకి తెచ్చింది. అయితే అంతకు ముందున్న రాష్ట్ర చట్టాలు మాత్రం కొనసాగుతాయని అన్నది. కానీ, రాష్ట్ర చట్టాలన్నీ విద్యుత్ చట్టం-2003 కు లోబడే ఉండాలి. అంటే భారత దేశంలో విద్యుత్ రంగం అంతా కేవలం విద్యుత్ చట్టం-2003 ప్రకారమే నడుస్తుందని చెప్పవచ్చు.

విద్యుత్ చట్టం-2003, విద్యుత్ రంగంలో అనేక కీలక మార్పులు తెచ్చింది.

అవి…

విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించడంలో అంతకు ముందున్న అనేక నిబంధనలను సరళతరం చేసింది. విద్యుత్ వినియోగదారులు  విద్యుత్తును డిస్కమ్ (Distribution Company- పంపిణీ సంస్థ)ల వద్ద మాత్రమే కాకుండా, ఇప్పుడున్న సరఫరా (Transmission), పంపిణీ  వ్యవస్థలను అద్దెకు వాడుకుని, నేరుగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి కొనడానికి అవకాశం కల్పించింది. ఇలా సరఫరా, పంపిణీ వ్యవస్థలను అద్దెకు వాడుకోవడాన్ని “ఓపెన్ యాక్సెస్ (Open Access)” విధానం అంటారు.

టెలికాం రంగంలో ఉన్నట్టు, విద్యుత్ రంగంలో కూడా ఒకే భౌగోళిక ప్రదేశంలో ఎన్నయినా ప్రైవేటు/ ప్రభుత్వ విద్యుత్ పంపిణీ కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చే లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.  దీనిని “సమాంతర లైసెన్సింగ్ (Parallel Licensing)” విధానం అంటారు.

విద్యుత్ చట్టం-2003 అమలులోకి వచ్చిన తరువాత ఉత్పత్తి, సరఫరా రంగాలలో భారీ మార్పులు వచ్చాయి. అవి: 

  • అనేక ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబడ్డాయి.
  • ఓపెన్ యాక్సెస్ విధానం పెద్ద వినియోగదారులకు  (అంటే ఒక మెగావాట్ కన్నా ఎక్కువ వినియోగం ఉన్న వినియోగదారులకు) అందుబాటులోకి వచ్చింది.  ఈ విధానం ద్వారా చాలామంది బడా వినియోగదారులు డిస్కమ్ ల వద్ద కాకుండా నేరుగా విద్యుత్ ప్లాంట్ల నుండి విద్యుత్తును కొంటున్నారు.
  • అయితే పంపిణీలో ప్రైవేటు కంపెనీలకు ప్రవేశాన్ని కల్పించే సమాంతర లైసెన్సింగ్ విధానానికి విద్యుత్ చట్టంలో అవకాశం ఉన్నా అది అమలుకు నోచుకోలేదు. ఎందుకంటే, సమాంతర పంపిణీ కంపెనీ పెడితే, వాళ్ళు ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ  వ్యవస్థను వాడుకోవడాన్ని విద్యుత్ చట్టం-2003 ఒప్పుకోదు. దీంతో ఎవరు పంపిణీ కంపెనీ పెట్టుకున్నా, వాళ్ళు స్వంతంగా లైన్లు, సబ్-స్టేషన్లు నిర్మించుకోవాలి. ఇది  చాలా సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి టెలికాం రంగంలో వచ్చినట్టు, సమాంతర ప్రైవేటు కంపెనీలు విద్యుత్ రంగంలో రాలేదు.

దీంతో సమాంతర విద్యుత్ పంపిణీ కంపెనీలు పెట్టుకునేవారికి ప్రస్తుతం ఉన్న లైన్లు, సబ్-స్టేషన్లను అద్దెకు వాడుకునే అవకాశం కల్పించే  విద్యుత్ సవరణ బిల్లు-2014 ను కేంద్రం గతంలో ప్రతిపాదించింది.  

అమలుకు నోచుకోని విద్యుత్ సవరణ బిల్లు-2014:

ఈ బిల్లులో ఉన్న కీలకమైన అంశం ఇప్పటికే ఉన్న పంపిణీ కంపెనీలను పంపిణీ, సప్లై అని రెండు కంపెనీలుగా ముక్కలు చేయడం. పంపిణీ కంపెనీ విద్యుత్ లైన్లు, సబ్-స్టేషన్లను నిర్వహిస్తుంది. సప్లై కంపెనీ ఈ లైన్లను, సబ్-స్టేషన్లను వాడుకుని విద్యుత్తును వినియోగదారులకు అందిస్తుంది. అయితే ప్రైవేటు వ్యక్తులు కూడా సమాంతరంగా సప్లై కంపెనీలు పెట్టుకొని వినియోగదారులకు విద్యుత్తును అమ్మవచ్చు. దీనికి వారు పంపిణీ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న లైన్లను, సబ్ స్టేషన్లను అద్దెకు వాడుకోవచ్చు. ఈ సవరణలతో టెలికాం రంగంలో వచ్చినట్టు ఒకే ప్రాంతంలో అనేక విద్యుత్ సప్లై కంపెనీలు విద్యుత్ రంగంలో వస్తాయని కేంద్రం ఆశించింది.

ఈ సవరణలపై దేశం యావత్తూ విస్తృతమైన చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. కారణాలేవైనా, విద్యుత్ రంగంలో సమూలమైన మార్పులు తెచ్చే పై  సవరణలను పక్కకు పెట్టి, ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఆకస్మికంగా ఈ విద్యుత్ సవరణ బిల్లు-2020 ని ముందుకు తెచ్చింది. 

డిస్కమ్​ల ప్రైవేటీకరణ.  సబ్-లైసెన్సింగ్ ఫ్రాంచైజీ విధానం

కేంద్రం సవరణల ప్రకారం డిస్కంల  ప్రైవేటీకరణ పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశం. సవరణ సెక్షన్ 2 (17)(a) ప్రకారం.. డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీ అంటే పంపిణీ సంస్థ తరఫున. దాని పరిధిలో విద్యుత్ పంపిణీ చేసే అధికారం పొందిన వ్యక్తి. విద్యుత్​ పంపిణీ సంస్థ, రాష్ట్ర రెగ్యులేటరీ కమీషన్ అనుమతితోనే ఈ గుర్తింపు జారీ అవుతుంది.  అంటే ఈ పద్ధతిలో పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ పూర్తిగా డిస్కంలదే నిర్ణయం అని స్పష్టంగా ఉంది. డిస్కమ్ లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. అంటే  రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా డిస్కమ్ లను సబ్-లైసెన్సీలకు ఇవ్వడం అసాధ్యం. తరువాత రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ ఆమోదం కూడా తప్పనిసరి. ఈ విధానంతో రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం డిస్కమ్ లను  ప్రైవేటీకరిస్తుందని చెప్పడం సరికాదు.

ఫ్రాంచైజీ అంటే ‘ఒక పంపిణీ సంస్థ తరఫున, దాని పరిధిలోని కొంత భూభాగంలో విద్యుత్ పంపిణీ చేయడానికి, ఆ పంపిణీ సంస్థచే, రాష్ట్ర రెగ్యులేటరీ కమీషన్ కు సమాచారం ఇచ్చి, గుర్తింపబడి, అధికారం పొందిన వ్యక్తి అని నిర్వచనం. ఇక్కడ కూడా ఒక ప్రాంతాన్ని ఫ్రాంచైజీలకు ఇవ్వాలంటే డిస్కమ్ ల అనుమతి తప్పనిసరి, అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి ఫ్రాంచైజీలపై జరుగుతున్న ప్రచారానికి ఆధారం లేదు. 

Advertisement

ఒక డిస్కమ్ ను పూర్తిగా ప్రైవేటీకరించడం, ఒక డిస్కమ్ పరిధిలో కొన్ని ప్రాంతాలను ఫ్రాంచైజీలకు అప్పజెప్పడం ప్రస్తుతమున్న విద్యుత్ చట్టం-2003 లేక రాష్ట్రాల విద్యుత్ చట్టాల పరిధిలోనే చేయవచ్చు. ఒడిశా, ఢిల్లీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరిగిన డిస్కమ్ ల ప్రైవేటీకరణ, ఫ్రాంచైజీలను ప్రవేశపెట్టడం పాత చట్టాల ఆధారంగా జరిగినదే. కొత్తగా వచ్చిన ప్రతిపాదన డిస్కమ్ ల పరిధిలో సబ్-లైసెన్సింగ్ విధానమే.

కేంద్రం తన అధీనంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో  డిస్కమ్ లను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించింది. అయితే సవరణలతో కేంద్రం నేరుగా రాష్ట్రాల్లోని పంపిణీ కంపెనీలను ప్రైవేటీకరించాలని ఆదేశించలేకున్నా, తాను ప్రకటించే అనేక పథకాలకు, ప్రైవేటీకరణకు లింకు పెట్టి రాష్ట్రాలను బలవంతంగా ప్రైవేటీకరణ వైపు నెడతారనే ఒక భయం ఉంది.

సబ్సిడీల ఎత్తివేత.. పేదలపై విపరీతమైన భారం

సబ్సిడీలను ఎత్తివేసే ప్రతిపాదన ఈ సవరణల్లో ప్రతిపాదించలేదు. ప్రస్తుతం  రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను డిస్కమ్ లకు చెల్లిస్తున్నవి. సవరణ తరువాత సెక్షన్-65 ప్రకారం సబ్సిడీలను నేరుగా వినియోగదారులకు చెల్లించాల్సి  ఉంటుంది. దీనిని డైరెక్ట్ బెనిఫిట్ టాన్స్ ఫర్ అంటారు. గ్యాస్ సబ్సిడీ తరహాలో కాకుండా, ఈ సబ్సిడీలను వినియోగదారులకు అడ్వాన్స్ గా, అంటే విద్యుత్ బిల్లు రాకముందే సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుడికి జమ చేస్తారు.

సబ్సిడీ ఇంటి యజమాని పేరు మీద వస్తే..  అద్దెకు ఉన్నవారికెలా .

వాస్తవం: సబ్సిడీ అమౌంట్​ను విద్యుత్ కనెక్షన్ నంబర్ మీద జమ చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాబట్టి అద్దెకున్న వారికి సబ్సిడీ రాదనే ప్రచారం తప్పు.

ఎస్‌సి , ఎస్‌టి లకు వస్తున్న సబ్సిడీ విద్యుత్తు

రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది ఎస్సీ ఎస్టీలున్నారు.  సవరణల ప్రకారం సబ్సిడీలను నేరుగా ప్రభుత్వం జమ చేయాల్సి వస్తుంది. ఎస్‌సి, ఎస్‌టి లకు సబ్సిడీలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్య ఉత్పన్నం కాదు.  ప్రతి నెలా 100, -200 లోపు యూనిట్లను వాడే  చిన్న వినియోగదారులకు  డైరెక్ట్ బెనిఫిట్ టాన్స్ ఫర్ (డీబీటీ) విధానం ఆశించిన ఫలితాలనివ్వదు. ప్రభుత్వం ఒకవేళ సబ్సిడీని అడ్వాన్స్ గా చెల్లించక పోతే, ఈ వినియోగదారులు పూర్తి బిల్లును  కట్టే అవకాశం లేదు. సబ్సిడీ చెల్లించడం ఆలస్యమైతే, ఆ మొత్తంపై వడ్డీ  ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.

అగ్రికల్చర్​ పంపుసెట్లకు మీటర్లు..24 గంటల ఉచిత విద్యుత్తు .

ప్రతి వ్యవసాయ పంపు సెట్టుకూ మీటరు పెట్టాలనే ప్రతిపాదన లేదు. ప్రభుత్వం సబ్సిడీ చెల్లించకుంటే రైతుల వద్ద పూర్తి ఛార్జీలు  వసూలు చేస్తారనే ఆందోళన  అవసరం లేదు. విధాన నిర్ణయం తీసుకున్నందున ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి రైతుకు బెంగ లేదు.  రాష్ట్రంలో సుమారు 24.40 లక్షల అగ్రికల్చర్​ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం  ప్రతి కనెక్షన్ కు ఏడాదికి రూ.60 వేలకు -పైగా సబ్సిడీ చెల్లిస్తున్నది. ప్రస్తుతం ఎలాంటి మీటర్లు , లెక్కలు లేకుండానే ప్రభుత్వం డిస్కమ్ లకు ఈ  సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తున్నది.   సవరణలు అమలైతే  రైతులకు ఇచ్చే సబ్సిడీని పక్కాగా లెక్కించాల్సి ఉంటుంది.  అన్ని ట్రాన్స్ ఫార్మార్ల వద్ద మీటర్లు బిగించాలి. ట్రాన్స్ ఫార్మర్ వారీగా వినియోగం ప్రకారం సబ్సిడీ లెక్కింపు జరగాలి.  ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మీటర్లు బిగిస్తే 99% కచ్చితత్వంతో వ్యవసాయ వినియోగం అంచనా వేయవచ్చు. దానికి తగ్గ సబ్సిడీ ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తే సరిపోతుంది. వ్యవసాయ వినియోగం లెక్క తేలితే.. చౌర్యం ఎంత ఉందో కచ్చితమైన  లెక్క తేలుతుంది.  చౌర్యాన్ని వ్యవసాయ వినియోగంగా చూపించే అవకాశముండదు. చౌర్యాన్ని తగ్గించటం ద్వారా విద్యుత్ కంపెనీల సామర్ధ్యం పెరుగుతుంది. ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుంది.  వినియోగదారుల పైనా చార్జీల భారం తగ్గుతుంది. డిస్కమ్ ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

 కేంద్రం చెప్పినంత సేపే కరెంట్​

కేంద్రం ప్రతిపాదించిన సవరణలలో ఇలాంటి ప్రస్తావన ఎక్కడా లేదు. రైతులకు ఎన్ని గంటల ఉచిత విద్యుత్తును ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రస్తుతం ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం డిస్కమ్ లకు సబ్సిడీగా చెల్లిస్తున్నది. ఈ సబ్సిడీని డిస్కమ్ లకు కాకుండా నేరుగా రైతులకు జమ చేయాల్సి ఉంటుంది.

ఈఆర్​సీ.. రెగ్యులేటరీ కమీషన్ సభ్యుల నియామకం

రెగ్యులేటరీ కమీషన్ ల పనితీరు పైనే విద్యుత్ రంగం పనితీరు ఆధారపడి ఉంటుంది. విద్యుత్ కంపెనీలు, వినియోగదారులపై ప్రభావం చూపే అనేక నిర్ణయాలు కమీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా  రాష్ట్రాలు రెగ్యులేటరీ కమీషన్ సభ్యుల నియామకాలు,  కమీషన్ వ్యవస్థను బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కమీషన్ సభ్యుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీ ఉంటున్నాయి. కమీషన్ల స్వతంత్రత, వాళ్ల పాత్ర ప్రశ్నార్ధకమైంది. అందుకే  రాష్ట్రాలే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చినట్లైంది. కొత్త సవరణల ప్రకారం  కమీషన్ సభ్యుల నియామక కమిటీలో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కొంత ప్రాతినిధ్యం ఉంటుంది.

కేంద్రం అధ్వర్యంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్

వినియోగదారులకు అతి తక్కువ ధరకు సరఫరా చేయడానికి ఎన్​ఎల్​డీసీ ఎన్నో మార్గాలు అనుసరిస్తున్నది.  ఏ రాష్ట్రమైనా అధిక ధరకు విద్యుత్ ఉత్పత్తి  చేస్తుంటే, అదే టైమ్​లో ఇతర రాష్ట్రాల్లో  తక్కువ ధరకు ఉత్పత్తయ్యే విద్యుత్తు అందుబాటులో ఉంటే, అదే తక్కువ ధర విద్యుత్తు వినియోగదారులకు సరఫరా చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ధర తగ్గి వినియోగదారులకు లాభం జరిగే అవకాశం ఉంది.  ఎక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు నష్టం లేకుండా ప్లాంటు నడవకున్నా పూర్తి స్థిర చార్జీలను చెల్లిస్తారు. దీన్ని సెక్యూరిటీ కన్​స్ట్రైన్​డ్​ ఎకనామిక్​ డిస్పాచ్​ అంటారు.  దేశంలో ఈ విధానం ప్రవేశపెట్టినాక ప్రతీ ఏటా విద్యుత్ ఉత్పత్తి ఖర్చు సుమారు రూ.వెయ్యి కోట్లు తగ్గింది.  ప్రస్తుతం కేంద్ర ఉత్పత్తి సంస్థలే ఈ విధానంలో ఉన్నాయి. దేశంలోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలూ ఈ విధానంలోకి వస్తే ఉత్పత్తి ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంతమేరకు వినియోగదారులపై భారం తగ్గుతుంది.  2014లో దేశంలోని మొత్తం విద్యుత్ వ్యవస్థ ఒకే గ్రిడ్ గా మారింది. ఎన్​ఎల్​డీసీ  పాత్ర, బాధ్యత మరింత పెరిగింది. విద్యుత్తు వ్యవస్థలో సాంకేతిక అవసరాల దృష్ట్యా దీని పాత్రను  విమర్శించడం తగదు.

ఈసీఈఏ

ఈసీఈఏ ఏర్పాటు సమస్యను పరిష్కరించక పోగా  జటిలం చేసే ప్రమాదం ఉంది.  ప్రతీ రాష్ట్రంలో ఈఆర్​సీలు పెద్ద ఎత్తున కేసులను పరిష్కరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని  కేసులు  గంపగుత్తగా ఈసీఈఏకు వెళితే.. వీటిని పరిష్కరించడం తలకు మించిన భారమే. .విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ధర నిర్ణయించడం లాంటి అంశాలు ఈఆర్​సీల పరిధిలో ఉంటాయి. విస్తృతమైన ప్రక్రియ ఉంటుంది. ఒప్పందాలపై ఈఆర్​సీకి స్పష్టత ఉంటుంది. దీంతో వివాదాలు వచ్చినా పరిష్కరించటం ఈజీ. అందుకే వీటిని ఈఆర్​సీకి వదిలేస్తేనే మంచింది. 

 ప్రైవేటు వారి చేతుల్లోకి. ఉద్యోగాలు పోతాయి

ఇప్పటికే వివరించినట్టు ప్రతిపాదిత సవరణల ప్రకారం విద్యుత్ కంపెనీలను ప్రైవేటుపరం చేయడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. కాబట్టి ఉద్యోగ భద్రత, జీతాలు, పెన్షన్లు, జీపీఎఫ్ ల చెల్లింపులు ఆయా రాష్ట్ర విద్యుత్ కంపెనీల ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది.

విద్యుత్ కొనుగోలు, సరఫరా ఒప్పందాలు

కొత్త సవరణల్లో.. ఒప్పందానికి రెగ్యులేటరీ కమీషన్ అనుమతి ప్రస్తావన లేదు. నిజానికి విద్యుత్ చట్టం-2003 లోని 62, 63 సెక్షన్ల ప్రకారం  అన్నిఒప్పందాలకు కమీషన్ అనుమతి తప్పనిసరి.  అలాంటప్పుడు కమిషన్ ను పక్కకు పెట్టే మార్పు చేయటం సరైంది కాదు.  కాబట్టి ఈ సవరణను తొలగించాలి.

క్రాస్ సబ్సిడీలు

ఉదాహరణకు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కమ్ కు రూ.100 ఖర్చయిందని అనుకుందాం.  అందులో చార్జీల ద్వారా రూ.70  వస్తే, మిగతా రూ. 30 లోటు. అందులో రూ. 20 రూపాయలు  ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తే.. మిగతా రూ.10 వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమల నుంచి అధిక ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. ఎక్కువ ఛార్జీలు చెల్లించే శక్తి ఉన్న వినియోగదారుల నుండి వసూలు చేసే మొత్తాన్ని క్రాస్ సబ్సిడీలు అంటారు. ఎక్కువ ఛార్జీలు చెల్లించే స్తోమత లేని వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఉపయోగిస్తారు. గతంలో చట్టాలూ, ఇప్పుడు సవరణలన్నీ క్రాస్ సబ్సిడీలను తగ్గించాలనే చెపుతున్నాయి. రాష్ట్రాలు ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయలేదు. ఇప్పుడు బలవంతంగా కేంద్రం అమలు చేస్తుందని రాష్ట్రాల భయం.  క్రాస్ సబ్సిడీలను తగ్గించకపోతే మరో ప్రమాదముంది. ఛార్జీలు ఎక్కువగా ఉంటే  పెద్ద వినియోగదారులు దూరమవుతారు. 2003 చట్లంలోని ఓపెన్ యాక్సెస్ విధానం ద్వారా బహిరంగ మార్కెట్ లో విద్యుత్తును కొనుక్కుంటున్నారు.  దీంతో  డిస్కమ్ లు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ముగింపు

దేశంలో  డిస్కమ్ ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. అప్పుల భారాలతో, నష్టాలతో, వసూలు కాని బకాయిలతో డిస్కమ్ లు కునారిల్లుతున్నాయి. చిన్న వినియోగదారులైన వ్యవసాయ, గృహ రంగాలనుండి  ఆదాయం పెద్దగా రాదు. ఓపెన్ యాక్సెస్ విధానంతో పరిశ్రమలు, పెద్ద   వినియోగదారులకు చార్జీలను పెంచలేని పరిస్థితి. ఛార్జీలు పెంచితే వీళ్ళు డిస్కమ్ లను విడిచి పెట్టే ప్రమాదం ఉంది.  ఇప్పటికే పెద్ద  పరిశ్రమలు, రైల్వేలు ఓపెన్ యాక్సెస్ విధానాన్ని ఆశ్రయిస్తున్నాయి. దీంతో డిస్కమ్ ల పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరిగిపోతోంది. వీటిని ప్రభుత్వాలు చెల్లించలేనప్పుడు డిస్కంలకు మళ్లీ అప్పులే మార్గం.

అందుకే సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కమ్ ల ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. కానీ మూడు దశాబ్దాలుగా విద్యుత్ సంస్కరణల అనుభవం ప్రైవేటు రంగ వైఫల్యాలను మన ముందు ఉంచింది. ప్రైవేటు రంగం లాభాపేక్షతో పని చేయడం తప్ప సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో  విఫలమైంది. అందుకే విద్యుత్ లాంటి కీలక రంగాల్లో ఏ సంస్కరణలైనా, సవరణలైనా ప్రభుత్వ రంగ పరిధులలోనే జరగాలి.  ఉత్పత్తి ఖర్చులను తగ్గించే అంశాలు, వినియోగదారుల సేవలకు సంబంధించిన అంశాలేవీ ఈ సవరణల్లో లేవు. ఎన్ని చేసినా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోలేక పోతే చార్జీల భారం తప్పదు. అన్ని స్థాయిలలో అవినీతికి తావులేకుండా, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించడానికి అవసరమైన మార్పులు కూడా సవరణలలో చేర్చాలి. 2003  విద్యుత్ చట్టం- లో వినియోగదారుల సంక్షేమం కోసం ఉన్నసెక్షన్లు ఇప్పటికే నామమాత్రంగా మారాయి. వీటిని బలోపేతం చేసేలా కొత్త సవరణలుండాలి. .

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!