ఇంటర్లో బైపీసీ పూర్తి చేసి,ఎఫ్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ లభించే విభిన్న ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. సరైన కాలేజీని ఎంచుకోవడానికి, ఉన్నత చదువులను విజయవంతంగా కొనసాగించడానికి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ విద్యార్థులకు అత్యంత కీలకం కానుంది. ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేసిన ఈ కౌన్సెలింగ్ షెడ్యూల్, స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్ల తేదీలు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు, షెడ్యూల్:
స్లాట్ బుకింగ్: అర్హత సాధించిన అభ్యర్థులు తమ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడానికి సెప్టెంబరు 12 నుంచి 16 వరకు అవకాశం కల్పించారు.
డాక్యెమెంట్ వెరిఫికేషన్: స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
వెబ్ ఆప్షన్లు: సెప్టెంబరు 16 నుంచి 20 వరకు అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు , కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదుర్కొకుం డా ముందుగానే తమకు ఇష్టమైన కాలేజీల లిస్ట్ తయారు చేసుకుని వెబ్ ఆప్షన్లు పూర్తి చేయడం బెస్ట్.
అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు:
ఈ విద్యా సంవత్సరంలో బైపీసీ విద్యార్థుల కోసం వివిధ రంగాల్లో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఫార్మసీ రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు.
బీఫార్మసీ: 124 కాలేజీల్లో మొత్తం 8,473 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫార్మా-డీ: 72 కాలేజీల్లో 1,567 సీట్లు భర్తీ చేయనున్నారు.
బీటెక్ బయో మెడికల్: రెండు కాలేజీల్లో 37 సీట్లు ఉన్నాయి.
బీటెక్ బయో టెక్నాలజీ: ఆరు కాలేజీల్లో 299 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్: నాలుగు కాలేజీల్లో 170 సీట్లు ఉన్నాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే అర్హులైన పేద విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. కాబట్టి అభ్యర్థులు నిర్దేశిత సమయలోగా రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం లేదా గతేడాది ట్రెండ్ గమనించడం ద్వారా మంచి కాలేజీలో సీటు దక్కించుకునే అవకాశాలు మెరుగవుతాయి.





