ఆర్థిక సమస్యలతో ఇంజినీరింగ్ చదవలేని విద్యార్థినులకు డీఆర్‌డీఓ(డిఫెన్స్ ఆర్ అండ్ డి ఆర్గనైజేషన్) స్కాలర్‌షిప్ అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్/ స్పేస్ ఇంజినీరింగ్ అండ్ రాకెటరీ/ ఏవియానిక్స్/ ఏర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ చదువుతోన్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ డిగ్రీకి నాలుగేళ్లు ఆర్థిక సాయం
డిగ్రీ స్థాయిలో 20 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ (మెయిన్)లో మంచి స్కోర్ సాధించి ఉండాలి. ఏడాదికి రూ.1,20,000 చొప్పున నాలుగేళ్లకు స్కాలర్‌షిప్ ఇస్తారు. లేదా వార్షికఫీజు.. ఏది తక్కువగా ఉంటే అది చెల్లిస్తారు.
పీజీకి రెండేళ్లు సాయం
పీజీ స్థాయిలో 10 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ ఇంజినీరింగ్ చదువుతున్నవారై ఉండాలి. బీఈ/బీటెక్/బి.ఇంజినీరింగ్ డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. గేట్‌లో మేలైన స్కోర్ సాధించాలి. ఏడాదికి రూ.1,86,000 స్కాలర్‌షిప్‌ను రెండేళ్ల కాలానికి చెల్లిస్తారు. లేదా నెలకు రూ.15,500 చొప్పున చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ కలర్‌ఫొటో, ఆధార్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, ఫీజు వివరాలు… మొదలైనవి అప్‌లోడ్ చేయాలి. పూర్తి వివరాలతో నింపకపోయినా, సంబంధిత పత్రాలను జతపరచకపోయినా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి కరస్పాండెన్స్‌కూ అవకాశం ఉండదు. స్కాలర్‌షిప్‌ల మంజూరుకు సంబంధించి ఏ దశలోనూ ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు. మెరిట్ ఆధారంగానే అర్హులైన విద్యార్థినులను ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 31 మార్చి
వెబ్‌సైట్: https://rac.gov.in