ఇంజనీరింగ్, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మక రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓకి చెందిన హైదరాబాద్ ‘రిసెర్చ్ సెంటర్ ఇమారత్’ (RCI) పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ స్టూడెంట్స్ ఇందుకు అర్హులు. స్టైపెండ్‌తో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఈ ఇంటర్న్‌షిప్‌లకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 20వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరెవరు అర్హులు?
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
అండర్ గ్రాడ్యుయేట్: బీటెక్ (B.Tech) 7వ , 8వ సెమిస్టర్ చదువుతున్న వారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్: ఎంటెక్ (M.Tech) లేదా ఎమ్మెస్సీ (M.Sc – ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే) సెకండ్ ఇయర్ చదువుతున్న వారు.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి.
స్టైపెండ్ ఎంత ?
ఎంపికైన అభ్యర్థులకు కనీసం 6 నెలల కాలపరిమితితో ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో (మొదటి 3 నెలల తర్వాత ఒకసారి.. కోర్సు పూర్తయ్యాక మరోసారి) చెల్లిస్తారు. అవసరాన్ని బట్టి ఎంటెక్, ఎమ్మెస్సీ వాళ్లకు మరో 4 నుంచి 6 నెలలు ఇంటర్న్‌షిప్ పొడిగించే ఛాన్స్ ఉంది (కానీ పొడిగించిన కాలానికి స్టైపెండ్ ఉండదు).
ఫీజు, సెలెక్షన్ ప్రాసెస్:
ఈ నోటిఫికేషన్‌కు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థుల అకడమిక్ మెరిట్ (CGPA మార్కులు) లేదా ఆన్‌లైన్ ఇంటర్వ్యూ / ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: జూన్ 20వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సెలెక్ట్ లిస్ట్: జూలైలో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
ఇంటర్న్‌షిప్ ప్రారంభం: ఆగస్టు 03 నుంచి ఇంటర్న్ షిప్ ప్రారంభం అవుతుంది.
ఎలా అప్లై చేయాలి?
ఇది ఆఫ్‌లైన్ ప్రాసెస్ కాబట్టి అభ్యర్థులు DRDO అఫీషియల్ వెబ్‌సైట్ (drdo.gov.in) లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని తప్పులు లేకుండా పూర్తి చేసి, మీ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను జత చేయాలి. ఆపై నోటిఫికేషన్‌లో పేర్కొన్న అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా జూన్ 20 లోపు చేరేలా పంపించాల్సి ఉంటుంది.





