ఉద్యోగం చేస్తూ లేదా వేరే వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే ఎంబీఏ (MBA) పూర్తి చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Dr.BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సాధారణ ఎంబీఏతో పాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్ సెట్ చేసుకోవాలనుకునే వారి కోసం స్పెషల్ కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 లోగా దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు..
కోర్సులు & అర్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ప్రోగ్రామ్.
ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ (MBA – HHCM)
విద్యార్హత: ఈ కోర్సులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో (రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపులు ఉండవచ్చు) ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అయితే ఫైన్ ఆర్ట్స్, ఓరియంటల్ లాంగ్వేజెస్ చదివిన వారు దీనికి అనర్హులు.
వయోపరిమితి: అభ్యర్థులు తప్పనిసరిగా 01.06.2006 లేదా అంతకంటే ముందు జన్మించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ఈ కోర్సుల్లో సీటు సాధించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్వయంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయడం, లేదా ఈ ఏడాది నిర్వహించిన టీజీ ఐసెట్ (TG ICET-2026) లో మంచి ర్యాంక్ సాధించి ఉండడం. ఒకవేళ మీరు ఇప్పటికే ఐసెట్ పరీక్ష రాసి ఉంటే, మళ్లీ ఈ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా అడ్మిషన్ పొందవచ్చు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసే ముందే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగ (PwD) అభ్యర్థులు రూ.1,000, ఓసీ, బీసీ, ఇతర అభ్యర్థులు రూ.1,500 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం:
ఈ ప్రవేశ పరీక్షను ఆఫ్‌లైన్ (పెన్-పేపర్) పద్ధతిలో నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లోనూ ఉంటుంది.
తెలంగాణలోని ప్రధాన నగరాలైన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, హనుమకొండ (వరంగల్) లతో పాటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని BRAOU హెడ్‌క్వార్టర్స్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 5వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లేట్ ఫీజు: అభ్యర్థులు రూ. 500 లేట్ ఫీజుతో ఆగస్టు 16 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్ల డౌన్లోడ్ : ఆగస్టు 13 నుంచి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు 23న ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు.
రిజల్ట్: ఆగస్టు 31వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.
కోర్సు ఫీజు వివరాలు:
సాధారణ ఎంబీఏ (MBA) కోర్సుకు సంవత్సరానికి సుమారు రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ట్యూషన్ ఫీజు ఉంటుంది (రెండు సంవత్సరాలకు కలిపి దాదాపు రూ. 35,000 నుంచి రూ. 40,000). ఇక స్పెషలైజ్డ్ కోర్స్ అయిన ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ (HHCM) కోర్సు కాబట్టి దీని ఫీజు సాధారణ ఎంబీఏ కంటే కాస్త ఎక్కువగా.. సంవత్సరానికి సుమారు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఉండే అవకాశం ఉంది.





