రేపు హైదరాబాద్ కు అర్వింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ రేపు ఉదయం హైదరాబాద్ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు. అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆయన సీఎం కేసీఆర్ మద్దతు కోరనున్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. సాధారణ పాస్‌పోర్టు కోసం చేసుకున్న అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాలానికి గానూ ఆయనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) జారీ చేసింది. ‘మోడీ ఇంటి పేరు’వ్యాఖ్యలతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న వేళ కొత్తపాస్ పోర్టు కోసం ఇటీవల పిటిషన్ వేశారు. అయితే, రాహుల్ కోరినట్టుగా 10 ఏళ్ల వెసులుబాటు ఇస్తే నేషనల్ హెరాల్డ్ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి కోర్టుకు తెలిపారు. దీంతో ఇవాళ ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం10 ఏళ్లకు కాకుండా కేవలం మూడేళ్లు మాత్రమే ఎన్వోసీని జారీ చేసింది.
లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దది: రేవంత్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. “రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు తెగనమ్మారు. ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైంది. ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహరంలో కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీ పాల్పడింది. ఇందులో కేసీఆర్, కేటీఆర్ లబ్దిదారులైతే.. సూత్రాధారులు, పాత్రధారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు.
జీవో 111పై టీపీసీసీ నిజనిర్ధారణ కమిటీ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన జీవో 111పై టీపీసీసీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి సూచన మేరకు వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం చేపట్టారు. కోదండరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రామ్మోహన్ రెడ్డి, జ్ఞానేశ్వర్, ఆర్థిక వేత్తలు లుబ్న శర్వాత్, జస్వీన్ జైరథ్ సభ్యులుగా ఉన్నారు. తొలి సమావేశాన్ని ఇవాళ గాంధీ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. 111 జీవో రద్దుతో జంట జలాశాలకు నష్టం కలుగుతుందని చెప్పారు. దీనిపై పర్యావరణ వేత్తలతో లోతైన సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సమగ్ర నివేదిక అందజేస్తామని వెల్లడించారు.
రాజ్యాంగానికి కేసీఆర్ అవమానం: బండి సంజయ్

సీఎం కేసీఆర్ ఎక్కడికీ వెళ్లడని, ప్రజలను కూడా కలవడని ఆయనో బంకింగ్ మాస్టర్ అంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. ‘ నీతి ఆయోగ్ సమావేశానికి రాడు, ప్రధాని కార్యక్రమానికి వెళ్లడు, రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కూ పోడు, రాజ్ భవన్ లో నిర్వహించే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కు వెళ్లడు, సదరన్ జోన్ మీటింగ్స్ కూ హాజరు కాడు, ప్రజలను కలేవడు. పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళతాడా.?’ అని అన్నారు. కేసీఆర్ తన చర్యలతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేసీఆర్ పదే పదే అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బస్ టికెట్‌తో పాటే ప్రయాణికులకు స్నాక్ బాక్స్

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్ తో పాటే ‘స్నాక్ బాక్స్’ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ e-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్ ప్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను అరెస్ట్ చేశామని, 85 లక్షల విలువైన 2.65 టన్నుల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు చెప్పారు. బాచూపల్లి, బాలానగర్, షాబాద్ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు సప్లై చేస్తుండగా ముఠాను పట్టుకున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుకుని నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. బీజీ 3, హెచ్ టీ పత్తి విత్తనాలను తెలంగాణలో బ్యాన్ చేశారని, వీటినే నిందితులు బ్రాండెడ్ సీడ్ పౌచ్ లలో ప్యాక్ చేసి అమ్మతున్నట్టు తెలిపారు. పట్టుబడ్డ నిందితులపై గతంలో కూడా కేసులున్నందున వారిపై పీడీ యాక్టు పెడతామని వెల్లడించారు.
చైనాలో కరోనా కొత్త వేరియంట్

చైనాలో మరోసారి కరోనా కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తోంది. జూన్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుని వారానికి 65 మిలియన్ల చొప్పున ఈ వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో డ్రాగన్ దేశం మరోసారి టీకాలపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం ఎక్స్‌బీబీ 1.9.1, ఎక్స్‌బీబీ 1.5, ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్లు అక్కడ తీవ్రంగా ఉన్నాయి. వీటిని అడ్డుకునే టీకాలకు తాజాగా చైనాలో అనుమతులు ఇచ్చినట్టు చైనా అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్షాన్ ఇటీవల ప్రకటించారు.
పాలీసెట్ ఫలితాలు విడుదల

టీఎస్ పాలిసెట్ ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ రోజు విడుదల చేశారు. మొత్తం 80,752 (82.7 శాతం) మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. ఇందులో 37,746 ( 86.63 శాతం) ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. అబ్బాయిలు 43,006మంది (78.63%) మంది అర్హత సాధించారు. కాగా, ఈనెల 17న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
బోనాల పండుగ తేదీలు ఖరారు

తెలంగాణలో బోనాల పండుగ తేదీలు ఖరారయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి(లస్కర్) బోనాలను జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. అదే నెల 16, 17 తేదీల్లో లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ నిర్వహిస్తారు. వచ్చే నెల 22న గోల్కొండ రేణుకా మాత ఉత్సవాలతో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఇవాళ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆషాడ బోనాలపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. పండుగ కోసం రూ. 15 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రులు చెప్పారు. ఈ ఏడాది బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.