డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ మంచి అవకాశం. ఇందులో విజయం సాధిస్తే త్రివిధ దళాల్లో ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు. తాజాగా సీడీఎస్ 2024కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్, ప్రిపరేషన్, కెరీర్ అవకాశాలు తెలుసుకుందాం..
దేశంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ల స్వప్నం సర్కారీ కొలువు. ఇందుకోసం లక్షల మంది ఏటా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. త్రివిధ దళాల్లోని నాలుగు విభాగాల్లో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష సీడీఎస్‌ఈ. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటిలో మొదటిది.. యూపీఎస్‌సీ నిర్వహించే సీడీఎస్ రాత పరీక్ష. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి.. మెరిట్ జాబితాలో నిలిస్తే.. మలి దశలో ఆయా దళాలకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌ల ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్: సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎస్‌ఎస్‌బీ ఎంపిక
రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు ఈ టెస్ట్ జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 300. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను ఖరారు చేస్తారు.
స్టేజ్–1లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే స్టేజ్–2కు అనుమతిస్తారు. స్టేజ్–1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్) టెస్ట్‌లు, స్టేజ్–2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ తర్వాత వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ),సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. చివరగా సెల్ఫ్ డిస్క్రిప్షిన్ టెస్ట్(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజులపాటు 9 రకాల గ్రూప్ టాస్క్‌లు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్‌లు పూర్తయ్యాక చివరగా.. బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా చివరగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సంపాధించుకున్న విద్యార్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
ట్రైనింగ్ .. స్టైపెండ్: అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారిని జెంటిల్‌మెన్ క్యాడెట్, లేడీ క్యాడెట్స్‌గా పిలుస్తారు. ఇలా శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. నిర్దేశిత వ్యవధిలో ఉండే శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్మనెంట్ కొలువు సొంతమవుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ(డెహ్రాడూన్)లో 18 నెలలు; నేవల్ అకాడమీలో సుమారు 17 నెలలు; ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్ హోదాలో కొలువు ఖాయం అవుతుంది. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్–లెఫ్ట్‌నెంట్ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.
సీడీఎస్ హోదాలు: సీడీఎస్ పరీక్షలో విజయం సాధించిన వారికి త్రివిధ దళాల్లో లభించే హోదాలు, పదోన్నతుల వివరాలు.. లెఫ్ట్‌నెంట్; కెప్టెన్; మేజర్; లెఫ్ట్‌నెంట్ కల్నల్; బ్రిగేడియర్; మేజర్ జనరల్; లెఫ్ట్‌నెంట్ జనరల్ హెచ్‌ఏజీ స్కేల్; ఆర్మీ కమొడోర్/లెఫ్ట్‌నెంట్ జనరల్.
ప్రిపరేషన్ ప్లాన్
సీడీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లీష్: ఇంగ్లీష్ విభాగం 120 ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ భాషపై పట్టును, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్టోజ్ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్: అభ్యర్థుల్లో సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహనని పరీక్షించే విభాగం.. జనరల్ నాలెడ్జ్. ఇది 100 మార్కులకు 120 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్–అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, ఫ్యాక్టరైజేషన్ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఖాళీలు: మొత్తం 459 ఖాళీల్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాదూన్- 100, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల- 32, ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్‌ఏ), హైదరాబాద్- 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్- 276, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్- 19 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.