HomeLATESTసైబర్‌ సెక్యూరిటీకి సూపర్​ కెరీర్​

సైబర్‌ సెక్యూరిటీకి సూపర్​ కెరీర్​

ప్రస్తుత డిజిటలైజేషన్​ కాలంలో సమాచార భద్రత కీలకంగా మారింది. దీంతో సైబర్​ మోసాలు తగ్గించడానికి సైబర్​ సెక్యూరిటీ రిక్రూట్​మెంట్​విపరీతంగా పెరిగింది. పెద్దపెద్ద సంస్థల ముఖ్యమైన డేటా కొల్లగొట్టడం నుంచి ఖాతాదారులకు తెలియకుండా వారి బ్యాంకుల్లోని డబ్బును కాజేయడం వరకూ..అన్నీ సైబర్‌ నేరగాళ్ల పనే. వీరి నుంచి రక్షణకోసం ఏర్పాటుచేసే భద్రతా వలయమే..సైబర్‌ సెక్యూరిటీ!! ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. సైబర్‌ సెక్యూరిటీ అంటే ఏమిటి.. దాని ప్రాధాన్యత.. కెరీర్‌ అవకాశాలు, కావాల్సిన అర్హతలు, స్కిల్స్ గురించి తెలుసుకుందాం..

డిజిటలైజేషన్​తో అవకాశాలు పెరిగాయ్​

డిజిటలైజేషన్‌ కారణంగా సంస్థలకు సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలైలో అమెరికా సహా 17 దేశాలపై రాన్సమ్‌వేర్‌తో సైబర్‌ దాడులు చేసి.. భారీగా డబ్బును డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులదే ప్రధాన పాత్ర. ఐఎస్సీ స్క్వేర్‌(ఇంటర్నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌ కన్సార్టియం) తాజా అధ్యయనం ప్రకారం–అనేక సంస్థలు వచ్చే ఏడాది భారీ సంఖ్యలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోనున్నాయని అంచనా. కంప్యూటర్‌ నెట్‌వర్క్, అప్లికేషన్‌లపై దాడులు చేసి.. విలువైన సమాచారాన్ని ఇతరులు తస్కరించకుండా రక్షించేదే.. సైబర్‌ సెక్యూరిటీ. సంస్థలు తమ డేటా.. హ్యాకర్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకోసం నెట్‌వర్క్‌ ఇంజనీర్లు, సెక్యూరిటీ ఇంజనీర్లు, ఇతర నిపుణులతో సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి.

అవేర్​నెస్​ ముఖ్యం

సాధారణ ఫైర్‌వాల్‌లు, యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌లతో పూర్తి స్థాయి సైబర్‌ భద్రత కష్టమే. అందుకే ప్రభుత్వ సంస్థలు, స్టార్టప్‌లు, భారీ, మధ్యతరహా కంపెనీలతోపాటు వ్యక్తిగత వినియోగానికీ సైబర్‌ సెక్యూరిటీ కీలంగా మారింది. దీని సహాయం లేకుండా సంస్థలు సురక్షితంగా నడపలేని పరిస్థితి ఏర్పడింది. సంస్థల్లో ఏ స్థాయిలోనైనా ఎప్పుడైనా సైబర్‌ అటాక్స్‌ జరిగే ప్రమాదం ఉంది. మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, ఫోన్‌ కాల్స్‌ ద్వారా డబ్బు, బహుమతుల ఆశచూపి.. లింక్‌లు క్లిక్‌ చేయాలంటూ.. ఫిషింగ్‌ చేసే ఆస్కారముంది. కాబట్టి సైబర్‌ అటాక్స్‌ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి. చాలామంది తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనే అపోహతో సులభంగా సైబర్‌ వలలో చిక్కుకుంటున్నారు. అందుకే మన డిజిటల్‌ పరికరాలు, నెట్‌వర్క్‌ను సురక్షితంగా ఉంచడానికి సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సేవలను సంస్థలు వినియోగించుకుంటున్నాయి.

బీటెక్​ స్టూడెంట్స్​కు చాన్స్​

సైబర్‌ సెక్యూరిటీపై ఆసక్తి కలిగి, కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఫైర్‌వాల్స్, వివిధ ఎండ్‌ పాయింట్‌ సెక్యూరిటీపై పరిజ్ఞానం ఉన్నవారు ఇంట్రడక్షన్, అడ్వాన్స్‌డ్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌–మొబైల్‌ ప్లాట్‌ఫాం, నెట్‌వర్క్స్‌ తదితర కోర్సుల్లో రాణిస్తారు. సీ++, జావా, నోడ్, పైథాన్, రూబీ వంటి ప్రోగ్రామింగ్‌ భాషలపై పట్టు ఉంటే.. అదనపు ప్రయోజనం చేకూరుతుంది. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన సర్టిఫికేషన్‌లతో కెరీర్‌ అవకాశాలకు మెరుగుపరచుకోవచ్చు.

స్కిల్స్ పెంచుకోవాల్సిందే..

విస్తృత అవకాశాలకు వేదికైన సైబర్‌ సెక్యూరిటీ కెరీర్‌లో ప్రవేశించే అభ్యర్థులు.. ఆయా కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. హ్యాకింగ్‌పై అవగాహన, హ్యాకర్‌లా ఆలోచించే పరిజ్ఞానం ఉండాలి. సమస్య–పరిష్కార నైపుణ్యాలు, టెక్నికల్‌ అప్టిట్యూడ్, వివిధ ప్లాట్‌ఫాంలలో భద్రతపై పరిజ్ఞానం, ప్రాథమిక కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ నైపుణ్యాలు ఉండాలి. నేర్చుకోవాలనే అభిలాష, ఆత్మవిశ్వాసం, చొరవ, ఒత్తిడిలోనూ సమర్థంగా పనిచేసే సామర్థ్యాలు తప్పనిసరి.

ఫుల్​ డిమాండ్​


డిజిటల్‌ వ్యవస్థలో సైబర్‌ సెక్యూరిటీకి ఏర్పడిన డిమాండ్‌ కారణంగా ఈ విభాగంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి. సైబర్‌ అటాక్స్‌ నుంచి రక్షించుకునేందుకు సంస్థలకు అధిక సంఖ్యలో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దీంతో ఐటీ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ/ప్రైవేటు రంగ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. ప్రధానంగా సంస్థలు ఫైర్‌వాల్‌ల నుంచి రౌటర్‌లు, వీపీఎన్‌ల వరకూ.. సంస్థ నెట్‌వర్క్‌ భద్రతను నిర్వహించడానికి నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజనీర్‌లను నియమించుకుంటున్నాయి. క్లౌడ్‌–ఆధారిత ప్లాట్‌ఫాంల భద్రతకు క్లౌడ్‌ సెక్యూరిటీ ఇంజనీర్‌తోపాటు అప్లికేషన్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఐడెంటిటీ అండ్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజనీర్, సైబర్‌ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌లుగా అవకాశాలు అందుకోవచ్చు. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌లను చట్టబద్ధంగా హ్యాక్‌ చేసే పెనెట్రేషన్‌ టెస్టర్‌గా కూడా పనిచేయొచ్చు. సైబర్‌ సెక్యూరిటీలో నిపుణులైనవారు ప్రారంభంలోనే ఆరు లక్షల రూపాయల వార్షిక వేతనాలను పొందొచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!