Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ ఎఫైర్స్ తెలంగాణ (మార్చి 2020)

కరెంట్ ఎఫైర్స్ తెలంగాణ (మార్చి 2020)

Current Affairs Telangana

తెలంగాణ

హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు

హైదరాబాద్‌లో తొలి కోవిడ్ 19 కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన 24 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్టు గాంధీ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఒక్కో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైందని మార్చి 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా కట్టడికి రూ.100కోట్లు

కొవిడ్–19 వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కారు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 3న వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3 వేల బెడ్లను అందుబాటులో ఉంచారు.

సీసీఎంబీ కరోనా పరీక్ష

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ)లో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతించింది. కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడిచే ఈ బయోసేఫ్టి లెవల్‌–3 ప్రయోగశాలలో రోజుకు 1000 పరీక్షలు నిర్వహించే సామర్థ్యముంది. సీసీఎంబీని 1977లో స్థాపించారు.

వింగ్స్ ఇండియా

పౌర విమానయానశాఖ, ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి(ఫిక్కి) సంయుక్తంగా మార్చి 12 నుంచి నాలుగురోజుల పాటు హైదరాబాద్‌లో ‘వింగ్స్ ఇండియా’ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహించారు. ‘ఫ్లైయింగ్ ఫర్ ఆల్’ అనే థీమ్‌తో బేగంపేట ఎయిర్‌‌పోర్టులో వీటిని నిర్వహించారు. నూతన పాలసీల రూపకల్పన కోసం 6 దేశాల ప్రతినిధులు వ్యాపార అంశాలపై సమావేశం నిర్వహించారు. 20 దేశాలకు చెందిన 110 మంది ఎగ్జిబిటర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.

యువికాలో శివానిశ్రీ

ఇస్రో నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం)లో భాగంగా దేశవ్యాప్తంగా 368 మంది విద్యార్థులను ఎంపికచేయగా వీరిలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి జిల్లాపరిషత్ హైస్కూల్‌కు చెందిన చిప్పా శివానిశ్రీ ఉన్నారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్‌పై శిక్షణ అందించేందుకు 2019 నుంచి 9 తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. వీరికి మే 11 నుంచి 22 వరకు అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురంలో శిక్షణ ఇస్తారు.

నూతన రైతు బజార్లు

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 16 రైతుబజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44 రైతు బజార్లు ఉండగా కొత్తగా నిర్మించబోయే వాటికి రూ.18.53 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి 30 రైతుబజార్లు ఉండగా ప్రభుత్వం మరో 30 మంజూరు చేసింది. వీటిలో 16 ప్రారంభంకాకపోవడంతో ప్రస్తుతం 44 ఉన్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం రైతుబజారు మాత్రమే పురపాలక సంఘం పరిధిలో ఉండగా మిగిలినవన్నీ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలే నిర్వహిస్తున్నాయి.

కుసుమ నూనెకు లైసెన్స్

వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్పత్తి చేసే కుసుమ నూనెను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ మంజూరు చేసింది. ఈ నూనె అన్నిరకాల ప్రమాణాలను కలిగి ఉన్నట్లు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ధ్రువీకరించింది.

ఉత్తమ రాష్ట్రం తెలంగాణ

కేంద్రప్రభుత్వం, ఎయిర్‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కిలు సంయుక్తంగా అందించిన ‘ఏరోస్పేస్ అవార్డు’లలో ఏరోస్పేస్ రంగంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఉత్తమ విమానాశ్రయాలుగా బెంగళూరు, ఛండీగఢ్‌లు నిలిచాయి. ఉత్తమ దేశీయ ఎయిర్‌‌లైన్స్‌లుగా విస్తారా, వెంచురా సంస్థలు దక్కించుకున్నాయి. సుస్థిర ఏవియేషన్, పర్యావరణహిత పురస్కారాన్ని జీఎంఆర్ గ్రూపుకి లభించింది.

ఇంటికే రూ.5 భోజనం

హైదరాబాద్‌లో రూ.5 భోజనం ప్రారంభించి 6ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘అన్నపూర్ణ మొబైల్ క్యాంటిన్లు’ ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఈ స్కీం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు హాట్ బాక్సుల ద్వారా ఇంటికే రూ. 5భోజనం అందించనున్నారు.

పీవీ.స్మారక మ్యూజియం

మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు పుట్టి పెరిగిన ఇంటిని మ్యూజియంగా మార్చాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలోని ఇంటిలో పీవీ అమితంగా ఇష్టపడే మహాత్ముడి విగ్రహం, ఆయన ఉపయోగించిన కుర్చి, టీవీ, ఇతర వస్తువులు, ప్రధాన మంత్రిగా అందుకున్న జ్ఞాపికలు ప్రదర్శనకు పెట్టనున్నారు. జూన్ 28న పీవీ శతజయంతి రోజు మ్యూజియం ప్రారంభించనున్నారు.

టెస్కాబ్ నూతన ఛైర్మన్

తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్(టెస్కాబ్) ఛైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు నియమితులయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాకు చెందిన ఈయన గజసింగవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా, కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికై తద్వారా టెస్కాబ్ ఛైర్మన్‌గా నియమించబడ్డారు.

కొత్త ఎన్నికల ప్రధాన అధికారి

రాష్ట్ర నూతన ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక గోయల్ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈయన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇప్పటివరకు కొనసాగిన రజత్‌కుమార్ స్థానంలో ఈ నియామకం జరిగింది.

విశిష్ట మహిళా పురస్కారాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో రాణిస్తున్న 30 మహిళలకు ‘రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలను’ ప్రకటించింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన గల కమిటీ వీరిని ఎంపిక చేసింది. వీరిలో సోషల్ మీడియా సంచలనం గంగవ్వ, గాయని మంగ్లీ, ఒగ్గుకథ కళాకారిణి మల్లారి, పైలట్ సయ్యద్ సల్వా ఫాతిమా, ఇండస్ట్రియలిస్టు మన్నె ఉషారాణి, డ్యాన్సర్ నీరజాదేవి, రచయిత్రులు అయినంపూడి శ్రీలక్ష్మి, సూర్య ధనుంజయ, పెయింటర్ లక్ష్మిరెడ్డి, హక్కుల కార్యకర్త సరిత, క్రీడాకారిణి గోలి శ్యామల, మహిళా రైతు బేగరి లక్ష్మమ్మ, సైంటిస్టు మంజుల, స్టాఫ్ నర్సు పవార్ అనిత, ఏఎన్‌ఎం శారద, ఆశా కార్యకర్త కవిత, జర్నలిస్టు నిర్మల, అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి, డాక్టర్ అంజనీదేవితో పాటు ఇతరులు ఎంపికయ్యారు.

రాష్ట్ర బడ్జెట్ 2020–21

సంక్షేమానికి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.లక్షా 82 వేల 914 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కంటే ఇది 27.6శాతం అధికం. ప్రస్తుతం రూ.లక్ష కోట్లు రాష్ట్ర ఆదాయం ఉండగా వచ్చే ఏడాది అది రూ.1.43 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. వ్యవసాయానికి రూ.24,116 కోట్లు కేటాయించగా, ఆసరా పెన్షన్లకు రూ.11,758 కోట్లు కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్‌కు రూ. 10 వేల కోట్లు, ఆర్టీసీకి రూ. వేయి కోట్లు కేటాయించింది. పెన్షన్ లబ్ధిదారుల వయసును వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని పేర్కొంది.
మొత్తం బడ్జెట్ – 1,82,914 కోట్లు
నిర్వహణ వ్యయం – 78,301 కోట్లు
పథకాల వ్యయం – 1,04,612 కోట్లు
రెవెన్యూ మిగులు – 4,482 కోట్లు
ద్రవ్యలోటు – 33,191 కోట్లు

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!