శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు అవార్డులు
ఇంధన పొదుపు, సామర్థ్యాల పెంపుతో పాటు పర్యావరణ హితమైన చర్యలను పాటిస్తున్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెండు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘నేషనల్ ఎనర్జీ లీడర్’ అవార్డుతో పాటు ‘ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డు లభించాయి.
ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి:
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి నియమితులయ్యారు. పదవి విరమణ చేసిన నాగిరెడ్డి స్థానంలో సెప్టెంబర్ 8న నియమితులైన పార్థసారథి మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 1988లో విజయనగరం ఆర్డీవోగా పని చేసిన ఆయన 1993లో ఐఏఎస్ హోదా సాధించారు. రైతు బంధు పథకం అమలులో కీలకపాత్ర పోషించి 2018 జూన్‌లో స్కోచ్ అవార్డు అందుకున్నారు.
జయ ప్రకాశ్‌రెడ్డి:
తెలుగు సినిమా రంగంలో విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన జయప్రకాశ్‌రెడ్డి సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. నాటకరంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించిన జయప్రకాశ్‌రెడ్డి 300కి పైగా చిత్రాల్లో నటించారు. నాటకరంగంలో నాలుగుసార్లు నంది అవార్డు, జయం మనదేరా చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు.
కాళోజి అవార్డు –2020
తెలంగాణ ప్రజాకవి, కాళోజి నారాయణరావు పేరుతో అందిస్తున్న స్మారక అవార్డు 2020కి గాను ‘రమా చంద్రమౌళి’ దక్కింది. వరంగల్ జిల్లాకు చెందిన చంద్రమౌళి కాల నాళిక, దీపశిఖ, స్మృతిదార, అంతర్దహనం, అంతర, అసంపూర్ణ అనే రచనలు చేశారు. ఈయన కాలనాళిక నవల తెలంగాణ ఉద్యమ పరిణామాన్ని ఆవిష్కరించిన నవలగా పేరు పొందింది. 2015 నుంచి అందజేస్తున్న కాళోజి అవార్డు నగదు విలువ రూ.1,00,116.
ప్రాజెక్టులకు కొత్త పేర్లు:
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బస్వాపూర్ రిజర్వాయర్ పేరును నృసింహసాగర్గా మారుస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు ఘణపూర్ ఆనకట్ట పేరును వనదుర్గ ప్రాజెక్టుగా మార్చారు.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ:
గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని సెప్టెంబర్ 7న ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 55,067 అంగన్వాడీ కేంద్రాల్లోని 30.16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.
తామ్ర శాసనాలు లభ్యం:
ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలంలోని పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠంలో సెప్టెంబర్ 15న వెండి నాణేలు, తామ్రశాసనాలు లభ్యమయ్యాయి. 1800 సంవత్సర కాలంటి నాటివిగా భావిస్తున్న తామ్రశాసనాలపై నాగరి, కన్నడలిపి ఉంది. శివలింగాన్ని రాజు మొక్కుతున్నట్లు, నంది, గోవు చిత్రాలు వాటిపై ఉన్నాయి.
తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం:
తెలంగాణ ప్రభుత్వం, వీఆర్వో వ్యవస్థను తొలగిస్తూ, రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ రూపొందించిన నూతన రెవెన్యూ బిల్లును సెప్టెంబర్ 9న శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఎటువంటి సవరణలు లేకుండా సెప్టెంబర్ 11న శాససభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఉత్తమ నగరంగా హైదరాబాద్:
2020 జనవరి నుంచి జూన్ వరకు దేశంలోని 34 నగరాలలో హలిడిఫై డాట్ కామ్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ ఎంపికైంది. సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలు, సౌకర్యాలు, నివాసవసతి, ఉపాధి అవకాశాలు, రక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. హైదరాబాద్ తరువాత ముంబయి, పూణే, చెన్నై, బెంగళూరులు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇటీవల ప్రముఖ ప్రాపర్టి సంస్థ జేఎల్ఎల్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ ‘డైనమిక్ సిటీ’గా ఎంపికవగా బెంగళూరు(2), చెన్నై(5), ఢిల్లీ(6), పూణె(12), కోల్‌కత(16), ముంబయి(20) ప్రపంచ స్థాయి ర్యాంకులు పొందాయి.
వైఎస్ఆర్ జలసిరి:
రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు ఏర్పాటు చేసే వైఎస్ఆర్ జలసిరి పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం రాయలసీమలోని 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల రైతుల కోసం ప్రవేశపెట్టిన ‘ఎన్టిఆర్ జలసిరి’ని ఆధునికీకరిస్తూ ప్రవేశపెడుతున్నారు. హైడ్రలాజికల్, జియో ఫిజికల్ సర్వే ఆధారంగా బోర్లు వేస్తారు.
తెలంగాణలో ఫ్లోరైడ్ విముక్తి:
తెలంగాణ ఫ్లోరైడ్ నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు సెప్టెంబర్ 18న కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి గిరిష్ బాలచంద్ర బాపట్ లోక్‌సభలో ప్రకటించారు. 1937లో నల్గొండ జిల్లా బట్లపల్లి గ్రామంలో తొలిసారిగా ఫ్లోరైడ్ గుర్తించారు. 1985లో జరిపిన సర్వేలో ఇక్కడి భూగర్భజలాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 28 పీపీయం(పార్ట్సే పర్ మిలియన్) ఉన్నట్లు గుర్తించారు.
ఫైటర్ హెలికాప్టర్లో తెలుగు మహిళ:
భారత నౌకాదలంలో యుద్ధ హెలికాప్టర్ ఎంహెచ్60ఆర్/సేహక్ రోమియోలో ఎయిర్ బోర్న్ టెక్నిషియన్స్‌గా తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన రితీసింగ్, ఘజియాబాద్‌కు చెందిన కుముదిని త్యాగి ఉన్నారు. వీరిద్దరు కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2018లో నావిలో చేరారు.
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |
నేషనల్
ఇంగ్లిష్ ప్రో యాప్
ఇంగ్లిష్ భాషను సులభంగా నేర్చుకునేందుకు యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (యూఎస్‌ఆర్)లో భాగంగా ఇంగ్లిష్ అండ్ ఫారేన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఇంగ్లిష్ ప్రో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లిష్ భాష పై ఆసక్తి ఉన్న వాళ్లు భాషను త్వరగా నేర్చుకునేందుకు ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందించారు.
స్టార్టప్ చాలెంజ్ చునౌతి
కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘చునౌతి ’ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని ద్వారా 300 స్టార్టప్‌లను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.25 లక్షల వరకు నిధుల సాయంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. చునౌతి కార్యక్రమం కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.95 కోట్లు ఖర్చు చేయనుంది.
ఎఫ్‌డీఐలపై నివేదిక:
దేశంలో 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి ఆరునెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 1,71,558.77 కోట్లు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. అత్యధిక పెట్టుబడులు పొందిన రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర(30.35 శాతం), కర్ణాటక(17.92 శాతం), ఢిల్లీ(16.6 శాతం) నిలిచాయి. రూ. 4,865.19 కోట్లతో తెలంగాణ 8వ ర్యాంకు పొందగా ఏపీ రూ. 1,475.99 కోట్లతో పదో ర్యాంకులో నిలిచింది.
సులభతర వాణిజ్య సూచీ–2019:
సులభతర వాణిజ్య సూచీ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)–2019లో ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. 2015 నుంచి ప్రకటిస్తున్న ఈ ర్యాంకులలో తొలి ఏడాది రెండో స్థానంలో నిలిచిన ఏపీ, ఆ తరువాత వరుసగా మూడేళ్లుగా తొలిస్థానం పొందుతోంది.
ఆపరేషన్ గ్రీన్స్
టమాట, ఉల్లి, బంగాలదుంప రైతులకు నిలకడైన ధరలు అందించేందుకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆపరేషన్ గ్రీన్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని జమ్మూకశ్మీర్‌లో రాబోయే ఆరు నెలలపాటు అన్ని పంటలకు వర్తింపజేస్తున్నట్లు సెప్టెంబర్ 7న కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ రైతులకు రవాణా ఖర్చు, నిల్వ ఖర్చు, ధరలు తగ్గుతూ నష్టం వస్తే.. అందులో 50 శాతం వరకు సబ్సిడీ రూపంలో రైతులకు చెల్లిస్తుంది.
ఎన్ఎస్వో అక్షరాస్యత నివేదిక:
నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్వో) 2017 జులై–2018 జులై గణాంకాల ఆధారంగా నిర్వహించిన అక్షరాస్యత సర్వేను ‘హౌజ్ హోల్డ్ సోషల్ కన్జ్యుమ్సన్: ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఆస్ పార్ట్ ఆఫ్ 75 రైండ్ ఆప్ నేషనల్ శాంపిల్ సర్వే‘ పేరుతో ప్రచురించింది. ఇందులో కేరళ(96.2 శాతం), ఢిల్లీ(88.7 శాతం), ఉత్తరాఖండ్(87.6 శాతం), హిమాచల్ ప్రదేశ్(86.6 శాతం) అత్యుత్తమ అక్షరాస్యత రేటును నమోదు చేయగా.. ఏపీ(66.4 శాతం), తెలంగాణ (72.8 శాతం) నమోదు చేశాయి. భారత్‌లో అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉంది.
హెచ్ఎస్టీడీవీ ప్రయోగం:
క్షిపణుల రూపకల్పనలో నూతన పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా ‘హైపర్సోనిక్ టెక్నాలజీ డోమోనిసట్రేషన్ వెహికిల్’ను సెప్టెంబర్ 7న డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. ప్రస్తుత క్షిపణుల రూపకల్పనలో రామ్‌జెట్ టెక్నాలజీ వాడటం వలన ధ్వని వేగం కన్నా 3 రేట్లు ఎక్కువ(3 మ్యాక్) వేగాన్ని మాత్రమే పొందగలుగుతున్నారు. కానీ సెప్టెంబర్ 7న ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేసిన ప్రయోగంలో స్రోకమ్జెట్ టెక్నాలజీని ఉపయోగించి 6 మ్యాక్‌ల(ధ్వని వేగం కన్నా 6 రేట్లు) వేగాన్ని పొందారు. ఈ ప్రయోగ ఫలితాలను రాడార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, టెలిమెట్రి కేంద్రాలు ద్వారా పరీక్షించి వెల్లడించారు.
కిరణ్ హెల్ప్‌లైన్:
కొవిడ్–19 కాలంలో, ఇతర పరిస్థితుల్లో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కౌనసిలింగ్ కోసం 1800–500–0019 నంబర్‌తో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ హెల్ప్‌లైన్ ప్రారంభించారు. దీన్ని దివ్యాంగుల సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత శాఖలు సంయుక్తంగా అభివృద్ధిపరిచాయి.
అంకుర వ్యవస్థల వాతావరణంపై నివేదిక:
దేశంలో స్టార్టప్స్ స్థాపించడానికి తగిన వాతావరణం, ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న ప్రోత్సాహకాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రి అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ‘స్టేట్స్ ఆన్ సపోర్ట్ టు స్టార్టప్ ఎకోసిస్టమ్ 2019’ పేరుతో నివేదిక రూపొందించింది. ఇందులో ఎక్స్, వై కేటగిరీలు ఉండగా.. ఎక్స్ కేటగిరీలో గుజరాత్, వై కేటగిరీలో అండమాన్ నికోబార్ తొలి స్థానాల్లో నిలిచాయి.
ప్రాచీన భారత సంస్కృతి అధ్యయనంపై కమిటీ
పన్నెండు వేల సంవత్సరాల నుంచి భారత సంస్కృతి పరిణామాలపై అధ్యయనం కోసం 16 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. దీనికి భారత ఆర్కియాలజి సొసైటీ చైర్మన్ కేఎన్ దక్షిత నేతృత్వం వహిస్తున్నారు.
స్వామి అగ్నివేష్ కన్నుమూత:
ప్రముఖ సంస్కర్త, ఆర్యసమాజ నాయకుడు, బాలకార్మిక వ్యతిరేక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ సెప్టెంబర్ 11న మరణించారు. ఏపీలోని శ్రీకాకుళంలో జన్మించిన ఆయన అసలు పేరు వేపా శ్యామ్‌రావు. హర్యాన అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన అగ్నివేష్ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి(1972)గా వ్యవహరించారు.1981లో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ‘బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్’ స్థాపించి ఉద్యమించారు.2004లో రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన అవార్డు, ప్రత్యామ్నాయ నోబెల్‌గా పరిగణించే ‘రైట్లైవ్లిహుడ్ అవార్డు’ పొందారు.
జమ్మూకశ్మీర్ స్టూడెంట్స్‌కు స్కాలర్షిప్స్ పెంపు:
కేంద్రం pragati, saksham పథకాలలో భాగంగా జమ్మూకశ్మీర్ స్టూడెంట్స్‌కు ఏటా ఇస్తున్న రూ.5 వేల స్కాలర్షిప్ ను రూ.50 వేలకు పెంచింది. పెంచిన స్కాలర్షిప్ 2020–21 అకడమిక్ ఇయర్ నుంచే వర్తిస్తుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యనభ్యసిస్తున్న వారు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు.
ఒడిశాలో గరిమా పథకం:
పారిశుద్ధ్య కార్మికుల కోసం సెప్టెంబర్ 11న ఒడిశా ప్రభుత్వం ప్రారంభించిన పథకమే గరిమా. మహాత్మా గాంధీకి అంకితం చేసిన ఈ పథకాన్ని114 పట్టణ స్థానిక సంస్థల్లో గృహ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖలతో అమలు చేస్తారు. వ్యయం రూ.50 కోట్లు. ఈ పథకంతో పారిశుద్ధ్య కార్మికులు పని సమయం 6 గంటలకు తగ్గడంతోపాటు ఆరోగ్య బీమా, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరుస్తారు. దాదాపు 20 వేల మంది కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
మై ఫ్యామిలీ, మై రెస్పాన్సిబులిటీ:
కొవిడ్–19ను అరికట్టడంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి, వారు సామాజిక బాధ్యతలను నిర్వహించే విధంగా ఉద్యుక్తులను చేయడానికి సెప్టెంబర్ 15న ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ మై ఫ్యామిలీ, మైరెస్పాన్సిబులిటీ ప్రచార కార్యక్రమం చేపట్టింది.
లాంగ్ మార్చ్–11HYZ ప్రయోగం
చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ తొమ్మిది ఉపగ్రహాలతో కూడిన ‘లాంగ్ మార్చ్–11HYZ’ రాకెట్‌ను సెప్టెంబర్ 15న విజయవంతంగా పరీక్షించింది. ఎల్లో సముద్రంలోని ఓడ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌లోని తొమ్మిది ఉపగ్రహాలను ‘జిలిన్–1 గాఫెన్ 03–1 గ్రూప్’ గా వ్యవహరిస్తారు. ఇవన్నీ భూ పరిశీలక ఉపగ్రహాలు. వ్యవసాయం, అడవులు, పర్యావరణ పరిరక్షణ రంగాలలో రిమోట్ సెన్సింగ్ సేవలు అందించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. వీటిలో 6 ఉపగ్రహాలు భూమికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు చిత్రించగా, మిగిలిని 3 ఉపగ్రహాలు వీడియోలు తీశాయి.
కనీస మద్దతు ధర పెంపు:
ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు 2021–22 వ్యవసాయ సంవత్సరం రబీసీజన్‌కు సంబంధించి వివిధ పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్ర కెబినెట్ వ్యవహారాల కమిటి సెప్టెంబర్ 21 ఆమోదించింది. గోదుమ–1975, బార్లి–1600, సన్‌ప్లవర్–5327, కంది–5100, ఆవాలు–4650గా నిర్ణయించారు. 2018–19 బడ్జెట్లో రైతుల కనీస మద్దతు ధరను1.5 రెట్లు పెంచాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి అన్నదాన ఆయుసంరక్షణ్ అభియాన్‌లో భాగంగా ధరల పెంపు జరిగింది.
Voices of Dissent:
ప్రముఖ చరిత్రకారణి రోమిల్లా థాఫర్ రచించిన పుస్తకం Voices of Dissent ను 2020 అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ సందర్భంగా జరిగిన ఆందోళనలను ఉదహరిస్తూ రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
హర్షకుమార్ భన్వాల్ కమిటి:
సోషల్ ఆడిట్, సోషల్ ఎఫెక్ట్ అంశాలు ఎన్జీవోలకు, ఇతర సంస్థలకు ఏ విధంగా ఉండాలనే దానిపై సూచనలు చేయడానికి నాబార్డు మాజీ చైర్మన్ హర్షకుమార్ భన్వాల్ ఆధ్వర్యంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఒక సాంకేతిక గ్రూపును ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సరైన సూచనలతో కూడిన ఫ్రేమ్ వర్క్ రూపొందించి వెలువరిస్తుంది.
విరాట్ తొలగింపు:
మూడు దశాబ్దాలపాటు భారత నౌకాదళంలో సేవలందించిన ఐఎన్‌ఎస్ విరాట్‌ను తొలగించి విచ్చిన్నం చేయనున్నారు. సెప్టెంబర్ 19న ముంబయిలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ వద్ద వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అనంతరం ముంబయి నావిల్ డాక్‌యార్డు నుంచి గుజరాత్‌లోని అలంగ్ రేవు వద్దకు సాగనంపారు. 1986లో బ్రిటన్‌లోని ‘ఎంఎంఎస్ హెర్మెస్’ నౌకను భారత్ కొనుగోలు చేసి 1987 మే 12న ‘ఐఎన్‌ఎస్ విరాట్’గా భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు.
ఫ్రైట్ సేవ:
దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సరకుల రవాణాకు సంబంధించి సరైన సేవలను ప్రోత్సహిస్తూ మరింత మంది వినియోగదారులను ఆకర్షించడం కోసం ‘ఫ్రైట్ సేవ’ మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా సరుకుల రైళ్ల సమాచారం, పథకాలు, ధరలకు సంబంధించి వివరాలు పొందవచ్చు.
అభ్యాస్ విజయవంతం:
వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించే క్రమంలో ఆ క్షిపణులకు లక్ష్యంగా ఉపయోగపడే గగనతల డ్రోన్లాంటి వాహనమే అభ్యాస్. దీనినే హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏవియల్ టార్గెట్ అని కూడా వ్యవహరిస్తారు. దీనిని ఒడిశాలోని చాందిపూర్ టెస్ట్ రేంజ్ నుంచి సెప్టెంబర్ 22న విజయవంతంగా పరీక్షించారు. లక్ష్యను ఆదునికీకరించడం ద్వారా డీఆర్డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ)లు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |
ఇంటర్నేషనల్
జీతాల సగటులో భారత్‌కు 72వ స్థానం
ఇంటర్నేషనల్ ఈ -కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్ ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. 106 దేశాల్లో సగటు నెలవారీ జీతాలు, వేతనాలు ఎలా ఉన్నాయన్న దానిపై సర్వే చేపట్టగా స్విట్జర్లాండ్ రూ.4.49 లక్షల (5,989 యూఎస్ డాలర్లు) సగటు జీతంతో మొదటి స్థానం సంపాదించింది. ఇందులో భారత్ 72వ స్థానంలో నిలిచింది.
సింగపూర్ ప్రతిపక్షనేతగా ఇండియన్
సింగపూర్ ప్రతిపక్ష నేతగా ఎంపికైన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ప్రీతం సింగ్ నిలిచారు. 2020 జులై 10న 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ 83 స్థానాలు దక్కించుకుని అధికారం దక్కించుకోగా ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ 10 స్థానాలు గెలుపొంది ప్రతిపక్ష హోదా సాధించింది. ఆ పార్టీ నుంచి ప్రీతంసింగ్ ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు.
వరల్డ్ బిగ్గెస్ట్ సోలార్ ట్రీ
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ కేంద్రంగా గల సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లు సోలార్ పరికరాలతో ప్రపంచంలోని అతిపెద్ద వృక్ష ఆకృతిని రూపొందించింది. 7.5 లక్షలతో నిర్మించిన సోలార్ ట్రీ సామర్థ్యం 11.5 కిలో వాట్‌పీక్ . దీని ద్వారా సంవత్సరానికి 12,000–14,000 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఏటా 10–12 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఇది తగ్గిస్తుంది. సోలార్ ట్రీ కింది భాగం వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
జమ్మూలో సొరంగం గుర్తింపు
జమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు వెళుతున్న 170 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని బీఎస్‌ఎఫ్ బలగాలు కనుగొన్నాయి. ఈ సొరంగం దాదాపు 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3-4 అడుగుల వెడెల్పు ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలను రవాణా చేసేందుకు పాకిస్తాన్ దీనిని నిర్మించిందని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగ మార్గం ఉంది.
ఇంద్ర నావీ–2020
2003 నుంచి భారత్–రష్యాల మధ్య రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న నావీ విన్యాసాలు 2020 సెప్టెంబర్ 4– 5 వరకు బంగాళాఖాతంలోని మలక్క జలసంధికి సమీపంలో నిర్వహించారు. కోవిడ్–19 దృష్ట్యా ఇరు దేశాల అధికారులు దూరంగా ఉంటూ నిర్వహించారు. 2018 డిసెంబర్లో విశాఖపట్నంలో నిర్వహించారు. ఇరుదేశాల ఆయుధసంపత్తిని పరీక్షించుకోవడం, యుద్ధ వ్యూహాలను సమీక్షించుకోవడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.
జీ20 విద్యామంత్రుల సదస్సు:
జీ20 విద్యామంత్రుల సదస్సు సెప్టెంబర్ 5న సౌది అరేబియ నేతృత్వంలో వర్చువల్ పద్ధతిలో సెప్టెంబర్ 5న జరిగింది. దీనికి సౌదీఅరేబియా మంత్రి హమద్–అల్–అశిక్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ప్రధానంగా21వ శతాబ్దంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కొవిడ్–19 తో దెబ్బతిన్న విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడం అనే అంశంపై చర్చించింది. జీ20 1999లో ఏర్పాటయింది. జీ20 కూటమికి 2020లో సౌది అరేబియా అధ్యక్షత వహించింది.
12వ మెకాంగ్–గంగా సహకార సదస్సు
ఆరు దేశాల కూటమి అయిన మెకాంగ్–గంగా 12వ సహకార సదస్సు. సెప్టెంబర్4న వర్చువల్ పద్ధతిలో జరిగింది. ఆగ్నేయ ఆసియాలో ప్రవహించే మెకాంగ్నది, భారత్‌లో ప్రవహించే గంగానది నుంచి ఈ కూటమికి మెకాంగ్–గంగా అని పేరు వచ్చింది.2000 సంవత్సరంలో ఏర్పడ్డ కూటమి 12వ సదస్సులో పర్యాటకం, సంస్కృతి, విద్య, రవాణా కమ్యూనికేషన్ అంశాలపై చర్చించారు. ఈ కూటమిలో భారత్, కాంబోడియా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నంలకు సభ్యత్వం ఉంది.
జపాన్‌లో కొత్త ప్రభుత్వం
అనారోగ్య కారణాలతో వైదొలగిన జపాన్ ప్రధాని షింజోఅబె స్థానంలో సెప్టెంబర్ 16న ఆ దేశ పార్లమెంట్ కొత్త ప్రధానిగా యోషిహిదే సుగాను ఎన్నుకుంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన షింజో అబె 2006–07, 2012–2020 సెప్టెంబర్ 16 వరకు ప్రధానిగా కొనసాగారు. జపాన్ చరిత్రలో అతిచిన్న వయసులో(52) ప్రధానిగా, అత్యధిక రోజులు(7 సంవత్సరాల 266 రోజులు) ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా ఆయన రికార్డు సాధించారు.
యుఎన్ మహిళా కమిషన్‌లో భారత్:
యూఎన్ మహిళా కమిషన్‌లో 2021–25 కాలానికి సభ్యదేశాలుగా భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లు సెప్టెంబర్ 14న ఎంపికయ్యాయి. ఆసియా–పసిఫిక్‌లో రెండు స్థానాలకు ఇండియా, ఆఫ్ఘనిస్థాన్, చైనాలు పోటీపడగా ఇండియా 38 , ఆఫ్ఘనిస్థాన్ 39 ఓట్లతో ఎంపిక కాగా చైనా సగం ఓట్లు కూడా పొందలేకపోయింది. దీన్ని యూఎన్వోలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ప్రకటించారు. ఈ కమిషన్ 54 సభ్యదేశాలు గల యూఎన్వో ఆర్థిక సామాజిక మండలిలో ఒక భాగం. ఇటీవల భారత్ కెన్యా, ఐర్లాండ్, మెక్సికో, నార్వేలతో కలిసి 2021–22 కాలానికి గాను యుఎన్వో భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎంపికైంది.
27వ (ASEAN) ప్రాంతీయ సదస్సు:
ఆగ్నేయ ఆసియా దేశాలు(ASEAN) ప్రాంతీయ సదస్సు సెప్టెంబర్ 12న ఆన్‌లైన్ వేదికగా నిర్వహించారు. దీనికి వియాత్నం అధ్యక్షత వహించింది. దీనికి భారత ప్రతినిధిగా విదేశీవ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీదరన్ హాజరయ్యారు. సముద్ర చట్టాలు, ఉగ్రవాదం, జలవివాదాలు, కోరాన మహమ్మారి లాంటి అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. 1967 ఆగస్టు 8న ఏర్పడ్డ ASEAN లో సభ్యదేశాలు 10.
మాలి నూతన అధ్యక్షుడి ఎన్నిక:
మాలి నూతన అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ‘బాంగ్ నడావ్’, ఉపాధ్యక్షుడిగా కల్నల్ అస్సిమి గోయిటా నియమితులయ్యారు. వీరు సెప్టెంబర్ 25న బాధ్యతలు స్వీకరించారు. 2020 ఆగస్టు 19న రాజీనామా చేసిన ఆ దేశ అధ్యక్షుడు ‘ఇబ్రహీం బేబాకర్ కీటా స్థానంలో కొత్త నియామకం జరిగింది. 17 మంది సభ్యులు గల సైనికాధికారుల కూటిమి ఆధ్వర్యంలో నియామకం చేపట్టారు.
ప్రధాని మోడీకి ఐజీ నోబుల్ అవార్డు:
1991 నుంచి ‘అనల్స్ ఆఫ్ ఇంప్రాబబుల్ రీసెర్చ్’ అనే పత్రిక ఏటా అందిస్తున్న ‘ఐజీ’ నోబుల్ 2020కి గాను భారత ప్రధాని నరేంద్రమోడీకి లభించింది. వాజ్‌పేయి(1998) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత ప్రధాని మోడి. శాంతియుత అవసరాల కోసం అణ్వస్త్ర కార్యక్రమాలు నిర్వహించినందుకు వాజ్‌పేయి అవార్డు పొందగా, కొవిడ్–19 కట్టడి కోసం(వైద్యరంగం) చేసిన కృషికి గాను మోడీకి అవార్డు లభించింది.
ఎంసీపీ లింజ్:
సెప్టెంబర్ 21న భారత–మాల్దివుల మధ్య తొలిసారిగా ప్రవేశపెట్టిన కార్గో ఫెర్రి సర్వీస్ ఎంసీపీ లింజ్. దీనిని భారత నౌకాయాన శాఖ మంత్రి మన్సుక్ మాండవియ(స్వతంత్ర),మాల్దివుల రవాణా మంత్రి ఐషత్ నహులా సంయుక్తంగా ప్రవేశపెట్టారు. ఇది భారత రేవులైన ట్యుటికొరిన్, కకొచ్చిలను మాల్దివుల రేవులైన మాలే కుల్హుద్హౌపుషిలను అనుసంధానిస్తుంది.
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |
స్పోర్ట్స్
చెస్ ఒలింపియాడ్‌లో తొలి స్వర్ణం
96 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ తొలి స్వర్ణం అందుకుంది. ఆగస్టు 30న ముగిసిన ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా జట్లను అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) సంయుక్త విజేతలుగా ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగా రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేసి రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.
బెల్జియన్ గ్రాండ్ ప్రీ –2020
ఆగస్ట్ 30న జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రీ 2020 ఫార్మూలా వన్ టోర్నీలో మెర్సిడెజ్ డ్రైవర్ లెవిస్ హామిల్డన్ చాంపియన్ గా నిలిచాడు. 2020 సీజన్‌లో జరిగిన ఏడు రేసుల్లో ఇది ఐదో విజయం. ఓవరాల్‌గా 89వ గ్రాండ్ ప్రీ విజయం. లెవిస్ హామిల్డన్ 2008 ,14,15, 17,18,19 సంవత్సరాల్లో డ్రైవర్ చాంపియన్ షిప్ సాధించాడు. ఈ టోర్నీలో మెర్సిడేజ్‌కు చెందిన వాల్బెరి బొట్టాస్ రెండో స్థానంలో నిలువగా మాక్స్ వెర్స్ టాపిన్ మూడో స్థానంలో నిలిచాడు.
ఇటాలియన్ గ్రాండ్ ప్రి–2020
ఇటాలియన్ గ్రాండ్ ప్రి–2020 ఫార్ములావన్ పోటీల విజేతగా అల్ఫాతౌరి డ్రైవర్ పెరిగస్లీ విజయం సాధించాడు. కార్లిస్ సైంజ్(మెక్లారెన్), లాన్స్స్ర్టోల్(రేసింగ్ పాయింట్)లు వరుసగా తరువాత స్థానాల్లో నిలిచారు. 2020లో జరిగిన ఫార్ములావన్ పోటీల్లో 5 విజయాలు సాధించిన లెవిన్హమిల్టన్(మెర్సిడెజ్) ఈ టోర్నీలో 7వ స్థానం పొందాడు.
ఐపీఎల్ షెడ్యూల్:
ఇండియన్ ప్రిమియర్ లీగ్–2020 షెడ్యూల్‌ను బీసీసీఐ సెప్టెంబర్ 6న విడుదల చేసింది. లీగ్ దశ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు జరగనున్నాయి. 8 జట్టులు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రారంభమ్యాచ్ సెప్టెంబర్ 19న ముంబయ్–చెన్నైల మధ్య జరగనుంది. ఈ టోర్నీకి దుబాయి(24 మ్యాచ్‌లు), అబుదాబి(20 మ్యాచ్‌లు), పార్జా(12 మ్యాచ్‌లు) ఆతిథ్యమిస్తున్నాయి.
మోఫరా ప్రపంచ రికార్డు:
మోఫరాగా పిలువబడే బ్రిటన్ మారథాన్ రన్నర్ మహ్మద్ ముక్తార్ జమా ఫరా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన వానే డేమ్ డైమండ్ లీగ్ సిరిస్‌లో ఒక గంట రేసులో 21.33 కిలోమీటర్లు పరిగెత్తాడు. మోఫరా 2008 బీజింగ్, 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించాడు.
యూఎస్ ఓపెన్ టెన్నిస్–2020
యూఎస్ ఓపెన్ టెన్నిస్–2020 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగింది. 1881లో ప్రారంభమైన యూఎస్ ఓపెన్‌కు ఇది 140వ ఎడిషన్. పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. యూఎస్ ఓపెన్ నెగ్గిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెందిన నవోమి ఓసాకా బెలారస్ కు చెందిన విక్టోరియా అజరెంకాపై విజయం సాధించింది. నవోమి 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2018, 2020లలో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌లో లారా సిగ్మండ్(జర్మనీ), జ్వెరొనొవీ(రష్యా) జోడి గెలుపొందగా పురుషుల డబుల్స్‌లో ఎం పావిక్(క్రొయేషియా), బ్రూవ్ సాయేర్స్(బ్రెజిల్) జోడి గెలుపొందింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి నెం 1
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో బ్యాట్స్ మన్ లలో టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచాయడు. ఆ తర్వాత రోహిత్(భారత్), బాబర్(పాక్), వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్) నెంబర్ వన్ గా ఉండగా, బుమ్రా ( ఇండియా) రెండో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్లలో నబీ(అఫ్ఘనిస్థాన్) అగ్రస్థానం దక్కించుకోగా, జడేజా(ఇండియా) 8వ స్థానంలో ఉన్నాడు.
టస్కన్ గ్రాండ్‌ప్రి–2020
టస్కన్ గ్రాండ్‌ప్రి–2020 విజేతగా మెర్సిడెజ్ డ్రైవర్ లెవిస్ హమిల్టన్ విజేతగా నిలిచాడు. ఇది ఓవరాల్‌గా హమిల్టన్ కు 90వ టైటిల్. హమిల్టన్ 2008, 14, 15, 17, 18, 19లలో డ్రైవర్ చాంఫియన్‌షిప్ సాధించాడు. అత్యధికంగా 91 టైటిళ్లు, 7 డ్రైవర్ చాంపియన్‌షిప్‌లు సాధించిన రికార్డు మైకేల్ ఫూమేకర్(జర్మనీ) పేరుపై ఉంది.
అరుణ్ జైట్లి క్రీడా ప్రాంగణం:
దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి పేరుతో బహుళ ప్రయోజనకర క్రీడా ప్రాంగణానికి సెప్టెంబర్ 12న జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి జితేంద్ర సింగ్ శంకు స్థాపన చేశారు. దీన్ని జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గల హిరానిలో ఏర్పాటు చేస్తున్నారు. వ్యయం రూ. 58.23 కోట్లు. దీన్ని ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్నారు.
హల్ ఆఫ్ ఫేమ్‌లో ‘9’:
ఒకప్పటి లెజండరి క్రీడాకారులకు గౌరవ హోదా కల్పించే వేదిక టెన్నిస్ ‘హల్ ఆఫ్ ఫేమ్’లో 9 మందికి ఉమ్మడిగా చోటు దక్కింది. మహిళలకు ప్రైజ్ మని తక్కువ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడిన 9 మందిని కలిపి తొలిసారిగా ఒక బృందంగా చోటు కల్పించారు. వీరిలో బిల్లీ జాన్ కింగ్, పీచెస్ బర్త్ కోవిచ్, రోసి కాసల్స్, జూడి డాల్టన్, జూడి హెల్డ్మాన్, కెర్రీ మెల్విల్ రీడ్, క్రిస్టీజియన్, నాన్సీరిచి, వాలెరి బీజెనేఫస్లు ఉన్నారు.
ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్–2020
రోమ్ మాస్టర్స్/ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్ని 2020 సెప్టెంబర్ 14 నుంచి 21 వరకు ఇటలిలోని రోమ్ వేదికగా నిర్వహించనున్నారు. అర్జెంటీనాకు చెందిన డిగో ప్వ్కార్జ్నున్ను ఓడించడం ద్వారా నోవాక్(జకోవిచ్(సెర్బియ) పురుషుల సింగిల్స్ విజేతగా నిలవగా, కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్)ను ఓడించడం ద్వారా సియోనా హలెప్(రొమేనియ) మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో మార్వెల్ గ్రానోల్లర్స్(స్పేయిన్) హరాసియో జెబలోస్(అర్జెంటినా) జోడి విజేతగా నిలువగా, మహిళల డబుల్స్‌లో హె–సు–వెయ్(తైవాన్), బార్బారా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్) జోడి విజేతలుగా నిలిచారు.
ఏఎఫ్సీ టాస్క్ ఫోర్స్‌లో ముంగాలి:
ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్సీ) టాస్క్‌పోర్స్‌లో సభ్యుడిగా భారత్‌కు చెందిన కల్నల్ డా. గిరిజా ముంగాలి నియమితులయ్యారు. ఏడుగురు సభ్యుల ఏఎఫ్‌సీలో స్థానం పొందిన ఏకైక భారతీయుడు గిరిజా ముంగాలి. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కు చెందిన క్లబ్ లైసెన్సింగ్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న ముంగాలి 2023 వరకు ఈ పదవిలో ఉంటారు. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో ఫుట్‌బాల్ క్లబ్‌లను క్రమబద్ధీకరించడం ఈ టాస్క్ ఫోర్స్ లక్ష్యం.
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |
వార్తల్లో వ్యక్తులు
ప్రణబ్ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్య సమస్యలతో ఆగస్ట్ 31న మృతిచెందారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు కరోనా కూడా సోకడంతో 21 రోజుల పాటు మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. 1966లో బంగ్లాదేశ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్ కాంగ్రెస్ పార్టీ మూడు తరాల నాయకులతో కలిసి పనిచేశారు. వివిధ శాఖల్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012–2017 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన తన రాజకీయ అనుభవాలను ‘ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ ’ అనే పుస్తకంలో పొందుపరిచారు. 1997లో ఉత్తమ పార్లమెంటీరియన్‌గా, 2008లో పద్మవిభూషన్, 2019లో భారత రత్న అవార్డులు అందుకున్నారు.
రాజీవ్‌కుమార్
భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ నియమితులయ్యారు. 1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి అయిన రాజీవ్ కుమార్ 2025 వరకు విధుల్లో కొనసాగనున్నారు.
హేమంత్ ఖత్రి
హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నేవీ రిటైర్డ్ ఆఫీసర్ కమొడోర్ హేమంత్ ఖత్రి సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు స్థానంలో ఖత్రి నియామకమయ్యారు. 2017లో షిప్‌యార్డ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఖత్రి ఐఎన్‌ఎస్ సింధూవీర్, ఐఎన్‌ఎస్ అస్త్రధరణి సబ్‌మెరైన్‌ల మరమ్మతులలో కీలక పాత్ర పోషించారు.
చారు సిన్హా
1996 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సెక్టార్ సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో ప్రారంభమైన శ్రీనగర్ సెక్టార్ సీఆర్‌పీఎఫ్ కు తొలి మహిళా ఆఫీసర్‌గా చారు సిన్హా నేతృత్వం వహిస్తున్నారు.
అవీక్ సర్కార్
ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్(75) ఎన్నికయ్యారు. పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ ఎడిటర్ విజయ్‌కుమార్ చోప్రా స్థానంలో అవీక్ సర్కార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సర్కార్.. టెలిగ్రాఫ్, ఆనంద్ బజార్ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించిన అవీక్ సర్కార్ కు ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక పత్రికలు ఉన్నాయి. ఆయనకు పెంగ్విన్ ఇండియాకు ఫౌండింగ్ ఎండీగా, బిజినెస్ స్టాండర్డ్‌కు ఫౌండింగ్ ఎడిటర్‌గానూ వ్యవహరించిన అనుభవం ఉంది.
జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్:
2014 జులై 7 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా కొనసాగుతున్న రోహింటన్ ఫాలి నారీమన్. 2011–13 వరకు భారత సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. ఇటీవల పదవీ విరమణ పొందిన అరుణ మిశ్రా స్థానంలో సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ(ఎస్సీఎల్ఎస్సీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
డేవిడ్ అటెన్‌బరో:
2019కి గాను ఇందిరా గాంధి శాంతి బహుమతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెప్టెంబర్ 7న బ్రిటిష్ పర్యావరణ వేత్త డేవిడ్ అటెన్‌బరోకు అందజేశారు. ఇందిరా గాంధి శాంతి, నిరాయుదికరణ అవార్డు అని కూడా పిలువబడే ఈ అవార్డును 1986 నుంచి ఇస్తున్నారు. అవార్డు విలువ రూ.25 లక్షలు.
కేశవానంద భారతి మరణం:
కేరళలోని ఎడనీర్ మఠాధిపతి కేశానంద భారతి సెప్టెంబర్ 6న మరణించారు. ప్రాథమిక హక్కుల విషయంలో కేశవానంద భారతి కేసు భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక మైలు రాయి. కేరళలోని కాసర్‌ఘడ్ జిల్లాలో గల ఎడనీర్ మఠానికి చెందిన భూములపై భూ సంస్కరణల చట్టం–1969, 1971 ప్రకారం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే వాటిని కోర్టులు సమీక్షించే వీలు లేకుండా9వ షెడ్యూల్లో చేర్చారు. తీంతో రాజ్యాంగంలోని మతస్వేచ్ఛను అందించే ఆర్టికల్ 26కు భూ సంస్కరణల చట్టం వ్యతిరేకమన్న వాదనను సుప్రీంకోర్టు స్వీకరించింది. 13 మంది సభ్యుల ధర్మాసనం కేసును విచారించి 1973 ఏప్రిల్ 24న 7–6 తేడాతో తీర్పు వెలువరించింది. పార్లమెంట్‌కు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదని ఈ కేసు ద్వారా వెల్లడైంది.
హరివంశ్ నారాయణ సింగ్:
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు. తొలిసారి 2018 ఆగస్టు 8న ఎన్నికైన హరివంశ్‌సింగ్ 2020 సెప్టెంబర్ 14న తిరిగి ఎన్నికయ్యారు. ఈయనకు పోటీగా ప్రతిపక్షాలు రాష్ట్రీయ జనతాదల్ కు చెందిన మనోజ్ ఝాను బరిలోకి దింపాయి. కాగా రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్‌గా ఎస్వీ కృష్ణమూర్తి రావు(1152–1962) వ్యవహరించారు.
చైతన్య తమ్హనే
మరాఠి దర్శకుడైన చైతన్య తమ్హనే ‘ ది డిసిపల్’ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో వెనిస్ అంతర్జాతీయ పురస్కారం పొందాడు. 2001లో మిరా నాయర్(మాన్ సూన్ వెడ్డింగ్) తరువాత యూరోపియన్ అవార్డు పొందిన రెండో భారత వ్యక్తి చైతన్య తమ్హనే.
ఆదిత్య పూరి:
హెచ్డీఎఫ్సీ(హౌజింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్) ఎండీ, సీఈవో ఆదిత్య పూరి బ్యాంకింగ్ రంగంలో అందించిన సేవలకు గాను ప్రముఖ ఆర్థిక మ్యాగజైన్ యూరోమని అందించే జీవిత సాఫల్య పురస్కారం (2020) పొందాడు. 1992లో అవార్డు స్థాపించినప్పటి నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత కార్పొరేట్ రంగ ప్రముఖుడు ఆదిత్యపూరి.
పరేష్ రావల్:
ప్రముఖ బాలివుడ్ నటుడు పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు నూతన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో పదవికాలం పూర్తయిన రతన్ తియాన్ స్థానంలో సెప్టెంబర్ 10న రాష్ట్రపతి నియమించారు. పరేష్ రావల్ నసీబ్ ని బలిహరి అనే గుజరాతి చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1994లో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు, 2014లో పద్మశ్రీ అవార్డు పొందారు.
కపిల్ వాత్సాయన్:
భారతీయ శాస్త్రీయ నృత్య పండితులు, కళావిధ్వాంసులు, పరిశోధకురాలు కపిల్ వాత్సాయన్ సెప్టెంబర్ 16న మరణించారు. 1987లో స్థాపించిన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌కు వ్యవస్థాపక డైరెక్టర్. 2006లో రాజ్యసభకు ఎన్నికై లాభదాయక పదవుల వివాదంలో రాజీనామా చేసి 2007లో తిరిగి ఎన్నికయ్యారు.
రూల్బాడర్ గిన్సేబర్గ్:
మహిళల హక్కుల ఉద్యమకర్త, సుప్రీంకోర్టు అనుబంధ న్యాయమూర్తి రూల్బాడర్ గిన్సేబర్గ్ సెప్టెంబర్ 18న మరణించారు.. 1993 నుంచి 2020 వరకు సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్‌గా వ్యవహరించారు.
అనిల్ దస్మానా:
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్ఐ) నూతన చీఫ్‌గా అనిల్ దస్మానా నియమితులయ్యారు. రీసెర్చ్ అనాలసిస్ వింగ్ మాజీ అధిపతి అయిన అనిల్ దస్మానా సతీష్ చంద్ర జే స్థానంలో బాధ్యతులు చేపట్టారు. ఈయన1981 బ్యాచ్‌కు చెందిన మధ్యప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి. న్యూఢిల్లీ కేంద్రంగా గల ఎన్టీఆర్ఐ జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో పని చేస్తుంది.
ఉదిత సింఘాల్:
ఐక్యరాజ్య సమతి సుస్తిరాభివృద్ధి లక్ష్యాల ప్రచారంలో భాగంగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఎంపిక చేసే ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యువనేతల బృందంలో చోటు పొందిన భారతీయుడిగా ఉదిత్ సింఘాల్ నిలిచాయరు. గ్లాస్ టు శాండ్ సంస్థను స్థాపించి పర్యావరణానికి హానికలిగించే గాజు సిసాలను బయటపారవేయకూడదని ప్రచారం నిర్వహిస్తున్నాడు.
వ్యవసాయ బిల్లులకు ఆమోదం:
అన్నదాతలకు బహుళ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం రూపొందించిన రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల(సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరకుల (సవరణ) బిల్లులలో నిత్యావసర సరకుల బిల్లు సెప్టెంబర్ 17న ఆమోదించింది. రాజ్యసభ మూజువాణి ఓటుతో ఈ బిల్లులను సెప్టెంబర్ 20న ఆమోదించింది.
హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్–2020లో ఇండియా 116వ ర్యాంక్:
ప్రపంచ బ్యాంకు మానవ మూలధన సూచి–2020ని ‘ది హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 అప్డేట్: హ్యుమన్ క్యాపిటల్ ఇన్ ది టైమ్ ఆఫ్ కొవిడ్–19’ పేరుతో ప్రచురించింది. 174 దేశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. భారత్ 0.49 స్కోరుతో 116వ ర్యాంకు సాధించగా సింగపూర్(0.88), హాంకాంగ్ అండ్ చైనా(0.81), జపాన్(0.80) స్కోరుతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |