ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. ఇందులో సాధించే మార్కులే మెరిట్‌ను డిసైడ్ చేస్తాయి. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల్లో అడిగిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూస్తే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సాధారణంగా అందరు అనుకుంటున్నట్లుగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందనేది తప్పుడు అభిప్రాయం. టాపిక్ ప్రాధాన్యతను అనుసరించి అభ్యర్థులు 18 నెలల వరకు కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. గ్రూప్–1 ప్రిలిమినరీలో ప్రశ్నలు అడిగిన విధానం మొత్తం మారిపోయింది. దీని ప్రకారం చూస్తే వచ్చే పోటీ పరీక్షలన్నింటా ఇలాంటి మార్పులు ఉంటాయి. వచ్చే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లోనూ ప్రశ్నలు అడిగే విధానంలోనూ తప్పనిసరిగా మార్పులుంటాయి. వాటికి అనుగుణంగానే కరెంట్ అఫైర్స్‌పై అభ్యర్థులు దృష్టి పెట్టాలి.
1. కాంటెపరరీ ఇష్యూస్ : సమకాలీన అంశాలు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడా వ్యక్తులు సాధించిన విజయాలు, రాష్ట్రానికి చెందిన వ్యక్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉంటే వాటిని చదువుకోవాలి. రాష్ట్రానికి చెందిన వ్యక్తుai అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకుంటే గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, దాదా సాహేబ్ ఫాల్కే అవార్డులపై ఫోకస్ చేయాలి.
2. సబ్జెక్టు రిలేటేడ్ ఇష్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రవేశపెడుతున్న పథకాలు. వాస్తవంగా ఈ అంశం స్కీమ్ లేదా పథకాల కిందికి వస్తుంది. అన్ని ప్రభుత్వ పథకాలు చదవకుండా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన పథకాల మీద ఫోకస్ చేయాలి. రవాణాకు సంబంధించిన అంశం. రవాణా అంటే రోడ్డు, రైల్వే మొదలైనవి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా రోడ్డు రవాణా. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన జాతీయ హైవేలు దీని కిందికి వస్తాయి.
3. నేషనల్ కరెంట్ అఫైర్స్ : సమకాలీన అంశాలతో కూడిన జాతీయ కరెంట్ అఫైర్స్. ఇందులో ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు. ఇక్కడ ముఖ్యమైన తేదీలు అంటే అన్ని తేదీలను చదవడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రకటించిన ముఖ్యమైన తేదీలు. ఇక్కడ పుస్తకాలు, రచయితలు అంటే వివాదస్పదమైన పుస్తకాలు, జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నవి. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధాన మంత్రులు రాసినవి.
సబ్జెక్టుతో ముడిపడి ఉన్న సమకాలీన అంశాల్లో భాగంగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన తడి భూములు. కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 వరకు తడి భూములను గుర్తించింది. అంటే ఈ అంశం పర్యావరణ సబ్జెక్టు కిందికి వస్తుంది. జాతీయ ఎన్నికల కమిషన్ అధికారాలు, విధులు చదువుకోవాలి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక బలమైన స్టేట్మెంట్ ఎన్నికల కమిషన్‌పై చేసింది. ఈ అంశం గవర్నెన్స్ సబ్జెక్టు కిందికి వస్తుంది లేదా భారత రాజ్యాంగంలోని రాజ్యాంగబద్ద సంస్థల కిందికి వస్తుంది.
4. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ : సమకాలీన అంశాలతో కూడిన వాటికి ఉదాహరణగా ఫిపా వరల్డ్ కప్. ఫుట్ బాల్‌కు సంబంధించినవి. నోబెల్ ప్రైజెస్, వివిధ దేశాలకు కొత్తగా వచ్చిన ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, వివాదస్పదమైన వ్యక్తులు మొదలైనవి. అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో వచ్చే వివిధ సంస్థల బ్యాక్ గ్రౌండ్ కూడా చదువుకోవాలి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆర్థిక ఫోరం. అంతర్జాతీయ స్థాయిలో జరిగే సదస్సులు. ఉదాహరణకు జి–20, సార్క్, ఆసియాన్, ఐ2యూ2
5. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు : అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ముఖ్యమైన చాప్టర్ పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, మయన్మార్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తో ఇండియా రిలేషన్స్. మరో ముఖ్యమైన చాప్టర్..అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశ సంబంధాలు. ఉదాహరణకు యూఎస్ఏ, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీతో ఉండే రిలేషన్స్.