Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్ అక్టోబర్​ 2021

కరెంట్​ అఫైర్స్ అక్టోబర్​ 2021

అంతర్జాతీయం

జపాన్ ప్రధానిగా ఫ్యుమియో కిషిడా
జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా ఫ్యుమియో కిషిడా ఎన్నికయ్యారు. దేశంలో అధికారంలో ఉన్న లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి కిషిడా మరో మంత్రి తారో కోనోపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.

భద్రతామండలిలో భారత్​కు చోటివ్వాలి
ప్రపంచ శాంతికి కృషి చేస్తోన్న భారత్​కు ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్​తో పాటు మరికొన్ని దేశాలను ఇందులో చేర్చడానికి తమ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు.

కశ్మీర్​లో సొరంగాల నిర్మాణం
శ్రీనగర్​ నుంచి ల​డ్డాఖ్​ వరకు చలికాలంలో మంచు కారణంగా ఏడు నెలలు రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో చైనా, పాకిస్థాన్​తో సరిహద్దులు పంచుకునే లడ్డాఖ్​లో పొరుగుదేశాల వ్యూహాత్మక ఎత్తుగడలు నిలువరించడానికి జోజిలా, జడ్​మోర్​ సొరంగ మార్గాలు పూర్తికానున్నాయి.

నోబెల్​ అవార్డ్స్​
నోబెల్​ జ్యూరీ వివిధ రంగాల్లో అవార్డులు ప్రకటించింది. వైద్యశాస్త్రంలో డా. డేవిడ్‌ జూలియస్, డా. ఆర్డెమ్‌ పాటపౌటియన్‌కు ఉమ్మడిగా అందించగా, కెమిస్ట్రీలో బెంజమిన్‌ లిస్ట్, డేవిడ్‌ వి.సి. మెక్‌మిల్లన్‌లకు, ఫిజిక్స్​లో స్యూకోరో మనాబే, క్లాస్‌ హాసెల్‌మాన్‌, జియోర్గియో పరిసీ, నోబెల్‌ శాంతి పురస్కారం జర్నలిస్టులు మరియా రెసా(ఫిలప్పీన్స్‌), దిమిత్రి మురాటోవ్‌(రష్యా)లకు అందజేశారు.

పండోరా పేపర్స్​ లీక్​
ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్‌’ పేరిట ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది.

అంతరిక్షంలో సినిమా షూటింగ్​
తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్‌ జరగనుంది. ఛాలెంజ్​ సినిమా కోసం రష్యా నటి యులియా పెరెసిల్డ్‌, సినిమా డైరెక్టర్‌ క్లిమ్‌ షిపెంకో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. కజకిస్తాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్‌ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు.

షార్​లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
మహిళలకు అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆమె ప్రారంభించారు.

Advertisement

తాలిబన్ల మన్యూర్​ ఆర్మీ
అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ సంస్థ కొత్తగా ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది. లష్కర్‌-ఎ-మన్సూరి (మన్సూర్‌ ఆర్మీ)గా దానికి పేరు పెట్టారు. అఫ్గాన్‌ సరిహద్దుల్లోని తజికిస్థాన్, చైనా వెంబడి ఈ దళ సభ్యులు ఉంటారు.

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలు సూచించిన అమెరికా ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌ (65), జాషువా ఆంగ్రిస్ట్‌(61), గైడో ఇంబెన్స్‌(58)లకు 2021 ఏడాది ఆర్థిక నోబెల్‌ పురస్కారం లభించింది. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అవార్డ్​ ప్రకటించింది.

ఆహార భద్రతా సూచీలో 71వ ప్లేస్​
లండన్‌కు చెందిన ఎకనమిస్ట్‌ ఇంపాక్ట్‌ సంస్థ కోర్టెవా అగ్రిసైన్స్‌ సాయంతో రూపొందించిన గ్లోబల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ లో మొత్తం 113 దేశాల్లో 57.2 పాయింట్లతో భారత్​ 71వ స్థానంలో నిలిచింది. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజవనరులు వంటి అంశాల ఆధారంగా ఈ నివేదిక అంచనా వేసింది.

Advertisement

మానవ హక్కుల మండలికి భారత్‌
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లోని 18 కొత్త సభ్య దేశాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌ గెలుపొందింది. ఐరాస సర్వప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. మూడేళ్ల పాటు భారత్​ సభ్యత్వం కలిగి ఉంటుంది.

ఫేస్​బుక్​ పేరు మారింది
ఫేస్‌బుక్‌ కంపెనీ పేరు మారింంది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకుముందు ఫేస్‌బుక్‌ కంపెనీ కింద కొనసాగిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద ఉంటాయి.

‘ఎక్స్‌’ జెండర్‌ పాస్‌పోర్ట్​
పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) వర్గం పౌరులకు అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్‌’ జెండర్‌ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. అయితే, ‘ఎక్స్‌’ జెండర్‌ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు.

Advertisement

రాచరికం వద్దన్న యువరాణి
జపాన్‌ యువరాణి మాకో(ప్రిన్సెస్‌ మాకో ఆఫ్‌ అకిషినో) ప్రేమించిన వ్యక్తి కోసం రాచరిక హోదాని వదులుకొని సామాన్యురాలిగా మారిపోయింది. ప్రేమికుడు కీ కొమురొని పెళ్లాడింది. వారిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జపాన్‌ రాజభవనం అధికారులు విడుదల చేశారు.

ఆస్కార్‌ బరిలో ఇండియన్​ సినిమా
2022 ఏడాది ఆస్కార్‌ అవార్డుల విదేశీ విభాగంలో భారత్‌ తరఫున తమిళ చిత్రం ‘కూళాంగల్‌’ ఎంపికైంది. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్‌ శివన్, హీరోయిన్‌ నయనతార ‘రౌడీ పిక్చర్స్‌’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రంప్​ ‘ట్రూత్‌ సోషల్‌’ మీడియా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త సోషల్​ మీడియాను ప్రారంభించనున్నారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఆధ్వర్యంలో ‘ట్రూత్‌ సోషల్‌’ అనే సామాజిక మాధ్యమ వేదికను త్వరలోనే ప్రారంభిస్తానని ట్రంప్‌ తెలిపారు.

Advertisement

వాతావరణ పెట్టుబడుల్లో అమెరికా టాప్​
గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న జాబితాలో భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం 48 బిలియన్‌ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్‌ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్‌ డాలర్లతో స్వీడన్‌ మూడో స్థానంలో నిలిచాయి.

సూడాన్​లో సైన్యం తిరుగుబాటు
ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్‌ని అదుపులోకి తీసుకున్న సైన్యం.. దేశంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ప్రధాని హర్దోక్‌ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్‌ అబ్దుల్‌ ఫతా అల్‌–బుర్హాన్‌ తెలిపాడు.

జాతీయం

మరో ఐదేళ్లు మధ్యాహ్న భోజనం
కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్​’ గా మార్చింది. మరో ఐదేళ్ల పాటు ఈ పథకం కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది.

Advertisement

పర్యాటక శాఖ నిధి 2.0 పోర్టల్​
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘నిధి 2.0’ ( ద నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పోర్టల్‌ను కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించింది. ఇందులో పర్యాటక రంగానికి సంబంధించిన అన్ని వివరాలు రూపొందించామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

టాటా సన్స్​ చేతికి ఎయిర్​ ఇండియా
దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ గెలుచుకుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

బాల్యవివాహాల్లో కర్నాటక టాప్​
దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) రిపోర్టులో తెలిపింది. 2020 ఏడాదిలో కర్నాటకలో 185 బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్‌ నిలిచాయి.

Advertisement

విపత్తుల్లో స్పందనకు ‘ఆపద మిత్ర’
ఎలాంటి విపత్తు సంభవించినా తక్షణం స్పందించేలా పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో ‘ఆపద మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర మంత్రి అమిత్​ షా తెలిపారు.

అందరికీ హెల్త్​ ఐడీకార్డ్​
ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్​ లో భాగంగా ప్రతి పౌరుడికి డిజిటల్​ హెల్త్​ ఐడీ కార్డ్​ ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలో ఏ ప్రాంతంలో నివసించే పౌరులైనా ఈ కార్డుతో అత్యుత్తమ వైద్యసేవలు లభిస్తాయని పేర్కొన్నారు.

అతిపెద్ద జాతీయజెండా ఆవిష్కరణ
225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, వెయ్యి కిలోల భారీ చేనేత మువ్వన్నెల పతాకాన్ని లడ్డాఖ్‌లోని లెహ్‌లో భారత సైన్యం ఆవిష్కరించింది. గాంధీ జయంతి, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లను పురస్కరించుకొని లెహ్‌ గారిసన్‌లో అతిపెద్ద చేనేత జాతీయ జెండా ఆవిష్కరించారు.

Advertisement

పంటల వృద్ధి రేటులో త్రిపుర టాప్​
పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధి రేటులో త్రిపుర రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 6.87 శాతం వృద్ధి రేటుతో త్రిపుర తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 6.59 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. సిక్కిం రెండో స్థానంలో ఉంది. పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణదే మొదటి స్థానం.

స్వదేశీ దర్శన్​లో బౌద్ధ సర్క్యూట్​
స్వదేశ్‌ దర్శన్‌ పథకంలో భాగంగా దేశంలో బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్‌ రాష్ట్రాలలో వీటి అభివృద్ధికి రూ.325.53 కోట్ల విలువైన అయిదు ప్రాజెక్టులు మంజూరు చేసింది.

ఆర్​బీఐ వడ్డీరేట్లు యథాతథం
ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. దీంతో రెపోరేటు 4 శాతంగా.. రివర్స్‌ రెపోరేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. ఇలా వడ్డీరేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి.

Advertisement

హంగర్​ ఇండెక్స్​లో భారత్​ 101వ స్థానం
2021 సంవత్సరానికి రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)లో 116 దేశాలకు 27.5 స్కోరుతో భారత్‌ 101వ స్థానంలో నిలిచింది. ఈ సూచీని ఐరిష్‌ ఎయిడ్‌ ఏజెన్సీ అయిన ‘కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌’, జర్మనీకి చెందిన ‘వెల్ట్‌ హంగర్‌ హిల్ఫే’ సంస్థ సంయుక్తంగా రూపొందించాయి.

‘పీఎం గతిశక్తి’ ప్లానింగ్​ ఆవిష్కరణ
దేశం మొత్తాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థలతో అనుసంధానించేందుకు రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన ‘పీఎం గతిశక్తి’ మాస్టర్‌ ప్లాన్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళిక పునాది అన్నారు.

భారత వృద్ధి 9.5%
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తాజాగా విడుదల చేసిన ప్రపంచవ్యాప్త వృద్ధి అంచనాల (డబ్ల్యూఈఓ) నివేదికలో పేర్కొంది. 2022లో 8.5 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.

Advertisement

వ్యాక్సిన్​లో కేరళ టాప్​
దేశంలో ఇప్పటివరకు 20.3 శాతం మందికి రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఎక్కువమందికి టీకా వేసిన రాష్ట్రాల్లో 36 శాతంతో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్‌(35.3 శాతం), న్యూఢిల్లీ(34 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

సైబర్‌ భద్రతపై అగ్రిమెంట్​
సైబర్‌ భద్రతపై వినియోగదారుల్లో అవగాహన పెంపొందించటానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీ డ్యాక్‌ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌)- హైదరాబాద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎయిర్​పోర్ట్స్​లో కృషి ఉడాన్‌ 2.0
వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరతో వేగంగా రవాణా చేయడానికి వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న 53 విమానాశ్రయాల్లో దశలవారీగా కృషి ఉడాన్‌ 2.0 పథకాన్ని అమలుచేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.

పెగాసస్​ విచారణకు కమిటీ
దేశంలో కొందరు విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

జమ్మూలో కలాం సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ
జమ్మూ, కశ్మీర్‌లోని సాంబ జిల్లాలో ఉన్న జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ)లో కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటు కానుంది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కేసీఎస్‌టీకు డీఆర్‌డీవో చీఫ్‌ సతీశ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.

మేఘాలయలో కొత్త నత్త జాతి
నత్తల్లో ఒక కొత్త జాతిని సైంటిస్టులు గుర్తించారు. ఈ జీవి పొడవు రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంది. మేఘాలయలోని తూర్పు ఖాసి హిల్స్‌ జిల్లాలో ఉన్న సున్నపురాయి గుహలో ఇది కనిపించింది. దీనికి ‘జియోరిస్సా మాస్మెయాన్సిస్‌’ అని పేరు పెట్టారు.

ప్రాంతీయం

బీఐఎస్‌ పాలకమండలిలో తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వంలో నాణ్యతా నియంత్రణ, ప్రమాణాలు చూసే మంత్రికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) పాలకమండలిలో స్థానం కల్పించారు. వచ్చే రెండేళ్ల కాలానికి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ధరణి ఉపసంఘం చైర్మన్​గా హరీష్​ రావు
ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

పచ్చదనానికి ‘హరితనిధి’
రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి చేపట్టిన హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్‌ఫండ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా కొంత మొత్తం ఈ ఫండ్‌కు జమ చేయాలని కోరారు.

హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్‌ రామచంద్రరావు పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ కాగా, ఆ స్థానంలో బాంబే హైకోర్టు నుంచి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ రానున్నారు.

సీజేగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ
తెలంగాణ హైకోర్ట్​ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ పేరును ప్రతిపాదిస్తూ కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను నియమించారు.

‘కుమురం భీం’ పోస్టల్‌ కవర్‌
జల్, జంగిల్, జమీన్‌ కోసం పోరాడిన గిరిజన యోధుడు కుమురం భీంకు గుర్తింపుగా తపాలా శాఖ ఆయన చిత్రాలతో ప్రత్యేక పోస్టల్‌ కవర్లను ముద్రించింది. కుమురం భీం మనవడు సోనేరావు పోస్టల్‌ కవర్లు విడుదల చేశారు.

సెన్సిటివ్​ జోన్​గా శ్రీశైలం టైగర్‌ రిజర్వ్​
నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వు చుట్టూ 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ రిజర్వు సరిహద్దు చుట్టూ 26 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని దీనికిందికి తీసుకొస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వార్తల్లో వ్యక్తులు

రౌధా బౌడెంట్​
ట్యునీసియా తొలి మహిళా ప్రధానిగా రౌధా బౌడెంట్ రమధానేను నియమిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కౌస్​ సాయిద్​ ప్రకటించారు. ఆమె ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్​ స్కూల్​లో ప్రొఫెసర్​గా పని చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక సంక్షోభాల నుంచి దేశాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

దేబబ్రత ముఖర్జీ
ఆడిట్​ బ్యూరో ఆఫ్​ సర్క్యూలేషన్స్​ (ఏబీసీ)కు 2021–22 ఏడాదికి యునైటెడ్ బ్రెవెరీస్​ లిమిటెడ్​ చీఫ్​ మార్కెటింగ్ ఆఫీసర్​ దేబబ్రత ముఖర్జీ అధ్యక్షుడిగా, సకాల్​ పేపర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​కు చెందిన ప్రతాప్​ జి.పవార్​ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

కమలా భాసిన్‌
ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కమలా భాసిన్‌(75) క్యాన్సర్​తో మరణించారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ మండి బహావుద్దీన్‌లో 1946, ఏప్రిల్‌ 24న జన్మించిన కమల, భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ప్రతీక్‌ విఠల్‌ మోహితే
ప్రపంచంలోనే అతి పొట్టి బాడీ బిల్డర్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో మహారాష్ట్రకు చెందిన ప్రతీక్‌ విఠల్‌ మోహితే చోటు సంపాదించారు. ఆయన ఎత్తు 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. ఖలాపుర్‌ తాలూకాలోని డోలవలిలో జన్మించిన ప్రతీక్, బాడీ బిల్డింగ్‌పై ఆసక్తితో ఇటీవల గిన్నిస్‌కు ఎక్కాడు.

అబ్దుల్‌రజాక్ గుర్నాహ్
సాహిత్యంలో నోబెల్ బహుమతిని టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌రజాక్ గుర్నాహ్ గెలుచుకున్నారు. సంస్కృతులు, ఖండాల మధ్య అగాధంలో శరణార్థుల స్థితిగతులు, వలసవాదం ప్రభావాలను రాజీ లేకుండా పరిశీలించినందుకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రజాక్​ను ఎంపిక చేసింది.

గండ్ర జ్యోతి
వరంగల్‌ జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతి లండన్‌లో నిర్వహించిన మారథాన్‌ పోటీల్లో పాల్గొన్నారు. 42 కి.మీ. దూరాన్ని 5 గంటల 15 నిమిషాల్లో అధిగమించింది. జ్యోతి గతంలో అమెరికా సహా పలుచోట్ల జరిగిన మారథాన్‌ పోటీల్లో పాల్గొన్నారు.

స్మితా దేవరాని
మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌(ఏడీజీ)గా మేజర్‌ జనరల్‌ స్మితా దేవరాని బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్‌ మిలటరీ హాస్పిటల్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ పూర్వ విద్యార్థిని అయిన దేవరాని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలు అయ్యారు.

బీసీ పట్నాయక్‌
ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బీసీ పట్నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు కౌన్సిల్‌ ఫర్‌ ఇన్సూరెన్స్‌ అంబుడ్స్‌మన్‌ (ముంబై)కు సెక్రటరీ జనరల్‌గా పట్నాయక్‌ పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌ఐసీకి ఒక చైర్మన్, నలుగురు ఎండీలు పనిచేస్తున్నారు.

అలెక్సీ నావల్నీ
రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీకి యురోపియన్‌ యూనియన్‌(ఈయూ) అత్యున్నత పురస్కారం లభించింది. మానవతావాది, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సఖరోవ్‌ పేరు మీద ఇస్తున్న మానవ హక్కుల పురస్కారాన్ని నావల్నీకి దక్కింది.

అమిత్‌ ఖరే
ప్రధానమంత్రి సలహాదారుడిగా అమిత్‌ ఖరే నియమితులయ్యారు. కార్యదర్శి హోదాలో పీఎంఓలో సలహాదారుడిగా కాంట్రాక్ట్​ ప్రాతిపదికన రెండేళ్ల కాలానికి ఆయన్ని నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు గ్లోబల్‌ బిజినెస్‌ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్‌ విభాగంలో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌ దక్కింది. భారతీయ అమెరికన్‌ అయిన ప్రహ్లాద్‌ గౌరవార్థం కార్పొరేట్‌ ఈకో ఫోరమ్‌ సంస్థ ఈ అవార్డు అందిస్తుంది.

కొలిన్‌ పావెల్‌
అమెరికా మాజీ జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కొలిన్‌ పావెల్‌(84) కొవిడ్​తో మరణించారు. అమెరికా ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పదవి చేపట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇషానీ షణ్ముగం
భారత సంతతికి చెందిన ఆరేళ్ల ఇషానీ షణ్ముగం అద్భుతమైన జ్ఞాపకశక్తితో రికార్డు సాధించింది. గణితంలోని ‘పై’ విలువలో ఎకాఎకి 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పి, ‘సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది.

పునీత్ రాజ్ కుమార్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. కర్ణాటక లెజండరీ యాక్టర్, కంఠీరవ రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతులకు 1975 మార్చి 17వ తేదీని జన్మించాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసి 2002లో అప్పు సినిమాతో పరిచయం అయి హీరోగా 29 సినిమాల్లో నటించారు.

శక్తికాంత దాస్​
ఆర్​బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 10తో ఆయన తొలి మూడేళ్ల పదవీకాలం ముగియనుంది.

నీరా టండన్‌
భారతీయ అమెరికన్‌ నీరా టండన్‌ (51) వైట్​హౌస్​ సిబ్బంది కార్యదర్శిగా నియమితులయ్యారు. కీలక నిర్ణయాల్లో భాగస్వామి కావడంతో పాటు అనేక విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సహకారం అందించడంలో సిబ్బంది కార్యదర్శి ముఖ్యపాత్ర పోషిస్తారు.

కేవీ కామత్‌
మౌలిక రంగ రుణాల కోసం కొత్తగా రూ.20,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) చైర్మన్​గా దిగ్గజ బ్యాంకర్‌ కేవీ కామత్‌ను ప్రభుత్వం నియమించింది.

నిఖత్‌ జరీన్‌
జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సత్తాచాటింది. హర్యాణాలో ముగిసిన చాంపియన్‌షిప్‌ 50 – 52 కేజీల విభాగంలో ఆమె గోల్డ్​ మెడల్​ సొంతం చేసుకుంది. ఫైనల్లో నిఖత్‌ 4 – 1 తేడాతో మీనాక్షి (హర్యాణా)పై విజయం సాధించింది.

క్రీడలు

సానియాకు డబుల్స్​ టైటిల్​
భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి ష్వై జాంగ్‌తో కలిసి విజేతగా నిలిచింది. తాజా విజయంతో సానియా తన కెరీర్‌లో 43వ డబుల్స్‌ టైటిల్‌ సాధించింది.

చాంపియన్​ హామిల్టన్​
రష్యా గ్రాండ్‌ ప్రి లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ చాంపియన్​గా నిలిచాడు. రష్యాలోని సోచిలో ప్రధాన రేసును హామిల్టన్‌ గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. దీంతో హామిల్టన్‌ తన కెరీర్‌లో 100వ రేసు విజయం అందుకున్నాడు.

ఆర్చరీలో సిల్వర్​ మెడల్స్​
అమెరికాలోని యాంక్టన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ మూడు రజత పతకాలు గెలుచుకుంది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ విభాగంలో, మహిళల టీమ్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.

షూటింగ్​లో సరికొత్త రికార్డ్​
పెరూ రాజధాని లిమాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ గోల్డ్​ మెడల్​ సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో 463.4 పాయింట్లతో రికార్డ్​ పాయింట్లతో విజేతగా నిలిచాడు.

బెంగళూర్​లో ప్రొ కబడ్డీ
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఎనిమిదో సీజన్‌ డిసెంబర్‌ 22 నుంచి కొవిడ్​ నేపథ్యంలో మ్యాచ్​లన్నీ బెంగళూర్​లో నిర్వహించనున్నారు. మ్యాచ్‌ చూసేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదని లీగ్‌ కమిషనర్, మశాల్‌ స్పోర్ట్స్‌ సీఈఓ అనుపమ్‌ గోస్వామి తెలిపారు.

ఐపీఎల్​ చాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​
ఐపీఎల్‌ 14వ సీజన్‌ విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలిచింది. ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై విజయం సాధించింది. తాజా విజయంతో చెన్నై జట్టు నాలుగోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఆరెంజ్‌ క్యాప్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, పర్పుల్‌ క్యాప్‌ హర్షల్‌ పటేల్‌ సొంతం చేసుకున్నారు.

థామస్​ కప్​ విజేత ఇండోనేసియా
థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఇండోనేసియా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో చైనా జట్టుపై గెలిచి 14వసారి థామస్‌ కప్‌ను సొంతం చేసుకుంది. ఉబెర్‌ కప్‌ మహిళల టీమ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చైనా 3–1తో జపాన్‌ను ఓడించి 15వసారి చాంపియన్‌గా నిలిచింది.

సునీల్‌ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన వారిలో భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే (బ్రెజిల్‌)ను అధిగమించాడు.

ఒలింపిక్స్​ విన్నర్స్​కు ఖేల్‌రత్న
దేశ అత్యున్నత క్రీడా అవార్డు అయిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న కోసం నీరజ్​ చోప్రా, మిథాలీరాజ్​తో సహా 11 మందిని సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించింది. అర్జున పురస్కారం కోసం 35 మంది ఆటగాళ్లను కమిటీ ఎంపిక చేసింది. 2020 కంటే ఈసారి అధికంగా ఎనిమిది మంది ఈ అవార్డు దక్కించుకోనున్నారు.

చాంపియన్​ వెర్​స్టాపెన్​
2021 ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఎనిమిదో విజయం సాధించాడు. అమెరికాలోని ఆస్టిన్‌లో జరిగిన యూఎస్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

అకాశ్​ ప్రైమ్​ సక్సెస్​
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని కొత్త వెర్షన్‌ ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ‘ఆకాశ్‌ ప్రైమ్‌’ మిస్సైల్​ ఆకాశంలోని లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్​డీవో తెలిపింది. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా జి.సతీశ్‌ రెడ్డి ఉన్నారు.

జిక్రోన్​ క్రూయిజ్​ మిస్సైల్​
రష్యా మొదటి సారిగా అణు జలాంతర్గామి నుంచి రెండు జిక్రోన్‌ క్రూయిజ్‌ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. బారెంట్స్‌ సముద్రంలోని మాక్‌ లక్ష్యాలను ఛేదించాయని రష్యా రక్షణశాఖ పేర్కొంది. రెండు క్షిపణుల్లో ఒకటి భూతలం, మరొకటి తెల్ల సముద్రం నీటిలో నుంచి పరీక్షించారు.

కె–9 వజ్ర శతఘ్ను
చైనా కవ్వింపు చర్యలతో భారత్‌ అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి డ్రాగన్‌ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్‌ సెక్టార్‌లోని ఫార్వర్డ్‌ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది.

మలబార్​ విన్యాసాలు
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి ఇండియన్​ నేవి బంగాళాఖాతంలో మలబార్‌ రెండో దశ విన్యాసాలు చేశాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ రన్‌విజయ్‌(డీ55), ఐఎన్‌ఎస్‌ సత్పుర (ఎఫ్‌ 48) నౌకలు ఇందులో పాల్గొన్నాయి.

భూమిని చుట్టిన చైనా మిస్సైల్​
అణ్వస్త్ర సామర్థ్యమున్న సరికొత్త హైపర్‌సోనిక్‌ క్షిపణిని చైనా పరీక్షించింది. ఇది దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ భూమి మొత్తాన్ని చుట్టేసింది. కొద్దిలో గురితప్పి నిర్దేశిత లక్ష్యానికి 32 కిలోమీటర్ల దూరంలో పడింది.

‘అభ్యాస్’ హీట్​ సక్సెస్​
అకాశంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగపడే ‘హై స్పీడ్‌ ఎక్సెపెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ మానవరహిత విమానానికి ‘అభ్యాస్‌’ అని పేరు పెట్టారు.

అగ్ని 5 మిస్సైల్​ విజయవంతం
అణ్వాయుధాలను మోసుకెళ్లే అగ్ని–5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా రాష్ట్రం బధ్రక్‌ జిల్లా తీరంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఐలాండ్‌లో అక్టోబర్‌ 27న ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలియజేశాయి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!