ప్రాంతీయ అంశాలు
స్వచ్ఛ భారత్‌లో తెలంగాణ హ్యాట్రిక్
స్వచ్ఛ భారత్‌లో తెలంగాణ హ్యాట్రిక్ సాధించి వరుసగా మూడోసారి మొదటి స్థానం దక్కించుకుంది. 2019 నవంబర్ 1 నుంచి 2020 ఏప్రిల్ 20 కాలానికి నిర్వహించిన స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ విభాగాంలో, 2020 జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించిన కమ్యునిటీ టాయిలెట్ల నిర్మాణం–నిర్వహణలో, 2020 ఆగస్టు 8–15 వరకు నిర్వహించిన గందగీ ముక్తే భారత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో తొలి స్థానం పొందింది. జిల్లాల విభాగంలో కరీంనగర్ మూడో స్థానం దక్కించుకుంది.
వైఎస్ఆర్ జలకళ ప్రారంభం
చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఏపీ సీఎం ప్రభుత్వం సెప్టెంబర్ 28న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘వైఎస్ఆర్ జలకళ’ పథకాన్ని ప్రారంభించింది. 144 గ్రామీణ, 19 సెమి అర్బన్ నియోజకవర్గాల్లో బోర్లు వేసేందుకు 163 యంత్రాలను ఏర్పాటు చేశారు. నాలుగేళ్లలో ఈ పథకానికి రూ.2340 కోట్ల వ్యయం చేయనున్నారు.
జల వివాదాలపై సమావేశం:
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య అపెక్స్ కౌన్సిల్ సమావేశం అక్టోబర్ 6న జరగనుంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ సమావేశం జరగనుండటం రెండోసారి మాత్రమే. గోదావరి, కృష్ణా బోర్డుల పరిధిని గుర్తించడంతోపాటు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాలమూరు–రంగారెడ్డి , దిండి ఎత్తిపోతల పథకాలపై చర్చిస్తారు.
దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్–మాదాపూర్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే విధంగా నిర్మించిన 6 వరుసల కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర మంత్రి కె.టి రామారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సెప్టెంబర్ 25న ప్రారంభించారు. 21బిలియన్ డాలర్ల వ్యయంతో లార్సన్ అండ్ టుబ్రోలో నిర్మించిన వంతెన పొడవు 735.6 మీటర్లు కాగా దుర్గం చెరువుపై నిర్మించిన బ్రిడ్జి పొడవు 754.38 మీటర్లు. కేబుల్ బ్రిడ్జీలలో కాంక్రీట్ లో ప్రపంచంలోనే అతిపొడవైన ప్రీకాస్ట్ సెగ్మంటల్ స్పాన్ 233.85 మీటర్ల స్పాన్ వరకు ఉండటం ఈ బ్రిడ్జి ప్రత్యేకత.
జలవివాదాలపై సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పరిష్కారం కోసం అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌తోపాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సదస్సులో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలు డిపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని కేంద్రం పేర్కొంది. అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం తమ ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు పంపడానికి కేంద్రం అంగీకరించింది. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది.
జగనన్న విద్యా కానుక:
విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 8న జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించింది. ఈ పథకం 1 నుంచి10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. దీని ద్వారా స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్స్, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, బూట్లు, 2 జతల సాక్స్, బెల్ట్‌తో కూడిన కిట్‌ను ప్రతి విద్యార్థికి ఉచితంగా అందజేస్తారు. రూ.650 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 42,34,322 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందనున్నారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె.టి. రామారావు ప్రవేశపెట్టిన బిల్లును తెలంగాణ శాసనసభ అక్టోబర్ 13న ఆమోదించింది. గత ఎన్నికలలో జీవో ద్వారా కల్పించిన 50 శాతం రిజర్వేషన్ల అమలకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించారు. అక్టోబర్ 13న ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ గ్రేటర్లో 10 శాతం బడ్జెట్ ఉచిత కార్యక్రమాలకు, పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రతి డివిజన్‌కు నాలుగు కమిటీలు, ప్రభుత్వాన్ని సంప్రదించాకే గ్రేటర్ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించే విధంగా చట్టాన్ని సవరించారు.
హైదరాబాద్‌లో ఇంటెల్
హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ‘ఇంటెల్’ తెలంగాణ ప్రభుత్వంతోపాటు ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అక్టోబర్ 12న విడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ‘ఆల్ ఏఐ 2020’ సదస్సులో ఒప్పందం జరిగింది. ప్రజారోగ్య పరిరక్షణ, స్మార్ట్ మొబిలిటి రంగాలలో ఉన్న సమస్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారాలు చూపించడం, డేటాసైన్స్, కంప్యూటర్ మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అంకుర వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ఈ సంస్థ సంధాన కర్తగా వ్యవహరిస్తుంది.
తెలంగాణ ఆర్టీసీ రికార్డు
దేశంలోని 56 ప్రభుత్వరంగ రోడ్డు రవాణా సంస్థల పనితీరును విశ్లేషిస్తూ కేంద్ర రహదారి, రవాణా శాఖ రూపొందించిన 2016–17 నివేదికలో తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్ దేశంలో తొలి స్థానంలో పొందింది. బస్సుల సంఖ్య పరంగా(10,415) నాలుగో స్థానం సిబ్బంది(54,117) పరంగా మూడో స్థానంలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ 2016–17 సంవత్సరంలో 348.80 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి దేశంలో తొలి స్థానం పొందింది. ఆదాయంలో 2016లో రూ.4,295.71 కోట్లు సంపాదించిన టీఎస్ ఆర్టీసీ మహారాష్ట్ర, ఏపీల తరువాతి స్థానంలో నిలిచింది. నికరలాభంలో 2016–17 సంవత్సరానికి రూ.298.92 కోట్లతో ఏపీ తొలి స్థానంలో నిలిచింది.
వైఎస్ఆర్ బీమా
తెల్లరేషన్ కార్డు ఉన్న అందరికీ బీమా వర్తించే విధంగా అక్టోబర్ 21న ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభించింది. సహజ మరణం(18 నుంచి 50 ఏళ్లు) చెందితే రూ.2 లక్షలు, ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 18–50 సంవత్సరాల వారికి రూ. 5 లక్షలు, 51–70 ఏళ్ల వారికి రూ.3 లక్షలు అందిస్తారు. 18–70 ఏళ్ల లోపు వారు ఎవరికైనా పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షలు అందిస్తారు. 1.41 కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏటా రూ.510 కోట్లు ఖర్చు చేయనుంది.
నాయిని మరణం
రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, కార్మికనేత, తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అక్టోబర్ 21న మరణించారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మకు ప్రాంతానికి చెందిన ఆయన 1947లో రాంమనోహర్‌లోహియా స్థాపించిన హిందూ మజ్దూర్ సభ శాఖను హైదరాబాద్‌లో స్థాపించడం ద్వారా కార్మికనేతగా వెలుగులోకి వచ్చారు. 1978,1985, 2004లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005–08 వరకు వైఎస్ మంత్రివర్గంలో, 2014–19 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేశారు.
తెలంగాణలో గ్రాన్యూల్స్ ల్యాబ్ ఔషధ పరిశ్రమ
రాష్ట్రంలో ఔషధ పరిశ్రమల స్థాపన కోసం గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్స్ తెలంగాణ ప్రభుత్వంతో అక్టోబర్ 27న పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు 700 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నాయి. 75 దేశాలలో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యుల్స్ ఇండియా రూ. 400 కోట్లు పెట్టుబడితో 1600 మందికి, లారన్ల్యాబ్స్ 300 కోట్లు పెట్టుబడికి 1400 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ క్యాన్సర్, గుండెజబ్బు, మధుమేహం, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణ కోసం ముడిసరుకులు తయారి చేసి ఎగుమతి చేస్తోంది.
ధరణి వెబ్ పోర్టల్ ప్రారంభం
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణల అనంతరం ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌పోర్టల్‌ను అక్టోబర్ 29న సీఎం కేసీఆర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ భూహక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం–2020 అమలులోకి వచ్చింది. పోర్టల్ ద్వారా ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతాయి.
ఏపీ అవతరణ దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నవంబర్1ని గుర్తిస్తూ ప్రభుత్వం అక్టోబర్ 27న జీవో జారీ చేసింది. 1953 అక్టోబర్ 1న ఏర్పడ్డ ఆంద్ర రాష్ట్రం 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మారడంతో 2013 వరకు నవంబర్ 1 అవతరణ దినోత్సవంగా కొనసాగింది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ జూన్ 2 ను అవతరణ దినోత్సవంగా, ఏపీ ప్రభుత్వం జూన్ 2ను నవ నిర్మాణ దినోత్సవంగా నిర్వహించారు. ప్రస్తుత అవతరణ దినోత్సవం కోసం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఒక కమిటి నియమించింది.…………………………………………………………………………………………………
నేషనల్
పార్లమెంట్ స్థాయి సంఘాల చైర్మన్లు
పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్‌గా కే. కేశరావు, వాణిజ్య సంఘానికి విజయసాయిరెడ్డి, పర్యాటక, రవాణా, సాంస్కృతిక స్థాయి సంఘం చైర్మన్‌గా టి. జి వెంకటేశ్‌లు ఇటీవల నియమితులయ్యారు.
జశ్వంత్ సింగ్ మరణం
భారత మాజీ విదేశాంగ శాఖ మంత్రి సెప్టెంబర్ 27న మరణించారు. ఆర్మీలో మేజర్‌గా పని చేసిన జశ్వంత్ సింగ్ 1965లో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. వాజ్‌పేయి హయాంలో 1988–2002 వరకు విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1998లో పోఖ్రాన్–2 అణుపరీక్షలు, 1999 కార్గిల్ యుద్ధం, 2001 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించి 2012లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమిద్ అన్సారీపై పోటీ చేసి ఓడిపోయారు.
బాబ్రి కేసు తీర్పు:
1992 డిసెంబర్ 6న ఉత్తర ప్రదేశ్‌లోని బాబ్రిమసీద్ విధ్వంసంలో అభియోగాలు ఎదుర్కొంటున్న 32 మంది నిర్దోషులని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. బాబ్రికూల్చివేతలో అడ్వాణి, జోషి, ఉమాభారతి లాంటి వారు ప్రేరేపించలేదని, అనుకోకుండా జరిగిన సంఘటన అని సెప్టెంబర్ 30న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర. కె. యాదవ్ తీర్పు వెలువరించారు. బాబ్రిమసీద్ కూల్చివేత జరిగిన 28 ఏళ్లకు సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
సునిధి ప్రాజెక్ట్
మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ బొగ్గు గనుల శాఖ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ వివరాలు డిజిటలైజేషన్ చేయడానికి ‘సునిధి’(సుపీరియర్ న్యూ జనరేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా హ్యాడ్లింగ్ ఇనిషియేటివ్) పోర్టల్‌ను స్టార్ట్ చేశారు.
అటల్ టన్నెల్ ప్రారంభం:
ప్రపంచంలో అత్యంత పొడవైన, అత్యంత ఎత్తులో ఉన్న రోడ్డు సొరంగం ‘అటల్ టన్నెల్’ను అక్టోబర్ 3న ప్రధాన మోడీ ప్రారంభించారు. 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం 3000 మీటర్ల ఎత్తులో పిర్ పంజల్ పర్వత శ్రేణిలో ఉంది. 3300 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్ మనాలి–స్పితి లోయలను కలుపుతుంది. మనాలి–లెహ్ మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. ఈ టన్నెల్ ద్వారా గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. రోజు 3000 కార్లు, 1500 ట్రక్కుల వరకు ప్రయోగించడానికి అనుకూలంగా ఎన్ఏటీఎం(న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్) ద్వారా నిర్మించారు.
యుధ్ ప్రదుషణ్ కె విరుధ్:
కాలుష్యం నివారణపై అవగాహన కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అక్టోబర్ 5న యుధ్ ప్రదుషణ్ కె విరుధ్ కార్యక్రమం ప్రారంభించారు. పంజాబ్, హర్యానాలలో పంట కోత అనంతరం వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. అయితే ఎరువుగా మార్చే ద్రావణాన్ని పూసా వ్యవసాయ కేంద్రం ఇటీవల కనుగొంది. రైతులందరికీ ఈ విషయం తెలిసేలా ఢిల్లీ ప్రభుత్వం ప్రచార కార్యక్రమం చేపట్టింది. దీంతోపాటు కాలుష్యానికి సంబంధించిన అంశాలను ఫొటో రూపకంగా ఫిర్యాదు చేయడానికి ‘గ్రీన్ ఢిల్లీ యాప్’ను రూపొందించారు.
డిజిటల్ సేవా సేతు కార్యక్రమం
ప్రజలకు సేవలందించడం కోసం సాంకేతికతను సంపూర్ణంగా వినియోగిస్తూ కేంద్రం ప్రారంభించిన ‘భారత నెట్ ప్రాజెక్టు’లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే డిజిటల్ సేవా సేతు. ఫైబర్ నెట్ ద్వారా తొలిదశలో 2000 గ్రామాలను అనుసంధానిస్తారు. 2020 అక్టోబర్ 8న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా రేషన్ కార్డుల జారీ సహా 20 రకాల సేవలందిస్తారు.
దేశంలో తొలి ఆర్గానిక్ స్పైసెస్ పార్కులు
దేశంలో తొలిసారిగా రెండు సుగంధ ద్రవ్యాల పార్కుల ఏర్పాటుకు అక్టోబర్ 5న గుజరాత్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పటాన్‌లో సోంపుగింజలు, బనస్కాంతలో జీలకర్ర సుగంధ ద్రవ్యాల పార్కులు ఏర్పాటు కానున్నాయి. నాబార్డు అందించిన రూ.23 లక్షల సాయంతో ఈ పార్కులు ఏర్పాటు చేస్తూ రైతులకు లాభదాయక ఆచరణ పద్ధతుల రూపకల్పన, పరిశోధనలను ప్రోత్సహిస్తారు.
మై గంగా మై డాల్ఫిన్
డాల్ఫిన్ల పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 5న మై గంగా మై డాల్ఫిన్ కార్యక్రమం ప్రారంభించారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అటవీ శాఖ సంయుక్తంగా ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్లోని 6 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు.
స్వమిత్వ పథకం
గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించడం కోసం ప్రధాని నరేంద్ర మోడి అక్టోబర్ 11న స్వమిత్వ SVAMITVA( సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రోవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) కార్డుల పంపణీ కార్యక్రమాలను విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా 6.2 లక్షల గ్రామాల్లో ఆస్తులను సర్వే చేసి ఆస్తి హక్కు కార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మేరకు 2020 ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి 6 నెలల్లో హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో సర్వే చేసి 1.32 లక్షల మందికి ఆస్తి హక్కు పత్రాలు రూపొందించారు. ఏపీలోని 4000, తెలంగాణలోని 11,234 గ్రామాల్లో సర్వే చేయనున్నారు.
టెక్ ఫర్ ట్రైబ్స్
ఐఐటి కాన్పూర్, చత్తీస్గడ్ అటవి ఉత్పత్తుల సమాఖ్య సంయుక్తంగా అక్టోబర్ 13న ట్రైఫెడ్(TRIFED– ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. గిరిజనులతో ఒప్పందం, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల నిర్వహణ, మార్కెట్‌తో అనుసంధానించి వారి వ్యాపార దక్షత, ఆదాయాలను పెంచడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్(బెంగళూరు), టాటా ఇన్స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్(ముంబయి), వివేకానంద కేంద్ర(తమిళనాడు), కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(భువనేశ్వర్) లాంటి సంస్థల సహకారం తీసుకొని గిరిజనులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కేరళ కర్షక క్షేమనిధి బోర్డు
దేశంలో తొలిసారిగా కేరళ ప్రభుత్వం రైతుల సంక్షేమ నిధి(కేరళ కర్షక క్షేమ నిధి బోర్డు)ని ఏర్పాటు చేసింది. దీనికి డాక్టర్ పి. రాజేంద్రన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి రైతు 100 రూపాయలు సభ్యత్వం కోసం చెల్లించి ప్రతి నెల100 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. ప్రభుత్వం అంతే మొత్తం జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు పెన్షన్, ఆరోగ్యబీమా, వైద్యసాయం, మరణానంతర సాయం, కూతురి వివాహానికి ఆర్థిక సాయం లభిస్తాయి. వార్షిక ఆదాయం అయిదు లక్షలకు మించని, 5 సెంట్ల నుంచి 15 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. సభ్యులుగా చేరిన రైతులకు ప్రమాదవశాత్తు/అనారోగ్యంతో వైకల్యం సంభవిస్తే వారికి 60 ఏళ్లు వచ్చే దాక సెన్షన్ అందిస్తారు.
సాగర్ కవచ్ విన్యాసాలు
ఆరునెలలకు ఒకసారి జరిగే తీరరక్షణ (‘సాగర్ కవచ్’) విన్యాసాలు 2020 అక్టోబర్8 నుంచి 9 వరకు జరిగాయి. ఈ విన్యాసాలకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌లు వేదికగా నిలిచాయి. ఈ విన్యాసాలను దక్షిణ నౌకాదళం ప్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ అనిల్‌కుమార్ చావ్లా కొచ్చి నుంచి పర్యవేక్షించారు. 20 నౌకలు, 50 గస్తీ వాహనాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
ఎన్నికల వ్యయానికి సవరణ
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేసే వ్యయాన్ని అక్టోబర్ 19న కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. దీని కోసం ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లో మార్పులు చేసింది. 25 రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ.30.8 లక్షలుగా, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కీంలతోపాటు 6 కేంద్రా పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలకు రూ.59.40 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ.22 లక్షలుగా, జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలకు రూ.70 లక్షలు, అసెంబ్లీకి రూ.30.8 లక్షలుగా నిర్ణయించింది.
యాక్సిడెంట్స్‌పై రిపోర్ట్
2019లో ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలతో అమెరికా(22.11లక్షలు), జపాన్(4.99లక్షలు), భారత్(4.80లక్షలు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా అత్యధిక మరణాలతో భారత్ తొలి స్థానం పొందింది. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలువగా ఏపీ(8), తెలంగాణ(9)వ స్థానం పొందాయి. దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఏపీ వాటా 5 శాతం కాగా, తెలంగాణ వాటా 4.4 శాతం. దేశవ్యాప్తంగా 2018తో పోలిస్తే 26 రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గగా ఏపీలో 10 శాతం, తెలంగాణలో 3 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.
యూపీలో మిషన్ శక్తి
మహిళల రక్షణే లక్ష్యంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాత్ అక్టోబర్ 17న కేంద్ర ప్రాయోజిత పథకం ‘మిషన్ శక్తి’ని లక్నోలో ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ ఈ పథకం కోసం 8 నగరాలను(ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో) ఎంపిక చేసింది. దీనిలో కేంద్ర రాష్ట్రాల వాటా 60: 40 శాతం. మహిళల కోసం పింక్ పెట్రోలింగ్ వాహనం, కమాండింగ్ కార్యాలయం, మూత్రశాలలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు.
హిజ్రాలతో ప్రైడ్ స్టేషన్
నోయిడా మెట్రో రైలు కార్పోరేషన్ ఉత్తర భారత దేశ పరిధిలోని మెట్రో సర్వీసుల చరిత్రలోనే తొలిసారిగా హిజ్రాలతో మెట్రోరైలు నిర్వహణను అక్టోబర్ 27న ప్రారంభించింది. ఇందులో భాగంగా నోయిడాలోని 50వ స్టేషన్‌ను ఎంపిక చేసి దానికి ‘ప్రైడ్ స్టేషన్’గా నామకరణం చేసింది. 2017లో కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ కూడా ఇలాగే ఓ స్టేషన్ కేటాయించి 23 ట్రాన్స్‌జెండర్స్‌కు ఉపాధి కల్పించింది.
జమ్మూ కాశ్మీర్ భూముల కొనుగోలుపై గెజిట్
కాశ్మీరేతరులు సులభంగా నివాస భూములు కొనుగోలు చేసే విధంగా 11 పాత చట్టాల రద్దు/ మార్పులను చేస్తూ అక్టోబర్ 27న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని కోసం జమ్మూకాశ్మీర్ ఏలియనేషన్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్, జమ్మూకాశ్మీర్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రాగ్మెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్–1960, జమ్మూకాశ్మీర్ రైట్ ఆఫ్ ప్రైయర్ పర్చేస్ యాక్ట్–1936, జమ్మూకాశ్మీర్ టెనెన్సియాక్ట్–1966లోని క్లాజ్ 3, జమ్మూకాశ్మీర్ అన్ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఏలియేషన్ ఆఫ్ ఆర్చ్డ్ యాక్ట్–1975, జమ్మూకాశ్మీర్ యుటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్–2010, జమ్మూ కాశ్మీర్ అండర్ గ్రౌండ్ యుటిలిటిస్ యాక్ట్‌ను రద్దు చేశారు. 2019 ఆగస్టు 5న జరిగిన ఆర్టికల్ 370 రద్దు కన్న ముందు కశ్మీరీలు మాత్రమే భూములు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉండేది. అయితే ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం నివాస స్థలాలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయ భూములు మాత్రం కశ్మీరీల చేతుల్లోనే ఉంటాయి. విద్య, వైద్య రంగాల కోసమైతే వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేయవచ్చు.
తమిళనాడులో స్మార్ట్ బ్లాక్‌బోర్డ్ స్కీం
కేంద్ర విద్యాశాఖ ప్రాయోజిత పథకమైన ‘స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్’ ఇప్పటికే రాష్ట్రంలోని 7500 పాఠశాలల్లో అమలవుతుండగా కొవిడ్–19 దృష్ట్యా దీన్ని 80 వేల స్కూళ్లకు విస్తరించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. పెన్‌డ్రైవ్‌ల ద్వారా ఆడియో, వీడియో పాఠాల సమాచారాన్ని అందించి కంప్యూటర్ తెరలపై ప్రదర్శించడం దీని ఉద్దేశం. 18 మంది సభ్యుల కమిటీ కొవిడ్–19 దృష్ట్యా సిలబస్‌ను 40 శాతానికి తగ్గించాలని ఇటీవలె సూచించింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ‘టీఎన్–దీక్ష’, తమిళనాడు టీచర్స్ ప్లాట్‌ఫామ్ లాంటి ఆన్లైన్ వేదికలను నిర్వహిస్తోంది.
కూరగాయలకు మద్దతు ధర
దేశంలో కూరగాయలకు మద్దతు ధర ప్రకటించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. దేశంలో 23 పంటలకు మద్దతు ధర లభిస్తుండగా 16 రకాల కూరగాయలు, పండ్లు, దుంపలకు 2020 నవంబర్ 1 నుంచి మద్దతు ధర అందించనుంది. అరటి, పైనాపిల్, బంగాళదుంప, క్యాబేజీ, బెండకాయ, అల్లం, బీట్రూట్, బీన్స్, టమాట, పొట్లకాయ, అల్లం లాంటి కూరగాయలను ఈ పథకంలో చేర్చారు.
ఒడిషా ప్రభుత్వ వెబ్‌పోర్టల్స్
ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 28న సమంగలి, ఇంటిగ్రెటెడ్ ఒడిశా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్స్‌ను ప్రారంభించింది. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే సుమంగలి వెబ్‌పోర్టల్. హిందూ వివాహ చట్టం–1995 ప్రకారం తొలిసారి వివాహం చేసుకొని పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి 60 రోజుల తర్వాత రూ.2.5 లక్షల సాయం అందిస్తారు. ఇంటిగ్రెటెడ్ ఒడిశా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా 11 డిపార్ట్మెంట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్కాలర్షిప్లు అందించే అవకాశం ఉంది.
రాబందుల సంరక్షణ ప్రణాళిక
ఉత్తరప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అయిదు రాష్ట్రాల్లో 2020–25 కాలానికి చేయాల్సిన జాతీయ రాబందుల సంరక్షణ ప్రణాళికకు జాతీయ వన్యప్రాణి బోర్డు(ఎన్బీడబ్ల్యూఎల్) ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగానే పింజర్(హర్యాన), బోపాల్(మధ్యప్రదేశ్), గువాహటి(అస్సాం), హైదరాబాద్‌లోని రెస్క్యూ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రాబందుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలపై ఇక్కడి నుంచి అధ్యయనం చేస్తారు.
కిసాన్ సూర్యోదయ యోజన
2020 అక్టోబర్ 24న ప్రధాని మోడీ ప్రారంభించిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ పథకమే కిసాన్ సూర్యోదయ యోజన. ఈ స్కీం ద్వారా రైతులకు సాగునీటి కోసం పగటి సమయంలోనే 16 గంటలపాటు(త్రీఫేజ్) విద్యుత్ అందిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి కోసం 9 గంటల వరకు విద్యుత్ అందించే ఈ పథకం కోసం రూ.3500 కోట్లు కేటాయించారు.
ఇంటర్నేషనల్
ప్రపంచ ప్రమాద నివేదిక–2020
వలసలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర అంశాల ఆధారంగా ఏటా ప్రపంచ ప్రమాదాల నివేదిక(వరల్డ్ రిస్క్ ఇండెక్స్) రూపొందిస్తారు. దీన్ని ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ డెవలప్ చేసింది. 27 అంశాల ఆధారంగా 181 దేశాలను పరిగణనలోకి తీసుకొని వరల్డ్ రిస్క్ ఇండెక్స్–2020 రూపొందించారు. అత్యధిక ప్రమాద తీవ్రతతో వనేటు(49.74), టోంగా(29.72)లు వరుసగా తొలి స్థానాల్లో నిలవగా, అతి తక్కువ ప్రమాద తీవ్రతతో ఖతార్(0.31) 181వ ర్యాంకు పొందింది. 6.62 ప్రమాద తీవ్రతతో భారత్ 89వ స్థానంలో నిలిచింది.
నాగొర్నో–కరాబాఖ్ వివాదం:
ఆర్మేనియ–అజర్బైజాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతమే నాగొర్నో–కరాబాఖ్. 4400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్ బైజాన్‌లో ఉన్నప్పటికి 1994 నుంచి ఆర్మెనియ దళాలు దీన్ని నియంత్రిస్తున్నాయి. కాకనస్ పర్వత శ్రేణిలోని ఈ ప్రాంతాన్ని ఆర్ట్సాఖ్గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంపై ఆదిపత్యం కోసం జరిగిన వివాదంలో ఇటీవల ప్రజానష్టం, సైనిక నష్టం సంభవించింది.
మాలి నూతన ప్రధాని:
ఆఫ్రికా దేశం మాలి నూతన ప్రధానిగా మొక్తార్ జాని సెప్టెంబర్ 27న నియమించారు. ఆగస్టు 18న సైనిక కూటమితో మధ్యంతర అధ్యక్షుడిగా ఎన్నుకున్న బహన్డా తో ఈ నియామకం చేపట్టారు. మొక్తార్ జాని ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. మాలిలో మరో 18 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
ట్రాయ్ చైర్మన్‌గా వఘేలా
1986 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పి.డి. వఘేలా ట్రాయ్ నూతన చైర్మన్‌గా నియమితులయ్యారు. ట్రాయ్ చైర్మన్‌గా రిటైర్ అయిన రాంసేవక్ శర్మ స్థానంలో వఘేలాను నియమిస్తూ సెప్టెంబర్ 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శిగా ఉన్నారు.
సయ్యద్ అన్వరా తైమూర్ మరణం
అస్సాం మొదటి, ఏకైక మహిళా సీఎం, దేశ చరిత్రలో ఏకైక ముస్లిం సీఎం సయ్యద్ అన్వరా తైమూర్ సెప్టెంబర్ 28న మరణించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్ట ఈనుంచి 1980 డిసెంబర్ 6 నుంచి 1981 జూన్ 30 వరకు ఆమె అస్సాం సీఎంగా వ్యవహరించారు.
లెబనాన్ ప్రధాని రాజీనామా
లెబనాన్ ప్రధాని ముస్తఫా అదిబ్ సెప్టెంబర్ 27న రాజీనామా చేశారు. 2000–2004 వరకు లెబనాన్ ప్రధానిగా వ్యవహరించిన నజీబ్ మికాటికి సలహాదారుడిగా, 2013లో జర్మనీలో లెబనాన్ రాయబారిగా వ్యవహరించారు. 1975–1990 వరకు జరిగిన అంతర్గత సంక్షోభం వలన లెబనాన్ ఆర్థిక, రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది.
ఎల్పీజీ వినియోగంలో రికార్డు:
ప్రతి గృహానికి ఎల్పీజీ కనెక్షన్ అందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లాంటి పథకాల ద్వారా 2030 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ వినియోగదారుగా భారత్ నిలువనుందని ఉడ్మెకంజి నివేదిక వెల్లడించింది. ఏటా 3.3 శాతం వృద్ధితో 2030 నాటికి వంటగ్యాస్ వార్షిక వినియోగం 34 మిలియన్ టన్నులకు చేరుతుందని సబ్సీడీలు 42,750 కోట్లకు చేరతాయని ఈ రిపోర్టు పేర్కొంది.
జపాన్‌తో భారత్ 5జీ ఒప్పందం
సైబర్ భద్రతకు సంబంధించి భారత్ అక్టోబర్ 7న జపాన్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. 5జీ, కృత్తిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇండో–పసిపిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, భారత్ కలిసి ఏర్పాటు చేసిన వ్యూహాత్మక ‘క్వాడ్’ కూటమి సమవేశానికి టోక్యో వెళ్లిన భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ జపాన్ విదేశాంగ శాఖ మంత్రి తోషిమిత్సు మోతెగితో ఒప్పందం చేసుకున్నారు.
ఫిన్లాండ్ ప్రధానిగా 16 ఏళ్ల బాలిక
ఫిన్లాండ్లోని 16 ఏళ్ల బాలిక ‘అవా ముర్తో’ అక్టోబర్ 7న ఆ దేశానికి ఒక్కరోజు ప్రధానిగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితి ఏటా నిర్వహించే ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా ఓ సంస్థ చేపట్టిన ‘గర్ల్స్ టేకోవర్’ కార్యక్రమంలో దక్షిణ ఫిన్లాండ్కు చెందిన ‘వాక్సి’ అనే చిన్న గ్రామానికి చెందిన బాలిక అవా ముర్తో ఎంపికయ్యారు. ప్రస్తుతం ఫిన్లాండ్ ప్రధానిగా సనా మారిన్ వ్యవహరిస్తున్నారు.
వేలం థియరీకి నోబెల్
వేలం సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా కొత్త తరహా వేలం పద్ధతులు(ఆక్షన్ ఫార్మాట్స్) కనిపెట్టినందుకు క్యాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక వేత్తలు రాబర్ట్‌విల్సన్, పౌల్ ఆర్మిల్గోంలకు 2020 ఆర్థిక శాస్త్ర నోబెల్ లభించింది. ఒక వస్తువును వేలం వేస్తున్నప్పుడు దాని ధరను ఏ విధంగా నిర్ణయించుకొని వేలంలో పాల్గొనాలి అనే అంశాలపై వీరు పరిశోధనలు చేశారు.
ది ఎర్త్స్ హాట్ పైజ్
భూగోళంపై అననుకూల మార్పులను అరికట్టడానికి కృషి చేసే సంస్థలకు, వ్యక్తులకు రాబోయే పదేళ్లపాటు సాయం చేయడానికి బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, పర్యావరణ వేత్త డెవిడ్ అనెట్బరోలు సంయుక్తంగా ‘ఎర్త్స్ హాట్ ప్రైజ్’ స్థాపించారు. 1961లో అమెరికా అధ్యక్షుడు జౌన్ఎఫ్ కెనడి స్థాపించిన ‘మూన్హాట్ ప్రాజెక్ట్’ స్ఫూర్తిగా స్థాపించారు. దీనిలో ప్రకృతి పునరుద్దరణ, గాలి నాణ్యత పరిరక్షణ, సముద్రాల శుద్ధి, వాతావరణ పరిరక్షణ, ప్రకృతి దుర్వినియోగం నివారణ అనే అయిదు విభాగాలు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ఏటా 1 మిలియన్ పౌండ్లు(9.5 కోట్లు) అందిస్తారు. నవంబర్ 1 నుంచి నామినేషన్లు సేకరించి 2021లో లండన్ వేదికగా తొలిసారి విజేతలను ప్రకటిస్తారు.
అసమానతల తగ్గింపు నిబద్దత సూచి
వివిధ రంగాల్లో అసమానతల తగ్గింపుపై ఆయా దేశాలు చేస్తున్న కృషిని పేర్కొంటూ ఆక్స్‌ఫామ్, డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్నేషనల్ సంస్థలు కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఇక్వాలిటీ(సీఆర్ఐ) నివేదికన వెలువరించాయి. 158 దేశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన ఈ రిపోర్ట్‌లో నార్వే, డెన్మార్క్, జర్మనీలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. బహ్రెయిన్(156), నైజీరియా(157), దక్షణ సూడాన్(158)లు చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ ఓవరాల్‌గా 129వ ర్యాంక్ పొందింది. విభాగాల వారీగా పరిశీలిస్తే ప్రజాసేవలో(141), పన్ను సేవలో(19), కార్మిక సేవలో (151), ఆరోగ్యంలో(155) ర్యాంక్ సాధించింది.
మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియా
భారట్ ఏటా బంగాళాఖాతంలో అమెరికా, జపాన్‌లతో కలిసి నిర్వహించే ‘మలబార్’ విన్యాసాల్లో పాల్గొనాలని ‘ఆస్ట్రేలియా’ను వ్యూహాత్మకంగా ఆహ్వానించింది. చైనాకు వ్యతిరేకంగా ఈ నాలుగు దేశాలు ‘క్వాడ్’ అనే ఒక అనధికార కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ విన్యాసాలలో జపాన్ 2015లో భాగస్వామిగా చేరింది.
ప్రపంచ ఆకలి సూచి – 2020
కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్త్ హంగర్లైఫ్లు సంయుక్తంగా 107 దేశాలతో ప్రకటించిన ‘ప్రపంచ ఆకలి సూచి–2020’లో భారత్ 94వ ర్యాంక్ సాధించింది. ఈ నివేదిక ప్రకారం 17 దేశాలు 5లోపు స్కోరు సాధించి 1 నుంచి 17 ర్యాంకులు పొందగా శ్రీలకం(64), నేపాల్(73) బంగ్లాదేశ్(75), మయన్మార్(78), పాకిస్థాన్(88) స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం 27.2 శాతం స్కోరు సాధించిన భారత్ 94వ స్థానంతో తీవ్ర ఆకలి సమస్య ఎదుర్కొంటున్న దేశంగా నిలిచింది. గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది. భారత్ 2018లో 103, 2019లో 102వ స్థానంలో నిలిచింది. మిషన్ ఇంద్రదనుష్, జాతీయ ఆహార భద్రతా చట్టం–2013, ప్రధానమంత్రి మాతృవందన యోజన, పోషణ అభియాన్ లాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం భారత్ స్థితి మెరుగుపడటానికి కారణమయ్యాయి.
కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్
2020 నోబెల్ బహుమతి గ్రహీత ‘ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) 2020లో ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 సందర్భంగా ‘ది కాస్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ ఫుడ్–2020’ నివేదికను వెలువరించింది. రోజువారి ఆదాయంలో ఆహారం కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారనేదిఈ నివేదికకు ప్రామాణికంగా తీసుకున్నారు. 36 దేశాలతో రూపొందించిన నివేదికలో దక్షిణ సూడాన్(186 శాతం) తొలిస్థానం పొందగా భారత్(3.5 శాతం) 28వ స్థానం పొందింది. టాప్ 20లో 17 దేశాలు సబ్సహరన్ ఆఫ్రికా దేశాలు కావడం గమనార్హం.
న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా
లేబర్ పార్టీ నాయకురాలు జెసిండా అర్టర్న్ న్యూజిలాండ్ ప్రధానిగా వరుసగా రెండోసారి ఎన్నియ్యారు. అక్టోబర్ 17న జరిగిన ఎన్నికల్లో 49 శాతం ఓట్లు పొందిన లేబర్ పార్టీకి 64 సీట్లు, 8 శాతం ఓట్లు పొందిన మిత్రపక్షం గ్రీన్ పార్టీకి 10 శాతం ఓట్లు దక్కాయి. 29 శాతం ఓట్లు పొందిన నేషనల్ పార్టి 35 సీట్లు పొంది ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 24 సంవత్సరాలుగా ఏ పార్టీ కూడా ఒంటరిగా పూర్తి స్థాయి మెజారిటి సాధించలేకపోయింది. జెసిండా అర్టర్న్ న్యూజిలాండ్ ప్రధానిగా 2017 నుంచి కొనసాగుతున్నారు.
ఎయిర్ రైఫల్ చాంపియన్‌షిప్–2020
బంగ్లాదేశ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న నిర్వహించిన షేక్ రస్సెల్ అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ చాంపియన్‌షిప్–2020లో జపాన్ షూటర్ నవోయా ఒకాడా(630.9) స్వర్ణం సాధించగా, భారత్‌కు చెందిన పాహు తుషార్ మానె 623.8 స్కోరుతో రజతం సాధించాడు. మహిళల విభాగంలో భారత షూటర్ ఎలివెనిల్ వలరివనే 627.5 స్కోరుతో స్వర్ణం సాధించింది.
సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులు–2020
2014 నుంచి ఏటా అందిస్తున్న సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులు 7వ ఎడిషన్ వర్చువల్ పద్ధతిలో అందజేశారు. ఆఫ్రికాలోని ఘనా దేశ సెంట్రల్ బ్యాంక్‌కు ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్కార్నీకి ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ –2020’ అవార్డు లభించింది. ఓట్మర్ హిస్సింగ్కు జీవితసాఫల్య పురస్కారం లభించింది. ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించిన రఘురాంరాజన్కు 2015లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
ఆసియా పవర్ ఇండెక్స్–2020
లోవి ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఆసియా–పసిపిక్ ప్రాంతంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా ప్రభావితం చేస్తున్న దేశాల జాబితా రిలీజ్ చేసింది. 100 పాయింట్లతో రూపొందించిన జాబితాలో యూఎస్ఏ(81.6), చైనా(76.1), జపాన్(41.0) వరుసగా మూడు స్థానాల్లో నిలువగా 39.7 స్కోరు సాధించిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
2+2 చర్చలు సఫలం
ఇండో–పసిపిక్ ప్రాంతంలో చైనా ఆదిపత్యాన్ని అరికట్టడంలో భాగంగా భారత్, అమెరికా దేశాల నుంచి రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రులు పాల్గొన్న ‘2+2 చర్చలు’ అక్టోబర్ 27న జరిగాయి. ఈ చర్చల్లో భారత్ తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌లతో పాటు అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశాంగ మంత్రి మైక్ పాపియోలు పాల్గొన్నారు. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బెకా)తో పాటు ఇరు దేశాల మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటిరి ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్(2002), లాటిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్(2016), కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటి అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్(2018)ల తరువాత ఇరుదేశాల మధ్య కుదిరిన 4వ ఒప్పందం ‘బెకా’. ఈ ఒప్పందం ద్వారా ఇరుదేశాలు, రహస్యడేటా పరిజ్ఙాన మార్పిడి లాంటివి సులభంగా జరుగుతాయి.
గ్లోబుల్ క్లైమేట్ యాక్షన్–2020
యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్(యూఎన్ఎఫ్సీసీసీ) ప్రవేశపెట్టిన ‘మార్పు కోసం వేగం’ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డులు అందిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ రక్షణ కోసం కృషి చేసే దేశాలు, సంస్థలు, నగరాలు, పౌరసమూహాలు, పెట్టుబడిదారులకు ఈ అవార్డు అందిస్తారు. 2020కి గాను 13 మందికి అవార్డు ప్రకటించగా భారత్ నుంచి ‘ప్రపంచ హిమాలయ యాత్ర’ కార్యక్రమానికి లభించింది. ప్రపంచ పర్యాటక సంస్థ ఆమోదంతో నడుస్తున్న ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం దేశ, విదేశాల యాత్రికులకు హిమాలయ గ్రామాల్లో వసతి సౌకర్యం కల్పించి వచ్చిన ఆదాయం ద్వారా ఆ గ్రామాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు.
స్పోర్ట్స్
అలిస్సా హీలి రికార్డు
టీ20ల్లో అత్యధిక మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా ఆస్ట్రేలియ మహిళ క్రికెటర్ అలిస్సా హీలి రికార్డు సృష్టించారు. భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 91(57 క్యాచ్‌లు+34 స్టంప్‌లు) మందిని ఔట్ చేయగా అలిస్సా హీలి 114 మ్యాచుల్లో 92 మందిని ఔట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అమీసాటర్వైట్ను ఔట్ చేయడం ద్వారా రికార్డు పొందింది.
ఐపీఎల్లో రికార్డ్ బ్రేక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. సెప్టెంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన 224 పరుగులను ఛేదించింది. 2008లో డెక్కన్ చార్జర్స్ సాధించిన 215 పరుగులను ఛేదించిన రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరుతో ఉంది.
రష్యా గ్రాండ్‌ప్రి–2020
సెప్టెంబర్ 27న జరిగిన ఫార్ములావన్ రష్యా గ్రాండ్ ప్రి–2020 విజేతగా మెర్సిడెజ్ డ్రైవర్ వాల్టెరిబోటీస్ నిలిచాడు. మాక్స్ వెర్స్టాపెన్(రెడ్‌బుల్) రెండో స్థానం, లెవిస్ హమిల్టన్(మెర్సిడెజ్) మూడో స్థానం సాధించారు. ఫార్ములావన్ చరిత్రలో అత్యధికంగా 91 విజయాలు, 7 డ్రైవర్ చాంపియన్‌షిప్‌ల రికార్డు మైకెల్ షూమాకర్(జర్మనీ)పేరుతో ఉంది.
ఆస్ట్రేలియా మహిళల జట్టు రికార్డ్
2017 అక్టోబర్ నుంచి వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుస విజయాలు సాధిస్తున్న మెక్లారింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కొత్త రికార్డు నెలకొల్పింది. 2003లో రికిపాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు సాధించిన వరుస 21 మ్యాచ్‌ల విజయాల రికార్డును మహిళల జట్టు సమం చేసింది.
మహిళ టి20 ర్యాంకింగ్స్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అక్టోబర్ 2న విడుదల చేసిన మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో 270 పాయింట్లతో భారత మహిళల జట్టు 3వ స్థానం పొందింది. ఆస్ట్రేలియా(291), ఇంగ్లాండ్(280) తొలి రెండు స్థానాలు పొందాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(160), ఇండియా(121), ఇంగ్లాండ్(119) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం
అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు విష్ణు స్వర్ణం సాధించాడు. అక్టోబర్ 3న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల ఫైనల్స్‌లో 251.4 పాయింట్లతో స్వర్ణం పొందాడు.
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్–2020
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 124వ ఎడిసన్ 2020 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌పై 6–0, 6–2, 7–5 తేడాతో గెలుపొంది ఓవరాల్‌గా 13వసారి, వరుసగా 4వసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియటెక్(పోలండ్) 6–4, 6–1 తేడాతో సోఫియా కెనిన్(యుఎస్ఏ)పై గెలుపొందింది. పరుషుల డబుల్స్ విజేతలుగా జర్మనీకి చెందిన కెవిన్ క్రావిట్జ్, అండ్రియాస్ మిస్ జోడి, మహిళల డబుల్స్ విజేతలుగా తిమియ బాబోస్(హంగేరి), క్రిస్టినా మ్లెడనోవిక్(ఫ్రాన్స్)లు విజేతలుగా నిలిచారు.
ఫెదరర్ రికార్డు సమం చేసిన నాదల్
టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఫెదరర్ రికార్డును రాఫెల్ నాదల్(స్పెయిన్) సమం చేశాడు. ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను 6 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ఒకసారి, వింబుల్డన్ ఓపెన్‌ను 8 సార్లు, యుఎస్ ఓపెన్‌ను 5 సార్లు గెలుపొందగా.. నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకసారి, ఫ్రెంచ్ ఓపెన్ 13 సార్లు, వింబుల్డన్ ఓపెన్ రెండు సార్లు, యుఎస్ ఓపెన్ 4 సార్లు గెలుపొందాడు. నాదల్ 2008 ఒలింపిక్స్‌లో రోజర్ ఫెదరర్ 2012 ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించారు.
మహిళల ఐపీఎల్ 2020
మహిళల టి20 ఐపీఎల్‌ను 2020 నవంబర్ 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందులో సూపర్నోవాస్, ట్రయల్ బ్లౌజర్స్, వెలాసిటి అనే మూడు జట్టులు పాల్గొంటాయి. సూపర్ నోవాస్‌కి హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్బ్లేజర్స్కి స్మృతి మందన, వెలాసిటికి మిథాలి రాజ్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. నవంబర్ 4న జరిగే ప్రారంభ మ్యాచ్‌లో సూపర్నోవాస్, వెలాసిటి జట్లు తలపడతాయి. ఒక్కోజట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడగా నవంబర్ 9న ఫైనల్ జరుగుతుంది.
రికార్డ్ సమం చేసిన హమిల్టన్
ఫార్ములా వన్‌లో అత్యధికంగా 91 విజయాలు సాధించిన మైకెల్ షుమాకర్ రికార్డును లెవిస్ హమిల్టన్(బ్రిటన్) సమం చేశాడు. ఐఫిల్ గ్రాండ్ ప్రి–2020 ఫార్ములావన్ టోర్నీ–2020 విజేతగా నిలవడం ద్వారా మెర్సిడెజ్ డ్రైవర్ హమిల్టన్ రికార్డును సమం చేశాడు. అయితే అత్యధికంగా 7 డ్రైవర్ చాంపియన్ షిప్ రికార్డు మాత్రం షుమాకర్ పేరుతో ఉంది. లెవిస్ హమిల్టన్ 6 సార్లు(2008, 14, 15, 17, 18, 19) డ్రైవర్ చాంపియన్‌షిప్ సాధించాడు.
ఉమర్‌గుల్ రిటైర్మెంట్
పాకిస్థాన్ వెటరన్ ఫేస్బౌలర్ ఉమర్‌గుల్ అక్టోబర్ 17న రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003లో క్రికెట్ ఆరంగేట్రం చేసిన ఉమర్‌గుల్ 130 వన్డేలు, 47 టెస్టులు, 60 టి20లలో పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించి వన్డేలలో 179, టెస్టుల్లో 163, టీ20ల్లో 85 వికెట్లు తీశాడు.
కెన్యా రన్నర్ వరల్డ్ రికార్డ్
మహిళల ప్రపంచ అథ్లెటిక్స్ఆఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో కెన్యా రన్నర్ పెరెస్ జెప్చిర్చిర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మారథాన్‌ను పెరెస్1 గంటా 5 నిమిషాల16 సెకన్లలో ముగించి స్వర్ణం సాధించింది. జర్మనీకి చెందిన ఇసాక్, ఇథియోఫియాకు చెందిన మలెంజర్స్లు వరుసగా రజత, కాంస్యాలు సాధించారు.
ఇండియన్ సూపర్‌లీగ్–2020
ఇండియన్ సూపర్‌లీగ్ ఏడో సీజన్ నవంబర్ 20 నుంచి గోవాలో నిర్వహించనున్నారు. 2013 అక్టోబర్ 21న తొలిసారి ప్రారంభమైన ఈ లీగ్‌ను వివిధ వేదికల్లో నిర్వహించినప్పటికీ కరోనా నేపథ్యంలో పూర్తి మ్యాచ్‌లు గోవాలోనే జరగనున్నాయి. దీనిలో పాల్గొనే జట్లు 11. ఏటీకే మోహన్ భగాన్, బెంగళూరు, చెన్నయిన్, గోవా, హైదరాబాద్, జంషెడ్పూర్, కేరళ బ్లాస్టర్స్, ముంబయి సిటి, నార్త్ ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, ఈస్ట్ బెంగాల్ జట్లు పాల్గొంటాయి. 2019–20 సీజన్ విజేత ఏటీకే మోహన్ భగాన్ జట్టు.
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్–2020
2020లో నిర్వహించిన ఏకైక ప్రపంచ టూర్ బ్యాడ్మింటన్ టోర్నీ అయిన డెన్మార్క్ ఓపెన్–2020 అక్టోబర్ 13–18 వరకు డెన్మార్క్‌లోని ఒడెన్స్ వేదికగా జరిగింది. పురుషుల సింగిల్స్ విజేతగా అండర్స్ ఆంటోనేసేన్(డెన్మార్క్), మహిళల సింగిల్స్ విజేతగా నోజోమి ఒకుహరా(జపాన్) పురుషుల డబుల్స్ విజేతలుగా ఇంగ్లాండ్ ద్వయం మార్కస్ ఎల్లిస్, క్రేస్ లాంగ్రిడ్జ్లు, మహిళల డబుల్స్ విజేతలుగా జపాన్ ద్వయం యుకిపుకుషిమా, సయకాహిరోటాలు నిలిచారు.
పోర్చుగీసు గ్రాండ్ ప్రి–2020
అక్టోబర్ 25న జరిగిన పోర్చుగీస్ గ్రాండ్ ప్రి–2020 ఫార్ములావన్ పోటీల్లో లెవిస్ హమిల్టన్(మెర్సిడెజ్) విజేతగా నిలిచాడు. 1 గంట 29 నిమిషాల 56.828 సెకన్లలో రేస్ పూర్తి చేసిన హమిల్టన్ తన సహచర డ్రైవర్ వాల్టెరి బొటాస్ కన్నా 25.6 సెకన్ల ముందు కంప్లీట్ చేశాడు. ఈ టోర్నీలో వాల్టెరి బొటాస్(మెర్సిడెజ్) మార్క్స్ వెర్స్టాపెన్(రెడ్‌బుల్)లు వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.
హమిల్టన్ ప్రపంచ రికార్డు
ఫార్ములావన్ టోర్నీలో అత్యధికంగా 92 టైటిళ్లు పొందిన రేసర్‌గా లెవిస్ హమిల్టన్ రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 25న పోర్చుగీసు గ్రాండ్ ప్రి–2020 విజేతగా నిలిచి మైకెల్ షుమాకర్(జర్మని) 91 టైటిళ్ల రికార్డును అధిగమించాడు. అత్యధిక డ్రైవింగ్ చాంపియన్ చాంపియన్‌షిప్(7 సార్లు) షూమాకర్ పేరుతోనే ఉంది. హమిల్టన్(6సార్లు) 2008,14, 15, 17, 18, 19లలో డ్రైవర్ చాంపియన్‌షిప్ సాధించాడు. 2020 సీజన్లో 7 సార్లు విజేతగా నిలిచి డ్రైవర్ చాంపియన్‌షిప్ కోసం స్పష్టమైన ఆధిక్యంతో ఉన్నాడు.
ఆసియా దేశాల ఆన్లైన్ చెస్ టోర్నీ–2020
అక్టోబర్ 10 నుంచి జరిగిన ఆసియా దేశాల ఆన్లైన్ చెస్ టోర్నీ–2020లో భారత్ మహిళల జట్టు స్వర్ణం, పురుషుల జట్టు రజతం సాధించాయి. ఆసియా చెస్ ఫెడరేషన్ కొవిడ్ దృష్ట్యా ఆన్లైన్ వేదికగా టోర్నీ నిర్వహించగా ఆసియా–ఒషియానా నుంచి 32 దేశాలు పాల్గొన్నాయి. మహిళల జట్టు ఇండోనేషియాపై గెలుపొంది స్వర్ణం పొందగా, పురుషుల జట్టు ఆస్ట్రేలియాపై 3.5–4.5 తేడాతో ఓడి రజతం సాధించింది.
సైన్స్ & టెక్నాలజీ
పాసెక్స్–2020:
ఆస్ట్రేలియ– భారత్ నౌకా దళాల మధ్య సెప్టెంబర్ 23 నుంచి 24 వరకు నౌక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం యుద్ధ వ్యూహాల రూపకల్పన, మిత్రదేశాల సహకారం పరస్పరం పెంపొందించుకోవడం. ఈ విన్యాసాలలో భారత రహస్య యుద్ధనౌక ఐఎన్ఎస్ సహ్యాద్రి, క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కార్ముఖ్ పాల్గొనగా ఆస్ట్రేలియ తరుఫున హెచ్ఎంఏఎస్హోబార్ట్లు పాల్గొన్నాయి. ఇరు దేశాల మధ్య 2015 నుంచి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న పూర్తి స్థాయి నౌక విన్యాసాలు ‘AUSINDEX’.
జిమెక్స్–2020
రెండేళ్లకు ఒకసారి నిర్వహించే భారత్–జపాన్ దేశాల సంయుక్త నౌక విన్యాసాలు 2020 సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు ఉత్తర అరేబియ సముద్రంలో నిర్వహించారు. 2012లో తొలిసారిగా నిర్వహించగా తాజాగా నిర్వహించినవి నాలుగోసారి. భారత్ తరఫున రియర్ అడ్మిరల్ క్రిష్ణస్వామి నాధన్ ఆధ్వర్యంలో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ టర్కిష్ పాల్గొన్నాయి. జపాన్ నౌకలకు రియర్ అడ్మిరల్ కన్నో యసుషిగె నాయకత్వం వహించారు. 2020 సెప్టెంబర్ 10న జరిగిన పరస్పర రవాణా మద్దతు ఒప్పందం తరువాత తొలిసారి రెండు దేశాల మధ్య జరిగిన విన్యాసాలివి.
సూపర్ కంప్యూటర్
భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన హెచ్పీసీ(హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)–ఏ1 సూపర్ కంప్యూటర్ను పుణె కేంద్రంగా గల సీడ్యాక్(సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్) రూపొందించింది. దీని సామర్థ్యం6.5 పెటాప్లాప్స్(210A1 పెటాప్లాప్స్). దీనిని అమెరికన్ బహుళ సాంకేతిక సంస్థ ఎన్వీఐడీఐఏ సహకారంతో రూపొందించారు.
బాంగోసాగర్–2020
భారత్–బంగ్లాదేశ్ మధ్య జరిగిన మదో దశ నావి విన్యాసాలు అక్టోబర్ 3న ముగిశాయి. ఉత్తర బంగాళాఖాతంలో జరిగిన ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం భారత్–బంగ్లాదేశ్ అంతర్జాతీయ సాగర జలాల సరిహద్దు రేఖ వద్ద సమన్వయ గస్తీని బలోపేతం చేయడం. బంగ్లాదేశ్ నుంచి అబుబాకర్, ప్రోటోయ్లు పాల్గొనగా భారత్ నుంచి ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ ఖుక్రి పాల్గొన్నాయి.
శౌర్య క్షిపణి పరీక్ష
అణ్వస్త్ర సామర్థ్యమున్న హైపర్సోనిక్ క్షిపణి ‘శౌర్య’ కొత్త వెర్షన్‌ను అక్టోబర్ 3న విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం వీలర్స్ ఐలాండ్ నుంచి పరీక్షించిన ఈ క్షిపణి సామర్థ్యం 1000 కిలోమీటర్లు. శౌర్య జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే–15 తరగతి క్షిపణికి సంబంధించిన భూతల వెర్షన్ ఇది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణి 200 నుంచి 1000 కిలోల పెలోడ్ను మోసుకెళ్తుంది.
కల్పనా చావ్లా కార్గో నౌక ప్రయోగం
భారత– అమెరికన్ వ్యోమగామి దివంగత కల్పనా చావ్లా పేరుతో రూపొందించిన సరుకుల రవాణా వ్యోమనౌకను అక్టోబర్ 3న ప్రయోగించారు. అమెరికాలోనివర్జీనియ తీరంలోని అంతరీక్ష కేంద్రం నుంచి అక్టోబర్ 3న ప్రయోగించిన ఈ వ్యోమనౌక 3600 కిలోల సరకులను అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రానికి తీసుకెళ్తుంది. అంతరీక్ష కేంద్రంలో లీకేజిని పరిష్కరించడానికి పీడనంతో కూడిన ఎయిర్ ట్యాంకులు, 360 డిగ్రీల కోణంలో స్పేస్ వాక్‌ను చిత్రీకరించే కెమెరాలు, వ్యోమగాముల కోసం ముల్లంగి విత్తనాలు, మాంసం, పండ్లు, కూరగాయలు పంపించారు.
బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్
కాలుష్య నివారణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పాటిస్తున్న శుభ్రత చర్యల ఆధారంగా ప్రపంచ పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ), ఐక్యరాజ్యసమతి ప్రపంచ పర్యాటక సంస్థ(యుఎన్డబ్ల్యూటీఓ), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్)లు భారత్‌లోని 8 బీచ్‌లకు బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. గుర్తింపు పొందిన వాటిలో శివరాజ్‌పూర్(ద్వారక–గుజరాత్), ఘోఘ్లా(డయ్యూ), కాసర్కోడ్, పాడుబిద్రి(కర్నాటక), కప్పాడ్(కేరళ), రిషికొండ(ఏపీ), గోల్డెన్(పూరి–ఒడిశా), రాధానగర్(అండమాన్ నికోబార్)లు ఉన్నాయి.
తొలి హైడ్రోజన్ కారు
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి హైడ్రోజన్ ఆధారిత కారుకు అక్టోబర్ 10న ఢిల్లీలో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), కేపీఐటీ సంస్థలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో ఈ కారును సంయుక్తంగా రూపొందించాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ గాలిలోని ఆక్సిజన్‌ను వినియోగించుకొని కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ కరెంటుతో కారు పరుగెడుతుంది. 1.75 కేజీల బ్యాటరీ గల ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
బ్రహ్మోస్ పరీక్ష సక్సెస్
ధ్వనివేగం కన్నా అత్యంత ఎక్కువ వేగంతో ప్రయాణించే భారత స్వదేశీ సూపర్సోనిక్ క్షిపణి ‘బ్రహ్మోస్’ నౌకాదల వెర్షన్‌ను అక్టోబర్ 18న భారత్ విజయవంతంగా పరీక్షించింది. భూ, వాయు, నౌక, జలాంతర్గముల ద్వారా పరీక్షించే వీలున్న ఈ క్షిపణిని 2006లో సైన్యంలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 30న భూతల వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్, అక్టోబర్ 18న స్వదేశీ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ నుంచి అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది.
నాసా వినూత్న ప్రయోగం
‘బెన్ను’ గ్రహశకలం నుంచి 60 గ్రాముల మట్టి, రాళ్లను సేకరించేలా అమెరికా అత్యున్నత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2016లో ప్రయోగించిన ‘ఒసైరిస్–రెక్సే వ్యోమనౌక అక్టోబర్ 20న విజయవంతంగా చేరింది. భూమి నుంచి 32 కోట్ల కిలోమీటర్ల దూరంలో 1670 అడుగుల పరిమాణంతో గల ‘బెన్ను’ గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించి 2023 సెప్టెంబర్ 24న భూమిని చేరనుంది.
SLINEX–2020
‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత’ విధానంలో భాగంగా భారత్ 2020 అక్టోబర్ 19 నుంచి 21 వరకు శ్రీలకంతో కలిసి SLINEX–2020 విన్యాసాలను నిర్వహించింది. 2005లో తొలిసారి నిర్వహించిన ఈ విన్యాసాల 8వ ఎడిషన్ 2020లో శ్రీలకలోని ట్రింకోమలి జరిగాయి. భారత్ నుంచి రియర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నేతృత్వంలో జలాంతర్గామి విధ్వంసక నౌకలైన కమోర్తా, కిల్టన్లు అధ్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ చేతక్‌లు విన్యాసాల్లో పాల్గొన్నాయి.
పీఎంకేఎస్‌వై–ఏఐబీపీ ముంబై యాప్
కేంద్రజలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా ఇటీవల ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజన–ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం( పీఎంకేఎస్‌వై–ఏఐబీపీ) అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించాడు. నీటి వృథాను అరికట్టుతూ సూక్ష్మ నీటి పారుదలను ప్రోత్సహించే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ప్రధాన ఉద్దేశం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఈ యాప్ ద్వారా పంటలను, కాలువలను జియోట్యాగింగ్ చేస్తూ వాటి ప్రారంభం, ప్రస్తుత, పూర్తి స్థితిగతులను తెలుసుకుంటారు.
చంద్రుడిపై నీటి జాడలు
చంద్రుడి దక్షిణార్ధగోలంలో ఉన్న క్లావియస్బిలంలో నీటి జాడలు ఉన్నట్టు అమెరికా అత్యున్నత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన(స్టాటో స్పియరిక్ అబ్జర్వేటరి ఫర్ ఇన్ప్రారెడ్ ఆస్ట్రోనమి(సోఫియ) అబ్జర్వేటరి గుర్తించింది. క్లావియస్ బిలంలో 100–412 పీపీఎం ఉండవచ్చని అంచనా వేసింది. ఇది సహార ఎడారి కన్న వందరెట్లు అధికం. దీనిని తాగునీటి అవసరాల కోసం, రాకెట్ ఇంధన అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. 2008 అక్టోబర్ 22న పీఎస్ఎల్వి–సీ ద్వారా భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 కూడా చంద్రుడిపై నీటి జాడలు గుర్తించింది.
అవార్డులు:
సోనూసూద్‌కి అవార్డు:
లాక్డౌన్ కాలంలో పేదవర్గాలకు అందించిన రవాణా, వైద్య సేవలు పేద విద్యార్థులకు అందిస్తున్న విద్యాసేవలకు గాను ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) సంస్థ ప్రతిష్టాత్మక ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) హ్యూమనిటేరియన్ యాక్షన్’ పురస్కారాన్ని ప్రముఖ బాలివుడ్ నటుడు సోనూసూద్‌కి అందించింది.
సైమన్ రామో పురస్కారం
సిస్టమ్స్ ఇంజినీరింగ్ రంగంలో కృషి చేసిన వారికి అందించే సైమన్ రామో పురస్కారం 2020కి గాను ఇస్రో చైర్మన్ కె. శివన్‌కు లభించింది. ఆయనతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్‌లర్ బి.ఎన్ సురేష్‌కు అవార్డు లభించింది.
పీఏటీఏ గ్రాండ్ అవార్డు–2020
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం చేపట్టిన ‘ హ్యూమన్ బై నేచర్ ప్రింట్ కాంపెయిన్’కు పసిపిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్(పీఏటీఏ) గోల్డ్ అవార్డుకు ఎంపికైన 21 కార్యక్ర మాల్లో కర్ణాటక కార్యక్రమం ‘స్క్రిప్ట్ యువర్ అడ్వెంచర్’–2019 బెస్ట్ ప్రోగ్రామ్‌గా నిలిచింది.
గాంధీ అవార్డు–2020
మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ ఏటా అందించే గాంధీ అవార్డు–2020కి గాను రాజ్యసభ సభ్యుడు, ఆమ్‌ఆద్మి పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌కు లభించింది. అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రూ.25 వేలు అందజేస్తారు. మద్రాస్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా గతంలో వ్యవహరించిన కె. నారాయణ్ కురుప్ నేతృత్వంలోని కమిటీ అవార్డు గ్రహితను ఎంపిక చేసింది.
రైట్లైవ్లీహుడ్ అవార్డు–2020
ప్రత్యామ్నాయ నోబెల్‌గా పిలిచే రైట్లైవ్లీహుడ్ అవార్డు 2020కి గాను బ్రియాన్స్టివెన్ సన్(యూఎస్ఏ), లొట్టి కన్నింగ్హమ్ రెన్(నికరాగ్వా), నస్రిన్ సొటౌడెహ్(ఇరాన్), అలెస్ బియాలియాట్స్కి(బెలారస్)లకు లభించింది. పర్యావరణం, అంతర్జాతీయ అభివృద్ధి అంశాల్లో అవార్డు ప్రవేశపెట్టడానికి నోబెల్ కమిటీ తిరస్కరించడంతో స్వీడన్ వ్యాపార వేత్త జాకబ్ వాన్ ఉక్స్‌కుల్ 1981లో అవార్డు స్థాపించాడు. ఒక్కో గ్రహితకు 1 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు(రూ.82 లక్షలు) అందిస్తారు. లింగసమానత్వం, పత్రికా స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన కృషి ఆధారంగా 2020 గ్రహీతలను ఎంపిక చేశారు.
…………………………………………….
వార్తల్లో వ్యక్తులు
కువైట్ రాజు కన్నుమూత
కువైట్ రాజు షేక్ అల్ సభా అల్ అహ్మద్ సెప్టెంబర్ 29న మరణించారు. షేక్ సాద్ అల్ అబ్దుల్లా అల్ సబా తరువాత 2006లో కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టి గల్ఫ్ యుద్ధం(1990) తర్వాత కువైట్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇరాన్‌తో సంబంధాలు, అరబ్ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
శంకర్:
బేతాళ కథలకు కార్టూనిస్టుగా గుర్తింపు పొందిన శంకర్ సెప్టెంబర్ 29న మరణించారు. 1951 చందమామ పత్రికలో చేరిన శంకర్ 60 ఏళ్ల పాటు దానిలో పని చేశారు. ఆ పత్రిక మూతపడిన తర్వాత పలు తమిళ పత్రికలకు ఆయన బొమ్మలు అందించారు.
ధ్రువ తయారీలో రికార్డు:
తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ధ్రువ తయారీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రికార్డు సాధించింది.
దినేష్ కుమార్ ఖారా:
స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా నూతన చైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా నియమితులయ్యారు. రజనీష్ కుమార్ స్థానంలో అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టిన ఖారా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1984లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన దినేష్‌కుమార్ 2017లో భారతీయ మహిళా బ్యాంక్, దాని అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారు.
రాజేశ్వర రావు:
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఈయన 36 ఏళ్లుగా ఆర్బీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. అనారోగ్యంతో ఆరు నెలల క్రితం రాజీనామా చేసిన ఎన్ఎస్ విశ్వనాథన్ స్థానంలో రావు నియమితులయ్యారు. కొచ్చిన్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంబీఏ పూర్తి చేసిన రాజేశ్వరరావు 1984లో ఆర్బీఐలో చేరారు.
హరీష్ కొటేచా
అమెరికాలోని హిందూ సేవా సంస్థ ‘ హిందూ చారిటిస్ ఫర్ అమెరికా’ వ్యవస్థాపకుడైన హరీష్ కొటేచా ‘నేషనల్ అసోషియేషన్ ఫర్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ హోమ్‌లెస్ చిల్డ్రన్ యూత్’ సంస్థ అందించే శాండ్రనీస్ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికాలోని నిరాశ్రయులైన పిల్లలు, యువకులకు అండగా ఉంటూ వారి అవసరాలు తీరుస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
గుండా మల్లేశ్
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అక్టోబర్ 13న మరణించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 1983,1985,1994లో ఆసిఫాబాద్ నుంచి 2009లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఆయన ప్రాతినిథ్యం వహించారు.
చైతన్య వెంకటేశ్వరన్
ఢిల్లీకి చెందిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చైతన్య వెంకటేశ్వరన్ అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా భారత్‌లోని బ్రిటన్ హైకమిషనర్‌గా ఒకరోజు పని చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడంలో భాగంగా పోటీ నిర్వహించి చైతన్యకు ఈ అవకాశం కల్పించారు.
అనికా చేబ్రోలు
ఇన్సిలికో అనే విధానాన్ని ఉపయోగించి కొవిడ్–19 కారక సార్స్‌కోవ్–2 వైరస్‌లోని కీలకమైన స్పైక్ ప్రోటీన్‌కు నిర్దిష్టంగా అతుక్కునే ఒక పదార్థాన్ని కనుగొన్నందుకు భారత సంతతి బాలకి అనికా చేబ్రోలుకు అమెరికాలోని ‘3 ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్’ అవార్డు లభించింది.
అమర్త్యసేన్
1998 నోబెల్, 1999 భారత రత్న అవార్డు గ్రహీత అయిన అమర్త్యసేన్ 2020కి జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి పురస్కారాన్ని అక్టోబర్ 18న వర్చువల్ పద్ధతి ద్వారా స్వీకరించాడు. 1950 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డుతోపాటు 25 వేల యూరోలు అందిస్తారు.
ఐశ్వర్యశ్రీధర్
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2020 అవార్డును గెలుచుకోవడం ద్వారా ఆ ప్రత్యేకత పొందిన తొలి భారత మహిళగా ఐశ్వర్యశ్రీధర్ నిలిచింది. 2020లో ప్రకటించిన 56వ ఎడిషన్ అవార్డులలో ‘లైట్ ఆఫ్ ప్యాషన్’ పేరుతో తీసిన మిణుగురు పురుగుల చిత్రానికి అవార్డు లభించింది.
వార్తల్లో వ్యక్తులు
జస్టిస్ ఎమికోని బారెట్
అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అమెరికా సెనేట్ 52–48 ఓట్ల తేడాతో ఆమోదించింది. 7వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జడ్జిగా విధులు నిర్వర్తించిన ‘ఎమి’ని సుప్రీంకోర్టు జడ్జి రూత్ బాడర్ గిన్సేబర్గ్ స్థానంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. 115వ అసోసియేట్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు.
సరోజ్‌కుమార్
2010 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సరోజ్‌కుమార్ నవంబర్ 3న తెలంగాణలోని దుబ్బాక శాసనసభకు జరిగే ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకునిగా నియమించింది. ప్రస్తుతం చెన్నైలోని సైబర్ క్రైమ్ డివిజన్ సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరిస్తున్నారు.