Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​‌‌–జాతీయం జనవరి 2020

కరెంట్​ అఫైర్స్​‌‌–జాతీయం జనవరి 2020

నేషనల్

Advertisement

సీఎం అవాస్ యోజన

మురికివాడలలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘ముఖ్యమంత్రి అవాస్ యోజన’  పథకాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు నిర్వహించిన సర్వే ప్రకారం గృహాలు లేనివారికి పక్కా ఇళ్లు నిర్మిస్తారు. డిసెంబర్ 24న ప్రారంభించిన ఈ పథకంలో 64వేల మందికి మంజూరు పత్రాలు అందించారు.

నగదు డ్రాకు ఓటీపీ

Advertisement

ఈ ఏడాది జనవరి 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10వేలు అంతకుమించి నగదు విత్‌ డ్రా చేస్తే వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ)ని ప్రవేశపెట్టింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు ఈ నియమం వర్తిస్తుంది. ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎస్‌బీఐ ఖాతాదారులు నగదు డ్రా చేసినప్పుడు ఈ రూల్ వర్తించదు. బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

మహారాష్ట్రలో రుణమాఫీ

డిసెంబర్ 25న రైతుల రుణాలను మాఫీ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహాత్మా జ్యోతిరావు పూలే రైతు రుణ మాఫీ ’ పథకాన్ని తీసుకొచ్చింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు తీసుకున్న రూ.2లక్షలలోపు రుణాలకు ఇది వర్తిస్తుంది. 2020 మార్చిలో అమలుకానున్న ఈ పథకంతో రూ.21,216 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి.

Advertisement

చైనా బోర్డులు

ప్రతి ఏటా లక్షకు పైగా చైనా టూరిస్టులు ఇండియాలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తుండడంతో ఢిల్లీలోని 5 పర్యాటక ప్రదేశాలలో చైనా భాషలో సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని భారత పురాతత్వ శాఖ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్ స్థూపం, చౌకండి స్థూపం, కుషి నగరంలోని మహాపరినిర్యాణ దేవాలయం, పిపరాహ్వ, శరవస్థి వంటి ప్రదేశాలలోనూ ఏర్పాటు చేయనుంది.

 డిప్యూటీ సీఎంగా పవార్

Advertisement

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ డిసెంబర్ 30న నియమితులయ్యారు. గతేడాది నవంబర్ 23 నుంచి 25 వరకు బీజేపీ ప్రభుత్వంతో కలిసి డిప్యూటీ సీఎంగా కొనసాగిన పవార్ ప్రస్తుతం ‘మహా వికాస్ అఘాడి’ కూటమిలో భాగంగా నియమితులయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)కి చెందిన పవార్ ప్రస్తుతం బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సీఎంగా హేమంత్ సొరేన్

జార్ఖండ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ డిసెంబర్ 29న ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని మొరాబాది గ్రౌండ్‌లో గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. హేమంత్ జార్ఖండ్ సీఎం కావడం ఇది రెండోసారి. 2009 నుంచి 2013 మధ్య డిప్యూటీ సీఎంగా, సీఎంగా పనిచేశారు. ఆయనతోపాటు ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 81 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 30 సీట్లు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Advertisement

త్రివిధ దళాధిపతిగా రావత్

ఇండియాలో తొలిసారి ప్రవేశపెట్టిన త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ఎంపికయ్యారు. త్వరలో ఆర్మీ జనరల్‌గా వైదొలగనున్న ఆయన స్థానంలో మనోజ్ ముకుంద్ నరవాణె నూతన ఆర్మీ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ–1999కి నేతృత్వం వహించిన కె. సుబ్రమణ్యం కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నియామకాన్ని చేపట్టారు.

అటల్ కిసాన్ క్యాంటిన్లు

Advertisement

రైతులు, కూలీల కోసం రూ.10 రూపాయలకే ప్లేటు భోజనం అందించేందుకు హర్యానా ప్రభుత్వం ‘అటల్ కిసాన్ మజ్దూర్ క్యాంటిన్ల’ను డిసెంబర్ 29న కర్నాల్‌లో ప్రారంభించింది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ క్యాంటిన్లు అందుబాటులో ఉంటాయి. 4 రోటీలు, పప్పు, కూరగాయలు, అన్నం అందిస్తారు. రాష్ట్రంలోని మరో 25 ప్రాంతాలలో త్వరలో వీటిని తీసుకురానున్నారు.

కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్

కేంద్రహోం మంత్రిత్వశాఖ 2019 డిసెంబర్ 30న  నాగాలాండ్‌ను మరో 6 నెలలపాటు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. 1958 సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. నాగాలాండ్‌లో ఈ చట్టం గత 60 సంవత్సరాలుగా అమల్లో ఉంది.

Advertisement

ప్రణబ్ సేన్ కమిటీ

కేంద్ర  ప్రణాళిక, అమలు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక గణాంకాల కమిటీ సేవారంగాలు, వాణిజ్య, ఉపాధికల్పన రంగాలలో గణాంకాల సేకరణ కోసం 28 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఆర్థికవేత్త ప్రణబ్ సేన్ నేతృత్వం వహిస్తున్నారు. ఇది జనవరి 6న  తొలి సమావేశం నిర్వహించనుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే కార్మిక గణాంకాలు, సేవారంగం, వాణిజ్య పరిశ్రమల రంగం, అవ్యవస్థీకృత రంగంలో గణాంకాల సేకరణకు 4 ఉప కమిటీలు పనిచేస్తాయి.

తెలంగాణ టాప్–3

Advertisement

పేదరికం, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం వంటి 17 అంశాలపై నీతి ఆయోగ్ డిసెంబర్ 30న విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికలో తెలంగాణ 67 పాయింట్లతో మూడో ర్యాంకు దక్కించుకుంది. గతేడాది ఆరో ర్యాంకులో ఉన్న తెలంగాణ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుంది. 70 స్కోరుతో కేరళ తొలిస్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్​,, తమిళనాడు సైతం మూడో స్థానంలో ఉన్నాయి. బిహార్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు అధ్వాన్న పనితీరుతో చివరిస్థానంలో ఉన్నాయి. 2030 నాటికి యూఎన్‌ఓ రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. తొలిసారిగా 2018లో ఈ సూచీని నీతి ఆయోగ్ రూపొందించింది.

రైల్వే రక్షకదళం పేరు మార్పు

భారతీయ రైల్వేలు రైల్వే ప్రొటెక్షణ్ ఫోర్స్ పేరు ‘ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్‌’గా మార్చాయి. 1872 జులై 27న ఏర్పడిన ఈ సంస్థకు అరుణ్‌కుమార్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 30న పేరు మార్పునకు సంబంధించి రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ అమితాబ్ జోషి ప్రకటన విడుదల చేశారు.

Advertisement

100 గిగావాట్ల సామర్థ్యం

ఇండియా 2020లో 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సంతరించుకుంటుందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2019 నవంబర్ నాటికి 86 గిగావాట్లుగా ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల పెంపుకోసం ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షావం ఉత్థాన్ మహబియాన్ పథకం, ఇంటిపై కప్పు సోలార్ ఫేజ్–2తోపాటు మెగా సోలార్ పవర్ పార్కుల నిర్మాణం చేపట్టింది.

నేషనల్ ఆదివాసీ ఫెస్ట్

డిసెంబర్ 27 నుంచి 29వరకు జాతీయ ఆదివాసీ ఉత్సవం ‘ట్రైబల్ ఫెస్ట్’ పేరుతో చత్తీస్‌గఢ్‌ రాజధాని రాంచీలో నిర్వహించారు. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో 6 దేశాల నుంచి 1300 మంది కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రెండు విభాగాలలో 43 కళారూపాలను ప్రదర్శించారు.

నాణ్యమైన స్టేషన్ శివాజీ రైల్వే స్టేషన్​

ఆరోగ్యవంతమైన, నాణ్యమైన ఆహారం దొరికే రైల్వేస్టేషన్‌గా దేశంలోనే తొలిసారిగా ముంబయిలోని చత్రఫతి శివాజీ రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ గుర్తింపును అందజేసింది. ఆరోగ్యవంతమైన, సురక్షిత ఆహారమే లక్ష్యంగా ప్రారంభించిన ‘ఈట్ రైట్ ఇండియా’ ఉద్యమంలో భాగంగా ఈ గుర్తింపునిచ్చారు.

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్

డిసెంబర్ 27 నుంచి 31 వరకు 27వ బాలల సైన్స్ కాంగ్రెస్ కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించారు. కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు సంయుక్తంగా నిర్వహించాయి.  ‘సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ క్లీన్, గ్రీన్ అండ్ హెల్త్ నేషన్’ థీమ్‌తో నిర్వహించిన ఈ సదస్సులో 10 నుంచి 17 ఏళ్ల వయసున్న 658 మంది పిల్లలు పాల్గొన్నారు.

మైగవ్ యాప్

ప్రభుత్వ పథకాలు, సూచనలు, సలహాలను పౌరుల నుంచి తీసుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘మై గవ్’ మొబైల్‌ యాప్, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు కోటికి చేరాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దీనిని నిర్వహిస్తోంది. 2014 జులై 26న దీనిని ప్రారంభించారు.

ఈ–బీకేఆర్‌‌ఏవై

బ్యాంకుల వద్ద పేరుకుపోయిన నిరర్థక ఆస్తులను వేలం వేయడంలో ట్రాన్స్‌పరెన్సీని పాటించేందుకు కేంద్రం ‘ఈ–బీకేఆర్‌‌ఏవై’ ఎలక్ట్రానిక్ యాక్షన్ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొచ్చింది. ఇది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ తాకట్టు ఆస్తులతో అనుసంధానమై ఉంటుంది. దీనిలో ఆస్తుల వివరాలను రాష్ట్రం, జిల్లా, బ్యాంకుల వారీగా పరిశీలించవచ్చు. డిసెంబర్ 27 నాటికి రూ.2.3లక్షల కోట్ల విలువైన ఆస్తుల వివరాలు, వాటి ఫొటోలను ఇందులో అప్‌లోడ్ చేశారు.

‘ఆధార్’ రికార్డులు

2019 డిసెంబర్ 27 నాటికి ఆధార్ గుర్తింపు కార్డు 125 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. యూఐడీఏఐ ప్రకారం ఇప్పటివరకు 37వేల కోట్ల సార్లు ఆధార్‌‌ను ఉపయోగించారు. 331 కోట్ల సార్లు ఆధార్‌‌లో వివరాలను సవరించారు. ప్రతి రోజు 3 నుంచి 4 లక్షల వినతులు ఆధార్ సవరణ కోసం వస్తున్నాయి.

అభినందన్ పథకం

విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ లోన్‌లలో సబ్సిడీ ఇచ్చేందుకు డిసెంబర్ 27న అసోం ప్రభుత్వం ‘అభినందన్’ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో, బయట చదువుతున్న అసోం విద్యార్థులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా రూ.లక్ష వరకు లోన్ అందిస్తారు. దీనిలో గరిష్టంగా ఒకసారి రూ.50వేల సబ్సిడీ ఉంటుంది. పథకం ప్రారంభించిన రోజు 1,546మంది విద్యార్థులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.

కొత్తగా రెండు క్రీడలు

జనవరి 10 నుంచి ఫిబ్రవరి 22 వరకు అసోంలోని గువహటి ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనున్న 3వ ఖేలో ఇండియా క్రీడలలో కొత్తగా రెండు క్రీడలు ప్రవేశపెట్టనున్నారు. లాన్‌బౌల్స్, సైక్లింగ్ క్రీడలు కొత్తగా రానున్నాయి. వీటిని అండర్–17, అండర్–21 కేటగిరీలలో నిర్వహించనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలలో 58 జనరల్‌ కాగా, 12 ఎస్సీలకు కేటాయించారు. ప్రస్తుతం 6వ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ ఎన్నికలలో భాగంగా తొలిసారి 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు.

ఏపీలో ఆరోగ్యశ్రీ

ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్య శ్రీని పునర్‌‌వ్యవస్థీకరిస్తూ  జనవరి 3న ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.   రూ. 5లక్షల లోపు ఆదాయం ఉండి రూ. 1000 కన్నా ఎక్కువ ఖర్యయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.  పశ్చిమ గోదావరి జిల్లాలో  2059 వ్యాధులకు కవరేజీ ఉండగా మిగిలిన 12 జిల్లాలో 1259 వ్యాధులకు కవరేజీ ఉంటుంది.  దీంతో పాటుగా బడిలో హాజరుశాతాన్ని పెంచడమే లక్ష్యంగా జనవరి 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 182

రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎమర్జెన్సీ మినహా అన్ని రకాల సేవలకు 139 నంబర్‌‌ను మాత్రమే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎమర్జెన్సీ సేవలకు182 కొనసాగించనున్నారు. ఈ హెల్ప్‌ లైన్ 12 భాషలలో అందుబాటులో ఉంది. ఇటీవల రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్‌గా మార్చింది.

ఆసియాలో సింహాల లెక్క

ఈ ఏడాది మేలో ఆసియాలోని సింహాల గణనను చేపట్టాలని వైల్డ్‌ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.  మొదటగా గుజరాత్‌లోని 7జిల్లాలలో 8వేల నుంచి 10వేల కెమెరాలు ఉపయోగించి 25వేల చదరపు కి.మీ విస్తీర్ణంలో సింహాల గణనను చేపట్టనున్నారు. జాతీయ పులుల గణనలో ఉపయోగించిన టెక్నాలజీని వాడుతూ 3కి.మీ ప్రాంతాన్ని ఒక గ్రిడ్‌గా ఏర్పాటు చేసి 1000  నుంచి 2వేల మంది అధికారులను నియమించనున్నారు.

ఎలక్ర్టిక్ చార్జింగ్  సెంటర్లు

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ FAME( ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్ ఫ్యాక్షరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా) పథకంలో భాగంగా 2636 ఎలక్ట్రిక్ చార్జింగ్ సెంటర్లను  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 62 నగరాలలో 1633 వేగవంతమైన చార్జింగ్ కేంద్రాలు, 1003 తక్కువ వేగం చార్జింగ్ కేంద్రాలను  ఏర్పాటు చేయనుంది.  మహారాష్ట్రకు 317, ఏపీకి 256, తెలంగాణాకు 131 కేటాయించనున్నారు.

జీశాట్–30

ఈ ఏడాది జనవరి 17న  ఉత్తర అమెరికాలోని ఫ్రెంచ్‌ గయనాలోని యూరోపియన్ స్పేస్ పోర్ట్ నుంచి జీశాట్–30 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.  దీని కోసం ఏరియల్–5ఈసీఏ రాకెట్ ఉపయోగించనున్నారు. 2005లో ప్రయోగించిన ఇన్‌శాట్–4ఏ కాలపరిమితి 2019 అక్టోబర్ 21న ముగియడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జీశాట్–30  ప్రయోగిస్తున్నారు. ఇది 15 ఏండ్ల పాటు సేవలందించనుంది.

 MANI యాప్‌

జనవరి 8న  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ MANI (‘మొబైల్ ఏడెడ్ నోట్ ఐడెంటీఫైయర్ ) యాప్‌ను విడుదల చేశారు.  పాక్షిక, వర్ణ అంధత్వం కలిగిన వారు కరెన్సీ నోట్లను సులువుగా గుర్తించడానికి ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు.

107వ సైన్స్‌కాంగ్రెస్

జనవరి 3 నుంచి 7 వరకు 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు   కర్ణాటక రాజధాని బెంగుళూర్‌‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లో జరిగాయి.  ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును  ప్రారంభించారు. ‘ సైన్స్ అండ్ టెక్నాలజీ –రూరల్ డెవలప్‌మెంట్’ అనే థీమ్‌తో ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించారు. రైతులు, సాంకేతికత ఆవిష్కరణల మధ్య అనుసంధాన్ని ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.  1987, 2002 తర్వాత బెంగుళూర్‌‌ ఈ ఉత్సవాలకు మూడో సారి ఆతిథ్యమిచ్చింది.  మహిళా కాంగ్రెస్ సమావేశానికి టెస్సీ థామస్ (మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా) హాజరయ్యారు.

విక్రమ్ ఇన్నోవేషన్ సెంటర్

గుజరాత్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎక్స్‌టెన్షన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌లో ‘విక్రమ్ సారాబాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే ఆశయంతో యూనిసెఫ్​, గుజరాత్ యూనివర్సిటీ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 6 న గాంధీనగర్‌లో జరిగిన చిల్డ్రన్స్ ఇన్నోవేషన్ ఫెస్టివల్ (సిఐఎఫ్) కార్యక్రమంలో భాగంగా ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

12వ సంయుక్త నౌక విన్యాసాలు

భారత్–ఒమన్ దేశాల మధ్య కొనసాగుతున్న 12వ సంయుక్త నౌక విన్యాసాలలో పాల్గొనడానికి  ఒమన్ రాయల్ నావికి చెందిన రెండు నౌకలు ఆల్ రసిక్, ఆల్‌కసబ్‌లు జనవరి 5 న గోవా తీరాన్ని చేరాయి. దీనిలో భారత నౌకలు ఐఎన్‌ఎస్ బియాస్, ఐఎన్‌ఎస్ సుభద్ర పాల్గొన్నాయి.  సముద్రంలో హార్బర్ వద్ద రెండు విడతలుగా ఇవి  విన్యాసాలు చేశాయి.

హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్

వ్యోమగాముల  శిక్షణ కోసం ఇస్రో కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరెలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హ్యూమన్ స్పేస్ ప్లైట్ సెంటర్   ఏర్పాటు చేయనుంది. రూ. 2700 కోట్లతో బెంగుళూర్‌‌లో ఏర్పాటు చేయనున్న ఈ స్పేస్  సెంటర్  ద్వారా గగన్‌యాన్ కార్యకలాపాలు  కంట్రోల్ చేయబడతాయి. రాబోయే మూడేండ్లలో ఈ కేంద్రం కార్యకలాపాలను ప్రారంభించనుంది.  2022లో గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా అంతరిక్షంలో వెళ్లే  నలుగురు వ్యోమగాములకు ఇక్కడ శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతం వీరికి రష్యాలోని యూరిగగారిన్ కాస్మొనాట్ సెంటర్‌‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

అత్యంత ఉష్ణ సంవత్సరం

2019 సంవత్సరాన్ని భారత వాతావరణ శాఖ  అత్యంత ఉష్ణ సంవత్సరంగా ప్రకటించింది. 1901  నుంచి ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ఆధారంగా 2016 లో నమోదైన ఉష్ణోగ్రతలను 2019 ఇయర్ అధిగమించింది.

చంఢీగడ్ ఐదో స్టేషన్

అంధుల కోసం ప్రత్యేక నావిగేషన్ సిస్టమ్‌ను ప్రారంభించిన ఐదో స్టేషన్‌గా చంఢీగడ్ రైల్వేస్టేషన్ గుర్తింపు పొందింది.  భారత రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేక్‌ మై ట్రిప్, అను ప్రయాస్ అనే ఎన్‌జీవోలు సంయుక్తంగా ప్రారంభించాయి.  దేశంలో మొట్టమొదటి సారిగా  మైసూర్ రైల్వే స్టేషన్‌లో నావిగేషన్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు.

టాప్–20లో కన్హయ్య

2020 లో  పరిశీలించదగిన 20 మంది వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక  ప్రకటించింది. ఇందులో   యూఎస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు హసల్ మిన్హాజ్ మొదటిస్థానంలో నిలిచారు. అర్సెలర్ మిట్టల్ సంస్థ సీఈవో ఆదిత్య మిట్టల్ రెండో స్థానం పొందారు. ఇండియా నుంచి జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ కన్హయ్య కుమార్ 12వ స్థానంలో నిలిచారు. ఇటీవల జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడంలో కృషి చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ 16వ స్థానంలో నిలిచారు.

సెల్ఫ్ డిఫెన్స్ ‘సుకన్య’

 కోల్‌కత్తా పోలీసులు జనవరి 6 న ‘సుకన్య ప్రాజెక్టు’ మూడో దశను ప్రారంభించారు.  ఇందులో భాగంగా సిటీలోని 100 స్కూళ్లు, కాలేజీల్లో  చదువుతున్న స్టూడెంట్స్‌కు సెల్ఫ్​ డిఫెన్స్‌లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

బక్సా బర్డ్ ఫెస్టివల్

జనవరి 7నుంచి 10 వరకు పశ్చిమ బెంగాల్ లోని అలిపూర్‌‌దార్ జిల్లా ‘బక్సా బర్డ్ ఫెస్టివల్’ను నిర్వహించారు. ఈ కాలంలో ఉత్తరార్థగోళంలోని శీతల ప్రాంతాల నుంచి  300 అరుదైన పక్షి జాతులు ఇక్కడికి వస్తాయి. 4 రోజుల పాటు జరిగే ఈ పండుగను చూసేందుకు,  వీటి చిత్రాలను తీసుకునేందుకు  ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అండమాన్‌ నికోబార్ ద్వీపాల నుంచి 50 మంది అర్నిథాలజిస్ట్‌లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీళ్లలో విదేశీయులు కూడా ఉన్నారు. గ్రేట్‌‌‌‌‌‌‌‌ హార్న్‌‌‌‌‌‌‌‌బిల్‌‌‌‌‌‌‌‌, సుల్తాన్‌‌‌‌‌‌‌‌ టిట్‌‌‌‌‌‌‌‌, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ స్పాటెడ్‌‌‌‌‌‌‌‌ ఈగల్‌‌‌‌‌‌‌‌ సహా 300 రకాల పక్షులు ఇక్కడికి వస్తుంటాయి.

ఇయర్‌‌ ఆఫ్ మొబిలిటీ

కేంద్ర భద్రతా దళం 2020 సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ మొబిలిటీ ( చైతన్య సంవత్సరం)గా ప్రకటించింది. దీని ద్వారా బలగాలకు  క్రీడలు, శారీరక ధారుడ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి సహాయపడతారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం 1969లో ఏర్పాటై కేంద్ర హో మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. దీనికి ప్రస్తుత డైరెక్టర్‌‌ జనరల్ గా రాజేశ్ రంజన్ ఉన్నారు.

నేషనల్ ఫారెస్ట్ రిపోర్ట్

2019 సంవత్సరానికి సంబంధించిన ‘నేషనల్ ఫారెస్ట్ రిపోర్ట్’ను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసింది. 2004–17 గణాంకాల ప్రకారం దేశంలో  21.40శాతం అటవీ ప్రాంతం దహనానికి గురయ్యే అవకాశం ఉంది  3.89శాతం భూభాగం అత్యంత  ఎక్కువగా, 6.01శాతం సాధారణంగా , 11.50శాతం తక్కువగా దహనానికి గురయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రాల పరంగా 2,795 హెక్టార్ల ప్రాంతంతో మిజోరం ప్రమాదకర స్థితిలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో 2,723 హెక్టార్లు, మహారాష్ట్రలో 2,516, ఒడిశాలో 2213, ఛత్తీస్‌గఢ్‌లో 1008 హెక్టార్లు అటవీ దహనం జరిగే ప్రాంతాలుగా గుర్తించింది.

తొలి స్టేట్ యూపీ

ఇటీవల సవరించిన పౌరసత్వ సవరణ చట్టం–2019(సీఏఏ) ప్రకారం అక్రమ వలసదారుల జాబితాను రూపొందిస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన 6 రకాల మతాల వారిని గుర్తించి పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు  వలసదారులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న 75 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్య సంజీవని

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్‌ స్కీంలలో ఆరోగ్య సంజీవనిని తప్పనిసరి చేస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరి డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పలు రకాల పేర్లతో కొనసాగుతున్న ప్రైవేటు ఇన్సూరెన్స్ పాలసీల పేరు మార్చాలని సూచించింది. దీనిలో కనిష్టంగా రూ.లక్ష, గరిష్ఠంగా రూ.5లక్షల పాలసీ అందించాలని స్పష్టం చేసింది. 18 నుంచి 65 ఏండ్ల వయసున్న వ్యక్తితో పాటు భార్య, పిల్లలు, తల్లిండ్రులకు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది.

రోహిత్ శర్మ స్టేడియం

హైదరాబాద్‌లో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ  పేరుతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కమలేశ్ గురు నేతృత్వంలో జనవరి 3న చేగూర్‌‌లోని శాంతి వనంలో రోహిత్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై  స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. హార్ట్‌ఫుల్‌నెస్ అనే సంస్థ ఈ స్టేడియం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.

వెంకయ్య నాయుడు నేషనల్ అవార్డు–2020

ముప్పవరపు ఫౌండేషన్ పదేండ్ల ఉత్సవాల సందర్భంగా తొలిసారిగా వెంకయ్యనాయుడు నేషనల్ అవార్డులను అందజేశారు. దీని విలువ రూ. 5లక్షలు.  వ్యవసాయ రంగంలో హరితవిప్లవానికి కృషి చేసిన  ఎం.ఎస్ స్వామినాథన్‌కు, రాష్ట్రీయ సేవా సమితి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్న గుంట మునిరత్నంను  ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

అరుణాచల్ ప్రదేశ్​ కొత్త లోగో

జనవరి 9న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కొత్త అసెంబ్లీ  లోగోను ఆమోదించింది. దీనిలో జాతీయ చిహ్నం నాలుగు సింహాలు, దేవనాగరి లిపిలో ఉన్న సత్యమేవ జయతే అనే పదాన్ని చేర్చారు. దాని చుట్టూ నక్కతోక ఆర్కిట్‌గా పిలువబడే రింకోస్టైలిష్​ రెట్యూసాతో పాటు అసెంబ్లీ స్వయం ప్రతిపత్తి సూచించే నీలిరంగును కలిపి రూపొందించారు.

శబరిమల కేసులో సుప్రీం నిర్ణయం

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రదేశాన్ని అనుమతిస్తూ ఐదుగురు సభ్యులు 4–1  తేడాతో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని 9మందితో కూడిన సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ బోబ్డౌతో పాటు, ఆర్‌‌ భానుమతి, ఎం.ఎం శంతన్‌గౌడ్, అబ్దుల్‌ నజీర్, ఆర్​ సుభాష్​ రెడ్డి, బి.ఆర్ గవాయి, అశోక్‌ భూషణ్‌, నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత ఉన్నారు. 

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు

12ఏండ్లలోపు బాలికల అత్యాచారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా  పెండింగ్‌లో ఉన్న 1.60 లక్షల కేసుల విచారణ కోసం 24 రాష్ట్రాల్లో 1023 స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. జాతీయ మహిళ రక్షణ మిషన్‌లో భాగంగా క్రిమినల్ లా చట్టం2018 ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు విలువ 767.25 కోట్లు, ఇప్పటికే 12 రాష్ట్రాలలో ఉన్న 216 పోస్కో కోర్టులకు ఇవి అదనం,  2018 మార్చి 31 నాటికి వివిధ కోర్టులలో 1,66,882 పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

కర్బన ఉద్గారాలను తగ్గించిన ఎయిర్‌‌పోర్ట్‌లు

2015 నుంచి 2018 వరకు co2 విడుదల గణాంకాల ప్రకారం కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష కృషి చేసిన నాలుగు ఎయిర్ పోర్టులకు అంతర్జాతీయ విమానయాన మండలి గుర్తింపు ఇచ్చింది. వీటిలో నేతాజి సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌‌పోర్ట్‌(కోల్‌కత్తా), బిజూపట్నాయక్ ఎయిర్‌‌పోర్ట్‌(భువనేశ్వర్‌‌), లాల్‌బహదూర్ శాస్త్రీ ఎయిర్‌‌పోర్ట్‌(వారణాసి), త్రివేండ్ర ఎయిర్‌‌పోర్ట్‌  ఉన్నాయి.

రైల్వే  తొలి సొలార్ సెక్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ డివిజన్‌ నందాల–యర్రుగుంట్ల  రైల్వే సెక్షన్‌ను తొలి సోలార్ సెక్షన్‌గా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.  కడప జిల్లాలోని ఈ సెక్షన్‌ పరిధిలోని మద్దూర్, బనగానపల్లి, కోయిలకుంట్ల, సంజాముల నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్‌‌, రైల్వే స్టేషన్లలో సొలార్ పరికరాలను అమర్చారు.  2020–21 నాటికి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సొలార్ ప్లేట్లను అమర్చారు.

పప్పు ధాన్యాల సదస్సు–2020

ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు  జాతీయ పప్పు ధాన్యాల సమాఖ్య ఆధ్వర్యంలో మహారాష్ట్ర లోని  అంబివ్యాలి నగరంలో పప్పు ధాన్యాల సదస్సు –2020 ను  నిర్వహించనున్నారు.  ప్రపంచ అవసరాలలో భారత్ 25% పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేస్తూ 27% వినియోగిస్తోంది. ఈ మేరకు  2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి, దిగుమతి, కోత అనంతరం యాజమన్య పద్దతులను మెరుగుపర్చడానికి కావాల్సిన అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఇంటిగ్రేటెడ్ ఐరన్ డెవెలప్‌మెంట్‌ సెంటర్

జనవరి 11న పశ్చిమ బెంగాల్ కేంద్రంగా సమీకృత ఉక్కు అభివృద్ధి కేంద్రాన్ని  కేంద్ర పెట్రోలియం , సహజవాయుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ప్రారంభించారు. ఒడిశా, జార్ఖాండ్, చత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ను కలుపుకుని దీనిని ఏర్పాటు చేశారు.  కేంద్ర ఉక్కు విధానం ప్రకారం 2030–31 నాటికి దేశవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిని 75శాతం పెంచాలనే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

 యుద్ధనౌకపై తేజస్‌

ఇండియా నేవీ కోసం స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేజస్ విమానం జనవరి 11న ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్ అయింది.  దీంతో యుద్దనౌకలపై విజయవంతంగా విమానాలను దించగల అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇండియా చేరింది. తేజస్‌ను భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ( డీఆర్‌‌డీఓ) ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) తదితర సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి పరిచాయి.

భారత్–జపాన్ కోస్ట్ విన్యాసాలు

భారత్–జపాన్ కోస్ట్ గార్డ్స్ సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు జనవరి 16 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ విన్యాసాలు తొలిసారిగా 2000వ సంవత్సరంలో నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి జపాన్ తీరగస్తీ నౌక చెన్నై తీరానికి చేరుకుంది.

యశస్విని స్కీం

స్వయం సంఘాలకు రూ. 5లక్షలకు వరకు వడ్డీలేని  రుణాలు అందించడం కోసం జనవరి 11న గోవాలోని పనాజీ జిల్లా జలెగావ్ పట్టణంలో స్మృతి ఇరానీ ‘యశస్విని’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.  హీమోగ్లోబిన్, షుగర్, బీపీ నిర్దారణ పరీక్షల కోసం ఉపయోగపడే కిట్లను స్వస్త సఖీ ప్రాజెక్టు లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు అందజేయనున్నారు.

నేషనల్ యువ దివాస్

స్వామి వివేకానంద 157వ  జయంతి సందర్భంగా జనవరి12న జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ ఏడాది ‘ ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్’ అనే థీమ్‌తో  యువ దివాస్‌ను నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరా జిల్లాలోగల బేలూర్ మఠంలో నిర్వహించిన ఉత్సవాలలో  ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

అసెండ్–2020

పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జనవరి 9 నుంచి10వరకు కేరళలోని కొచ్చి కేంద్రంగా అసెండ్ –2020 సదస్సును నిర్వహించారు.  ఈ సందర్భంగా సుమారు  రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సమీకరించినట్టు  కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి 164 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిపింది.

మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు –2019

ప్రధాన మూలకాల నుంచి సమ్మేళనాల తయారీలో ఉత్ప్రేరకాల ప్రభావాన్ని అధ్యయనం చేసినందుకు హైదరాబాద్‌కు  చెందిన సైంటిస్ట్  సుఖ్యాసింగ్ సేన్ బృందానికి ‘మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డు–2019’ ను జనవరి 9న కర్ణాటక ప్రభుత్వం అందజేసింది. రసాయన శాస్ట్రంలో 10ఏండ్లకు పైగా అనుభవమున్న వారికి అందించే ఈ అవార్డు విలువ రూ.2లక్షలు.  ట్రావెలింగ్ అవార్డు కింద ఒక్కొక్కరికి 1.50లక్షలు అందిస్తారు.

నీటి విధానంపై కమిటీ

జాతీయ నీటి విధానం రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్‌గా  గ్రేటర్ నోయిడాలోని శివ నాడప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మిహిర్ లీ ఎంపికయ్యారు. కమిటీ పదవీకాలం 6 నెలలు.  జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో శశిరేఖ, రమేశ్ చంద్రపాండ, ఆశ్విన్ పాండా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

తొలి మోడల్ క్రీడా గ్రామాలు

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని  బహదూర్ పుర్, ఖెరివిరాన్ గ్రామాలు  దేశంలోనే తొలి మోడల్ క్రీడా గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ( గజియాబాద్),  ‘ఎ వే ఆఫ్ లైఫ్​ ’అనే ఎన్జీవో తో కలిసి చేపట్టిన ‘ ఆదర్శ్ గ్రామ్’ పథకంలో భాగంగా వీటిని ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఒలంపిక్ ఆటలకు సంబంధించిన పరికరాలతో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తారు.

లతా మంగేష్కర్ అవార్డులు

ప్రముఖ బాలివుడ్ గాయకురాలు లతామంగేష్కర్ పేరుతో అందిస్తున్న అవార్డులకు  ఎంపికైన వారి పేర్లను జనవరి 16న ప్రకటించారు. 2017 ఏడాదికి  సింగర్ సుమన్ కల్యాణ్‌పూర్, 2018 ఏడాదికి సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్ ఎంపికయ్యారు. అవార్డు విలువ రూ. 2లక్షలు, దీనిని మధ్యప్రదేశ్​ ప్రభుత్వం 1984 నుంచి అందజేస్తుంది. అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యుడిగా గాయకుడు సురేష్​ వడ్ కార్ వ్యవహించారు.

రోజ్‌గార్ సంఘీ యాప్

జనవరి 15న చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్​ బఘేల్‌ రోజ్‌గార్ సంఘ్ యాప్‌ను ప్రారంభించారు. దీనిని  ఆ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూపొందించింది. యాప్ ద్వారా పారిశ్రామిక సంస్థలకు ప్రతిభ ఉన్న యువత వివరాలు అందిస్తూ వారధిగా పనిచేస్తుంది.

వ్యవసాయ కౌలు ఒప్పందం విధానం

దేశంలోనే వ్యవసాయ కౌలు ఒప్పందం విధానం ప్రవేశపెట్టిన తొలి  రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. దీనిలో భాగంగా ప్రభుత్వానికి రైతులు 30ఏండ్ల ఒప్పందంతో భూములు అప్పగించారు. ఆ భూమిని ప్రభుత్వం వివిధ సంస్థలకు, కంపెనీలకు  జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో ప్రభుత్వం లీజుకు ఇస్తుంది.

చాంపియన్ ఆఫ్​ చేంజ్–2019

జార్ఖండ్ లోని బర్హట్, దుమ్కా అసెంబ్లీ నియోకవర్గాల్లో చేసిన కృషికి ఆ రాష్ట్ర  సీఎం హేమంత్ సోరెన్‌కు  చాంపియన్ ఆఫ్ చేంజ్–2019 అవార్డు లభించింది.  జనవరి 20న  న్యూఢిల్లీలో  జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. వరసగా రెండో సారి బర్హట్ నుంచి గెలిచిన హేమంత్ ఈ అవార్డును తన తండ్రి శిబూసోరెన్, రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.

వన్ నేషన్– వన్ రేషన్

దేశంలో ఏప్రాంతం నుంచైనా రేషన్ అందుకునేందుకు వీలుగా  కేంద్రం ‘వన్ నేషన్–వన్ రేషన్ స్కీంను ప్రవేశపెట్టింది.  జనవరి 1 నుంచి  తెలంగాణ  ఏపీ, మధ్యప్రదేశ్, గోవా, త్రిపుర, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, హర్యాణ, గుజరాత్,మహారాష్ట్ర లో  అమలు చేస్తున్నారు. జూన్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వన్ పేర్కొన్నారు.

సరస్వతి సమ్మాన్ అవార్డు–2019

సింధీ భాష రచయిత వాసుదేవ మోహి సరస్వతి సమ్మాన్ అవార్డు–2019 కి  ఎంపికయ్యారు. ఈయన రచించిన ‘చెక్‌బుక్’ అనే చిన్న కథల సంపుటికి ఈ పురస్కారం లభించింది.  1991 నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ సరస్వతి సమ్మాన్ అవార్డును అందజేస్తోంది. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో అవార్డును అందిస్తున్నారు . ఈ సారి అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్‌గా లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్​ కశ్యప్ వ్యవహరించారు.

జి.వి.రాజా అవార్డు

కేరళ ప్రభుత్వం అందించే జి.వి రాజా అవార్డును ఈ ఏడాదికి  అథ్లెట్ మహమ్మద్ ఆనస్‌కు అందజేస్తున్నట్టు ప్రకటించింది. ఈయన 2018లో జక్తర్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్‌ను సాధించారు.  రూ. 3లక్షల విలువ చేసే ఈ పురస్కారాన్ని లెఫ్టినెంట్ కల్నర్ గోదావర్మ రాజా పేరుతో స్థాపించారు.

ఇండియాకు 54వస్థానం

ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) జనవరి 22న విడుదల చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ–2019లో ఇండియా 51వ స్థానంలో నిలిచింది. 2018తో పోలిస్తేపది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. మొదటి మూడు స్థానాల్లో నార్వే, ఐస్‌లాండ్, స్వీడన్ దేశాలు ఉన్నాయి.

ముగిసిన ఖేలో ఇండియా గేమ్స్

 జనవరి 10న అస్సాంలోని గువాహటిలో ప్రారంభమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి 22న ముగిశాయి. ఈ క్రీడల్లో మహారాష్ట్ర 78 గోల్డ్ మెడల్స్, 77 సిల్వర్ మెడల్స్, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హర్యానా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో,  ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 7 గోల్డ్‌, 6 సిల్వర్, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి15వ స్థానం సాధించింది. ఆంధ్రప్రదేశ్ 3 గోల్డ్, 7 సిల్వర్, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు సాధించి  22వ స్థానంలో నిలిచింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!