Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ జాతీయం ఏప్రిల్​ 2020

కరెంట్​ అఫైర్స్​ జాతీయం ఏప్రిల్​ 2020

Current Affairs National April 2020

నేషనల్


కాంగ్రెస్​ టాస్క్​ఫోర్స్​
కరోనా వ్యాధిని అరికట్టడంలో కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు, సూచనల కోసం జాతీయ కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధి టాస్క్​ ఫోర్స్​ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్​గా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సభ్యులుగా జైరాం రమేష్​, వీరప్ప మొయిలీ,తమ్రద్వజ్​ సాహులను నియమించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల మ్యానిఫెస్టో కమిటి చైర్మన్​లు కూడా దీనిలో సభ్యులుగా కొనసాగుతారు.
టీమ్​​–11
కరోనాను ఎదుర్కోవడం కోసం ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం11 కమిటీలను ఏర్పాటు చేసింది. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రెవెన్యూ, ప్రజా వ్యవహారాలు వంటి కమిటీలు కరోనాను ఎదుర్కోవడానికి ఆయా రంగాల్లో సరైన చర్యలు తీసుకుంటాయి. వీటన్నింటిని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలోని మరో కమిటి సమన్వయం చేస్తుంది. ఈ కమిటీలన్ని ముఖ్యమంత్రి మోగి ఆధిత్యనాథ్​ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
సైటెక్​ ఎయిర్​ఆన్​
ఆసుపత్రి గదులను వేగవంతంగా వైరస్​ రహితంగా మార్చే కూలర్​ వంటి పరికరమే సైటెక్​ ఎయిర్​ఆన్​. పుణెకు చెందిన ‘సైటెక్​ పార్క్​’ అనే స్టార్టప్​ సంస్థ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఒక గదిని గంటలో 99.7% వైరస్​ రహితంగా మార్చవచ్చు. ఈ పరికరం ద్వారా వెలువడే డిటర్జంట్​ వైరస్​ ఉపరితలంపై ఉండే ప్రోటీన్​ ప్రాపర్టిని ద్వంసం చేస్తుంది.
స్టాండర్డ్​ ఇండియా
భారత పర్యాటక మంత్రిత్వ శాఖ రూపొందించిన వెబ్​పోర్టల్ స్టాండర్డ్​ ఇండియా. కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్​లో చిక్కుకున్న విదేశి టూరిస్టులకు భారత్​లో లాక్​డౌన్​ ముగిసి విదేశి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యే వరకు సహాయం చేయడానికి ఉద్ధేశించి దీన్ని రూపొందించారు. ఇక్కడే చిక్కుకున్న విదేశి పర్యాటకులను భారత విదేశీ మంత్రిత్వ శాఖకు చెందిన ఎంబసిలకు చేర్చుతారు. దీని కోసం రెండు టోల్​ ఫ్రీ నంబర్లు(1075 మరియు 91–11–23978046)లను ఏర్పాటు చేశారు.
పీఎం–కేర్స్​
కోవిడ్​–19తో సతమతమవుతున్న తరుణంలో దేశ పునర్నిర్మాణంలో భాగంగా ప్రజల ఆర్థిక భాగస్వామ్యం కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమమే ప్రైమ్​ మినిస్టర్స్​ సిటిజన్​ అసిస్టెంస్​ అండ్​ రిలీఫ్​ ఇన్​ ఎనర్జీ సిచుయేషన్​ ఫండ్​(పీఎం కేర్స్​). దీని కోసం www.pmindia.gov.in వెబ్​సైట్ సందర్శించి పీఎం​–కేర్స్​ని క్లిక్​ చేసి ఆర్థిక సహాయం చేయవచ్చు. ఈ కార్యక్రమానికి ఎస్​బీఐ పార్ట్​నర్​ బ్యాంక్​గా వ్యవహరిస్తుంది.
దూరదర్శన్​ కార్యక్రమాలు
లాక్​డౌన్​లో ఉన్న ప్రజల మానసిక ఉల్లాసం కోసం రామానంద–సాగర్​ దర్శకత్వంలో రూపొందించిన రామాయణం, బి.ఆర్​,చోప్రా దర్శకత్వంలోని మహాభారతం సీరియల్స్​ను దూరదర్శన్​, డిడి భారతి చానల్స్​లో ప్రసారం చేస్తుండగా ఏప్రిల్ మొదటి వారం నుండి శక్తిమాన్​, చాణక్యలను ప్రసారం చేయాలని నిర్ణయించింది. వీటికితోడు శ్రీమాన్​ శ్రీమతి, ఉపనిడ్​ గంగా, కృష్ణకాలిలను కూడా త్వరలో ప్రసారం చేయనున్నారు.
తెలంగాణలో వేతనాల తగ్గింపు
కోవిడ్​–19 లాక్​డౌన్​ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాల జీతభత్యాల్లో కోత విధించింది. నాలుగో తరగతి ఉద్యోగులకు 10%, పింఛన్​దారులకు 50%, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50%, ఐఎఎస్​, ఐపిఎస్​లకు వంటి హైలెవల్​ క్యాడర్​ అధికారులకు 60%, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతభ్యత్యాల్లో 75% కోత విధించనున్నారు.
దాది జానకి మరణం:
బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన రాజ‌యోగిని దాది జాన‌కి(104) 2020 మార్చి 27న కన్నుమూశారు.1961 సంవత్సరంలో పాకిస్థాన్​లోని హైదరాబాద్​లో జన్మించిన దాది జానకి రాజస్థాన్​లోని మౌంట్​ అబు కేంద్రం బ్రహ్మకుమారీస్​ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించింది. ప్రపంచంలో మహిళలే స్వయంగా నడిపిస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా బ్రహ్మ కుమారిస్​ గుర్తింపు పొందింది​.
ఆపరేషన్​ నమస్తే
కోవిడ్​–19 ప్రభావాన్ని తగ్గించడంలో భాగంగా భారత ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజలకు అందేలా చేయడానికి ఇండియన్​ ఆర్మీ ‘ఆపరేషన్​ నమస్తే’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆర్మీ జనరల్​ వాహబ్​ ముకుంద్​ నరవాణె వెల్లడించారు.
ఆర్​బీఐ ద్రవ్యపరపతి సమీక్ష
కోవిడ్​–19 వ్యాధి వ్యాప్తి తదితర కారణాలతో మందగించిన ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుత్తేజం కల్పించడంలో భాగంగా 3.74 లక్షల కోట్లను మార్కెట్లోకి తేవాలని ఆర్​బీఐ నిర్ణయించింది. దీని కోసం రెపోరేటును 75 బేసిక్​ పాయింట్లు తగ్గించి 4.4%గా మార్చింది. రివర్స్​ రెపోరేటును 90 బేసిక్​ పాయింట్లు తగ్గించి 4 %గా, క్యాష్​ రిజర్వ్​ రేషియోని 1% తగ్గించి 3%గా నిర్ణయించింది.
వెంటిలేటర్ల తయారి
భారత్​లో కోవిడ్​–19 శరవేగంగా విస్తరిస్తే ఎదుర్కోడానికి 40,000 వెంటిలేటర్లను సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇస్రో తక్కువ ధరకే వెంటిలేటర్లు తయారు చేస్తామని ప్రకటించగా, ఈసీఐఎల్​ ఇప్పటికే వెంటిలేటర్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్​(డీఆర్​డీఓ)​ అనేక మందికి ఉపయోగించే వీలు ఉన్న ఒక వెంటిలేటర్​ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం ఓట్ ఆన్​ అకౌంట్
కోవిడ్​–19 వ్యాప్తితో బడ్జెట్​ ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 213(1) ప్రకారం 2020–21 తొలి మూడు నెలల కాలానికి ఓట్​ ఆన్​ అకౌంట్​ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది. 70వేల కోట్ల బడ్జెట్​లో అంచనా వ్యయం 62వేల కోట్లు కాగా హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్​, స్పీకర్​, డిప్యూటి స్పీకర్​ లాంటి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారి జీతభత్యాల కోసం 8వేల కోట్లు కేటాయించారు.
ఆక్సిజన్​ సరఫరా కోసం ఒప్పందం
కోవిడ్​–19 విస్తృతి పెరిగితే వెంటిలేటర్లకు కావాల్సిన ఆక్సిజన్​ను నిరంతరంగా సప్లయ్​ చేయడం కోసం ప్రభుత్వం పీఈఎస్​ఓ(పెట్రోలియం అండ్​ ఎక్స్​ప్లోజివ్స్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​)కు ఆదేశాలు జారీచేసింది. ఈ సంస్థ 1898 సెప్టెంబర్​లో నాగ్​పూర్​ కేంద్రంగా ఏర్పాటైంది.
చందన్​ సింగ్​ రాథోడ్​
ఇటీవల మరణించిన మాజీ ఎయిర్​ మార్షల్ చందన్​ సింగ్​ రాథోడ్​. ఈయన 1962లో జరిగిన ఇండో–చైనా, 1971లో జరిగిన ఇండో–పాక్​ యుద్దాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈయన 1961లో అతి విశిష్ట సేవాపతకం, 1962లో వీర చక్ర, 1971లో మహావీర చక్ర అవార్డులు పొందాడు.
తబ్లిగ్​–ఎ–జమాత్​
ఢిల్లీలోని నిజాముద్దీన్​ ప్రాంతంలో జరిగిన ముస్లిం మతపరమైన కార్యక్రమం తబ్లిక్​–ఎ–జమాత్​. ఈ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఈ ఏడాది జనవరి1వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 2100 మంది విదేశీయులు పాల్గొన్నారని హోంశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. వీరి ద్వారా కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ఈ తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చారు.ప్లాస్మా థెరఫీ
కోవిడ్–19 నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలోని ప్లాస్మాలో గల యాంటీ బాడీలను ఉపయోగించి వేరే రోగి చికిత్సకు ఉపయోగించే ‘ప్లాస్మా థెరఫీ’ జర్మనీలో విజయవంతమైంది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేరళలోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఈ విధానాన్ని అవలంబిస్తోంది.
కాశ్మీర్‌‌లో 4జీపై విచారణ
జమ్మూ కాశ్మీర్‌‌లో 4జీ సేవలు పునరుద్ధరించే అంశంపై ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. కాశ్మీర్‌‌లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం 2జీ సేవలు మాత్రమే అందిస్తున్నారు. మీడియా సేవల కోసం 4జీ అవసరం అనే వాదనపై విచారణ జరిపి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఆపరేషన్ షీల్డ్
ఢిల్లీలో కోవిడ్–19 విస్తృతి ఎక్కువగా ఉన్న 21 ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ‘ఆపరేషన్ షీల్డ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. పాజిటివ్ రోగి ఉన్న ప్రాంతాలను సీల్ చేయడం, సీలింగ్ పరిధిలోని ప్రజలను హోమ్ క్వారంటైన్‌లో ఉంచడం, పాజిటివ్ రోగిని ఐసోలేషన్‌లో ఉంచి ఎవరెవరిని కలిశారో గుర్తించడం, నిత్యావసరాలు పంపిణీ చేయడం, పారిశుద్ధ్యం చేపట్టడం, సీల్ చేసిన ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు చేయడం వంటి కార్యక్రమాలను ఈ ఆపరేషన్‌లో భాగంగా చేపడతారు.
సన్నద్ధతా ప్యాకేజీ
కోవిడ్–19తో దెబ్బతిన్న రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్రం అత్యవసర స్పందన, ఆరోగ్యవ్యవస్థ సన్నద్ధతా ప్యాకేజీని రూ.15వేల కోట్లతో ప్రకటించింది. వీటిలో రూ.7774 కోట్లను తక్షణమే మంజూరు చేయగా మిగతా మొత్తాన్ని విస్తీర్ణం, పాజిటివ్ కేసుల నమోదు ఆధారంగా 3 దశలలో అందించనుంది. జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, జులై నుంచి 2021 మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అందించనుంది.
దేఖో అప్‌నా దేశ్
కరోనా సంక్షోభ సమయంలో లాక్‌డౌన్‌లో ఉన్న దేశ ప్రజలందరికీ పర్యాటకం పట్ల అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ‘దేఖో అప్‌నా దేశ్’ పేరుతో వెబినార్ సిరీస్ రూపొందించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగరం గురించి ‘సిటీ ఆఫ్ సిటీస్ ఢిల్లీస్ పర్సనల్ డైరీ’ పేరుతో తొలి సిరీస్‌లో ప్రసారం చేశారు.
రక్షణ ఒప్పందం
అమెరికా ప్రభుత్వం హర్పూన్–II ట్యాంకు విధ్వంసక క్షిపణులు, ఎంకే–54 తేలికపాటి టర్పడో(నీటి లోపల నుంచి ప్రయోగించేవి) ఇండియాకు విక్రయించాలని నిర్ణయించింది. హర్పూన్ క్షిపణుల విలువ 92 మిలియన్ డాలర్లు కాగా ఎంకే 54 టర్పడోల విలువ 63 మిలియన్ డాలర్లు.
జంతువుల క్వారంటైన్ కేంద్రం
అమెరికాలోని బ్రాంక్స్ జూపార్క్‌లోని ‘నదియా’ పులికి కరోనా పాజిటివ్ రావడంతో దేశంలో జంతువుల సంరక్షణ కోసం సైతం క్వారంటైన్‌లు ఏర్పాటు చేయాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచన మేరకు ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును ఎంపిక చేశారు. ఇది జంతువుల కోసం ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి క్వారంటైన్ కేంద్రం. ఈ కాంప్లెక్స్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేసి కెమెరాల ద్వారా కరోనా లక్షణాలు పరిశీలిస్తారు. ఈ పార్కులో 110 వృక్షజాతులు, 50 జాతుల క్షీరదాలు, 580 పక్షిజాతులున్నాయి.
ఇక్రిశాట్ డైరెక్టర్‌‌ జనరల్‌గా హ్యుగ్స్
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమి ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్ కంది, శనగ, వేరుశనగ వంటి అర్ధశుష్క పంటల పరిశోధన కోసం ఏర్పాటైన సంస్థ) నూతన డైరెక్టర్ జనరల్‌గా జాక్విలన్ హ్యూగ్స్ నియమితులయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ పీటర్ కార్ బెర్రి స్థానంలో ఏప్రిల్ 23న హ్యూగ్స్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన ఐఆర్ఆర్ఐ(ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ అసోసియేషన్) డిప్యూటీ డైరెక్టర్‌‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్రిశాట్‌ను 1972లో హైదరాబాద్​ సమీపంలోని పటాన్‌చెరులో ఏర్పాటు చేశారు.
పీఎంకేఎస్‌వై
2019–20 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అమలులో తమిళనాడు(2,06,853.25 హెక్టార్లు), కర్ణాటక(1,41,103.56 హెక్టార్లు) గుజరాత్ (1,08,322.00 హెక్టార్లు) వరసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సూక్ష్మ నీటి పారుదల మెరుగు పరచడం, పెట్టుబడులు ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచడంలో భాగంగా 2015 జులైలో ఈ స్కీంను ప్రవేశపెట్టారు.
హీరో ఆఫ్ ది యానిమల్
కరోనా వైరస్ నివారణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌లో అన్ని మున్సిపాలిటీల్లో జంతువులు సంరక్షణ కోసం ఒడిశా ప్రభుత్వం రూ.54లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌కు హీరో ఆఫ్ యూనిమల్ అవార్డును ప్రకటించారు. జంతువుల సంరక్షణ కోసం చేసిన కృషికి గాను పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్​ యూనిమల్స్ (పీఈటీఏ) ఈ అవార్డు అందిస్తోంది.
మై టాలెంట్‌
ఒడిశా ప్రభుత్వం యూనిసెఫ్ సహకారంతో ‘ మై టాలెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. లాక్‌డౌన్‌ టైమ్‌లో పిల్లల ప్రతిభను వెలికి తీయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. 5 నుంచి 18 ఏండ్ల వారిని మూడు గ్రూపులుగా విభజించి కథలు, పద్యాలు, పెయింటింగ్స్, కార్టూన్స్, నినాదాలు వంటి అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు.
ఎక్సర్‌‌సైజ్ యోగ్‌దన్‌
కొవిడ్–19 ను ఎదుర్కోవడంతో భాగంగా హెల్ప్‌లైన్ సెంటర్లు, సరుకుల పంపిణీ, డేటా నిర్వహణ, ట్రాఫిక్ లాంటి అంశాలలో వలంటీర్లుగా పనిచేయుటకు ఎన్‌సీసీ( నేషనల్ క్యాడెట్ కార్ప్స్) చేపట్టిన కార్యక్రమం ఎక్సర్‌‌సైజ్ యోగ్‌దన్. 1948లో ఏర్పాటైన ఎన్‌సీసీ డైరెక్టరేట్, రాష్ట్రస్థాయి, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సేవలందిస్తారు.
జియో ఫెన్సింగ్ యాప్‌
క్వారంటైన్/ ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి పారిపోతే అతని మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించడం జియో ఫెన్సింగ్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం –1885 ప్రకారం క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించిన వారి వివరాలను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అందించాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అంశాలతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ‘ మహాకవచ్‌’’ క్వారంటైన్ అనే యాప్‌ను ఐఐటి ముంబాయి రూపొందించింది.
ఎడిసన్ అవార్డు
విద్యుత్ పొదుపు, వినియోగంపై అవగాహన కల్పించి అత్యుత్తమ సేవలందించే సంస్థలకు అందించే ‘గ్లోబల్ ఎడిసన్ అవార్డు’ టాటా పవర్ కంపెనీకి ఈ ఏడాదికి లభించింది. ఈ సంస్థ 2007లో ప్రారంభించిన ‘క్లబ్ ఎనర్జీ #స్విచ్ఛాఫ్ టు స్విచ్ఛాన్’ కార్యక్రమానికి సోషల్ ఇన్నోవేషన్ కేటగిరీ, సోషల్ ఎనర్జీ సొల్యూషన్స్ ఉప విభాగంలో బహుమతి లభించింది. స్కూల్ పిల్లలు లక్ష్యంగా దేశవ్యాప్తంగా 533 పాఠశాలలోని విద్యార్థులను 2007 నుంచి చైతన్యపర్చి 29.8 మిలియన్ల యూనిట్ విద్యుత్‌ పొదుపు సాధించింది.
ఎఫ్‌డీఐ నిబంధనల్లో మార్పులు
ఇండియాతో సరిహద్దును పంచుకునే అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ముందస్తు అనుమతులను తప్పనిసరి చేస్తూ కేంద్ర పారిశ్రామిక, ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ నిబంధన కేవలం పాకిస్థాన్‌కు మాత్రమే ఉండేది. ఇకనుంచి చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, అప్గనిస్థాన్‌లకు ఈ నిర్ణయం వర్తించనుంది. కొవిడ్–19 నేపథ్యంలో బలహీనపడ్డ దేశీయ కంపెనీలు అవకాశవాద టేకోవర్లకు గురికాకుండా కాపాడడం దీని ఉద్దేశం.
ప్లాస్మా ప్రయోగాలకు అనుమతి
కొవిడ్–19 రోగులకు కాన్వాలసెంట్ ప్లాస్మా చికిత్సను ఉపయోగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చేసిన ప్రతిపాదనకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. కొవిడ్–19 రోగి శరీరంలోని ప్లాస్మాలో ఉన్న యాంటీ బాడీలనుపయోగించి చికిత్స చేసే పద్ధతే కాన్వాలసెంట్ ప్లాస్మా థెరఫీ. దేశంలో తొలిసారిగా కేరళలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(తిరువనంతపురం) ఈ పద్ధతిని తొలిసారి ఉపయోగించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానంపై పూర్తి అధ్యయనం కోసం గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది.
రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు
షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) ప్రాంతాలలో ఎస్టీలకు 100శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినిత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోస్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఉమ్మడి ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి చెబ్రోలు లీలా ప్రసాదరావు దాఖలు చేసిన పిల్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది. ఉమ్మడి ఏపీ 1986లో ఈ తరహా జీవో విడుదల చేయగా ట్రిబ్యునల్ కొట్టివేసింది. దీనికే కొన్ని మార్పులతో 2000లో మళ్లీ తీసుకొచ్చారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ జీవోలు మళ్లీ వస్తే 1986 నుంచి ఇచ్చిన ఉద్యోగాలను కాపాడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఐ యామ్ బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ పట్ల తమ ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరిచేందుకు, మ్యాచ్ ఫిక్సింగ్, డోపింగ్ నిరోధంపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తీసుకొచ్చిన ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’ కార్యక్రమ అంబాసిడర్లలో ఒకరిగా పీవీ సింధు ఎంపికయ్యారు. సింధుతో పాటు కెనడాకు చెందిన మిచెల్ లీ, చైనా ద్వయం జెంగ్ సి వీ, హువాంగ్ యా కియాంగ్, ఇంగ్లాండ్ నుంచి జాక్ షెపర్డ్, జర్మనీ నుంచి వాలెస్కా నోబ్లాచ్, ఆ దేశ అథ్లెట్స్ కమిషన్ ఛైర్మన్ మార్క్ జ్విబ్లెర్ ఎంపికయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం మలేసియాలోని కౌలాలంపూర్‌‌లో ఉంది.
రోహిత్ శర్మ
అసోంలోని రైనోల సంరక్షణకు కృషి చేస్తున్న ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ దుబాయ్ క్రికెట్ అకాడమి ‘క్రిక్ కింగ్‌డమ్‌’కు బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఎంపికయ్యారు. ఈ అకాడమి కొవిడ్–19 విస్తరణ తగ్గిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వనుంది. స్టూడెంట్లను, కోచ్‌లను, అకాడమిలను ఒకే వేదిక మీదకు తీసుకురానుంది. ఇప్పటికే ఈ అకాడమి ముంబయి పేసర్ ధవల్ కులకర్ణిని మెంటార్‌‌గా నియమించుకుంది. నాలుగు కేటగిరీల్లో క్రికెటర్లకు శిక్షణ ఇవ్వనుంది.
డబ్ల్యుడబ్ల్యుఎఫ్ బ్రాండ్ అంబాసిడర్
వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా విభాగం నిర్వహిస్తున్న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ఎంపికయ్యారు. ఈయన పర్యావరణానికి సంబంధించిన సమస్యలపై ఇండియా అంతటా పిల్లలకు అవగాహన కల్పించనున్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా తన 50 సంవత్సరాల ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియాలో తన ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాంను 1976లో తీసుకొచ్చింది. ఇది దేశంలోని 2000 పాఠశాలల్లో 5 మిలియన్ల మంది పిల్లలకుపర్యావరణంపై అవగాహన కల్పిస్తోంది.
డాక్టర్ల రక్షణకు ఆర్డినెన్స్
కొవిడ్–19 రోగులకు సేవ చేస్తున్న వైద్యులపై దాడులు చేసేవారికి కఠిన శిక్షలు విధించేలా ‘జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం–1897’కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. డాక్టర్లపై దాడి చేస్తే నాన్‌బెయిలబుల్‌ కేసుగా పరిగణించడంతో పాటు 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయనున్నారు. కోర్టులు ఏడాదిలోపు తీర్పులు వెలువరించాలి. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.5లక్షల వరకు జరిమానా విధిస్తారు. క్లినిక్‌లు, ఇండ్లు, వాహనాలపై దాడులు చేస్తే రెండు రెట్ల పరిహారం వసూలు చేసేలా ఆర్డినెన్స్‌లో నిబంధలు చేర్చనున్నారు.
ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాలు
2020–2021 సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ శాఖ 29.83 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2019–20 కంటే ఇది 63 లక్షల టన్నులు అదనం. ఇందులో ఖరీఫ్ లక్ష్యం 14.99 కోట్ల టన్నులు కాగా రబీ లక్ష్యంగా 14.84 కోట్ల టన్నులు. ఆహారధాన్యాల్లో 11.75 కోట్ల టన్నుల వరిని, 10.65 కోట్ల టన్నుల గోధుమలు, 4.87 కోట్ల టన్నుల తృణధాన్యాలు, 2.56 కోట్ల టన్నుల పప్పు ధాన్యాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఆహారేతర ఉత్పత్తుల్లో నూనెగింజలు 3.66 కోట్ల టన్నులు, చెరకు 39 కోట్ల టన్నులు, పత్తి 3.6 కోట్ల బేళ్లు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది.
వ్యాక్సిన్ తయారీకి టాస్క్‌ఫోర్స్
ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న పరిశోధనలను, ప్రయత్నాలను విశ్లేషిస్తూ కొవిడ్–19 వ్యాక్సిన్ తయారుచేసేందుకు కేంద్రప్రభుత్వం నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పౌల్, ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సాంకేతిక సలహాదారుడు, ప్రొఫెసర్ క్రిష్ణస్వామి విజయరాఘవన్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. ఆయుష్ మంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాలోని ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు.
కమ్యూనిటీ కిచెన్లకు జియో ట్యాగ్
లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రాంతాలలో పేదలకు ఉచిత ఆహారం అందించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాలోని కమ్యూనిటీ కిచెన్లకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆ ప్రత్యేకత పొందిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. 7,368 కిచెన్లలో రోజుకు 12లక్షల ఆహార ప్యాకెట్లు పేదలకు అందిస్తున్నారు. ఇందులో 668 వంటశాలలు స్వచ్ఛంద సంస్థలవి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 కోట్ల ఆహార ప్యాకెట్లు పేదలకు ఉచితంగా అందజేశారు.
గబ్బిలాలలో కరోనా
ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఫుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్త ఆధ్యయనంలో గబ్బిలాలలో కరోనా వైరస్‌ను గుర్తించింది. కానీ వీటినుంచే మనుషులకు వ్యాపించింది అనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తెలంగాణ, చండీగఢ్, పుదుచ్చేరిలలో టీరోపస్, రేసెట్టస్ అనే 2 జాతులకు చెందిన 25 గబ్బిలాలను పరిశీలించినప్పుడు వాటిలో కరోనా/సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా–2(సార్స్ కోవ్–2) పాజిటివ్ లభించింది.
చిత్ర జీన్ ల్యాంప్
కేరళలోని శ్రీ చిత్రా తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సంస్థ 2 గంటల్లోనే ఫలితాన్నిచ్చే కరోనా టెస్ట్ కిట్‌ను ఆవిష్కరించింది. ఇందులో 30 నమూనాలు ఒకే పరికరం ద్వారా ఒకేసారి పరీక్షిస్తారు. కొవిడ్–19 ఎన్‌–జీన్‌ను గుర్తిస్తారు. దీనికి భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ నిధులను అందజేసింది.
యునిసెఫ్‌తో ఒప్పందం
కొవిడ్–19ను అధిగమించేందుకు స్థానిక నాయకులకు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వలంటీర్లకు, స్వయంసహాయక సంఘాలకు శిక్షణ అందించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(ఎన్‌ఐఆర్‌‌డీ) పంచాయతీరాజ్, యునిసెఫ్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు భాగస్వాములుగా ఉన్నాయి.
ఆరోగ్యసేతు ప్రపంచరికార్డు
కొవిడ్–19 దృష్ట్యా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ అత్యధిక డౌన్‌లోడ్‌లతో ప్రపంచరికార్డు సృష్టించింది. ఫేస్ బుక్ యాప్ కు 5 కోట్ల మంది యూజర్లు యాడ్ కావడానికి 19 రోజుల సమయం పట్టగా కేవలం 13 రోజుల్లోనే ఆరోగ్యసేతు యాప్ 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. అతి తక్కువ రోజుల్లో 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్న యాప్ గా వరల్డ్ రికార్డులు సృష్టిస్తోంది. 5 కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి టెలిఫోన్‌కు 75 ఏళ్లు, టీవీకి 38 ఏళ్లు, కంప్యూటర్లకు 11 ఏళ్లు పట్టింది. క్వారంటైన్‌లో ఉన్నవారు, పాజిటివ్‌గా ఉన్నవాళ్లు దగ్గరికిరాగానే హెచ్చరించడం చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యాప్‌ను 4 రోజుల్లో 11 భాషల్లో రూపొందించింది.
AICTE హెల్ప్‌లైన్‌
లాక్‌డౌన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న స్టూడెంట్స్ కోసం http://aicte-india.org అనే వెబ్ పోర్టల్‌ను కేంద్ర సర్కారు ప్రారంభించింది. స్టూడెంట్స్‌కు వసతి, ఆహారం, ఆన్‌లైన్ తరగతులు, పరీక్షలు, ప్రవేశాలు, స్కాలర్‌‌షిప్‌లు తదితర సమాచారన్ని ఈ వెబ్‌ పోర్టల్ నుంచి పొందవచ్చు.
అర్టెమిస్ మిషన్
చంద్రునిపైకి తొలి మహిళను 2024 నాటికి పంపాలని అమెరికా చేపట్టిన కార్యక్రమం అర్టెమిస్ మిషన్. ఇప్పటి వరకు చంద్రునిపైకి 12 మంది వ్యోమగాములు వెళ్లగా ఈ ప్రయోగం ద్వారా మహిళ చంద్రుడి దక్షిణ ధృవం పైకి పంపి సుమారు 2నెలల పాటు నివాసం ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీనికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
నాస్కామ్‌లో నియామకాలు
యూపీలోని నోయిడా కేంద్రంగా గల నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీస్ ( NASCOM) 2020-21 కాలానికి చైర్మన్‌గా యూ.బి ప్రవీణ్‌రావు, వైస్ చైర్మన్‌గా రేఖా మీనన్‌ను నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌‌గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ ప్రభుత్వం 1994 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పదవీకాలం అర్థాంతరంగా ముగియడంతో ఆయన స్థానంలో కనగరాజ్ నియమితులయ్యారు. నూతన ఆర్డినెన్స్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసివారు మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌గా పదవీబాధ్యతలు చేపట్టాలి.
వైఎస్‌ఆర్ టెలీమెడిసిన్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్ టెలీమెడిసిన్’ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 13న తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించింది. కోవిడ్–19కు సంబంధించిన వైద్యసేవలు పొందేందుకు దీనిని తీసుకొచ్చింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. దీనికోసం 14410 టోల్ ఫ్రీ నంబర్‌‌ను కేటాయించారు.

ఇంటర్నేషనల్

థామస్ అజన్ రాజీనామా
అవినీతి, డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇంటర్నేషన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు థామస్ అజన్ ఏప్రిల్ 16న రాజీనామా చేశారు. ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిలో 43 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఫెడరేషన్‌కు యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఉర్సుల పాపాండ్రియా కొనసాగనున్నారు. థామస్‌పై అవినీతి ఆరోపణలపై ప్రొఫెసర్ రిచర్డ్ మెక్‌ లారెన్ స్వతంత్ర దర్యాప్తు కొనసాగనుంది.
బాంటర్ బ్లిట్జ్‌కప్
2019 సెప్టెంబర్ 25 నుంచి 2020 ఏప్రిల్ 15 వరకు చెస్24.కామ్ ఒపెరా, జేఎఫ్‌డీ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన బాంటర్ బ్లిట్జ్‌కప్‌ చెస్ టోర్నీని ఇరాన్ గ్రాండ్ మాస్టర్ అలిరెజీ ఫిరేజ్జీ గెలుపొందారు. ఫైనల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ మాగ్నస్ కార్ల్‌సన్‌(నార్వే)ను ఓడించి ఈ టైటిల్ గెల్చుకున్నారు.
మేటర్‌‌హర్న్‌పై ఇండియా ఫ్లాగ్
కొవిడ్–19పై పోరాటం చేస్తున్న దేశాలకు సంఘీభావంగా స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉన్న మేటర్‌‌హర్న్‌పై ఇండియా జాతీయపతాకాన్ని ప్రదర్శించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన కళాకారుడు గెరీ హాఫ్‌సెట్టర్ 4,478 మీటర్ల ఎత్తున్న శిఖరంపై ఇండియాతో పాటు వివిధ దేశాల జాతీయజెండాలను లైట్ ప్రొజెక్టర్‌‌ ద్వారా ప్రదర్శించారు. అన్ని దేశాలు కరోనాపై విజయం సాధించాలని, ఆదే నమ్మకంతో ఉండాలని జెర్మాట్ అనే పర్యాటక సంస్థ ఈ లైటింగ్‌ను ప్రదర్శించింది.
ఫేస్‌బుక్ అతిపెద్ద పెట్టుబడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99శాతం వాటాను ఏప్రిల్ 22న ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. 5.7 బిలియన్ డాలర్లు(43,574 కోట్లు) పెట్టుబడి పెట్టడం దేశీయ సాంకేతిక రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ–కామర్స్, ఆన్‌లైన్ చెల్లింపులు రంగంలో ఆధిపత్యం కోసం పెట్టుబడులు పెట్టగా, 2021 నాటికి రుణరహిత కంపెనీగా ఆవిష్కరించడమే లక్ష్యంగా రిలయన్స్ ఈ పెట్టుబడిని ఆహ్వానించింది.
జీ20 సదస్సులు
కొవిడ్–19తో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థల స్థితిగతులపై చర్చించేందుకు జీ–20 దేశాల ఆర్థికమంత్రుల, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల వీడియో కాన్ఫరెన్స్‌ను ‘Realising opportunities of the 21st century for all’ అనే థీమ్‌తో నిర్వహించారు. సౌదీ అరేబియా నేతృత్వంలో జరిగిన సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 320 మిలియన్ల భారత ప్రజలకు 3.9 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా జీ–20 కూటమికి అధ్యక్షత వహిస్తోంది. జీ–20 దేశాల వ్యవసాయ మంత్రుల సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ఆహారభద్రత, ఆహార వ్యర్థాలను అరికట్టడం, అంతరాయాలు లేని సరఫరా, అత్యుత్తమ సాగు విధానాలను పంచుకోవడంపై సదస్సు జరిగింది. భారత ప్రతినిధిగా వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇందులో పాల్గొన్నారు.
ఇండియా@142
పారిస్ కేంద్రంగా ఉన్న రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఏప్రిల్ 22న 2020 ఏడాదికి ప్రకటించిన ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ’లో ఇండియాకు 142వ స్థానం దక్కింది. గతేడాది 140వ ర్యాంకు దక్కగా ఈసారి రెండు స్థానాలు దిగజారింది. 2019లో జర్నలిస్టుల హత్యలు జరగలేదని, 2018లో ఆరుగురు హత్యకు గురయ్యారని పేర్కొంది. 180 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో నార్వేతొలిస్థానంలో, ఫిన్లాండ్ రెండు, డెన్మార్క్ మూడోస్థానంలో ఉన్నాయి. ఉత్తరకొరియా 180వ స్థానంలో నిలిచింది. ఇండియా పొరుగుదేశాలలో పాకిస్థాన్ 145, బంగ్లాదేశ్ 151, శ్రీలంక 127, నేపాల్ 112వ స్థానంలో ఉన్నాయి.
పారాగేమ్స్ మస్కట్
2022లో అక్టోబర్ 9 నుంచి 15 వరకు చైనాలోని హంగ్జే వేదికగా జరగనున్న 4వ పారా ఆసియాన్ గేమ్స్ మస్కట్‌గా ‘Feifei’ పక్షిని ప్రకటించారు. చైనాలోని ఓవిన్ బర్డ్‌కు ఇది ప్రతీక. 2022లో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగనున్న ఆసియా గేమ్స్ మస్కట్‌గా కాంగ్‌కాంగ్, లియాన్‌లియాన్, చెన్‌చెన్‌లను ఇప్పటికే ప్రకటించింది. 2022 ఆసియా క్రీడల మోటో ‘హార్ట్ టు హార్ట్’.
ఐఎంఎఫ్​సీ సమ్మిట్
‘ఎక్స్‌సెప్షనల్ టైమ్స్ – ఎక్స్‌సెప్షనల్ యాక్షన్’ ఎజెండాతో ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ సమావేశం ఏప్రిల్ 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఇండియా నుంచి నిర్మలా సీతారామన్ పాల్గొన్న ఈ సమావేశంలో కొవిడ్–19 ప్రభావంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ పనితీరు, నగదు చెలామణి కోసం తీసుకోవాల్సిన చర్యలు, సభ్య దేశాలకు ఆర్థిక ప్యాకేజీలపై ప్రధానంగా చర్చించారు. వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్​) డైరెక్టర్‌‌గా ప్రస్తుతం క్రిస్టలిన జార్జియోవా కొనసాగుతున్నారు.
మరోసారి మూన్‌ జే ఇన్
ఏప్రిల్ 16న విడుదలైన దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీ డెమెక్రటిక్ పార్టీ, దాని మిత్రపక్షాలు 180 సీట్లు గెల్చుకున్నాయి. 300 సీట్లున్న జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ యునైటెడ్ ఫ్యూచర్ పార్టీకి 103 సీట్లు దక్కించుకుంది. 2017 మే 10 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మూన్ జే ఇన్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. 66.2శాతం ఓట్లు పోలైన ఈ ఎన్నికలలో మెజారిటీకి 181 సీట్లు అవసరం.
వారసత్వ సమావేశం వాయిదా
జూన్ 29 నుంచి జులై 9 వరకు చైనాలోని ఫ్యుజేలో జరగాల్సిన 44వ యునెస్కో వారసత్వ సమావేశం వాయిదాపడింది. ఇప్పటివరకు యునెస్కో ప్రపంచవ్యాప్తంగా 1121 వారసత్వ ప్రదేశాలను కలిగి ఉండగా ఇందులో 869 సాంస్కృతిక, 213 సహజ, 39 సమ్మిళిత రంగాలకు చెందినవి ఉన్నాయి.
మదురోను అభిశంసించిన యూఎస్​ఏ
వెనుజులా అధ్యక్షుడు నికోలస్​ మదురోను యూ.ఎస్.​ఎ ‘నార్కో టెర్రరిజం’ అభియోగంతో అభిశంసించింది. వెనిజులా మాదక ద్రవ్యాల గ్రూపు ‘ది కార్టెల్​ ఆఫ్ ది సన్స్​’కు ఇతను నేతృత్వం వహిస్తున్నాడని ఈయనపై అమెరికా ప్రధాన ఆరోపణ. కొలంబియా ఉగ్రవాద సంస్థ ‘రివల్యూషనరీ ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ ఆఫ్​ కొలంబియా’ ద్వారా మాదక ద్రవ్యాలు ఎగుమతి చేస్తున్న ఈయనకు సంబంధించిన సరైన ఆధారాలు సమర్పిస్తే 15 మిలియన్ల బహుమతిని అందిస్తామని అమెరికా ప్రకటించింది.
ఆఫ్ఘాన్​ ఉగ్రదాడి
ఆఫ్గనిస్తాన్​లోని కాబుల్​ నగరంలో మార్చి 25న గురుద్వారాపై చేసిన ఉగ్రదాడి అనుమానితులను గుర్తించారు. ఇస్లామిక్​ స్టేట్ ఆఫ్​ కోరసాన్​ ప్రావిన్స్​కు చెందిన అబుఖలీద్​–అల్​–హింది/అబ్ధల్ ఖయ్యుం/అబ్ధుల్​ ఖలీదిగా గుర్తించారు. కేరళలోని కాసర్​ఘడ్​ జిల్లాలో గల త్రికారిపూర్​ గ్రామానికి చెందిన ఇతని కుటుంబం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో నివాసం ఉంటుంది. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​కు ఉపాధికోసం వెళ్ళిన ఖలీద్​ ఇస్లామిక్​ స్టేట్​లో సభ్యుడయ్యాడు.
కరోనా బారిన పడ్డ ప్రముఖులు
స్పెయిన్​ యువరాణి మారియా థెరిసా కరోనాతో మృతిచెందగా బ్రిటన్​ యువరాజు ఇటీవల కోలుకున్నాడు. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ కరోనా పాజిటివ్​తో హోమ్​ ఐసోలేషన్​లోకి వెళ్ళాడు. తన సహాయకుడికి కరోనా సోకడంతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉన్నట్లు ప్రకటించారు.
అవాంతరాలు లేని ఎల్​సీజీ సరఫరా
ఎటువంటి అవాంతరాలు లేకుండా లిక్విఫైడ్​ పెట్రోలియం గ్యాస్​ (ఎల్​పీజీ)ని భారత్​కు సరఫరా చేసేందుకు సౌదీ అరేబియాతో పరస్పర అవగాహన ఒప్పందం కుదిరినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ ప్రకటించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ప్రవేశపెట్టడంతో భారత్​లో ఎల్​పీజీ వినియోగం పెరిగి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్​పీజీ దిగుమతిదారుగా నిలిచింది. 2018–19లో 24.9 మిలియన్​ టన్నుల ఎల్​పీజీని భారత్​ దిగుమతి చేసుకోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.9% అదనంగా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అదే సమయంలో కిరోసిన్​ దిగుమతి 10% తగ్గింది.
పౌరహక్కుల నేత జోసెఫ్ లౌరీ​ మృతి
అమెరికాకు చెందిన‌ ప్రముఖ పౌర హ‌క్కుల ఉద్యమ నేత జోసెఫ్ లౌరీ(98) క‌న్నుమూశారు. క్రిస్టియ‌న్ లీడ‌ర్‌షిప్ కాన్ఫరెన్స్‌ వ్యవ‌స్థాప‌క స‌భ్యుడిగా ఉన్నారు.1960వ దశకంలో అమెరికాలో జరిగిన పౌరహక్కుల ఉద్యమంలో మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్​తో కలిసి కీలక పాత్ర పోషించారు. ఇతను స్థాపించిన సంస్థ ‘సౌథర్న్​ క్రిస్టియన్​ లీడర్​షిప్​ కాన్ఫరెన్స్​’. అమెరికా ప్రభుత్వం అందజేసే ‘ప్రెసిడెన్షియల్​ మెడల్​ ఆఫ్​ ఫ్రీడమ్​’కి 2009లో ఎంపికయ్యాడు.
ఐడి నౌ కోవిడ్–19
కేవలం 5 నిమిషాల్లోనే కరోనాను గుర్తించే పరికరం అందుబాటులోకి వచ్చింది. అబ్బాట్​ లాబరేటరీస్​ రూపొందించిన ఈ పరికరాన్ని వాషింగ్టన్​లో తొలిసారి ప్రవేశపెట్టారు. అమెరికా ఆహార, ఔషద, నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ) దీన్ని ఆమోదించింది.
నాటోలో చేరిన నూతన దేశం
నార్త్ అట్లాంటిక్​ ట్రిటి ఆర్గనైజేషన్​(నాటో)లో చేరిన 30వ దేశంగా ఉత్తర మాసిడోనియా నిలిచింది. 2017లో ఈ దేశం చేరికపై గ్రీసు ప్రతిపాదించిన అభ్యంతరాలను వెనక్కు తీసుకోవడంతో ఉత్తర మాసిడోనియా 2020 మార్చి 27న 30వ సభ్యదేశంగా చేరింది.
ఫ్లాయిడ్​ కార్డోజ్​ మృతి
కరోనా వైరస్ కారణంగా అమెరికాలోని భారత సంతతికి చెందిన ప్రముఖ చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్(59) మరణించారు. 2011లో ఇతనికి ‘టాప్​ చెఫ్​మేట్స్​’ అవార్డు లభించింది. ముంబయిలోని బోంబే క్యాంటీన్, ఓ పెర్డో అనే రెండు రెస్టారెంట్లకు ఆయన సహ యజమానిగా ఉన్నారు. ఇటీవల తన మూడో వెంచర్ బోంబే స్వీట్ షాప్ కూడా ప్రారంభించారు.
అమెరికా మిలిటరీ శాటిలైట్​ ప్రయోగం
అమెరికా మార్చి 26న ప్రయోగించిన ఈ శాటిలైట్​ అత్యంత ఆధునిక మిలిటరీ కమ్యూనికేషన్​ శాటిలైట్స్​లో ఆరొవది. మిగతా అయిదింటిని 2010–19ల మధ్య ప్రయోగించారు. దీన్ని అట్లాస్​ V*551 వాహక నౌక సహాయంతో అమెరికా ఫ్లోరిడాలోని శాటిలైట్​ కేంద్రం నుంచి ప్రయోగించారు.
ధామస్ షిఫర్​ ఆత్మహత్య
జర్మనీలోని హెస్సీ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న ధామస్ షిఫర్ కోవిడ్​–19 వ్యాప్తితో ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సేవల రాజధానిగా ఫ్రాంక్ ఫర్ట్‌కు పేరుంది. ప్రపంచంలో ప్రముఖ బ్యాంక్‌గా పేరున్న డూషే బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. ఆయన గత పదేళ్ల నుంచి హెస్సీ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఇండియాకు యూఎస్‌ఏఐడీ గ్రాంట్‌
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ) కొవిడ్–19 ను ఎదుర్కొనేందుకు ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను ప్రకటించింది. భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న కెన్నత్ జస్టర్‌‌ ఈ ప్రకటన వెలువరించారు.
చైనా సంతాపదినం
కొవిడ్–19 తొలి బాధిత దేశం అయిన చైనా ఏప్రిల్ 4ను జాతీయ సంతాపదినోత్సంగా ప్రకటించింది. ప్రజారోగ్య కారణాలతో జాతీయ సంతాప దినోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి. 76 రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న వ్యూహన్ నగరంలో ఏప్రిల్ 8 న లాక్‌డౌన్ తొలగించారు.
అమెరికాకు భారత్ సాయం
కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికాకు భారత్ సాయాన్ని అందించింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విన్నపం మేరకు గుజరాత్‌కు చెందిన మూడు కంపెనీల నుంచి దాదాపు 29 మిలియన్‌ డోసుల డ్రగ్స్‌ అమెరికాకు పంపించనున్నట్టు పీటీఐ వెల్లడించింది. భారత్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్ ప్రధాని నరేంద్రమోడీకి, దేశ ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ ఈ ఏడాదికి బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. 124.7 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. 103.4 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. పారిస్ కేంద్రంగా ఉన్న లగ్జరీ బ్యాగుల తయారీ సంస్థ లూయిస్ వుయిట్టెన్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 89.8 బిలియన్ డాలర్లతో థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఇండియా నుంచి 44.3 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 17వ స్థానం, డీ మార్ట్ వ్యవస్థాపకుడు రాధా కిషన్ దమానీ ఫ్యామిలీ 16.6 బిలియన్ డాలర్లతో 65, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివనాడార్ 12.4 బిలియన్ డాలర్లతో 116వ స్థానంలో ఉన్నారు.
కోవిడ్–19పై యూఎన్‌వో సమ్మిట్
కరోనా వ్యాప్తి తదనంతర పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య వీడియో కాన్ఫరెన్స్ ఏప్రిల్ 10న నిర్వహించింది. జీవాయుధ దాడి జరిగితే ఏర్పడే పరిస్థితులు ప్రపంచం ముందున్నాయని, ఉగ్రవాదులు సైతం ఇలాంటి దాడికి పాల్పడే అవకాశాలు లేకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ సమావేశానికి డొమినిక్ రిపబ్లిక్ దేశం అధ్యక్షత వహించింది.
ఇంటర్నేషనల్ అరబ్ ప్రైజ్
అరబ్ సాహిత్యంలోనే అత్యున్నత అవార్డు 13వ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ అరబిక్ ఫిక్షన్‌ను అల్జీరియా రచయిత abdelouahab aissaoui గెలుచుకున్నారు. ‘The spartan court’ అనే నవలకు ఈ అవార్డు లభించింది. బుకర్ ఫౌండేషన్ సహకారంతో అబుదాబి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అందించే ఈ ప్రైజ్ విలువ 50 వేల డాలర్లు.

సైన్స్ అండ్ టెక్నాలజీ


హౌస్​ క్వారంటైన్​ యాప్​
విదేశాల నుండి హోమ్​ ఐసోలేషన్​(గృహ నిర్భందం)లో ఉంటున్న వారిని సమన్వయం చేయడానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రూపొందించిన మొబైల్​ యాప్​ హైస్​ క్వారంటైన్​ యాప్​.
కరోనా కవచ్ యాప్
భారత ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ, భారత ఎలక్ట్రానిక్స్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ సహకారంతో ప్రవేశపెట్టిన మొబైల్​ యాప్​ కరోనా కవచ్​ యాప్. కేంద్రం ఈ యాప్​లో ప్రతి గంటకు కరోనా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను అప్​లోడ్ చేస్తుంది. ఈ యాప్​లోని కలర్​ కోడ్​ ద్వారా కరోనా అనుమానిత లక్షణాలున్న మనిషినికి సంబంధించిన మొబైల్​ను సమీపిస్తున్నప్పుడు వారిని గుర్తించి అలర్ట్​ చేస్తుంది.
CORONTINE​​ యాప్​
బాంబే ఐఐటీ రూపొందించిన ఈ యాప్​ ద్వారా కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయిన వ్యక్తులను జియో ట్యాగింగ్​ చేస్తారు. సదరు వ్యక్తులు క్వారంటైన్​ నుండి బయటకు వచ్చినప్పుడు అధికారులకు ఎస్​ఎంఎస్​, ఈ–మెయిల్​ ద్వారా సమాచారం అందుతుంది.
రాజ్​ కాప్​ సిటిజన్స్​ యాప్
రాజస్థాన్​ పోలీసులు రూపొందించిన మొబైల్​ యాప్​ ఇది​. దీని ద్వారా అత్యవసర సమయంలో లాక్​డౌన్​ నుండి బయటకు వెళ్లాలనుకునే వ్యక్తులు పోలీసుల అనుమతి తీసుకోవచ్చు.


వ్యక్తులు


మినల్ దఖవే భోసాలే
ఈమె కరోనా వైరస్​ను గుర్తించే తొలి స్వదేశీ టెస్ట్​కిట్​ రూపొందించడంలో కీలకపాత్ర పోషించింది. పుణె కేంద్రంలోని ఆమెకు చెందిన మైలాబ్ డిస్కవరీలో కేవలం రెండున్నర గంటల్లో ఫలితాన్ని అందించే తొలి స్వదేశీ టెస్ట్​ కిట్​ను ప్రవేశపెట్టారు. కరోనావైరస్ టెస్టింగ్ కిట్‌లను తయారు చేసి విక్రయించడానికి పూర్తి అనుమతి పొందిన మొదటి భారతీయ సంస్థగా ‘మైలాబ్​ డిస్కవరి’ గుర్తింపు దక్కించుకుంది.
సతీష్ గుజ్రాల్​
ఈయన ఇటీవల మరణించిన ప్రముఖ శిల్పి, చిత్రకారుడు, వేణువాద్య కళాకారుడు. 1997–98 వరకు ప్రధానిగా వ్యవహరించిన ఐ.కే.గుజ్రాల్​ సోదరుడు. ఆయనకు 1999లో భారత ప్రభుత్వం అందజేసే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది.
ఖలీదా బేగం
ఈమె జమ్మూకశ్మీర్​కి చెందిన ముస్లిం మహిళ. ప్రస్తుత లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సేవా భారతి’ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ముగ్ధురాలై హజ్​యాత్ర కోసం దాచుకున్న 5 లక్షల రూపాయలను ఆ సంస్థకు విరాళంగా ప్రకటించింది. కోవిడ్​–19 వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఈ మొత్తాన్ని అందించాలని కోరింది.
అజామ్ ఖాన్
కరోనా వైరస్​ వల్ల గత వారం లండన్​లోని ఈలింగ్ ఆసుపత్రిలో మరణించిన పాకిస్తాన్​ స్క్వాష్​ క్రీడాకారుడు అజామ్ ఖాన్(95)​. ఈయన 1959–61 మధ్య వరుసగా బ్రిటిష్ ఓపెన్ టైటిల్​ స్క్వాష్ ఛాంపియన్​గా నిలిచాడు.
బి.పి. కనుంగో
రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా డిప్యూటి గవర్నర్​గా వ్యవహరిస్తున్నారు​. ఇటీవల ఏడాది కాలం పాటు ఈయన పదవీ కాలాన్ని ఆర్​బీఐ పొడిగించింది. ఈయన విదేశీ ముద్రా విభాగం, ప్రభుత్వ మరియు బ్యాంక్ ఖాతాల విభాగం, అంతర్గత రుణ నిర్వహణ విభాగాలను కూడా పర్యవేక్షించనున్నారు. ఇతనితో పాటు ఎన్​.ఎస్​.విశ్వనాధన్​, మహేష్​ కుమార్​ జైన్​, మైకెల్​.డి.పాత్ర ఆర్​.బి.ఐ డిప్యూటి గవర్నర్లుగా వ్యవహరిస్తున్నారు.
బెని ప్రసాద్​ వర్మ
కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు అయిన బెని ప్రసాద్ వర్మ(79) ఇటీవలే మరణించారు. ఉత్తరప్రదేశ్​కు చెందిన వర్మ 1996–98 మధ్య దేవెగౌడ కాలంలో టెలికాం మంత్రిగా మన్మోహన్​సింగ్​ కాలంలో ఉక్కుశాఖా మంత్రి(2011–14)గా వ్యవహరించాడు.
ఏపీప్రభుత్వ సలహాదారుడిగా శ్రీనాథ్​రెడ్డి
ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీలోని ఎయిమ్స్​ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్​ శ్రీనాథ్​ రెడ్డి నియమితులయ్యారు. ప్రజారోగ్యం విభాగంలో సలహాదారుగా వ్యవహరించనున్న ఇతను ఎటువంటి జీతభత్యాలు తీసుకోనందున ఈయన నియామకాన్ని ఏపీ ప్రభుత్వం గౌరవ నియామకంగా ప్రకటించింది.
ఏపీ ప్రముఖుడికి జాతీయ గుర్తింపు
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రానిక్స్​ అండ్ రాడార్​ డెవలప్​మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్​(ఎల్​ఆర్​డీఈ) నూతన డైరెక్టర్​గా ఆంధ్రప్రదేశ్​కు చెందిన పరమట రాధాకృష్ణ నియమితులయ్యారు.
భోగాపురం విమానాశ్రమం
విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్​ లిమిటెడ్​ గ్రూప్​కు అప్పగిస్తూ లెటర్​ ఆఫ్​ అవార్డ్​ (ఎల్​ఓఏ) అందజేస్తూ ఆంధ్రప్రదేశ్​ విమానాశ్రయాల అభివృద్ది సంస్థ(ఏపీఏడీసీఎల్) నిర్ణయించింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!