నేషనల్
గిరిజనుల కోసం ‘గోల్’
గిరిజన యువత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ GOAL(Going Online As Leaders) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా డిజిటల్ అక్షరాస్యత, జీవన నైపుణ్యాలు, నాయకత్వ, వ్యవస్థాపకత నైపుణ్యాలు మెరుగుపడేలా శిక్షణ ఇస్తారు. గిరిజన యువతను వ్యవసాయం, కళలు, సంస్కృతి, చేతివృత్తులు, చేనేత, ఆరోగ్య, పోషన తదితర రంగాలలో ఆదాయాలు పొందే విధంగా ప్రోత్సహిస్తారు.
కోబాస్ – 6800
ఢిల్లీలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం రూపొందించిన కోబాస్–6800 యంత్ర పరికరాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. దీనిద్వారా రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతిలో ఒకేరోజు 1200 కరోనా టెస్టులు చేయవచ్చు. బయోసేప్టీ లెవల్–2 ప్లస్ లేబరేటరీలో మాత్రమే పనిచేసే ఈ పరికరం ద్వారా హెపటైటిస్–బీ, సీ, హెచ్‌ఐవీ, పాపిల్లోమా వంటి వైరస్ వ్యాధులను గుర్తించవచ్చు.
వరల్డ్ బ్యాంకు రుణం
కోవిడ్–19పై పోరాటంలో భాగంగా ఇండియాకు ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్(రూ.7500 కోట్లు) రుణాన్ని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు విభాగమైన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్, అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకులు కలిసి ఈ రుణాన్ని అందిస్తాయి. రూ.1900 కోట్లను జూన్ 30 తర్వాత అందజేయనుంది. గతంలో ఇండియాకు ప్రపంచ బ్యాంకు అందజేసిన 1 బిలియన్ డాలర్ రుణానికి ఇది అదనంగా అందించనుంది.
నీరబ్‌కుమార్ ప్రసాద్ కమిటీ
మే 7న వైజాగ్ సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్ నుంచి పాలిస్టైరీన్, ఎక్స్‌పాండెడ్ పాలీ స్టైరీన్ వాయువులు వెలువడిన ఉదంతంపై ప్రభుత్వం నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీని నియమించింది. ఆయన ప్రస్తుతం ఏపీ పర్యావరణ, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖల చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సభ్యులుగా కరైకల్ వలెవన్(పరిశ్రమల శాఖ కార్యదర్శి), వివేక్ యాదవ్ (ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు), ఆర్‌కే మీనా(వైజాగ్ పోలీస్ కమిషనర్), వినయ్‌చంద్(వైజాగ్ కలెక్టర్) లు ఉన్నారు.
నాబార్డ్ కొత్త ఛైర్మన్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) కొత్త ఛైర్మన్‌గా చింతల గోవిందరాజులు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఛైర్మన్‌గా కొనసాగిన హర్షకుమార్ భన్వాల స్థానంలో ఆయన పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఈ పదవిలో 2022 జులై 31 వరకు కొనసాగుతారు.
పరిశుభ్రత రేటింగులు
దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, స్థానిక సంస్థలు పరిశుభ్రత పాటిస్తున్న అంశాల ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 141 సంస్థలకు రేటింగులు ఇచ్చింది. వీటిలో 6 నగరాలకు ఫైవ్ స్టార్, 65 నగరాలకు 3 స్టార్, 70 నగరాలకు సింగిల్ స్టార్ లభించింది. 12 రాష్ట్రాలలోని నగరాలకు రేటింగ్ ఇవ్వగా ఇందులో తెలంగాణకు చోటు దక్కలేదు. దేశంలోని ఏ నగరానికి 7 స్టార్ రేటింగ్ రాలేదు. అంబికాపూర్(చత్తీస్‌గఢ్), రాజ్‌కోట్, సూరత్(గుజరాత్), మైసూర్(కర్ణాటక), ఇండోర్(మధ్యప్రదేశ్), నవీ ముంబయి(మహారాష్ట్ర)లకు ఫైవ్ స్టార్ లభించింది. ఏపీ నుంచి తిరుపతి, విజయవాడలకు 3 స్టార్ లభించగా, చీరాల, విశాఖపట్నం, సత్తెనపల్లి, పలమనేరులకు సింగిల్‌స్టార్ దక్కింది.
షెట్కార్ కమిటీ
సరిహద్దుల వద్ద మౌలిక వసతులు, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే దిశలో కేంద్రప్రభుత్వం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డిబీ షెట్కార్ కమిటీ చేసిన 3 సూచనలను అమలుచేయాలని నిర్ణయించింది. 2016లో మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో ఈ కమిటీని నియమించారు. రోడ్ల నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలను అనుమతించి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌పై ఒత్తిడి తగ్గించడం, నిర్మాణరంగ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, అటవీ, భూసేకరణ అనుమతులు వేగంగా అందించడం వంటి ఈ కమిటీ సూచనలలో ముఖ్యమైనవి.
వలస కార్మికుల స్టాంపు
భారత తపాల శాఖ ముంబయిలోని ప్రఖ్యాత బిసెంటిన్నియల్ హాల్ కేంద్రంగా వలస కార్మికులపై పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. నిర్మాణ రంగం నుంచి ఇద్దరు, ట్యాక్సిడ్రైవర్, నెక్లస్ డిజైనర్, దర్జీ లాంటి అయిదుగురిచే ఈ స్టాంపును తపాల శాఖ ఆవిష్కరించింది.
పీఎం వయ వందన యోజన
సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ‘పీఎం వయ వందన యోజన’ను కేంద్రం పునర్‌వ్యవస్థీకరించి ఎల్‌ఐసీ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టింది. ఈ పథకానికి 60 ఏళ్లు దాటినవారు అర్హులు. రూ.15 లక్షల వరకు గరిష్టంగా డిపాజిట్ చేయవచ్చు. నెలకు కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. 2023 మార్చి 31 వరకు అందుబాటులో ఈ పథకంలో 7.40శాతం వడ్డీరేటు కల్పిస్తారు. 3 సంవత్సరాల తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 75శాతం రుణం లభిస్తుంది.
మణిపూర్ సంస్థకు యూఎన్‌వో గుర్తింపు
కోవిడ్–19పై పోరాడుతున్న 10 అంతర్జాతీయ సంస్థలను ‘టాప్–10 గ్లోబల్ ఇనిషియేటివ్స్’ పేరుతో యూఎన్‌వో గుర్తించింది. ఇందులో మణిపూర్‌కు చెందిన ఎన్‌జీవో ‘యా ఆల్’కు చోటు దక్కింది. కోవిడ్–19తో దెబ్బతిన్న ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు ‘కుడోల్’ పేరుతో నిధుల సేకరణ చేసింది. దీనిద్వారా 1000 ఆరోగ్య కిట్లు, 6500 శానిటరీ ప్యాడ్స్, 1500 కండోమ్స్, 2000 కుటుంబాలకు ఆరోగ్య ఆసరా కల్పించింది.
ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్
న్యూయార్క్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా అసోసియేషన్ అందించే ‘ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఈ ఏడాదికి ఐబీఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్)లో పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి రాజీవ్ జోషికి లభించింది. ఐఐటీ ముంబయి గ్రాడ్యుయేట్ జోషి మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.
విదేశాలకు ఖాదీ మాస్కులు
కోవిడ్–19 ప్రభావంతో విదేశాలకు మాస్క్‌ల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఇటీవల తొలగించింది. 1957లో ఏర్పడిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రిస్ కమిషన్ నాన్ మెడికల్ మాస్కులను యూఎస్‌ఏ, యూఏఈ, మారిషస్ దేశాలతోపాటు మధ్య తూర్పు దేశాలకు భారత విదేశీ రాయబార కార్యాలయాల ద్వారా ఎగుమతి చేయనుంది.
సూర్యనగరిగా కోణార్క్
కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ఒడిశాలోని కోణార్క్ పట్టణం, సూర్యదేవాలయాన్ని వందశాతం సోలార్ విద్యుత్‌తో అనుసంధానించిం ‘సూర్యనగరి’గా మార్చాలని నిర్ణయించింది. వంద శాతం కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ పథకాన్ని ఒడిశా రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అమలుపరుస్తోంది.
ఔషధ నియంత్రణకు కమిటీ
దేశంలో నూతన ఔషధాల ఆమోద ప్రక్రియను సరళతరం, వేగవంతం చేయడానికి కావాల్సిన సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 11మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీకి రాజేష్ భూషణ్ నేతృత్వం వహిస్తున్నారు. భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్.సి.పులనేవాలా వంటివారు సభ్యులుగా ఉన్నారు.
చంబా టన్నెల్ ప్రారంభం
చార్‌ధామ్ యాత్రను సులభతరం చేయడంలో భాగంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చంబా టన్నెల్‌ను నిర్మించింది. చార్‌ధామ్ మహమార్గ్ వికాస్ పరియోజనలో భాగంగా నేషనల్ హైవే 94పై రిషికేశ్ – దరాసుల మధ్య చంబా వద్ద 440 మీటర్ల పొడవుతో ఈ టన్నెల్‌ను నిర్మించింది. 2020 అక్టోబర్ నుంచి ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది.
యూఎన్ మిలిటరీ జెండర్ అవార్డు
శాంతి కార్యకలాపాలలో మహిళలు, శాంతి భద్రతపై యూఎన్ సూత్రాలను ప్రోత్సహించడంలో కృషి చేసినవారికి అందించే యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు తొలిసారిగా ఇద్దరు యూఎన్ శాంతిభద్రతా అధికారులకు లభించింది. వారిలో ఇండియన్ ఆర్మీ సిగ్నల్ కాప్స్‌కు చెందిన సుమన్ గవామి, బ్రెజిల్ నౌకాదళ అధికారిణి కార్లా మాంటిరో డి కాస్ట్రో అరాజో ఉన్నారు. ఈ అవార్డు పొందిన తొలి భారత వ్యక్తి సుమన్ గవామి దక్షిణ సుడాన్‌లోని యూఎన్‌వో శాంతిదళంలో పనిచేస్తోంది. రెండు విభిన్న రంగాలవారికి ఈ అవార్డు లభించడం ఇదే తొలిసారి.
విద్యాదాన్2.0
లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో స్టూడెంట్స్‌కు సమాచారం అందించడంతో కోసం కేంద్ర ప్రభుత్వం ‘దీక్ష’ ప్లాట్ పై విద్యాదాన్ 2.0 ను ప్రారంభించింది. 1 నుంచి 12వ తరగతి వరకు బోధించే టీచర్లు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకుని సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలను, క్వశ్చన్ పేపర్లను అప్‌లోడ్ చేయవచ్చు. హిందీ, ఇంగ్లిష్ భాషలలో అందుబాటులో ఉంది.
రీ స్టార్ట్ సదస్సు
నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా మే 11న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ ‘రీ స్టార్ట్’ పేరుతో డిజిటల్ సదస్సును ప్రారంభించారు. RE–START అనగా Reboot the Economy through Science, Technology And Research Translations. భారత శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక అభివృద్ధి బోర్డు ఈ సదస్సును నిర్వహించింది. శాస్త్ర పరిశోధనలో పాల్గొంటున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
తగ్గిన శిశుమరణాల రేటు
2018 గణాంకాల ఆధారంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం దేశంలో శిశుమరణాల రేటు ప్రతి 1000 మందికి 32గా ఉంది. 2009లో శిశుమరణాల రేటు 50 ఉండగా 2017లో 33గా ఉంది. రాష్ట్రాల వారీగా మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ప్రతి 1000 మందికి 48 మరణాలు సంభవిస్తున్నాయి. అత్యల్పంగా నాగాలాండ్‌లో 4 నమోదైంది. అత్యంత వేగంగా మిజోరంలో శిశుమరణాల రేటు 15 నుంచి 5కు తగ్గింది. అత్యల్ప మరణాలు సంభవించిన పెద్ద రాష్ట్రాలలో కేరళ 7, చిన్నరాష్ట్రాలలో నాగాలాండ్ 4, కేంద్రపాలిత ప్రాంతాలలో 9 మరణాలతో అండమాన్ నికోబార్ ఉన్నాయి.
ఎఫ్‌ఐఆర్ ఆప్ కే ద్వార్
నేరాలు జరిగినప్పుడు ప్రాథమిక విచారణ ద్వారా నమోదు చేసే అత్యంత కీలకమైన ఎఫ్‌ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను బాధితులు ఇంటివద్దనే నమోదు చేసేలా ‘ఎఫ్‌ఐఆర్ ఆప్ కే ద్వార్ యోజన’ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 11న ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని 11 బ్లాక్‌లలో ఉన్న 23 పోలీస్‌స్టేషన్లలోని హెడ్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి బాధితుల ఇంటివద్దనే విచారణ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా చూస్తుంది. ఆగస్టు 31 వరకు పైలట్ ప్రాజెక్టుగా కొనసాగించి ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించనుంది. ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను హైదరాబాద్ నగరంలో తొలిసారి చేపట్టారు. 2019 నవంబర్ 27న దిశ అత్యాచారం అనంతరం 2020 జనవరిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఫిఫా అండర్–17 వాయిదా
2020 నవంబర్ 2 నుంచి 21 వరకు నవీ ముంబయి, గువహటి, అహ్మదాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్ వేదికలుగా జరగాల్సిన ఫిఫా అండర్–17 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ కోవిడ్–19 దృష్ట్యా వాయిదాపడింది. రీషెడ్యూల్ ప్రకారం 2021 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ఫిఫా అండర్–20 మహిళల ప్రపంచకప్ 2021 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు పనామా, కోస్టారికా వేదికగా నిర్వహించనున్నారు.
ఒకటే పెన్షన్
సామాజిక పెన్షన్లను పునర్‌వ్యవస్థీకరించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకు ఒక పెన్షన్ మాత్రమే అందజేయాలని నిర్ణయించింది. దివ్యాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు/డయాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్, తలసీమియా, పక్షవాతం వ్యాధిగ్రస్తులను మాత్రం మినహాయించనుంది. ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వే ఆధారంగా మే 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
యాంటీబాడీస్ చికిత్స
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) తన న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ (ఎన్‌ఎమ్‌ఐటిఎల్‌ఐ) కింద కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్లకు చికిత్సగా హ్యుమన్– మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిర్వహణను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించింది. భారత్ బయోటెక్‌తో పాటు ఐఐటీ ఇండోర్, పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, గురుగ్రామ్‌కు చెందిన ప్రిడోమిక్స్ టెక్నాలజీస్ ఈ పరిశోధనలో పాలుపంచుకోనున్నాయి. కోవిడ్–19ను తటస్థం చేయగల ప్రభావవంతమైన, నిర్దిష్ట మానవ మోనోక్లోనల్ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసే ప్రత్యామ్నాయ చికిత్స విధానాన్ని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో యాంటీబాడీస్ వైరస్‌ను బంధించి పనిరానిదిగా చేసి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నిరోధించగలవు.
ఆత్మ నిర్భర్ అభియాన్
కోవిడ్–19తో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, స్థానిక పరిశ్రమల స్వావలంబన, పేద ప్రజలకు ఆర్థిక మద్దతు లక్ష్యంగా కేంద్రం రూ.20లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించింది. ఇది భారత జీడీపీలో సుమారు 10 శాతంగా ఉంది. ఇప్పటికే జపాన్ తమ జీడీపీలో 21శాతం, అమెరికా 13శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించగా ఇండియా ప్రకటించిన ప్యాకేజీ మూడో అతిపెద్ద ప్యాకేజీగా గుర్తింపు పొందింది. దీంతోపాటు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను నాలుగోసారి పొడగించనుంది.
వైజాగ్‌లో స్టైరీన్ లీక్
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదవశాత్తు పాలి స్టైరీన్, ఎక్స్‌పాండెడ్ పాలిస్టైరీన్ గ్యాస్ లీకై 12 మంది మరణించారు. 1961లో హిందుస్థాన్ పాలిమర్స్‌గా ఏర్పడిన ఈ కంపెనీని 1978లో యునైటెడ్ బేవరేజెస్ సొంతమైంది. చెరకు మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారీకి అవసరమయ్యే ఇథనాల్‌ను ఇక్కడ ఉత్పత్తి చేసేవారు. అధిక దుర్గంధం, ప్రజల అభ్యంతరాలతో మూతపడిన కంపెనీని 1997లో దక్షిణ కొరియా ఎల్‌జీ టేక్‌ఓవర్ చేసింది. గ్యాస్ లీకేజీ దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఛైర్మన్‌గా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
సంబల్ యోజన
నిరుపేద షెడ్యూల్డ్ కులాలు, తెగల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక చేయూతనిచ్చేందుకు మధ్యప్రదేశ్ మే 6న ‘సంబల్ యోజన’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా అకాల మరణం చెందిన ఎస్సీ, ఎస్టీలకు రూ.2లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.4లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.2లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష వారి కుటుంబాలకు అందజేస్తారు. చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ.50 వేలు అదనంగా అందిస్తారు. గర్భిణీలకైతే డెలివరీకి ముందు రూ.4వేలు, అనంతరం రూ.1200 ఇస్తారు.
పురుగుమందుల నిషేధం
క్షయ వ్యాధిగ్రస్తులకు వాడే స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్‌లను పంటలపై వాడటాన్ని సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ నిషేధించింది. మైకోబ్యాక్టిరియం ట్యుబరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియాతో సంక్రమించే క్షయ నిర్మూలన కోసం రూపొందించిన మందులను పంటలపై బ్యాక్టీరియా కోసం వాడుతుండడంతో ఈ నిషేధం విధించింది.
నాలుగింటికి జీఐ ట్యాగ్
జార్ఖండ్‌కు చెందిన సోహరాయ్ ఖోవర్ చిత్రకళ, తెలంగాణలోని పుట్టపాక తేలియ రుమాలు, తమిళనాడులోని తంజావూరు నెట్టి వర్క్స్, ఆరంభవూరు వుడ్ కార్వింగ్‌లకు భౌగోళిక గుర్తింపు లభించింది. చెన్నై కేంద్రంగా ఉన్న జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ మే 12న ఈ నాలుగింటికి ప్రకటించింది. యాద్రాది జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక తేలియ రుమాల్ నేయడంలో పేరుగాంచింది. ఇవి ఎండలో చల్లగా, చలిలో వెచ్చగా ఉండేలా రూపొందిస్తారు.
సరోవర్ లింక్ రోడ్
శివుడు నడయాడిన ప్రదేశంగా పేరుగాంచిన చైనా ఆధీనంలో టిబెట్‌లో గల మానస సరోవర్‌ను చేరేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన మానస సరోవర్ లింక్ రోడ్డును మే 8న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. సముద్రమట్టానికి 6000 మీటర్ల ఎత్తులో ఉత్తరాఖండ్‌లోని దార్బులా నుంచి చైనా సరిహద్దు వద్ద గల లే వరకు 80 కిలోమీటర్లు రోడ్డు నిర్మించింది. దీంతో 5 రోజుల పట్టే సమయం కాస్త రెండు రోజులకు తగ్గుతుంది.
ఆపరేషన్ సముద్రసేతు
కోవిడ్–19తో విదేశాలలో చిక్కుకున్న ఇండియన్స్‌ను ఓడల ద్వారా సముద్ర మార్గం నుంచి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సముద్రసేతు’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మే 5న మాల్దీవులకు భారత నౌకాదళాలు ఐఎన్‌ఎస్ జలశ్వ, ఐఎన్‌ఎస్ మగర్‌లను కేంద్రం పంపించింది.
వందే భారత్ మిషన్
కోవిడ్–19 దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడంతో వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి తీసుకురావడానికి భారత వైమానిక దళం సాయంతో భారత ప్రభుత్వం ‘వందే భారత్ ’ మిషన్‌ను ప్రారంభించింది. మే 7 నుంచి 13 వరకు యూకే, యూఎస్‌ఏ, సింగపూర్, మలేషియా, ఫిలిఫ్ఫైన్స్, బంగ్లాదేశ్ వంటి 12 దేశాలలో ఉన్న 15000 మంది భారతీయులను ఫ్లైట్‌లో తీసుకురానున్నాయి. 64 విమానాల ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రయాణ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
లాక్‌డౌన్ 3.0
కోవిడ్–19ను నియంత్రించడంలో భాగంగా కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మే 17 వరకు పొడిగించింది. ఇప్పటికే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటిసారి, ఏప్రిల్ 14 నుంచి మే 3వరకు రెండో సారి పొడిగించింది. ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. కంటైన్‌మెంట్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేయగా, మిగిలిన జోన్లలో షరతులతో కూడిన ఆర్థికకార్యకలాపాలను సైతం నిలిపివేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. పాఠశాలలు, శిక్షణా సంస్థలు, రాజకీయ, మతపరమైన సదస్సులు నిషేధం. గ్రీన్ జోన్లలో మాత్రం 50శాతం సీటింగ్‌తో ప్రజా రవాణాకు అనుమతినిచ్చింది.
రియాజ్ నైకూ హతం
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజుబుల్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ రియాజ్ నైకూ మే 6న హతమయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మరణించాడు. 2016 జనవరిలో టెర్రరిస్టు అహ్మద్ భట్ అంత్యక్రియల్లో గాల్లోకి కాల్పులు జరపడం ద్వారా వెలుగులోకి వచ్చిన రియాజ్ హిజుబుల్ అధినేత బుర్హాన్‌వనీ ఎన్‌కౌంటర్ తర్వాత ఆ సంస్థకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. కేంద్రప్రభుత్వం రియాజ్ తలపై రూ. 12 లక్షల రివార్డును ప్రకటించింది.
ముఖేశే నెంబర్ వన్
ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితా–2020లో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేశ్ అంబానీ నిలిచారు. ఇతని సంపాదన 36.8 బిలియన్ డాలర్లు. డిమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ 13.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. 11.9 బిలియన్ డాలర్ల సంపాదనతో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివనాడార్ మూడో స్థానంలో ఉన్నారు. 10.4 బిలియన్ డాలర్లతో ఉదయ్ కొటక్, 8.9 బిలియన్ డాలర్లతో అదానీ, 8.8 బిలియన్ డాలర్లతో సునీల్ మిట్టల్ తర్వాతి స్థానాలలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో ఉన్నారు. 98 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు.
రిషి కపూర్
బాలీవుడ్ ప్రేమకథల కథానాయకుడు రిషి కపూర్ ఏప్రిల్ 30న మరణించారు. శ్రీ 420 చిత్రంతో బాలనటుడిగా పరిచయమైన రిషి ‘మేరా నామ్ జోకర్’ చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. నటించడమే కాకుండా ‘ఆ అబ్ లేట్ చలే’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ది బాడి అనే చిత్రంలో ఆయన చివరిసారిగా నటించారు. లైలామజ్ను, అమర్ అక్బర్ ఆంటోనీ, పతి పత్నీ ఔర్ వో, చాందినీ, లవ్ ఆజ్ కల్, అగ్నిపథ్ వంటి హిట్ సినిమాల్లో ఆయన నటించారు.
సానియా మీర్జా
టెన్నిస్‌రంగంలో అందించే ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్ హర్ట్ అవార్డుకు సానియా మీర్జా నామినేట్ అయ్యారు. సానియాతో పాటు ఆసియా–ఓషియానియా గ్రూపు నుంచి ప్రిస్కా మెడలిన్ నుగ్రోరా(ఇండోనేషియా) ఎంపికైంది. యూరప్– ఆఫ్రికా గ్రూపు నుంచి అనెట్ కొంటానెట్(ఎస్తోనియా), యోనోరా మెలినారో(లక్సెంబర్గ్), అమెరికా ఖండాల గ్రూపు నుంచి ఫెర్నాండో గోమెజ్(మెక్సికో), వెరోనికా రాయ్‌గ(పరాగ్వే) నామినేటయ్యారు.
కావేరీ అథారిటీ విలీనం
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీని జల్‌శక్తి అభియాన్ మంత్రిత్వ శాఖలో విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయించింది. అంతరాష్ట్ర నదీజలాల వివాద చట్టం–1956 ప్రకారం తమిళనాడు, కేరళ, కర్ణాటకల మధ్య వివాద పరిష్కారం కోసం కావేరి అథారిటీని 1990లో ఏర్పాటు చేశారు. ఈ విలీనం ద్వారా కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ స్వయంప్రతిపత్తికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు.
చత్తీస్‌గఢ్ టాప్
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశవ్యాప్తంగా చత్తీస్‌గఢ్ తొలిస్థానంలో నిలిచింది. ఈ పథకం ద్వారా చత్తీస్‌గఢ్ 18.51 లక్షల మందికి పని కల్పించింది. రాజస్థాన్ 10.79 లక్షల మందికి పని కల్పించడంద్వారా రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 9.06 లక్షల మందితో మూడోస్థానంలో, పశ్చిమబెంగాల్ 7.29 లక్షల మందితో నాలుగో స్థానంలో, మధ్యప్రదేశ్ 7.24 లక్షల మందికి పనికల్పించి ఐదోస్థానంలో నిలిచింది.
ఇండియన్స్‌కు కీలకపదవులు
డొనాల్డ్ ట్రంపు నేతృత్వంలోని అమెరికన్ ప్రభుత్వం ముగ్గురు ప్రవాస భారతీయులను అత్యున్నత పదవులకు నామినేట్ చేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)లో అమెరికన్ రాయబారిగా మనీషా సింగ్‌ను నామినేట్ చేశారు. ప్రపంచబ్యాంకులో రుణాలు అందించే అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికన్ ప్రతినిధిగా అశోక్ మైకెల్ పింటోను, అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ ది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా కోమటిరెడ్డి సరితను నామినేట్ చేశారు.
కశ్మీరీలకు పులిట్జర్
సాహిత్యం, జర్నలిజం రంగాలలో కృషికి గానూ అందించే పులిట్జర్ అవార్డు ఈ ఏడాది ముగ్గురు కాశ్మీర్ జర్నలిస్టులకు లభించింది. అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన చన్ని ఆనంద్, ముక్తార్‌ఖాన్, దార్‌యాసిన్‌లకు ఈ అవార్డు దక్కింది. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు టైంలో ఆ ప్రాంతంలో ఏర్పడిన పరిస్థితులను వీరు ఫోటోల ద్వారా తెలిపారు. 1917 నుంచి అందిస్తున్న ఈ అవార్డు విలువ 15వేల అమెరికన్ డాలర్లు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ
2020–21 ఏడాదికి లోక్‌సభలోని 20 మంది సభ్యులు, రాజ్యసభలోని 10 మంది సభ్యులతో మొత్తం 30 మందితో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీకి అధ్యక్షుడిగా గుజరాత్‌కు చెందిన కిరీట్ ప్రేమ్‌జీబాయ్ సోలంకి ఎంపికయ్యారు. సభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ నుంచి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఎంపికయ్యారు.
పీఏసీలో బాలశౌరి
పార్లమెంట్ కమిటీలలో అత్యంత ప్రాచీనమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 2020–21 కాలానికి సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నియమితులయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కొనసాగుతున్నారు.
కోవిడ్ ఫార్మా
కోవిడ్–19ను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కోవిడ్ ఫార్మా’ పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కోవిడ్–19 లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు మందుల కోసం మెడికల్ షాపులకు వెళ్తే వారి ఫోన్ నంబర్ తీసుకోవడం ద్వారా ట్రేస్ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68వేల మెడికల్ షాపులను దీని పరిధిలోకి తీసుకొచ్చారు.
గరుడ్ పోర్టల్
కోవిడ్–19ను అరికట్టడంలో భాగంగా వివిధ రాష్ట్రాలు డ్రోన్లను ఉపయోగించినట్లయితే వాటికి కావాల్సిన అనుమతులను వేగవంతంగా అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘గరుడ(గవర్నమెంట్ అథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్) అనే పోర్టల్‌ను తీసుకొచ్చింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లు దీనిని సంయుక్తంగా ప్రారంభించాయి.
దాదా దాదీ, నానా నానీ అభియాన్
కోవిడ్–19 ప్రభావంతో మరణించే అవకాశం ఎక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లను సంరక్షించుకోవడంలో భాగంగా నీతి ఆయోగ్ ‘సురక్షిత్ దాదా–దాదీ, నానా–నాని అభియాన్’ అనే ప్రచార కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనకబడిన అసోం, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలోని 25 జిల్లాలకు చెందిన 2.9 మిలియన్ల వృద్ధులను తొలిదశలో అప్రమత్తం చేస్తారు.
సౌరభ్ లోథా
ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న సౌరభ్ లోథా భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతి శాఖ అందించే యంగ్ కెరీర్ అవార్డుకు ఎంపికయ్యారు. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది అవార్డు దక్కింది. ఆయన సాధించిన ఆవిష్కరణల ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాలు తక్కువ శక్తిని వినియోగించడం ద్వారా వేగంగా పనిచేస్తాయి.
నిఘా
వివిధ ప్రాంతాల నుంచి ఇంటికి వస్తున్న వలసకార్మికులు, ఇతరుల పట్ల వారి కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ‘నిఘా’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్ల సాయంతో అవగాహన కల్పించి వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచుతారు.
ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్
హైదరాబాద్‌లోని మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్) డైరెక్టర్ జనరల్‌గా జాక్వెలిన్ డీఆర్రోస్ హ్యూస్ నియమితులయ్యారు. ఇప్పటివరకు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న పీటర్ కార్బెరీ స్థానంలో ఆమె ఎంపిక జరిగింది. కోవిడ్–19 కారణంగా ఫిలిఫ్ఫైన్స్‌లో ఉండిపోయిన జాక్వెలిన్ వర్చువల్ ఈవెంట్ ద్వారా అక్కడి నుంచే పదవీబాధ్యతలు స్వీకరించారు.
ఇంటర్నేషనల్
ఇన్‌జెన్యూనిటి
2021లో అంగారక గ్రహంపైకి నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ‘ఇన్‌జెన్యూనిటి’ పేరుతో ప్రయోగించనున్న హెలికాప్టర్ లాంటి పరికరాన్ని ప్రయోగించనుంది. ‘నేమ్ ది మిషన్’ పేరుతో నిర్వహించిన పోటిలో భారత సంతతి విద్యార్థిని వనీజా రూపాణి సూచించిన ‘ఇన్‌జెన్యూనిటి’ పేరును నాసా ఖరారు చేసింది. వనీజా అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందినవారు.
సంసోలార్ నివేదిక
అమెరికా ఆధారిత క్యాపిటల్ గ్రూప్ మెర్కమ్ ఇండియా రీసెర్చర్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా సోలార్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో చైనా మొదటిస్థానంలో ఉంది. అమెరికా రెండో స్థానంలో ఉండగా, ఇండియా మూడోస్థానంలో ఉంది. ఇండియా సోలార్ మార్కెట్ లీడర్‌షిప్ అవార్డు–2020 ప్రకారం 2019–20 వత్సరంలో ఇండియాలో 7.3 గిగావాట్ల సోలార్ ఏర్పాటుకాగా, ఓవరాల్‌గా 2019 చివరినాటికి 35.7 గిగావాట్ల సోలార్ ఉత్పత్తి జరిగింది.
ఎవరెస్ట్‌పై 5జీ
ప్రపంచంలో ఎత్తయిన పర్వతశిఖరం ఎవరెస్ట్‌పై చైనా మే 1న 5జీ సేవలు ప్రారంభించింది. టిబెట్‌లో సముద్రమట్టం నుంచి 6500 మీటర్ల ఎత్తులో చైనాకు చెందిన హువావే 5 బేస్ స్టేషన్లను నిర్మించింది. చాలా కష్టతరమైన ఈ భూభాగంలో 5జీ సేవలకోసం చైనా 10 మిలియన్ యువాన్లకు పైగా ఖర్చు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులకు కమ్యూనికేషన్ సేవలతో పాటు, తప్పిపోయినవారిని గుర్తించేందుకు, రెస్య్కూ వర్కర్స్‌కు ఇవి ఉపయోగపడనుంది. 5జీ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో ఐదో తరం కాగా ప్రపంచంలో 5జీ నెట్‌వర్క్ పొందిన తొలి సిటీగా షాంఘై నిలిచింది. వాణిజ్యస్థాయిలో 5జీ సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభించిన దేశంగా దక్షిణకొరియా నిలిచింది.
ఓపెన్ బడ్జెట్ సర్వే
బడ్జెట్‌ను రూపొందించడంలో ప్రజల అవసరాలను ప్రామాణికంగా తీసుకోవడం, పారదర్శకత, వాస్తవిక రూపకల్పన ఆధారంగా ఏ దేశాలు బడ్జెట్‌ను రూపొందిస్తున్నాయి అనే అంశంపై 117 దేశాలతో ఇంటర్నేషనల్ బడ్జెట్ సర్వే రూపొందించింది. ఇందులో అత్యుత్తమ బడ్జెట్‌తో న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. దక్షిణాఫ్రికా సెకండ్ ప్లేస్‌లో ఉండగా, స్వీడన్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. అన్నింటికంటే చివరగా యెమన్ నిలిచింది. అంతకంటే ముందు 116వ స్థానంలో వెనెజులా, 115వ స్థానంలో కామోరూన్ నిలిచింది. ఇందులో ఇండియాకు 53వ స్థానంలో ఉంది.
వి విల్ విన్
కోవిడ్–19ను నివారించడంలో డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బంది చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) ‘వి విల్ విన్’ పేరుతో ప్రత్యేక వీడియో నివాళిని అర్పించింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియా పాలుపంచుకున్నారు.
ఇండియాకు యూఎస్ ఎయిడ్
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) సంస్థ ఏప్రిల్ 6న ఇండియాకు ప్రకటించిన 2.9 మిలియన్ డాలర్ల సాయానికి అదనంగా మరో 3 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇండియా – అమెరికా మధ్యనున్న పహల్(పార్ట్‌నర్‌షిప్ ఫర్ అఫార్డబుల్ హెల్త్‌కేర్ యాక్సెస్ అండ్ లాంగెవిటీ) ఒప్పందంలో భాగంగా కోవిడ్–19పై భారత పోరాటానికి మద్దతుగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
ఇంటర్నేషనల్
కామన్వెల్త్ ఆరోగ్యమంత్రుల సదస్సు
కామన్వెల్త్ దేశాల ఆరోగ్యమంత్రుల 32వ సదస్సు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మే 14న నిర్వహించారు. డెలివరింగ్ ఏ కో–ఆర్డినేటెడ్ కామన్వెల్త్ కోవిడ్–19 రెస్పాన్స్ అనే థీమ్‌తో ఈ సమావేశం జరిగింది. భారత ప్రతినిధిగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో కామన్వెల్త్ దేశాల ప్రగతి, అవరోధాలు, సహకారంపై చర్చ జరిగింది.
చోగమ్ సదస్సు వాయిదా
రెండేళ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్ దేశాధినేతల సదస్సు చోగమ్(కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్స్) వాయిదాపడింది. 1931లో లండన్ కేంద్రంగా ఏర్పడిన కామన్వెల్త్ కూటమి 26వ సదస్సు 2020 జూన్ 22 నుంచి 27 వరకు రువాండాలోని కిగాలో జరగాలి. కానీ కోవిడ్–19 కారణంగా వాయిదాపడింది. తర్వాత సదస్సు ఎప్పుడు అనేది ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ కూటమిలో 54 సభ్యదేశాలున్నాయి.
ఇజ్రాయెల్ వీధికి ఠాగూర్ పేరు
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో గల ఒక వీధికి భారత నోబెల్ గ్రహీత, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును పెట్టారు. ఆయన 159 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత సంస్కృతిని పశ్చిమ దేశాలకు వ్యాపింపజేసిన ఠాగూర్ లిటరేచర్‌లో నోబెల్ (1913) పొందిన మొట్టమొదటి యూరప్ ఖండేతర వ్యక్తిగా నిలిచాడు.
రాబర్ట్ అజివిడో రాజీనామా
2013 నుంచి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న రాబర్ట్ అజివిడో ఆగస్టు 31 అనంతరం వైదొలగనున్నట్లు ప్రకటించారు. బ్రెజిల్‌కు చెందిన అజివిడో ఈ సంస్థకు నేతృత్వం వహించిన మొట్టమొదటి లాటిన్ అమెరికన్ వ్యక్తిగా నిలిచారు. 1995 జనవరి 1న జెనీవా కేంద్రంగా ఏర్పడిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో 164 సభ్యదేశాలున్నాయి.
ఫిడే ఆన్‌లైన్ చెస్ టోర్నీ
ప్రపంచ చెస్ సమాఖ్య ఫిడే తొలిసారిగా మే 5 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన నేషన్స్ కప్‌లో చైనా విజేతగా నిలిచింది. 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో చైనా, యూఎస్‌ఏ, యూరప్‌లు వరుసగా 3 స్థానాలలో నిలిచాయి. ఇండియా 5వ స్థానంలో నిలిచింది. ఇండియా టీమ్‌లో విశ్వనాథన్ ఆనంద్, విదిత, పి. హరికృష్ణ, బి. ఆదిబన్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులుగా ఉన్నారు.
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు
ఇజ్రాయెల్ బెంజిమన్ నెతన్యాహు 5వ సారి ఎన్నికయ్యారు. 120 మంది సభ్యులు గల ఆ దేశ పార్లమెంట్ ఎన్నికలలో హంగ్ ఏర్పడింది. నెతన్యాహు తన ప్రత్యర్థి బ్లూ అండ్ వైట్ పార్టీకి చెందిన బిన్‌యామిన్ గాంట్జ్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రధానిగా 18 నెలలు 2021 నవంబర్ వరకు నెతన్యాహు కొనసాగి తర్వాత మిగతా కాలానికి బిన్‌యామిన్ గాంట్జ్‌కు బాధ్యతలు అప్పగిస్తారు.
అలెగ్జాండర్ డాల్‌రింపిల్ అవార్డు
ఇండియన్ హైడ్రోగ్రఫీకి, హిందూ మహాసముద్ర ప్రాంతానికి చేసిన కృషికి గాను ఇండియన్ హైడ్రోగ్రాఫర్, వైస్ అడ్మిరల్ వినయ్ భద్వార్‌కు ప్రతిష్టాత్మక అలెగ్జాండర్ డాల్‌రింపిల్ అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోగ్రఫీ, కార్టోగ్రఫీ, నావిగేషన్ ప్రమాణాలను పెంచడంలో కృషి చేసినవారికి యూకే హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఈ అవార్డును అందజేస్తుంది. బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ 2006లో తొలిసారిగా ఆ దేశ హైడ్రోగ్రాఫర్ స్మారకార్థం ప్రవేశపెట్టింది.
గంజాయి సాగు చట్టబద్ధం
గంజాయి సాగును చట్టం చేసిన తొలి అరబ్ దేశంగా లెబనాన్ నిలిచింది. 1975–90 మధ్య సివిల్ వార్‌తో తీవ్ర సంక్షోభం ఏర్పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లెబనాన్‌కు కోవిడ్–19 మరిన్ని కష్టాలు తెచ్చింది. దీంతో వైద్యం, ఆరోగ్యం, వాణిజ్య అవసరాల కోసం గంజాయి ఎగుమతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంతో మోరాక్, అఫ్గనిస్తాన్ తరువాత అత్యధిక గంజాయి ఎగుమతి చేస్తున్న దేశంగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఇన్నోవేషన్ సెంటర్లు
ఇండియాలో ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్స్ కార్పొరేషన్స్(ఐబీఎం)తో కలిసి ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బెంగుళూర్‌లో తొలి ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. తర్వాత యూఎస్, యూకేలలో సెంటర్లను విస్తరించనుంది. క్లేడ్ ఆధారిత టెక్నాలజీ ప్రజలకు చేరువ చేయడం, డిజిటల్ రూపాంతరీకరణ ప్రధాన లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు.
అబ్బాస్ ఝా
బిహార్‌లోని పాట్నా స్కూల్ విద్యార్థి, భారత సంతతి ఆర్థికవేత్త, సింగపూర్‌కు చెందిన అబ్బాస్ ఝాను దక్షిణాసియాలో వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ పరిశీలకుడిగా ప్రపంచ బ్యాంకు నియమించింది. ఇండియాలో 12 ఏళ్లపాటు ఐఏఎస్‌గా సేవలందించిన అబ్బాస్ 2001 నుంచి ప్రపంచబ్యాంకులో కొనసాగుతున్నారు.
ఇజ్రాయెల్–ఇండియా ఒప్పందం
కరోనా వైరస్ నిర్ధారణకు ఉద్దేశించిన ర్యాపిడ్ టెస్టింగ్ కోసం ఉమ్మడిగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలని చేపట్టాలని ఇండియా, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రీసెర్చ్ చేయనున్నాయి. ఈ ఒప్పంద సమావేశంలో ఇజ్రాయెల్‌లో ఇండియా రాయబారి సంజీవ్ సింగ్లా, డీఆర్‌డీవో, సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
అలీన దేశాల హెల్త్ సదస్సు
అలీనోద్యమ కూటమి (నామ్) దేశాల ఆరోగ్యమంత్రుల సదస్సు మే 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. అజర్‌బైజాన్ ఆరోగ్యమంత్రి ఒగాటే షిరాలియెవ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కోవిడ్–19ను నిర్మూలించడంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆర్థిక వనరులపై దృష్టిసారించాయి. ఇండియా నుంచి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 1961లో జకార్తా(ఇండోనేషియా) ప్రధాన కార్యాలయంగా ఏర్పడిన నామ్ దేశాల కూటమిలో 122 సభ్యదేశాలున్నాయి.
ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ ఒప్పందం
ఓఎన్‌జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్), ఎన్‌టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)లు భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనాల సంయుక్త ఉత్పత్తిపై పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓఎన్‌జీసీ ఇప్పటికే 176 మెగావాట్ల (23 మెగావాట్ల సోలార్, 153 మెగావాట్ల పవన విద్యుత్) పునరుత్పాదక ఇంధనాలు ఉత్పత్తి చేస్తుంది. ఎన్‌టీపీసీ 2032 నాటికి 32 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 920 మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది.
ఫాస్టెస్ట్ ఇంటర్నెట్
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను(44.2 టెరాబైట్/సెకండ్) ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మెల్‌బోర్న్‌లోని ఆర్‌ఎంఐటీ వర్సిటీ, క్లెటన్‌లోని మొనిషా వర్సిటీ మధ్య 76.6 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్లను మైక్రోకోంబ్ సాయంతో అమర్చి ఈ వేగాన్ని సాధించారు.
యూఎస్ లేజర్ వెపన్
లేజర్స్ వెపన్ సిస్టం డిమోన్‌లో భాగంగా అమెరికా నౌకాదళం ‘లేజర్ వెపన్’ ప్రయోగాన్ని చేపట్టింది. లేజర్ కాంతిపుంజాన్ని నౌకపై నుంచి ప్రయోగించి గాలిలో ఉన్న విమానాన్ని కూల్చేసింది. ఆధునిక యుద్ధతంత్రంలో అతిముఖ్యమైన పరిశోధనగా దీనిని భావిస్తున్నారు.
బెస్ట్ ఎయిర్‌పోర్ట్స్
స్కైట్రాక్స్ సంస్థ 2020 ఏడాదికి ప్రకటించిన అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో సింగపూర్‌కు చెందిన చాంగై ఎయిర్‌పోర్ట్‌కు ఫస్ట్ ప్లేస్ లభించింది. జపాన్‌లోని టోక్యో హనెడా ఎయిర్‌పోర్టు సెకండ్ ప్లేస్‌లో, ఖతార్‌కు చెందిన హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు థర్డ్ ప్లేస్ దక్కింది. బెంగళూరు కేంద్రంగా గల కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రాంతీయ, మధ్య ఆసియాలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 68వ స్థానంలో నిలిచింది.
గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఈ ఏడాదికి ప్రకటించిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ నివేదిక్‌లో 51.5శాతం స్కోర్‌తో ఇండియా 74వ స్థానంలో నిలిచింది. 74.2 శాతంతో స్వీడన్ మొదటిస్థానంలో ఉంది. 73.4శాతంతో స్విట్జర్లాండ్ రెండోస్థానం, 72.4శాతంతో ఫిన్లాండ్ మూడోస్థానంలో నిలిచాయి. 40 కొలమానాల ఆధారంగా సుస్థిర, తక్కువ ధరకు, రక్షణాత్మక రూపకల్పనలతో భవిష్యత్తు శక్తి వ్యవస్థలను రూపొందించుకుంటున్న 115 దేశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించింది.
కోవిడ్ సాయం
ప్రపంచ జనాభాలో సుమారు 17శాతం జనాభా కలిగిన ఇండియా కోవిడ్–19పై చేస్తున్న పోరాటానికి బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలకు చెందిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది. బ్రిక్స్ దేశాలలో సుస్థిరాభివృద్ధి కోసం ప్రాజెక్టులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2014లో షాంఘై కేంద్రంగా ఈ బ్యాంకు ఏర్పడింది. ఇదే అంశంలో భాగంగా అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇండియాకు 3.6 మిలియన్ డాలర్లు(రూ.27 కోట్లు) అందించాలని నిర్ణయించింది.
మిషన్ సాగర్
మాల్దీవులు, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, కామోరూస్ లాంటి ద్వీపదేశాలకు ఆహారపదార్థాలు, కోవిడ్–19 నివారణకు సంబంధించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు, ఆయుర్వేద మందులు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్స్ వంటివి పంపించేందుకు ఇండియా ‘మిషన్ సాగర్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత రక్షణశాఖ సాయంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ దీనిని చేపట్టింది. ఈ మిషన్‌లో భాగంగా ఐఎన్‌ఎస్ కేసరి అనే నౌకను ఉపయోగించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
మశూచి నిర్మూలన@40
ప్రపంచాన్ని 500 సంవత్సరాలు పీడించిన మశూచి వ్యాధి అంతమై 2020 మే 8 నాటికి 40 ఏళ్లు పూర్తయింది. వారియోలా వైరస్ ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ద్వారా తీవ్ర జ్వరం, చర్మంపై పొక్కులు ఏర్పడతాయి. ఎడ్వర్డ్ జెన్నర్ దీనికి టీకా రూపొందించడంతో 1980 నాటికి ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఈ వ్యాధితో 20వ శతాబ్దంలోనే 30 కోట్ల మంది మరణించారు.
హోప్ పోర్టల్
యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘హోప్’ అనే వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. హోప్ అనగా హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్. ఈ పోర్టల్ ద్వారా సేకరించే గణాంకాలను ముఖ్యమంత్రి స్వరోజ్‌గార్ యోజనకు అనుసంధానిస్తారు. ఉద్యోగాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగ యువతకు ఈ పోర్టల్ సంధానకర్తగా వ్యవహరించనుంది.
చాంపియన్స్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం చాంపియన్స్ (క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ది అవుట్‌పుట్ అండ్ నేషనల్ స్ట్రెంత్) అనే పోర్టల్‌ను కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఇండియన్ కంపెనీలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడంలో భాగంగా టెలిఫోన్, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సమాచార విశ్లేషణ సాధానాలను ఉపయోగించి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తారు. రుణాలు, ముడిపదార్థాలు, కార్మికులు, అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ఫిర్యాదుల విభాగానికి అనుసంధానిస్తారు.
సెప్సీవ్యాక్
ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఉపయోగించే వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌కు ‘డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా’ అనుమతినివ్వడంతో అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా ఫార్మాస్యూటికల్ ‘సెప్సీవ్యాక్’ అనే క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. దీనిని న్యూ మిలినియం ఇండియన్ టెక్నాలజీ లీడర్ షిప్ ఇనిషియేటీవ్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేసింది. దీనిని రోగులకు సేవలందించే మెడికల్ సిబ్బందికి అందించడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచి కొవిడ్–19 సోకకుండా అరికట్టవచ్చు.
ఫెలూడా
తక్కువ ధరకే కోవిడ్–19 ను గుర్తించే టెస్ట్ స్ట్రిప్ ఫెలుడా. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే కథలలోని డిటెక్టివ్ క్యారెక్టర్ ‘ఫెలుడా’ పేరును ఈ కిట్‌కు పెట్టారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చెందిన సైంటిస్టులు రూపొందించారు. రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా గంటలోపే కరోనా వైరస్‌ను గుర్తిస్తుంది. వైరస్ నుంచి ఆర్‌ఎన్‌ఏ ను గ్రహించి డీఎన్‌ఏగా మార్చడం ద్వారా వంద శాతం ఫలితం అందిస్తుంది.
ఆప్తమిత్ర హెల్ప్‌లైన్
కోవిడ్–19 హాట్ స్పాట్ ప్రాంతాలలో ప్రజలకు కౌన్సెలింగ్, మెడిసిన్ అందించడం, క్వారంటైన్ కోసం కర్నాటక ప్రభుత్వం ‘హెల్ప్‌లైన్ ఆప్తమిత్ర’ను ప్రవేశపెట్టింది. 14410 టోల్‌ఫ్రీ నంబర్‌తో నడిచే ఈ ప్రోగ్రాం కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపనీస్ సహకారంతో ప్రవేశపెట్టింది. దీనికోసం బెంగళూర్, మైసూర్, భట్‌వాల్, మంగళూర్‌లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
సుదర్శన్‌రెడ్డి మృతి
ప్రముఖ పీడియాట్రిక్స్ వైద్యుడు డాక్టర్ పటోళ్ల సుదర్శన్ రెడ్డి మే 1న అనారోగ్యంతో కన్ను మూశారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ పీడియాట్రిషియన్‌గా ఆయన గుర్తింపు పొందారు. నీలోఫర్ హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్‌గా, ఉస్మానియా మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్స్‌లో పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా వ్యవహరించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని ఇంద్రకరణ్ ఆయన స్వస్థలం.
నూతన న్యాయమూర్తులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్తగా నలుగురు న్యాయమూర్తుల నియమానికి కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బి. కృష్ణమోహన్, కన్నెగంటి లలితకుమార్, కె. సురేష్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టుకు బి.విజయ్‌సేన్ రెడ్డిలు కొత్తగా నియమితులయ్యారు.
స్థాయి సంఘం ఛైర్మన్‌గా కేకే
పార్లమెంటు పరిశ్రమల స్థాయి సంఘం సభ్యుడిగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆ సంఘానికి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనల్ దేశ్ దీపక్ వర్మ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
బత్తాయి దినోత్సవం
రైతులను ప్రోత్సహించేందుకు మే 10న బత్తాయి దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్–19తో అన్ని రకాల ఎగుమతులు, అమ్మకాలు నిలిచిపోవడంతో ఉద్యానవన రైతుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొచ్చింది.
స్పోర్ట్స్
ఇండియా వెయిట్ లిఫ్టర్లకు ఒలింపిక్స్‌లో చోటు
ఇద్దరు ఇండియన్ వుమెన్ వెయిట్ లిఫ్టర్లు ఒలింపిక్స్‌లో క్వాలిఫై అయినట్టు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. 67కిలోల కేటగిరిలో జెరెమిలాల్‌రినుంగా, 49కిలోల కేటగిరిలో సైకోమ్ మిరాబాయిబా అర్హత సాధించారు. కోవిడ్–19 కారణంగా వాయిదాపడ్డ టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు నిర్వహించనున్నారు.
వరల్డ్ గేమ్స్ లోగో రిలీజ్
ఒలింపిక్స్ జరిగిన ఏడాది తర్వాత నిర్వహించే ప్రపంచ క్రీడల లోగోను ఏప్రిల్ 23న ఆవిష్కరించారు. 2021 జూలైలో బిర్మింగ్‌ఘామ్, అలాబామా, యూనైటెడ్ స్టేట్స్ లో జరగాల్సిన క్రీడలు కోవిడ్ కారణంగా వాయిదా పడి 2022జులై 7నుంచి 17వరకు నిర్వహించనున్నారు. ఒలింపిక్స్‌తో సంబంధం లేకుండా తొలిసారిగా 1981లో శాంటాక్లారాలో ప్రపంచ క్రీడలు నిర్వహించారు.
వ్యక్తులు
సంజయ్ కొఠారి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. ఏప్రిల్ 25న ప్రమాణం చేశారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్‌బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా పనిచేశారు. సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగనున్నారు.
సానియా మీర్జా
తమ దేశం తరఫున అత్యుత్తమ టెన్నిస్ ఆటను కనబర్చిన ఆటగాళ్లను సత్కరించేందుకు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ 2009లో ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ఫెడ్‌కప్ హార్ట్ అవార్డు సానియా మీర్జాకు లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా సానియా రికార్డు సృష్టించింది. ఆసియా-ఓసియానియా జోన్ నుంచి ఫెడ్‌కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన సానియా వారం రోజులపాటు నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో విజేతగా నిలిచింది. మొత్తం 16,985 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, 60 శాతానికి పైగా ఆమెకు పోలయ్యాయి. ఈ అవార్డు కింద ఆమెకు 2000 అమెరికన్ డాలర్లు(రూ.1.50లక్షలు) నగదు బహుమతి లభించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వాసుదేవన్
రష్యా, మధ్య ఆసియాతో భారత చారిత్రక సంబంధాలపై విశేష పరిశోధన చేసిన చరిత్రకారుడు హరిశంకర్ వాసుదేవన్ మే 10న కోవిడ్–19తో కోల్‌కతాలో మరణించారు. భారత సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు.
వసుధా మిశ్రా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కార్యదర్శిగా 1987 తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ వసుధా మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కేంద్ర వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. సీబీఎస్‌ఈ బోర్డు ఛైర్మన్‌గా 1990 ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి మనోజ్ అహుజా నియమితులయ్యారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్‌గా వి. విద్యావతి నియమితులయ్యారు.
కుమార సంగక్కర
మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ క్లబ్ అధ్యక్ష పదవీకాలం ఏడాది. 2019 అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు చేపట్టిన సంగక్కర పదవీకాలాన్ని కోవిడ్–19 దృష్ట్యా 2021 వరకు పొడిగించారు.
కోర్మన్ రీన్‌హర్ట్
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు కొత్త ఉపాధ్యక్షురాలిగా కోర్మన్ రీన్‌హర్ట్ ఎంపికయ్యారు. జూన్ 15 నుంచి ఆమె ఈ పదవిలోకి రానున్నారు. రీన్‌హర్ట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించి మేరీలాండ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లో సేవలందించారు.
జాహ్నబి ఫుకాన్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి(ఫిక్కీ) లేడిస్ ఆర్గనైజేషన్‌కు 37వ నేషనల్ ప్రెసిడెంట్‌గా జాహ్నబి ఫుకాన్ ఎన్నికయ్యారు. ‘రైజింగ్ అబోవ్ కోవిడ్ ఛాలెంజెస్’ నేపథ్యంతో లోక్‌సభ స్పీకం ఓం ప్రకాశ్ బిర్లా సమక్షంలో జరిగిన 36 వ ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ వార్షిక సమావేశంలో ఇప్పటివరకు ప్రెసిడెంట్‌గా కొనసాగిన హర్జిందర్ కౌర్ తల్వార్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫుకాన్ ఎంట్రప్రెన్యూర్, ఆమె సహ వ్యవస్థాపకురాలుగా ఉన్న జంగిల్ ట్రావెల్స్ ఇండియా, జేటీఐ గ్రూపు ఆధ్వర్యంలోని అస్సాం బెంగాల్ నావిగేషన్ కంపెనీలు నేషనల్ టూరిజం అవార్డులు గెల్చుకున్నాయి.
తై ఇంగ్ వెన్
తైవాన్ అధ్యక్షురాలిగా తై ఇంగ్ వెన్ వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. కోవిడ్–19ను అరికట్టడంలో సఫలమైన తై ఇంగ్ వెన్ ఆ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు. 2020 జనవరిలో ఎన్నికైన ఆమె డెమెక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే 20న రెండోసారి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా 2016లో ఎన్నికయ్యారు.