అంతర్జాతీయం
‘స్విఫ్ట్’ నుంచి రష్యా అవుట్
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్యకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా మాస్కోపై అమెరికా, యూరప్ ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోని 200కుపైగా బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్) సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించాయి.
అతిపెద్ద విమానం ‘మ్రియా’ ధ్వంసం
ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానంగా పేరొందిన ‘ఆంటోనోవ్ ఏఎన్–225 లేదా మ్రియా(స్వప్నం)’ను రష్యా సైనికులు ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌బేస్‌లో మరమ్మతు కోసం నిలిపి ఉంచిన మ్రియాపై రష్యా జవాన్లు దాడి చేశారు.
ఉపగ్రహా ప్రయోగాలు నిలిపేసిన వన్‌వెబ్
యుద్ధం నేపథ్యంలో రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ వన్‌వెబ్ వెల్లడించింది. కజికిస్తాన్‌లో ఉన్న రష్యాకు చెందిన బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించే అన్ని ఉపగ్రహ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టుగా వన్‌వెబ్ తెలిపింది.
రష్యాకు లొంగిపోయిన ఖెర్సన్
యుద్ధం మొదలైన 8 రోజుల అనంతరం ఎట్టకేలకు ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకోగలిగింది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మార్చి 3న రష్యా సైన్యం ప్రకటించింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా దీన్ని ధ్రువీకరించింది.
దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడు
దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడిగా పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ ఎన్నికయ్యారు. అమెరికాతో బలమైన బంధాలను ఏర్పాటు చేసుకుంటామని యూన్ ప్రకటించారు. బలమైన సైన్యాన్ని నిర్మించి ఉత్తర కొరియాను ఢీకొంటామని చెప్పారు. యూన్ మే నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు.
సింధూ జలాలపై భారత్, పాక్ చర్చలు
సింధూ జలాల శాశ్వత కమిషన్ వార్షిక సమావేశం ఇస్లామాబాద్‌లో జరిగింది.1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల్లో ప్రవహించే నదుల నుంచి నీటి వినియోగం, వరద ప్రవాహం గురించి పరస్పరం సమాచారం అందిపుచ్చుకున్నారు.
ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగం
ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఆ దేశం సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఆ దేశ రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలో ఈ మిస్సైల్ టెస్ట్ చేశారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై నిషేధం
ఉక్రెయిన్‌పై దాడికి దిగిందని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న పలు మీడియా సంస్థలపై రష్యా నిషేధాజ్ఞలు జారీ చేసింది. తాజాగా ఫేస్‌బుక్, ట్విట్టర్ కూడా నిలిపివేసింది. రష్యాపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలు కల్పించేలా చట్టాన్ని తీసుకొచ్చింది.
పొరుగు దేశాలకు ఉక్రెయిన్ వాసులు
బాంబు దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉక్రెయిన్ వాసులు పరాయి దేశాలకు వలసపోతున్నారు. యుద్ధం ఆరంభమైన 11 రోజుల్లోనే ఈ శరణార్థుల సంఖ్య 15 లక్షలు దాటిపోయింది. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద శరణార్థి సంక్షోభంగా మారొచ్చని యూఎన్ఓ హెచ్చరించింది.
రష్యా అధీనంలో ‘చెర్నోబిల్’
చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం రష్యా అధీనంలోకి వెళ్లింది. ఈ అణు విద్యుత్ కేంద్రం (ఎన్‌పీపీ)తో అంతర్జాతీయ అణుశక్తి సంస్థకి సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ‘సేఫ్‌గార్డ్స్ మానిటరింగ్ సిస్టమ్స్’ నుంచి రిమోట్ డేటా ట్రాన్స్‌మిషన్ ఆగిపోయినట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఐఏఈఏ తెలిపింది.
మిస్ వరల్డ్‌గా కరోలినా బియలావ్‌స్కా
మిస్ వరల్డ్–2021 టైటిల్‌ను పోలాండ్‌కి చెందిన కరోలినా బియలావ్‌స్కా గెలుచుకుంది. ప్యూర్టోరికో రాజధాని శాన్ జువాన్‌లో 70వ ప్రపంచ సుందరి పోటీల్లో 97 దేశాల నుంచి పాల్గొన్నారు. ఫైనల్‌గా 23 ఏళ్ల కరోలినా మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంది.
చిలీ అధ్యక్షుడిగా గాబ్రియేల్ బోరిక్
వామపక్ష విద్యార్థి నేత గాబ్రియేల్ బోరిక్ చిలీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 36 ఏళ్ల వయసులో దేశ అత్యున్నత పదవిని అలంకరించిన చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని యువనేత ప్రకటించారు.
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో మార్చి 16న భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలుస్తోంది.
రష్యా ఔట్
ఐరోపా అత్యున్నత మానవ హక్కుల సంఘం ది కౌన్సిల్ ఆఫ్ ఐరోపా నుంచి రష్యా బహిష్కరణకు గురైంది. 47 ఐరోపా దేశాలతో ఏర్పాటైన ఈ సంఘంలో రష్యాతో పాటు, ఉక్రెయిన్ కూడా సభ్యదేశం.
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్
ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ వరుసగా నాలుగో ఏడాది టాప్‌లో నిలిచింది. స్విట్జర్‌ల్యాండ్‌కి చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2021 విడుదల చేసింది. కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్), జమేనా (చాడ్ రిపబ్లిక్), దుషంబె (తజికిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి.
బాలికా విద్యపై అఫ్గానిస్తాన్‌లో నిషేధం
అఫ్గానిస్తాన్‌లో బాలికా విద్య విషయంలో తాలిబాన్ ప్రభుత్వం తీరు మారలేదు. ఆరో తరగతికి మించి బాలికలు విద్య అభ్యసించడానికి వీల్లేదని మార్చి 22న తాలిబాన్ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైన తొలిరోజే విద్యార్థినులు ఇంటిదారి పట్టారు.
ఉక్రెయిన్‌పై హైపర్‌సోనిక్ ప్రయోగం
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తొలిసారిగా హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగించింది. ధ్వని కంటే 10 రెట్లు వేగంతో దూసుకెళ్లే అధునాతనమైన ‘కింజాల్’ క్షిపణిని మిగ్-31కె యుద్ధ విమానం ద్వారా పశ్చిమ ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై సంధించింది.
2025 వరకూ ట్రూడోనే ప్రధాని
కెనడాలో 2025 వరకు తమ పార్టీ అధికారంలో ఉండేలా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రతిపక్షంతో ఒప్పందానికి వచ్చారు. దీంతో తదుపరి ఎన్నికలు జరిగే 2025 వరకు ట్రూడో ప్రభుత్వం అధికారంలో ఉండటానికి మార్గం సుగమమైంది.
ఆకలితో నిమిషానికి 11 మంది మరణం
కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలతో నిమిషానికి 11 మంది చనిపోతున్నారని పేదరిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్‌ఫామ్’ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తాజగా ‘ది హంగర్ ముల్టిప్లయిస్’అనే పేరుతో నివేదిక విడుదల చేసింది.
నార్వేలో నాటో విన్యాసాలు
నార్వేలో ఐరోపా, ఉత్తర అమెరికాకు చెందిన 25కి పైగా దేశాలు సుమారు 30,000 మంది సైన్యం, 200 విమానాలు, 50 యుద్ధనౌకలు నాటో విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇవి ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని నాటో స్పష్టంచేసింది. విన్యాసాలకు పరిశీలక దేశం హోదాలో వచ్చేందుకు రష్యా నిరాకరించింది.
జాతీయం
ఆపరేషన్ గంగా
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత్ ‘ఆపరేషన్ గంగా’ పేరుతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సన్నిహిత సమన్వయంతో, భారతీయ విద్యార్థులను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
సైనిక సత్తా చాటిన మిలాన్
విశాఖ నౌకాదళంలోని నావల్‌డాక్‌యార్డ్‌లో ఏర్పాటుచేసిన ‘మిలాన్’ (బహుళదేశాల నౌకాదళ విన్యాసాలు)లో భాగంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుమారు 39 దేశాల నుంచి వచ్చిన నౌకాదళాలు ఇందులో పాల్గొన్నాయి.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వ పథకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ఇందుకు ఆమోదముద్ర వేసింది. అయిదేళ్ల కాలానికి ఈ పథకం కోసం రూ.1,600 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
ఎల్‌ఐసీలో 20 శాతం ఎఫ్‌డీఐ
త్వరలో పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఎల్‌ఐసీ షేర్లను ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో నమోదు చేయడానికి ప్రభుత్వం ఇది వరకే అనుమతి ఇచ్చింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో, ఆప్ ఒక రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలకు బీజేపీ 273 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రానుంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ 92 స్థానాలు గెల్చుకొని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ 47 స్థానాలతో ముందంజలో ఉంది. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 20 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలకు బీజేపీ 32 సీట్లు సాధించి అధికారంలోకి రానుంది.
భారత్‌కు 120వ స్థానం
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ మూడు స్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 117వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 120కి పడిపోయినట్లు ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ రిపోర్ట్-2022 పేర్కొంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) రూపొందించిన ఈ నివేదికలో భారత్‌కు100కు 66 స్కోర్ వచ్చింది.
మహిళా వ్యాపారవేత్తలకు ‘సమర్థ్’
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ ‘సమర్థ్’ను ప్రారంభించింది. ఎంఎస్‌ఎంఈ రంగం మహిళలకు అనేక అవకాశాలను అందిస్తోందని ఆ శాఖ మంత్రి నారాయణ్ రాణే అన్నారు.
దేశంలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్
దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్‌ను ముంబయి (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లో రిలయన్స్ ప్రారంభించింది. ఇది 18.5 ఎకరాల్లో విస్తరించిన జియో వరల్డ్ సెంటర్‌లో ముకేశ్ అంబానీ నేతృత్వంలో నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం 5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది.
స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన
స్వాతంత్య్ర సమరయోధులు, వారిపై ఆధారపడిన అర్హులైన వారికి పింఛన్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించే ‘స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన (ఎస్‌ఎస్‌ఎస్‌వై) పథకానికి 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 వరకు రూ.3,274 కోట్ల కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ముంబయిలో అత్యంత ధనికులు
దేశంలో ధనికులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని ‘నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్- 2022’ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అత్యంత ధనికులను కలిగిన నగరాల్లో ముంబయి అగ్రస్థానంలో ఉంది. అయిదేళ్లలో హైదరాబాద్‌లో ధనికుల సంఖ్య 31.4 నుంచి 48.7 శాతం పెరిగింది.
హిజాబ్ తప్పనిసరి కాదు
ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
పంజాబ్ సీఎంగా భగవంత్ మన్
పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి ఆప్ భారీ విజయం సాధించింది. దీంతో ఆప్ పార్టీకి చెందిన భగవంత్ మన్ ముఖ్యమంత్రిగా గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎయిర్ ఇండియా చైర్మన్‌గా చంద్రశేఖరన్
ఎయిర్ ఇండియా చైర్మన్‌గా టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఎయిర్ ఇండియా బోర్డ్ ఈ మేరకు ఆయనకు ఈ కొత్త బాధ్యత అప్పగించింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐజును ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీగా టాటా సన్స్ ప్రకటించింది.
తెలుగు వ్యక్తికి మారిషస్ స్టార్ పురస్కారం
మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషా యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ‘ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవమైన మార్చి 12వ తేదీన తొమ్మిది మంది ప్రముఖులను ఈ పురస్కారానికి అక్కడి ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.
యూఏవీని ఆవిష్కరించిన ‘మాగ్నమ్ వింగ్స్’
హైదరాబాదీ స్టార్టప్ మాగ్నమ్ వింగ్స్ తన తొలి వాణిజ్య యూఏవీ (మానవ రహిత విమాన వాహనం) – ఎండబ్ల్యూ వైపర్‌ను విడుదల చేసింది. పూర్తిగా దేశీయ అవసరాల కోసం రూపొందించిన దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు తమ అవసరాలకు వినియోగించవచ్చని వివరించింది.
2022 పద్మ పురస్కారాలు
రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రం నుంచి కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇండియన్ అంటార్కిటికా బిల్లు
అంటార్కిటికాలో భారత పరిశోధన కార్యకలాపాలు, అక్కడి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర భూ విజ్ఞానశాస్త్రాల శాఖ ఆధ్వర్యంలో ‘ది ఇండియన్ అంటార్కిటికా బిల్లు’ ముసాయిదాను రూపొందించారు.
సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణం
మణిపుర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ గణేశన్, బీరేన్‌తో సీఎంగా, అయిదుగురు ఎమ్యెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.
ఆర్జేడీలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ విలీనం
బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ నేతృత్వంలోని లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ )లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్చి 20న ఆయన తెలిపారు.
నిర్బంధ మతమార్పిడి నిరోధక బిల్
నిర్బంధ మతమార్పిడిని నిరోధించే బిల్లుకు హర్యాన అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ‘చట్టవ్యతిరేక మతమార్పిడి నిరోధక బిల్లు, 2022’ను బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. నిర్బంధంగాను, ప్రలోభాలకు గురిచేయడం, ఒత్తిడి తేవడం ద్వారా మతమార్పిడికి పాల్పడితే చర్యలు తీసుకుంటారు.
ప్రాంతీయం
నిర్మల్ జిల్లాలో ఇనుప ఖనిజం
నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామం వద్ద గల ఏడువారాల గుహల్లో ఇనుప ఖనిజం ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. జీఎస్‌ఐ కూడా దీన్ని ఇనుప ఖనిజంగా నిర్ధారించినట్టు తెలిపింది. సుమారు అరకిలోమీటర్ వైశాల్యంలో ఉన్న గుట్టల్లో ఇనుప ఖనిజం గుర్తులు ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లాలో ‘శాతవాహన’ ఆనవాళ్లు
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో శాతవాహనుల కాలం నాటి ఇటుక గోడలు, పురావస్తు అవశేషాల్ని గుర్తించినట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, చరిత్ర పరిశోధన సంస్థ ‘పిహ్రా’ ప్రతినిధుల బృందం వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2022 –23
2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను మార్చి 7న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. బడ్జెట్లో రెవెన్యూ రాబడి 1,93,029.40 రూపాయలు కాగా, రెవెన్యూ వ్యయం 1,89,274.82, రెవెన్యూ మిగులు 3,754.58 రూపాయలుగా ఉంది.
శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి శాసనమండలి చైర్మన్ పదవి ఖరారైంది. చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్ అనుమతి కోసం పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి ‘ఉద్యమిక’
మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సమీక్షించి వారికి అండగా నిలుస్తోందన్నారు.
మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి
రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ తెలిపారు.
నర్సంపేట మహిళా సమాఖ్యకు నేషనల్ అవార్డు
మహిళా సంఘాల బలోపేతంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వరంగల్ జిల్లా నర్సంపేట మండల సమాఖ్యకు జాతీయస్థాయి ‘ఆత్మనిర్భర్ సంఘటన్’ అవార్డు దక్కింది. సమాఖ్య ప్రతినిధులు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సుజన
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా అడ్మినిస్ట్రేటివ్ రిజిస్ట్రార్ కె.సుజన నియమితులయ్యారు. గతంలో ఉన్న రిజిస్ట్రార్ జనరల్ నాగార్జున్ న్యాయమూర్తిగా నియమితులుకావడంతో ఆయన స్థానంలో కె.సుజన బాధ్యతలు స్వీకరించారు.
కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు
రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డిని, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌ను, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇంతియాజ్ ఇషాక్‌ను నియమించారు.
హైకోర్టులో కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు.
వార్తల్లో వ్యక్తులు
మాధవి పురి బచ్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కొత్త చైర్‌పర్సన్‌గా మాధవి పురి బచ్ నియమితులయ్యారు. మార్కెట్ నియంత్రణాధికార సంస్థ పగ్గాలు చేపట్టబోతున్న తొలి మహిళ ఈమే. చైర్‌పర్సన్‌గా మూడేళ్లు ఆమె పదవిలో ఉండనున్నారు.
కెటాన్జీ బ్రౌన్ జాక్సన్
అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిగా కెటాన్జీ బ్రౌన్ జాక్సన్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశాడు. గత రెండు శతాబ్దాలుగా శ్వేత జడ్జీలతోనే కొనసాగుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కూర్పులో తొలి నల్ల జాతీయురాలిగా ఆమె రికార్డ్ సృష్టించారు.
డోబ్రియాల్
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖకు నూతన సారథి(అటవీ సంరక్షణ ప్రధాన అధికారి/పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్‌గా ఉన్న ఆర్.శోభ పదవీ విరమణ పొందారు.
మెద్వెదెవ్
రష్యా టెన్నిస్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత జకోవిచ్‌ను మెద్వెదెవ్ వెనక్కి నెట్టాడు. ఫెదరర్, నాదల్, జకోవిచ్, ముర్రే కాకుండా.. గత 18 ఏళ్లలో నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్న తొలి ఆటగాడిగా మెద్వెదెవ్ నిలిచాడు.
రఫెల్ నాదల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ మెక్సికన్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. సింగిల్స్ ఫైనల్లో నాదల్ 6-–4, 6-–4తో కామెరూన్ నోరి (బ్రిటన్)ని ఓడించాడు. 35 ఏళ్ల నాదల్‌కు కెరీర్‌లో ఇది 91వ ఏటీపీ టైటిల్. ఈ సీజన్లో మూడోది.
ఆర్.ప్రియ
చెన్నై మేయర్‌గా ఎన్నికైన తొలి దళిత మహిళగా ఆర్. ప్రియ రికార్డు సృష్టించింది. చెన్నైకు ప్రియ 49వ మేయర్‌కాగా ఇందులో కేవలం ఇద్దరే మహిళలు ఉన్నారు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డీఎంకే నుంచి కామాక్షి జయరామన్ మాత్రమే మేయర్లుగా పని చేశారు.
సునీల్ అగర్వాల్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా సునీల్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఎఫ్‌వోగా ఆయన బాధ్యతలను స్వీకరించినట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాంగి సంజయ్ సోమాన్ సీఎఫ్‌వో బాధ్యతలు చూశారు.
ప్రాచీ దేవ్
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దేవ్ కేక్ పీస్‌లతో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించింది. దాదాపు 1500 పీస్‌లతో ఇటలీలోని ప్రసిద్ధ స్మారకం మిలన్ కేథడ్రల్ (క్రైస్తవుల ప్రార్థనాలయం)ను రూపొందించారు. ఈ 100 కేజీల కళాకృతి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.
మాన్సి జోషి
2019 ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ మాన్సి జోషి బీడబ్ల్యూఎఫ్ తాజా పారా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ఇటీవల స్పానిష్ ఇంటర్నేషనల్ ఈవెంట్ మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
రవీంద్ర జడేజా
శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో బ్యాట్, బంతితో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకులో నిలిచాడు. బాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా ఐదు, ఆరో స్థానంలో ఉన్నారు.
ప్రసన్నశ్రీ
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సత్తుపాటి ప్రసన్నశ్రీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి – 2021 పురస్కారాన్ని అందుకున్నారు. మొత్తం 28 మందికి పురస్కారాలు అందించగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రసన్నశ్రీ ఒక్కరే ఉన్నారు.
వికాస్‌రాజ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ రాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ముందు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శశాంక్ గోయల్ కేంద్ర సర్వీస్ మీద వెళ్లారు.
గోరటి వెంకన్న
ప్రజాగాయకుడు, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార ఈ అవార్డును వెంకన్నకు ప్రదానం చేశారు.
డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి
అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేషన్(ఏజీఏ) ‘విశిష్ట విద్యావేత్త’ అవార్డుకు ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టోఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.
దేవాశిష్ పాండా
భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నూతన చైర్మన్‌గా ఆర్థిక దేవాశిష్ పాండాను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉండేందుకు మంత్రివర్గ నియామకాల సంఘం అనుమతినిచ్చింది.
ప్రదీప్ కుమార్ రావత్
చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14న బీజింగ్‌లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారని ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులైన మునుపటి రాయబారి విక్రమ్ మిస్రీ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
మల్లు స్వరాజ్యం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో మరణించారు. ఆమె 1945- – 46 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం ఎదిరించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలు ఉద్యమాల్లో, రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి, రెండుసార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు.
పుష్కర్‌సింగ్ ధామి
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ధామితో పాటు 8 మంది మంత్రులతో ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్‌సింగ్ ప్రమాణం చేయించారు.
జయతీ ఘోష్
‘సమర్థవంతమైన బహుపాక్షికత’పై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సలహామండలికి భారతీయ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ను ఎంపిక చేసినట్లు యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు.
యాష్లే బార్టీ
మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్టీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాకి చెందిన 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
పంకజ్ అద్వాణీ
భారత క్యూ స్టార్ పంకజ్ అద్వాణీ ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. సింగిల్స్ ఫైనల్లో పంకజ్ 6-2తో మరో భారత ఆటగాడు ధ్రువ్ సిత్‌వాలాపై గెలిచాడు. కెరీర్‌లో అద్వాణీకి ఇది ఎనిమిదో ఆసియా బిలియర్డ్స్ టైటిల్. మొత్తం మీద అతడికి ఇది 40వ అంతర్జాతీయ టైటిల్.
శోభా దీక్షిత్
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధ సంస్థ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ (ఐడబ్ల్యూఎన్) దక్షిణ ప్రాంత చైర్‌పర్సన్‌గా అల్‌ప్లా ఇండియా డైరెక్టర్ శోభా దీక్షిత్ బాధ్యతలు స్వీకరించారు. 2022–23 సంవత్సరానికి ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.
హిసాషి టకూచి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఎండీ, సీఈఓగా హిసాషి టకూచిని నియమించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఎండీ, సీఈఓగా ఉన్న కెనిచి అయుకవా పదవీ కాలం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సారథిని బోర్డు ఎంపిక చేసింది.
స్పోర్ట్స్
దబంగ్ ఢిల్లీకి ప్రొ కబడ్డీ టైటిల్
దబంగ్ ఢిల్లీ బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి ప్రొ కబడ్డీ సీజన్-–8లో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ 37–-36తో పట్నాను ఓడించింది. ఈ సీజన్లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన నవీన్ కుమార్ (13) ఫైనల్లోనూ సత్తా చాటాడు.
షూటింగ్ ప్రపంచకప్‌లో గోల్డ్
ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ లభించింది. మార్చి 3న జరిగిన మహిళల10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది.
షూటింగ్‌లో ఇషాకు సిల్వర్
హైదరాబాద్ టీనేజ్ షూటర్ ఇషాసింగ్ కైరోలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఫైనల్లో ప్రపంచ చాంపియన్ అనా కొరాకాకి (గ్రీస్), టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత విటలీనా (రష్యా) లాంటి షూటర్ల కంటే ఇషా మెరుగైన ప్రదర్శన చేసింది.
క్రికెట్‌కు శ్రీశాంత్ వీడ్కోలు
టీమ్ ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల దేశవాళీ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
గుండెపోటుతో షేన్ వార్న్ మృతి
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మరణించాడు. 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు.
హ్యాండ్‌బాల్‌లో భారత్‌కు గోల్డ్
ఆసియా మహిళల జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. కజకిస్థాన్‌లో జరిగిన ఈ టోర్నీలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో తొలిసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది.
శ్రేయస్‌కు ఐసీసీ అవార్డు
భారత బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు ఐసీసీ మెన్స్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్, శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల్లో శ్రేయస్ విశేషంగా రాణించాడు. మహిళల విభాగంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైంది.
హైదరాబాద్‌కు ఇండియన్ సూపర్ లీగ్
ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్‌ను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ సీజన్-–8లో హోరాహోరీగా సాగిన ఆఖరి పోరులో హైదరాబాద్ పెనాల్టీ షూటౌట్లో 3–-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. గత రెండు సీజన్లలో 10, 5 స్థానాల్లో నిలిచిన హైదరాబాద్‌కు కప్ గెలవడం విశేషం.
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్
భారత యువ ఆటగాడు లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రన్నర్‌గా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. అక్సెల్సెన్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
చైనా లాంగ్ మార్చ్-–8 సక్సెస్
చైనా అధునాతన లాంగ్ మార్చ్-8 రాకెట్ 22 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఒక అంతరిక్ష నౌక ద్వారా ఇన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం చైనాలో ఇదే తొలిసారి. ఈ మేరకు వెంచాంగ్ అంతరిక్ష నౌక ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
బ్రహ్మోస్ మిస్సైల్ సక్సెస్
సముద్రం నుంచి భూమిపైకి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొట్టే మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. అరేబియా సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్’ సక్సెస్ అయినట్లు నేవీ ప్రకటించింది.
చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-– 2
చంద్రయాన్-2 ఆన్‌బోర్డ్‌లోని చేస్-2 పరికరం చంద్రుని ఉపరితంలోని ఆర్గాన్ ఉద్గారాలను పరిశీలిస్తోంది. చేస్-2 స్వతంత్రంగా చేపట్టిన తొలి ప్రక్రియ ఇదే అని ఇస్రో బెంగళూరులో ప్రకటించింది. చంద్రుని ఉపరితలంలోని జీవరాశులు, రేడియోధార్మిక ప్రక్రియలను ఇది అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది.
పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్ ఫెయిల్
సింధ్ టెస్టింగ్ రేంజ్ నుంచి పాక్ ప్రయోగించిన మిస్సైల్ విఫలమైంది. గాల్లోకి ఎగిరిన కొన్ని సెకండ్లలోనే క్షిపణి సాంకేతిక లోపంతో గతి తప్పి, సింధ్‌లోని తానాబులాఖాన్ ప్రాంతంలో పడిపోయింది. సింధ్ ప్రావిన్సులో గుర్తు తెలియని వస్తువు పొగతో ఆకాశంలో కనిపించడంతో కంగారు పడిన స్థానికులు మీడియాలో మిస్సైల్ టెస్ట్ ఫెయిలయినట్టు తెలుసుకున్నారు.
బ్రహ్మోస్ పరీక్ష సక్సెస్
ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ పరీక్ష నిర్వహించింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేధించిందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ‘వింగ్స్ ఇండియా 2022’
ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఏవియేషన్ షో ‘వింగ్స్ ఇండియా 2022’ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శనలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి చిన్న, పెద్ద విమానాలు, హెలికాప్టర్లు వచ్చాయి.