Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ ఎఫైర్స్: జూన్​ 2020

కరెంట్ ఎఫైర్స్: జూన్​ 2020

తెలంగాణ


ఐటీ వృద్ధిరేటు
రాష్ట్రం 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఐటీ వృద్ధిరేటు 17.97శాతంగా నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు 8.09శాతం నమోదైంది. 2018–19లో ఐటీ ఎగుమతులు 10.61శాతం ఉండగా ఈ ఏడాది11.58శాతం నమోదైంది. ఉద్యోగవృద్ధిరేటు 7.2శాతంగా ఉంది. ఈ ఏడాది ఐటీ రంగంలో రూ.7337 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
గజ్వేల్‌కు రైలు
2016లో ప్రధాని మోడీ మనోహరాబాద్–కొత్తపల్లి రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా తొలిదశలో మనోహరాబాద్–గజ్వేల్ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిచేశారు. ఈ మార్గంలో నాచారం, ఎల్కల్ బేగంపేట్ అనే రెండు స్టేషన్లు ఉండగా రైలు నడిపేందుకు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టి అనుమతించింది. ఈ ప్రాజెక్టుకు ఉచిత భూమి, 1/3 నిర్మాణ వ్యయం, 5 ఏళ్ల పాటు నిర్వహణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది.
పాముల రక్షణ కేంద్రం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో గల బౌరంపేట్‌లో పాముల రక్షణ కేంద్రాన్ని రాష్ట్ర అటవీశాఖ ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. రూ.1.40 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. 35 ఎకరాలలో విస్తరించిన ఈ కేంద్రంలో రక్షించిన పాములను 7 రోజులపాటు ఉంచి అనంతరం అడవులలో వదిలేస్తారు.
STREE ప్రోగ్రాం
హైదరాబాద్‌లోని మహిళలను గృహ హింస నుంచి కాపాడి వారి స్వయం సమృద్ధి కోసం తోడ్పడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ ‘She Triumphs through Respect, Equality, and Empowerment” (STREE)’ అనే ప్రోగ్రాన్ని తీసుకొచ్చారు. విభిన్న సమస్యలతో బాధపడుతున్న మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారిలో ఒకరిని ‘సబలశక్తి’ వలంటీర్‌‌గా నియమిస్తారు. వీరికి సలహాలివ్వడం కోసం గ్రూపులో ఒక ఎన్‌జీవో సభ్యుడు, ఒక అడ్వకేట్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి హౌస్ ఆఫీసర్ సభ్యుడిగా ఉంటారు.
బయోడైవర్సిటీ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీకి ఈ ఏడాదికి ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పర్యావరణ అవార్డులలో ఒకటైన ప్రిన్స్ అల్బర్ట్ II మొనాకో ఫౌండేషన్ అందించే బయో డైవర్సిటీ అవార్డు గెల్చుకుంది. సంగారెడ్డి జిల్లాలో 75 గ్రామాలలో మహిళా, రైతు సంఘాలను ఏర్పాటు చేసి బంజరు భూములలో జీవవైవిధ్యం కోసం చేస్తున్న కృషికి లభించింది. ఈ సంస్థకు 2019లో యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అందించే ‘ఈక్వెటార్ అవార్డు’ లభించింది.
సమ్మక్క బ్యారేజీ అనుమతులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సమ్మక్క(తుపాకుల గూడెం) బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 68.9 ఎకరాల అటవీశాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీటిని అందించడంలో భాగంగా గోదావరి నదిపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
కొండ పోచమ్మ సాగర్ ప్రారంభం
ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండ పోచమ్మ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మే 29న ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్‌‌ స్వామితో కలిసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని బైలాన్‌పూర్ వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టును సముద్రమట్టానికి 618 మీటర్లు ఎత్తులో నిర్మించారు. దీని సామర్థ్యం 15 టీఎంసీలు. దీనిద్వారా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 3 లక్షల ఎకరాలు లబ్ధి పొందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ కాగా అత్యధిక ఎత్తులో నిర్మించిన ప్రాజెక్టు కొండ పోచమ్మ సాగర్.

Advertisement

నేషనల్

స్ట్మార్ట్ క్లాస్‌రూమ్
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం 100 పాఠశాలల్లో ‘స్మార్ట్ క్లాస్‌రూమ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం జూన్ 21న రాజస్థాన్ ప్రభుత్వం, పవర్‌‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందుకు రూ.1.85 కోట్ల వ్యయం చేయనుంది. గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ ఒక్కో పాఠశాలలో నలుగురు టీచర్లకు శిక్షణ ఇస్తారు.
జర్మన్ బుక్‌ట్రేడ్ ప్రైజ్
గ్లోబల్ పీస్ కోసం చేసిన కృషి, రచనలకు గాను 1988 ఎకనమిక్స్ నోబెల్ విన్నర్ అమర్త్యసేన్‌కు జర్మన్ బుక్‌ట్రేడ్ పీస్ ప్రైజ్ ఈ ఏడాదికి లభించింది. 1950 నుంచి జర్మన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ అందిస్తున్న ఈ బహుమతి విలువ 25వేల యూరోలు.
ఏక్తు ఖేలో ఎక్తు పడో
త్రిపుర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ‘ఏక్తు ఖేలో ఎక్తు పడో’ పథకాన్ని జూన్ 25న ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న విద్యార్థులకు వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వర్క్‌షీట్స్‌ను పంపుతూ కొవిడ్–19 కాలంలో వారి విద్యాసాధనకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
రూల్ ఆఫ్ లా ఇండెక్స్
వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు 128 దేశాలను పరిగణలోకి తీసుకుని రూల్ ఆఫ్ ఇండెక్స్ జాబితాను తీసుకొచ్చింది. ప్రభుత్వ అవరోధాలు, అవినీతి, పారదర్శకత, ప్రాథమిక హక్కులు, రక్షణ, చట్టాల అమలు, సామాజిక న్యాయం లాంటి అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క్ తొలి స్థానంలోఉంది. నార్వే రెండు, ఫిన్లాండ్ మూడోస్థానంలోఉంది. ఇండియాకు 69వ స్థానం దక్కింది.
బలగాలు వెనక్కి
తూర్పు లడఖ్‌లో భారత్ – చైనాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని జూన్ 23న ఒప్పందం కుదిరింది. చైనా ఆధీనంలోని చుషుల్ ప్రాంతంలో జరిగిన చర్చల్లో 14వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి కమాండర్ జనరల్ లియులిన్‌లు నేతృత్వం వహించారు.
భద్రతా మండలికి ఇండియా
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి జరిగిన ఎన్నికల్లో ఆసియా–ఫసిఫిక్ ప్రాంతం కేటగిరి నుంచి ఇండియా ఎన్నికైంది. ఇండియాతోపాటు నార్వే, మెక్సికో, ఐర్లాండ్ దేశాలు ఎన్నికయ్యాయి. ప్రతి రెండేళ్లకోసారి ఐరాసలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 192 దేశాలు పాల్గొన్నాయి. భారత్‌కు అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి.
ఖేలో ఇండియా సెంటర్లు
జిల్లాస్థాయిలో ఖేలో ఇండియా పథకాన్ని విస్తరించేందుకు 1000 ఖేలో ఇండియా సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేయనుంది. షూటింగ్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బాక్సింగ్, హాకీ, అథ్లెటిక్స్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, జూడో, రెజ్లింగ్, ఫెన్సింగ్, స్విమ్మింగ్, రోయింగ్ వంటి క్రీడా విభాగాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
వైఎస్సార్ కాపు నేస్తం
కాపు, తెలగ, బలిజ కులాలకు ఏపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ కాపునేస్తం’ కింద జూన్ 24న ఆర్థిక సాయం అందించింది. ఒక్కో మహిళకు ఏటా రూ.15వేల చొప్పున 5 ఏళ్లలో రూ.75వేలు అందిస్తారు. రూ.254 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా 2,35,873 మంది లబ్ధి పొందనున్నారు.
బీఎస్ భానుమతి
విశాఖపట్నం జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్న బీఎస్ భానుమతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులయ్యారు. 2019 జనవరి 1న ఏర్పడిన ఏపీ హైకోర్టుకు తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా మానవేంద్రనాథ్ రాయ్ పనిచేశారు.
గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్
బిహార్‌‌లోని ఖగారియా జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ పథకాన్ని జూన్ 20న ప్రారంభించారు. వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఇది అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడం కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేయనుంది.
సత్యభామ పోర్టల్
ఖనిజ తవ్వకాలలో డిజిటల్ విధానం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం SATYABHAMA(Science And Technology Yojana for Aatmanirbhar Bharat in Mining Advancement) అనే పోర్టల్‌ను తీసుకొచ్చింది. మైనింగ్ రంగంలో ప్రమాణాలు మెరుగుపర్చుటకు ఏర్పాటు చేశారు. దీనిని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వహిస్తుంది.
నయా రక్షక్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆమోదించిన పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్(పీపీఈ) ‘నయా రక్షక్’. దీనిని భారత నౌకా హాస్పిటల్‌ ఐఎన్‌హెచ్‌ఎస్–అశ్వినికి చెందిన డాక్టర్లు రూపొందించారు. వీటి ఉత్పత్తి కోసం నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 5 ఎంఎస్‌ఎంఈలకు లైసెన్స్‌లు జారీ చేసింది.
కేకే వేణుగోపాల్
భారత అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈయన 2017 జులై 1 నుంచి పదవిలో కొనసాగుతుండగా 2020 జులై 1 నుంచి ఏడాది కాలం పొడిగించారు. మొరార్జీ దేశాయ్ కాలంలో ఈయన అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
శోభా శేఖర్
భారత సంతతి విద్యాంసురాలు శోభా శేఖర్ ఈ ఏడాదికి ‘ది మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారానికి ఎంపికైంది. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌లో లెక్చరర్‌‌గా పనిచేస్తున్నారు. 1994 నుంచి ఆస్ట్రేలియాలో ‘కళాకృతి’ అనే సంస్థను నిర్వహిస్తోంది. మ్యూజిక్ షోలు నిర్వహించి వాటిద్వారా వచ్చిన డబ్బులను ఆమె ఆస్ట్రేలియా బుష్‌ఫైర్‌ బాధితులకు అందజేశారు. ‌
కెప్టెన్ అర్జున్
ప్రయాణికుల పరిశీలన, నిఘా కోసం సెంట్రల్ రైల్వేకు చెందిన ఫుణె డివిజన్ ‘కెప్టెన్ అర్జున్’ అనే రోబోను రూపొందించింది. ARJUN అనగా Always be Responsible and Just Use to be Nice. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ రోబోలో అంతర్గతంగా సైరన్ ఉంటుంది. రైల్వేస్టేషన్‌లో సంఘ వ్యతిరేక కార్యకాలాపాలను పరిశీలిస్తుంది.
జీపైలో భారత్
గ్లోబల్ పార్ట్‌నర్‌‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(జీపీఏఐ) గ్రూపులో జూన్ 15న ఇండియా వ్యవస్థాపక దేశంగా చేరింది. ప్రపంచ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇందులో యూకే, యూఎస్‌ఏ, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, మెక్సికో, కొరియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
డబుల్ స్టాక్ కంటెనయిర్ ట్రైన్
వెస్ట్రన్ రైల్వే పరిధిలోని పలన్‌పూర్ – బొటాడ్ మార్గంలో 272 కిలోమీటర్ల దూరం ఎలక్ట్రికల్ హాల్డ్ డబుల్ స్టాక్ కంటెయినర్ రైలు జూన్ 10న ప్రారంభమైంది. 7.57 మీటర్ల ఎత్తయిన రెండు అంతస్తుల కంటైనర్లను ప్రవేశపెట్టడం ప్రపంచంలోనే తొలిసారి. ఎత్తైన ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌ను భూభాగంలో హై రీచ్ పాంటోగ్రాఫ్‌తో డబుల్ స్టాక్ కంటైనర్ రైలును నడిపిన మొదటి రైల్వేగా ఇండియన్ రైల్వే ప్రపంచరికార్డు సృష్టించింది.
హాస్టళ్లకి ఐఎస్‌వో గుర్తింపు
ఎస్సీ, ఎస్టీల కోసం ‘మిషన్ సువిద్య’లో భాగంగా 2019లో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ హాస్టళ్లకి ఐఎస్‌వో 9001:2015 గుర్తింపు లభించింది. గిరిజన వసతిగృహాలకు ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఐఎస్‌వో) గుర్తింపు లభించడం ఇదే తొలిసారి. ఎస్సీ, ఎస్టీ శాఖలు, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా చేపట్టిన మదింపు ఆధారంగా కియోంజర్‌‌లోని 32, సంబల్‌పూర్‌‌లోని 12 హాస్టళ్లకి ఈ గుర్తింపు దక్కింది.
డిజిటల్ తెరపై యోగా
కోవిడ్–19 దృష్ట్యా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని జూన్ 21న డిజిటల్ తెరలపై నిర్వహించాలని నిర్ణయించింది. ‘యోగా ఎట్ హోమ్ – యోగా విత్ ఫ్యామిలీ’ థీమ్‌తో నిర్వహించనున్నారు. ఇప్పటికే కేంద్రం యోగాపై ప్రచారం కోసం ‘మై ఫ్యామిలీ–మై యోగా’ వీడియో బ్లాగింగ్ టెస్ట్‌ను ప్రారంభించింది.
శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు ప్లాటినం
ఎయిర్‌‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఈ ఏడాదికి ప్రకటించిన అత్యుత్తమ ఎయిర్‌‌పోర్టుల జాబితా ఆసియా – పసిఫిక్ విభాగంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌‌పోర్టుకు ప్లాటినం గుర్తింపు లభించింది. 2020లో నీటి నిర్వహణ అంశంలో 35 మిలియన్లలోపు ప్రయాణికుల విభాగంలో ఈ పురస్కారం ప్రకటించారు. ఇదే జాబితాలో ఇందిరాగాంధీ ఎయిర్‌‌పోర్టు(ఢిల్లీ)కు గోల్డ్, చత్రపతి శివాజీ ఎయిర్‌‌పోర్ట్‌(ముంబయి)కు సిల్వర్ గుర్తింపు లభించింది.
రాజధానిగా గెయిర్‌‌సేయిన్
ఉత్తరాఖండ్ రాష్ట్ర రెండో రాజధానిగా గెయిర్‌‌సేయిన్‌ను ఎంపిక చేసినట్లు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. 2000 నవంబర్ 9న ఏర్పడ్డ ఉత్తరాఖండ్‌కు రాజధానిగా ఉన్న డెహ్రాడూన్‌ను శీతల రాజధానిగా కొనసాగనుంది. గెయిర్‌‌సేయిన్ వేసవి రాజధానిగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా చమోలిలోని ఒక నగర పంచాయతీ ఇది. 2011 జనాభా లెక్కల ప్రకారం దీని జనాభా 7,138 మాత్రమే. రాష్ట్రం మధ్యలో ఉండడంతో భవిష్యత్తులో పూర్తిస్థాయి రాజధానిగా కానుంది.
అనన్య స్ప్రే
పుణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సంస్థ నానో టెక్నాలజీ ఆధారంగా కోవిడ్–19ను అరికట్టే ‘అనన్య స్ప్రే’ను రూపొందించింది. దీనిని 6 నెలలపాటు వాడుకునే వీలుంటుంది. మాస్కులు, వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లతో పాటు, కారిడార్స్, స్ట్రెచర్స్ వంటి వాటిపై స్ప్రే చేయవచ్చు. శరీరంలోనికి వ్యాధికారక వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు. శరీరంపై రసాయన ప్రభావం పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటుంది.
కోరో రోబో
మహారాష్ట్రలోని థానేకు చెందిన ప్రతీక్ తిరోద్కర్ అనే యువ ఇంజినీర్ ‘కోరో రోబో’ను తయారు చేశారు. ప్రపంచంలోనే ఇంటర్నెట్ ఆధారంగా నియంత్రించే తొలి రోబో ఇది. ఆసుపత్రులలో సేవల కోసం దీనిని రూపొందించారు. కోవిడ్–19 రోగులకు ఆహారం, మందులు, నీరు అందిస్తుంది.
నేపాల్‌కు సాయం
2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న పాఠశాలల పునర్నిర్మాణం కోసం ఇండియా 2.95 బిలియన్ నేపాలి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 7 జిల్లాల్లోని 56 స్కూళ్లను పునర్నిర్మిస్తున్నారు. వీటిలో గోర్ఖా, నువాకోచ్, దడింగ్, దొలాకా, కప్రిపారన్ చౌక్, సింధుపాల్‌చౌక్, రామెచాప్ జిల్లాలున్నాయి. 2015 ఏప్రిల్‌లో భూకంపం సంభవించినప్పుడు నేపాల్‌లో ‘ఆపరేషన్ మైత్రి’ కార్యక్రమాన్ని చేపట్టింది.
నేత్రకు యూఎన్‌వో గుర్తింపు
తమిళనాడులోని మధురైకు చెందిన సెలూన్ యజమాని కూతురు నేత్ర తన చదువు కోసం పేరెంట్స్ దాచిన రూ.5లక్షలను వలసకూలీల నిత్యావసర సరుకుల కోసం అందించింది. దీనిపై మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకున్న నేత్ర జెనీవాలో జరిగే యూఎన్‌వో సదస్సులో ‘పేదరికం’ పై ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకుంది. యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ పీస్ సంస్థకు గుడ్‌విల్ అంబాసిడర్‌‌గా ఎంపికైంది.
వివాహ వయసు పెంపు
మహిళల వివాహ వయసు పెంచేందుకు గల సాధ్యాసాధ్యాలపై సూచనలు అందించేందుకు కేంద్రప్రభుత్వం జయాజైట్లీ(ఢిల్లీ) నేతృత్వంలో కమిటీని నియమించింది. ఇందులో నజ్మా అక్తర్, వసుధా కామత్, దీప్తి షాలు సభ్యులుగా ఉన్నారు. పదవీరీత్యా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరు వివాహ వయసు, మాతృత్వం, గర్భధారణ సమస్యలు, శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్య రేటు, స్త్రీ పురుష నిష్పత్తిపై అధ్యయనం చేస్తారు. శారదాచట్టం–1929 నిబంధనల ప్రకారం వివాహ వయసును 1978లో 15 నుంచి 18కి పెంచారు.
తొలి ఆన్‌లైన్ వేదిక
వ్యర్థాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఆరెంజ్, రెడ్‌జోన్‌ల పరిధిలోని పరిశ్రమల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేస్తారు.
రాజ్‌నాథ్‌సింగ్ కమిటీ
ఆత్మనిర్భర్ భారత్‌ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించడం కోసం ప్రకటించిన రుణాలను పొందడంలో భాగంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి కావాల్సిన సూచనలు చేసేందుకు రాజ్‌నాథ్​ సింగ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను పునరుద్ధరించడం కోసం మే 13న ఈ ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రం ఇటీవల నిర్వచనం ప్రకారం రూ.1–5 కోట్ల టర్నోవర్ ఉన్నవి సూక్ష్మ, రూ.10 కోట్ల పైన టర్నోవర్ ఉన్నవి చిన్న, రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ కలిగినవి మధ్యతరహా పరిశ్రమలుగా గుర్తిస్తారు.
జాతీయ పశుగణన
2019 ఏడాదికి సంబంధించిన జాతీయ పశుగణన వివరాలను కేంద్రం మే 30న ప్రకటించింది. 2019లో 512.06 మిలియన్లు ఉన్న పశుసంపద 4.63శాతం పెరుగుదలతో 535.78 మిలియన్లకు చేరాయి. మాంసం వార్షిక వృద్ధిరేటులో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఉన్ని ఉత్పత్తిలో బిహార్ మొదటిస్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి వృద్ధిరేటులో కర్ణాటక, గుడ్ల ఉత్పత్తి వృద్ధిరేటులో రాజస్థాన్‌లు తొలిస్థానం పొందాయి. గుడ్ల వినియోగంలో మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు సంయుక్తంగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి.
పీఎం మత్స్య సంపద యోజన
కోవిడ్–19తో దెబ్బతిన్న మత్స్యరంగాన్ని పునరుద్ధరించడంలో భాగంగా 2020–21 నుంచి 2024–25 వరకు అమలులో ఉండే విధంగా కేంద్రం ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ పథకాన్ని చేపట్టింది. దీని వ్యయం రూ. 20,050 కోట్లు. హెక్టారుకు 5 టన్నుల చేపల దిగుబడిని పెంచుతూ 2025 నాటికి చేపల ఉత్పత్తిని 220 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలి. ఈ పథకానికి 100శాతం నిధులు కేంద్రం అందిస్తుంది.
మై లైఫ్ మై యోగ
ఆయుష్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)ల సహకారంతో మే 31 ప్రధాని మోడీ ‘మై లైఫ్ మై యోగ’ వీడియో బ్లాగింగ్‌ పోటీని ప్రారంభించారు. 2020 జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో ప్రజలు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం చైతన్యపర్చనుంది. యోగాలోని ఆసనం, ధ్యానం, ముద్రలతో కూడిన 3 నిమిషాల వీడియోను పంపిస్తే ఫస్ట్ ప్రైజ్ కింద రూ.లక్ష, సెకండ్ ప్రైజ్ రూ.50వేలు, థర్డ్ ప్రైజ్ రూ.25వేలు అందిస్తారు.
పీఎం స్వనిధి
వీధి వ్యాపారుల రూ.10 వేలు రుణం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 1న ‘ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర నిధి(పీఎం స్వనిధి) పథకాన్ని ప్రవేశపెట్టింది. వీటిని సకాలంలో చెల్లిస్తే 7శాతం వడ్డీ రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. సకాలంలో చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా మరింత ఎక్కువ రుణం, డిజిటల్ చెల్లింపులు చేసినవారికి నెలవారీ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
సీఐఐ కొత్త ఛైర్మన్
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రిస్ (సీఐఐ)కు నూతన ఛైర్మన్‌గా ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. ఇప్పటివరకు కొనసాగిన విక్రం కిర్లోస్కర్ స్థానంలో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం కొటక్ మహీంద్రా ఎండీగా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తున్నారు.
అజిత్ జోగి
చత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి మే 29న కన్నుమూశారు. ఈయన 2000 నుంచి 2003 వరకు సీఎంగా వ్యవహరించారు. 2016లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్(జేసీసీ) పార్టీని స్థాపించారు. బహుజన సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేసిన ఈ పార్టీ 7.6శాతం ఓట్లతో 5 సీట్లను గెల్చుకున్నారు.
సుబ్బారావు
న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అండ్ బిహేవియర్ సైన్సెస్ విభాగంలో ఈ ఏడాదికి ‘మిడ్ కెరీర్ అవార్డు’ విజేతగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘ఐసీఎంఆర్ – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’కు చెందిన శాస్త్రవేత్త సుబ్బారావు గవరవరపు నిలిచారు. ఆయన ఎడ్యుకేషన్ రీసెర్చ్, పాలసీ అండ్ ప్రాక్టీస్‌లో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
ఇండియాకు 23వ ర్యాంకు
స్టార్టప్ కంపెనీల స్థాపనకు అనుకూల వాతావరణం, రక్షణ, ప్రోత్సాహకాల ఆధారంగా స్టార్టప్ బ్లింక్ సంస్థ రూపొందించిన ‘గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆఫ్ స్టార్టప్ ఎకో సిస్టం’ నివేదికలో యూఎస్‌ఏ తొలిస్థానంలో నిలిచింది. యూకే రెండు, ఇజ్రాయెల్ మూడోస్థానంలో ఉన్నాయి. ఇండియాకు 23వ ర్యాంకు లభించింది. గతేడాది 17వ ర్యాంకులో ఉండగా ఈ సారి ఆరు స్థానాలు పడిపోయింది. ప్రపంచంలోని అత్యుత్తమ 1000 స్టార్టప్ నగరాలలో ఇండియా నుంచి 38 నగరాలకు చోటు లభించింది. బెంగళూరు 14, న్యూఢిల్లీ 15, ముంబయి 22, హైదరాబాద్ 96 స్థానాలలో ఉన్నాయి.
కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్
బ్రిటీష్ పాలిత దేశాలకు చెందిన 18 ఏళ్ల పైబడిన వయసు వారికి ప్రతి సంవత్సరం ప్రచురించని ఉత్తమ షార్ట్ స్టోరీస్(3000లోపు పదాలతో రూపొందించిన)కు అందించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్’ ఈ ఏడాదికి ఇండియన్ రైటర్ రాంచీకి చెందిన క్రితికా పాండేకు లభించింది. ఆసియా ప్రాంత విభాగంలో ఆమె రాసిన ‘గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్’ అనే షార్ట్ స్టోరీస్‌కు ఈ అవార్డు దక్కింది.
నో టొబాకో డే అవార్డు
ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నిర్మూలన కోసం కృషి చేసినవారికి ఏటా అందించే ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ’ అవార్డును ఈ ఏడాది సీడ్స్(సోషియో ఎకనమిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ) అనే ఎన్‌జీవోకు లభించింది. 2001లో స్థాపించిన ఈ సంస్థ బిహార్, జార్ఖండ్‌లలో ఈ–సిగరెట్లు, గుట్కాల నిర్మూలన కోసం చేసిన కృషికి దక్కింది. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ ప్రత్యేక అవార్డు కాంబోడియన్ మూవ్‌మెంట్ ఫర్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాయ్ కాంగ్‌కు లభించింది.
1100 ఏళ్ల శివలింగం
ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వియత్నాంలో 1100 ఏళ్లనాటి సాండ్ స్టోన్ శివలింగాన్ని కనుగొన్నది. సెంట్రల్ వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లో గల మైసన్ శాంక్చురీ పరిధిలో చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో బయటపడింది. 10వ శతాబ్దంలో ఖ్మేర్ సామ్రాజ్యాన్ని పాలించిన రెండో ఇంద్రవర్మన్ నిర్మించిన ‘మైసన్’ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది.

ఇంటర్నేషనల్

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్
బ్లూమ్‌బర్గ్ సంస్థ ఈ ఏడాదికి రూపొందించిన బిలియనీర్ల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్(160.1 బిలియన్ డాలర్లు) మొదటిస్థానంలో నిలిచాడు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్(108.7 బిలియన్ డాలర్లు) రెండో స్థానం, ఎల్‌వీఎంహెచ్ స్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫ్యామిలీ(103.2బిలియన్ డాలర్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇండియా నుంచి రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ టాప్ 10లో నిలిచారు. 64.6 బిలియన్ డాలర్ల సంపాదనతో 9వ స్థానంలో ఉన్నారు.
ప్రపంచ దాతలు
టీన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచ దాతల నివేదికలో టిమ్‌ కుక్(ఆపిల్ సీఈవో), ఒఫ్రా విన్‌ఫ్రే(టీవీ యాంకర్), లియోనార్డో డికాప్రియో(హాలీవుడ్ నటుడు) లాంటి ప్రముఖులకు చోటు లభించింది. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీకి చోటు లభించింది.

నేచర్ ఇండెక్స్
ఆయా దేశాలలో జరుగుతున్న పరిశోధనల ఆధారంగా స్ర్పింగర్ నేచర్ విడుదల చేసిన నేచర్ ఇండెక్స్‌లో చైనీస్ అకాడమి ఆఫ్ సైన్సెస్ సంస్థ మొదటిస్థానంలో నిలిచింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ రెండు, యాక్స్ ప్లాంక్ సొసైటీ(జర్మనీ) మూడో స్థానంలో ఉంది. ఇండియాలో సీఎస్‌ఐఆర్‌‌ సంస్థకు 160, ఐఐఎస్సీ 184, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 260వ ర్యాంకు దక్కాయి.
వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ సంస్థ 63 దేశాలను పరిశీలించి విడుదల చేసిన వరల్డ్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో సింగపూర్‌‌ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. డెన్మార్క్ సెకండ్, స్విట్జర్లాండ్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇండియాకు 43వ ప్లేస్ దక్కింది. విద్య, ఉత్పాదక పెరుగుదల, విదేశీ మారక నిల్వల పెరుగుదలతో గతంతో పోలిస్తే ఒక స్థానం మెరుగుపర్చుకుంది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే చైనా(20) తర్వాత స్థానంలో ఉంది.
ఆసియా యూత్ పారాగేమ్స్
ది ఆసియన్ పారా ఒలంపిక్స్ కమిటి నాల్గవ ఆసియా యూత్ పారాగేమ్స్‌ను 2021లో డిసెంబర్ 1 నుంచి 10 వరకు బహ్రెయిన్ లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. తొలిసారిగా ఈ క్రీడలు 2009లో టోక్యోలో జరిగగా చివరిసారిగా 2017లో దుబాయిలో నిర్వహించారు.
ఫిఫా ర్యాంకింగ్స్
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా(ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ) 2020 ఏడాదికి గాను జూన్ 11న ర్యాంకులను ప్రకటించింది. బెల్జియం, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాలు వరసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇండియా 108వ స్థానం దక్కించుకుంది.
ప్రపంచ ఆహార బహుమతి
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 న అందించే ప్రపంచ ఆహార బహుమతి – 2020 ఏడాదికి గాను భారత సంతతికి చెందిన అమెరికన్ రతన్‌లాల్‌కు ఈ లభించింది. ఒహియో యూనివర్సిటీకి చెందిన ఇతను భూమి ఆధారిత విధానాలను రూపొందించి ఆహార పంటల ఉత్పాదకతను పెంచాడు.

Advertisement

ఆసియా బెస్ట్ వర్సిటీలు
టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 482 ఇండియన్ యూనివర్సిటీలకు చోటు దక్కింది. 2019తో పోలిస్తే కొత్తగా 72 సంస్థలకు చోటు లభించింది. జపాన్(110), చైనా(81) తర్వాత ఎక్కువగా 72 కొత్త సంస్థలు ఇండియా నుంచి ఎంపికయ్యాయి. ఈ జాబితాలో చైనా నుంచి సింగ్హువ వర్సిటీ ఫస్ట్, పెకింగ్ వర్సిటీ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ థర్డ్ ప్లేసులో ఉంది. టాప్–100లో ఇండియా నుంచి 8 సంస్థలకు చోటు లభించగా వీటిలో 6 ఐఐటీలు ఉన్నాయి.
ఫోర్బ్స్ సెలెబ్రెటీలు
ఫోర్బ్స్ ఈ ఏడాదికి అత్యధిక ఆదాయం గల టాప్–100 సెలెబ్రెటీల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయుడిగా అక్షయ్ కుమార్ నిలిచారు. ఇతను 48.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 52వ ర్యాంకు దక్కించుకున్నాడు. కైలీ జెన్నర్ (390 మిలియన్ డాలర్లు) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. కాన్యె వెస్ట్(170మి.డా)సెకండ్, రోజర్ ఫెదరర్(106మి.డా) థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ జాబితాలో నిలిచిన అతిచిన్న వయస్కుడిగా బిల్లీ ఐలిష్ (53మిలియన్ డాలర్లతో 43వ ర్యాంకులో ఉన్నారు. పౌల్ మెక్ కోట్నో 37 మిలియన్ డాలర్లతో 91వ స్థానంలో నిలిచి టాప్–100లో నిలిచిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు.
వరల్డ్ బెస్ట్ బిజినెస్‌మెన్ అవార్డు
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏటా అందించే ప్రపంచపు అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డు ఈ ఏడాదికి బయోకాన్ ఛైర్‌‌పర్సన్ కిరణ్‌ మజుందార్ షాకు లభించింది. ఉదయ్ కొటక్(2014), నారాయణమూర్తి(2005)ల తర్వాత ఈ అవార్డుకి ఎంపికైన మూడో వ్యక్తి కిరణ్. 41 దేశాల నుంచి 46 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తల నుంచి ఈ ఎంపిక చేపట్టారు.
ఇండియా – డెన్మార్క్ అగ్రిమెంట్
విద్యుత్ రంగంలో వ్యూహాత్మక జోక్యంలో భాగంగా భారత్ – డెన్మార్క్‌ల మధ్య జూన్ 5న పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా ఇరువర్గాలకు లాభదాయకమైన పునరుత్పాదక ఇంధనాలపై దృష్టిసారిస్తారు. ఇందుకోసం విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందర్ సహాయ్ భారత్‌లో డెన్మార్క్ రాయబారి ఫ్రెడ్డిస్వానెలు సంతకం చేశారు.
జీ–20 సాయం
అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిగా 1999లో ఏర్పడిన జీ–20 కోవిడ్‌–19పై పోరాటం చేస్తున్న సభ్యదేశాలకు 21 బిలియన్ డాలర్లు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో అందించిన 5 ట్రిలియన్ డాలర్ల సాయానికి ఇది అదనం. గతంలో ప్రకటించిన మొత్తం ద్రవ్యవిధానాలు, పథకాల అమలు కోసం కాగా ప్రస్తుత సాయం పరిశోధన, అభివృద్ధి, వ్యాక్సిన్ల తయారీ, పరీక్షా విధానాల రూపకల్పన, చికిత్స విధానాలు మెరుగుపర్చేందుకు అందించింది.

వ్యక్తులు


కృష్ణేందు మజుందార్
యూకేలో నివసిస్తున్న టెలివిజన్ నిర్మాత కృష్ణేందు మజుందార్ బ్రిటిష్ అకాడమి ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్తా)కు కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. బాఫ్తా చరిత్రలో ఛైర్మన్‌గా ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి ఈయనే. ప్రస్తుతం పిప్పా హారిస్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. హారిస్ ఇక నుంచి డిప్యూటీ ఛైర్‌‌పర్సన్‌గా కొనసాగనున్నారు. దీనికంటే మజుందార్ లెర్నింగ్ అండ్ న్యూ టాలెంట్ కమిటీ, టెలివిజన్ కమిటీలకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన ‘హాఫ్ ద రికార్డు’కు ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరించి అమెరికన్ ప్రీమియర్ టెలివిజన్ రంగంలో అందించే ఎమ్మీ అవార్డుకు ఎంపికయ్యారు.
జో బిడెన్
2020 నవంబర్‌‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. పార్టీలోని 3879 డెలిగేట్స్‌లో 1991 మంది ఆయనకు మద్దతు తెలిపారు. ఆగస్టులో విస్కార్సిస్‌లో జరిగే డెమోక్రటిక్ కౌన్సిల్‌లో ఇతని అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
రాజీవ్ టోప్నో
2009 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్ టోప్నోను ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌కు సీనియర్ సలహాదారునిగా నియమించారు. ఈయన 1996 గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి.
బ్రజేంద్ర నవనీత్
2016 నుంచి పీఎంవోలో పనిచేస్తున్న బ్రజేంద్ర నవనీత్‌ను ప్రపంచ వాణిజ్య సంస్థ( డబ్ల్యూటీవో)లో భారత శాశ్వత రాయబారిగా నియమించారు. ఈయన 1999 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి.
రంజిత్ కుమార్
భారత సంతతికి చెందిన ఇంజినీర్ రంజిత్ కుమార్‌‌కు ‘నాసా డిస్టింగ్విష్‌డ్ పబ్లిక్ సర్వీస్ మెడల్’ లభించింది. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా నాసా మిషన్ కోసం కృషి చేస్తున్నవారికి ఈ పురస్కారం అందిస్తారు. రంజిత్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) రీ డిజైనింగ్‌లో చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.

బీపీఆర్ విఠల్
1950 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ జూన్ 19న మరణించారు. 1972–82 కాలంలో కేంద్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. సూడాన్, మాల్దీవులకు పన్ను సలహాదారుడిగా వ్యవహరించారు. ఈయన రచించిన ‘ది తెలంగాణ సర్‌‌ప్లెసెస్; ఏ కేస్ స్టడీ వ్యాసం తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించింది.
ఉర్జిత్ పటేల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థకు నూతన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు కొనసాగిన విజయ్ కేల్కర్ స్థానంలో ఈ నియామకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ఆర్థికశాఖ నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులు, ఆర్‌‌బీఐ, నీతి ఆయోగ్ నుంచి ఒక్కొక్కరు దీనిలో సభ్యులుగా ఉంటారు.
వోల్కాన్ బోజ్కిర్
75 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వర్చువల్ విధానంలో జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 75వ అధ్యక్షుడిగా టర్కీ దౌత్యవేత్త వోల్కాన్ బోజ్కిర్ ఎన్నికయ్యారు. సీక్రెట్ బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో 178 దేశాలు మద్దతు తెలపగా, 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
అన్మోల్ నారంగ్
అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సిక్కు మహిళ అన్మోల్ నారంగ్ యునైటెడ్ స్టేట్స్ మిలటరీ అకాడమి నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా నిలిచారు. మార్చి 13న జరిగిన అకాడమి వార్షికోత్సవ కార్యక్రమంలో 23 ఏళ్ల నారంగ్ పట్టా అందుకున్నారు. ఓక్లహామాలోని అకాడమి నుంచి ఆమె బేసిక్ ఆఫీసర్ లీడర్‌‌షిప్ కోర్సును పూర్తిచేశారు. ప్రస్తుతం అన్మోల్ సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు.
కతి సులివాన్
ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంగా పేరుగాంచిన పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్‌లోకి డైవ్ చేసిన తొలి మహిళగా కతి సులివాన్ రికార్డు సృష్టించారు. అమెరికాకు చెందిన ఈమె 1984లో స్పేస్‌వాక్ చేసిన తొలి అమెరికన్ మహిళగా రికార్డు నెలకొల్పారు. మార్చి 15న ఓషనోగ్రాఫర్ విక్టర్ వెస్కోవాతో కలిసి ఆమె 35,853 అడుగుల లోతున్న ట్రెంచ్‌లోకి డైవ్ చేశారు.
క్యాతి ల్యూడర్స్
నాసా చంద్రుని పైకి 2024లో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి చీఫ్‌గా కతి ల్యూడర్స్ ఎంపికయ్యారు. ఆమె హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ఆపరేషన్స్ మిషన్‌ డైరెక్టరేట్‌ను లీడ్ చేయనున్నారు. 1992 నుంచి నాసాలో పనిచేస్తున్న ల్యూడర్స్ మానవులను అంతరిక్షంలోకి వెళ్లడానికి స్పేస్ ఎక్స్, బోయింగ్‌, ఇతర సంస్థలతో కలిసి నాసా చేస్తున్న స్పేస్ క్యాప్యూల్స్ ప్రయోగానికి బాధ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

స్పోర్ట్స్

గోమతి మరిముత్తుపై నిషేధం
తమిళనాడుకు చెందిన రన్నింగ్ అథ్లెట్ గోమతి మరిముత్తుపై అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ డోపింగ్‌ ఆరోపణలతో 4 ఏళ్ల(2019 మే 17 – 2023 మే 16) నిషేధం విధించింది. దీంతోపాటు 2019 మార్చి 18 నుంచి సాధించిన అన్ని పతకాలు, పాయింట్లు, ర్యాంకింగ్స్‌పై నిషేధం విధించింది. దోహా(ఖతార్‌‌)లో జరిగిన ఆసియాన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్–2019లో 800 మీటర్ల పరుగులో గోమతి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.
ఆసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నీ
ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్‌ నిర్వహించే మహిళల ఫుట్‌బాల్ టోర్నీ 2022లో ఇండియా వేదికగా జరగనుంది. 2023 ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టోర్నీకి ఇది అర్హత టోర్నీ. ఇది 1975లో ప్రారంభమవగా 1979లో ఒకసారి ఇండియాలో జరిగింది. 41 ఏండ్ల తర్వాత భారత్‌కు దక్కింది.
వరల్డ్ ఆర్చరీ టోర్నీ వాయిదా
2020 సెప్టెంబర్‌‌లో యూఎస్‌ఏలోని యాంక్టన్ ఆర్చరీ సెంటర్‌‌లో జరగాల్సిన వరల్డ్ ఆర్చరీ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ కోవిడ్–19 కారణంగా 2022కు వాయిదాపడింది. 2021లో వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ జరగాల్సి ఉంది.
భూమి – అంతరిక్షం మధ్య చెస్‌ పోటీ
భూమిపై ఉన్న క్రీడాకారులతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములతో చెస్‌ టోర్నీ త్వరలో జరగనుంది. మాస్కోలోని వ్యోమగాముల స్మారక మ్యూజియం నుంచి రష్యన్ గ్రాండ్ మాస్టర్ సెర్జి కర్జాకిన్ ఐఎస్‌ఎస్‌లోని అనటోలి ఇవానిషిన్, ఇవాన్ వాగ్నర్‌‌లతో పోటీ పడనున్నారు. ఇటువంటి టోర్నీ తొలిసారిగా 1970లో జరిగింది.
బ్యాడ్మింటన్ టోర్నీ వాయిదా
న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో జరగాల్సిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు వాయిదాపడ్డాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించిన రీ షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ 2021 జనవరి 11 నుంచి 16 వరకు, సింగిల్స్, డబుల్స్ జనవరి 18 నుంచి 24 వరకు జరగనున్నాయి.
కిరణ్‌జీత్‌పై నిషేధం
ఇండియన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కిరణ్‌జీత్ కౌర్‌‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నాలుగేళ్ల నిషేధం విధించింది. 2019 డిసెంబర్‌‌లో కోల్‌కతా వేదికగా జరిగిన 25 కిలోమీటర్ల రన్నింగ్ రేస్‌లో ఓవరాల్‌గా 11వ స్థానంలో నిలిచింది. అప్పుడు సేకరించిన శాంపిల్స్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు బయటపడడంతో ఈ నిషేధం విధించారు.
ఫెదరర్ టాప్
ఫోర్బ్స్ పత్రిక ఈ ఏడాదికి ప్రకటించిన అత్యధిక ఆదాయం గల క్రీడాకారుల టాప్–100 జాబితాలో స్విటర్జాండ్ల్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ రూ.801 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో టెన్నిస్ క్రీడాకారుడు తొలిస్థానం పొందడం ఇదే తొలిసారి. క్రిస్టియానో రోనాల్డో(రూ.794 కోట్లు) సెకండ్, లియోనల్ మెస్సీ(రూ.786 కోట్లు) థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లి(రూ.196 కోట్లు) 66వ స్థానంలో ఉన్నారు. టాప్‌–100లో చోటు పొందిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లినే కావడం విశేషం.

సైన్స్ అండ్ టెక్నాలజీ

స్పేస్ ఎక్స్ మానవ సహిత యాత్ర
అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా స్పేస్ ఎక్స్ అనే ప్రైవేటు సంస్థ మే 30న మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టింది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌకతో కూడిన వాహకనౌకను ప్రయోగించారు. నాసాకు చెందిన డెగ్‌ హర్లి, బాబ్ బెంకెన్‌లు ఈ వ్యోమనౌక ద్వారా ప్రయాణించారు. 19 గంటల ప్రయాణం అనంతరం ఆటోమేటిక్ పద్ధతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు అనుసంధానమైంది. ఈ ప్రయోగంలో బలరామమూర్తి అనే ఇండియన్ ఇంజినీర్ కీలకపాత్ర పోషించారు.
నాన్సి గ్రేస్ టెలిస్కోప్
నాసా ప్రయోగించనున్న నెక్ట్స్ జనరేషన్ టెలిస్కోప్ Wide field infraded survey telescope (WFIRST) పేరును నాన్సి గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌గా పేరు మార్చారు. అంతరిక్ష టెలిస్కోపులకు మార్గం సుగమం చేసిన, నాసాకు ఫస్ట్ చీఫ్ ఆస్ట్రానమర్‌‌గా వ్యవహరించిన నాన్సి గ్రేస్ జ్ఞాపకార్థం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని ఈ ఏడాది మధ్యలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!