Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జులై 2021

కరెంట్​ అఫైర్స్​: జులై 2021

అంతర్జాతీయం

Advertisement

చైనాలో భారీ జలవిద్యుత్​ కేంద్రం
ప్రపంచంలోనే రెండో అత్యంత పెద్దదైన బైహెతాన్​ జలవిద్యుత్​ కేంద్రాన్ని చైనా పాక్షికంగా ప్రారంభించింది. జూలై ఒకటో తేదిన చైనా కమ్యూనిస్ట్​ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మొత్తం 16 యూనిట్లలో రెండు యూనిట్లను ప్రారంభించింది.

గ్రే లిస్టులో పాకిస్తాన్​
ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ది ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్​ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ప్రకటించింది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో పాక్‌ ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడు మార్కస్‌ ప్లేయెర్‌ సూచించారు.

జాకబ్​ జుమాకు జైలు శిక్ష
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్​ జుమా కోర్టు ధిక్కరణకు పాల్పిడినందుకు ఆ దేశ సుప్రీంకోర్టు 15 నెలల జైలు శిక్ష వేసింది. అవినీతి కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పినా ధిక్కరికంచడంతో ఈ శిక్ష విధించారు.

గూగుల్​ నంబర్​వన్​
ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్‌ బ్రాండ్‌గా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. అమెజాన్‌ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ ఇండియా తర్వాత స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) 2021 సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ఆకర్షణీయమైన వేతనాలు, బెనిఫిట్స్​ వంటి అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందించారు.

హైతి అధ్యక్షుడి హత్య
కరేబియన్‌ దేశమైన హైతి అధ్యక్షుడు జోవెనెల్‌ మోయిజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పోర్ట్‌–అవ్‌–ప్రిన్స్‌ నగరంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు జోవెనెల్‌ను కాల్చి చంపినట్టుగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ వెల్లడించారు. దాడిలో గాయపడిన అధ్యక్షుడి భార్య మార్టిన్‌ మోయిజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తాలిబన్ల చేతుల్లో ఈశాన్య అఫ్గాన్​
అఫ్గనిస్థాన్​లోని ఈశాన్య రాష్ట్రమైన బాదక్షాన్​ మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అఫ్గాన్​ సైన్యం ఎదురుతిరగకపోవడంతో యుద్ధం లేకుండానే ఆ ప్రాంతం వారు ఆక్రమించారు. అఫ్గాన్​ నుంచి అమెరికా సైన్యం వెళ్లడంతో తాలిబన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

నిమిషానికి 11 ఆకలి చావులు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోతున్నారని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తోన్న ‘ఆక్స్​ఫామ్​’ సంస్థ నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ ‘ది హంగర్​ వైరస్​ మల్టిప్లైస్​’ పేరుతో నివేదిక రూపొందించింది. 155 మిలియన్ల మంది దారుణమైన ఆహార సంక్షోభంలో ఉందని తెలిపింది.

నేపాల్​ ప్రధానిగా దేవ్​బా
నేపాల్​ ప్రధానమంత్రిగా నేపాలి కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు షేర్​ బహదూర్​ దేవ్​బా నియమితులయ్యారు. ఆయన ప్రధానిగా ప్రమాణం చేయడం ఇది ఐదోసారి. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ దేశ అధ్యక్షురాలు బింద్యాదేవి భండారి దేవ్​బాను ప్రధానిగా నియమించారు.

ఒలింపిక్స్​ ప్రారంభించనున్న జపాన్​ రాజు
టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలను జపాన్‌ రాజు నరుహితో ప్రారంభిస్తారని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తెలిపింది. నరుహితో టోక్యో ఒలింపిక్స్‌కు ప్యాట్రన్‌గా ఉన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసి పోటీలు ఆరంభమైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు.

యూరో కప్​ విజేత ఇటలీ
ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీ యూరో కప్‌ –2020ని ఇటలీ జట్టు సొంతం చేసుకుంది. లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్‌లో 3–2తో ఇంగ్లండ్‌ను ఓడించింది. తాజా విజయంతో వరుసగా 34 మ్యాచ్‌ల పాటు ఓటమి ఎరుగని ఘనతను ఇటలీ సాధించింది.

అమెరికా రాయబారిగా గార్సెటి
అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ మేయర్‌గా పని చేస్తున్న ఎరిక్‌ గార్సెటిని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖరారు చేశారు.

బ్రిస్బేన్​లో 2032 ఒలింపిక్స్​
2032 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించ‌నున్నట్లు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్రక‌ట‌న చేసింది. 2000 సంవ‌త్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. టోక్యో త‌ర్వాత‌ 2024లో పారిస్‌లో, 2028 లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జ‌ర‌గ‌నున్నాయి.

బ్లూ ఆరిజిన్​ స్పేస్​ టూర్​ సక్సెస్​
అమెజాన్​ ఫౌండర్​ జెఫ్​ బెజోస్​ రోదసియాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. బ్లూ ఆరిజిన్​ రూపొందించిన ‘న్యూ షెపర్డ్​’ వ్యోమనౌకలో 10.10 నిమిషాల్లో వెళ్లొచ్చారు. టూర్​లో ప్రపంచంలోనే అతిపెద్ద, అతిచిన్న వ్యోమగాములుగా 82 ఏండ్ల మహిళ వేలీ ఫంక్​, 18 ఏండ్ల ఆలివర్​ డేమన్​ గుర్తింపు పొందారు.

సిరియా అధ్యక్షుడిగా అసద్​
సిరియా దేశ అధ్యక్షుడిగా బషర్​ అసద్​ ఎంపికయ్యాడు. అధ్యక్షుడి పదవీకాలం ఏడేళ్లు కాగ ఆయన 2000 నుంచి అధికారంలో ఉన్నారు. ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది వరుసగా నాలుగోసారి.

కరేజ్​ అండ్​ సివిలిటీ అవార్డ్​
బ్లూ ఆరిజిన్‌ సంస్థ అధినేత జెఫ్​ బెజోస్​ ‘కరేజ్‌ అండ్‌ సివిలిటీ’ పేరుతో కొత్త అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించాడు. సమాజంలోని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తోన్న వారికి ఈ అవార్డు అందజేయనున్నారు. ప్రస్తుతం ఈ అవార్డుకు ప్రఖ్యాత చెఫ్‌ జోస్‌ ఆండ్రీస్, అమెరికాలోని జర్నలిస్ట్​ వాన్‌ జోన్స్‌ ఎంపికయ్యారు. అవార్డుతో పాటు వీరిద్దరూ దాదాపు చెరో రూ. 745 కోట్ల(10కోట్ల డాలర్లు) అందుకోనున్నారు.

చైనా రైలు గంటకు 600 కి.మీ.
గంటకు 600 కి.మీ. వేగంతో దూసుకెళ్లే ఆధునిక మాగ్లెవ్​ రైలును చైనా ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే. తూర్పు చైనా ప్రాంతంలోని షిడాంగ్​ ప్రావిన్స్​ కిండావ్​ నగరంలో ఈ సరికొత్త మాగ్లెవ్​ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.

టిబెట్​లో జిన్​పింగ్​ పర్యటన
చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ తొలిసారి టిబెట్​లో పర్యటించారు. న్యాంగ్​, బ్రహ్మపుత్ర నదులపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులను, రైల్వే స్టేషన్​, మ్యూజియం సందర్శించారు. 2013 లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిన్​పింగ్​ టిబెట్​లో పర్యటించడం ఇదే తొలిసారి.

విదేశీ టూరిస్టులకు గ్రీన్​సిగ్నల్​
సౌదీఆరేబియా పర్యాటక శాఖ 17 నెలల తర్వాత విదేశీ పర్యాటకులను ఆగస్టు 1వ తేదీ నుంచి అనుమతిస్తుంది. కరోనా వైరస్​ ప్రభావంతో విదేశీ టూరిస్టులను సౌదీఆరేబియా అనుమతించడం లేదు. ఇప్పుడు వ్యాక్సిన్​ వేసుకున్న వారు సౌదీలో పర్యటించడానికి అవకావం కల్పిస్తోంది.

రష్యా ప్రధాని వివాదాస్పద టూర్​
రష్యా, జపాన్​ల మధ్య చాలా కాలంగా సద్దుమణిగిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రష్యా ప్రధాని మిఖైల్​ మిషుస్తిన్​ పసిఫిక్​ మహాసముద్రంలోని కురిల్ దీవులను సందర్శించి, అక్కడ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో జపాన్​ అభ్యంతరం తెలిపింది.

‘యూరోపా’ కు గ్రీన్​ సిగ్నల్​
గురు గ్రహనికి ఉపగ్రహమైన ‘యూరోపా’ పైకి నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిప్పర్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్​ దొరికింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్‌ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే దాని లక్ష్యం.

జాతీయం

హర్యానా గవర్నర్​గా దత్తాత్రేయ
ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్‌ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ అయ్యారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్, గోవాకు శ్రీధరన్‌ పిళ్లై, హిమాచల్‌ప్రదేశ్‌కు రాజేంద్రన్‌ విశ్వనాథ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపురకు సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌కు రమేష్‌ బయాస్‌ నియమితులయ్యారు.

టాప్​ బ్రాండ్​గా ‘తాజ్’​
టాటా గ్రూపునకు చెందిన ‘తాజ్‌’ ప్రపంచంలోనే బలమైన హోటల్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ‘హోటల్స్‌ 50–2021’ పేరుతో జూన్‌ 25న బ్రాండ్‌ ఫైనాన్స్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. తాజ్‌ తర్వాత ప్రీమియన్‌ ఇన్‌, మెలియా హోటల్స్‌ నిలిచాయి.

డ్రోన్​ అటాక్​
జమ్మూలోని భారత వైమానిక దళ (ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ ఉగ్రదాడి జరిగింది. జమ్మూ విమానాశ్రయంలోని ఐఏఎఫ్‌ స్టేషన్‌పై జూన్‌ 27న ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండు బాంబులు వేశారు. ఈ బాంబు దాడిలో ఇద్దరు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు.

అగ్రస్థానంలో బెంగళూర్​
కర్ణాటక రాజధాని బెంగళూరు దేశంలో నివాసయోగ్య నగరాల్లో టాప్​ ప్లేస్​లో నిలిచింది. విజ్ఞాన, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) విడుదల చేసిన నివాసయోగ్యాల నగరాల జాబితాలో ఈ విషయం వెల్లడైంది. సీఎస్‌ఈ జాబితా ప్రకారం బెంగళూరు తర్వాత స్థానాల్లో చెన్నై, సిమ్లా, భువనేశ్వర్, ముంబై నిలిచాయి.

రూ.6.28 లక్షల కోట్ల ప్యాకేజీ
ఉత్పత్తి, ఎగుమతులు, ఉపాధి పెంచుతూ ఆరోగ్య, సామాజిక, ఆర్థిక రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో ప్యాకేజీ ప్రకటించింది. రూ.6.28 లక్షల కోట్ల ప్యాకేజీతో 15 విభాగాలకు రాయితీలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ్​ ప్రకటించారు. మహమ్మారి నుంచి ఆర్థిక ఉపశమనం పేరుతో దీన్ని ప్రకటించారు.

పశ్చిమబెంగాల్​లో శాసనమండలి
శాసనమండలి ఏర్పాటుకు పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తీర్మానానికి 265 మంది సభ్యుల్లో 196 మంది ఆమోదించారు. ఈ తీర్మానానికి గవర్నర్‌ ఆమోదం తెలపాల్సిఉంది. అనంతరం పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ కావాల్సిఉంటుంది. ప్రస్తుతం దేశంలోని 6 రాష్ట్రాల్లో శాసనమండళ్లున్నాయి.

ఉత్తరాఖండ్​ సీఎంగా పుష్కర్‌సింగ్‌ ధామీ
ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ యువనేత పుష్కర్‌సింగ్‌ ధామీ ఎన్నికయ్యారు. పుష్కర్‌తో పాటు 11మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఉత్తరాఖండ్‌కు పిన్నవయస్కుడైన ముఖ్యమంత్రిగా పుష్కర్‌ రికార్డు నెలకొల్పారు.

నిపుణ్​ భారత్​ ప్రారంభం
దేశంలో సమగ్ర విద్య, అక్షరాస్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘నిపుణ్‌ భారత్‌–2021 కార్యక్రమం’ ప్రారంభమైంది. జాతీయ విద్యావిధానం –2020 అమలులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. నిపుణ్‌ భారత్‌కు సంబంధించిన చిన్న వీడియో, ఒక గీతం, మార్గదర్శకాలను ఢిల్లీ నుంచి వర్చువల్‌ మోడ్‌లో విడుదల చేశారు.

అధికారపక్ష నేతగా పీయూష్​
రాజ్యసభలో అధికార పక్షనేతగా కేంద్రమంత్రి పీయూష్​ గోయల్ ఎంపికయ్యారు. వర్షాకాల సమావేశాల నుంచి రాజ్యసభలో బీజేపీ నేతగా ఆయన వ్యవహరించనున్నారు. ప్రస్తుతం గోయల్​ పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, జౌళి, ఆహారపంపిణీ శాఖలకు మంత్రిగా ఉన్నారు.

కర్ణాటక గవర్నర్​గా థావర్​చంద్​
కర్ణాటక గవర్నర్​గా థావర్​ చంద్​ గెహ్లాట్​ బాధ్యతలు స్వీకరించారు. మోడీ క్యాబినేట్​లో సెంట్రల్​ మినిస్టర్​గా పనిచేసిన గెహ్లాట్​ను రాజ్​భవన్​లోని గ్లాస్​ హౌస్​లో గవర్నర్​గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అభయ్​ శ్రీనివాస ఓకా ప్రమాణం చేయించారు.

ఇండియా ఒలింపిక్​ సాంగ్​ రిలీజ్​
ఒలింపిక్స్​లో పాల్గొంటున్న భారత అథ్లెట్ల బృందానికి ‘ చీర్​ 4 ఇండియా: హిందుస్తానీ వే’ అనే అధికారిక పాటను క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ విడుదల చేశారు. ఈ సాంగ్​కు ఏఆర్​ రహమాన్​ సంగీతం అందించగా గాయని అనన్య బిర్లా పాడారు.

6.26% రిటైల్​ ద్రవ్యోల్బణం
జూన్​ నెలలో 6.26 శాతంగా రిటైల్​ ద్రవ్యోల్బణం నమోదైంది. మే (6.3%) నెలతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. కన్జ్యూమర్​ ప్రైస్​ ఇండెక్స్​ (సీపీఐ) ఆధారంగా రిటైల్​ ద్రవ్యోల్బణం లెక్కిస్తారు. 2 నుంచి 6 శాతం లోపు ద్రవ్యోల్బణం నియంత్రించాలని ఆర్​బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

బీబీబీ మైనస్‌గా భారత్‌ సావరిన్‌ రేటింగ్‌
భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను ‘బీబీబీ మైనస్‌’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– సాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) ప్రకటించింది. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇది దిగువ స్థాయి గ్రేడ్‌. వరుసగా 14 సంవత్సరాల నుంచీ ఎస్‌అండ్‌పీ భారత్‌కు ఇదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది.

మిజోరాం గవర్నర్​గా హరిబాబు
మిజోరాం 15వ గవర్నర్​గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఐజ్వాల్​లోని రాజ్​భవన్​లో గువాహటి హైకోర్ట్​ న్యాయమూర్తి జస్టిస్​ మైఖేల్​ జోథాన్​ఖుమా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

పెగాసస్​ సాఫ్ట్​వేర్​ దుమారం​
పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు ఇది పనికొస్తుంది. ఉగ్రవాదులు, నేరగాళ్లపై నిఘా పెట్టడం కోసం తయారైనా సాఫ్ట్‌వేర్‌ ను భారత్‌లో ప్రతిపక్షాలు, విలేకరులపై వాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అతిపెద్ద మానవ నిర్మిత అడవి
దేశంలోనే అతిపెద్ద మానవుడు నిర్మిస్తున్న అడవిని ఛత్తీష్​గఢ్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 885 ఎకరాల్లో 80 వేల మొక్కలు నాటేందుకు ప్లాన్​ చేస్తోంది. అడవి నిర్మాణం కోసం రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం భూపేశ్​ బఘేల్ తెలిపారు.

ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు
బ్రిటీష్​ కాలం వివాదాస్పద రాజద్రోహం చట్టం కింద 2014 నుంచి 2019 మధ్య దేశంలో 326 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆరు అభియోగాలు మాత్రమే రుజువు అయ్యాయి. భారత శిక్షాస్మృతిలోని 124ఏ సెక్షన్​ ఈ రాజద్రోహం గురించి చెప్తుంది. ఈ చట్టం ఇప్పుడ అవసరమా అని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఏటీఎంతో రేషన్​
హర్యానా ప్రభుత్వం దేశంలోనే తొలి రేషన్​ ఏటీఎం ను గురుగ్రామ్​లోని ఫరూక్​నగర్​లో ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం నుంచి 7 నిమిషాల్లో 70 కేజీల బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు వస్తాయి. ఇందులో బయోమెట్రిక్​ వ్యవస్థ ఉంది.

కర్ణాటక సీఎంగా బసవరాజ్​ బొమ్మై
యడియూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్​ బొమ్మై బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి ఎస్​ఆర్​ బొమ్మై కూడా గతంలో సీఎంగా పనిచేశారు. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజ్​ పేరు సూచించగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు తెలిపారు.

మహిళల భద్రతకు హెల్ప్​లైన్​
దేశవ్యాప్తంగా మహిళల భత్రత కోసం జాతీయ మహిళా కమిషన్​ 7827170170 హెల్ప్​​ లైన్​ నంబర్​ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడం, కమిషన్​ సేవలు విస్తరించడం కోసం ఈ డిజిటల్​ హెల్ప్​లైన్​ రూపొందించారు.

కెనడాలోనే అత్యధికం
విదేశీ చదువులకు ఎక్కువ ఇండియన్​ స్టూడెంట్స్​ కెనడాకు వెళ్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలు స్పష్టం చేశాయి. ఇప్పటివరకు కెనడాలో భారతీయ విద్యార్థులు 2,15,720 ఉండగా, అమెరికాలో 2,11,930 ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో 11.33 లక్షల మంది చదువుకుంటున్నారు.

వృద్ధిరేటు 9.5 శాతమే
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 9.5 శాతంగా నమోదు కావచ్చని ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) పేర్కొంది. గత ఏప్రిల్​లో వేసిన 12.5 వృద్ధిరేటు అంచనాలను సవరిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్​ రెండో దశ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపాయని ఆర్థికవేత్త గీతా గోపినాథ్​ తెలిపారు.

రికార్డు స్థాయిలో విదేశీ మారకం
ఇండియాలో విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి. జులై 16 తో ముగిసిన వారాంతానికి 612.73 బిలియన్​ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్​బ్యాంక్​ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది

Advertisement

ప్రాంతీయం

పీవీ శత జయంతి
పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్సవాల సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెక్లెస్​ రోడ్​ను ‘పీవీ మార్గ్‌’ గా మార్చింది. జ్ఞాన‌భూమిలో శ‌త‌జ‌యంతి ముగింపు ఉత్సవాలు జ‌రిగాయి.

ప్రాచీన వృక్ష శిలాజాలు
ములుగు జిల్లా భూపతిపూర్​ అడవిలో అతి ప్రాచీన వృక్ష శిలాజాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి 25 నుంచి 40 అడుగుల పొడవైన అతి ప్రాచీనమైనవి బృందం కన్వీనర్​ రామోజు హరగోపాల్​ చెప్పారు.

యునెస్కోలో రామప్ప
యునెస్కో వరల్డ్​ హెరిటేజ్​ కు రామప్పతో పాటు డోలవీర ఆలయం నామినేట్​ అయినట్లు కేంద్ర పురావస్తు శాఖ ఇటీవల ప్రకటించింది. రామప్ప ఆలయ చిత్రాలను యునెస్కో వెబ్​సైట్​లో ఉంచారు. 2020 సంవత్సరానికి మన దేశం నుంచి రామప్ప మాత్రమే ఎంపికైంది. 2021 నామినేషన్లతో డోలవీర ఆలయం ఉంది.

గిరిజనులకు ‘గిరిపోషణ’
రాష్ట్రంలోని ఆదిమజాతి గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిరుధాన్యాలతో ‘గిరిపోషణ’ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్​ తెలిపారు. ఈమేరకు 584 గిరిజన ఆవాసాల్లో 16,369 ఆదిమజాతి గిరిజనులకు పౌష్టికాహారం అందనుంది.

సాంస్కృతిక సారథిగా రసమయి
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్​గా మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2015లో మొదటిసారి ఆయన ఈ విభాగానికి చైర్మన్​గా ఎన్నికయ్యారు.

టెస్కాబ్​కు జాతీయ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్​ బ్యాంక్​ (టెస్కాబ్​)కు నాబార్డ్​ జాతీయస్థాయి ఉత్తమ పురస్కారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 353 డీసీసీబీల్లో దక్షిణ భారతదేశ స్థాయి ఉత్తమ అవార్డ్​ కరీంనగర్​ డీసీసీబీ ఎంపికైందని టెస్కాబ్​ చైర్మన్​ రవీందర్​రావు తెలిపారు.

తెలంగాణలో ‘దళితబంధు’
రాష్ట్రంలో అమలు చేయనున్న దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళితబంధు’గా సీఎం కేసీఆర్​ పేరు పెట్టారు. హుజురాబాద్​ నుంచి ప్రయోగాత్మకంగా ఈ పథకం ప్రారంభించనున్నారు. ప్రతి కుటుంబానికి నేరుగా బ్యాంక్​ ఖాతాలో రూ.10 లక్షలు వేయనున్నారు.

రాజుల కాలం నాట్యమండపం లభ్యం
నాట్యకళకు రాజుల కాలంలో ప్రత్యేక ఆదరణ ఉండేది. రాచకొండ పద్మనాయక రాజుల్లో ఒకరైన సర్వజ్య సింగభూపాలుడు రాజు భోగినిని పోషించడమే కాకుండ ఆమె కోసం కట్టిన నాట్యమండపం ఆధారాలు రాచకొండలో లభ్యమైనట్టు చరిత్రకారుడు సత్యనారాయణ తెలిపారు.

ఆసిఫాబాద్​లో సున్నపురాతి గుహ
ఆసిఫాబాద్​లో సున్నపురాతి గుహను చరిత్రకారులు గుర్తించారు. పాతరాతియుగంలో మానవుడి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు రాతిపనిముట్ల ఆకారంలో దొరికాయని చరిత్రకారుడు ఎంఏ శ్రీనివాస్​ వెల్లడించారు.

వరంగల్​కు పురస్కారం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సైకిల్స్​ ఫర్​ చేంజ్​ పోటీలో వరంగల్​కు పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో స్థానం దక్కించుకొని రూ.కోటి నగదు సొంతం చేసుకుంది.

Advertisement

వార్తల్లో వ్యక్తులు

శిరీష బండ్ల
అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ అడుగుపెట్టనుంది. అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ చేపట్టిన ‘వర్జిన్‌ స్పేస్‌ మిషన్‌’ ప్రాజెక్ట్‌ ద్వారా భారత సంతతికి చెందిన శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. జులై 11న అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనున్నారు.

పాలగుమ్మి సాయినాథ్​
ప్రముఖ జర్నలిస్ట్​ పాలగుమ్మి సాయినాథ్​కు జపాన్​కు చెందిన ‘పుకుఒకా గ్రాండ్​ ప్రైజ్​–2021’ దక్కింది. భారతదేశ వ్యవసాయం, గ్రామీణుల సమస్యలు, స్థితిగతులు వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అభిమన్యు మిశ్రా
ప్రపంచ చెస్‌ చరిత్రలో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా (12 ఏళ్ల 4 నెలల 25 రోజులు) భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌ (12 ఏళ్ల 7 నెలలు) పేరుతో 2002 నుంచి ఉన్న రికార్డ్​ అభిమన్యు బ్రేక్​ చేశాడు.

కె.కె.వేణుగోపాల్​
భారత అటార్నీ జనరల్​ కె.కె.వేణుగోపాల్​ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. మూడేళ్ల పదవీకాలం గతేడాది జూన్​ 30తో ముగియగా ఏడాది పొడిగించింది. తాజాగా మరో ఏడాది ఆయనే కొనసాగాలని నిర్ణయించడంతో 2022 జూన్​ 30 వరకు ఏజీఐగా కొనసాగనున్నారు.

అమితాబ్ ​కాంత్​
నీతి ఆయోగ్​ సీఈవోగా అమితాబ్​ కాంత్​ను మరో ఏడాది పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర నియామకాల కేబినేట్​ కమిటీ ఆమోదముద్ర వేసింది. 2022 జూన్​ 30 వరకు ఆయన కొనసాగుతారు.

సుభాష్​ చంద్ర
నేషనల్​ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్​ ఫండ్​ మేనేజ్​మెంట్​ అండ్​ ప్లానింగ్​ అథారిటీ (సీఏఎంపీఏ–కాంపా) సీఈవోగా ఐఎఫ్​ఎస్​ ఆఫీసర్​ సుభాష్ చంద్ర నియమితులయ్యారు. దేశంలోని అటవీకరణకు కాంపా నిధులు మంజూరు చేస్తుంది.

దిలీప్​కుమార్​
విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్‌ నట దిగ్గజం దిలీప్‌ కుమార్‌ తుది శ్వాస విడిచారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దిలీప్‌ భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్‌ ఏ ఇంతియాజ్‌’ను బహూకరించింది.

శ్రీకళా రెడ్డి
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహం జరిగింది.

ద్రోణవల్లి హారిక
మహిళల స్పీడ్​ చెస్​ చాంపియన్​షిప్​లో భారత గ్రాండ్​మాస్టర్​ ద్రోణవల్లి హారిక రన్నరప్​గా నిలిచింది. ఫైనల్లో 13–15 పాయింట్ల తేడాతో నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్​ హో ఇఫాన్​ (చైనా) చేతిలో హారిక ఓడిపోయింది.

వీరభద్రసింగ్​
హిమాచల్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్​ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ఆరుసార్లు హిమాచల్​ ప్రదేశ్​ సీఎంగా పనిచేశారు. కేంద్రంలో సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.

పడిదల విశ్వనాథ్​
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 ఏండ్ల యువ సెయిలర్​ పడిదల విశ్వనాథ్​ ఇటలీలో జరుగుతున్న ‘ఆప్టిమిస్ట్​ వరల్డ్​ సెయిలింగ్​ చాంపియన్​షిప్​–2021’ కు ఎంపికయ్యాడు. 2017లో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్​ పోటీల్లో సిల్వర్​ మెడల్​ సాధించాడు.

జైలా అవంత్​ గార్డే
అమెరికాలో ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో 2021 సంవత్సరానికి ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్–గార్డే(14) విజేతగా నిలిచింది. ఇప్పటిదాకా 93 సార్లు ఈ పోటీలు జరగ్గా, తొలిస్థానం దక్కించుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికనన్​గా ఆమె రికార్డు సృష్టించింది.

విశ్వనాథన్​ ఆనంద్​
క్రొయేషియా గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఈ ర్యాపిడ్, బ్లిట్జ్‌ టోర్నీలో ఆనంద్‌ ఓవరాల్‌గా 21 పాయింట్లు సాధించి రెండో స్థానం సాధించాడు. మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌–23 పాయింట్లు) చాంపియన్‌గా నిలిచాడు.

యశ్​పాల్​ శర్మ
భారత మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ శర్మ గుండెపోటుతో మరణించాడు. ఈయన 1983 వరల్డ్​కప్​ లో భారత జట్టులో కీలకపాత్ర పోషించాడు. 37 టెస్టుల్లో 33.45 సగటుతో 1,606 పరుగులు చేశారు. 42 వన్డేల్లో 28.48 సగటుతో 4 అర్ధసెంచరీలు సహా 883 పరుగులు సాధించాడు.

సమీర్​ బెనర్జీ
భారత సంతతికి చెందిన అమెరికా కుర్రాడు సమీర్ బెనర్జీ వింబుల్డన్ గ్రాండ్​స్లామ్​ టెన్నిస్ టోర్నీలో జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్​గా నిలిచాడు. లండన్‌లో జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల సమీర్‌ బెనర్జీ 7–5, 6–3తో అమెరికాకే చెందిన విక్టర్‌ లిలోవ్‌పై గెలుపొందాడు.

అరమనే గిరిధర్​
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి అరమనే గిరిధర్ నియమితులయ్యారు. 1988 ఏపీ కేడర్​కు చెందిన గిరిధర్ ప్రస్తుతం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

వినయ్​ ప్రకాశ్​
భారత్​లో కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రూల్స్​ పాటిస్తామని ట్విట్టర్ యాజమాన్యం తెలియజేసింది. నిబంధనల మేరకు రెసిడెంట్‌ ఫిర్యాదు అధికారిని(ఆర్‌జీఓ) నియమించింది. భారత్‌లో ఆర్‌జీఓగా వినయ్‌ ప్రకాశ్‌ నియమితులయ్యారు.

ఎల్లూరి శివారెడ్డి
తెలుగు యూనివ‌ర్సిటీ మాజీ వైస్​ చాన్స్​లర్​ డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి 2021 సంవత్సరానికి దాశ‌ర‌థి కృష్ణమాచార్య అవార్డు దక్కింది. పురస్కారంతో పాటు రూ.1,01,116 న‌గ‌దును దాశరథి జయంతి రోజు అందజేశారు.

రవీంద్ర నారాయణ్​ సింగ్​
ప్రముఖ డాక్టర్​, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవీంద్ర నారాయణ్​ సింగ్​ విశ్వ హిందూ పరిషత్​ (వీహెచ్​పీ) కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2010 లో ఆయనకు సామాజిక, వైద్య రంగంలో చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది.

జూకంటి జగన్నాథం
సినారె పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్​ ఏటా ఇస్తున్న సాహితీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవి జూకంటి జగన్నాథం వరించింది. సినారే 90వ జయంతిని పురస్కారం ప్రదానం చేసి, రూ.25 వేల నగదు అందజేస్తారు.

వైదేహి డోంగ్రే
మిస్​ ఇండియా యూఎస్​ఏ 2021 కిరీటాన్ని మిషిగన్​కు చెందిన వైదేహి డోంగ్రే గెలుచుకున్నారు. సుమారు 30 రాష్ట్రాల నుంచి 61 మంది ఇందులో పాల్గొన్నారు. జార్జియాకు చెందిన ఆర్షి లాలాని తొలి రన్నరప్​గా నిలిచింది.

సంతోష్​
కేరళకు చెందిన టూరిస్ట్​ సంతోష్​ జార్జ్​ కులంగర స్పేష్​ టూర్​కు వెళ్లనున్నాడు. వర్జిన్​ గెలాక్టిక్​ సంస్థకు చెందిన వ్యోమనౌకలో రూ.1.8 కోట్లకు టికెట్​ బుక్ చేసుకున్నాడు. రోదసియాత్ర చేసిన తొలి భారతీయ పర్యాటకుడిగా గుర్తింపు పొందనున్నారు. ​

హిడ్లీ డియాజ్​
టోక్యో ఒలింపిక్స్​లో ఫిలిఫైన్స్​ వెయిట్​లిఫ్టర్​ హిడ్లీ డియాజ్​ మహిళల 55 కేజీల విభాగంలో ఒలింపిక్​ రికార్డ్​ సృష్టిస్తూ గోల్డ్​ మెడల్​ సాధించింది. మొత్తం 224 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఫిలిఫైన్స్​కు ఇదే తొలి ఒలింపిక్​ గోల్డ్​ మెడల్​.

బండా శ్రీనివాస్​
తెలంగాణ ఎస్సీ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్​గా బండా శ్రీనివాస్​ను సీఎం కేసీఆర్​ నియమించారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​కు చెందిన ఆయన వ్యవసాయ మార్కెట్​ కమిటీ డైరెక్టర్​గా, జిల్లా టెలికాం బోర్డు సభ్యుడిగా పనిచేశారు.

రాకేశ్​ ఆస్తానా
ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా గుజరాత్‌ కేడర్‌కు చెందిన రాకేశ్‌ ఆస్తానా నియమితులయ్యారు. నియామక ఆదేశాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 1984 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆస్తానా గతంలో సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా, బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేశారు.

ఆంటోనీ జే బ్లింకెన్​
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్‌ భారత్​లో తొలిసారి పర్యటించారు. అమెరికాలో బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్లింకెన్‌ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి భారత్‌కు వచ్చారు.

Advertisement

స్పోర్ట్స్​


టాప్​లో ఆర్చర్​ దీపిక
ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్​లో భారత స్టార్​ ప్లేయర్​ దీపిక కుమారి నంబర్​వన్​గా నిలిచింది. ఆర్చరీ వరల్డ్​కప్​లో మూడు గోల్డ్​ మెడల్స్​ సాధించడంతో ఆమె టాప్​ ప్లేస్​ చేరింది. 2012లో తొలిసారి దీపిక నంబర్​వన్​ ర్యాంక్​ సొంతం చేసుకుంది.

బోల్ట్​ రికార్డ్​ బ్రేక్​
జమైకా స్ప్రింట్​ దిగ్గజం ఉసేన్​ బోల్ట్​ పదిహేడేళ్ల రికార్డును ఎరియన్​ నైటన్​ తిరగరాశాడు. అమెరికా ఒలింపిక్​ ట్రయల్స్​లో 200 మీటర్ల రేసును 19.84 సెకండ్లలో ముగించి బోల్ట్​ (19.93 సె.) అండర్​–20 రికార్డ్​ నైటన్​ బ్రేక్​ చేశాడు.

స్టిరియన్​ విన్నర్​ వెర్​స్టాపెన్​
రెడ్​బుల్​ డ్రైవర్​ మ్యాక్స్​ వెర్​స్టెపెన్​ స్టిరియన్​ గ్రాండ్​ ప్రి చాంపియన్​గా నిలిచాడు. మెర్సిడెస్​ డ్రైవర్​ రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో వెర్​స్టాపెన్​ డ్రైవర్స్​ చాంపియనషిప్​లో 156 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

నంబర్​వన్​ మిథాలీరాజ్​
క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా మిథాలీ (10,337) రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేలో బౌండరీ సాధించడంతో ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ చార్లట్​ ఎడ్వర్డ్స్ (10,273)ను మిథాలీ బ్రేక్​ చేసింది. ​మహిళల వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మిథాలీ రాజ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించింది.

మేరీకోమ్​, మన్​ప్రీత్​ సింగ్​కు గౌరవం
టోక్యో ఒలింపిక్స్​ ఆరంభ వేడుకల్లో భారత త్రివర్ణపతాకంతో ఇండియన్​ టీమ్​ను నడిపించే అవకాశం దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​, హాకీ టీమ్​ కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​కు దక్కింది. రెజ్లర్​ బజ్​రంగ్​ పునియా ముగింపు వేడుకల్లో పతాకాన్ని అందుకుంటాడు.

చాంపియన్​ అర్జెంటీనా
ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు విజేతగా నిలిచింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 1–0 గోల్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌పై గెలుపొందింది. ఈ కప్‌ను అర్జెంటీనా గెలవడం ఇది 15వ సారి.

వింబుల్డన్​ విన్నర్స్​ జకోవిచ్​, బార్టీ
వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల విభాగంలో నొవాక్‌ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్‌ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. దీంతో కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచి ఫెదరర్​, నాదల్​ సరసన చేరాడు. మహిళల సింగిల్స్‌ ఫైనల్స్​లో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించి వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకుంది.

బ్రిటీష్​ గ్రాండ్​ ప్రి విన్నర్​ హామిల్టన్​
మెర్సిడెజ్​ డ్రైవర్​ హామిల్టన్​ బ్రిటీష్​ గ్రాండ్​ప్రి విజేతగా నిలిచాడు. ఈ గ్రాండ్​ ప్రి గెలవడం హామిల్టన్​ కు ఇది ఎనిమిదోసారి. ఈ రేసులో లీక్లార్క్​, బొటాస్​ రెండు, మూడో స్థానంలో ఉన్నారు.

స్పార్క్​సెస్​ చెస్​ టోర్నీ విజేత ఆనంద్​
స్పార్క్​సెస్​ చెస్​ టోర్నమెంట్​లో భారత గ్రాండ్​మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్​ చాంపియన్​గా నిలిచాడు. రష్యా గ్రాండ్​మాస్టర్​ వ్వాదిమిర్​ క్రామ్నిక్​తో నాలుగు రౌండ్ల సమరాన్ని ఆనంద్​ 2.5–1.5 తో గెలుచుకున్నాడు.

మీరాబాయికి ‘సిల్వర్​’
టోక్యో ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో సిల్వర్​ మెడల్​ సాధించింది. మొత్తం 202 కేజీలు ఎత్తి రజతం గెల్చుకుంది. 210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్‌ జిజోయ్‌ స్వర్ణం దక్కించుకుంది. సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించగా, మళ్లీ ఇప్పుడు మీరాబాయి సిల్వర్​ గెలిచింది.

ప్రపంచ క్యాడెట్​ రెజ్లింగ్​లో గోల్డ్​
ప్రపంచ క్యాడెట్​ రెజ్లింగ్​ చాంపియన్​షిప్​లో భారత రెజ్లర్​ ప్రియ మాలిక్​ గోల్డ్​ మెడల్​ సాధించింది. 73 కిలోల ఫైనల్​ పోరులో 5–0 తో సెనియా పటపోవిచ్​ (బెలారస్​)ను ఓడించింది. ప్రస్తుత ప్రపంచ క్యాడెట్​ టోర్నీలో భారత్​కు ఇది మూడో స్వర్ణం.

Advertisement

సైన్స్​ అండ్​ టెక్నాలజీ

అగ్ని ప్రైమ్​ సక్సెస్​
కొత్తతరం క్షిపణి ‘అగ్ని ప్రైమ్​’ ను భారత్​ విజయవంతంగా పరీక్షించింది.1000 నంచి 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం సుమారు టన్ను పేలోడ్​ తీసుకెళ్తుంది. ఒడిశాలోని అబ్దుల్​ కలాం దీవి నుంచి డీఆర్​డీవో దీన్ని ప్రయోగించింది.

అతిచిన్న మైక్రోస్కోప్​
ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్‌ను హైదరాబాద్‌ ఐఐటీ అభివృద్ధి చేసింది. దీనికి ‘ముస్కోప్‌’గా పేరు పెట్టింది. ఇది ఆటోమెటిక్‌గా పనిచేస్తుందని తెలిపింది. వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో పరిశోధనకు ఈ మైక్రోస్కోప్​ ఉపయోగించవచ్చని తెలిపింది.

చైనా ఫెంగ్​యున్​–3ఈ ప్రయోగం
సౌర, అంతరిక్షం వాతావరణ పరిస్థితులను పరిశీలించడానికి చైనా లాంగ్​ మార్చ్​–4సి రాకెట్​ ద్వారా ఫెంగ్​యున్​–3ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీని ద్వారా ముందస్తు వాతావరణ హెచ్చరికల సామర్థ్యం పెరగనుంది. అంతేకాకుండా మంచు విస్తీర్ణం, సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు పర్యవేక్షించవచ్చు.

ఒకేసారి 88 శాటిలైట్స్​
అమెరికాకు చెందిన స్పేస్​ఎక్స్​ తాజాగా ట్రాన్స్​పోర్టర్​–2 మిషన్​లో భాగంగా ఒకేసారి 88 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. జనవరిలో ట్రాన్స్​పోర్టర్​–1 మిషన్​ ద్వారా 143 ఉపగ్రహాలను స్పేస్​ఎక్స్​ ప్రయోగించింది.

విజయవంతంగా స్పేస్​ టూర్​
అమెరికా అంతరిక్ష సంస్థ ‘వర్జిన్​ గెలాక్టిక్​’ కు చెందిన వీఎస్​ఎస్ యూనిటీ–22 రాకెట్​ ఆరుగురు ఆస్ట్రోనాట్స్​తో విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది. రోదసిలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా శిరీష రికార్డు సృష్టించింది. భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలోకి ప్రయాణించారు.

ఆకాశ్​ మిస్సైల్ సక్సెస్​
గగనతలంలోని లక్ష్యాలను భూతలం నుంచి చేధించగల న్యూ జనరేషన్‌(ఎన్‌జీ) ఆకాశ్‌ క్షిపణిని డీఆర్​డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి 60 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి చేధించిందని రక్షణశాఖ పేర్కొంది. వాయుసేనలో ప్రవేశపెట్టేందుకు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.

స్వదేశంలో తేజస్​ తయారీ
పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మిస్తున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అవసరమైన ప్రధాన భాగం (సెంట్రల్‌ ఫ్యూజిలేజ్‌ యూనిట్‌) దేశీయంగా సిద్ధమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న వీఈఎం టెక్నాలజీస్‌లో తయారైన తొలి సెంట్రల్‌ ఫ్యూజిలేజ్‌ యూనిట్‌ను హెచ్‌ఏఎల్‌కు అందజేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!