Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ జనవరి 2022

కరెంట్​ అఫైర్స్​ జనవరి 2022

ఇంటర్నేషనల్

రికార్డ్​ స్థాయిలో వాణిజ్యం
భారత్​ – చైనా దేశాలు 2021లో 10,000 కోట్ల డాలర్లపైనే రికార్డు స్థాయిలో వాణిజ్యం జరిగింది. సరిహద్దులో ఎలాంటి వివాదాలు ఉన్నా వాణిజ్యంపై వాటి ప్రభావం చూపలేదు. వార్షిక ప్రాతిపదికన 46.4 శాతం వృద్ధి ఇరు దేశాల మధ్య నమోదైంది.

గూగుల్​కు జరిమానా
గూగుల్​పై 10 కోట్ల డాలర్లు (సుమారు రూ.750 కోట్లు) జరిమానా విధిస్తూ రష్యాలోని జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా నిషేంధించిన కంటెంట్​ తొలగించడంలో గూగుల్​ విఫలమైనందున ఈ జరిమానా వేసింది.

వీగర్​ ముస్లింలకు అమెరికా చట్టం
చైనాలో ముస్లిం జనాభా అధికంగా ఉండే షింజియాంగ్​ రాష్ట్రంలో వీగర్​ ముస్లిం నిర్బంధితుల వెట్టి చాకిరీతో తయారైన వస్తువులను ఇక మీదట తమ దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సంతకం చేశారు .

ఇండో – కెనడియన్లకు పురస్కారం
ముగ్గురు ఇండో – కెనడియన్​ ప్రముఖులకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్​ ఆఫ్​ కెనడా’ వరించింది. సైంటిస్ట్​ వైకుంఠం అయ్యర్​ లక్షణన్​, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి బాబ్​ సింగ్​ ధిల్లాన్​, ప్రముఖ డాక్టర్​ ప్రదీప్​ మర్చంట్ వీటిని అందుకోనున్నారు.

జాబిల్లిపై ఎగిరే రోవర్​
అమెరికాలోని మసాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ ( ఎంఐటీ) సైంటిస్టులు జాబిల్లిపై ఎగిరే రోవర్​ కనుగొన్నారు. వాతావరణం లేకున్నా చందమామపై ఎగరగల వినూత్న రోవర్​ డిజైన్​ను వారు రూపొందించారు.

భద్రతా మండలిలో కొత్త దేశాలు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులుగా రెండేళ్ల కాలానికి ఎన్నికైన అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ దేశాలు బాధ్యతలు చేపట్టాయి. ప్రపంచ శాంతి, భద్రతలను పర్యవేక్షించే ఈ మండలిలో మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.

ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ మిస్సైల్​
భారత తయారీ బ్రహ్మోస్‌ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్‌ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. తాజా ఒప్పందంతో భారత్‌– ఫిలిప్పీన్స్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 413 కోట్లు.

పాంగాంగ్‌ సరస్సుపై చైనా వంతెన
భారత్‌తో సరిహద్దుల్లో తూర్పు లఢాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై కీలక వంతెనను చైనా ప్రస్తుతం నిర్మిస్తోంది. తాజాగా బయటికొచ్చిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం తెలిసింది. అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించేందుకు వంతెన దోహదపడనుంది.

ఫ్రాన్స్‌లో ఐహెచ్‌యూ వేరియంట్‌
ఫ్రాన్స్‌లో కరోనా మరో వేరియంట్‌ బయటపడింది. ఇన్‌స్టిట్యూట్‌ ఐహెచ్‌యూ మెడిటరేరియన్‌ ఇన్‌ఫెక్షన్‌ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు.

చైనాలో జననాల రేటు క్షీణత
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా గుర్తింపు ఉన్న చైనా ఇప్పుడు జననాల వృద్ధి రేటు బాగా క్షీణిస్తుంది. ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనేందుకు సైతం అనుమతిస్తూ కొత్త విధానం తీసుకువచ్చినా ఫలితాలు ఆశించినంతగా లేవు. పది ప్రావిన్సుల్లో జననాల రేటు ఒక శాతం లోపు పడిపోయింది.

రోబోస్టేషన్‌ ఇంటరాక్టివ్‌ మ్యూజియం
రోబోల వినియోగం విస్తృతం అవుతున్న నేపథ్యంలో వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు రష్యా రాజధాని మాస్కోలో రోబోస్టేషన్‌ ఇంటరాక్టివ్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్, దక్షిణకొరియా, చైనా, జపాన్‌ సహా వివిధ దేశాలకు చెందిన 40 రోబోలు దీంట్లో కొలువుదీరాయి.

ఆంగ్‌సాన్‌ సూకీకి జైలుశిక్ష
వాకీటాకీల అక్రమ దిగుమతి, వినియోగం, కరోనా నిబంధనల ఉల్లంఘన కేసుల్లో మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌ సూకీకి చెరో రెండేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చింది. 2021 ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ఆమెపై 12కు పైగా అభియోగాలను మోపింది.

యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీ
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వం కేంద్రం (వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌) వెబ్‌సైట్‌లో భారత్‌కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ మేరకు యునెస్కో (పారిస్‌)లో భారత శాశ్వత ప్రతినిధి విశాల్‌ వీ శర్మకి ఈ విషయాన్ని వెల్లడించింది.

సూపర్‌ ఫుడ్‌గా మైక్రోగ్రీన్స్‌
మైక్రోగ్రీన్స్‌ అనేవి 10 – 15 రోజుల వయసు కలిగిన వివిధ రకాలైన ఆకుకూరలు. వీటిని బేబీ ప్లాంట్లుగా పరిగణిస్తారు. ఇవి పోషకాహారాన్ని మెరుగుపరచడానికే కాకుండా అత్యధిక పోషకాల లభ్యత వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని సూపర్‌ ఫుడ్‌గా ప్రకటించింది.

భారత్‌ సరిహద్దులో మాధేశ్‌ ప్రదేశ్‌
భారత్‌ సరిహద్దులో ఆగ్నేయంగా ఉన్న ప్రావిన్సు-2కు మాధేశ్‌ ప్రదేశ్‌ అనే పేరు పెట్టాలని నేపాల్‌ నిర్ణయించింది. దీనికి రాజధానిగా జానక్‌పుర్‌ కొనసాగుతుంది. ఈ రెండు నిర్ణయాలను ప్రొవిన్షియల్‌ శాసనసభ మూడింట రెండొంతుల ఓట్ల ఆధిక్యంతో ఆమోదించింది.

బాలిస్టిక్‌ మిస్సైల్​ ప్రయోగం
క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా నెల రోజుల వ్యవధిలోనే మూడో పరీక్ష నిర్వహించింది. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అమెరికా కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరికీ భయపడం అని ఉత్తర కొరియా ఈ పరీక్ష చేసినట్లు నిపుణులు చెప్తున్నారు.

షింజో అబెకు నేతాజీ అవార్డ్​
నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబెకు ప్రదానం చేసింది. కోల్‌కతాలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ నకమురా యుటక ఆయన తరఫున దీన్ని స్వీకరించారు. భారత్‌ – జపాన్‌ మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అబె పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతి సన్నటి నది
ప్రపంచంలోనే అతి సన్నటి హులాయి నది చైనాలోని మంగోలియాలో ఉంది. హులాయి నది పొడవు 17 కిలోమీటర్లు. సగటు వెడల్పు మాత్రం 15 సెంటీమీటర్లే. కొన్ని చోట్ల అయితే ఇంతకన్నా తక్కువగానే ఉంటుంది. ఈ నది గత పదివేల సంవత్సరాలుగా ప్రవహిస్తూనే ఉంది.

బంధీగా బుర్కినా ఫాసో అధ్యక్షుడు
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది చెప్పలేదు. ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రైవేట్‌ డ్రోన్లపై యూఏఈ నిషేధం
దేశంలో ప్రైవేట్‌ డ్రోన్ల కార్యకలాపాలు నిషేధిస్తున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూఏఈ) ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్‌ డ్రోన్లతో పాటు ప్రైవేట్‌ లైట్‌ స్పోర్ట్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా నెలపాటు నిషేధిస్తున్నామని తెలిపింది.

నేషనల్

గుడ్​ గవర్నెన్స్​లో గుజరాత్​ టాప్​
దేశంలో సుపరిపాలన సూచీలో గుజరాత్​, మహారాష్ట్ర తొలి రెండు స్థానాల్లో నిలవగా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా 2020–21 సంవత్సరానికి ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణల శాఖ రూపొందించిన సూచీని అమిత్​షా విడుదల చేశారు.

నెహ్రూ జూపార్క్​కు ఐఎస్​ఓ గుర్తింపు
దేశంలో ఉత్తమ జూ గా హైదరాబాద్​ నెహ్రూ జూ పార్క్​ కు ఇంటర్నేషనల్​ స్టాండర్డ్​ ఆర్గనైజేషన్​ (ఐఎస్​ఓ) గుర్తింపు లభించిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి తెలిపారు. 2020 – 21 సంవత్సరానికి నెహ్రూ జూపార్క్​ జంతువుల, పక్షుల సహజ ఎన్​క్లోజర్​గా నిర్మితమైన జూగా పేరుగాంచింది.

‘ప్రసాద్’​ పథకంలో భద్రాచలం
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్​లో చేర్చనున్నారు. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రానున్నాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి ఆమోదం తెలిపారు.

సిక్కింలో నరేంద్ర మోడీ మార్గ్​
సిక్కిం రాష్ట్రంలో ఉన్న నాథులా కనుమలోని త్సోంగో సరస్సును గాంగ్‌టాక్‌తో కలిపే రెండో రహదారికి సిక్కిం ప్రభుత్వం ‘నరేంద్రమోడీ మార్గ్‌’గా పేరు పెట్టింది. 51 క్యోంగ్‌శాల గ్రామ సమీపంలో ఈ రహదారిని సిక్కిం రాష్ట్ర గవర్నర్‌ గంగా ప్రసాద్‌ ప్రారంభించారు.​

దేశంలో తొలి వాటర్ మెట్రో
దేశంలో తొలి వాటర్ మెట్రో(బ్యాటరీతో నడిచే బోటు) కేరళ రాష్ట్రం కొచ్చిలో ప్రారంభమైంది. వాటర్‌ మెట్రో ప్రాజెక్టులో భాగంగా డిసెంబర్ 31న కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (కేఎంఆర్‌ఎల్‌) ఈ బోటును ప్రారంభించింది. వందమందితో ఇందులో ప్రయాణం చేయవచ్చు. ప్రపంచంలోనే విద్యుత్​ బ్యాటరీతో
నడిచే అతిపెద్ద బోటు ఇదే.

మహిళా పారిశ్రామికవేత్తలకు ఐ-విన్‌
మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన స్టార్టప్​కు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ‘విమెన్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ (ఐ-విన్‌)ను ప్రారంభించినట్లు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తెలిపింది. ఐ-వెంచర్స్‌ జీ ఐఎస్‌బీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేసింది.

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌గా ‘టాటా గ్రూప్‌’ వ్యవహరించనుంది. ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్‌ కంపెనీ ‘వివో’ తప్పుకోనుంది. ఐపీఎల్‌ రెండు సీజన్లకు (2022, 2023) ఇది వర్తిస్తుంది.

కెప్టెన్‌ పార్టీకి హాకీ స్టిక్‌ చిహ్నం
‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ (పీఎల్‌సీ) పేరుతో పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ప్రారంభించిన కొత్త పార్టీకి ఎన్నికల చిహ్నంగా హాకీ స్టిక్‌ – బాల్‌ లభించింది. ఎన్నికల్లో భాజపాతో పొత్తుపెట్టుకుని పీఎల్‌సీ పోటీ చేయనుంది.

‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’పై సుప్రీం తీర్పు
ప్రకృతిలో సహజంగా సంభవించే తుపాన్లు, వరదలు, భూకంపాలు, పిడుగులు వంటి వాటి కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలనే న్యాయ పరిభాషలో దైవిక చర్య (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌)గా భావించగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరీ, జస్టిస్‌ కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

‘నేషనల్‌ స్టార్టప్‌ డే’గా జనవరి 16
భారతదేశం జనవరి 16ను ‘నేషనల్‌ స్టార్టప్‌ డే (జాతీయ స్టార్టప్‌ దినోత్సవం)’గా జరుపుకోబోతున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. స్టార్టప్‌ల కల్చర్‌ దేశమంతటా విస్తరించేలా చేయడానికి జనవరి 16ను నేషనల్‌ స్టార్టప్‌ డేగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

కొవాగ్జిన్‌పై తపాలా స్టాంప్​
దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ప్రాముఖ్యతను గుర్తిస్తూ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తపాలా స్టాంపును ఆవిష్కరించారు.

‘సూపర్‌ మామ్‌’ పులి మృతి
మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లో 29 పులిపిల్లలకు జన్మనిచ్చిన కాలర్‌ వాలీ అనే ఆడపులి మృతిచెందింది. పదిహేడేళ్ల వయసు కలిగిన ఈ పులి ‘సూపర్‌ మామ్‌’గా పేరుగాంచింది. 2008 – 2018 మధ్యకాలంలో 8 ప్రసవాల్లో 29 పిల్లలకు జన్మనిచ్చి రికార్డు నెలకొల్పింది.

‘విరాట్‌’కు వీడ్కోలు
రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అంగరక్షక దళంలో ముందు వరుసలో ఉండే గుర్రం ‘విరాట్‌’కు కోవింద్‌తో పాటు ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు వీడ్కోలు పలికారు.ఈ గుర్రాన్ని 2003లో రాష్ట్రపతి అంగరక్షక దళ కుటుంబంలో చేర్చారు. దీన్ని ప్రెసిడెంట్‌ బాడీగార్డ్‌ ఛార్జర్‌ అని పిలుస్తారు.

ఢిల్లీలో నేతాజీ భారీ విగ్రహం
నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ 125వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా దేశ రాజధానిలోని ఇండియాగేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్రను ఘనంగా చాటిచెప్పేలా విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు.

డెకా కార్న్‌ క్లబ్​లో స్విగ్గీ
దేశంలో మరో డెకా కార్న్‌ (10 బిలియన్‌ డాలర్లు, సుమారు రూ.75000 కోట్ల విలువైన) సంస్థగా ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఆవిర్భవించింది. ఇప్పటివరకు దేశీయ స్టార్టప్​లో పేటీఎం, ఓయో, బైజూస్‌ ఈ ఘనత సాధించాయి.

కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 180 దేశాలతో కూడిన కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌–2021(సీపీఐ–2021)ను విడుదల చేసింది.ఈ జాబితాలో 40 మార్కులతో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. 28 మార్కులతో పాకిస్తాన్‌ 140వ స్థానంలో నిలిచింది.

ఆర్‌సీఐ నుంచి సరికొత్త అస్త్రాలు
డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ), డీఆర్‌డీఎల్‌ అభివృద్ధి చేసిన ఐదు సరికొత్త అస్త్రాలను రాజ్‌పథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో తొలిసారి ప్రదర్శించారు. యుద్ధ విమానం నుంచి ప్రయోగించే వీటికి అస్త్ర, రుద్రం, సా, గౌరవ్, తారా అనే పేర్లు పెట్టారు.

లాల్‌చౌక్‌లో మువ్వన్నెల జెండా
శ్రీనగర్‌లోని చారిత్రక క్లాక్‌టవర్‌ లాల్‌చౌక్‌లో 30 ఏళ్ల తర్వాత మువ్వన్నెల జెండా మళ్లీ ఎగిరింది. చివరిసారిగా 1992లో భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఇక్కడ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రాంతీయం

ఫ్లైఓవర్‌కు అబ్దుల్‌కలాం పేరు
హైదరాబాద్‌లో మిధాని – డీఎంఆర్‌ఎల్‌ కూడళ్ల మధ్య నిర్మించిన ఫ్లైఓవర్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం పేరు పెట్టారు. డీఆర్‌డీఓలో అనేక పరిశోధనలు చేసి, దశాబ్ద కాలంపాటు ఆ ప్రాంతంలో జీవించిన కలాంకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ రూ.63 కోట్లతో ఈ పనులు పూర్తిచేసింది.

ఆకుల లలితకు కీలక పదవి
తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.

పెద్ద రాతియుగం ఆనవాళ్లు
సూర్యాపేట-కోదాడ మార్గం మునగాల మండలం మాదారం గ్రామ పొలాల్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం పెద్ద రాతియుగం ఆనవాళ్లను గుర్తించింది. చెదిరిపోయిన కైరన్‌(కుప్ప రాళ్ల) సమాధి, సమాధిలోపలి రాతి చలవలు, బంతిరాళ్లకు వాడిన రాతిగుండ్లు అక్కడ కనిపించాయని బృందం కన్వీనర్‌ హరగోపాల్‌ తెలిపారు.

ఓడీఎఫ్‌లో నంబర్​వన్​
బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ టాప్​ ప్లేస్​లో నిలిచింది. రాష్ట్రంలో 96.74 శాతం గ్రామాలు బహిరంగ విసర్జన రహిత జాబితాలో చేరాయి. తెలంగాణ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని మంత్రి దయాకర్ రావు అన్నారు.

పదో శతాబ్దం చాముండి విగ్రహం
నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని జౌళి గ్రామంలో అత్యంత పురాతనమైన పదో శతాబ్దపు చాముండి విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్‌ తెలిపారు. విగ్రహంపై కిరీటం, కంఠాభరణాలు కలిగి నాలుగు చేతుల్లో ఢమరుకం, ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

33 జిల్లాల మ్యాప్‌ ఆవిష్కరణ
తెలంగాణలోని 33 జిల్లాలతో రూపొందించిన సమగ్ర మ్యాప్‌ అట్లాస్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విడుదల చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియా దీన్ని ఆమోదించగా, విష్ణు మ్యాప్‌ పబ్లికేషన్స్‌ సంస్థ రూపొందించింది.

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్‌
ఫార్ములా ఈ-రేస్‌కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా వన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్, రోమ్, లండన్, హాంకాంగ్, న్యూయార్క్, బెర్లిన్‌ తదితర 18 నగరాలు వేదికగా ఉండగా భారత్‌ నుంచి హైదరాబాద్‌ స్థానం సంపాదించింది.

వ్యాక్సిన్​ పంపిణీలో నంబర్​వన్​
వంద శాతం కొవిడ్‌ టీకాల పంపిణీ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

‘ఎ’ గ్రేడ్‌ కార్పొరేషన్‌గా కాళేశ్వరం
కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ‘ఎ’ కేటగిరీ కార్పొరేషన్‌గా గుర్తిస్తూ, భారత ప్రభుత్వ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఈసీఎల్‌) ఉత్తర్వులిచ్చింది. నిధుల వినియోగం, నిర్మాణం, లక్ష్యం తదితర అంశాల ఆధారంగా ఆ సంస్థ కేటగిరీని నిర్ణయిస్తుంది.

‘యూనికార్న్‌’ క్లబ్‌లో డార్విన్‌బాక్స్‌
హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన స్టార్టప్​ డార్విన్‌బాక్స్ ‘యూనికార్న్‌’ క్లబ్‌లో చేరింది. సంస్థాగత విలువ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) కంటే అధికంగా ఉన్న స్టార్టప్​లను యూనికార్న్‌లుగా పరిగణిస్తున్నారు.

వార్తల్లో వ్యక్తులు

గోరెటి వెంకన్న
ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు ఆయన రాసిన వల్లంకితాళంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 2021 సంవత్సరానికి గాను కవితా విభాగంలో ఆయన అవార్డు అందుకోబోతున్నారు. అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు.

మల్లికా బిల్లుపాటి
విజయవాడకు చెందిన మల్లికా బిల్లుపాటి ‘మిసెస్‌ ఇండియా’గా ఎంపికయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 9వ సీజన్‌ (2021-22) మిసెస్‌ ఇండియా పోటీల్లో మల్లికా బిల్లుపాటి విజేతగా నిలిచారు. 2019లో ‘శ్రీమతి అమరావతి’ టైటిల్‌ నెగ్గారు.

విక్రమ్‌ మిశ్రి
విదేశీ వ్యవహారాల అధికారి విక్రమ్‌ మిశ్రి.. నేషనల్​ సెక్యూరిటీ కౌన్సిల్​ సెక్రటేరియట్​లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.1989 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన మిశ్రి భారత్​-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో రాయబారిగా కీలక సేవలు అందించారు.

డెస్మండ్‌ టుటు
దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్‌ టుటు అనారోగ్యంతో మరణించారు. బ్రిటీషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్‌ టుటు తీవ్రంగా పోరాడారు.

టోనీ బ్లెయిర్‌
బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ నైట్‌హుడ్‌ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్‌ ‘ఆర్డర్‌ ఆఫ్‌ గార్డర్‌’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్‌ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్‌ హోదాతో గౌరవిస్తోంది.

బావర్న్‌ష్మిట్‌
అమెరికా నౌకాదళ చరిత్రలో మొదటిసారిగా అణు ఇంధనంతో నడిచే విమాన వాహక నౌకకు ఓ మహిళ నాయకత్వం వహిస్తున్నారు. అణుశక్తి నౌక యు.ఎస్‌.ఎస్‌. అబ్రహం లింకన్‌ సారథిగా నియమితులైన కెప్టెన్‌ బావర్న్‌ష్మిట్‌కు ఆ అరుదైన గౌరవం దక్కింది.

వినయ్‌ కుమార్‌ త్రిపాఠి
రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈవో గా ఈశాన్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినయ్‌ కుమార్‌ త్రిపాఠి నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఆర్ఎస్ఈఈ అధికారి అయిన వినయ్‌ 2022, జనవరి1 నుంచి జూన్‌ 31 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

అల్కా మిత్తల్‌
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ చైర్​పర్సన్​, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (సీఎండీ) అల్కా మిత్తల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఓఎన్‌జీసీ మానవ వనరుల డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఓఎన్‌జీసీ సీఎండీగా ఒక మహిళ పనిచేయనుండటం ఇదే ప్రథమం.

ఎస్‌.సోమనాథ్‌
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.సోమనాథ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.శివన్‌ పదవీకాలం జనవరి 14న ముగియనుండడంతో నూతన చైర్మన్‌గా సోమనాథ్‌ను నియమించారు.

ఉర్జిత్‌ పటేల్‌
ఆర్‌బీఐ మాజీ గవర్నర్​ ఉర్జిత్‌ పటేల్‌ ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏఐఐబీలో చైనా తర్వాత అత్యధిక ఓటింగ్‌ హక్కులను భారత్‌ కలిగి ఉంది. చైనా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జిన్‌ లిక్వన్‌ ఏఐఐబీకి ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

సాగర్‌ కతుర్డె
ఖమ్మంలో నిర్వహిస్తున్న నేషనల్​ బాడీ బిల్డింగ్ పోటీల్లో మహారాష్ట్ర ఆదాయపు పన్ను శాఖకు చెందిన సాగర్‌ కతుర్డె ‘మిస్టర్‌ ఇండియా’ టైటిల్‌ సొంతం చేసుకున్నారు. ఆర్‌.కార్తికేశ్వర్‌(తమిళనాడు), శర్వణన్‌(తమిళనాడు) రెండో స్థానంలో నిలిచారు.

జస్టిస్‌ ఇందూ మల్హోత్రా
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై పూర్తి దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో ఈ కమిటీని నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జనవరి 12న ఉత్తర్వులిచ్చారు.

మేఘన
ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికైంది. ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక నేపథ్యంలో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా ‘వాల్కటో’ ప్రాంతం నుంచి ఎంపికయ్యారు.

రుమెన్‌ రదేవ్‌
బల్గేరియా అధ్యక్షుడిగా రుమెన్‌ రదేవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష బాధ్యతలు రదేవ్‌ చేపట్టడం ఇది రెండోసారి. 2021 దేశంలో జరిగిన ఆందోళనలకు అనుకూలంగా మాట్లాడి అత్యంత ప్రజాదరణ పొందారు. యూరోపియన్‌ యూనియన్‌లో పేద దేశంగా బల్గేరియా నిలుస్తోంది.

సానియా మీర్జా
హైదరాబాద్​ టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా త్వరలోనే రిటైర్​మెంట్​ ప్రకటించనున్నట్లు తెలిపింది. 2022 సీజన్‌ అనంతరం టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు వెల్లడించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో ఓటమి పాలైన అనంతరం సానియా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించింది.

నీరజ్‌ చోప్రా
టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్​ మెడలిస్ట్​, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్ నీరజ్‌ చోప్రా మరో గౌరవాన్ని అందుకున్నాడు. రిపబ్లిక్​ డే సందర్భంగా నీరజ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘పరమ విశిష్ట సేవా పురస్కారం’తో సత్కరించారు.

చంద్రశేఖర్‌ అయ్యర్‌
గోదావరి బోర్డు చైర్మన్‌గా ఉన్న జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ను కేంద్ర జలసంఘం సభ్యుడిగా నియమించారు. సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ సర్వీసు హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌గా ఉన్న అయ్యర్‌ను ఈ పోస్టులో నియమించారు.

నరేంద్ర మోడీ
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాల్లో అత్యధికంగా 71% ప్రజాదరణతో మోడీ టాప్​లో ఉండగా, 43శాతంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానం దక్కింది.

పుష్పకుమార్‌ జోషి
హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్త చైర్మన్‌ ఎండీగా పుష్పకుమార్‌ జోషి ఎంపికయ్యారు. పీఈఎస్‌బీ చేసిన సిఫారసుకు ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర పడాల్సి ఉంది. ఏప్రిల్‌ 30న ప్రస్తుత చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సురానా రిటైర్​ కానున్నారు.

మీను రహేజా
దేశంలోనే అత్యంత పొట్టి న్యాయవాదిగా మీను రహేజా నిలిచారు. ఆమె ఎత్తు 2 అడుగుల 9 అంగుళాలు మాత్రమే. ప్రస్తుతం నిరుపేదల పక్షాన కేసులు వాదిస్తూ, వారి హక్కుల సాధనకై పోరాడుతోంది. చూడటానికి మీను రహేజా చాలా చిన్నగా కనిపిస్తుంది.

స్పోర్ట్స్

విజయ్​ హజారె ట్రోఫీ
అఖిల భారత విజయ్​ హజారె ట్రోఫీ తొలిసారి హిమాచల్​ ప్రదేశ్​ టీమ్​ కైవసం చేసుకుంది. ఫైనల్లో తమిళనాడును ఓడించి దేశవాళీ అత్యున్నత వన్డే ట్రోఫీని సొంతం చేసుకుంది. తుది పోరులో 11 పరుగుల తేడాతో తమిళనాడును ఓడించింది.

ర్యాపిడ్​ చెస్​ చాంపియన్​ నోడిర్బెక్​
రికార్డు స్థాయిలో అయిదోసారి ప్రపంచ చాంపియన్​గా నిలిచిన కార్ల్​సన్​ (నార్వే) ను ప్రపంచ ర్యాపిడ్​ చాంపియన్​ షిప్​లో ఓడించి నోడిర్బెక్​ విజేతగా నిలిచాడు. నోడిర్బెక్​ 13 ఏండ్లకే గ్రాండ్​ మాస్టర్​ హోదా సాధించాడు. 11 ఏండ్లకే జూనియర్​ ర్యాంకింగ్స్​లో 100 లోపు స్థానాల్లో చోటు దక్కించుకున్నాడు.

ఆసియా చాంపియన్​ ఇండియా
దుబాయ్‌లో ముగిసిన ఆసియా అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ చాంపియన్‌గా భారత్ నిలిచింది. ఫైనల్లో యువ భారత్‌ 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసింది. భారత అండర్‌–19 టీమ్‌ ఆసియా కప్‌ గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి.

రేసులో స్మృతి మంధాన
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) డిసెంబర్ 31న ‘ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2021’ నామినేషన్ల వివరాలను ప్రకటించింది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ‘రాచెల్‌ హేహో ఫ్లింట్‌ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం నాలుగు పేర్లు నామినేట్​ చేయగా భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఇందులో పోటీ పడుతోంది.

మిథాలీ రాజ్‌
భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ వరుసగా మూడో వన్డే వరల్డ్‌ కప్‌లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌–2022 బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది.

బోపన్న – రామ్‌ జోడీకి టైటిల్‌
భారత టెన్నిస్‌ స్టార్లు రోహన్‌ బోపన్న – రామ్‌కుమార్‌ రామనాథన్‌ జంట ఏటీపీ అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్లో టైటిల్‌ కైవసం చేసుకుంది. బోపన్నకు ఇది కెరీర్‌లో 20వ డబుల్స్‌ టైటిల్‌ కాగా రామ్‌కుమార్‌కు ఏటీపీ టైటిల్‌ గెలవడం ఇదే తొలిసారి.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఎజాజ్​ పటేల్​
ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ (డిసెంబర్​)గా న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. భారత్‌తో జరిగిన ముంబై టెస్టులో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా ఎజాజ్ నిలిచాడు.

క్రికెట్‌కు మోరిస్‌ వీడ్కోలు
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దేశవాళీ జట్టు టైటాన్స్‌కు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మోరిస్‌ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మోరిస్‌ 4 టెస్టుల్లో 12 వికెట్లు, 173 పరుగులు.. 42 వన్డేల్లో 48 వికెట్లు, 467 పరుగులు.. 23 టీ20 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 133 పరుగులు చేశాడు.

టెస్ట్‌ కెప్టెన్సీకి కోహ్లీ గుడ్​బై
టీం ఇండియా టెస్ట్‌ కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలికాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ తర్వాత 2014లో టెస్ట్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. 68 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. 40 విజయాలను అందించాడు. అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన కెప్టెన్‌గా నిలిచాడు.

చాంపియన్​ లక్ష్యసేన్‌
భారత యువ ఆటగాడు లక్ష్యసేన్‌ ప్రపంచ చాంపియన్‌ కీన్‌ యూ (సింగపూర్‌)ను చిత్తుచేసి ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కీన్‌ యూ స్వర్ణం గెలవగా లక్ష్యసేన్‌ కాంస్యం నెగ్గాడు.

మంధానకు ఐసీసీ అవార్డ్​
భారత అమ్మాయిల జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపికైంది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో మేటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. రేసులో టామీ బీమాంట్‌ (ఇంగ్లండ్‌), లిజెల్లె లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్‌ (ఐర్లాండ్‌)ను మంధాన వెనక్కినెట్టింది.

పీవీ సింధుకు టైటిల్​
రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇండియన్​ ప్లేయర్​ మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించింది.

కెప్టెన్‌లుగా రాహుల్, హార్దిక్‌
ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు వేలానికి ముందు ఆటగాళ్ల ఎంపికను పూర్తిచేశాయి. అహ్మదాబాద్‌కు హార్దిక్‌ పాండ్య, లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అహ్మదాబాద్‌.. హార్దిక్, రషీద్‌ ఖాన్‌ కోసం రూ.15 కోట్ల చొప్పున వెచ్చించింది. లఖ్‌నవూ రాహుల్‌ కోసం రూ. 17 కోట్లు ఖర్చు చేసింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

జేమ్స్​ వెబ్​ స్పేస్​ టెలిస్కోప్​
అంతరిక్ష రహస్యాలను, విశ్వ ఆవిర్భావం తొలి జాడలను పరిశోధించడానికి 29 దేశాల సైంటిస్టులు, 25 ఏండ్ల శ్రమ, రూ.73 వేల కోట్లతో రూపొందించిన జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. కౌరులోని ఫ్రెంచ్​ గయానా నుంచి ఎరియాన్​ – 5 రాకెట్​లో నింగిలోకి దూసుకెళ్లింది.

నౌకాదళంలోకి నిఘా విమానాలు
హిందూ మహాసముద్రంలో భారత నిఘా సామర్థ్యాలు మరింత పెంచేందుకు మరో రెండు పొసైడన్‌-8ఐ (పి-8ఐ) నిఘా విమానాలు నౌకాదళం అమ్ములపొదిలో చేరాయి. ఇవి జలాంతర్గాములను గుర్తించి, ధ్వంసం చేయగలవు. నౌకాదళంలో ఇప్పటికే ఎనిమిది పీ-8ఐ విమానాలు ఉన్నాయి. వీటిని అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ తయారు చేసింది.

నీటి జాడ కనుగొన్న చాంగే-5
చంద్రుడిపై నీటి ఆనవాళ్లను చైనా ల్యాండర్‌ చాంగే-5 కనుగొంది. జాబిల్లి ఉపరితలంపై ఉంటూ నీటి జాడను పసిగట్టడం ఇదే మొదటిసారి. ఈ ల్యాండర్‌ ఉన్న ప్రదేశంలో 120 పీపీఎం మేర నీరు ఉన్నట్లు ల్యాండర్‌ తేల్చింది.

చైనాలో కొత్త సూర్యోదయం.. ‘ఈస్ట్‌’
సూర్యుడిలో శక్తిని ఉత్పత్తి చేసే సంక్లిష్ట ప్రక్రియను భూమిపై సాధించడానికి చైనాలో పరిశోధనలు చేస్తున్నారు. ‘కృత్రిమ సూర్యుడి’ని సాకారం చేసి భారీగా, పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని డ్రాగన్‌ ప్రయోగాలు చేస్తోంది. ఈ దిశగా ఇటీవల కీలక ముందడుగు వేసింది

బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్​
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌కు సంబంధించిన నౌకాదళ వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. నేవీకి చెందిన స్టెల్త్‌ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నుంచి ఈ అస్త్ర ప్రయోగం జరిగింది. క్షిపణిని భారత్, రష్యాలు ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి.

చైనా సృష్టించిన చందమామ
శాస్త్ర పరిశోధన రంగాల్లో చైనా జోరు పెంచింది. భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ‘కృత్రిమ సూర్యుడి’ సాకారం దిశగా ముందడుగు వేసిన డ్రాగన్‌ ఇప్పుడు చందమామపై పరిస్థితులను అనుకరించేందుకు ఒక బుల్లి జాబిల్లిని సృష్టించింది. అందులో గురుత్వాకర్షణ శక్తి మాయం చేయడం విశేషం.

సరికొత్తగా ‘బ్రహ్మోస్‌’
అత్యాధునిక సాంకేతికత మార్పులు చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో దేశీయంగా తయారు చేసిన పరికరాల సంఖ్యను కూడా పెంచినట్లు పేర్కొంది. రష్యాతో కలిసి డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ఒడిశాలో పరీక్షించినట్లుపేర్కొంది.

జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తన లక్ష్యాన్ని సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్‌2 పాయింట్‌ (లాంగ్రేజియన్‌ 2 పాయింట్‌)ను చేరినట్లు నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా) వర్గాలు తెలిపాయి.

వికాస్‌ ఇంజన్‌ టెస్ట్ సక్సెస్​
ఇస్రో భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్‌–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్‌ ఇంజన్‌ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. జనవరి 20న తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ)లో ఈ పరీక్ష నిర్వహించారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!