Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ ఎఫైర్స్​@ జనవరి

కరెంట్​ ఎఫైర్స్​@ జనవరి


నేషనల్​


డ్రైవర్‌ రహిత మెట్రో
దేశంలోనే తొలిసారిగా, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సేవలను ప్రధాని మోడీ డిసెంబర్​ 28న వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. మెజెంటా లైన్‌లో ఈ కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో న్యూఢిల్లీ నుంచి ద్వారకా సెక్టార్‌-21 వరకు 23 కి.మీ.పరిధిలో ఇది పనిచేస్తుంది. దేశంలో తొలి మెట్రో రైలు వాజ్‌పేయీ కృషి వల్ల ప్రారంభమైంది. 2014లో 5 నగరాల్లో, 248 కిలోమీటర్లకు మాత్రమే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం700కు పైగా కిలోమీటర్లలో అందుబాటులోకి వచ్చాయి.

అసోంలో డిసేబిలిటీ స్టడీస్​ వర్సిటీ
దేశంలో తొలిసారిగా దివ్యాంగ, పునరావాస శాస్త్రాల అధ్యయనానికి సంబంధించిన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. ఈమేరకు దివ్యాంగుల సాధికారిత విభాగం(డీఈపీడబ్ల్యూడీ) ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా అసోంలోని కామ్‌రూప్‌ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నట్లు డీఈపీడబ్ల్యూడీ తెలిపింది.

వందో కిసాన్‌ రైలు
దేశంలో వందో కిసాన్‌ రైలును ప్రధాని మోఢీ డిసెంబర్​ 28న ప్రారంభించారు. ఇది మహారాష్ట్రలోని సంగోలా-పశ్చిమ బెంగాల్‌లోని షాలీమార్‌ మధ్య నడుస్తుంది. కిసాన్‌ రైలు ఆగే అన్ని స్టేషన్లలో పండ్లు, కూరగాయలను ఎక్కించుకునేందుకు, దించుకునేందుకు అనుమతులు ఉన్నాయి. లోడుపై ఎటువంటి పరిమితులు లేవు. ఛార్జీల్లో రాయితీని 50 శాతానికి పెంచారు. ఆగస్టు 7న ప్రారంభమైన తొలి కిసాన్‌ రైలు మహారాష్ట్రలోని దేవ్‌లాలి- బిహార్‌లోని దానాపూర్‌ మధ్య నడిచింది.

కొవిషీల్డ్, కొవాగ్జిన్‌కు డీసీజీఐ ఆమోదం
హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’, పుణెలోని సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కొవిషీల్డ్‌’ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జనవరి 3న ఆమోదం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకాను సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సీరం సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది.

ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకథ
మాజీ రాష్ట్రపతి, దివంగత నేత ప్రణబ్‌ ముఖర్జీ మరణానికి ముందు రాసిన తన ఆత్మకథ ‘ద ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ 2012–-2017’ బుక్​ జనవరి 5న విడుదలైంది.

డిజిటల్‌ పేమెంట్​ ఇండెక్స్​
దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల విస్తృతిని తెలుసుకునేందుకు ఆర్బీఐ డిజిటల్‌ చెల్లింపుల సూచీ(డీపీఐ)ని అభివృద్ధి చేసింది. ఈ సూచీ కోసం 2018 మార్చిని బేస్‌ పిరియడ్‌గా తీసుకుంది.

మేకింగ్‌ ఆఫ్‌ ఏ హిందూ పేట్రియాట్‌
ప్రముఖ రష్యన్‌ కవి లియో టాల్‌స్టాయ్‌కి 1909, 1910 సంవత్సరాల్లో మహాత్మా గాంధీ రాసిన లేఖల ఆధారంగా రాసిన ‘మేకింగ్‌ ఆఫ్‌ ఏ హిందూ పేట్రియాట్‌’ పుస్తకాన్ని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ రాజ్‌ఘాట్‌లో డిసెంబర్​ 1న విడుదల చేశారు. ఈ బుక్​(వెయ్యి పేజీల)ను ఎండీ శ్రీనివాస్, జేకే బజాజ్‌ సంయుక్తంగా రచించారు.

కర్ణాటకలో గోవధ నిషేధం
కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లును గవర్నర్‌ వజూభాయి వాలా ఆమోదించారు. ఈ చట్టం 2021 జనవరి 5 నుంచే అమలులోకి వస్తుందని ప్రకటన విడుదల చేశారు. విధానపరిషత్తులో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ చట్టం ప్రకారం గోవులను వధిస్తే మూడు నుంచి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో నారీ దళం
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌)లోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశం లభించింది.100 మందికిపైగా మహిళలతో కూడిన ఫస్ట్​ టీం శిక్షణ పూర్తి చేసుకొని డిసెంబర్​ 5న ఎన్​డీఆర్​ఎఫ్​లో చేరింది. ఈ టీంను ఉత్తర్‌ప్రదేశ్‌లోని గఢ్‌ ముక్తేశ్వర్‌ పట్టణంలో గంగా నది ఒడ్డున అత్యవసర విధులు అప్పగించారు.

ఢిల్లీలో ‘న్యూ స్కూల్​ బ్యాగ్​ పాలసీ’
పిల్లలపై భారం తగ్గించేలా దేశ రాజధానిలోని స్కూళ్లలో ‘న్యూ స్కూల్​ బ్యాగ్​ పాలసీ’ని అమలు చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం జనవరి 5న ఆదేశాలిచ్చింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రూపొందించిన ఈ పాలసీని ఢిల్లీ విద్యాశాఖ 2020, డిసెంబరులోనే ఆమోదం తెలిపింది.

ఓల్డెస్ట్​ లయన్​ మృతి
రాజస్థాన్‌ జైపుర్‌లో నాహర్‌గఢ్‌ జంతు సంరక్షణ కేంద్రంలో దేశంలోనే ఓల్డెస్ట్​ లయన్​ అయన 30 ఏళ్ల బేగం మృతి చెందింది. 2005లో ఝార్ఖండ్‌లోని నటరాజ్‌ సర్కస్‌ నుంచి 15ఏళ్ల వయసున్న సింహాన్ని తీసుకొచ్చి.. నాహర్‌గఢ్‌ జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు.

మహిళా పైలెట్ల రికార్డు
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగుళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి సుదీర్ఘ ప్రయాణం చేసిన మహిళా పైలెట్లు అరుదైన రికార్డు సాధించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో బయలుదేరిన ఈ విమానం 16 గంటల్లో 13,993 కి.మీ. ప్రయాణించి బెంగుళూరుకు చేరుకుంది. ఎయిర్‌ ఇండియా(ఏఐ 176) విమానానికి జోయా అగర్వాల్‌ ప్రధాన పైలెట్‌గా వ్యవహరించారు. ఆమెకు సహాయకులుగా తెలుగు తేజం కెప్టెన్‌ పాపగారి తన్మయి, కెప్టెన్‌ సోనావారే, కెప్టెన్‌ శివాని ఉన్నారు.

ట్విటర్‌లో మోడీనే టాప్​
ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ టాప్​లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 6.47 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విటర్‌ శాశ్వతంగా తొలగించింది. దీంతో మోదీకి మొదటి స్థానం దక్కింది. క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను 12.79 కోట్ల మంది ట్విటర్‌లో ఫాలో అవుతున్నారు.

సైనిక విమానాల్లో మహిళా పైలెట్లు
సైనిక విమానాల్లో మహిళా పైలెట్లకు అవకాశం కల్పించాలని ఇండియన్​ ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొదటి బృందం శిక్షణకు జులై నెలలో ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. ‘జనవరి 15.. ఆర్మీ డే’ సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు ఏడాది శిక్షణ తర్వాత మహిళలు ఫ్రంట్‌లైన్‌ ఆపరేషన్లలో పాల్గొనే చాన్స్​ రానుంది.

సీ-విజిల్‌ 21
నావికా దళం, తీర ప్రాంత రక్షణ దళం ఆధ్వర్యంలో జనవరి 12 నుంచి రెండు రోజుల పాటు సీ విజిల్‌-21 కార్యక్రమం నిర్వహించారు. 7516 కిలోమీటర్ల తీర ప్రాంతమున్న 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతుంది.సీ-విజిల్‌ విన్యాసాల ప్రధాన ఉద్దేశం సముద్రంలోను, తీరంలోను ఎదురయ్యే ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ, అణచివేత.

డిజిటల్‌ లోన్లపై ఆర్‌బీఐ కమిటీ
ఆన్‌లైన్‌లోనూ, యాప్‌ల ద్వారా లోన్లు ఇచ్చి, తర్వాత వేధిస్తున్న డిజిటల్‌ రుణ సంస్థల దారుణాలను అదుపు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిటల్‌ లోన్లపై అధ్యయనానికి ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బృందానికి ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయంత్‌ కుమార్‌ దశ్‌ నేతృత్వం వహిస్తారు. మరో ముగ్గురు ఆర్‌బీఐ ఉన్నతాధికారులు, ఒక ఫిన్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

51వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌
51వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి) వేడుకలు జనవరి 16న గోవాలో ప్రారంభమయ్యాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ విట్టోరియో స్టోరారోకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు బిశ్వజిత్‌ ఛటర్జీకి ఇండియన్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ప్రకటించారు.

60 గంటల్లో బెయిలీ బ్రిడ్జి
జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై 120 అడుగుల పొడవైన బెయిలీ బ్రిడ్జిని సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) కేవలం 60 గంటల్లోనే పూర్తి చేసి అరుదైన రికార్డు సాధించింది.

అంకుర భారత్‌ మూలనిధి
స్టార్టప్​లకు చేయూతనిచ్చే ఉద్దేశంతో రూ. వెయ్యి కోట్లతో ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌’ (అంకుర భారత్‌ మూలనిధి)ను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న ప్రకటించారు.

పరాక్రమ దినోత్సవం
స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ(ఐఎన్‌ఏ) వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని జనవరి 23ను ఏటా పరాక్రమ దినోత్సవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ప్రకటించారు.

డ్రాగన్‌ ఫ్రూట్​ ఇక కమలం
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘డ్రాగన్‌’ ఫ్రూట్​ పేరును గుజరాత్‌లో ‘కమలం’ అని నామకరణం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ పేర్కొన్నారు.

ఖేతీ కా ఖూన్‌
అగ్రిచట్టాలకు సంబంధించి రైతుల ఆందోళనలపై కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ‘ఖేతీ కా ఖూన్‌’ (వ్యవసాయ రుధిరం) అనే కరపుస్తకాన్ని రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో జనవరి 19న విడుదల చేశారు.

నేతాజీ ఎక్స్‌ప్రెస్‌
నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా హౌరా-కాల్కా మెయిల్‌ పేరును ‘నేతాజీ ఎక్స్‌ప్రెస్‌’గా మారుస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 20న ట్విటర్‌లో తెలిపింది. తూర్పు రైల్వే పరిధిలోని హౌరా నుంచి ఢిల్లీ మీదుగా పశ్చిమ రైల్వే పరిధిలోని కాల్కా వరకు హౌరా-కాల్కా మెయిల్‌ రైలు ప్రయాణిస్తుంది.

జయా జైట్లీ కమిటీ
యువతులు వివాహం చేసుకోవడానికి ఉండాల్సిన కనీస వయసుపై మదింపు వేయడానికి ఏర్పాటైన జయా జైట్లీ కమిటీ.. తన సిఫార్సులను ప్రధాన మంత్రి కార్యాలయానికి, మహిళా, శిశు సంక్షేమ శాఖకు జనవరి 19న సమర్పించింది.

2021 పద్మపురస్కారాలు ప్రదానం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 119 పద్మ పురస్కారాలను అందజేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్​, 10 మందికి పద్మభూషణ్​, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. తమిళనాడు నుంచి సింగర్​ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్​, గాయకురాలు చిత్రకు పద్మభూషణ్​ దక్కాయి. తెలంగాణ నుంచి గస్సాడీ రాజుగా పేరొందిన కనకరాజు పద్మశ్రీ పురస్కారం పొందారు.

మహారాష్ట్రలో ‘జైలు పర్యాటకం’
మహారాష్ట్ర గవర్నమెంట్​ జనవరి 26 న ‘జైలు పర్యాటకం’ స్టార్ట్​ చేశారు. పుణేలోని ఎరవాడ జైలులో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పాలనలో గాంధీ, నెహ్రూ, తిలక్, పటేల్, నేతాజీ వంటి జాతి నేతలెందరినో ఎరవాడ జైలులో నిర్బంధించారు. వారి గుర్తులెన్నో అక్కడ నేటికీ ఉన్నాయి. ముంబయిలో 26/11 దాడుల ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైల్లోనే ఉరి తీశారు. ఆ ఉరికంబాన్నీ సందర్శకులు చూడొచ్చు. ఎరవాడ జైలుతో పాటు థానే, నాసిక్, రత్నగిరి జైళ్లలోనూ ఈ తరహా పర్యాటకం ప్రారంభించనున్నారు.

రామాలయం మూడేళ్లలో పూర్తి
యూపీలోని అయోధ్యలో రామాలయ నిర్మాణం మూడేళ్లలో పూర్తి అవుతుందని ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్‌’ కోశాధికారి స్వామీ గోవింద్‌దేవ్‌ మహరాజ్‌ తెలిపారు. మొత్తం వ్యయం రూ.1100 కోట్లు కాగా ఒక్క ప్రధాన ఆలయంపైనే రూ.300 నుంచి-400 కోట్ల వరకు ఖర్చు కానుంది.

సాయుధ బ‌ల‌గాల‌కు ‘ఆయుష్మాన్‌ భారత్‌’
కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం ప్రయోజనాలను కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్‌)కు కూడా విస్తరించింది. ఈ మేరకు గువాహటిలో ‘ఆయుష్మాన్‌ సీఏపీఎఫ్‌’ పథకాన్ని కేంద్ర మంత్రి అమిత్‌ షా జనవరి 23న ప్రారంభించారు. సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్, నేషల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌సీ) సిబ్బంది 28 లక్షల మందితో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం పరిధిలోకి వస్తారు.

కోర్బా చేరుకున్న లాంగెస్ట్​ ట్రైన్​
దేశంలోనే లాంగెస్ట్​ సరకు రవాణా రైలు ‘వాసుకి’ని విజయవంతంగా ప్రారంభించి ఆగ్నేయ రైల్వే రికార్డు సృష్టించింది. ఐదు కార్గో రైళ్లను జతచేసి 3.5 కిలోమీటర్ల వాసుకి రైలును ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి రాయ్‌పూర్‌ రైల్వే డివిజన్‌లోని కోర్బా వరకు నడిపి ఆగ్నేయ రైల్వే ఈ ఘనత సాధించింది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 224 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల్లోనే వాసుకి పూర్తి చేసింది.

కరెన్సీ లేకుండా జోన్‌బీల్‌ మేళా
అసోంలోని మరిగోవ్‌ జిల్లాలో తివా వర్గ ప్రజలు ఏటా నిర్వహించే జోన్‌బీల్‌ మేళాలో కరెన్సీ నోటు వినియోగించకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. మేఘాలయ, అసోం సరిహద్దు గ్రామాల్లో తివా వర్గా ప్రజలు పండించిన వ్యవసాయ, ఆహార, పంటలను కొండ ప్రాంతాల కర్బి, ఖాసీ, రాభా, జైంతియా వర్గాలు తీసుకొచ్చిన వస్తువులతో మారకం చేశారు. ఈ మేళా 15వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇది ఏటా ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది.

బిగ్‌ బిలియన్‌ స్టార్టప్ బుక్​కు అవార్డు
పాన్‌ మెక్మిలన్‌ ఇండియా సంస్థ ప్రచురించిన ‘బిగ్‌ బిలియన్‌ స్టార్టప్‌: ది అన్‌టోల్డ్‌ ఫ్లిప్‌కార్ట్‌ స్టోరీ’ పుస్తకం ‘గాజా క్యాపిటల్‌ బిజినెస్‌ బుక్‌ ప్రైజ్‌ 2020’ గెలుచుకుంది. పాత్రికేయుడు మిహిర్‌ దలాల్‌ రచించిన ఈ పుస్తకం భారతీయ వాణిజ్యంపై వచ్చిన ఆరు ఉత్తమ పుస్తకాల్లో అత్యుత్తమమైనదిగా నిలిచింది. విజేతకు రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

Advertisement

ఇంటర్నేషనల్​

అయిదో అతిపెద్ద ఎకానమీగా భారత్‌
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఆరో స్థానానికి పరిమితమైన భారత్‌ 2025 కల్లా బ్రిటన్‌ను అధిగమించి అయిదో స్థానాన్ని దక్కించుకుంటుందని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ (సీఈబీఆర్‌) వార్షిక నివేదికలో పేర్కొంది. 2019లో బ్రిటన్‌ను వెనక్కినెట్టి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌ తర్వాత 2020లో ఆరో స్థానానికి పరిమితమైంది. అమెరికాను దాటి 2028లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలుస్తుందని, డాలర్ల అంశంలో పోలిస్తే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్‌ నిలుస్తుందని నివేదిక వెల్లడించింది.

గ్లోబల్​ ప్రవాసీ రిష్తా
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న దాదాపు 3.12 కోట్ల మంది ఇండియన్స్​తో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ డిసెంబర్​ 30న ‘గ్లోబల్​ ప్రవాసీ రిష్తా’ పోర్టల్​, యాప్​ను విడుదల చేసింది.

పియెర్‌ కార్డిన్‌ మరణం
ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత డిజైనర్ పియెర్‌ కార్డిన్‌(98) డిసెంబర్​ 29న మరణించారు. 1922లో ఇటలీలోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆయన కాలక్రమంలో ఫ్యాషన్‌ రంగానికి పేరుగాంచిన ఫ్రాన్స్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తన కళాత్మక దృష్టితో దుస్తులు, చేతి గడియారాలు, దుప్పట్లు, ఆటోమొబైల్‌ భాగాలు లాంటి వేల వస్తువులకు కొత్త సొబగులు అద్ది ఆశ్చర్యపరిచారు.

యూఎన్​వో భద్రతా మండలిలో భారత్​
యూఎన్​వో భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ రెండేళ్ల పదవీ కాలాన్ని (2021-22) 1 జనవరి 2021 నుంచి ప్రారంభించింది. ఇందులో భారత్‌కు చోటు దక్కడం ఇది ఎనిమిదోసారి.15 దేశాల భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. తాత్కాలిక సభ్యదేశాలుగా ఎస్తోనియా, నైజర్, సెయింట్‌ విన్సెంట్‌ గ్రెనైడెన్స్, ట్యునీషియా, వియత్నాం కొనసాగుతున్నాయి. ఇందులో భారత్, మెక్సికో, ఐర్లాండ్, నార్వే, కెన్యా కొత్తగా చేరాయి. ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జరిగిన ఎన్నికల్లో భారత్‌ 184 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2021 ఆగస్టు నెలలో, 2022లో మరో నెల పాటు భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత్‌ కొనసాగనుంది.

బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్​ ప్రోగ్రాం జనవరి 4 నుంచి బ్రిటన్‌లో స్టార్ట్​ అయింది. జాతీయ ఆరోగ్య సర్వీసు(ఎన్‌హెచ్‌ఎస్‌) ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా.. క్లినికల్‌ ప్రయోగాలకు వెలుపల ఈ వ్యాక్సిన్‌ను వేస్తున్న తొలి దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను భారత్‌లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోంది. బ్రిటన్‌లో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ల టీకాను వేస్తున్నారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు కూడా అత్యవసర వినియోగ అనుమతి లభించింది. మొదటగా 82 ఏళ్ల బ్రియాన్‌ పింకర్‌కు టీకాను వేశారు.

భారత్‌కు అర్జెంటీనా లిథియం
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో భాగంగా భారత్‌ లిథియంను దిగుమతి చేసుకునేందుకు దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అర్జెంటీనా మూడో స్థానంలో ఉంది. లిథియం-అయాన్‌ రీఛార్జబుల్‌ బ్యాటరీలు తయారుచేసేందుకు లిథియం ఖనిజాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. విదేశాల నుంచి లిథియం, కోబాల్ట్‌ను దిగుమతి చేసుకునేందుకు మూడు ప్రభుత్వ రంగ సంస్థలు- హిందుస్థాన్‌ కాపర్, మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్, నాల్కోలు సంయుక్తంగా ‘ఖాంజీ బిదేశ్‌ ఇండియా’ (కేబీఐఎల్‌) సంస్థను ఏర్పాటు చేశాయి.

ఆస్ట్రేలియా జాతీయ గీతంలో సవరణ
దేశ ఐక్యతా స్ఫూర్తిని, చరిత్రను ప్రతిబింబించేలా ఆస్ట్రేలియా జాతీయ గీతంలో సవరణ చేసింది. ‘ఫర్‌ వుయ్‌ ఆర్‌ యంగ్‌ అండ్‌ ఫ్రీ’ అనే పంక్తిలో ‘యంగ్‌’ స్థానంలో ‘వన్‌’ అనే పదాన్ని చేర్చింది. ఈ విషయాన్ని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ న్యూ ఇయర్​ వేడుకల్లో ప్రకటించారు.1984లో జాతీయ గీతం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ దేశం తొలిసారిగా మార్పు చేసింది.

చైనా రక్షణ చట్టంలో మార్పులు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సెంట్రల్‌ మిలిటరీ కమిటీ (సీఎంసీ) రక్షణ చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. దీంతో సీఎంసీపై పౌర నియంత్రణ ఉండదు. ఎప్పుడైనా ఎక్కడికైనా సైన్య, పౌర వనరులను తరలింంచవచ్చు. దేశం లోపల, బయట ఎలాంటి సైనిక నిర్ణయాలైనా తీసుకోవచ్చు.

చైనా యాప్‌లపై నిషేధం
చైనాకు సంబంధించిన ఎనిమిది యాప్‌లపై అమెరికా నిషేదం విధించింది. ఇందులో అలీపే, వుయ్‌చాట్‌ పే, కామ్‌స్కానర్, షేర్‌ఇట్‌ టెన్సెంట్‌ క్యూక్యూ, డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్, క్యూక్యూ వ్యాలెట్, వీమేట్‌ ఉన్నాయి.

ఇ- పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ 2021
హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ ‘ఇ- పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ 2021’ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ 58 స్కోరుతో 85వ ర్యాంకులో(గతేడాది 84వ స్థానం) ఉంది. ఓ టూరిస్ట్‌గా వీసా లేకుండా కేవలం పాస్‌పోర్ట్‌తో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ లిస్ట్‌లో జపాన్‌ మొదటి స్థానంలో(191), సింగపూర్‌(190) రెండో స్థానంలో, సౌత్‌ కొరియా, జర్మనీ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ చివరి స్థానం (స్కోరు 26), పాకిస్థాన్‌ 32 స్కోరుతో చివరి నుంచి నాలుగో ర్యాంక్‌లో ఉంది..

ట్రంప్‌పై అభిశంసన తీర్మానం
డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో జనవరి 11న అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. క్యాపిటల్‌ హిల్‌పై దాడికి ఆయన తన మద్దతుదారులను ప్రోత్సహించారని, తిరుగుబాటుకు కారణమయ్యారని పేర్కొన్నారు. డెమొక్రాట్లు జమీ రస్కిన్, డేవిడ్‌ సిసిలైన్, టెడ్‌ లియూలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీనికి 211 మంది మద్దతు తెలిపారు.

రిపబ్లిక్​ డేకు సురినామ్‌ ప్రెసిడెంట్​
ఈ ఏడాది రిపబ్లిక్​ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారతీయ మూలాలున్న సూరినామ్‌ అధ్యక్షుడు చంద్రికాపెర్సాద్‌ సంతోఖి హాజరవుతారని పీఎంఓ ఖరారు చేసింది. దక్షిణ అమెరికా ఖండంలోని చిన్న దేశంగా ఉన్న సూరినామ్‌దేశ జనాభా 5.87 లక్షలు. ఇందులో 27.4 శాతం మంది భారతీయ మూలాలున్న వారే. ఈసారి రిపబ్లిక్​ డే వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా.. కరోనా తీవ్రత దృష్ట్యా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు.

అమెరికాలో మహిళకు మరణశిక్ష
కనాస్‌కు చెందిన మహిళ లీసా మాంట్‌గోమెరీ (52)కు అమెరికా ప్రభుత్వం జనవరి 23న మరణశిక్ష అమలు చేసింది. తన స్నేహితురాలు బాబీ జో స్టిన్నెట్‌ను హత్య చేసి, గర్భాన్ని కోసి, బిడ్డను అపహరించిన నేరానికిగాను ఈ శిక్షను విధించింది. అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష అమలుచేయడం 67 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం.

జో బైడెన్‌ ప్రమాణం
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌లో జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి నల్లజాతి మహిళగా, తొలి భారతీయ సంతతికి చెందిన మహిళగా కమలాహారిస్‌ చరిత్ర సృష్టించారు. క్యాపిటల్‌ హిల్‌ వెస్ట్‌ ఫ్రంట్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. లేడీ గగా జాతీయ గీతం ఆలపించారు. జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో అలరించారు.

కే2పై నేపాల్‌ టీం
ప్రపంచంలోనే రెండో ఎత్తయిన కే2 పర్వతాన్ని అధిరోహించి నేపాల్‌ బృందం రికార్డు సృష్టించింది. 10 మంది సభ్యులతో కూడిన బృందం శీతాకాలంలో మొదటిసారిగా కే2 పర్వతాన్ని అధిరోహించినట్లు జనవరి 17న నేపాల్‌ పర్యాటక శాఖ పేర్కొంది. 28,251 అడుగుల ఎత్తయిన ఈ పర్వతంపైకి శీతాకాలంలో ఇప్పటివరకు ఎవరూ చేరుకోలేదు.

బ్రిటన్​లో జీ-7 సమ్మిట్​
2021 జూన్‌లో బ్రిటన్​లో జీ 7 సమ్మిట్​ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆహ్వానించారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణకొరియా అతిధి దేశాల హోదాలో పాల్గొంటాయి.

అగ్రికల్చర్​పై ఆన్‌లైన్‌ సదస్సు
‘భారతీయ వ్యవసాయం-2030, రైతుల ఆదాయం పెంపు- పౌష్టికాహార భద్రత- సుస్థిర ఆహార వ్యవస్థ’ అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ, నీతి ఆయోగ్, ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) ఆధ్వర్యంలో జనవరి 19న ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌ నుంచి ప్రారంభించారు.

అవినీతి సూచిలో భారత్‌కు 86వ స్థానం
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచీ-2020లో 40 స్కోరుతో భారత్‌ 86వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 6 స్థానాలు దిగువకు పడిపోయిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. 2020కి సంబంధించి 180 దేశాల అవినీతి సూచీని ఆ సంస్థ విడుదల చేసింది. 2019 సర్వే ప్రకారం 41 స్కోరుతో భారత్‌ 80వ స్థానంలో ఉంది. లేటెస్ట్​ రిపోర్ట్​ ప్రకారం న్యూజిలాండ్, డెన్మార్క్‌లు 88 స్కోరుతో అవినీతి తక్కువ ఉన్న దేశాలుగా అగ్రస్థానంలో నిలిచాయి. 12 స్కోరుతో సోమాలియా, దక్షిణ సూడాన్‌ దేశాలు 179 ర్యాంకుతో అత్యంత అవినీతిమయ దేశాలుగా ఉన్నాయి.

హెల్త్​ ఇండెక్స్​లో పదో స్థానం
ఆసియా పసిఫిక్‌ దేశాల్లో వ్యక్తిగత ఆరోగ్య భద్రతపై ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) రిలీజ్​ హెల్త్​ ఇండెక్స్​లో భారతదేశానికి పదో ర్యాంకు (10/11) వచ్చింది. ఈ జాబితాలో ఇండోనేసియా చివరిస్థానంలో(11) ఉంది. అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలతో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా వరుస స్థానాల్లో నిలిచాయి.

అణ్వస్త్ర నిషేధ ఒప్పందం
అణ్వాయుధాల నిషేధానికి సంబంధించిన ఫస్ట్​ ఒప్పందం జనవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. ‘ఇంటర్నేషనల్‌ కాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌’ సంస్థ కృషి వల్ల ఒప్పందం విషయంలో ముందడుగు పడింది. 2017 జులైలో యూఎన్​వో సర్వప్రతినిధి సభ దీనికి ఆమోదం తెలుపగా 120కిపైగా దేశాలు దీనికి పచ్చజెండా ఊపాయి. ఈ అగ్రిమెంట్​ అమల్లోకి రావాలంటే కనీసం 50 దేశాలు ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. 2020 అక్టోబరులో 50వ ర్యాటిఫికేషన్‌ పూర్తయింది. ఆ తర్వాత 90 రోజుల గ్యాప్​ తర్వాత జనవరి 22 నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది.

వర్చువల్‌ సందర్శనకు జాతిపితల నివాసాలు
భారత జాతిపిత గాంధీజీ నివసించిన సబర్మతి ఆశ్రమంతో పాటుగా ఇజ్రాయెల్‌ జాతి పిత డేవిడ్‌ బెన్‌ గురియన్‌ ఇంటిని ఉమ్మడిగా (వర్చువల్‌గా) సందర్శించే కార్యక్రమానికి ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి సంజీవ్‌ సింగ్లా జనవరి 26న శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని బెన్‌ గురియన్‌ హెరిటేజ్‌ ఇన్‌స్టిట్యూట్, సబర్మతి ఆశ్రమ ట్రస్టు సంయుక్తంగా నిర్వహిస్తాయి.

ప్రాంతీయం

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సునీతాలక్ష్మారెడ్డి
తెలంగాణ తొలి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్​ 27న ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యురాళ్లుగా గద్దల పద్మ (వరంగల్‌ జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌), షాహీనా అఫ్రోజ్‌ (హైదరాబాద్, మహబూబ్‌గంజ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్‌పర్సన్‌), కుమ్ర ఈశ్వరీబాయి (ఇంద్రవెల్లి మాజీ ఎంపీపీ), కొమ్ము ఉమాదేవియాదవ్‌ (మంచిర్యాల), సూదం లక్ష్మి (నిజామాబాద్‌), కటారి రేవతిరావు (పెద్దపల్లి) నియమితులయ్యారు. వీరు అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

కొత్త రాతి యుగపు గొడ్డలి
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని కృష్ణా తీర గ్రామమైన సోమశిలలో క్రీ.పూ.4000 నుంచి-2000 మధ్య కాలానికి చెందిన కొత్త రాతి యుగపు గొడ్డలి బయటపడింది. సోమశిలలోని సోమనాథస్వామి ఆలయానికి తూర్పు దిక్కున జరిపిన తవ్వకాల్లో 4 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు, అంగుళం మందంతో ఉన్న ఈ గొడ్డలి దొరికింది.

రుషికొండ బీచ్​లో బ్లూఫ్లాగ్‌
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ దేశంలో ఎంపికైన 8 బీచ్‌లలో డిసెంబర్​ 28న ఆన్‌లైన్‌ ద్వారా బ్లూఫ్లాగ్‌లను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నీలిరంగు పతాకాన్ని రుషికొండ తీరంలో ఎగురవేశారు. విదేశీ పర్యాటకులు బీచ్‌లను సందర్శించే ముందు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును పరిశీలిస్తారు. డెన్మార్క్‌ దేశానికి చెందిన ఫౌండేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ 33 ప్రమాణాల్ని పరిశీలించి బీచ్‌లకు ఈ గుర్తింపును ఇస్తుంది.

‘స్వనిధి’ నిర్మల్‌కు గుర్తింపు
కరోనాతో ఉపాధి కోల్పోయిన చిరు, వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకం అమలులో నిర్మల్‌ పట్టణం దేశవ్యాప్తంగా లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో(80 శాతం లక్ష్యసాధనతో) ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. పట్టణంలోని 4,603 మంది వీధి వ్యాపారులకు లోన్​ మంజూరవగా.. 4,152 మందికి పంపిణీ పూర్తయింది.

మహిళలకు షిక్యాబ్‌ స్కీం
పైలట్‌ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో షిక్యాబ్‌ పథకాన్ని మంత్రి హరీశ్‌రావు జనవరి 4న ప్రారంభించారు. ఇందులో 18 మంది మహిళలకు కార్లు పంపిణీ చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.83.77 లక్షలు రాయితీ కింద విడుదల చేసింది.

వెన్నెలకంటి మరణం
ప్రముఖ గీత, మాటల రచయిత వెన్నెలకంటి(63) జనవరి 5న గుండెపోటుతో చెన్నైలో మరణించారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. 34 ఏళ్ల ఆయన సినీ సాహిత్య ప్రయాణంలో 300కిపైగా చిత్రాల్లో 2500కి పైగా పాటలు రాశారు.

డాక్టర్‌ పద్మజకు నైటింగేల్​ అవార్డు
నెల్లూరు జిల్లా తడ మండలంలోని చిన్నమాంబట్టుకు చెందిన డాక్టర్‌ పద్మజ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె తిరుపతి స్విమ్స్‌ నర్సింగ్‌ కాలేజీ ప్రొఫెసర్​, వైస్‌ ప్రిన్సిపల్‌గా ఉన్నారు. నర్సింగ్‌ విద్యా రంగంలో ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు

‘ఆత్మ నిర్భర్‌’లో తెలంగాణ టాప్​
వీధి వ్యాపారులకు సంబంధించి ‘ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్‌ పథకం’ అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ పథకం అమలులో లక్షలోపు జనాభా కలిగిన పురపాలక సంఘాల కేటగిరిలో మొదటి 10 తెలంగాణ రాష్ట్రానికి చెందినవే ఉన్నాయి. నిర్మల్, సిద్దిపేట, కామారెడ్డి, బోధన్, సిరిసిల్ల, పాల్వంచ, ఆర్మూర్, సంగారెడ్డి, మంచిర్యాల, కోరుట్ల మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. పది లక్షలలోపు జనాభా కలిగిన నగరాల కేటగిరిలో వరంగల్‌ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 40 లక్షలకు మించిన జనాభా కలిగిన మెగాసిటీల కేటగిరిలో హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ దేశంలో మొదటి స్థానంలో ఉంది.

వైమానిక క్రీడా శిక్షణ కేంద్రం
దేశంలోనే మొట్టమొదటి వైమానిక క్రీడా శిక్షణ కేంద్రాన్ని తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన, ఉదండాపూర్‌ జలాశయాల మధ్య 15 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

టీఎస్‌ రెడ్కోకు జాతీయ అవార్డు
ఇంధన పొదుపులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్‌ రెడ్కో)కు జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ పురస్కారం లభించింది. జాతీయ ఇంధన సామర్థ్యం మండలి (బీఈఈ), కేంద్ర విద్యుత్‌శాఖ సంయుక్తంగా ఈ రంగంలో ఏటా పురస్కారాలను ఇస్తాయి. జనవరి 11న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ టీఎస్‌ రెడ్కో ఎండీ జానయ్యకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

టాప్​ 5 లో తెలంగాణ
నీతి ఆయోగ్​ ఉపాధ్యక్షుడు రాజీవ్​కుమార్​, సీఈవో అమితాబ్​కాంత్​లు జనవరి 20న విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్​ ఇండెక్స్​లో తెలంగాణ.. దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా ఉండగా.. కర్ణాటక, తెలంగాణలు మాత్రమే గత ఏడాది స్థానాలను నిలబెట్టుకున్నాయి.

బూర్గుల నర్సింగరావు మరణం
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, అభ్యుదయవాది, కమ్యూనిస్టు నేత బూర్గుల నర్సింగరావు(89) జనవరి 18న అనారోగ్యంతో మరణించారు. రజాకార్లకు వ్యతిరేకంగా అప్పట్లో పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌ నిర్వహించిన ‘ఇమ్రోజ్‌’ పత్రికకు బూర్గుల పూర్తి సహాయ సహకారాలు అందించారు. 1952లో తలెత్తిన ముల్కీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1960లో ఇంగ్లండ్‌లో ఉన్నతవిద్య అభ్యసించారు. ప్రత్యేక తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్నారు.

నల్లా కనెక్షన్లలో రెండు రాష్ట్రాలు
ప్రతి ఇంటికి నీరు అందించడంలో భాగంగా వంద శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలుగా దేశంలో గోవా, తెలంగాణలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.​ ఈ విషయాన్ని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ జనవరి 21న ట్విటర్​ ద్వారా తెలిపారు.

హస్తకళా ఉత్పత్తులపై తపాలా కవర్లు
తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన హస్తకళా ఉత్పత్తులైన చేర్యాల చిత్రాలు, నిర్మల్‌ బొమ్మలు, గద్వాల చీరలు, కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రిలపై తపాలా శాఖ రూపొందించిన నాలుగు కొత్త కవర్లను జనవరి 23న గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో విడుదల చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ ఉత్తర్వులకు అనుగుణంగా నియమించిన కమిటీ వివరాలు కోరుతూ హయాతుద్దీన్‌ కేంద్ర పర్యావరణశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి ఆ శాఖ స్పందిస్తూ.. ఎన్జీటీ గతేడాది అక్టోబరు 20న ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నవంబరు 20న ఓ నిపుణుల కమిటీని నియమించినట్లు పేర్కొంది. బలరాజ్‌ జోషి ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో ఈ కమిటీ ఉంటుందని, కమిటీ నివేదిక సమర్పణకు ఆరు నెలల గడువు విధించినట్లు కేంద్ర పర్యావరణ శాఖ తెలియజేసింది.

తెలంగాణకు 3వ స్థానం
మానవాభివృద్ధి సూచీలో తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించి 9వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌తో కూడిన బృందం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందించారు.

ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం
ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం సరఫరా చేసే మొబైల్‌ వాహనాలను ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 21న విజయవాడలో ప్రారంభించారు. అనంతరం కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు 2,500 వాహనాలు ఏకకాలంలో బయల్దేరాయి.

తలసరి విద్యుత్‌ వినియోగంలో రికార్డు
తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రికార్డు సాధించినట్లు రాష్ట్ర జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం 2,071 యూనిట్లు కాగా.. దేశంలో ఇదే అత్యధికం. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ సామర్థ్యం ప్రస్తుతం 16,245 మెగావాట్లకు చేరింది.

వార్తల్లో వ్యక్తులు


ర్యాన్‌కాజీ
2020లో యూట్యూబ్‌ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదించిన టాప్‌-10 యూట్యూబ్‌ స్టార్ల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసింది. యూట్యూబ్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా రూ.220 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నవారి జాబితాలో ర్యాన్‌కాజీ(9) వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని సంపాదించాడు. ప్రస్తుతం థర్డ్​ క్లాస్​ చదువుతున్న ర్యాన్‌కాజీది అమెరికాలోని టెక్సాస్‌. యూట్యూబ్‌ ఛానల్‌ ర్యాన్స్‌ వరల్డ్‌ పేరుతో చిన్న పిల్లలు ఆడుకొనే బొమ్మలపై ర్యాన్‌ రివ్యూ చేస్తూ వీడియోలు రూపొందించాడు. ఈ ఛానల్‌కు దాదాపు 3కోట్ల మంది వీక్షకులు ఉన్నారు.

హేమంత్‌ కుమార్‌ పాండే
డీఆర్‌డీవో ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2018’ అవార్డును సీనియర్‌ శాస్త్రవేత్త హేమంత్‌ కుమార్‌ పాండే అందుకున్నారు. ఈయన ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్, డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో-ఎనర్జీ రిసెర్చ్‌ (డీఐబీఈఆర్‌)లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. బొల్లి వ్యాధి చికిత్సకోసం ప్రస్తుతం వినియోగిస్తున్న ల్యూకోస్కిన్‌ ఔషధాన్ని ఈయనే తయారు చేశారు.

రవీందర్‌రావు
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టీఎస్‌క్యాబ్‌) ఛైర్మన్‌ కొండ్రు రవీందర్‌రావు రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (న్యాఫ్స్‌క్యాబ్‌) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఐదేళ్లు కొనసాగుతారు. దేశంలోని 34 రాష్ట్రాల బ్యాంకుల అధ్యక్షులతో పాటు ఇతర ప్రతినిధులు సమాఖ్యలో సభ్యులుగా ఉంటారు. 1964లో సమాఖ్య ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలుగువారికి సమాఖ్య ఛైర్మన్‌ పదవి దక్కింది.

నర్రా రవికుమార్‌
దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణా పారిశ్రామికవేత్త నర్రా రవికుమార్‌ ఎంపికయ్యారు. ఈయన ఇప్పటి వరకు డిక్కీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నేతి మురళీధర్​
రాష్ట్ర సహకార అపెక్స్​ బ్యాంక్​(టేస్కాబ్​) ఎండీ నేతి మురళీధర్​కు జాతీయస్థాయి ఉత్తమ ఎండీ పురస్కారం లభించింది. మురళీధర్​ పనితీరు, సుపరిపాలన కారణంగా ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

సునీత్‌ శర్మ
రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్, సీఈవోగా సునీత్‌ శర్మ డిసెంబర్​ 31న నియమితులయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న వినోద్‌కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం ముగియడంతో కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ ఆ స్థానంలో సునీత్‌ శర్మను నియమించింది.ఈయన ఈస్టర్న్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌గా ఉన్నారు.

ఎలాన్​ మస్క్​
విద్యుత్​ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ ప్రపంచ కుబేరుడయ్యాడు. టెస్లా షేరు వాల్యూ జనవరి 7న 4.8 శాతం పెరగడంతో ఈ రికార్డు సాధించాడు. బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ సూచీ ప్రకారం ఎలాన్​ మస్క్​ నికర సంపద 188.5 బిలియన్​ డాలర్ల(దాదాపురూ.14.13 లక్షల కోట్ల)కు చేరింది. 2017 నుంచి అగ్రస్థానంలో ఉన్న అమెజాన్​ అధిపతి జెఫ్​జోస్​ సంపద కంటె ఈ మొత్తం 1.5 బిలియన్​ డాలర్లకు ఎక్కువ.

ఎస్కే హల్దర్‌
పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవోగా పనిచేసిన ఎస్కే హల్దర్‌ను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఆర్కే జైన్‌ పదవీ విరమణ చేశారు.

నాన్సీ పెలోసీ
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా నాన్సీ పెలోసీ(80) మరోసారి ఎన్నికయ్యారు. ఆమె వరుసగా నాలుగోసారి ఈ పదవిని చేపడుతున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన నాన్సీకి 216 ఓట్లు రాగా, ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కెవిన్‌ మెక్‌కార్తీకి 209 వచ్చాయి.

శివశంకర్‌ గంగూలీ
నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్(ఎన్జీఆర్‌ఐ) సైంటిస్టు డాక్టర్‌ శివశంకర్‌ గంగూలీ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఇండియా (ఎన్‌ఏఎస్‌ఐ) యంగ్‌ సైంటిస్టు ప్లాటినం జూబ్లీ అవార్డు-2020కు ఎంపికయ్యారు. ఎర్త్‌ సిస్టం సైన్సెస్‌లోని న్యూమరికల్, అబ్జర్వేషనల్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటెన్షియల్‌ పని ద్వారా చమురు రికవరీ, చమురు క్షేత్రాన్ని అంచనావేయడంలో చేసిన కృషికిగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఉమాకాంత్‌
భారత వ్యవసాయ పరిశోధన మండలిలో చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్‌ ఏవీ ఉమాకాంత్‌కు ఉత్తమ విత్తన శాస్త్రవేత్త అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో జనవరి 11న జరిగిన సీడ్స్‌మెన్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు ఉమాకాంత్‌కు పురస్కారాన్ని అందజేశారు. ఆయన రెండున్నర దశాబ్దాలుగా జొన్న పంటపై పలు కీలకమైన పరిశోధనలు చేసి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు.

అద్నాన్​ ఒక్తర్​
టర్కీలోని ఓ కోర్టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అద్నాన్‌ ఒక్తర్‌కు ఏకంగా 1,075 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడిపై నమోదైన 10 అభియోగాలకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది. నేర ముఠాను నడపటం, రాజకీయ, సైనిక గూఢచర్యానికి పాల్పడటం, మైనర్లపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు ఒడిగట్టడంతో పాటు బెదిరించడం లాంటి తీవ్రమైన కేసుల్లో అద్నాన్‌పై నేరం నిరూపణ అయింది.

వేద్‌ ప్రకాశ్‌ మెహతా
భారతీయ జీవన వైవిధ్యాన్ని తన రచనల ద్వారా అమెరికన్ల కళ్లకు కట్టిన సుప్రసిద్ధ రచయిత వేద్‌ మెహతా (86) న్యూయార్క్‌లోని తన నివాసంలో జనవరి 11న మరణించారు. ఆయన 1934లో అవిభాజ్య భారత్‌లోని లాహోర్‌లో జన్మించారు. తన జీవితానుభవాలతో 24 భాగాలుగా ఆయన రచించిన గ్రంథాలు విశేష గుర్తింపును తీసుకొచ్చాయి.

సిద్ధార్థ మహంతీ
ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సిద్ధార్థ మహంతీ జనవరి 19న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఆయన కొత్త బాధ్యతలు చేపట్టి 2023 జూన్‌ 30వరకు పదవిలో కొనసాగుతారు. టీసీఐఎల్‌ ఛైర్మన్, ఎండీగా సంజీవ్‌ కుమార్‌ నియమతులయ్యారు.

మనీశ్​ కుమార్​
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ జనవరి 16న ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు మనీశ్‌ కుమార్‌(34)కు కొవాగ్జిన్‌ టీకా ఇచ్చారు.

యూవెరీ ముసావెనీ
ఉగాండా అధ్యక్షుడిగా యూవెరీ ముసావెనీ(76) వరుసగా ఆరోసారి ఎన్నికయ్యారు. ఆయన 1986లో సైనిక తిరుగుబాటు ద్వారా మొదటిసారి అధ్యక్ష పదవి చేపట్టారు. ముసావెనీకి 52 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి బాబీ వైన్‌కు 34 శాతం ఓట్లు పడ్డాయి.

వినయ్‌రెడ్డి
అమెరికా అధ్యక్షుడి ప్రసంగ పాఠాన్ని తెలంగాణకు చెందిన వినయ్‌రెడ్డి రాశారు. ఆయన అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఆయన కుటుంబ స్వస్థలం కరీంనగర్‌ జిల్లాలోని పోతిరెడ్డిపేట. వినయ్‌ తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వలస వెళ్లారు. బైడెన్‌ స్పీచ్‌ రైటర్‌గా వినయ్‌రెడ్డి జనవరిలో నియమితులయ్యారు.

నవజ్యోత్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ) హైదరాబాద్‌ ఛాప్టర్‌ ఛైర్మన్‌గా పుట్టపర్తి నవజ్యోత్‌ జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ పదవిలో ఏడాది కాలం పాటు ఉంటారు.

వి.శాంత
చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్‌పర్సన్, నిరుపేద క్యాన్సర్‌ రోగుల చికిత్సకే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ వైద్యురాలు వి.శాంత(93) జనవరి 19న గుండెపోటుతో మరణించారు.

స్వామినాథన్, అశ్వినీ కుమార్‌ తివారీ
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్లుగా జే.స్వామినాథన్, అశ్వినీ కుమార్‌ తివారీ జనవరి 28న బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. స్వామినాథన్‌ ఎస్‌బీఐ ఫైనాన్స్‌ విభాగంలో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ, తివారీ ఎస్‌బీఐ కార్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గాను పనిచేశారు.

పట్టాభి యాదిరెడ్డి
రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌) మేనేజింగ్‌ డైరక్టర్‌(ఎండీ)గా పట్టాభి యాదిరెడ్డిని నియమిస్తూ వ్యవసాయశాఖ జనవరి 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు ఎండీగా పనిచేసిన భాస్కరాచారి ఏసీబీకి పట్టుబడటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది.

జస్టిస్‌ గీతా మిత్తల్‌
టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లెయింట్స్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌గా జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌ నియమితులయ్యారు. ఈ స్వతంత్ర, స్వీయ నియంత్రణ వ్యవస్థను ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసింది.

అభిషేక్​ పవార్​
కర్ణాటకకు చెందిన యువకుడు అభిషేక్‌ పవార్‌ తన నైపుణ్యంతో వివిధ రకాలుగా స్కిప్పింగ్‌ చేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఇతనిది హుబ్లీ మండలంలోని నూల్వీ గ్రామం.

కళా సుదర్శన్​ రెడ్డి
కర్ణాటకకు చెందిన డా.ఎం.కళా సుదర్శన్‌ రెడ్డి 149 డిగ్రీలను సంపాదించారు. అందులో 122 మాస్టర్‌ డిగ్రీలు కాగా, 27 బ్యాచిలర్‌ డిగ్రీలు ఉన్నాయి. 100 మాస్టర్స్‌ డిగ్రీలను కేవలం 12 సంవత్సరాల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఆయన ఏపీలోని పంచాయతి రాజ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. పై చదువుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి బళ్లారి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

అన్వితారెడ్డి
భువనగిరికి చెందిన పర్వతారోహణ శిక్షకురాలు అన్వితారెడ్డి ఐపీఎస్‌ అధికారి తరుణ్‌ జోషితో కలిసి టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. వీరిద్దరూ 5,895 మీటర్లు (19,340 అడుగుల) ఎత్తు ఉన్న శిఖరాగ్రానికి చేరుకున్నారు. పర్వత శిఖరంపై జాతీయ పతాకంతో పాటు రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ పతాకాన్ని ఆవిష్కరించారు.

మడావి కన్నీబాయి
హిమాలయాల శ్రేణి పంగార్చుల్ల పర్వతారోహణకు తెలంగాణ నుంచి ఎంపికైన 28 మంది టీంకు నాయకురాలిగా ఆదివాసీ మహిళ మడావి కన్నీబాయి ఎంపికయ్యారు. ఆమె కుమురంభీం జిల్లా కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందినవారు. అడ్వెంచర్‌ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు పొందారు. దేశ చరిత్రలోనే హిమాలయాల పర్వతారోహణకు ఓ ఆదివాసీ మహిళ ఎంపిక కావడం ఇదే తొలిసారి.

Advertisement

సైన్స్​ & టెక్నాలజీ

విదేశాలకు ‘ఆకాశ్​’
డీఆర్​డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఆకాశ్​’ క్షిపణుల ఎగుమతికి డిసెంబర్​ 30న ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూమి మీద నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి అయిన ‘ఆకాశ్​’ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. డీఆర్​డీవో మొట్టమొదటి ఆకాశ్​ పరీక్షను 1990లో నిర్వహించింది. 2005లో వేగంగా కదులుతున్న లక్ష్యాలను ‘ఆకాశ్​’ ఛేదించగలిగింది. ఇతర దేశాలు చేసే ఖర్చులో ఎనిమిది నుంచి పదోవంతుతోనే డీఆర్​డీవో విజయవంతంగా అభివృద్ధి చేసింది. 2012లో మొదటి బ్యాచ్​ ఆకాశ్​ క్షిపణులను భారత వాయుసేనలో ప్రవేశపెట్టగా, 2015లో భారత సైన్యం అమ్ముల పొదిలో ఆకాశ్​ చేరింది.

రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ప్రయోగం
రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా ప్రయోగించింది. వాయువ్య చైనాలోని జియుకాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. యోగాన్‌-33తో పాటు అంతరిక్షంలో మైక్రో, నానో సాంకేతిక ప్రయోగాలకు ఉద్దేశించిన మరో ఉపగ్రహాన్ని లాంగ్‌మార్చ్‌-4సీ రాకెట్‌ ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

కృత్రిమ సూర్యుడి రికార్డు
దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు 20 సెకండ్ల పాటు ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో జ్వలించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కొరియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యుజన్‌ ఎనర్జీ, సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడి పేరు ‘కె-స్టార్‌ (ది కొరియా సూపర్‌ కండక్టింగ్‌ టొకమాక్‌ అడ్వాన్సుడ్‌ రీసెర్జ్‌)’. 2025 నాటికి దీన్ని కనీసం 300 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలన్నది పరిశోధకుల లక్ష్యం.

‘సహాయక్‌ ఎన్జీ’ పరీక్షలు సక్సెస్​
రక్షణ సామగ్రిని విమానాల నుంచి యుద్ధనౌకల మీదకు చేర్చే ‘సహాయక్‌ ఎన్జీ’ ఎయిర్‌ డ్రాపబుల్‌ కంటైనర్‌ను డీఆర్‌డీవో డిసెంబర్​ 31న పరీక్షించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన దీన్ని గోవా తీరంలో నౌకదళానికి చెందిన ఐఎల్‌-38ఎస్‌డీ విమానం నుంచి కిందకు దించారు.

నేవీలోకి ఎల్​సీయూ
భారత నౌకాదళంలోకి 8వ ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ యుటిలిటీ(ఎల్‌సీయూ)యుద్ధనౌక చేరింది. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ దీన్ని నిర్మించింది. ఈ యుద్ధనౌక కీలకమైన అండమాన్, నికోబార్‌ దీవుల్లో మోహరిస్తుంది. అత్యంత సంక్లిష్టమైన బీచ్‌లను చేరగలిగేలా దీన్ని రూపొందించారు. రెండు సీఆర్‌ఎన్‌ 91 శతఘ్నులు కూడా ఈ యుద్ధనౌకలో ఉన్నాయి.

లార్జెస్ట్​ ఫ్లోటింగ్​ సోలార్​
ప్రపంచంలోనే లార్జెస్ట్​ ప్లోటింగ్​ సోలార్​ ప్రాజెక్ట్​ను భారత ప్రభుత్వం నర్మదా నదిపై నిర్మించనుంది. ఉన్న ఓంకారేశ్వర్​ డ్యామ్​ వద్ద 3000 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్​ సామర్థ్యం 600 మెగావాట్స్​. 2022 నుంచి ఇక్కడ పవర్​ జనరేషన్​ ప్రారంభం కానుంది.

మెట్రాలజీ కాన్​క్లేవ్​
కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ & ఇండస్ట్రియల్​ రీసెర్చ్​–నేషనల్​ ఫిజికల్​ ల్యాబొరేటరే ఆధ్వర్యంలో జనవరి 4న నేషనల్​ మెట్రాలజీ కాన్​క్లేవ్​ న్యూఢిల్లీలో నిర్వహించారు. ‘ఇన్​క్లూజివ్​ గ్రోత్​ ఆఫ్​ ది నేషన్​’ థీమ్​తో జరిగిన ఈ కాన్​క్లేవ్​లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

భారత వాయుసేనకు తేజస్‌
దేశీయంగా అభివృద్ధిపరిచిన 83 తేలికపాటి తేజస్‌ యుద్ధ విమానాలను రూ.48,000 కోట్ల ఖర్చుతో సమీకరించడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 13న ఆమోదం తెలిపింది. ఐఏఎఫ్‌-హెచ్‌ఏఎల్‌ మధ్య మార్చిలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, 2024 నుంచి విమానాల అందజేత మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. విమానంలో వాడేవాటిలో దేశీయంగా తయారైనవి 50 శాతం ఉండగా, ప్రస్తుత కార్యక్రమం ముగిసే నాటికి అది 60 శాతానికి చేరుతుంది. దాదాపు 500 వరకు భారతీయ కంపెనీలు ఈ విమానాల తయారీలో హెచ్‌ఏఎల్‌తో పాలుపంచుకుంటున్నాయి.

నేవీకి ల్యాండింగ్​ గేర్​ సిస్టమ్స్​
మానవరహిత విమానాల(యూఏవీ) కోసం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ల్యాండింగ్‌ గేర్‌ వ్యవస్థలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నౌకాదళానికి అప్పగించింది. ఈ సంస్థకు చెందిన ‘కంబాట్‌ వెహికిల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’ (సీవీఆర్‌డీఈ) చెన్నైలో దీన్ని తయారుచేసింది.‘తపస్‌’ యూఏవీ కోసం మూడు టన్నుల రిట్రాక్టబుల్‌ ల్యాండింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

బ్రెజిల్​కు కొవాగ్జిన్​
భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా, ‘కొవాగ్జిన్‌’ బ్రెజిల్‌ దేశానికి ఎగుమతి కానుంది. బ్రెజిల్‌కు చెందిన ప్రిసిసా మెడికమెంతోస్‌ అనే సంస్థతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ జనవరి 12న ప్రకటించింది. మనదేశంలో బ్రెజిల్‌ రాయబారి ఆండ్రే అరాన్హ కోరే డా లాగో దృశ్య మాధ్యమ విధానంలో డాక్టర్‌ కృష్ణ ఎల్లతో మాట్లాడి, తమ దేశానికి టీకా సరఫరా చేయాలని కోరారు.

నక్షత్రాల అంతం..
భారీ నక్షత్రాల అంతానికి దారితీసే కీలక అంశాలను ఐఐటీ గువాహటి సైంటిస్టులు కనుగొన్నారు. జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫిజిక్స్, అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్‌ వర్సిటీతో కలిసి వారు ఈ పరిశోధన సాగించారు. భారీ నక్షత్రాలు అంతరించే సమయంలో సూపర్‌నోవాగా పిలిచే తీవ్రస్థాయి పేలుడు సంభవిస్తుంది. ఆ సందర్భంగా ప్రకంపనలు ఉద్భవించి నక్షత్రం కూలిపోతుంది. అయితే, ఈ పరిణామం ఇతర నక్షత్రాల పుట్టుకకు కారణమవుతోంది. సూపర్‌నోవాను, దాని ద్వారా విడుదలయ్యే రేణువులను అధ్యయనం చేయడం ద్వారా నక్షత్రాల మరణం, విశ్వం గురించిన లోతైన విషయాలు తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు.

స్పేస్​ ఎక్స్​ రికార్డ్​
అమెరికాలోని ఎలన్​మస్క్​కు చెందిన స్పేస్​ ఎక్స్​ కంపెనీ జనవరి 24న ఒకేసారి 143 ఉపగ్రహాలను ఫాల్కన్​ 9 రాకెట్​ ద్వారా అంతరిక్షంలోకి పంపి రికార్డు సృష్టించింది. మొత్తం 143 ఉపగ్రహాల్లో 133 ప్రభుత్వానికి చెందినవి కాగా, 10 శాటిలైట్స్​ స్పేస్​ ఎక్స్​కు చెందినవి. ఇంతకు ముందు 2017లో ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన వరల్డ్​ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు తాజాగా స్పేస్​ ఎక్స్​ ఆ రికార్డును బ్రేక్​ చేసింది. ఇంతకు ముందు 2017లో

ఆకాశ్‌ క్షిపణి పరీక్ష సక్సెస్​
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్‌ (ఆకాశ్‌-ఎన్‌జీ) క్షిపణిని భారత్‌ సక్సెస్​ఫుల్​గా పరీక్షించింది. ఒడిశా తీరంలోని సమీకృత పరీక్ష వేదిక నుంచి జనవరి 25న ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అస్థిరంగా కదిలే చిన్నస్థాయి డ్రోన్లు వంటి వాటిని నేలకూల్చగలదు. దీన్ని ఆకాశ్‌-ఎన్‌జీ వ్యవస్థను చాలా మెరుగ్గా మోహరించడానికి వీలుగా రూపొందించారు.

ఇండియాకు ఎఫ్​ 15 ఈఎక్స్​
భారత వైమానిక దళానికి ఎఫ్‌-15ఈఎక్స్‌ బహుళ ప్రయోజన యుద్ధవిమానాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ లోహ విహంగాల తయారీ సంస్థ ‘బోయింగ్‌’ ఈ విషయాన్ని జనవరి 28న ప్రకటించింది. ఎఫ్‌-15 శ్రేణి యుద్ధవిమానాల్లో ఇది అత్యాధునికమైంది. ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లడంలోను, పనితీరులోను ఈ జెట్‌ చాలా ఉపయోగపడుతుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో, రాత్రి పగలు తేడా లేకుండా పోరాటం చేయగలదు.

క్రీడలు

కోహ్లి, పెర్రీ -మేటి క్రికెటర్లు
ఐసీసీ ట్విట్టర్లో ఈ దశాబ్ద కాలానికి సంబంధించిన అవార్డుల విజేతలను ప్రకటించింది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఈ దశాబ్దపు మేటి పురుష క్రికెటర్‌గా ఐసీసీ ప్రకటించింది. అతడిని గారీ సోబర్స్‌ అవార్డుకు ఎంపిక చేసింది. కోహ్లి ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద డెకేడ్‌’గా కూడా నిలిచాడు. మాజీ కెప్టెన్‌ ధోని ‘ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డ్‌ ఆఫ్‌ డెకేడ్‌’ను గెలుచుకున్నాడు. ఈ దశాబ్దంలో మేటి మహిళ క్రికెటర్‌ (రేచల్‌ హెహో-ఫ్లింట్‌ అవార్డు)గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీకు దక్కింది. వన్టే, టీ20ల్లోనూ ఉత్తమ క్రికెటర్‌ అవార్డును పెర్రీనే గెలుచుకుంది.

హైదరాబాద్​ కోచ్​గా అనిరుధ్​
హైదరాబాద్​ మాజీ కెప్టెన్​ అనిరుధ్​ సింగ్​ను కోచ్​గా ప్రకటించిన హెచ్​సీఏ, రెండు రోజుల తర్వాత సహాయ కోచ్​గా ఉన్న జాకీర్​ హుస్సేన్​కు, మళ్లీ అతనికి కాదని డిసెంబర్​ 28న అనిరుధ్​ సింగ్​కే బాధ్యతలు అప్పగించింది. గతంలో హైదరాబాద్​ అండర్​–16, అండర్​–23 జట్లకు అనిరుధ్​ శిక్షకుడిగా వ్యవహరించి మంచి ఫలితం తీసుకొచ్చాడు.

గ్రాండ్‌మాస్టర్‌గా మెండోంకా
గోవాకు చెందిన లియోన్‌ మెండోంకా(14) భారత 67వ గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన వెర్గాని కప్‌లో మూడో నార్మ్‌ గెలుచుకున్న మెండోంకా ఈ ఘనత సాధించాడు. గోవా నుంచి గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా మెండోంకా నిలిచాడు.

క్రిస్టియానో రొనాల్డో
జాతీయ జట్టు, క్లబ్‌ల తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ఆటగాడిగా జువెంటస్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్‌) నిలిచాడు. ఉడినిస్‌ కాల్సియో క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ కొట్టిన రొనాల్డో ఈ ఘనత సాధించాడు. కెరీర్‌ మొత్తంలో 758 గోల్స్‌ కొట్టి బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే (757)ను అధిగమించాడు. మొత్తంగా బికాన్‌(805, ఆస్ట్రియా) ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నాడు.

చెస్‌ సమాఖ్య ప్రెసిడెంట్​గా సంజయ్‌
అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) అధ్యక్షుడిగా సంజయ్‌ కపూర్‌ ఎన్నికయ్యాడు. భరత్‌ సింగ్‌ చౌహాన్‌ కార్యదర్శి పదవిని నిలబెట్టుకున్నాడు.ఆన్​లైన్​ వేదికగా సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించగా యూపీ చెస్‌ సంఘం నుంచి సంజయ్‌ రెండు ఓట్ల తేడాతో వెంకట్రామ రాజాపై నెగ్గాడు. 2005 నుంచి ఏఐసీఎఫ్‌కు ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి. గత పదిహేనేళ్లుగా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా సాగింది.

టెస్ట్​ ర్యాంకింగ్స్​లో కివీస్​
న్యూజిలాండ్​ జట్టు చరిత్రలో తొలిసారి ఐసీసీ టెస్ట్​ ర్యాంకింగ్స్​లో నెంబర్​ 1 స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా కన్నా రెండు ఎక్కువ పాయింట్లతో కివీస్​(118) తొలి స్థానంలో ఉండగా, భారత్​ 114 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్​(106), దక్షిణాఫ్రికా(96) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

శ్రీహితకు వరల్డ్​ గోల్ఫ్‌ టైటిల్‌
ప్రపంచ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో తెలుగమ్మాయి శ్రీహిత విజేతగా నిలిచింది. క్లాసిక్‌ గోల్ఫ్‌ కోర్సులో ముగిసిన అండర్‌-14 బాలికల టోర్నీలో 158 పాయింట్లతో శ్రీహిత అగ్రస్థానం కైవసం చేసుకుంది. కెయా కుమార్‌ (దిల్లీ- 171) ద్వితీయ, అమీరాసింగ్‌ (దిల్లీ- 177) తృతీయ స్థానాల్లో నిలిచారు.

క్రికెట్‌లోకి శ్రీశాంత్‌ రీఎంట్రీ
స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన తొలి మ్యాచ్‌లో పుదుచ్చేరిపై 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.

బెస్ట్​ క్రికెటర్​గా ప్రణవి
ఫాల్కన్​ స్పోర్ట్స్​ క్లబ్​ నిర్వహించిన ఇండియా నిప్పాన్​ కప్​ మహిళల టీ20 క్రికెట్​ టోర్నీలో హైదరాబాద్​ అండర్​–19 కెప్టెన్​ ప్రణవి చంద్ర ఉత్తమ వర్ధమాన క్రికెటర్​ అవార్డు సొంతం చేసుకుంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్​ శాంతా రంగస్వామి ఆధ్వర్యంలో జనవరి 4 నుంచి 12 వరకు ఈ టోర్నీ బెంగళూరులో జరిగింది.

నంబర్‌వన్‌గా టీమ్‌ఇండియా
ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయాన్ని సాధించిన భారత్‌ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 430 పాయింట్లతో ఉన్న టీమ్‌ఇండియా 71.1 పాయింట్ల శాతంతో న్యూజిలాండ్‌ను (70 శాతం; 420 పాయింట్లు) వెనక్కి నెట్టింది. ఆస్ట్రేలియా (69.2; 332 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (113)ను వెనక్కి నెడుతూ భారత్‌ (117 పాయింట్లు) రెండో ర్యాంకులో నిలిచింది. న్యూజిలాండ్‌ (118) అగ్రస్థానంలో ఉంది.

టాప్‌-10లో 800 వీక్స్​
అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌(ఏటీపీ) పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో వరుసగా 800 వారాలపాటు టాప్‌-10లో నిలిచిన తొలి ప్లేయర్‌గా రఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌) రికార్డు సృష్టించాడు. మొత్తం ర్యాంకింగ్స్‌లో 9,850 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో జిమ్మీ కానర్స్‌(789 వరుస వారాలు) పేరిట రికార్డు ఉండేది. నాదల్‌ 2005 ఏప్రిల్‌లో తొలిసారిగా టాప్‌-10లో ప్రవేశించాడు. గతేడాది నవంబర్‌లో జిమ్మీ కానర్స్‌ను వెనక్కి నెట్టి రికార్డులకెక్కాడు.

రిషబ్‌ పంత్‌కు 13వ స్థానం
భారత వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 13వ ర్యాంకు సాధించాడు. విలియమ్సన్‌ 1వ, స్టీవ్‌ స్మిత్‌ 2వ, విరాట్‌ కోహ్లీని వెనక్కి నెట్టి లబుషేన్‌ మూడో స్థానానికి చేరుకున్నారు. పుజారా 7, రహానె 9వ స్థానంలో నిలిచారు. శుభ్‌మన్‌ గిల్‌ 68 నుంచి 47వ స్థానానికి చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్యాట్‌ కమిన్స్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అశ్విన్‌ (8వ), బుమ్రా (9వ) టాప్‌-10లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ 32 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు సాధించాడు.

ఫుట్‌బాల్‌-2022 హోస్ట్​​ భారత్‌
వచ్చే ఏడాది(2022)లో జరిగే మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. 2022 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఈ టోర్నీ భారత్‌లో జరుగుతుందని ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ప్రకటించింది. ఆసియా కప్‌ (2022)లో భారత్‌ సహా 12 జట్లు పోటీపడతాయి. ఎనిమిది జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంటాయి. 2023 ఫిఫా మహిళల ప్రపంచకప్‌కు ఆసియా కప్‌ అర్హత టోర్నీగా పని చేస్తుంది.

ప్రతి నెలా ఐసీసీ అవార్డులు
క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ఏటా ప్రకటించే అవార్డులను ఇకపై ప్రతి నెలా ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. కొత్తగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డులను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో అభిమానులతో పాటు ఐసీసీ ఓటింగ్‌ అకాడమీ సభ్యులు ఓటింగ్‌ ద్వారా విజేతలను ఎన్నుకుంటారు.

అంపైర్‌ బ్రూస్‌ వీడ్కోలు
క్రికెట్‌లో అంపైర్‌గా 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు బ్రూస్‌ ఆక్సెన్‌ఫర్డ్‌ (ఆస్ట్రేలియా) వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్​లో ఇక అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించనని ఆయన ప్రకటించాడు. 2012 నుంచి ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ అంపైర్ల జాబితాలో బ్రూస్‌ కొనసాగుతున్నారు. ఆయన 62 టెస్టుల్లో, 97 వన్డేల్లో, 20 టీ20ల్లో అంపైర్‌గా వ్యవహరించారు. చివరగా ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా ఆడిన ఆఖరి టెస్టులో అంపైర్‌గా చేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!