Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ ఎఫైర్స్ ఇండియా (మార్చి 2020)

కరెంట్ ఎఫైర్స్ ఇండియా (మార్చి 2020)

Current Affairs India National issues

నేషనల్

కోవిడ్‌–19పై కమిటీ

కోవిడ్‌–19ను సమర్థవంతంగా అడ్డుకోవడంలో భాగంగా కావాల్సిన సూచనల కోసం కేంద్రప్రభుత్వం 21 మంది ప్రముఖులతో కూడిన కమిటీకి ఛైర్మన్‌గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ నియమితులయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఛైర్మన్ బలరాం భార్గవ, ఇతర సభ్యులుగా రణదీప్ గులేరియా(ఎయిమ్స్ డైరెక్టర్, ఢిల్లీ), సుజీత్ సింగ్(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్, ఢిల్లీ), సంజయ్ పుజారి(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్, ఢిల్లీ), రాజన్ కోబ్రగడే(కేరళ చీఫ్ సెక్రటరీ) ఉన్నారు.

జనతా కర్ఫ్యూ

కోవిడ్–19పై పోరుకు సిద్ధంగా ప్రధాని మోడీ మార్చి 22న దేశమంతటా జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటలపాటు ఇంట్లోనే ఉండాలని కోరారు. ఈ కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5గంటలకు కోవిడ్–19 నిర్మూలన కోసం కృషి చేస్తున్న డాక్టర్లను అభినందిస్తూ చప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు.

లాక్‌ డౌన్

కోవిడ్–19 ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతా మార్చి 25 నుంచి 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతూ, నిత్యావసర సరుకుల కోసం 3 కిలోమీటర్ల పరిధిలో సంచరించేలా నిబంధ తీసుకొచ్చారు. రాత్రి 7 తర్వాత వైద్యపరమైన అవసరాలకు మినహా బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు.

కర్ఫ్యూలో రేషన్

కేంద్రం కోవిడ్–19 నిర్మూలనలో భాగంగా విధించిన కర్ఫ్యూలో రాష్ట్రాలకు 90రోజులకు సరిపడా రేషన్‌ను రుణ ప్రాతిపదికన అందించగా రాష్ట్రాలు ప్రత్యేక విధానాలను అమలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ నెల సరుకులను ఉచితంగా అందించగా, తెలంగాణ ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం అందిస్తూ కుటుంబానికి నిత్యావసర వస్తువుల కోసం ఒక్కో కుటుంబానికి రూ.1500 అందిస్తామని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ రేషన్‌ను ఉచితంగా మార్చి 29నే అందించి కుటుంబానికి రూ.1000 ఆర్థిక సాయాన్ని ఏప్రిల్ 4న అందజేస్తామని ప్రకటించింది.

సార్క్ దేశాల నిధి

కోవిడ్–19ను అడ్డుకోవడంలో భాగంగా సార్క్ దేశాలు అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలన్న మోడీ పిలుపు మేరకు ఇండియా 1 బిలియన్ డాలర్లు అందించగా నేపాల్(1 మిలియన్ డాలర్లు), మాల్దీవులు, భూటాన్‌లు(2లక్షల డాలర్ల చొప్పున), శ్రీలంక (5మిలియన్ డాలర్లు), అప్గనిస్థాన్(1.2 మిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్‌లు 1.5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఆర్‌‌బీఐ వార్‌‌రూమ్

ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక పరిస్థితిపై సమీక్షించేందుకు వార్‌‌రూమ్‌ను ఏర్పాటు చేసిన తొలి సెంట్రల్‌ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిలిచింది. బిజినెస్ కంటిజెన్సీ ప్లాన్(బీసీపీ)లో భాగంగా స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం, రియల్‌టైం గ్రాస్ సెటిల్‌మెంట్, నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్‌‌ లాంటి వ్యవస్థలలో అంతరాయం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై చర్చించారు.

తెలుగు మీడియం పాఠశాలలపై జీవో

2020–21 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రవేశపెట్టబోతున్న దృష్ట్యా ప్రతి మండలానికో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేసి ప్రయాణ ఖర్చులను సైతం విద్యార్థులకు ప్రభుత్వమే అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా పేర్కొంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలతోపాటు ఒరియా, తమిళం, కన్నడ, ఉర్దూ మీడియంలో కూడా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్‌

మధ్యప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేయడంతో మైనారిటీ ప్రభుత్వం నడుపుతున్న కమల్‌నాథ్ మార్చి 20న బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. 230 మంది సభ్యులున్న సభలో 22 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదించడంతో 107 మంది సభ్యులున్న బీజేపీ తరఫున శివరాజ్ సింగ్ చౌహన్ మార్చి 23న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి  ఎన్నికయ్యారు. బాబులాల్ గౌర్ రాజీనామాతో 2005 నవంబర్ 29న పదవిలోకి వచ్చిన చౌహన్ 2018 డిసెంబర్ 17వరకు కొనసాగారు. 2020 మార్చి 23న తిరిగి ఎన్నికైన చౌహన్ మార్చి 24న కాంగ్రెస్ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటింగ్ ద్వారా బలపరీక్షలో నెగ్గారు.

‘నమస్తే ట్రంప్’ ప్రైవేట్

అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం(మొతేరా స్టేడియం)లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని దానిని ‘నాగరిక్ అభినందన్ సమితి’ అనే సంస్థ నిర్వహించిందని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శంతన్‌సేన్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటు సమాధానమిచ్చింది. ఈ సమితికి అధ్యక్షుడిగా అహ్మదాబాద్ మేయర్ బిజల్ బెన్ పటేల్ ఉన్నారు.

రైల్వే భూముల్లో సోలార్

రైల్వేశాఖకు సంబంధించింది నిరుపయోగ/ఖాళీ స్థలాలలో 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా హర్యానాలోని దివానాలో 2 మెగావాట్లు, మధ్యప్రదేశ్‌లోని బినాలో 1.7 మెగావాట్లు సామర్థ్యం గల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి ఈ ఏడాది జూన్ వరకు పూర్తికానున్నాయి.

బీఎస్‌–6 ఇంధనం

దేశంలో భారత్ స్టేజ్(బీఎస్)–6 ఇంధనాన్ని సరఫరా చేస్తున్న తొలి కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిలిచింది. దేశంలో తన ఆధీనంలో ఉన్న 28 వేల పెట్రోల్ బంకులలో బీఎస్–6 ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ ఇంధనం ద్వారా తక్కువ మోతాదులో సల్ఫర్ ఉద్గారాలు వెలువడుతాయి.

ప్రాజెక్ట్ ఐజాక్

కరోనా వ్యాధి విస్తరణ సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులను సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐఐటీ అహ్మదాబాద్ ‘ప్రాజెక్టు ఐజాక్’ కార్యక్రమాన్ని చేపట్టింది. 1665లో ఇంగ్లాండ్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఐజాక్ న్యూటన్ సెలవులను పరిశోధనల కోసం వాడుకుని ఎన్నో ఆవిష్కరణలు చేశారు. విద్యార్థుల సైతం సెలవులను వ్యూహాత్మకంగా సమర్థవంతంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

టేజర్ గన్స్

అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రిటన్ వంటి అభివృద్ధి దేశాల మెట్రోపాలిటన్ నగరాలలో వాడే టేజర్ గన్స్‌ను ప్రవేశపెట్టిన తొలి భారత రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. సాధారణ తుపాకులతో మరణాలు, గాయాలు సంభవిస్తున్నందున వాటి స్థానంలో టేజర్ గన్స్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో నైట్రోజన్ ఉండి ట్రిగ్గర్ నొక్కగానే అగ్ని లాంటిది ఏర్పడి శరీరానికి షాక్ తగిలి సమూహాలు చెల్లాచెదురు కావడానికి అవకాశం ఉంటుంది.

భారజల కేంద్రం షట్‌డౌన్

అణువిద్యుత్ ఉత్పత్తిలో వెలువడే ఉష్ణాన్ని స్థిరీకరించడంలో వాడే భారజలాన్ని ఉత్పత్తి చేసే కేంద్రాలలో ఒకటైన మణుగూరు భారజల కేంద్రాన్ని మార్చి 23న షట్‌డౌన్ చేశారు. 1982లో ఉమ్మడి ఖమ్మంలో ప్రారంభించిన ఈ భారజల కేంద్రం 2019 మే నెలలో తొలిసారిగా నీటికొరతతో షట్‌డౌన్‌ కాగా ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా షట్‌డౌన్ చేశారు.

రైజ్ సదస్సు వాయిదా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తొలిసారిగా ఇండియాలో నిర్వహించాల్సిన జరగాల్సిన రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్‌‌మెంట్(రైజ్) సదస్సు కోవిడ్–19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాయిదాపడింది. ఏప్రిల్ 11, 12 తేదీలలో ముంబయిలో జరగాల్సిన సదస్సు అక్టోబర్ 5, 6 తేదీలలో నిర్వహించనున్నారు.

టెక్ ఫర్ ట్రైబ్స్

గిరిజనులలో టెక్నాలజీ గురించి అవగాహన కల్పించేందుకు, తగిన శిక్షణ ఇచ్చేందుకు ‘టెక్ ఫర్ ట్రైబ్స్’ పేరుతో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ట్రైఫెడ్) కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐఎం ఇండోర్, కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 30 రోజుల శిక్షణ కార్యక్రమంలో 120 సెషన్లు నిర్వహించి 3లక్షల మందికి లబ్ది చేకూరుస్తారు.

రైతు ఆత్మహత్యలపై నివేదిక

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం 2014–18 కాలంలో దేశంలో 31,645 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 99.5శాతం రైతులు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 12,813 మంది రైతులు అత్మహత్యలు చేసుకోగా, కర్ణాటకలో 4,634మందితో రెండో స్థానం, తెలంగాణలో 1655 మందితో మూడో స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల పరంగా ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది.

యురేనియం అన్వేషణ

నాగార్జునసాగర్ అభయారణ్యం పరిధిలోని నిడిగల్లులో 83 చదరపు కిలోమీటర్లు, అచ్చంపేటలో 38 చదరపు కిలోమీటర్లతో కలిపి మొత్తం 8,300 హెక్టార్ల పరిధిలో యురేనియం అన్వేషణ జరగనుందని దీనికోసం అనుమతి పత్రం హైదరాబాద్‌ కేంద్రంగా గల డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ పరిశీలనలో ఉందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

హ్యాపీ అవర్స్

ఆటోరిక్షా కార్మికులు, ప్రజలకు ఉపయుక్తంగా ఉండేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రాం ‘హ్యాపీ అవర్స్’. రద్దీలేని టైమ్ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఆటోరిక్షాలో ప్రయాణించేవారికి బిల్లులో 15శాతం రాయితీ లభిస్తుంది. 1.5 కిలోమీటర్ల వరకు కనీస బిల్లులో మార్పు లేకుండా తర్వాత నమోదయ్యే బిల్లులో 15శాతం రాయితీ లభిస్తుంది.

నమస్తే ఓవర్ హ్యాండ్ షేక్

కోవిడ్–19(కరోనా) వైరస్‌ను అరికట్టడంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమమే ‘నమస్తే ఓవర్ హ్యాండ్ షేక్’. ఇతరులను చేతులతో తాకినప్పుడు ఆ వైరస్ సంక్రమించే అవకాశలున్నందున షేక్ హ్యాండ్ కన్నా నమస్కారం శ్రేయస్కరం, ఆరోగ్యదాయకం అని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రచారం చేస్తున్నారు.

లేహ్‌లో 2020 యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు 2020 ఏడాదికి ‘లేహ్‌’ ఎంపికైంది. లఢక్‌లోని లేహ్‌లో జరగనున్న ఈ ఉత్సవాలలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలను కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి(ఫిక్కీ), ది సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌‌టీ)లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు.

యంగ్‌ గ్లోబల్ లీడర్స్

ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 2020 ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 115 మందితో యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితా రూపొందించింది. 52 దేశాల నుంచి ‘ఛేంజ్ మేకర్స్’ పేరుతో రూపొందించిన ఈ జాబితాలో ఐదుగురు ఇండియన్స్‌కి చోటు లభించింది. వీరిలో వినతి ముట్రేజా (వినతి ఆర్గానిక్స్ ఎండీ), తారాసింగ్ (ఆంతారా సీనియర్ లివింగ్ సీఈవో), రవీంద్రన్(బైజుస్ సీఈవో), గౌరవ్ గుప్తా (జొమాటో సహ వ్యవస్థాపకుడు), స్వపన్ మెహ్ర(లోరా ఎకలాజికల్ సొల్యూషన్స్, సీఈవో)లు ఉన్నారు.

1075 టోల్ ఫ్రీ నంబర్

కరోనాపై సేవల కోసం, సందేహాల నివృత్తి కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 24/7 పనిచేసే 1075 టోల్ ఫ్రీ నంబర్‌‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌‌తోపాటు ఇది కొనసాగనుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 1800 118797 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది.

మహదేశ్ ప్రసాద్

మహమ్మారిగా గుర్తించిన కోవిడ్ -19 కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంపై పరిశోధనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన యూరోపియన్ టాస్క్‌ఫోర్స్‌ బృందంలో సభ్యుడిగా కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన యువశాస్త్రవేత్త మహదేశ్ ప్రసాద్ ఎంపికయ్యారు. ఈ బృందంలో ఎంపికైన ఏకైక భారతీయ శాస్త్రవేత్త ఈయన ఒక్కరే. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి యూరోపియన్ యూనియన్ టాస్క్‌ఫోర్స్10 పరిశోధన బృందాలను ఏర్పాటు చేసింది.

మనోహర్ పారికర్‌‌పై పుస్తకం

దివంగత గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణశాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంపై ‘An extrodinary life; a biography of manohar parikar పేరుతో పుస్తకం వెలువరించారు. దీనిని సద్గురు పాటిల్, మాయాభూషణ్ నాగ్‌వెంకర్ సంయుక్తంగా రూపొందించారు.

రాజ్యసభకు గొగొయ్

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రంజన్ గొగొయ్ రాజ్యసభకు ఎంపికయ్యారు. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యసభకు ఎన్నికవడం ఇది రెండోసారి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా(1998–2004) తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన సీజేఐగా నిలిచారు. వీరికంటే ముందు సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించిన బహరుల్ ఇస్లాం రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఔరంగబాద్ ఎయిర్‌‌పోర్ట్ పేరు మార్పు

ఔరంగబాద్ ఎయిర్‌‌పోర్ట్ పేరును ఛత్రపతి శంభాజీ ఎయిర్‌‌పోర్టుగా మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును నానా(జగన్నాథ్) శంకర్‌‌సేథ్ రైల్వేస్టేషన్‌గా మార్చింది. ప్రముఖ విద్యావేత్త శంకర్‌‌సేథ్ జంషెడ్‌జీ జీజీబాయితో కలిసి దేశంలో రైల్వే అసోసియేషన్‌ను ప్రారంభించారు.  మార్చి 16న హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని అమీన్‌పూర్ గ్రామం పేరును అభిమన్యుపురంగా మార్చుతూ కేంద్రం ఆమోదించింది.

రోడ్డు ప్రమాదాలపై నివేదిక

1988 మోటారు వాహనాల చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన 2019 చట్టం తర్వాత 100శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లుగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా 24శాతం ప్రమాదాలు తగ్గాయి. జమ్మూ కాశ్మీర్, ఛండీగఢ్‌లో 15శాతం, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 13, ఆంధ్రప్రదేశ్‌లో 7, మణిపూర్‌‌లో 4, కేరళ, అసోంలో 4.9శాతం ప్రమాదాలు తగ్గాయి.

ఉత్తరన్ పథకం

క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా అసోం ప్రభుత్వం ‘ఉత్తరన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా రూ.300 కోట్ల వ్యయంతో 33 క్రీడా స్టేడియాలు, 500 క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి గ్రామీణుల క్రీడా నైపుణ్యాలను వెలికితీస్తారు. దీంతోపాటు 1000 మంది ప్రతిభ గల క్రీడాకారులకు రూ.50 వేలు, 2500 క్లబ్‌లకు రూ.75వేల ఆర్థికసాయం అందిస్తారు.

రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర

2019–20 రంజీ క్రికెట్ టోర్నీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు నిలచింది.  డ్రా గా ముగిసిన ఫైనల్లో బెంగాల్‌తో తలపడిన సౌరాష్ట్ర 44 పరుగుల ఆధిక్యంతో విజేతగా నిలిచింది. గతంలో సౌరాష్ట్రను నవనగర్, వెస్టర్న్ ఇండియాగా పిలిచేవారు. నవనగర్ పేరుతో 1936–37లో, వెస్టర్న్ ఇండియా పేరుతో 1943–44లో విజేతగా నిలిచినప్పటికీ సౌరాష్ట్ర పేరుతో గెలవడం ఇదే తొలిసారి.

అంబేడ్కర్ ఇల్లు మ్యూజియం

బ్రిటన్‌లోని లండన్‌లో నివసించిన భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ ఇంటిని మ్యూజియంగా కొనసాగించడానికి మార్చి 13న బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. అంబేద్కర్ 1921 నుంచి 1922 వరకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదివేటప్పుడు ఈ ఇంటిలోనే నివాసం ఉన్నారు. మొదట ప్లానింగ్ రూల్స్‌ను బ్రేక్ చేసిందంటూ బ్రిటన్ ప్రభుత్వం మూసివేయాలనుకుంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా అప్పీలు చేయడంతో బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 కర్ణాటకకు ఫస్ట్ ప్లేస్

మార్చి 10న కేంద్ర నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి నివేదికలో కర్ణాటక రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. జలవిద్యుత్, జీవ ఇంధనాలు, సోలార్, విండ్ విద్యుత్‌ను కలిపి సంప్రదాయేతర ఇంధన వనరులుగా గుర్తిస్తారు. ఇందులో తెలంగాణ 8వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది.

శక్తివంతమైన మహిళల జాబితా

ప్రముఖ మ్యాగజైన్ టైమ్ గడిచిన 100 ఏళ్లలో శక్తివంతమైన మహిళల జాబితా రూపొందించగా ఇండియా నుంచి 1947 ఏడాదికి రాజ్‌కుమారి అమృత్ కౌర్, 1976కు ఇందిరాగాంధీ ఎంపికయ్యారు. పంజాబ్‌లోని కపుర్తాలా రాజకుటుంబానికి చెందిన రాజ్‌కుమారి కేంద్రమంత్రివర్గంలో తొలి మహిళా మంత్రిగా వ్యవహరించారు. వీరితోపాటు ఈ నివేదికలో మిచెల్లి ఒబామా, హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో, చైనా ఫార్మసిస్ట్ యూయో, డిజైనర్ కోకోచాపల్, జపాన్ మహిళ సడాకో ఒగాటో ఉన్నారు.

యస్ బ్యాంక్ సంక్షోభం

ఆర్థికవ్యవస్థ అదుపుతప్పి సంక్షోభంలోకి వెళ్లడంతో యస్ బ్యాంక్‌పై కేంద్రం మారిటోరియం విధించింది. ఏప్రిల్ 3వరకు రోజుకు రూ.50వేల వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో 49శాతం వాటా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రూ.10 విలువ గల 245కోట్ల షేర్లను ఎస్‌బీఐ రూ.2450 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాబోయే నాలుగేళ్లలో యస్ బ్యాంక్ పునర్నిర్మాణానికి రూ.10వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.

నమస్తే ఓర్చా

మధ్యప్రదేశ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి ఆ రాష్ట్ర టూరిజం బోర్డు ‘నమస్తే ఓర్చా’ పేరుతో 3 రోజుల పండుగను మార్చి 6 నుంచి 8 వరకు ఓర్చా నగరంలో నిర్వహించింది. ఓర్చా ప్రజల ఆర్థిక పురోగతికి సహాయపడే వారసత్వం, సంస్కృతి,  ప్రణాళికలను పరిరక్షించాలనే దృష్టితో దీనిని కేంద్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖలు నిర్వహించాయి. ఓర్చాలోని పురాతన రామ్‌రాజా ఆలయాన్ని  సోమనాథ్ ఆలయం, తిరుమల తిరుపతి, గోల్డెన్ టెంపుల్ తరహాలో ప్రధాన తీర్థయాత్ర, పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. 2017-18 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా ఓర్చాకు జాతీయ అవార్డు గెల్చుకుంది.

ఆహ్వానం తిరస్కరణ

మణిపూర్‌‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి 8 ఏళ్ల లిసిప్రియ కాంగుజంను ‘షి ఇన్‌స్పైర్ అజ్‌(ఆమె మమ్మల్ని ప్రభావితం చేసింది)’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపగా ఆమె తిరస్కరించి వార్తల్లో నిలిచారు. వాతావరణ మార్పు చట్టం కోసం ప్రచారం చేసిన ఆమె సాధించిన విజయాలు నకిలీవని ఆరోపణలు వచ్చాయి. 2019లో ఇండియా పీస్ ప్రైజ్, ఏపీజే అబ్దుల్ కలాం చిల్డ్రన్ అవార్డు, రైజింగ్ స్టార్ ఆఫ్ ఎర్త్ డే నెట్‌వర్క్ వంటి పురస్కారాలు అందుకున్నారు.

రంజన్ దేశాయ్ కమిటీ

జమ్మూ కాశ్మీర్, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్‌లలోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పెంపునకు గల అవకాశాలను సూచించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి రంజన్‌ప్రకాశ్ దేశాయ్ నేతృత్వం వహించనున్నారు. ఇది ఒక సంవత్సరం పాటు పనిచేయనుంది. ఇందులో కేంద్ర ఎన్నికల కమిషనర్, సంబంధిత రాష్ట్రాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఇద్దరు సభ్యులుగా ఉండనున్నారు. డీలిమిటేషన్ యాక్ట్ – 2002 నిబంధనల ప్రకారం డీలిమిట్ చేయనున్నారు.

జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ

జమ్మూ కాశ్మీర్ మాజీ ఆర్థికమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత సయ్యద్ అల్తాఫ్ బుఖారీ మార్చి 8న అధికారికంగా ‘జమ్మూ కాశ్మీర్ అప్ని పార్టీ(జేకేఏపీ)ని ప్రారంభించారు. గతంలో ఈయన అమిరాకాదల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా వ్యవహరించారు. ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో ఇదే మొదటి రాజకీయ కార్యకలాపాం కావడం విశేషం.

నారీ శక్తి పురస్కారాలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘నారీ శక్తి పురస్కారాలు’ మార్చి 8న న్యూఢిల్లీలో 15మందికి ప్రదానం చేశారు. క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధించిన 103 ఏళ్ల మన్‌ కౌర్‌, ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి,  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా ఫైటర్‌ పైలట్స్‌ మోహన సింగ్, అవని చతుర్వేది, భావన కాంత్‌, బీహార్‌కు చెందిన (మశ్రూమ్‌ మహిళ) బినా దేవి, అరిఫ్‌ జాన్‌, చామి ముర్ము, నిల్జా వాంగ్మో, రష్మీ ఉర్దువర్దేశి, కళావతి దేవి, కౌషికి చక్రవర్తి, భగీరథి అమ్మ, కార్తియాని అమ్మ, తాషి, నుంగ్షీ (కవలలు) పురస్కారాలు అందుకున్నారు.

పోషణ్ అభియాన్ ర్యాంకింగ్స్

నేషనల్ హెల్త్ మిషన్‌ను పునర్‌‌వ్యవస్థీకరిస్తూ 2018 మార్చి 8న ప్రారంభించిన పోషణ్(ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్‌‌రీచింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నరిష్‌మెంట్) అభియాన్ పథకం అమలుకు సంబంధించిన రాష్ట్రాల ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. 19 పెద్ద రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. చత్తీస్‌గఢ్ సెకండ్, మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేసులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ 15, కేరళ 19వ స్థానంలో ఉన్నాయి. 8 చిన్న రాష్ట్రాలలో మిజోరాం, సిక్కిం, నాగాలాండ్‌లు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. 7 కేంద్రపాలిత ప్రాంతాలలో దాద్రానగర్ హవేలి, చండీగఢ్, డయ్యూడామన్ తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. లక్షద్వీప్ చివరిస్థానంలో ఉంది.

క్రికెట్‌కు జాఫర్ గుడ్ బై

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌‌కు రిటర్మైంట్ ప్రకటించాడు. 1996–97లో ఫస్ట్ క్లాస్ ఆరంగ్రేటం చేసిన జాఫర్ రంజీ ట్రోఫీ చరిత్రలో 12వేల పరుగుల మైలురాయిని చేరిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇండియా తరఫున 31 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5 సెంచరీలు సాధించాడు.

ఎకో సెన్సిటివ్ జోన్‌గా  చంబల్‌

మధ్యప్రదేశ్‌లో 870 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చంబల్ సాంక్ష్యుయరీని పర్యావరణ సున్నిత మండలి(ఎకో సెన్సిటీవ్ జోన్‌)గా కేంద్రం ప్రకటించింది. దీంతో చంబల్ చుట్టు పక్కల ప్రాంతంలో పరిశ్రమలు, జల విద్యుత్ కేంద్రాలు, క్రషర్స్‌, భారీ నిర్మాణాలు, గనుల తవ్వకాల లాంటివి నిషేదిస్తారు. 75శాతం మంచి నీటి డాల్ఫిన్లు, 9 రకాల జాతుల తాబేళ్లు, 180 రకాల వలస పక్షులు ఈ సాంక్ష్యుయరీలో ఉన్నాయి.

HAMSAFAR మొబైల్ యాప్‌

మార్చి 3న కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్​ కుమార్ గాంగ్వార్ HAMSAFAR యాప్‌ను ప్రవేశపెట్టారు.  దీంతో పరిశ్రమలు, హోటళ్లు, గృహ నిర్మాణ కాంప్లెక్స్‌లు, ఇతర స్థలాలకు ఎక్కువ స్థాయిలో డీజిల్ అవసరమైనప్పుడు ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు.

ఇంక్రిడెబుల్ ఇండియా పోర్టల్‌

భారత టూరిజం వివరాలను అందించడానికి ప్రవేశపెట్టిన వెబ్‌పోర్టల్. గతంలో ఆంగ్లం, హిందీ భాషలో సమాచారం అందేది. ప్రస్తుతం  చైనీస్, అరబిక్, స్పానిష్, భాషలలో  సమాచారం అందించేలా డెవెలప్ చేశారు.

సు పోషిత్ మా అభియాన్

మార్చి 1న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  రాజస్థాన్‌లోని తన సొంత నియోజకవర్గం కోటలో ‘సుపోషిత్ మా అభియాన్ ’పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా కౌమర దశ బాలికలు, గర్బిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించనున్నారు. తొలి దశలో 1000 మంది గర్భిణులకు సరిపడా 17 కిలోల బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ను ప్రతి నెల వెయ్యి మంది మహిళలకు పౌష్టికాహారం కిట్లను అందిస్తారు.

పూసా కృషి విజ్ఞాన్ మేళా

పూసా కృషి విజ్ఞాన్ మేళా 2020’   న్యూఢిల్లీలో మార్చి 1 నుంచి 3 వరకు జరిగింది. ఈ సందర్భంగా  వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరానికి చెందిన ఆదర్శరైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) ‘సృజనాత్మక రైతు’ అవార్డును కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి చేతుల మీదుగా అందుకున్నారు. వినూత్న పద్దతుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ

డిల్లీ ఐఐటీ కరోనా పరీక్ష

శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్–19ను గుర్తించడంలో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ విద్యార్థులు ‘ప్రోబ్ – ప్రి డిటెక్షన్ అస్సే’ అనే విధానాన్ని రూపొందించారు. ఈ విధానం ప్రస్తుతం ఫుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశీలనలో ఉంది.

తొలి కరోనా హాస్పిటల్

దేశంలో కోవిడ్–19ను అరికట్టడంలో భాగంగా తొలి ప్రత్యేక హాస్పిటల్ ముంబయిలో ఏర్పాటైంది. సర్‌‌ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబయిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్లు, నర్సులకు ఒకరి నుంచి ఒకరికి సోకకుండా నెగెటివ్ ప్రెజర్ రూమ్ సౌకర్యాన్ని కల్పించారు. అత్యాధునిక వెంటిలేటర్, ఐసోలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

బ్రేక్ త్రూ చైన్

ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తున్న కోవిడ్–19ను అరికట్టడంలో భాగంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ‘బ్రేక్ త్రూ చైన్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఐసోలేషన్ పాటించడం, లాక్ డౌన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

కరోనా సహాయక విభాగాలు

కరోనాపై సలహాలు, సూచనల కోసం 104 టోల్ ఫ్రీ నంబర్‌‌తో పాటు కేంద్రం 1075 టోల్ ఫ్రీ నంబర్‌‌ను కొత్తగా ప్రకటించింది. దీంతో పాటు MyGov.corona హెల్ప్‌డెస్క్‌ను, ncovid2019@gmail.com అనే మెయిల్ సౌకర్యాన్ని సమాచార మార్పిడి కోసం ఏర్పాటు చేసింది.

డూ ద ఫైవ్

కోవిడ్‌–19ను అరికట్టడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పాటించాల్సిన 5 కార్యక్రమాలను వివరిస్తూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’ డూ ద ఫైవ్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవడం, ముఖాన్ని చేతులతో తాకకుండా ఉండడం, ఒక్కొక్క వ్యక్తి మధ్య 3 అడుగుల దూరం ఉండే విధంగా చూడడం, ఇంటికే పరిమితం కావడం వంటి 5 అంశాలను దీని ద్వారా ప్రచారం చేస్తోంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!