Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ అఫైర్స్‌ డిసెంబర్​ 2021​

కరెంట్ అఫైర్స్‌ డిసెంబర్​ 2021​

ఇంటర్నేషనల్​

రిపబ్లిక్​ కంట్రీగా బార్బడోస్‌
కరేబియన్‌ ద్వీప దేశం బార్బడోస్‌ నవంబర్‌ 30న గణతంత్ర దేశం(రిపబ్లిక్‌)గా అవతరించింది. వలస పాలన ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్‌ రాణి ఎలిజెబెత్‌–2ని తొలగించింది.

Advertisement

ఖరీదైన నగరంగా టెల్ అవీవ్
ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయు) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో టెల్ అవీవ్ అగ్రస్థానంలో నిలిచింది.

స్వీడన్‌ ప్రధానిగా మాగ్దలేనా అండర్సన్‌
స్వీడన్‌ ప్రధానిగా మాగ్దలేనా అండర్సన్‌ ఎన్నికయ్యారు. దేశ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె గంటల వ్యవధిలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.349 సీట్లున్న చట్టసభలో మరోసారి ఎన్నిక నిర్వహించగా సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలైన మాగ్దలేనాకు మెజార్టీ ఓట్లు వచ్చాయి.

హోండూరస్‌ అధ్యక్షురాలిగా షియోమరా
సెంట్రల్‌ అమెరికా దేశమైన హోండూరస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష లిబర్టీ అండ్‌ రీఫౌండేషన్‌ పార్టీ విజయం సాధించింది. నూతన అధ్యక్షురాలిగా 62 ఏళ్ల షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు.

Advertisement

భారత్​కే అత్యధిక రెమిటెన్సులు
విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడం(రెమిటెన్సులు)లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. 2021 ఏడాదిలో రెమిటెన్సుల రూపంలో భారత్‌కు రానున్న మొత్తం 87 బిలియన్‌ డాలర్లని (2020లో ఈ విలువ 83 బిలియన్‌ డాలర్లు) ప్రపంచబ్యాంక్‌ నివేదిక పేర్కొంది. భారత్‌ తర్వాత వరుసగా చైనా, మెక్సికో, ఫిలిప్పైన్స్, ఈజిప్టు ఉన్నాయి.

జర్మనీ కొత్త చాన్సెలర్‌గా ఒలాఫ్‌ షోల్జ్‌
జర్మనీ నూతన చాన్సెలర్‌గా సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ నేత ఒలాఫ్‌ షోల్జ్‌ ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రోగ్రెసివ్‌ కూటమి నేతగా ఒలాఫ్‌ షోల్జ్‌ను ఎన్నుకున్నారు. దీంతో నూతన చాన్సెలర్‌గా షోల్జ్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది.16 ఏళ్లపాటు ప్రభుత్వాధినేతగా కొనసాగి చరిత్ర సృష్టించిన ఎంజెలా మెర్కెల్‌ ఐదో దఫా చాన్సెలర్‌ ఎన్నికల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు.

ఆంగ్‌ సాన్‌ సూచీకి నాలుగేళ్ల జైలు
దేశం కోసం పదిహేనేళ్లు సైనిక నిర్బంధంలోనే గడిపిన మయన్మార్‌ సీనియర్‌ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూచీ ఆ దేశ సైనిక ప్రభుత్వం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సైన్యం అధీనంలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఆమెపై ఎన్నికల్లో అవకతవకలు, దేశద్రోహం, అవినీతి కార్యకలాపాలు తదితర 11 అభియోగాలను సైన్యం మోపింది.

Advertisement

చైనా నుంచి లావోస్‌కు రైలు
చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో భాగంగా చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌ నుంచి లావోస్‌ రాజధాని వియంటియాన్‌కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్‌ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు.

అంతరిక్ష యాత్రకు జపాన్​ బిలియనీర్​
జపాన్‌ బిలియనీర్, ఫ్యాషన్‌ బిజినెస్​మెన్​ యుసాకు మెజావా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు పయనమయ్యారు. సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన యుసాకుతో పాటు ప్రముఖ నిర్మాత యోజో హిరానో ఉన్నారు. యుసాకు యాత్రను హిరానో డాక్యమెంటరీగా చిత్రీకరించనున్నారు.
నాసా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్​
విశ్వరహస్యాలను ఇప్పటివరకు అందిస్తున్న హబుల్‌ టెలిస్కోప్​కు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు ప్రయోగం 2021, డిసెంబర్‌ 22న జరగనుంది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడా స్పేస్‌ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది.

ఐఎంవో కౌన్సిల్‌కు భారత్​
అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంవో) కౌన్సిల్‌కు భారత్‌ తిరిగి ఎన్నికైంది. 2022 నుంచి 23 వరకు రెండేళ్లపాటు ఈ సభ్యత్వం కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ది నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Advertisement

ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. మౌమెరె పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర గర్భంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. సెలేయార్‌ ద్వీపంలో ఉన్న స్కూల్‌ స్వల్పంగా దెబ్బతింది.

‘తబ్లిగీ జమాత్‌’పై నిషేధం
తబ్లిగీ జమాత్‌ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. తబ్లిగీ జమాత్‌తో ప్రజలకు, సమాజానికి ప్రమాదం పొంచి ఉంది. ఉగ్రవాదానికి తబ్లిగీ ఒక మార్గం. ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది.

అమెరికాలో టోర్నడో
అమెరికాలో అకాల టోర్నడో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఈ టోర్నడో తీవ్రత, విస్తృతి వాతావరణ శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ టోర్నడో నేలపై కొనసాగిందని అంచనా. అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

Advertisement

చిలీ అధ్యక్షుడిగా బోరిక్‌
చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియెల్‌ బోరిక్‌ ఘన విజయం సాధించారు. బోరిక్‌ రికార్డు స్థాయిలో 56% ఓట్లు గెలుచుకున్నారు. దేశ పాలనపగ్గాలు చేపట్టిన ఆధునిక ప్రపంచ యువ నేతల్లో ఒకరిగా, అత్యంత పిన్న వయస్కుడైన చిలీ అధ్యక్షుడిగా బోరిక్‌ నిలిచారు.

దుర్గా పూజలకు యునెస్కో గుర్తింపు
మావనజాతి ‘వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో కోల్‌కతా దుర్గా పూజలకు స్థానం లభించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రకటించింది. ‘వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో కోల్‌కతా దుర్గా పూజలను చేర్చామని యునెస్కో ట్వీట్‌ చేసింది.

కొత్త రాయబారిగా ప్రదీప్‌ రావత్‌
చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్‌కుమార్‌ రావత్‌ను నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. విక్రమ్‌ మిస్రీ నుంచి ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ప్రదీప్‌కు చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌ రాయబారిగా ఉన్నారు.

Advertisement

భారత్‌–సెంట్రల్‌ ఆసియా సమ్మిట్​
మూడో భారత్‌–సెంట్రల్‌ ఆసియా సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో భారత్‌ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అఫ్గనిస్తాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, వారికి సాయం చేయాలని తీర్మానించారు.

నేషనల్​

రికార్డ్​ జీఎస్‌టీ వసూళ్లు
జీఎస్‌టీ వసూళ్లు వరుసగా 5వ నెల రూ.లక్ష కోట్లను, వరుసగా రెండో నెల రూ.1.30 లక్షల కోట్లను దాటాయి. నవంబరులో రూ.1,31,526 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఇది గత ఏడాది నవంబరుతో పోలిస్తే 25.30% అధికం.

పేద రాష్ట్రంగా బిహార్​
భారత్‌లో అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ అని జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ)-2021 నివేదిక ఆధారంగా నీతి ఆయోగ్‌ వెల్లడించింది. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71 శాతం), గోవా(3.76 శాతం), సిక్కిం(3.82 శాతం), తమిళనాడు(4.89 శాతం) ఉన్నాయి.

Advertisement

బ్యాంకులపై ఆర్‌బీఐ ప్రత్యేక డేటా కేంద్రం
బ్యాంకులు డేటా మాస్కింగ్‌కు పాల్పడకుండా పర్యవేక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్తగా అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఆర్‌బీఐ నేరుగా బ్యాంకుల వ్యవస్థల్లోకి వెళ్లి డేటాను ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది.

సాగు చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
పార్లమెంట్​ ఆమోదించిన మూడు సాగు చట్టాలను రద్దు బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన మొదటి రోజే ఉభయ సభలు ఈ బిల్లు రద్దును ఆమోదించారు.

మారని కీలక వడ్డీరేట్లు
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్‌ రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో వృద్ధే లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరించింది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి.

Advertisement

ఆనకట్టల భద్రత బిల్లు ఆమోదం
దేశంలో నిర్దేశించిన ఆనకట్టల భద్రత కోసం జాతీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఆమోదించింది. ఆకస్మిక విపత్తులను నివారించేలా ఆనకట్టలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణకు అవసరమైన నిబంధనలతో బిల్లును రూపొందించారు. లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

కిల్లర్స్‌కు ‘ప్రెసిడెంట్‌ స్టాండర్డ్‌’ పురస్కారం
విశిష్ట సేవలు అందించినందుకు ‘22వ మిసైల్‌ వెసల్‌ స్క్వాడ్రన్‌’కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ‘ప్రెసిడెంట్‌ స్టాండర్డ్‌’ పురస్కారం బహూకరించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే దీన్ని ఇస్తుంటారు. ఈ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ స్క్వాడ్రన్‌ను ‘కిల్లర్స్‌’గా వ్యవహరిస్తుంటారు.

కొంకణి, అస్సామీ రచయితలకు జ్ఞాన్‌పీఠ్‌
ప్రఖ్యాత కొంకణి రచయిత దామోదర్‌ మౌజో, అస్సామీ రచయిత నీల్‌మణి ఫుకాన్‌లకు జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం లభించింది. ఇది కొంకణి ప్రజలకు, ఇక్కడి సాహిత్యానికి గర్వకారణమని మౌజో పేర్కొన్నారు. నవలలు, బాలల పుస్తకాలతో పాటు కాల్పనిక సాహిత్యంలో తనదైన ముద్రతో వారు సొంతం చేసుకున్నారు.

Advertisement

భారత ప్రధానితో పుతిన్​ చర్చలు
21వ భారత్‌ – రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్​లో పర్యటించారు. ప్రధాని మోడీతో సమావేశమై ద్వెపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం, మధ్య ఆసియా ప్రాంతంలో పెను సవాళ్లపైనా అగ్రనేతలు సమాలోచనలు చేశారు. ఇంధనం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యం పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పోఖ్రాన్​లో సాంట్‌ మిస్సైల్‌ టెస్ట్​
దేశీయ రక్షణ సామర్థ్యం పెంచే సాంట్‌ (స్టాండ్‌ ఆఫ్‌ యాంటీ ట్యాంక్‌) మిస్సైల్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో డీఆర్​డీవో, ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ సంయుక్తంగా ఈ ఫ్లైట్‌ టెస్టింగ్‌ను నిర్వహించాయి.

‘ఆయుష్మాన్‌ భారత్‌’ గోల్డ్‌ కార్డు
‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ‘గోల్డ్‌ కార్డు’ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్డు ద్వారా దేశంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంటుందన్నారు.

భారత్‌ వృద్ధి రేటు 9.7
2021–22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదవుతుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 10 శాతం నుంచి 9.7 శాతానికి కుదించింది.

పేటీఎంకు షెడ్యూల్డ్​ బ్యాంక్​ హోదా
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హోదా లభించింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం, పెద్ద సంస్థల బాండ్లు, వేలం, రెపో, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ ఆపరేషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

సైనికులకు ఏసీ జాకెట్‌
దేశ రక్షణ కోసం ఎండల్లో పని చేస్తున్న సైనికుల చల్లదనం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఏసీ జాకెట్‌ను రూపొందించారు. రాజస్థాన్‌ ఎడారుల్లాంటి సుమారు 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. దీన్ని యుద్ధ ట్యాంకులు, జలాంతర్గాముల్లోనూ వాడొచ్చు.

సరోగసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సరోగసీ (నియంత్రణ) బిల్లు – 2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లు ప్రకారం.. చట్టబద్ధమైన వివాహం ద్వారా అయిదేళ్లు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు. భార్యకు 23 – 50ఏళ్ల లోపు వయసు, భర్తకు 26 – 55ఏళ్ల వయసు ఉన్న దంపతులే సరోగసీ విధానంలో బిడ్డను పొందవచ్చు.

యువతుల కనీస వివాహ వయసు పెంపు
యువతుల కనీస పెళ్లి వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టం – 1955లకూ సవరణలు చేయనుంది.

మోడీకి భూటాన్‌ పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోడీకి భూటాన్​ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానిని ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రక్‌ గ్యాల్పో’ అవార్డుకు ఎంపిక చేసినట్లు భూటాన్‌ ప్రధాని లోతెయ్‌ షేరింగ్‌ తెలిపారు. ఈ పురస్కారాన్ని స్థానిక భాషలో ‘నగ్‌దక్‌ పేల్‌ జి ఖోర్లో’ అని పిలుస్తారు.

అగ్ని-పి క్షిపణి ప్రయోగం విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-పి భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ‘అగ్ని-పి’ అనేది రెండంచెల క్షిపణి. అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఇది 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ప్రాంతీయం

భైంసాలో బుద్ధుడి శిల్పం
నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని సిద్ధార్థనగర్‌ చెరువులో క్రీ.శ.3వ శతాబ్దం నాటి బుద్ధుడి శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రకటించింది. భైంసాలో బౌద్ధం ఆనవాళ్లు లభించడం ఇదే తొలిసారని బృందం తెలిపింది.

తగ్గిన భూగర్భ జలాలు
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయి. 2021 అక్టోబరుతో పోలిస్తే నవంబరులో జిల్లాలవారీగా చూస్తే 0.29 మీటర్ల నుంచి 2.36 మీటర్ల దాకా తగ్గుదల ఉన్నట్లు భూగర్భ జల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో గత అక్టోబరులో సగటున 4.17 మీటర్ల లోతున భూగర్భ జలాలుంటే నవంబరు కల్లా అవి 6.53 మీటర్ల లోతుకు పడిపోయాయి.

పాండవుల గుట్టల్లో రాష్ట్రకూట శాసనం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లిలోని పాండవుల గుట్టల్లో 9వ శతాబ్దపు నాటి రాష్ట్రకూట శాసనాన్ని కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇది 1100 ఏళ్ల కిందటి తెలుగు, కన్నడ శాసనమని చెప్పారు.

హెలికాప్టర్ల తయారీ కేంద్రంగా రాష్ట్రం
పూర్తిస్థాయి విమానాలు, హెలికాప్టర్ల తయారీకి తెలంగాణ కేంద్రంగా మారనుందని ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. ‘ఫ్యూచర్‌ ఏరోస్పేస్‌’ నగరాల్లో హైదరాబాద్‌ ప్రపంచ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంది.ఆదిభట్లలోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ రూపొందించిన ఎఫ్‌-16 ఫైటర్‌ వింగ్స్‌ కేటీఆర్‌ ఆవిష్కరించారు.

‘ఆరోగ్యంపై అవగాహన’లో అగ్రస్థానం
గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంచి ప్రతిభతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. నడక, పరుగు, బడికెళ్లే పిల్లల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై ఆరోగ్య సిబ్బంది చైతన్యం కల్పించినందుకు ఈ ర్యాంక్​ దక్కింది.

తెలంగాణ అమ్మాయికి ఐటీఎఫ్‌ టైటిల్‌
ఇంటర్నేషనల్​ టెన్నిస్‌ ఫెడరేషన్​ (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సామ సాత్విక డబుల్స్‌ టైటిల్‌ సాధించింది. సోలాపూర్‌లో జరిగిన డబుల్స్‌ ఫైనల్లో సాత్విక–రమ్య నటరాజన్‌ (భారత్‌) ద్వయం టాప్‌ సీడ్‌ సౌజన్య బవిశెట్టి–షర్మదా (భారత్‌) జోడీపై విజయం సాధించింది.

‘రూర్బన్‌’ పథకం అమల్లో నంబర్​వన్​
జాతీయస్థాయిలో ‘శ్యామ్​ ప్రసాద్‌ ముఖర్జీ జాతీయ రూర్బన్‌ మిషన్‌’పథకం అమల్లో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 295 క్లస్టర్ల ర్యాంకింగ్‌లలో తొలి రెండు స్థానాలను రాష్ట్రం కైవసం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు గ్రామాల్లోనూ అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ పథకాన్ని అమలుచేస్తారు.

పల్లెల్లో ప్రతి ఇంటికీ నల్లా నీరు
తెలంగాణ సహా 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని (యూటీ) మొత్తం గ్రామాల్లో ప్రతి ఇంటికీ నల్లా నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తెలంగాణతో పాటు హర్యాణ, గోవా, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్‌ దీవులు, దాద్రా నగర్‌ హవేలి, దమన్‌ దీవ్‌లలో ఇది 100 శాతం పూర్తయిందని జలశక్తి శాఖ తెలిపింది.
తడి చెత్తతో బయోగ్యాస్‌ ఉత్పత్తి
రాష్ట్రంలో తొలిసారి సిద్దిపేట మున్సిపాలిటీలో తడి చెత్త నుంచి కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. పట్టణ శివారులోని బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన బయోగ్యాస్‌ ప్లాంట్‌ని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వార్తల్లో వ్యక్తులు

పరాగ్‌ అగర్వాల్‌
ట్విటర్‌కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా ఉన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అగర్వాల్‌ ఆ పదవిని చేపట్టారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మరణించారు. 1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టిన ఆయన 11 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

హర్షవంతీ బిష్ట్‌
ప్రముఖ పర్వతారోహకురాలు హర్షవంతీ బిష్ట్‌ ఇండియన్‌ మౌంటనీరింగ్‌ ఫౌండేషన్‌ (ఐఎంఎఫ్‌) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తద్వారా ఆ స్థానాన్ని అలంకరించిన తొలి మహిళగా ప్రత్యేకత చాటారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు 107 ఓట్లలో 60 లభించాయి.

ఆర్‌.హరికుమార్‌
భారత నావికాదళ 25వ అధిపతి(చీఫ్‌ ఆఫ్‌ నావెల్‌ స్టాప్‌)గా వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ బాధ్యతలు చేపట్టారు. నవంబర్‌ 30న న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ నుంచి హరికుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.
అంజూ బాబీ జార్జ్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత మాజీ క్రీడాకారిణి, లాంగ్‌జంపర్‌ అంజూ బాబీ జార్జ్‌కు ‘వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2021’గా ఎంపికైంది. దేశంలో ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషికిగాను అంజూకు ఈ అవార్డు దక్కింది.

వివేక్‌ జోహ్రి
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్‌గా సీనియర్‌ అధికారి వివేక్‌ జోహ్రి బాధ్యతలు స్వీకరించారు. 1985 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్, పరోక్ష పన్నులు) అధికారి అయిన జోహ్రి ఇప్పటికే బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.

బిపిన్​ రావత్​
మొట్టమొదటి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(బ్లాక్‌ బాక్స్‌)ను వెలికితీశారు.

ఇషా సింగ్‌
జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఇప్పటికే రెండు గోల్డ్​ మెడల్స్​, కాంస్యాలు గెలిచింది. తాజాగా పోటీల చివరి రోజున మరో రెండు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది. 25 మీ. పిస్టల్‌ జూనియర్‌ అమ్మాయిల విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచింది.

నొవాక్‌ జకోవిచ్‌
టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ నంబర్‌వన్‌ ర్యాంకులో 350 వారాలు కొనసాగిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. పురుషుల్లో ఫెదరర్‌ (310 వారాలు) రికార్డును ఈ ఏడాది మార్చిలో అధిగమించిన జకో, స్టెఫీగ్రాఫ్‌ (377 వారాలు) ఓవరాల్‌ రికార్డును బద్దలుకొట్టే దిశగా సాగుతున్నాడు.

అనిల్‌ మేనన్‌
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన డాక్టర్​ అనిల్‌ మేనన్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ఆయన భవిష్యత్‌లో చేపట్టబోయే ఒరాయన్‌ వ్యోమనౌక, స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ రాకెట్‌లో చంద్రుడిపైకి, సుదూర అంతరిక్ష యాత్రలకు పయనమవుతారు.

హర్నాజ్‌ సంధు
భారత్‌కు చెందిన పంజాబ్‌ యువతి హర్నాజ్‌ సంధు విశ్వసుందరి-2021 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇజ్రాయెల్‌లో జరిగిన 70వ విశ్వసుందరి పోటీల్లో 79 దేశాల నుంచి అందగత్తెలు పోటీపడ్డారు. పరాగ్వే సుందరి నదియా ఫెరారియా రెండో స్థానం, దక్షిణాఫ్రికా అందగత్తె లలేలా మ్స్వానే మూడో స్థానం దక్కించుకుంది.

లీనా నాయర్‌
ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంతమైన వస్తువుల బ్రాండ్‌ ఛానెల్‌కు సీఈవోగా భారతీయ సంతతి వ్యక్తి లీనా నాయర్‌ నియమితులయ్యారు. గతంలో ఆమె యూనీలివర్‌ ప్రతినిధిగా ఉన్నారు. లీనా నాయర్‌ హిందుస్థాన్‌ యూనీలివర్‌లో 30 ఏళ్ల క్రితం మేనేజ్​మెంట్‌ ట్రైనీగా కెరీర్‌ ప్రారంభించింది.

సత్యవతి
ప్రతిష్టాత్మకమైన ‘కువెంపు జాతీయ అవార్డు–2021’కు ప్రఖ్యాత తెలుగు కథారచయిత్రి పి.సత్యవతి ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, సిల్వర్​ మెడల్​ అందుకోనున్నారు. కథలు, నవలలు, అనువాదాలతో సహా అనేక రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకుగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

తోట చిరంజీవి
గ్రేటర్‌ నొయిడాలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్‌ అండ్‌ డీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్‌ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ పీకాక్‌ ఎకో ఇన్నోవేషన్‌–2021 అవార్డు లభించింది.

ఎంఎం నరవణె
త్రివిధ దళాల అధిపతుల కమిటీ (సీవోఎస్‌సీ) చైర్మన్‌గా సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మూడు దళాల అధిపతులలో సీనియర్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం ఈ పదవిని అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
హర్భజన్ సింగ్
టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 1998లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన 41 ఏళ్ల భజ్జీ.. టీమిండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు.. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు సాధించాడు.

పీవీ సింధు
భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు, ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్ల కమిషన్‌ సభ్యురాలిగా నియమితురాలైంది. సింధుతో పాటు మరో ఐదుగురు సభ్యులు 2025 వరకు ఈ కమిషన్‌లో ఉంటారని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది.

ఎలన్‌ మస్క్‌
టైమ్‌ మ్యాగజైన్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2021’గా టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ను ఎంపిక చేసింది. అపర మేధావి, దార్శనికుడు, వ్యాపారవేత్త, షోమాన్‌గా ఆయనను అభివర్ణించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను అధిగమించి మస్క్‌ ఇటీవలే ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు.

కేథరీన్ రస్సెల్‌
సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ యునెసెఫ్​ అధిపతిగా కేథరీన్ రస్సెల్‌ను నియమించారు. కేథరీన్ రస్సెల్ వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ కార్యాలయానికి కూడా నాయకత్వం వహిస్తుంది. 2013 నుంచి 17 వరకు ప్రపంచ మహిళల సమస్యల కోసం స్టేట్ డిపార్ట్‌మెంట్ అంబాసిడర్‌గా పనిచేశారు.

అవని లేఖరా
అంతర్జాతీయ పారాలింపిక్స్‌ కమిటీ అవార్డుల్లో 2021 ఉత్తమ అరంగేట్ర క్రీడాకారిణిగా షూటర్‌ అవని లేఖరా అవార్డు సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్లో అవని స్వర్ణం గెలిచింది. అదే క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్‌ త్రీపొజిషన్స్‌లో కూడా ఆమె కాంస్యం సాధించింది. ఈ నేపథ్యంలో క్రీడల్లో అత్యున్నత పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును కూడా అవని ఇటీవలే అందుకుంది.

స్పోర్ట్స్

మెస్సికి బాలోన్‌ దోర్‌ అవార్డు
ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సి ఏడోసారి బాలోన్‌ దోర్‌ (బంగారు బంతి) అవార్డును అందుకున్నాడు. 34 ఏళ్ల మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనా జులైలో కోపా అమెరికా టైటిల్‌ను గెలుచుకుంది. మెస్సి 613 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో అలెక్సియా పుటెల్లాస్‌ ఈ అవార్డు సొంతం చేసుకుంది.

నాలుగో స్థానంలో జ్యోతి సురేఖ
ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో ర్యాంక్​ సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత కాంపౌండ్‌ ఆర్చర్‌గా సురేఖ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆసియా ర్యాంకింగ్స్‌లో సురేఖ నంబర్‌ వన్‌గా కొనసాగుతుంది.

సౌరవ్‌ గోషాల్‌కు మలేసియన్‌ టైటిల్​
భారత స్క్వాష్‌ స్టార్‌ ప్లేయర్‌ సౌరవ్‌ గోషాల్‌ మలేసియన్‌ ఓపెన్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్స్‌–2021లో సౌరవ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్‌ 11–7, 11–8, 13–11తో టాప్‌ సీడ్‌ మిగెల్‌ రోడ్రిగెజ్‌ (కొలంబియా)పై విజయం సాధించాడు.
సౌదీ గ్రాండ్‌ప్రి విన్నర్​ హామిల్టన్​

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో తొలిసారి నిర్వహించిన సౌదీ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. సౌదీ అరేబియాలోని జెద్దాలో డిసెంబర్‌ 7న ముగిసిన 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్‌ అందరికంటే ముందుగా ముగించి విజేతగా అవతరించాడు.
నంబర్​ వన్​ టీమ్​ ఇండియా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 124 పాయింట్లతో కివీస్‌ను వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌ రెండో ర్యాంకుకు పడిపోయింది. ఇక ఇండియా, కివీస్‌(121) తర్వాత ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్‌(107), పాకిస్తాన్‌(92 పాయింట్లు) టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి.
జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

అర్జెంటీనా జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్‌తో ఆరుసార్లు ఛాంపియన్‌ జర్మనీకి షాకిచ్చింది. డొమెన్‌ 10, 25, 50వ నిమిషాల్లో గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫ్రాంకో (60వ) ఒక గోల్‌ కొట్టాడు.
అబుదాబి విన్నర్​ వెర్‌స్టాపెన్‌

రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ను అందుకున్నాడు. సీజన్‌ చివరిదైన అబుదాబి గ్రాండ్‌ ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. ఈ విజయంతో మొత్తం 395.5 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. హామిల్టన్‌ (387.5) రెండో స్థానంలో నిలిచాడు.
అజయ్‌సింగ్‌కు గోల్డ్​ మెడల్​

కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో అజయ్‌సింగ్‌ పురుషుల 81 కేజీల విభాగంలో గోల్డ్​ మెడల్​ సాధించాడు. స్నాచ్‌లో జాతీయ రికార్డు సృష్టిస్తూ 147 కేజీలు ఎత్తిన అజయ్‌.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 175 కేజీలు లిఫ్ట్‌ చేశాడు.
శ్రీకాంత్‌కు సిల్వర్​ మెడల్​
భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఫైనల్లో ఓడినా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా శ్రీకాంత్‌ రికార్డులకెక్కాడు. ఈ చాంపియన్​షిప్​లో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
వెర్‌స్టాపెన్‌కు చాంపియన్‌ ట్రోఫీ

తొలిసారి ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌గా రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (నెదర్లాండ్స్‌) నిలిచాడు. ఏడు సార్లు ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్, ఏఫ్‌ఐఏ ఈ ఏడాది మేటి వ్యక్తిగానూ ఎంపికయ్యాడు. మెర్సిడెజ్‌ ఈ ఏడాది జట్టు చాంపియన్‌గా నిలిచింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

భారత్‌కు ఎస్‌–400 మిస్సైల్స్​
ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్‌–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్‌–400 క్షిపణులు భారత్‌కు అండగా నిలవనున్నాయి. మొదటి క్షిపణిని లద్దాఖ్‌ సెక్టార్‌లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది.
వేగవంతమైన రోల్స్​ రాయ్స్​ ఎలక్ట్రిక్‌ ఫ్లైట్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ విమానాన్ని రోల్స్‌రాయ్స్‌ సంస్థ రూపొందించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’ ఆల్‌–ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన బోస్కోంబ్‌ డౌన్‌ టెస్టింగ్‌ సైట్‌లో దీనిని పరీక్షించారు.
చెత్త కారణంగా స్పేస్‌వాక్‌ క్యాన్సల్​

అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా నాసా తన స్పేస్‌వాక్‌ వాయిదావేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు సమీపంగా వేగంగా పరిభ్రమిస్తున్న శకలాలు స్పేస్‌వాక్‌ సమయంలో వ్యోమగాముల సూట్‌కు తూట్లు పెట్టే ప్రమాదముందని స్పేస్‌వాక్‌ను ఆపేశారు.
బ్రహ్మోస్‌ ఎయిర్‌ వెర్షన్‌ సక్సెస్​
బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ఎయిర్‌ వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్‌ సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు డీఆర్​డీవో వర్గాలు తెలిపాయి. ఎయిర్‌ వెర్షన్‌ సక్సెస్​ కావడంతో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది.
స్మాట్​ ప్రయోగం సక్సెస్​

దూరంలో ఉన్న శత్రు జలాంతర్గామిని కచ్చితత్వంతో పేల్చివేసే అధునాతన ఆయుధ వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ‘సూపర్‌ సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ టోర్పిడో’ (స్మాట్‌) అస్త్రాన్ని ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి ప్రయోగించారు. నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు.

‘ప్రళయ్‌’ తొలి పరీక్ష సక్సెస్​
దేశీయంగా తయారుచేసిన బాలిస్టిక్‌ క్షిపణి ‘ప్రళయ్‌’ తొలి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలో దీనిని పరీక్షించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. భూమి మీది లక్ష్యాలను చేధించేందుకు భూమి మీద నుంచి ప్రయోగించేలా ప్రళయ్‌ క్షిపణిని తయారుచేశారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!