Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ ఎఫైర్స్ డిసెంబర్​‌‌–2020

కరెంట్​ ఎఫైర్స్ డిసెంబర్​‌‌–2020

ప్రాంతీయం

ఎన్​టీసీఏ ప్రత్యేక కమిటీ
కుమురం భీం జిల్లాలో పులి దాడిలో ఇటీవల ఇద్దరు మృతి చెందడంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి జాతీయ పులుల సంరక్షణ కేంద్రం(ఎన్టీసీఏ) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సి.పి.వినోద్‌కుమార్‌ ఛైర్మన్‌గా, మరికొంత మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.

హెచ్​ఐవీలో తెలంగాణ ఆరో స్థానం
2017 గణాంకాల ప్రకారం కేసుల నమోదులో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా.. 2019 నాటికి 6వ స్థానానికి తగ్గింది. ఈమేరకు ఎయిడ్స్​ కంట్రోల్​ బోర్డ్​ డిసెంబర్​ 1న రిపోర్టు విడుదల చేసింది. జిల్లాల పరంగా హైదరాబాద్​లో అత్యధిక కేసులు నమోదవగా, తర్వాత నల్గొండ, కరీంగనర్​, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లాలు నిలిచాయి. ఆదిలాబాద్​ జిల్లాలో అత్యల్ప కేసులు నమోదయ్యాయి.

కొండగొర్రెల‌ పార్కు
టీఎస్‌ఎఫ్‌డీసీ హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట సమీపంలోని లాల్‌గడి మలక్‌పేటలో మరో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును ఏర్పాటు చేసింది. దేశంలోనే కొండ గొర్రెల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొదటి పార్కు ఇదే. 2,635 ఎకరాల్లో ఈ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.

ఏపీలో అమూల్‌ ప్రాజెక్టు
కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అమూల్‌ ప్రాజెక్టు తొలి దశ కార్యక్రమాన్ని సచివాలయం నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్​ 2న ప్రారంభించారు. మార్కెట్లో ఇప్పటి వరకు అమ్ముకుంటున్న ధర కంటే లీటర్‌ పాలకు కనీసం రూ.4-5 అదనంగా రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు.

జగనన్న జీవ క్రాంతి
వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించటానికి డిసెంబర్​ 10న సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రూ.1,869 కోట్ల వ్యయంతో ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని ప్రారంభించారు.

ఎన్టీపీసీకి ‘ప్లాటినం’ అవార్డు
థర్మల్‌ విద్యుదుత్పత్తిలో స‌మ‌ర్థమైన‌ పనితీరుకు రామగుండం ఎన్టీపీసీకి అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ప్లాటినం అవార్డు దక్కింది. ఉత్తమ పనితీరుకు అపెక్స్‌ ఇండియా గ్రీన్‌ లీఫ్‌ అవార్డ్సు-2019లో భాగంగా ఎన్టీపీసీని ఎంపిక చేస్తూ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసింది.

64 దేశాల రాయబారులు
కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు డిసెంబరు 9న హైదరాబాద్‌ను సందర్శించారు. భారత్‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. పెద్దసంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం.

ముఖ్రా (కె)
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లో భాగంగా రాష్ట్రంలో నూటికి నూరు శాతం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామపంచాయతీగా నిలిచినందుకుగానూ కేంద్ర జల వనరుల శాఖ ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రా (కె) గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు.

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు
దేశవ్యాప్తంగా ఒకేసారి 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ఉత్తరాఖండ్‌కు బదిలీ కావడంతో ఆ స్థానంలోకి పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి నియమితులయ్యారు.

హిందుస్థాన్‌ కోకొకోలా
హిందుస్థాన్‌ కోకొకోలా బెవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) తెలుగు రాష్ట్రాల్లో రెండు పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇందులో హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌ ఫ్యాక్టరీ వద్ద సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానెల్‌ ప్రాజెక్టు ఒకటి కాగా, మరొకటి విజయవాడ ఫ్యాక్టరీ కోసం సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం.

జూకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌
హైదరాబాద్​లోని నెహ్రూ జువాలజికల్‌ పార్కు ఐఎస్‌ఓ 9001: 2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ దక్కించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్‌వో సర్టిఫికెట్‌ పొందిన మొదటి జూగా ఇది నిలిచింది.

కామారెడ్డికి ‘వెబ్‌రత్న’
డిజిటల్‌ గవర్నెన్స్‌లో కామారెడ్డి జిల్లా వెబ్‌రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ శరత్‌ అందుకుంటారు. జిల్లా గురించి సంక్షిప్తంగా, వివరణాత్మక అంశాలతో కూడిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.

కోతుల సంరక్షణ కేంద్రం
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యల్లో భాగంగా రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మల్‌ జిల్లా గండి రామన్న హరితవనంలో కోతుల సంరక్షణకు పునరావాస కేంద్రాన్ని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి డిసెంబర్​ 20న ప్రారంభించారు. ఇది దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి కేంద్రంగా నిలిచింది.

హైదరాబాద్‌లో ఒప్పో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌
దేశంలోని మొట్టమొదటి 5జీ ఆవిష్కరణల ప్రయోగశాల (ఇన్నోవేషన్‌ ల్యాబ్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ప్రసిద్ధ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో మొబైల్‌ టెలీ కమ్యూనికేషన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డిసెంబర్​ 22న ప్రకటించింది. చైనా తర్వాత తమ సంస్థ విదేశాల్లో ఏర్పాటు చేసిన తొలి ఆవిష్కరణల ప్రయోగశాల ఇదేనని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 5జీ అభివృద్ధిని ఇక్కడి నుంచే వేగవంతం చేయనున్నట్లు తెలిపింది.

ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్‌
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1987 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని డిసెంబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజు కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్‌ బాధ్యతలు చేపడతారు. కొత్త సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌దాస్‌ సొంత రాష్ట్రం బిహార్‌.

Advertisement

జాతీయం

ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌-2020
రాబోయే అయిదేళ్లలో జాబ్స్​ స్థితిగతులపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ రిపోర్ట్‌-2020’ పేరుతో ఇటీవల నివేదిక​ విడుదల చేసింది. – ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి కొలువుల రూపం, అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమల వ్యూహం తదితర అంశాలపై సర్వే చేసి డిమాండ్‌ పెరిగే 10 కొలువులు, ప్రాధాన్యం కోల్పోయే పదింటి పేర్లను దేశాల వారీగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న కొలువుల్లో మొదటి స్థానంలో కృత్రిమ మేధ(ఏఐ) ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్​ టెక్నాలజీతో ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 8.50 కోట్ల ఉద్యోగాలు పోయినా.. కొత్తగా 9.70 కోట్ల ఉద్యోగాలు వస్తాయని నివేదిక పేర్కొంది.

ఇండియాకు అన్నపూర్ణ విగ్రహం
1913లో చోరీకి గురైన కాశీలోని అన్నపూర్ణ విగ్రహాన్ని కెనడా ప్రభుత్వం స్వదేశానికి పంపించినట్లు నవంబర్​ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో వెల్లడించారు.

వ్యాక్సిన్‌ వాలంటీరుపై దావా​
కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసింది. వ్యాక్సిన్‌ ప్రయోగంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయని వాలంటీరు ఆరోపించారు. దీంతో సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారన్న కారణంతో సీరం ఇన్స్టిట్యూట్​ దావా వేసింది.

2020లో అతిపెద్ద ఒప్పందం
సమాచార దిగ్గజం ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ను 44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)కు సొంతం చేసుకోడానికి డేటా దిగ్గజం ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇంక్‌ ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సమాచార విపణిలో పెరుగుతున్న పోటీని తట్టుకోడానికి కంపెనీల మధ్య ఈ ఒప్పందం జరిగింది. 2020లోనే జరిగిన అతిపెద్ద ఒప్పందంగా ఇది నిలిచింది.

వ్యవసాయంపై రిపోర్ట్​
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రమాదం పొంచి ఉందని ‘గ్రామీణ, వ్యవసాయ స్థితిగతుల నివేదిక-–2020’ హెచ్చరించింది. ‘నెట్‌వర్క్‌ ఆఫ్‌ రూరల్‌ అండ్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌’ సంస్థ ఈ అధ్యయనం చేపట్టి, నివేదిక రూపొందించింది. దిల్లీ ఐఐటీలో నవంబర్​ 30న జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వి.రామ్‌గోపాల్‌రావు దీన్ని విడుదల చేశారు.

కొత్త పార్లమెంట్‌ భవనం
కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ డిసెంబర్​ 10న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి రూ. 971 కోట్లు వెచ్చిస్తున్నారు. 2022, ఆగస్టు 15 నాటికి ఇది పూర్తి కానుంది. టాటా సంస్థకు నిర్మాణ పనులను అప్పగించారు. ప్రస్తుతం ఉన్న పాత పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులను 1921లో ప్రారంభించారు. ఆరేళ్ల తర్వాత 1927లో ఆ భవన నిర్మాణం పూర్తయింది. సెంట్రల్​ విస్టా ఉభయ సభల పబ్లిక్‌ గ్యాలరీల్లో 530 సీట్లు ఉంటాయి. 1244 ఎంపీలకు అనువైన రీతిలో సీట్లను కేటాయించారు. రాజ్యసభలో 348 ఎంపీలకు సీటింగ్, లోక్‌సభలో 888 ఎంపీలకు సీటింగ్‌ ఉంటుంది. 64,500 మీటర్ల విస్తీర్ణంలో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణం అవుతుంది.

డైమండ్స్​ రింగ్​ గిన్నీస్​ రికార్డ్​
సుమారు 12,638 వజ్రాలు కలిగి ఉన్న ఓ రింగు తాజాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్​ కు ఎక్కింది. పువ్వు ఆకారంలో ఉన్న ఆ రింగును ‘ది మారీగోల్డ్‌-ద రింగ్‌ ఆఫ్‌ ప్రాస్పరిటీ’గా పిలుస్తున్నారు. దీని బరువు సుమారు 165 గ్రాములు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన హరీశ్‌ బన్సాల్‌(25) ఈ రింగును డిజైన్‌ చేశారు.

‘కో-విన్‌’ యాప్‌
కొవిడ్‌-19 టీకా పంపిణీ, వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు, ఎవరైనా టీకా కావాలనుకుంటే నమోదు చేసుకోవడానికి వీలుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ‘కో-విన్‌’ పేరిట ఓ ఉచిత మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. టీకా కోసం నమోదు చేసుకున్నవారి వివరాలు సహా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని(డేటా) ఇందులో పొందుపరుస్తారు.

2021లో 5జీ సేవలు
2021సెకండ్​ హాఫ్లో​ 5జీ టెలికాం సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. భారత్‌లో హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీని పెంచాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా అభివృద్ధి చేసిన నెట్‌వర్క్, హార్డ్‌వేర్, సాంకేతిక భాగాలతో జియో 5జీ సేవలు ఉంటాయని ముకేశ్‌ చెప్పారు.

‘స్వస్త్‌ సతీ’ స్కీం
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మహిళల ఆరోగ్యం కోసం డిసెంబర్ 10న కొత్త స్కీం ప్రవేశపెట్టారు. భువానీపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ‘స్వస్త్‌ సతీ’ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు పొందటానికి కుటుంబంలోని ఒక మహిళకు రూ.5 లక్షల పరిమితి కలిగి ఉన్న కార్డును అందజేశారు.

డాక్‌పే యాప్‌
తపాలా శాఖ (ఇండియా పోస్ట్‌), ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతాదారుల బ్యాంకింగ్‌ సేవలకు వీలుగా ‘డాక్‌పే’ యాప్‌ను ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిసెంబర్​ 15న ఈ యాప్‌ను ఆవిష్కరించారు.

వేధింపుల్లో నాలుగో స్థానం
తెలంగాణలో 36.9 శాతం, ఏపీలో 30 శాతం మహిళలు గృహ, లైంగిక వేధింపులకు గురవుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎస్‌) తెలిపింది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలు డిసెంబర్​ 14న విడుదలయ్యాయి. దీని ప్రకారం అత్యధికంగా కర్ణాటక (44.4 శాతం)లో ఎక్కువ మంది వేధింపులకు గురవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్‌ (40 శాతం), మణిపూర్‌(39 శాతం) ఉన్నాయి.

ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా
ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా 2020 వర్చువల్​ సదస్సులో డిసెంబర్​ 15న ముకేశ్‌ అంబానీ, జూకర్‌బర్గ్‌లు ప్రసంగించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి, ఆసియా కుబేరుల్లో తొలిస్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ సమావేశంలో ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే అగ్రగామి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ వృద్ధి చెందుతుందన్నారు.

వెస్ట్​ బెంగాల్​లో తెలుగుకు అధికారిక హోదా
పశ్చిమ బెంగాల్లో డిసెంబర్​ 22న ఆ రాష్ట్ర సీఎం మమత అధ్యక్షతన నిర్వహించిన మంత్రి మండలి తెలుగు భాషకు అధికారిక గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. భాషాపరమైన మైనారిటీలుగా పేర్కొంటూ ఆమోదం తెలిపింది.

పెరిగిన చిరుతలు
భారత్‌లో చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ 2018 నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం 2016లో 8 వేలు ఉన్న చిరుతలు, 2018కల్లా 12,852కు పెరిగాయి. భారత్‌లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,421, తెలంగాణలో 334, ఏపీలో 492 చిరుతలు ఉన్నాయి.

Advertisement

ఖేలో ఇండియా ఎక్స్‌లెన్స్‌ సెంటర్స్
దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంచే ఉద్దేశంతో ఎనిమిది ఖేలో ఇండియా రాష్ట్ర ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్​ 22న నిర్వహించిన వర్చువల్‌ కార్యక్రమంలో ఈ సెంటర్లను క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజు ప్రారంభించారు. తెలంగాణ, మణిపుర్, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరాం, కేరళ, నాగాలాండ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఈ కేంద్రాల జాబితాలో ఉన్నాయి.

పార్సిల్‌ టెర్మినల్‌గా కాచిగూడ
పార్సిల్‌ టెర్మినల్‌గా హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా 4 స్టేషన్లను ఎంపిక చేయగా అందులో కాచిగూడ (దక్షిణ మధ్య రైల్వే), సంగోల (మధ్య రైల్వే), కోయంబత్తూర్‌ (దక్షిణాది రైల్వే), కంకరియా (పశ్చిమ రైల్వే) ఉన్నాయి.

అంతర్జాతీయం

Advertisement

ఎస్​సీవో సదస్సు
షాంఘై సహకార సంస్థ(ఎస్​సీవో) 19వ ప్రతినిధుల మండలి సమావేశానికి భారత్​ ఆథిత్యమిచ్చింది. నవంబర్​ 30న వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించారు. ఉగ్రవాదం కట్టడి, సంప్రదాయ ఔషధాల్లో సభ్య దేశాల పరస్పర సహకారం తదితర అంశాలు చర్చించారు.

లండన్​ రోడ్డుకు గురునానక్​ పేరు
లండన్​లో సిక్కులు అధికంగా ఉండే సౌతాల్​లోగల ఓ రోడ్డుకు గురునానక్​ పేరును పెట్టేందుకు వెస్ట్​ లండన్​ కౌన్సిల్​ నవంబర్​ 30న ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా చారిత్రక హావ్​లాక్​ రోడ్డుకు గురునానక్​ పేరు పెట్టనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పేరు అమల్లోకి రానుంది.

యాపిల్‌పై ఫైన్​
యాపిల్‌ కంపెనీపై ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్‌ అథారిటీ ‘ఏజీసీఎమ్‌’ 10 మిలియన్‌ యూరోలు /12 మి. డాలర్ల(దాదాపు రూ.88 కోట్లు) ఫైన్​ విధించింది. ఐఫోన్లు నీటిలో పడ్డా ఏమీ కాదని (వాటర్‌ రిసిస్టెంట్‌) ‘పక్కదారి’ పట్టించే విధంగా కంపెనీ ప్రచారం చేసిందని.. అసలు ఏ పరిస్థితుల్లో నీటి నుంచి రక్షణ ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది.

చారిత్రక కట్టడాల్లో భారత చెరువులు
వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్స్‌ (ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాలు) 2020 ఏడాదికిగానూ ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులను ఎంపిక చేసి ఆ జాబితాను విడుదల చేసింది. భారత్‌ నుంచి ఏపీలోని కేసీ కాలువ, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువు, మహారాష్ట్రలోని ధామాపూర్‌ చెరువుకు ఈ గుర్తింపు దక్కింది.

ఎవరెస్టు ఎత్తు పెరిగింది
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్‌ ఎవరెస్టు ఎత్తు మరింత పెరిగింది. చైనా, నేపాల్‌ బృందాలు కలిసి చేపట్టిన సర్వేలో శిఖరం ఎత్తు 86 సెంటీమీటర్లు పెరిగినట్లు వెల్లడయింది. తాజా సర్వేతో శిఖరం ఎత్తు 8,848.86 మీటర్ల (29,032 అడుగుల)కు చేరుకుందని చైనా, నేపాల్‌ దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న ఈ శిఖరం ఎత్తు విషయంపై ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాల పాటు నడిచిన వివాదానికి ఈ ప్రకటనతో తెరపడింది. భూమి అడుగులోని ప్లేట్ల కదలికల కారణంగా ప్రతి 300 సంవత్సరాలకు ఎవరెస్టు ఒక అడుగు మేర పైకి జరుగుతోంది. అప్పుడప్పుడు వచ్చే తీవ్రమైన భూకంపాలు ఈ ఎత్తును దెబ్బతీస్తాయి. అందుకే… 2015లో నేపాల్‌లో వచ్చిన తీవ్రమైన భూకంపం కారణంగా ఈ ఎత్తులో ఏమైనా మార్పు వచ్చిందేమో చూద్దామని చైనా, నేపాల్‌ ఏడాదికి పైగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.

కెనడాలో అసెంబ్లీ స్పీకర్‌
కెనడాలో రాజ్‌ చౌహాన్‌ అనే ప్రవాస భారతీయుడు బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సు అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికై, ఆ పదవి చేపట్టిన భారతీయ మూలాలున్న తొలి వ్యక్తిగా నిలిచారు. పంజాబ్‌లో జన్మించిన చౌహాన్‌ 1973లో కెనడాకు వలస వెళ్లారు. బ్రిటిష్‌ కొలంబియా అసెంబ్లీకి ఐదుసార్లు చట్టసభ్యుడిగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గానూ సేవలందించారు.

టై గ్లోబల్‌ సదస్సు 2020
టై గ్లోబల్‌ సదస్సు 2020 దృశ్యమాధ్యమ సదస్సు డిసెంబర్​ 8న నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. దేశంలో 65 శాతం మంది యువత ఉన్నారనీ, ప్రతిభావంతులైన యువత శక్తిసామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

మానవాభివృద్ధి సూచీలో 131వ స్థానం
మానవాభివృద్ధి సూచీలో భారత్‌ 131వ స్థానానికి పరిమితమైంది. 189 దేశాల్లో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా రూపొందించిన సూచీని యూఎన్​వో అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) విడుదల చేసింది. అందులో నార్వే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఐస్‌లాండ్‌ ఉన్నాయి. 2019లో భారత్‌లో సగటు జీవిత కాలం 69.7 ఏళ్లుగా ఉన్నట్లు మానవాభివృద్ధి నివేదిక తెలిపింది. 2018 సూచీలో భారత్‌ 130వ స్థానంలో నిలిచింది.

ఫైజర్​ వ్యాక్సినేషన్​
కొవిడ్‌-19 ఫైజర్‌ వ్యాక్సినేషన్‌ సామూహిక ప్రక్రియ డిసెంబర్​ 14 నుంచి అమెరికా, కెనడాలో ప్రారంభమైంది. క్వీన్స్‌లోని లాంగ్‌ ఐలాండ్‌ యూదు మెడికల్‌ సెంటర్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో పనిచేస్తున్న నర్సు శాండ్రా లిండ్సే తొలి టీకాను తీసుకున్నారు. టొరంటోలోని ఆంటారియాలో ఐదుగురు కెనడా వాసులు టీకాలను తీసుకున్నారు. ఇందులో ఇద్దరు నర్సులు, ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

రిపబ్లిక్​ డేకు బ్రిటన్​ పీఎం
2021 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం డౌనింగ్‌ స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి.

నేపాల్‌ కొత్త ప్రధానిగా ప్రచండ
కొద్ది రోజుల క్రితం ప్రధాని కేపీ శర్మ ఓలీ ఏకపక్షంగా పార్లమెంటు రద్దుకు నిర్ణయించిన నేపథ్యంలో అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్‌సీపీ) పార్లమెంటరీ పార్టీ కొత్త నేతగా పుష్ప కమాల్‌ దహాల్‌(ప్రచండ)ను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్‌సీపీలో ప్రచండ వర్గం పార్లమెంటరీ పార్టీ డిసెంబర్​ 23న సమావేశం నిర్వహించింది. ప్రచండ నామినేషన్‌ను సీనియర్‌ నేత మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ బలపరిచారు. ప్రచండ వర్గానికి చెందిన కేంద్ర కమిటీ ఓలీని పార్టీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించి మొదటి ఛైర్మన్‌గా ప్రచండను, రెండో ఛైర్మన్‌గా మాధవ్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు.

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ రద్దు
నిర్ణీత గడువులోపు 2020 బడ్జెట్‌ పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ రద్దయింది. దీంతో ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం ఏడు నెలలు మాత్రమే అధికారంలో కొనసాగింది. ఏడు నెలల క్రితం నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్‌ పార్టీ, బెన్నీ గాంట్జ్‌ అధ్యక్షుడిగా ఉన్న బ్లూ అండ్‌ వైట్‌ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగడం గత రెండేళ్లలో ఇది నాలుగోసారి.

Advertisement

వియత్నాంతో ఏడు ఒప్పందాలు
భారత్‌ ‘ఇండో-పసిఫిక్‌ విజన్‌’ వర్చువల్‌ సదస్సులో వియత్నాం ప్రధాని న్యూయెన్షువాన్‌తో భారత ప్రధాని మోడీ డిసెంబర్​ 21న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌ ‘యాక్ట్‌ ఇస్ట్‌’ విధానంలో కూడా వియత్నాంది ప్రధాన పాత్ర అని మోడీ తెలిపారు.ఈ సదస్సులో రక్షణ, అణు ఇంధన తదితర రంగాల్లో భారత్, వియత్నాంలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

గాంధీ-కింగ్‌ చట్టానికి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం
మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ సిద్ధాంతాలు, బోధనలపై పరిశోధనలు చేపట్టేందుకు ఉద్దేశించిన ‘గాంధీ-కింగ్‌ ఎక్స్ఛేంజ్‌ ఇనీషియేటివ్‌ యాక్ట్‌’కు డిసెంబర్​ 22న అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. సుమారు రూ.170 లక్షల కోట్ల (2.3 ట్రిలియన్‌ డాలర్ల) విలువైన వార్షికాంతర బిల్లులో భాగంగా దీన్ని చేర్చారు. చట్టసభల ఆమోదం లభించడంతో అధ్యక్షుడి ఆమోదం కోసం ఈ బిల్లు శ్వేతసౌధానికి చేరింది.

ఉద్యమకారిణి కరీమా హత్య
పాకిస్థాన్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న బలూచిస్థాన్‌ విముక్తి పోరాట యోధురాలు బలూచ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ కరీమా బలూచ్‌ హత్యకు గురయ్యారు. 2016లో పాకిస్థాన్‌ నుంచి పారిపోయి కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందిన ఆమె… టోరంటోలోని లేక్‌షోర్‌ సమీపాన ఓ లంక వద్ద విగతజీవిగా కనిపించారు.

Advertisement

క్రీడలు

సచిన్​ను దాటేసిన విరాట్​
వన్డేల్లో వేగంగా 12వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్​మెన్​గా విరాట్​ కోహ్లీ, సచిన్​ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్​ 300 ఇన్నింగ్స్​లో ఈ రికార్డ్​ సాధించగా, కోహ్లీ కేవలం 242 ఇన్నింగ్స్​లోనే బ్రేక్​ చేయడం విశేషం. మొత్తంగా 12 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఆరో బ్యాట్స్​మెన్​ విరాట్​.

చెస్​ చాంపియన్​షిప్​కు రిత్విక్​
ప్రపంచ యూత్​ ర్యాపిడ్​ ఆన్​లైన్​ చెస్​ చాంపియన్​ షిప్​లో భారత్​ తరపున పోటీపడేందుకు తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్​ సెలెక్ట్​ అయ్యాడు. ప్రపంచ చెస్​ సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్​ 11 నుంచి ఆరంభమయ్యే ఈ టోర్నీలో అండర్​-16 విభాగంలో రిత్విక్​ తలపడనున్నాడు. కరోనా కారణంగా ఈ టోర్నీ ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో అతనొక్కడే
అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడి ఎన్నికల్లో థామస్​ బాక్​ ఒక్కడే నిలిచాడు. మార్చిలో జరగనున్న ఎన్నికల్లో బాక్​కు పోటీగా ఎవరూ లేరని ఐవోసీ తెలిపింది. దీంతో అతని ఎన్నిక లాంఛనంగా కనపడుతుంది.

హమిల్టన్​కు కరోనా
జోరు మీదున్న ఫార్ములావన్​ ప్రపంచ చాంపియన్​ లూయిస్​ హమిల్టన్​ కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ బ్రిటన్​ రేసర్​ సాఖీర్​ గ్రాండ్​ ప్రి కి దూరం కానున్నాడు. తాజాగా బహ్రెయిన్​ గ్రాండ్​ ప్రి గెలిచిన హమిల్టన్ కెరీర్​లో 95వ టైటిల్​ తన ఖాతాలో వేసుకున్నాడు.​

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ టాప్​
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి మొద‌టి ‌స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ వన్డే సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు చేసిన విరాట్‌ ఆ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతను 870 పాయింట్లతో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. రోహిత్‌శర్మ (842), బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్, 837) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఎఫ్‌2 విన్నర్​ మిక్‌ షుమాకర్‌
వచ్చే ఏడాది ఎఫ్‌1 అరంగేట్రం చేయనున్న మిక్‌ షుమాకర్‌(21) ఎఫ్‌2 టైటిల్‌ గెలిచాడు. అతను ఈ సీజన్‌లో ప్రెమా రేసింగ్‌ జట్టు తరఫున పోటీపడి మొత్తం 2.15 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బహ్రెయిన్‌లో జరిగిన చివరి రేసులో 18వ స్థానంలో నిలిచినా మొత్తంగా అత్యధిక పాయింట్లతో ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకోగలిగాడు. మిక్‌ ఎఫ్‌1లో హాస్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

క్యాండీ సరికొత్త రికార్డు
హాఫ్‌ మారథాన్‌లో కెన్యా స్ప్రింటర్ కిబివోట్‌ క్యాండీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వెలెన్సియాలో జరిగిన పోటీలో 21 కిలోమీటర్ల పరుగును 57 నిమిషాల 32 సెకన్లలో పూర్తి చేసి, పురుషుల హాఫ్‌ మారథాన్‌లో వేగవంతమైన రికార్డును సృష్టించాడు. 2019లో జోఫ్రీ కంవోరోర్‌ (58 నిమిషాల 1 సెకన్‌) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.

రెజ్లింగ్‌లో అన్షుకు సిల్వర్​
బెల్‌గ్రేడ్‌(సెర్బియా)లో జరిగిన రెజ్లింగ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత రెజ్లర్‌ అన్షు మలిక్‌ రజతం సాధించింది. మహిళల 57కేజీల విభాగంలో అనస్తేషియా నిచిత (మాల్దోవా)తో పోటీపడి1-5 పాయింట్లు తేడాతో ఫైనల్లో ఓడిపోయింది.

ఆసియా క్రీడలకు ఖతార్‌ ఆతిథ్యం
2030 ఆసియా క్రీడలకు ఖతార్‌ రాజధాని దోహా ఆతిథ్యమివ్వనుంది. 2034 క్రీడలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నాయి. ఈ రెండు దేశాలు 2030 ఆతిథ్య హక్కుల కోసం పోటీపడ్డాయి.2017లో ఖతార్‌పై సౌదీ అరేబియా వ్యాపార, ప్రయాణ ఆంక్షలు విధించింది. 2022 ఫిఫా ప్రపంచకప్‌నకు కూడా ఖతార్‌ ఆతిథ్యమిస్తుంది.

అబుదాబి గ్రాండ్‌ ప్రి విజేత వెర్‌స్టాపెన్‌
రెడ్‌ బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ అబుదాబి గ్రాండ్‌ ప్రి విజేతగా నిలిచాడు. ఈ రేసులో బోటాస్‌ (మెర్సిడస్‌) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బోటాస్‌ కంటే 16 సెకన్ల ముందు వెర్‌స్టాపెన్‌ రేసును ముగించాడు. సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కెరీర్‌ మొత్తంలో ప‌ది విజ‌యాలు.

రాబర్ట్​ లెవెన్​కు ఫిఫా అవార్
2020 ఏడాదికి గాను ఫిఫా ఉత్తమ పుట్​బాల్​ ఆటగాడి అవార్డును రాబర్ట్​ లెవెన్​ డోస్కీ(పోలెండ్​) గెలుచుకున్నాడు. ఈ సీజన్​లో జర్మనీ క్లబ్​ బారెన్​ మ్యూనిక్​ తరఫున 55 గోల్స్​ కొట్టిన రాబర్ట్​.. ఈసారి ఫిఫా కుదించిన ఫైనల్​ బెస్ట్​ ప్లేయర్స్​ లిస్ట్​లో రొనాల్డో, మెస్సీతోపాటు చోటు సంపాదించాడు. ఇద్దరు దిగ్గజాలను వెనకకు నెట్టి లెవెన్​డోస్కీ ఈ అవార్డు సాధించడం విశేషం.

సిమ్రన్‌జీత్, మనీషాలకు స్వర్ణాలు
జర్మనీలో జరిగిన బాక్సింగ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో సిమ్రన్‌జీత్‌కౌర్‌ (60 కేజీ), మనీషా (57 కేజీ) పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. సిమ్రన్‌జీత్‌ 4-1తో మయా క్లిన్‌హన్స్‌ (జర్మనీ)పై గెలిచారు. మనీషా 3-2తో సాక్షిపై విజయం సాధించింది. దీంతో బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

ఖేలో ఇండియాలో 4 దేశీయ క్రీడలు
2021లో జరగబోయే ఖేలో ఇండియా క్రీడల్లో నాలుగు కొత్త ఆటలు చేరాయి. భారత దేశీయ క్రీడలైన తంగ్తా, మల్లఖంబ, కలరిపయట్టు, గత్కాలను ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చడాన్ని క్రీడా మంత్రిత్వ ధ్రువీకరించింది. కేరళలో పుట్టిన కలరిపయట్టు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మల్లఖంబ్‌కు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రసిద్ధి చెందినవి. గత్కా పంజాబ్‌లో పుట్టింది. సిక్కు యోధులు ఆత్మరక్షణలో భాగంగా ఈ ఆటను తీసుకొచ్చారు. మణిపుర్‌కు చెందిన తంగ్తా ఒక మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడ.

Advertisement

విన్నర్​గా 300 వీక్స్
సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకొని ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను అందుకునేందుకు జకోవిచ్‌కు కావాల్సింది మరో పది వారాలే. ఫెదరర్‌ 310 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ

మార్స్​పై ఆక్సిజన్ ఉత్పత్తి
భారత సంతతి శాస్త్రవేత్త విజయ్‌ రమణి నేతృత్వంలో అమెరికా శాస్త్రవేత్తలు అరుణ గ్రహ ఉపరితలంపై లభ్యమయ్యే ఉప్పు నీటి నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌ ఇంధనాన్ని సేకరించే సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్‌లో అంగారక గ్రహానికే కాక.. సుదూర రోదసి యాత్రల తీరుతెన్నులను మార్చేస్తుందని వారు తెలిపారు. భూమి మీద సముద్రాల నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌ను సేకరించడానికీ ఇది పనికొస్తుందని పేర్కొన్నారు.

ప్రొపెల్లెంట్​ ట్యాంక్​
జీఎస్​ఎల్​వీ ఎంకే–3 కంటే అత్యధిక పేలోడ్​లోను మోసే క్రయోజెనిక్​ ప్రొపెల్లెంట్​ ట్యాంక్​(సీ32 ఎల్​హెచ్​2)ను బెంగళూరులోని హిందుస్థాన్​ ఏరోనాటికల్​ సంస్థ(హెచ్​ఏఎల్​) ఇస్రోకు సమకూర్చుకుంది. ఈ కొత్త ట్యాంకు 4 మీటర్ల వ్యాసం, 8 మీటర్ల ఎత్తుండి 5,755 కిలోల పేలోడ్​లను మోసుకెళ్లగలదు.

న‌క్షత్రాల‌ కొత్త అట్లాస్‌
పాలపుంత, న‌క్షత్రాలకు చెందిన కొత్త ప‌టాన్ని(అట్లాస్‌) ఆస్ట్రేలియా సైంటిస్టులు ఇటీవల విడుద‌ల చేశారు. ఆ దేశంలోని ఓ ఎడారిలో ఉన్న ఆధునిక టెలిస్కోప్‌తో ఆ న‌క్షత్ర స‌మూహాల‌ను గుర్తించారు. జాతీయ సైన్స్ ఏజెన్సీ సీఎస్ఐఆర్‌వోకు చెందిన కొత్త టెలిస్కోప్ ఆ పాల‌పుంత‌ల‌ను క‌నిపెట్టగా వీటితో విశ్వానికి చెందిన కొత్త అట్లాస్‌ను రూపొందించిన‌ట్లు ఆ సంస్థ చెప్పింది.

బ్రహ్మోస్ యాంటీ షిప్ వర్షన్​ ప‌రీక్ష సక్సెస్​
బ్రహ్మోస్ సూప‌ర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌కు చెందిన యాంటీ షిప్ వ‌ర్షన్‌ను భార‌త్ ప‌రీక్షించింది. డిసెంబర్​ 1న అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈ క్షిప‌ణి ప‌రీక్షలు జ‌రిగాయి. ఇటీవ‌ల భార‌త్ వ‌రుస‌గా బ్రహ్మోస్ క్షిప‌ణిని ప‌రీక్షిస్తుంది. దానిలో భాగంగానే భార‌తీయ నేవీ ఈ ప‌రీక్షను నిర్వహించింది. అక్టో‌బ‌రు 24న కూడా భార‌త్ బ్రహ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భార‌తీయ ఆర్మీ నేతృత్వంలో ఆ ప‌రీక్ష జ‌రిగింది.

ఆస్ట్రేలియాలో దిగిన జపాన్‌ క్యాప్సూల్
సుదూర గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో జపాన్‌ క్యాప్సూల్‌ విజయవంతంగా భూమికి చేరింది. ఈ నమూనాల విశ్లేషణ ద్వారా సౌర కుటుంబం, పుడమి పుట్టుక వివరాలతోపాటు జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలక అంశాలను తెలుసుకోవచ్చు. భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి నమూనాల సేకరణకు 2014లో జపాన్‌ హయబుసా-2 వ్యోమనౌకను ప్రయోగించింది. 2018లో అది ఆ ఖగోళ వస్తువును చేరింది.

చంద్రుడిపై చైనా జెండా
అమెరికా తర్వాత చంద్రుడిపై జెండా ఎగరేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. చంద్రుడి మట్టి, శిలల నమూనాలను తెచ్చేందుకు ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక ద్వారా ఈ ఘనతను సాధించింది. ఈ పతాకం పొడవు 90 సెంటీమీటర్లు, వెడల్పు రెండు మీటర్లు. 1969లో మానవసహిత యాత్ర ద్వారా అమెరికా తొలిసారిగా చంద్రుడిపై జెండాను పాతింది.

క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌
రక్షణ, సైనిక, ప్రభుత్వ, వ్యూహాత్మక సంస్థలపై సైబర్‌ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సమాచారాన్ని హ్యాక్​ చేసే వీలులేని క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ (క్యూకేడీ)ని డీఆర్‌డీవో ప్రవేశపెట్టింది. తొలుత హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ ప్రయోగశాలల మధ్య (12 కిలోమీటర్లు) విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. అత్యంత సురక్షితంగా సమాచార మార్పిడికి ఫోటాన్లతో ‘క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికత’ను దేశంలో తొలిసారిగా డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

‘హిమగిరి’ యుద్ధనౌక
కోల్‌కతాలోని జీఆర్‌ఎస్‌ఈ (గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌) యార్డ్‌ నుంచి పీ17ఎ ప్రాజెక్టు కింద తయారైన తొలి దేశీయ స్టెల్త్‌ యుద్ధనౌక ‘హిమగిరి’ డిసెంబర్​ 14న హుగ్లీ నదిలోకి జలప్రవేశం చేసింది. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్‌ సిస్టమ్‌తో కూడిన కొత్తతరం యుద్ధనౌకను త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రారంభించారు.

బెంగళూరులో ఎస్‌ఎస్‌ఏ సెంటర్​
అంతరిక్షంలో ఇస్రో ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం స్పేస్‌ సిచ్యువేషనల్‌ అవేర్‌నెస్‌ (ఎస్‌ఎస్‌ఏ) కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. బెంగళూరులోని పీణ్యా ఐఎస్‌టీఆర్‌ఏసీ ఆవరణలో ఈ కేంద్రాన్ని ఇస్రో ఛైర్మన్‌ డా.కె.శివన్‌ ప్రారంభించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో, డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్పేస్‌ (డీఓఎస్‌) ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తాయి. నెట్‌వర్క్‌ ఫర్‌ స్పేస్‌ ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ అండ్‌ అనాలసిస్‌ (నేత్ర) ప్రాజెక్టునూ ఈ కేంద్రం నుంచే రూపొందించనున్నారు.నెట్‌వర్క్‌ ఫర్‌ స్పేస్‌ ఆబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ అండ్‌ అనాలసిస్‌ (నేత్ర) ప్రాజెక్టునూ ఈ కేంద్రం నుంచే రూపొందించనున్నారు.

చాంగే-5 వ్యోమనౌక
జాబిల్లి నుంచి మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక ‘చాంగే-5’ భూమిని సురక్షితంగా చేరింది. మంగోలియాలోని సిజివాంగ్‌ జిల్లాలో సంబంధిత క్యాప్సూల్‌ దిగింది. డిసెంబరు 1న జాబిల్లి ఉపరితలంపై కాలు మోపిన ‘చాంగే-5’ రెండు మీటర్ల లోతు వరకు తవ్వి దాదాపు రెండు కిలోల నమూనాలను సేకరించింది. చంద్రుడి నుంచి మట్టి, రాతి నమూనాలను భూమికి తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 1976లో అప్పటి సోవియట్‌ యూనియన్‌కు చెందిన ‘లూనా-24’ చందమామ నుంచి నమూనాలను మోసుకొచ్చింది.

హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్
హైదరాబాద్​లోని దుండిగల్‌ సమీపంలోని డీఆర్‌డీవోకు చెందిన సెంటర్‌ ఫర్‌ అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌(సీఏఎస్‌)లో హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డిసెంబర్​ 19న ప్రారంభించారు. ధ్వనితో పోలిస్తే 5 నుంచి-12 రెట్లు వేగంతో దూసుకెళ్లే సమయంలో తలెత్తే హైపర్‌సోనిక్‌ వాయు ప్రవాహ తీరును ఇది కృత్రిమంగా సృష్టిస్తుంది. అమెరికా, రష్యా తర్వాత ఈ సౌకర్యం ఉన్న మూడో దేశంగా భారత్‌ నిలిచింది.

Advertisement

ఎంఆర్‌ఎస్‌ఎఎం క్షిపణి పరీక్ష సక్సెస్​
భూ ఉపరితలం నుంచి దూసుకెళ్లి గాలిలోని లక్ష్యాన్ని ఛేదించగల మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌ఎస్‌ఎఎం)ని భారత్​ ఒడిశా తీరాన విజ‌యవంతంగా ప‌రీక్షించింది. ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ సంస్థతో కలిసి డీఆర్‌డీవో ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) విడి భాగాల‌ను ఉత్పత్తి చేస్తోంది.

లాంగ్‌ మార్చ్‌-8ను ప్రయోగించిన చైనా
కొత్తగా రూపొందించిన మధ్యశ్రేణి అంతరిక్ష వాహకనౌక లాంగ్‌ మార్చ్‌-8ను చైనా విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అయిదు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. హైనాన్‌ ప్రావిన్స్‌లోని వెంచాంగ్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. తాజాగా రోదసిలోకి ప్రవేశించిన ఐదు ఉపగ్రహాలు.. సూక్ష్మతరంగ చిత్రీకరణ, ఇతర కీలక పరిజ్ఞానాలను పరీక్షిస్తాయి. ఖగోళశాస్త్రం, రిమోట్‌ సెన్సింగ్, కమ్యూనికేషన్‌ పరిజ్ఞానాలకు సంబంధించిన ప్రయోగాలనూ నిర్వహిస్తాయి. లాంగ్‌ మార్చ్‌-8 రాకెట్‌ పొడవు 50.3 మీటర్లు. బరువు 356 టన్నులు.

వార్తల్లో వ్యక్తులు

నోముల నర్సింహయ్య
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య డిసెంబర్​ 1న గుండెపోటుతో మృతిచెందారు. 1999, 2004లో నకిరేకల్​ నుంచి సీపీఎం పక్షాన శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన నోముల 2018లో టీఆర్​ఎస్​ తరఫున నాగార్జునసాగర్​ నుంచి గెలుపొందారు.

ఉత్పల్‌కుమార్‌ సింగ్‌
లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ నవంబర్​ 30న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న స్నేహలత శ్రీవాస్తవ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో ఈయనను నియమించారు. పదవీ విరమణ చేసిన స్నేహలత శ్రీవాస్తవ కొత్తగా ఏర్పాటుచేసిన సభా గౌరవ అధికారి (హానరరీ ఆఫీసర్‌ ఆఫ్‌ ద హౌస్‌) పోస్టులో నియమితులయ్యారు.

బి. సతీష్​
రాష్ట్రానికి చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ బి.సతీష్‌ ప్రభు ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్‌డోభాల్‌ ఆయనకు పతకాన్ని అందజేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ సీబీఐ విభాగంలో పనిచేస్తున్నారు.

వివేక్‌మూర్తి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ఆరోగ్యశాఖ బృందాన్ని ప్రకటించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఉన్న జేవియర్‌ బసెర్రాను ఆరోగ్య మంత్రిగా, భారత సంతతి డాక్టర్​ వివేక్‌ మూర్తిని సర్జన్‌ జనరల్‌గా ఆయన నామినేట్‌ చేశారు. పరిశోధకుడిగా, పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ కార్ప్స్‌ వైస్‌ అడ్మిరల్‌గా వివేక్‌ మూర్తి ప్రాచుర్యం పొందారు.

అనిల్‌ సోని
ప్రైవేటు విరాళాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా భారత సంతతికి చెందిన అనిల్‌ సోనిని డబ్ల్యూహెచ్‌ఓ నియమించింది. ఫౌండేషన్‌ బాధ్యతలను జనవరిలో స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన ఫార్మాస్యూటికల్‌ సంస్థ వియాట్రిస్‌కు సీఈవోగా ఉన్నారు.

మాళవిక హెగ్డే
కాఫీ ఉత్పత్తుల విక్రయాల్లో పేరొందిన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌(సీడీఈఎల్‌) కొత్త సీఈఓగా మాళవిక హెగ్డే నియమితులయ్యారు. ఇప్పటివరకు డైరెక్టరుగా వ్యవహరిస్తున్న ఆమె, 2020 డిసెంబరు 7 నుంచి సీఈఓగా నియమితులైనట్లు సంస్థ వెల్లడించింది.

ఉదయ్‌ శంకర్‌
పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షుడిగా 2020–-21 సంవత్సరానికి మీడియా ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌ శంకర్‌ నియమితులయ్యారు. డిసెంబరు 11,-14 తేదీల్లో జరగబోయే ఫిక్కీ 93వ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎమ్‌) ఫిక్కీ ప్రస్తుత ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి నుంచి శంకర్‌ బాధ్యతలు తీసుకోనున్నారు.

రాజాచారి
అమెరికా వైమానిక దళంలో కర్నల్‌గా పనిచేస్తున్న భారతీయ-అమెరికన్‌ రాజాచారి (43) స్పేస్‌ఎక్స్‌ క్రూ-3 మిషన్‌ కమాండర్‌గా ఎంపికయ్యారు. మిగిలిన ఇద్దరు వ్యోమగాముల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన టామ్‌ మార్ష్‌బర్న్‌ పైలట్‌గా, ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ(ఈఎస్‌ఏ)కు చెందిన మత్తియాస్‌ మౌరర్‌ మిషన్‌ స్పెషలిస్ట్‌గా ఎంపికయ్యారు. 2017లో నాసా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం.

శేఖర్‌ వెంపటి
ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార (బ్రాడ్‌కాస్టింగ్‌) సంఘాల్లో ఒకటైన ఆసియా-పసిఫిక్‌ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) శశి శేఖర్‌ వెంపటి ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు శేఖర్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు.1964లో ఏర్పడిన ఈ సంఘంలో 57 దేశాల నుంచి 286కు పైగా ప్రసార సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.

యూఎన్​ఈపీ ఎర్త్​ అవార్డు విజేతలు
యూనైటెడ్​ నేషన్​ ఎన్విరాన్​మెంట్​ ప్రోగ్రామ్​(యూఎన్​ఈపీ) 2020 ఏడాది ఎర్త్​ అవార్డు​ విజేతలుగా ఆరుగురిని ప్రకటించింది. ఫ్రాంక్​ బైనీమరమ(పీజీ పీఎం), పేబియన్​ లీండెర్ట్జ్​(జర్మనీ), మిండీ లబ్బర్​(యూఎస్​ఏ), నిమోంటే నెన్​క్యుమో(ఈక్వెడార్​), యాకూబా సవడోగో(బుర్కినా ఫసో), రాబార్ట్​ డీ బుల్లార్డ్​(యూఎస్​ లైఫ్​ టైం క్యాటగిరీ)లు విజేతలుగా నిలిచారు. ఈ వార్డు అయిదు క్యాటగిరీలలో 20005 నుంచి ఇస్తున్నారు.

నరేంద్ర మోడీకి లీజియన్​ ఆఫ్​ మెరిట్ అవార్డు
అమెరికా అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన ‘లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌’ను డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడంలో, భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. వైట్‌హౌస్‌లో డిసెంబర్​ 22న జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రయాన్‌ ఈ అవార్డును అందజేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు.. మోడీ తరఫున ఈ అవార్డును అందుకున్నారు.

రతన్​ టాటా
టాటా గ్రూప్​ చైర్మన్​ రతన్​టాటాకు ప్రతిష్టాత్మక ఫెడరేషన్​ ఆఫ్​ ఇండో–ఇజ్రాయిల్​ చాంబర్​ ఆఫ్​ కామర్స్​కు చెందిన ఇంటర్నేషనల్​ చాప్టర్​ను దుబాయ్​లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ‘గ్లోబల్​ విజనరీ ఆఫ్​ సస్టెయినబుల్​ బిజెనస్​ అండ్​ పీస్​’ అవార్డుతో రతన్​ టాటాను గౌరవించనున్నారు.

Advertisement

సురేశ్​కుమార్​
హైదరాబాద్‌ నాంపల్లిలోని విజయనగర్‌కాలనీ ప్రభుత్వ మ్యాథ్స్​ టీచర్​ పడాల సురేశ్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో గ్లోబల్‌ టీచర్‌ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో చేపట్టిన గ్లోబల్‌ టీచర్‌ అవార్డుకు ఇండియా నుంచి ఎంపికైన 16 మందిలో సురేశ్‌కుమార్‌ ఒకరు.

మోతీలాల్‌ వోరా
కాంగ్రెస్‌ పార్టీ కురువృద్ధుడు మోతీలాల్‌ వోరా కరోనా అనంతర అనారోగ్య సమస్యలతో డిసెంబర్​ 21న మరణించారు. రాజస్థాన్​లో పుట్టిన ఆయన ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో సోషలిస్ట్‌ పార్టీ కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి అవిభక్త మధ్యప్రదేశ్‌కు సీఎంగా, యూపీ గవర్నర్‌గా, అయిదుసార్లు ఎంపీగా సేవలందించారు.

ముళ్లపూడి నరేంద్రనాథ్‌
ఆంధ్రా షుగర్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు జాతీయ పురస్కారం లభించింది. ఒంగోలు జాతి పశు అభివృద్ధి, పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జాతీయ వ్యవసాయ, పరిశోధన మండలి, నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనటిక్‌ రిసోర్సెస్‌ (కర్నాల్, హరియాణా) ఆధ్వర్యంలో ‘బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డు- 2020’ అందజేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!