Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ @ ఆగస్ట్​ 2021

కరెంట్​ అఫైర్స్​ @ ఆగస్ట్​ 2021

అంతర్జాతీయం

చైనా సైన్యంలో టిబెట్‌ యువత

భారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు డ్రాగన్‌ దేశం చైనా టిబెట్‌ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఆదేశాలిచ్చింది.

పీవోకే ప్రధానిగా అబ్దుల్​ ఖయ్యుం

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే) ప్రధానిగా తెహ్రీక్​ ఏ ఇన్సాఫ్​ పార్టీ నేత అబ్దుల్​ ఖయ్యుం నియాజీ ఎన్నికయ్యారు. ఖయ్యుం పేరును పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ప్రతిపాదించారు. పీవోకే అసెంబ్లీలో 53 మంది సభ్యులకుగాను నియాజీకి 33 మంది మద్దతు తెలిపారు.

భారత్​–చైనా మధ్య హాట్​లైన్​

ఉత్తర సిక్కిం సెక్టార్‌లో ఉన్న భారత్‌–చైనా ఆర్మీ అధికారుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటైంది. కొంగ్రా లాలోని భారత ఆర్మీ, ఖాంబా డాంగ్‌లో ఉన్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మధ్య ఈ హాట్‌లైన్‌ కనెక్షన్‌ పూర్తయింది. నియంత్రణ రేఖ వెంట బలగాల మధ్య శాంతిసంబంధాలు నెలకొల్పేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.

ఎత్తైన సైకత దుర్గం

డెన్మార్క్​లోని బ్లోఖస్​ నగరంలో డచ్​మన్​ విల్​ఫ్రెడ్​ స్టిగ్జర్​ నిర్మించిన సైకత దుర్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైకతకోటగా గిన్నిస్​ రికార్డ్​ నెలకొల్పింది. 69.4 అడుగులున్న ఈ కళాఖండానికి సుమారు 500‌‌‌‌0 టన్నుల ఇసుక ఉపయోగించినట్లు గిన్నిస్​ సంస్థ తెలిపింది.

ముగిసిన టోక్యో​ ఒలింపిక్స్

టోక్యోలో జులై 23న ప్రారంభమైన ఒలింపిక్స్​, ఆగస్టు 8 న ఘనంగా ముగిశాయి. ఈ క్రీడల్లో 39 స్వర్ణాలతో సహా 113 పతకాలు సాధించిన అమెరికా పట్టిక టాప్‌లో నిలిచింది. చైనా (88), జపాన్‌ (58) మెడల్స్​తో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. భారత్ 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్​లో 2024 ఒలింపిక్స్ జరగనున్నాయి.

కృత్రిమ అంగారక వాతావరణం

అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుంటాడో లేదో అధ్యయనం చేసేందుకు నాసా భూమిపైనే కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోంది. హూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ కృత్రిమ కుజ నివాసం సిద్ధం చేస్తున్నారు.

ఐపీసీసీ రిపోర్ట్​ రిలీజ్​

ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై రూపొందించిన ‘కోడ్‌ రెడ్‌ ఫర్‌ హ్యుమానిటీ’ నివేదికను ఆగస్టు 9న ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) విడుదల చేసింది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని నివేదిక రూపకర్తలో ఒకరైన లిండా మెర్న్స్‌ చెప్పారు.

అఫ్గానిస్తాన్​లో తాలిబన్ల రాజ్యం

అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్​లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబాన్లు పూర్తిగా దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అఫ్గాన్​లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశం పేరును ‘ఇస్లామిక్​ ఎమిరేట్​ ఆఫ్​ అఫ్గానిస్తాన్​’గా మారుస్తామని ప్రకటించారు.

పీవోకే అధ్యక్షుడిగా సుల్తాన్​ మహ్మద్​

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే) అధ్యక్షుడిగా సుల్తాన్​ మహ్మద్​ ఎన్నికయ్యారు. ఈ ప్రాంతానికి పాక్​ జరిపిన ఎన్నికల్లో గెలుపొందిన పాకిస్థాన్​ తెహ్రీక్​–ఈ–ఇన్సాఫ్​ మహ్మద్​కు మద్దతు తెలిపింది. పీవోకేకు పాక్​ ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్​ తీవ్రంగా ఖండించింది.

మలేసియా ప్రధాని రాజీనామా

సంకీర్ణ ప్రభుత్వంలో మెజారిటీ కోల్పోయిన మలేసియా ప్రధాని ముహిద్దీన్​ యాసిన్​ పదవికి రాజీనామా చేశారు. 2020 మార్చిలో ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన ముహిద్దీన్​ అతి తక్కవ కాలం (17 నెలలు) ప్రధానిగా పనిచేసిన రికార్డు సృష్టించారు.

Advertisement

మలేసియా ప్రధానిగా సబ్రీ యాకోబ్‌

మలేసియా నూతన ప్రధానిగా ఇస్మాయిల్‌ సబ్రీ యాకోబ్‌(61) నియమితులయ్యారు. ఇప్పటివరకు ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన తొమ్మిదో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అఫ్గాన్​ ప్రజలకు భారత్​ ఈ–వీసా

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడంతో భారత్‌కు రావాలని కోరుకొనే అఫ్గాన్లకు అత్యవసర ఈ–వీసాలు జారీ చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. మతంతో సంబంధం లేకుండా అఫ్గానిస్థాన్‌ పౌరులు ఎవరైనా వీసాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

హైతీలో భూకంపం

కరేబియన్​ దీవుల్లోని హైతీ తీరంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. హైతీలోని సెయింట్​ లూయిస్​ డూ సుడ్​ ప్రాంతానికి 12 కి.మీ. దూరంలో దీన్ని గుర్తించారు. భూ ప్రకంపనలతో రాజధాని పోర్ట్​ జౌ ప్రిన్స్​లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ముగ్గురు పిల్లలకు ఆమోదం

ముగ్గురు బిడ్డల విధానానికి చైనా ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రివైజ్డ్‌ పాపులేషన్‌ అండ్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ లాకు ఎన్‌పీసీ(నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌)కు చెందిన స్టాండింగ్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం ఎక్కువ మంది పిల్లలు కంటే వారికి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సాయం అందజేస్తుంది.

స్వదేశీ రాకెట్​ పరీక్షించిన పాక్​

దేశీయ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన రాకెట్​ వ్యవస్థ ఫతా–1ను పాకిస్థాన్​ విజయవంతంగా ప్రయోగించింది. శత్రు భూభాగంలోని లక్ష్యాలపైకి సంప్రదాయ వార్​ హెడ్లను అత్యంత కచ్చితత్వంతో ఇది ఛేదిస్తుందని పాక్​ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

అఫ్గాన్​ పరిస్థితులపై జీ7 సమావేశం

యూకే, అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీలు సభ్యదేశాలుగా ఉన్న జీ–7 కూటమి ఆఫ్గానిస్తాన్‌ పరిస్థితిపై చర్చించింది. దేశాన్ని వీడాలనుకునే వారు సురక్షితంగా వెళ్లిపోవడానికి వీలు కల్పిస్తామని తాలిబన్లు హామీ ఇవ్వాలనేది జీ–7 ‘మొదటి షరతు’గా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

Advertisement

జాతీయం

అధ్యక్ష హోదాలో భారత్‌

ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతామండలి అధ్యక్ష హోదా భారత్‌కు దక్కింది. ఆగస్టు 1వ తేదీ నుంచి నెల రోజులు ఈ హోదాలో కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రప్రాంత రక్షణ, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి కీలక చర్చలకు నేతృత్వం వహిస్తుందని యూఎన్​ఓలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు.

మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న

క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్​ ఖేల్​రత్న పేరును ‘ మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న’గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అవార్డు పేరు మార్చాలని దేశవ్యాప్తంగా అనేక వినతులు వచ్చాయన్నారు. ధ్యాన్​చంద్​ జయంతి (ఆగస్టు 29)న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

పారదర్శకతకు ఈ–రూపీ

ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా కేంద్రం ‘ఈ–రూపీ’ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది.

100 శాతం ఎఫ్​డీఐకు అనుమతి

ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్‌ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి మార్గం సుగమం అయ్యింది.

అసెంబ్లీ శతాబ్ది ఉత్సవాలు

తమిళనాడులో శాసనసభ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం 1921లో మద్రాసు లెజిస్లేటివ్​ కౌన్సిల్​ ఏర్పడి, తమళనాడు శాసనసభగా రూపాంతరం చెందింది. అత్యధిక కాలం డీఎంకే అగ్రనేత కరుణానిధి (19 ఏండ్లు) ముఖ్యమంత్రిగా సేవలందించారు.

ఓబీసీ బిల్లుకు ఆమోదం

జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021ను లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాయి. కాంగ్రెస్​ సహా పలు పార్టీలు ఈ బిల్లుకు పార్లమెంట్​లో మద్దతు తెలిపాయి.

అత్యవసర సేవలకు ‘112’

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ఇకపై డయల్​ 112 వినియోగంలోకి రానుంది. 2021 అక్టోబర్​ నాటికి అన్ని అత్యవసర సేవలు ఈ నంబరుకే కాల్​ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

ఉజ్వల 2.0 పథకం ప్రారంభం

ప్రధాన్‌మంత్రి ఉజ్వల్‌ యోజన 2.0 వంట గ్యాస్‌ పథకాన్ని ఆగస్టు 10న ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభించారు. మహిళా లబ్ధిదారులకు వర్చువల్‌ పద్ధతిలో ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ సదుపాయాన్ని అందించారు. కొత్తగా కోటి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలి వాటర్​ ప్లస్​ నగరంగా ‘ఇండోర్’​

దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్​ ఇప్పుడు దేశంలో తొలి ‘వాటర్​ ప్లస్​ సిటీ’ టైటిల్​ సొంతం చేసుకుంది. మొత్తం 200 ప్రాంతాల్లో 11 అంశాల ప్రాతిపదికన తీసుకొని ర్యాంకింగ్​ ఇచ్చారు. మురుగు కాలువల్లోకి చెత్త వేయడాన్ని ఆరికట్టింది.

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల కోసం కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్​ చేసింది. ఇందులో హిమా కోహ్లి, శ్రీనివాస్​ ఓకా, విక్రమ్​నాథ్​, జేకే మహేశ్వరి, బీవీ నాగరత్న, బేలా త్రివేది, సీటీ రవికుమార్​, ఎంఎం సుందరేశ్​, పీఎస్​ నరసింహా ఉన్నారు. జస్టిస్​ బీవీ నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి తొలి మహిళ సీజేఐగా చరిత్ర సృష్టించనున్నారు.

రామ్​సర్​ జాబితాలో చిత్తడినేలలు

దేశంలోని మరో నాలుగు చిత్తడినేలలకు రామ్​సర్​ జాబితాలో చోటు దక్కింది. హరియాణలోని సుల్తాన్​పూర్​ నేషనల్​ పార్క్, భిందవాస్​ వన్యమృగ సంరక్షణ కేంద్రం, గుజరాత్​లోని థోల్​ సరస్సు వన్యమృగ సంరక్షణ కేంద్రం, వాధ్వానా చిత్తడినేలకు ఈ గుర్తింపు లభించింది. దేశంలో 46 చిత్తడినేలలు ఈ జాబితాలో ఉన్నాయి

గతిశక్తి భారత్‌ ప్రాజెక్ట్​

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కావిశ్వాస్‌ అన్న నినాదానికి కొత్తగా సబ్‌కాప్రయాస్‌ (సమష్టి కృషి) చేర్చారు. దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు.

రైతులకు ‘కృషీతంత్ర’ వెబ్​సైట్​

రైతులకు టెక్నాలజీ, భూసార పరీక్షల ప్రయోజనాలు వివరించడం కోసం నాబార్డ్​ ‘కృషీతంత్ర’ వెబ్​సైట్​ ప్రారంభించింది. అన్నదాతలు ఆదాయ, ఉత్పత్తి మార్గాలను పెంచుకునేందుకు అవసరమైన సమాచారం ఇందులో పొందుపరిచారు.

దేశంలో తొలి డ్రోన్​ ఫోరెన్సిక్​ ల్యాబ్​

దేశంలో తొలిసారిగా డ్రోన్​ ఫోరెన్సిక్​ ల్యాబ్​, పరిశోధన కేంద్రాన్ని కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. సీఎం పినరయి విజయన్​ దీన్ని ప్రారంభించారు. గగనతలం నుంచి వచ్చే ముప్పును విశ్లేషించడంతో పాటు వాటిని ఎక్కడెక్కడ వినియోంగిచవచ్చో పరిశోధిస్తారు.

హ్యాండ్​లూమ్​ డిజైన్​ రిసోర్స్​ సెంటర్​

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీ (నిఫ్ట్​) ద్వారా హైదరాబాద్​ సహా దేశంలోని పది కేంద్రాల్లో హ్యాండ్​లూమ్​ డిజైన్​ రిసోర్స్​ సెంటర్స్​ ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ నిర్ణయించింది. చేనేతకారులు, ఎగుమతిదారులు, తయారీదారులు, డిజైనర్లకు డిజైన్ల నమూన అందుబాటులో ఉంచడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం.

ఆపరేషన్​ దేవి శక్తి

అఫ్గానిస్తాన్​ నుంచి ఇండియన్స్​ను భారత్​కు తీసుకొస్తున్న మిషన్​కు ‘ఆపరేషన్​ దేవి శక్తి’ గా పేరు పెట్టినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ తెలిపాడు. ఈ మిషన్​లో ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​, ఎయిర్​ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్​ ఎక్స్​టర్నల్​ అఫైర్స్​ సిబ్బంది సేవలందిస్తున్నారు.

ఢిల్లీలో స్మాగ్​ టవర్​

దేశంలోనే తొలి స్మాగ్​ టవర్​ను ఢిల్లీలోని కన్నాట్​ ప్లేస్​లో సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ప్రారంభించారు. కి.మీ. పరిధిలో సెకనుకు 1000 క్యూబిక్​ మీటర్ల గాలిని ఇది క్లీన్​ చేయనుంది. 24 మీటర్ల ఎత్తులో రూ.20 కోట్లతో దీన్ని నిర్మించారు.

చేనేత రంగంపై సునీల్‌ సేథీ కమిటీ

చేనేత ఉత్పత్తి పెంపు, ఎగుమతుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలో ఎగుమతులు నాలుగు రెట్లు పెరగాలన్నది లక్ష్యం. కమిటీకి ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డీసీఐ) చైర్మన్‌ సునీల్‌ సేథీ నేతృత్వం వహిస్తారు.

కార్మికుల డేటాబేస్​కు ‘ఈ–శ్రమ్​’

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక డేటాబేస్​ ఏర్పాటు చేసేందుకు ‘ఈ–శ్రమ్​’ వెబ్​ పోర్టల్​ను ప్రారంభించింది. డిసెంబర్​ 31 నాటికి 38 కోట్ల కార్మికుల నమోదు లక్ష్యంగా పెట్టుకుంది.

జర్మనీలో భారత రాయబారిగా హరీశ్​

జర్మనీలో భారత రాయబారిగా హరీశ్​ పర్వతనేని నియమితులయ్యారు. 1990 ఐఎఫ్​ఎస్​ బ్యాచ్​ అధికారిగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు.

100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో ఇన్ఫోసిస్​

ప్రముఖ టెక్​ సంస్థ ఇన్ఫోసిస్​ మార్కెట్​ క్యాపిటల్ తాజాగా 100 బిలియన్​ డాలర్లకు చేరింది. ఈ ఘనత సాధించిన నాలుగో కంపెనీగా ఇన్ఫోసిస్​ నిలిచింది. 140 బిలియన్​ డాలర్లతో రిలయన్స్​ టాప్​లో ఉండగా, టీసీఎస్​ (115 బి.డా), హెచ్​డీఎఫ్​సీ (100.1 బి.డా) రెండు, మూడో స్థానంలో ఉన్నాయి.

ప్రాంతీయం

ధ్రువ హెచ్​టీ

మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌) నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు దేశంలోనే తొలి వెబ్‌సైట్‌ ధ్రువహెచ్‌టీ ను ఇటీవల ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో బ్రిటీష్‌ హైకమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

హైదరాబాద్​లో అంతర్జాతీయ ప్రదర్శన

రాష్ట్రంలో మరోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన (వింగ్స్​ ఇండియా 2022) హైదరాబాద్​లో నిర్వహించనున్నారు. బేగంపేట ఎయిర్​పోర్టులో వచ్చే ఏడాది మార్చి 24 నుంచి 27 వరకు ఇది జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది.

శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు అవార్డ్​

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌) అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు–2021కు ఎంపికైంది. కొవిడ్ పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు వరుసగా మూడో ఏడాది ఈ అవార్డు లభించింది.

వరి ఉత్పాదకతలో నాలుగో స్థానం

దేశ వ్యాప్తంగా వరి ఉత్పాదకతలో తెలంగాణ నాలుగో స్థానం, పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. వరి ఉత్పాదకతలో పంజాబ్​, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

హైకోర్టు జడ్జిగా ఏడుగురికి పదోన్నతులు కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్​ చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య ఇటీవలే 42కి పెంచారు. ప్రస్తుతం 12 మంది న్యాయమూర్తులే ఉండగా, కొత్తగా ఏడుగురు రానున్నారు.

బీసీ కమిషన్​ చైర్మన్​గా వకుళాభరణం

తెలంగాణ బీసీ కమిషన్​ చైర్మన్​గా వకుళాభరణం కృష్ణమోహన్​రావు నియమితులయ్యారు. చైర్మన్​తో పాటు ముగ్గురు సభ్యులు కె.కిశోర్​గౌడ్​, సీహెచ్​ ఉపేంద్ర, శుభప్రద పటేల్​ నూలిలతో కమిషన్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్​లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌

అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్‌) మధ్యవర్తిత్వ కేంద్రం(ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌) హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. దేశంలో ఏర్పాటు అవుతున్న తొలి ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఇదే.

వార్తల్లో వ్యక్తులు

Advertisement

పీవీ సింధు
భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు కాంస్య పతక పోరులో హే బింగ్‌ జియావో (చైనా)పై విజయం సాధించి, ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ చరిత్రలో వరుసగా రెండు పతకాలు సాధించిన నాలుగో షట్లర్‌గా సింధు నిలిచింది.

లవ్లీనా బొర్గోహై
విశ్వక్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహై (69 కేజీలు) కాంస్య పతకం దక్కించుకుంది. సెమీఫైనల్‌లో బుసేనాజ్‌ సుర్మనేలి (టర్కీ) చేతిలో ఆమె పరాజయం పాలైంది. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కింది. గతంలో విజేందర్‌ సింగ్‌ (2008 బీజింగ్‌), మేరీకోమ్‌ (2012 లండన్‌) ఈ ఘనత సాధించారు.

నటాషా పేరి
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒకరిగా 11 ఏళ్ల వయసున్న ఇండియన్‌ అమెరికన్‌ నటాషా పేరి ఎంపికైంది. స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌), అమెరికన్‌ కాలేజీ టెస్టింగ్‌ (యాక్ట్‌)లలో అసమాన ప్రతిభ చూపించినందుకు అమెరికాలోని న్యూజెర్సీ విశ్వవిద్యాలయం నటాషా పేరిని అత్యంత తెలివైన చిన్నారిగా గుర్తించి గౌరవించింది.

సైరస్​ పూనావాలా
సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) చైర్మన్‌ సైరస్‌ పూనావాలా ప్రతిష్టాత్మక లోక్‌మాన్య తిలక్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 ఏడాదికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లు ట్రస్ట్‌ అధ్యక్షుడు దీపక్‌ తిలక్‌ ప్రకటించారు. కొవిడ్​ సమయంలో ఆయన సేవలు గుర్తిస్తూ ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు వివరించారు.

థాంప్సన్​ హెరా
జమైకా స్ప్రింటర్​ ఎలేన్​ థాంప్సన్​ హెరా వరుసగా రెండు ఒలింపిక్స్​ల్లోనూ అమ్మాయిల 100 మీ, 200 మీ పరుగులో చాంపియన్​గా నిలిచిన తొలి రన్నర్​గా రికార్డు సృష్టించింది. వందేళ్ల పైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్​లో మరే మహిళా రన్నర్​కు సాధ్యం కాని ఘనత సొంతం చేసుకుంది.

నీరజ్​చోప్రా
టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా 87.58 మీట‌ర్ల దూరం విసిరి గోల్డ్​ మెడల్​ సాధించాడు. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ఆటగాడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. గోల్డ్​మెడల్​ సాధించిన రోజుకు గుర్తుగా ఆగస్టు 7న ‘జాతీయ జావెలిన్‌ డే’గా నిర్వహించనున్నారు.

రేఖాశర్మ
జాతీయ మహిళా కమిషన్​ (ఎన్​సీడబ్ల్యూ) చైర్​పర్సన్​గా పనిచేస్తున్న రేఖాశర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడగించింది. ఆమె ఈ పదవీకాలం ఆగస్టు 7 తో ముగియగా తాజాగా కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని మరోసారి నియమించారు. ఈ మేరకు దేవదాయశాఖ కార్యదర్శి వాణీమోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. సుబ్బారెడ్డి తొలిసారి 2019 జూన్‌ 22న టీటీడీ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

రాజీవ్​ గౌబా
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ కార్యదర్శిగా రిటైర్​మెంట్​ ప్రకటించిన గౌబాను కేంద్రం 2019 లో రెండేళ్ల కాలానికి కేబినెట్ కార్యదర్శిగా నియమించింది.

శ్రీకాంత్​ బొల్లా
హైదరాబాద్​కు చెందిన అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్​ బొల్లా 2021 జేసీఐ వరల్డ్​ కాంగ్రెస్​ నామినీగా ఎంపికయ్యరు. 150కి పైగా దేశాల నుంచి 400 మంది ఇందులో పాల్గొనగా తుది 20 మందిలో శ్రీకాంత్​కు స్థానం దొరికింది.

రాధా కిషన్​ దమానీ
ప్రపంచంలోని 100 మంది అగ్రశ్రేణి కుబేరుల్లో డిమార్ట్​ అధినేత రాధాకిషన్​ దమానీకి చోటు లభించింది. బ్లూమ్​బర్గ్​ బిలియనీర్స్​ సూచిలో ఆయనకు 98వ స్థానం దక్కింది. ఆయన నికర సంపద 19.2 బిలియన్​ డాలర్లు ( సుమారు 1,38 లక్షల కోట్లు) గా ఉంది.

నితీశ్​ కుమార్​
ముఖ్యమంత్రి హోదాలో 15వ సారి జాతీయజెండా ఎగరవేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక సీఎంగా నితీశ్​ కుమార్​ రికార్డ్​ సృష్టించారు. సీఎంగా 5,474 రోజులు పూర్తిచేసుకొని, గతంలో బిహార్​ తొలి ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా కంటే ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా నిలిచాడు.

మహాత్మా గాంధీ
భారత జాతిపిత మహాత్మా గాంధీని అమెరికా అత్యున్నత పురస్కారంతో గౌరవించాలని అక్కడి ప్రతినిధుల సభ తీర్మానించింది. ప్రతిష్టాత్మక ‘కాంగ్రెషనల్​ గోల్డ్​ మెడల్​’ మహాత్మా గాంధీకి ఇవ్వాలంటూ న్యూయార్క్​ ప్రజాప్రతినిధి కరోలిన్​ బీ మెలోని చేసిన ప్రతిపాదనకు సభ్యులంతా ఆమోదం తెలిపారు.

మాకికాజీ
గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకుగా పేరుపొందిన జపాన్‌కు చెందిన మాకికాజీ బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించాడు. మాకికాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్‌ గురించి చెప్తూ పర్యటించారు. సుడోకు చాంపియన్‌షిప్‌ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది.

పవన్​దీప్​ రాజన్​
మ్యూజికల్​ రియాలిటీ షో ఇండియన్​ ఐడల్​–12 విజేతగా పవన్​ దీప్​ రాజన్​ నిలిచాడు. అతడికి రూ.25 లక్షలతో పాటు ట్రోఫీ అందజేశారు. విశాఖకు చెందిన తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ ఆరో స్థానంలో నిలిచింది.

జోయా అఫ్రోజ్​
మిస్​ ఇండియా ఇంటర్నేషనల్​ 2021గా ముంబయికి చెందిన జోయా అఫ్రోజ్​ కిరీటం దక్కించుకుంది. బెస్ట్​ ఇన్​ ఈవెనింగ్​ గౌన్​, మిస్​ గ్లామరస్​ ఐస్​, టాప్​ మోడల్​ సబ్​ టైటిల్స్​ కూడా ఆమె సొంతం చేసుకుంది. ఈ ఏడాది నవంబర్​లో జపాన్​లో జరిగే మిస్​ ఇంటర్నేషనల్​ పోటీల్లో భారత్​కు ప్రాతినిథ్యం వహించనుంది.

లా గణేశన్‌
తమిళనాడుకు చెందిన బీజేపీ నేత లా గణేశన్‌ను కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ గవర్నర్‌గా నియమించింది. గణేశన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. గణేశన్‌ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.

కల్యాణ్​ సింగ్​
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ అనారోగ్యంతో మరణించారు. పది అసెంబ్లీ ఎన్నికల్లో 9 సార్లు గెలుపొందిన కల్యాణ్‌… ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నారు.

యశోధర మిశ్రా
ప్రముఖ ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రాకు 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆమె రచించిన ‘సముద్ర కులె ఘొరో’ (సాగర తీరంలో ఇల్లు) కథల సంకలనానికి ఈ అవార్డు దక్కింది.

ఆచంట ఉమేశ్​
యూరప్​ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఎల్​బ్రస్​ పర్వతాన్ని (5642 మీ.) తెలుగు యువకుడు ఆచంట ఉమేశ్​ అధిరోహించాడు. మధ్యప్రదేశ్​ కు చెందిన మరో వ్యక్తితో కలిసి ఆగస్టు 15న శిఖరంపై మువ్వన్నెల జెండా ప్రదర్శించారు.

టి. శ్రీకాంత్​
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి టి.శ్రీకాంత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన శ్రీకాంత్‌ ఇప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.

ఒ.ఎమ్.నంబియార్
భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్ ఒ.ఎమ్.నంబియార్ కన్నుమూశారు. పీటీ ఉషను పరుగుల రాణిగా తీర్చిదిద్దిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 1985లో తొలి ద్రోణాచార్య అవార్డు, 2021లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

స్పోర్ట్స్​

రెజ్లింగ్​లో సిల్వర్​
ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో ఇండియ‌న్ రెజ్లర్ ర‌వికుమార్ ద‌హియా సిల్వర్ మెడ‌ల్ సాధించాడు. 57 కేజీల విభాగంలో జ‌రిగిన ఫైన‌ల్లో జవుర్ ఉగుయెవ్ చేతిలో ర‌వి 4-7 తేడాతో ఓడిపోయాడు. దీంతో ఒలింపిక్స్​లో సిల్వర్ గెలిచిన రెండో ఇండియ‌న్ రెజ్లర్‌గా నిలిచాడు. 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ ఈ ఘనత సాధించాడు.

మెన్స్​ హాకీలో కాంస్యం
భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1980 తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్​ 5-4 తేడాతో జర్మనీని ఓడించి 41 సంవత్సరాల తర్వాత పతకం సాధించారు. ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 12 హాకీ పతకాలు గెలుపొందింది.

పీఎస్​జీ క్లబ్​లో మెస్సీ
బార్సిలోనా క్లబ్‌తో బంధం తెంచుకున్న అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ ఫ్రాన్స్‌కు చెందిన పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ క్లబ్‌తో జత కట్టాడు. రెండేళ్ల పాటు ఆ జట్టుతో కలిసి ఆడనున్నాడు. ఆ క్లబ్‌ ఏడాదికి సుమారు రూ.305 కోట్లు చెల్లించనుంది.

రన్నరప్​ సిక్కిరెడ్డి జోడి
భారత మహిళల బ్యాడ్మింటన్‌ జోడీ సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప డెన్మార్క్‌ మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌లో రన్నరప్‌గా నిలిచింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన భారత ద్వయం ఫైనల్లో 21-15, 19-21, 14-21తో టాప్‌ సీడ్‌ అమేలీ మాగెలాండ్‌-ఫ్రెజా రాన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి పాలైంది.

హంగేరి గ్రాండ్​ ప్రి విన్నర్​ ఒకాన్​
ఫార్ములా వన్‌ రేసు హంగేరి గ్రాండ్‌ప్రిలో అల్పైన్‌ డ్రైవర్‌ ఎస్టబాన్‌ ఒకాన్‌ విజేతగా నిలిచాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రధాన రేసును ఎనిమిదో స్థానం నుంచి మొదలు పెట్టిన ఒకాన్ 2 గంటలా 4 నిమిషాల 43.199 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. వెటెల్​, హామిల్టన్​ రెండు, మూడో స్థానంలో ఉన్నారు.

పదేళ్లు హాకీకి ఒడిశా స్పాన్సర్​
భారత హాకీ జట్లకు మరో పదేళ్లు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్​ చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం నవీన్​ పట్నాయక్​ ప్రకటించారు. భారత హాకీ పురుషులు, మహిళా జట్ల క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, సిబ్బందికి రూ.5 లక్షల నగదు అందజేశారు.

ఆర్చరీలో ధీరజ్​కు గోల్డ్​
ప్రపంచ యూత్​ ఆర్చరీ టోర్నమెంట్​లో తెలుగు తేజం ధీరజ్​ రికర్వ్​ జూనియర్​ బాలుర టీమ్​ విభాగంలో గోల్డ్ మెడల్​ సాధించాడు. ఫైనల్లో ధీరజ్​, ఆదిత్య చౌదరి, పార్థ్​సాలుంకెలతో కూడిన భారత బృందం 5–3తేడాతో స్పెయిన్​ టీమ్​పై విజయం సాధించింది.

మనిక బాత్రా–సత్యన్‌ జోడికి టైటిల్​
హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) కంటెండర్‌ టోర్నీలో భారత క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్‌ జోడి టైటిల్​ కైవసం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో హంగేరీకి చెందిన డోర మదరస్జ్‌–నండోర్‌ ఎక్సెకీ జంటపై విజయం సాధించింది.

ఫ్లాగ్​బేరర్​ టెక్ ​చంద్​
టోక్యో పారాలింపిక్స్‌–2020 ఆగస్టు 24న ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత ఫ్లాగ్‌ బేరర్‌గా ప్రకటించిన రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. దాంతో షాట్‌పుట్‌లో పోటీ పడుతున్న టెక్‌ చంద్‌ ఫ్లాగ్‌ బేరర్‌గా ముందుకు సాగాడు.

సైన్స్​ అండ్​ టెక్నాలజీ

నౌకాదళంలో స్వదేశీ టెక్నాలజీ
భారత నౌకాదళ చరిత్రలో తొలిసారిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన యుద్ధ విమాన వాహన నౌక (ఐఏసీ) విక్రాంత్​ను సముద్ర జలాల్లో పరీక్షించే ప్రక్రియ ప్రారంభించారు. దీనిపై మిగ్​–29కే ఫైటర్​ జెట్లను, కేఏ–31 హెలికాప్టర్లను మోహరించనున్నారు. వచ్చే ఏడాది ఇది విధుల్లోకి చేరనుంది.

2023లో ఇస్రో, నాసా ప్రయోగం
ఇస్రో, నాసా ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ ఉపగ్రహ ప్రయోగం 2023 ఆరంభంలోనే ఉంటుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూ ఉపరితలంలో జరిగే మార్పులను అడ్వాన్స్‌డ్‌ రాడార్‌ వ్యవస్థను ఉపయోగించి పసిగట్టడమే ఈ ప్రయోగ లక్ష్యమన్నారు.

జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 విఫలం
క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో జీఎస్‌ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్‌ ప్రకటించారు. దేశ భద్రత అవసరాలు, విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్‌–03 రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

‘నిర్భయ్​’ మిస్సైల్​ సక్సెస్​
పూర్తి స్వదేశీ రూపొందించిన ‘నిర్భయ్‌’ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్​డీవో ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కి.మీల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా చేధించగలదు.

టెస్లా హ్యూమనాయిడ్​ రోబో
ఎలక్ట్రిక్​ కార్​ మేకర్​ టెస్లా నుంచి హ్యూమనాయిడ్​ రోబో రానుంది. వచ్చే సంవత్సరం టెస్లా బాట్​ పేరుతో ఈ రోబోను రూపొందించనున్నట్లు కంపెనీ సీఈవో ఎలెన్​ మస్క్​ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మోడల్​ను మస్క్​ విడుదల చేశారు.

మిస్తైల్​ కేంద్రానికి బీడీఎల్​ అగ్రిమెంట్​
మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ఓ క్షిపణి పరీక్ష, తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. స్వల్ప దూర లక్ష్యాలను ఛేదించగల, గాల్లోంచి గాల్లోకి ప్రయోగించగల క్షిపణి (ఏఎస్‌రామ్‌) పరీక్ష, తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఎంబీడీఏలు తీర్మానించాయి.

భారత్​కు హర్పూన్​ క్షిపణి వ్యవస్థ
హర్పూన్‌ జాయింట్‌ కామన్‌ టెస్ట్‌ సెట్‌ (జేసీటీఎస్‌) యాంటీ షిప్‌ క్షిపణి వ్యవస్థను భారత్‌కు విక్రయించడానికి అమెరికా అంగీకరించింది. దీని అంచనా వ్యయం రూ.60 కోట్లుగా ఉంది. ఈ క్షిపణి కొనుగోలు ప్రతిపాదనతో భారత రక్షణ రంగం మరింత బలపడుతుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

అమెరికాలో మలబార్​ విన్యాసాలు
అమెరికాలోని గువామ్‌ తీరం(పసిఫిక్‌ మహాసముద్రం)లో మలబార్‌ యుద్ధ విన్యాసాలు జరిగాయి. ఇందులో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. విన్యాసాల్లో భారత్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ శివాలిక్, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌ యుద్ధ నౌకలు విశాఖ తీరం నుంచి వెళ్లాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!